India-China
-
45 ఏళ్ల తర్వాత మరణాలు.. చైనాపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. గత కొద్ది నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చల ఫలితంగా సంబంధాలు మెరుగైనట్టు ఆయన తెలిపారు. భారత సరిహద్దుల విషయంలో కూడా కీలక పురోగతి నెలకొందని చెప్పుకొచ్చారు.ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్..‘భారత్-చైనా సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడుతూ..‘చైనా చర్యల కారణంగా 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని తెలిపారు.2020 ఏప్రిల్‌లో తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా రెండు వైపులా మరణాలకు ఈ ఘర్షణ దారితీసింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన.. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కోసం భారతదేశం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో లడఖ్‌లోని భారత సరిహద్దుల నుంచి చైనా బలగాలు, భారత సైన్యం వెనక్కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. గతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. వాస్తవాధీన రేఖకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ఇరుదేశాలకు ఏకాభిప్రాయం లేదు. పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శాంతియుతంగా సరిహద్దు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు విషయాలపై చర్చించారు’ అని చెప్పుకొచ్చారు. లాజిస్టికల్ సవాళ్లు, కొవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఇలా తమ సామర్థ్యాలతో ఓ వైపు దీటుగా ప్రతిస్పందిస్తూనే, ఉద్రిక్తతలు తగ్గించడం కోసం పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేశాం. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా ఇరు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు. వీటికి సంబంధించి భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.#WATCH | In the Lok Sabha, EAM Dr S Jaishankar says "I rise to apprise the House of some recent developments in the India-China border areas and their implications for our overall bilateral relations. The House is aware that our ties have been abnormal since 2020 when peace and… pic.twitter.com/gmE3DECobq— ANI (@ANI) December 3, 2024 -
లద్ధాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. గతవారం భారత్-చైనా దేశాల మధ్య జరిగిన కీల ఒప్పందంలో భాగంగా.. కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని పేర్కొంది.కాగా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పెట్రోలింగ్, దళాలుప సంహరణకు ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల గస్తీ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యింది. అక్టోబర్ 29 లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. స్పందించిన రష్యా
మాస్కో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట సైనికులను ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన అవగాహనను రష్యా స్వాగతించింది. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల నుంచి సంకల్పం, విశ్వాసం అవసరమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం అన్నారు.‘‘ ఐదేళ్ల విరామం తర్వాత కజాన్‌లో చైనా, భారత్‌ల నేతల మధ్య తొలి సమావేశం జరగడాన్ని మేం (రష్యా) స్వాగతిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇది.. చాలా సానుకూల పరిణామం. భారత్-చైనా సరిహద్దు వివాదం చాలా సంక్లిష్టమైన సమస్య.దీనికి సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అవసరం. భారత్, చైనా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై చివరికి విజయం సాధిస్తాయనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.దానికి సంకల్పం, సహృదయం, నమ్మకం అవసరం. సామరస్యానికి ఇవి చాలా అవసరం’’ అని అలిపోవ్ తెలిపారు.అక్టోబరు 23న రష్యాలోని కజాన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల భేటీకి రెండు రోజుల ముందే ఎల్ఏసీ వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై చైనాతో భారత్ ఒప్పందాన్ని ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి వచ్చాయి. చదవండి: 2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల! -
Rahul Gandhi: చైనాను అడ్డుకోలేకపోయారు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్‌లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు. ‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్‌లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. నిరాధార ఆరోపణలు: రాజ్‌నాథ్ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ‘‘ లోక్‌సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అనిరాజ్నాథ్ అన్నారు. -
భారత్‌లోకి చైనా చొచ్చుకొస్తుంటే.. మోదీ నిద్రపోతున్నారు: ఖర్గే
న్యూఢిల్లీ: భారత సరిహద్దు విషయంలో చైనాతో వివాదం కొనసాగుతున్న వేళ ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత భూభాగంలోకి డ్రాగన్ దేశం(చైనా) చొచ్చుకువస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నారని విమర్శించారు. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ ఇలా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి. ఈ క్రమంలోనే మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్లాగొన్న ఖర్గే.. మోదీని అబద్దాల సర్దార్‌గా విమర్శించారు. ప్రధాని దృష్టి అంతా సంక్షేమంపై కాకుండా గాంధీ కుటుంభాన్ని దూషించడంపేనే ఉందని దుయ్యబట్టారు. మోదీ దేశం కోసం ఆలోచించడం పక్కకు పెట్టి గాంధీ కుటుంబంపై దుర్భాషలాడటం పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. 'నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, నేను భయపడను' అని మోదీ అంటున్నారు. మీకు భయం లేకుంటే మన ప్రాంతంలోని భూభాగాన్నంతా చైనాకు ఎందుకు విడిచిపెట్టారు? వారు భారత్‌లోకి చొచ్చుకువస్తున్నారు. మీరేమో నిద్రపోతున్నారు. నిద్రమాత్రలు వేసుకున్నారా? దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి తన వెంట తీసుకెళ్లాలని అనుకొంటున్నారన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబంల ఎవరూ ప్రధానమంత్రి, మంత్రి పదవిని చేపట్టలేదని, అయినప్పటికీ ప్రధానమంత్రి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబ సభ్యులు ఈ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తారు. ఎన్నికల సమయంలో దేశమంతా తిరుగుతారు గానీ, అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌కు మాత్రం ఇంతవరకు వెళ్లలేదు’ అని మండిపడ్డారు. కాగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. చైనా తీరును గతంలోనే భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు, ఈ ప్రాంతం దక్షిణ టిబెట్‌లో భాగమని బీజింగ్ తెలిపింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉంది. అయితే పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్‌లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. -
సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ . భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి.. ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైన భారత్‌కు సవాల్ విసిరితే.. తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘ఢిఫెన్స్ సమ్మిట్’లో గురువారం రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని.. ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ, ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే, తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రక్షణ రంగానికి తాము ప్రాధాన్యత పెంచామని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వయంశక్తి) ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితోపాటు రక్షణ పరికారల ఎగుమతి, సైనిక ఆధునికీకరణపై దృష్టి సారించామని చెప్పారు.దీని వల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని పేర్కొన్నారు. చదవండి: విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే.. -
తూర్పు లద్దాఖ్‌పై భారత్, చైనా సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మూడున్నరేళ్ల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు భారత్, చైనా 21వ విడత సైనిక చర్చలు జరిపాయి. చర్చల్లో ఎలాంటి కీలకమైన ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వాస్తవా«దీన రేఖ వెంబడి ఛుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఫిబ్రవరి 19వ తేదీన ఈ చర్చలు జరిగాయి. భారత్ తరఫున లేహ్ కేంద్రంగా ఉన్న 14వ కోర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలీ, చైనా తరఫున దక్షిణ గ్జిన్జియాంగ్ సైనిక జిల్లా కమాండర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే సైనిక, దౌత్య కమ్యూనికేషన్లను ఇకమీదటా కొనసాగించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ అంశమూ చర్చకొచి్చందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో 20వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని జనవరిలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించడం తెల్సిందే. 2020 ప్రథమార్ధంలో తూర్పు లద్దాఖ్‌లో ఉన్న సాధారణ స్థాయికి ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. -
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్‌లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్‌లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్‌లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్‌లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్‌లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్‌లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్‌లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చైనాను నమ్మలేం... అప్రమత్తతే రక్ష!
2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలలో మూలమలుపు లాంటిది. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన సరిహద్దు పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులో ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ బఫర్ జోన్లు సరికొత్త వివాదానికి తెర తీశాయి. ఇలా బఫర్ జోన్లకు అంగీకరించడమంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలూ సరిహద్దుల సమీపంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటం ఆందోళనకరం. భారతదేశం, అమెరికా, చైనా అంతర్జాతీయ యవనికపై మూడు ముఖ్యమైన పాత్ర ధారులు. వీటి ఆసక్తులు పరస్పరం లోతుగా పొందుపర్చుకుని ఉన్నాయి. ఈ వాస్తవం క్రమానుగత వ్యవధిలో ఇతరులతో పోలిస్తే వారి ఎంపికలను తూకం వేసి చూసుకునేలా వారిని బలవంతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆసక్తితో ఉంది. కాగా, భారతదేశం చైనాతో 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును, దాంతోపాటు 61 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పంచుకుంటోంది. ఇక చైనా విషయానికి వస్తే 2049 నాటికి నంబర్ వన్ అగ్రరాజ్యం కావాలని కోరుకుంటోంది. అది జననేత మావో సేటుంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయం పొందిన శతాబ్ది సంవత్సరం మరి. ఆసియాలో చైనాకు ప్రత్యక్ష పొరుగు దేశమైన భారతదేశం, చైనా ప్రాదేశిక ఆకాంక్షల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంది. ఇన్ని దశల చర్చలు జరిగినా నేటికీ భారత్–చైనా సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం గాల్వాన్ ప్రాంతంలో చైనాతో భారత్‌కు తీవ్ర వైరం ఏర్పడింది. ఇటీవల 2023 జూన్‌లో గాల్వాన్ ప్రతిష్టంభన మూడవ వార్షికోత్సవం సందర్భంగా, చాలామంది పండితులు, మాజీ దౌత్యవేత్తలు... దురాశాపూరిత చైనా పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1950ల నాటి నుండి భారత్ – చైనా సరిహద్దు వివాదం ప్రజర్విల్లుతోంది. ‘హిందీ–చినీ భాయ్ భాయ్’ అని భారత ప్రజలు నినదిస్తున్న వేళ, భారత భూభాగాల్లోకి చైనా సైనికులు కవాతు చేస్తున్నప్పుడు మనదేశం అకస్మాత్తుగా మేల్కొంది. భారత సైన్యం చవిచూసిన ఘోర పరాభవం ఇది. అప్పటి నుండి సరిహద్దు వివా దాన్ని పరిష్కరించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, చర్చలు జరి గాయి. కానీ ఫలించలేదు. ఇక 2020 జూన్ దగ్గరకు వద్దాం. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైన్యం చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా సేనలను తమ ట్రాక్‌లో నిలిపివేసి నప్పటికీ, వారు యథాతథ స్థితితో సంతోషంగా లేరనీ, తమకు అనుకూలమైన మార్పు కోసం ఆసక్తిగా ఉన్నారనీ చైనా వైపు నుండి సందేశం స్పష్టంగా కనబడుతోంది. 2020లో అవకాశాన్ని కోల్పోయి నప్పటికీ, వారు తమ ప్రణాళికను కచ్చితంగా వదులుకున్నారని దీని అర్థం కాదు. సరిహద్దు సమస్యను చైనా ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. 2022 డిసెంబర్ లో, చైనా తవాంగ్‌లో ఒక ఫార్వర్డ్ పోస్ట్‌ను ప్రారంభించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా భారతీయ సైనికులు అడ్డుకున్నారు. 2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలను మూలమలుపు తిప్పిన ఘటన. నిజానికి ఇరు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడం ఇదే తొలిసారి. 1975 అక్టోబరులో చివరగా వాస్తవిక ఘర్షణ జరిగింది. ఆయుధాల వినియోగ నిషేధ ఒప్పందం ఒకటి భారత్, చైనాల మధ్య ఉంది. గాల్వాన్‌లో చైనా సైనికులు మేకులున్న కర్రలను ఉపయోగించారు. భారతీయులు ఫైబర్‌గ్లాస్ లాఠీలతో ప్రతిస్పందించారు. కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా ఉపయోగించారు. భారతీయుల కంటే చైనీయులు ఎక్కువ మంది సైనికులను కోల్పోయారని కొన్ని స్వతంత్ర నివేదికలు నొక్కి చెప్పాయి. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది కూడా! ఇప్పుడు ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లు ఏర్పాటయ్యాయి. కానీ ఈ బఫర్ జోన్లు కొత్త వివాదాస్పద అంశంగా మారాయి. వీటి ఏర్పాటుకు ఒప్పుకోవడం అంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇది చాలదన్నట్లు సైనికులనూ, సైనిక సామగ్రినీ సులభంగా తరలించడానికి చైనా తన వైపు రెండు వంతెనలను కలిగి ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో బిజీగా ఉంది. భారత దేశం కూడా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిప్యాడ్లు వంటివి ఉన్న తన భూభాగం వైపున మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇది ఈ ప్రాంతంలో శాంతికి శుభ సూచన కాదు. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ, చైనా–భారత్‌ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోంది. భారతదేశం హిమాలయ పొరుగు దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారత – చైనా బంధం విషయంలో ఎల్లప్పుడూ నిరంతర పరిశీలన అవసర మని భారత నాయకులు గమనించాలి. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు సరిపోయే దానికంటే తక్కువగా దేనితోనూ సమాధానపడదని గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో, అమెరికా కూడా చైనా ఎదుగుదల, దాని ఆకాంక్షల గురించి ఆందోళన చెందుతోంది. పైగా చైనాను సవాలు చేయడానికి భారతదేశాన్ని తన విలువైన భాగస్వామిగా చూస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి అమెరికా ఎర్ర తివాచీ పరిచింది. జపాన్ లాగా, ఇప్పుడు భారత దేశం... అమెరికా వ్యూహాత్మక చింతనలో ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ఒబామా వైట్‌హౌస్‌లో ఉన్న రోజుల నుండి, యూఎస్ –ఇండియా సంబంధాల సంగతి ‘21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధాల’లో ఒకటిగా అమెరికా మాట్లాడుతోంది. 2023 జూన్ మొదటి వారంలో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన 2016 నుండి అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉంటున్న భారతదేశం గురించి మాట్లాడారు. ‘క్వాడ్’ సభ్యులందరిలో, చైనాతో భారీ భూ–సరిహద్దు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు. 2023 జూన్ మొదటి వారంలో దాని 20వ ఎడిషన్‌ను ముగించిన వార్షిక ‘షాంగ్రి–లా డైలాగ్ ’... ఆసియాలో మారుతున్న ఈ ధోరణులను గుర్తించింది. అయితే భారతదేశం ఈ ప్రాంతంలో యూఎస్ క్లయింట్ స్టేట్‌గా ఉండలేదు. లేదా దిగ్గజ చైనాపై ఒక స్థాయికి మించి భారత్ ఆగ్రహం ప్రదర్శించలేదు. దూకుడుకు, అతివాగుడుకు చోటు లేని ఉన్నత స్థాయి దౌత్య నైపుణ్యం దీనికి అవసరం. చైనాతో సంబంధాలు భారతదేశంలో అంతర్–పార్టీ స్పర్థ కోణాన్ని జోడించాయి. 1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు, బీజేపీని అసహ్యించుకునే పండిట్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాబట్టి నెహ్రూను ఢీకొట్టే ఒక్క అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటూండగా, బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2023 జూన్ 20వ తేదీ సోమవారం, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో సరిహద్దు పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 2020 జూన్ 19 నాటి అఖిలపక్ష సమావేశంలో ‘ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు లేదా ఏ సరిహద్దు ప్రాంతం కూడా ఇతరుల అధీనంలో లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యలను తరచుగా ప్రస్తావించడం ద్వారా ప్రధానిని మరింత ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అవన్నీ పక్కన పెడితే, చైనాను నిరంతరం పరిశీలిస్తూండటం మనకు ఎంతో అవసరం. భారత్ అప్రమత్తంగా మెలుగుతూ ఉండాలి. అవినాష్ కోల్హే వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ముంబయ్ -
సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి
బీజింగ్: భారత్–చైనా సరిహద్దులో ప్రస్తుతం సాధారణ స్థిరత్వం నెలకొని ఉందని చైనా విదేశాంగ మంత్రి జనరల్ లీ షాంగ్ఫు చెప్పారు. ఇరు దేశాల సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నాయని వివరించారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన లీ షాంగ్ఫు శుక్రవారం భారత విదేశాంగ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్–చైనా సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితి, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఉన్న మొత్తం ఆధారం చెరిగిపోతుందని చైనాకు రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. సరిహద్దుకు సంబంధించిన ఏ వివాదమైనా ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో జనరల్ లీ షాంగ్ఫు ఆచితూచి స్పందించారు. -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
చైనా దూకుడుకు కారణాలెన్నో!
చైనాకు లదాఖ్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుంది. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. ఈ సంవత్సరం జనవరి 20–22 తేదీల్లో ఢిల్లీలో ‘కంచె లేని భూసరిహద్దుకు సంబంధించిన భద్రతా సమస్యలు’ అనే అంశంపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో లదాఖ్‌లో చైనాతో ఉన్న సరిహద్దుకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చి, అవి మీడియాలో కూడా అనేక చర్చలకు దారితీశాయి. ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం– ఈ ప్రాంతంలో కారకోరం పాస్ నుండి చుమూర్ గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న 65 పాట్రోలింగ్ పాయింట్స్‌లో 26 పాయింట్స్ అంటే పాయింట్ నంబర్ 5 నుండి 17, 24 నుండి 32, 37, 51, 52, 62 అనే పాయింట్స్ ఇండియా కోల్పోయిందనీ, చైనా పాటించే సలామి స్లైస్ వ్యూహంలో(చిన్న దాడులతో పెద్ద ఫలితం రాబట్టడం) ఇవి చిక్కుకున్నాయనీ వెల్లడయిన విషయాలు ఆందోళన కలిగించేవే! అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనాకు ఉన్న ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది ఊహించదగ్గదే. ఇండియా, చైనా మధ్య 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ సుమారు 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాలేదు. రెండు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగుతున్న సంఘటనలు, నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మిలిటరీ స్టేషన్స్, జనావాసాలు... ఎన్ని రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ 2020 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరుద్ధరించడం కష్టమేనన్న భావన కలిగిస్తున్నాయి. దానికి తోడు జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లదాఖ్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. చైనాకు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఈ సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. గత మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో, దాని రూపకల్పనలో సైన్యం పోషించే పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. తొంభయ్యో దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అతిగోప్యతను పాటించడం, ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే, కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానంలో సమూల మార్పులకు దోహద పడ్డాయి. అందులో భాగంగా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది. దూకుడైన విధానాలు, బలమైన, టెక్నాలజీ సపోర్ట్‌తో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టింది. జిన్‌పింగ్ కాలంలో విదేశీ విధానాల రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత పెరగటం గమనించవచ్చు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి రక్షణ చర్యలు తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. 2016 నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ అసియా, అఫ్గానిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదం ప్రభావం తన ఉగెర్, క్సిన్జియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా, తన వెస్ట్రన్ కమాండ్‌ను మొత్తంగా పునరుద్ధరించింది. ఈ చర్యలు అటు క్సిన్జియాంగ్ ప్రోవిన్సుతో పాటు, టిబెట్ ప్రావిన్స్ లలో సైన్యం కదలికలు పెరిగి ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాల్లోని సరిహద్దులపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా విధానాల్లో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు, తాను నిర్దేశించుకున్న ‘మూల ప్రయోజనాలు’. తొంభయ్యో దశకం వరకు ఆర్థిక అభివృద్ధి, దేశ సమగ్రత ముఖ్య లక్ష్యాలయితే, అది కొత్త మిలీనియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకునేందుకు, అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తుల ప్రదర్శన చేయడంగా రూపాంతరం చెందింది. అయితే ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో చైనాకు లదాఖ్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, అవి ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే చైనాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గోచరిస్తుంది. చైనాకు ఈ ప్రాంతంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి: చైనాలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న నగరి డ్యామ్ ద్వారా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా, వాటిని తన రక్షణ దళాల అవసరాలకు మళ్ళించుకోవడానికీ, ఆప్రాంతానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికీ అక్సాయ్ చిన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై చైనాకు పూర్తి నియంత్రణ అవసరం. రెండు: క్సిన్జియాంగ్ ప్రావిన్స్‌ను టిబెట్ ప్రావిన్స్‌తో కలిపే ఎ219 హైవే, కషుగర్ నగరాన్ని సెంట్రల్ చైనా నుండి బీజింగ్‌తో కలిపే ఎ314 హైవే... ఈ రెండింటి భద్రతకు అక్సాయ్ చిన్, లదాఖ్ ప్రాంతాలు చైనాకు అతి ముఖ్యమైనవి. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. ఈ ప్రాంతంలో ఇండియా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రహదారులు, దౌలత్ ఓల్డ్ బేగ్ లాంటి వైమానిక స్థావరాలతో చైనా భద్రతకు, అందునా చైనా– పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను కషుగర్ సిటీతో కలిపే కారకోరం హైవేకు ప్రమాదం ఏర్పడుతుందని చైనా అంచనా. మూడు: ఈ ప్రాంతంలో 1913లో జరిగిన డి ఫిలిపె ఎక్స్‌పెడీషన్, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ జరిపిన భౌగోళిక సర్వేలో అత్యంత విలువైన థోరియం, యురేనియం, బోరోక్స్, సల్ఫర్, నికెల్, పాదరసం, ఇనుము, బంగారం, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. 2019లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి వెలికితీత కార్యక్రమాలు, శుద్ధిచేసే ప్లాంట్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఖనిజ సంపదతో తన తూర్పు ప్రాంతానికి సమానంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనీ, ఉగెర్ ప్రాంతంలో నెలకొని ఉన్న పేదరికాన్ని, వేర్పాటువాదాన్ని ఎదుర్కొనవచ్చనీ చైనా వ్యూహం. ఈ పరిస్థితుల మధ్య భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుందనీ, భవిష్యత్తులో మరింత దూకుడుగా ఉంటుందనీ అంచనా వేయవచ్చు. ఇంతకు ముందులా కాకుండా భారత్ కూడా లదాఖ్ నుండి అరుణాచల్ వరకు ఉన్న తన సరిహద్దుల వెంబడి అనేక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సైనిక దళాలకు కావలసిన వసతులను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నది. చైనాకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా, అది వ్యవహరిస్తున్న తీరును బట్టి, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చని చెప్పవచ్చు. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. వ్యాసకర్త సహాయ ఆచార్యులు, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
భారత భూభాగం ఆక్రమించిన చైనా.. కేంద్రానికి సంచలన నివేదిక!
భారత్ సరిహద్దుల్లో చైనా కారణంగా ఎప్పుడూ ఉద్రిక్తత చోటుచేసుకుంటూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ భారత్‌కు చెందిన సరిహద్దులపై కన్నేసి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా భారత్‌కు సంబంధించిన భూమిని చైనా ఆక్రమించుకున్నట్టు స్వయంగా దేశానికి చెందిన సీనియర్ అధికారి ఓ నివేదికలో చెప్పడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలోని 65 పాయింట్లలో భారత్ గస్తీ నిర్వహించాల్సి ఉండగా.. మన బలగాలు 26 చోట్లకు మాత్రమే ప్రవేశించగలుగుతున్నాయి. పలు చోట్ల భారత్ గస్తీ నిర్వహించడం లేదని ఈ క్రమంలోనే ఆక్రమణ జరిగినట్టు లేహ్ ఎస్పీ నిత్య కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నివేదికను ఆమె.. ఢిల్లీలో జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. కాగా, ఆ ప్రాంతం కారాకోరం శ్రేణుల్లో నుండి చమూరు వరకు విస్తరించి ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక, ఈ ప్రాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించకపోవడంతో చైనా.. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో కొన్ని చోట్ల బఫర్ జోన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అయితే, బఫర్ జోన్లను ఆసరాగా తీసుకుని భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు నివేదికలో చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ బలగాల కదలికలను సైతం గుర్తించేందుకు అక్కడి ఎత్తైన శిఖరాలపై చైనా.. కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా, బఫర్ జోన్లోకి భారత సైన్యం వెళ్లిన వెంటనే ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదే అని చైనా దూకుడగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఇలా చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. Did India lose access to 26 patrolling points in Eastern Ladakh? Become a Youturn Supporter: https://t.co/6cvL9b8072#Youturn | #FactCheck | #IndiaBorder | #Ladakh pic.twitter.com/kHY6nsLBcY — Youturn English (@Youturn_media) January 25, 2023 -
అక్కడ రష్యా.. ఇక్కడ చైనా..
న్యూఢిల్లీ: యుద్ధంలో మునిగిన ఉక్రెయిన్, రష్యాలతో భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పోలుస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘ ఉక్రెయిన్ను ఆక్రమిస్తూ రష్యా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మార్చేస్తోంది. అదే తరహాలో భారత్‌తో ఉన్న సరిహద్దును మార్చేందుకు చైనా తన సైన్యం చొరబాట్లతో దుస్సాహసానికి తెగబడుతోంది’ అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్‌తో చర్చాగోష్టి తాలూకూ సుదీర్ఘ వీడియోను రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. ‘బలహీన ఆర్థిక వ్యవస్థ, దమ్ములేని నాయకత్వంలో దార్శనికత కొరవడిన ప్రజలు, విద్వేషం, ఆగ్రహం కలగలిసిన ఈ పరిస్థితులను చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. లద్దాఖ్‌లోకి వస్తామంటోంది. అరుణాచల్‌లో అడుగుపెడతామంటోంది’ అని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 3వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన రాహుల్ గాంధీకి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి కాంగ్రెస్ ప్లీనరీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా.. మూడు రోజులపాటు తమ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ప్లీనరీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చైనా నుంచి వచ్చే ముప్పును తక్కువ అంచనా వేస్తుందని విమర్శించారు. డ్రాగన్ దేశం యుద్ధానికి కాలు దువ్వుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని అంగీకరించడం లేదని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర భాగంగా రాజస్థాన్‌లోని దౌసాలో రాహుల్‌గాంధీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా ఉన్నారు, కాగా డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖవద్ద భారత్, చైనా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుపడ్డారు ‘చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాల సరళి, వాడకం చూస్తే అర్థమవుతోంది.. అది యుద్ధం కోసమేనని. కానీ మన ప్రభుత్వం దానిని గుర్తించడం లేదు. భారత ప్రభుత్వం వ్యూహాలపై కాదు, సంఘటనలపై పనిచేస్తోంది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన సైనికులపై దాడి చేసింది. దీంతో డ్రాగన్‌తో వచ్చే ముప్పు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని దాచేస్తోంది. మోదీ చైనా బెదిరింపులను విస్మరిస్తున్నారు. ఓవైపు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దాడికి సిద్ధమవుతుంటే.. భారత ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిద్రపోతుంది’ అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్ -
నమ్మలేని పొరుగు దేశం
భారత–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత మరోమారు పార్లమెంట్ సహా దేశమంతటినీ కుదిపి వేస్తోంది. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద యాంగ్సే ప్రాంతంలో చొచ్చుకొని రావడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు గట్టిగా తిప్పికొట్టిన తీరుపై వైనవైనాలుగా కథనాలు వస్తున్నాయి. అక్కడ నిజంగా జరిగిందేమిటో తెలుసుకొని, పరిస్థితిని సమీక్షించి, లోటుపాట్లను సరిదిద్దుకొని, రక్షణ దళాలను బలోపేతం చేసే పనిలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఉంది. అయితే, సరిహద్దు వెంట శాంతి నెలకొనాలనీ, అనేక ఇతర అంశాల్లో సహకారం వెల్లివిరియాలనీ – ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని దశాబ్ద కాలంగా పొరుగుదేశం పదే పదే ఉల్లంఘించడం కీలకాంశం. పొరుగునే పొంచివున్న పాము పట్ల అప్రమత్తత అనివార్యం. రెండేళ్ళ క్రితం 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల్లోనూ, తాజా తవాంగ్ ఘటనలోనూ చైనా తన తప్పేమీ లేదనే భావన కలిగించడానికి శతవిధాల ప్రయత్నించింది. వాస్తవాలు వెలికి రావడంతో డ్రాగన్ పాచిక పారలేదు. భారత – చైనాల మధ్య సైనిక ఘర్షణ 1962 నుంచి 60 ఏళ్ళుగా సాగుతోంది. లద్దాఖ్ పరిసర పశ్చిమ ప్రాంతం – టిబెట్‌తో మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ల సరిహద్దుతో కూడిన మధ్యప్రాంతం – అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం... ఈ మూడూ భారత–చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు. అరుణాచల్‌తో ఉన్న 1126 కి.మీల తూర్పు సరిహద్దుపై చైనా ఎప్పుడూ పేచీ పెడుతూనే ఉంది. అరుణాచల్ తనదేనంటోంది. అధిక భాగాన్ని ‘దక్షిణ టిబెట్’ అని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది. అరుణాచల్‌పై రచ్చ రేపి, చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక అక్సాయ్చిన్ని తమకు వదిలేస్తే, అరుణాచల్‌పై పట్టు వీడతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహమని ఓ విశ్లేషణ. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవాంగ్ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు. 17వేల అడుగుల ఎత్తైన పర్వతప్రాంతాన్ని వశం చేసుకుంటే, ఎల్ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు. ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి, భారత్‌కు చోటు లేకుండా చేయాలన్నది చైనా పన్నాగం. అలాగే అరుణాచల్‌లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికీ తాజా చర్యకు దిగింది. అది ఫలించకపోవడంతో తవాంగ్‌లో ప్రస్తుతానికి భారత్‌దే పైచేయి. కానీ, మరోపక్క సిక్కిమ్ సరిహద్దులో 2017లో ఘర్షణ సాగిన కీలక డోక్లామ్ ప్రాంతంలో కొన్నేళ్ళుగా చైనా ఊళ్ళకు ఊళ్ళు కడుతోంది. వంతెనలు నిర్మిస్తోంది. ఇది ఆందోళనకరం. తవాంగ్‌లో 13 వేల అడుగుల ఎత్తైన చోట, మైనస్ 15 డిగ్రీల్లోనూ భారత్ నిర్మిస్తున్న సేలా సొరంగ మార్గం పూర్తి కావచ్చింది. ఇటు ప్రజలకూ, అటు ఆర్మీకీ పనికొచ్చే ఇలాంటివి చైనాను చీకాకుపరుస్తున్నాయి. ఆసియాపై ఆధిక్యం చూపాలంటే, హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం. పైగా, భవిష్యత్ దలైలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం. అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమనీ, అదీ తమ దేశంలో భాగమైపోవాలనీ చైనా తాప త్రయం. మరోపక్క బ్రహ్మపుత్రా నదిపై ప్రాజెక్ట్‌లు కడుతూ, ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది. ఇక, తవాంగ్ ఘటనలో భారత్‌ను అమెరికా సమర్థించడంతో పుండు మీద కారం రాసినట్టయింది. భారత, అమెరికాల బంధం బలోపేతమైతే తన ప్రాంతీయ ఆధిపత్యానికి గండి పడుతుందని చైనా భావన. అందుకే, ఢిల్లీ, వాషింగ్టన్లు దగ్గరవుతున్న కొద్దీ కవ్వింపు పెంచుతోంది. ప్రపంచవేదికలు శాంతివచనాలు పలుకుతున్నా, వాటి ప్రభావం శూన్యం. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై మన దేశమంతా ఏకతాటిపై ఉందని చాటాల్సిన సమ యమిది. కానీ తవాంగ్ ఘటన సైతం రాజకీయమవుతోంది. తమనూ విశ్వాసంలోకి తీసుకొని, సరిహద్దు రక్షణపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కారణాలేమైనా అధి కార బీజేపీ అంగీకరించట్లేదు. 1962 చైనా యుద్ధవేళ నెహ్రూ విధానాన్ని కాషాయధ్వజులు తప్పు పడున్నారు. అప్పట్లో నెహ్రూ సభలో చర్చించి, ఏకంగా 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశ మిచ్చి, ఆపైనే నిర్ణయం తీసుకున్నారని విస్మరిస్తే ఎలా అని కాంగీయులు ప్రతిదాడి చేస్తున్నారు. వెరసి, అప్పట్లో గల్వాన్ ఘటనలోనూ, ఇప్పుడీ తవాంగ్పైనా ఈ రాజకీయ వాగ్వాదపర్వం కీలకమైన దేశభద్రతలో లోటుపాట్లపై లోతైన చర్చకు దారి తీయకపోవడమే విచారకరం. సరిహద్దు వెంట చైనా లాగానే, టిబెట్, దక్షిణ మంగోలియా, హాంకాంగ్, తవాంగ్ లాంటి చోట్ల చైనాపై మనమూ దూకుడు చూపాలనేది కొందరి వాదన. అయితే, మన పాలకులు ‘ఆత్మనిర్భరత’ అంటూ రొమ్ము విరుచుకుంటున్నా, ఇవాళ్టికీ బొమ్మలు (86 శాతం), ఎలక్ట్రానిక్ విడిభాగాలు (37 శాతం), ఆటో విడిభాగాలు (30 శాతం) సహా అనేక అంశాల్లో మనం చైనా దిగుమతులపైనే ఆధార పడ్డాం. వస్తూత్పత్తిలో స్వీయపురోగతికి దీర్ఘకాలం పడుతుంది. అలా చూస్తే పొరుగున ఉన్న చైనాతో బద్ధశత్రుత్వంతో రోజులు గడవవు. దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే, నేటికీ స్పష్టంగా అంగీకారం లేని సరిహద్దు రేఖపై చర్చించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాలి. సరిహద్దుల్లో జరగనున్న భారత వైమానికదళ విన్యాసాలతో తోక తొక్కిన తాచులా చైనా బుసలుకొట్టవచ్చు. రానున్న రోజుల్లో ఉద్రిక్తతలూ పెరగవచ్చు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో సర్వర్లను స్తంభింపజేసిన సైబర్ దాడీ చైనా పనేనట. ఈ పరిస్థితుల్లో సైన్యం, భారత గూఢచారి దళాల అప్రమత్తతే మనకు రక్షాకవచం. -
చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత బలగాలు.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
తవాంగ్ ఘర్షణ: రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
‘మీకేం వీటో పవర్ ఇవ్వలేదు’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇదీ చదవండి: వీడియో: గుజరాత్ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్! ఎందుకంటే.. -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్ – చైనా చర్చలు
China-India: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద 22 నెలల క్రితం తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత–చైనాల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరిగాయి. వరసక్రమంలో ఇవి 15వ దఫా చర్చలు. రెండు నెలల క్రితం జరిగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితమూ కనబడకపోవడం కారణంగా ఈ చర్చల ప్రక్రియపై కొంత నిరాశా నిస్పృహలు ఏర్పడిన మాట వాస్తవమే. అయితే చర్చలకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు కనుక ఇవి కొనసాగక తప్పదు. 2020 మే నెల మొదటి వారంలో ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తొలిసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాలూ భారీయెత్తున సైన్యాన్నీ, ఆయుధ సామగ్రినీ తరలించాయి. ఆ ఏడాది జూన్ నెలలో చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనా సైన్యం కూడా తీవ్రంగా నష్టపోయిందన్న కథనాలు వెలువడ్డాయి. సైన్యం స్థాయిలోనూ, దౌత్యపరంగానూ చర్చోపచర్చలు జరిగాక నిరుడు ప్యాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రెండు దేశాలూ సైన్యాలను ఉపసంహ రించుకున్నాయి. గోగ్రాలో కూడా ఇది పూర్తయింది. హాట్ స్ప్రింగ్స్ (పెట్రోలింగ్ పాయింట్–15) ప్రాంతాలనుంచి ఉపసంహరణ విషయంలో చైనా నానుస్తోంది. అలాగే డెస్పాంగ్ బల్జ్, డెమ్చోక్ లతో సహా మరికొన్న చోట్ల కూడా ఉపసంహరణ మొదలుకావాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఎల్ఏసీపై ఏకాభిప్రాయం కుదరక ఇరు దేశాల మధ్యా అడపాదడపా ఉద్రిక్తతలు అలుముకుంటున్నాయి. మాస్కోలో 2020లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్యా పరస్పరం చర్చలు జరగాలని నిర్ణయించారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలనీ, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను గౌరవించాలనీ అవగాహన కుదిరింది. కానీ ఆ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది చైనాయే. సరిహద్దుల్లో దీర్ఘకాలం సైన్యాలను మోహ రించడం వల్ల అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయి. అవి ఘర్షణలకు దారితీస్తాయి. వర్తమాన రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే అందుకు తార్కాణం. ఇరుగు పొరుగు దేశాలు రెండూ భాగస్వాములుగా మెలగాలితప్ప ప్రత్యర్థులుగా కాదని చైనా విదేశాంగమంత్రి గతంలో అన్నారు. కానీ ఆచరణలో అందుకు సంబంధించిన జాడలు కనబడవు. అమెరికా రూపొందించి అమలు చేస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం సారాంశం ఆసియాలో మరో నాటో రూపకల్పన తప్ప మరేమీ కాదని ఆయన ఈమధ్య చేసిన వ్యాఖ్య కీలకమైనది. ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా అమెరికా చొరవతో ఏర్పాటైన చతుర్భుజ కూటమి (క్వాడ్)లో భారత్ భాగస్వామి. దీంతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మధ్య నిరుడు సెప్టెంబర్‌లో ‘ఆకస్’(ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గా ములు సమకూర్చడంతోపాటు ఇతరత్రా అంశాల్లో సైతం హామీ ఇవ్వడం ఈ ఒప్పందం సారాంశం. ఇది కూడా ఇండో–పసిఫిక్ వ్యూçహానికి సంబంధించిందే. ఇదికాక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా భాగస్వాములుగా ‘ఫైవ్ ఐస్’ పేరుతో రక్షణ సంబంధమైన నిఘా, అంతరిక్ష నిఘా వగైరాలకు సంబంధించి మరో ఒప్పందం ఉంది. ఇవన్నీ తనను చుట్టుముట్టి కట్టడి చేయడానికేనని చైనా బలంగా విశ్వసిస్తోంది. అయితే చైనా ఆరోపిస్తున్నట్టు ఇప్పటికైతే క్వాడ్ సైనిక కూటమి కాదు. ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాలు కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వాతావరణ మార్పులు, కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వంటి అంశాలకు మాత్రమే అది పరిమిత మైంది. ఇది ముందూ మునుపూ ఏమవుతుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సైనిక కూటములు ఏర్పడటం, కయ్యానికి కాలుదువ్వడం వంటి పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. అందుకు ప్రస్తుత ఉక్రెయిన్ ప్రత్యక్ష ఉదాహరణ. సామరస్య పూర్వకంగా సంప్రదింపులు జరుపుకోవడం, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించడం ఉత్తమమైన మార్గం. కానీ సమస్యలో భాగమైన అన్ని పక్షాలూ అందుకు నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అవతలి పక్షానికి విశ్వాసం కల్పించాలి. కానీ ఎల్ఏసీ విషయంలో మాత్రమే కాదు... బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) పేరిట రూపకల్పన చేసిన బృహత్తర ప్రాజెక్టులో సైతం చైనా మన వ్యూహా త్మక ప్రయోజనాలను దెబ్బతీసే ఎత్తుగడలు అనుసరించింది. ఇండో–పసిఫిక్ వ్యూహం తన కట్టడి కోసమే ఉనికిలోకొచ్చిందన్న సందేహం చైనాకు ఉండటం వల్లే ఎల్ఏసీ వద్ద యధాతథ స్థితిని దెబ్బతీసి, మన దేశాన్ని చికాకుపరచడం మొదలుపెట్టింది. ఇది తెలివితక్కువ పని. నిజానికి వివాదంలో మూడో పక్షం ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలిగితే సత్వరం ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడం విజ్ఞుల లక్షణం. చైనాకు అది కొర వడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉండాలని చైనా నిజంగా కోరుకుంటే అందుకు సంబంధించిన సంకేతాలు కనబడాలి. చర్చల్లో విశాల దృక్పథంతో వ్యవహ రించడం, అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలుండటం అవసరం. భారత్ –చైనా మధ్య జరుగుతున్న చర్చలు సాధ్యమైనంత త్వరలో ముగిసి ఒక సానుకూల ఫలితం వస్తుం దనీ, అది రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు మార్గం సుగమం చేస్తుందనీ ఆశించాలి. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్‌కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. చదవండి: సిద్దిపేట లాల్ కమాన్‌పై ఉన్నట్టుండి వెలసిన కేసీఆర్ విగ్రహం కాగా భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్‌కు చెందినవారు. 16-బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. సంతోష్ 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఆయన చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు. -
సరిహద్దులో చైనా దూకుడు!
న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సైనికుల కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్ స్ప్రింగ్స్, చురుప్‌సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో దిష్టవేయని సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. భారత్ సైతం చైనాకు ధీటుగా స్పందిస్తోంది.