మనాలి– కులు రహదారిపై ఆర్మీ ట్రక్కులు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి.
తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్‌లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి.
కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది.
తూర్పువైపు బలగాలు
సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్‌లో లద్దాఖ్‌లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి.
దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు.
ఆందోళన అక్కర్లేదు
1962లో అరుణాచల్‌ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు.
భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్‌లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్‌లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment