indian forces
-
భారత బలగాలు మా భూభాగంపై వద్దేవద్దు
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. సాధారణ పౌర దుస్తుల్లోనైనా సరే భారత సైనిక సిబ్బంది తమ భూభాగంలో మే 10వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని అన్నారు. మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడి ప్రభుత్వం మార్చి 10వ తేదీ కల్లా భారత సైనిక సిబ్బంది వాటిని విడిచి వెళ్లిపోవాలని గడువు ప్రకటించింది. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు ముయిజ్జు మళ్లీ తన బుద్ధిని బయటపెట్టారు. భారతీయ సిబ్బంది ఏ రూపంలోనైనా సరే తమ దీవిలో ఉండరాదన్నారు. -
ఓటమి నేర్పిన పాఠాలు
భారత్–చైనా యుద్ధానికి 60 ఏళ్లు! నాయకత్వ వైఫల్యాలు, సన్నద్ధంగా లేని సైన్యం కారణంగా భారత్ అందులో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామనే చెప్పాలి. అయితే ఆ పాఠాలు చొరబాట్లను ఎదుర్కోడానికి మాత్రమే పనికొచ్చేవి. సరిహద్దు సమస్యల్ని పరిష్కారించుకోడానికైతే మిగిలి ఉన్న మార్గం ఒక్కటే. 1959–60 ప్రతిపాదనల ప్రకారం... ఇరుదేశాలు ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిలో ముందుకు వెళ్లడం! అక్సాయ్ చిన్ను చైనాకు వదిలేసి, అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ ఉంచుకోవడం. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం! సరైన ఆయుధాలు, దుర్భేద్యమైన సైనిక దుస్తులు లేకుండా ఈశాన్య సరిహద్దు ప్రాంతం (నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ – ఎన్.ఇ.ఎఫ్.ఎ.)లో గస్తీ కాస్తున్న భారత దళాలు ఒక హఠాత్పరిణామంగా 1962 అక్టోబర్ రాత్రి 19–20 తేదీల మధ్య చైనా జరిపిన చొరబాటు దాడులతో అనేక ప్రాధాన్య స్థావరాలను కోల్పోయాయి. ఆశ్చర్యకరంగా, చైనా సైని కుల్ని వెనక్కి తరిమికొట్టే బాధ్యత... దానికి ఎంతమాత్రమూ తగని ‘గజరాజ్ కోర్’ సేనాని, నెహ్రూ మనిషిగా పరిగణన పొందిన లెఫ్ట్‌నెంట్ జనరల్ బి.ఎం.కౌల్‌పై పడింది! ఆ అయోమయంలో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వ్యూహమంటూ లేని మన గందరగోళం గురించి ఢిల్లీలోని రాజకీయ దిగ్గజాలకు నివేదించడం ఆయన ఉద్దేశం. ఈశాన్య భారతదేశానికి, టిబెట్‌కు మధ్య ఉన్న మక్‌మహన్ సరిహద్దు రేఖ వెంబడే చైనా మూకల చొరబాట్లు కొనసాగుతూ ఉండటంతో ఢిల్లీ వెళ్లిన కౌల్ మళ్లీ తిరిగిరాలేదు. సైనిక దళాల మోహరింపు, యుద్ధ ప్రణాళికలకు వ్యూహరచన జరుగుతుండే ఢిల్లీలోనూ అయోమయం నెలకొంది. చైనా వెన్నుపోటు పొడిచిందని నెహ్రూ, ఆయన అనుచరులు ఆ తర్వాత వాదిస్తూ వచ్చారు కానీ, మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు నాయకత్వం ఏం చేయనుందో 1950ల చివరి నుంచీ చాలినన్ని హెచ్చరికలు కనిపిస్తూనే ఉన్నాయి. చైనాను బుజ్జగించడానికి టిబెట్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం మానేస్తామని భారత్ ఇచ్చిన హామీపై 1954లో ‘పంచశీల’ ఒప్పందానికి చైనా అంగీకారం తెలిపింది. అయినప్పటికీ అక్సాయ్ చిన్లోగానీ, తవాంగ్‌లో మక్‌మహన్ నియంత్రణ రేఖను మీరిన భాగాన్ని కూడా తనదేనన్న వాదననుగానీ చైనా వదులుకోలేదు. 1959లో లోంగ్జులో జరిగిన వాగ్వివాదాలను భారత్ తేలిగ్గా తీసుకుంది. లోంగ్జులో వందలాది భారత సైనిక దళాలు తమ భూభాగం లోకి ప్రవేశించాయంటూ చైనాలోని భారత రాయబార కార్యాలయా నికి చైనా నిరసన పత్రం పంపినప్పుడు భారత్ ఏమాత్రం దీటైన జవాబు ఇవ్వలేకపోయింది. మావో, కృశ్చేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పం దాన్ని అనుసరించి సోవియట్ వైమానిక, భూ ఉపరితల సేనల సహ కారంతో టిబెట్ భూభాగంపై చైనా తన సైనిక బలగాలను స్థిరంగా పెంచు కుంటూ పోయింది. ఆ పరిణామాన్ని కూడా భారత్ పట్టించు కోలేదు. 1959లో అమెరికా సాయంతో టిబెట్ నుంచి భారత్‌కు తప్పించుకున్న దలైలామా, ఆయన అనుచరులు భారత్‌లో ఆశ్రయం పొందడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. నిజానికి ముందుగా అనుకున్నది వారు అమెరికా వెళ్తారని. అన్నిటినీ మించి చైనా కోపానికి కారణమైన అంశం... అమెరికా కార్యకలాపాలకు భారత్ ఒక ప్రధాన కేంద్రం అవడం. సీఐఏ శిక్షణ పొందిన సాయుధ టిబెటన్ తిరుగు బాటు దళాల్ని టిబెట్‌లోకి పంపించేందుకు భారత్‌ను అమెరికా ఒక ‘లాంచ్ ప్యాడ్’గా ఉపయోగించుకుంది. ఇక స్వదేశంలో ఒత్తిళ్లకు లోనైన నెహ్రూ భారత భూభాగాలలోంచి చైనీయులను విసిరి బయట పడేయమని భారత సైన్యాన్ని ఆదేశించారు. ఆ దూకుడులో ఆయన చైనా ప్రధాని చౌ ఎన్–లై 1960లో ఇండియా పర్యటించినప్పుడు చేసిన ప్రతిపాదనలను సైతం విస్మరించారు. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాకు ఉంచి, మక్‌మహన్ రేఖకు దక్షిణ వైపున ఉన్న ప్రాంతాన్ని భారత్ తీసుకోవడం ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ ప్రతిపాదన. నిజానికి 1962 భారత్–చైనా యుద్ధంలో మన సేనలు మెరుగైన ప్రతిఘటననే ఇచ్చాయి. సరిహద్దు వెంబడి ప్రాధాన్య స్థావరాలపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వీరోచితంగా పోరాడాయి. మన సేనాపతులు తమ సైనికులపై ఎన్ని నెపాలు మోపినా గానీ, ఆ సైనికుల అసమాన శౌర్య పరాక్రమాలకు ఎన్నో నిదర్శనాలు కనిపి స్తాయి. అలాగైతే ఎందుకు ఓడిపోయాం? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ థాపర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఈస్ట్రన్ కమాండ్) లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎల్.పి.సేన్ల నిస్పృహ కలిగించే పాత్రతో పాటుగా, నెహ్రూ నిర్ణయం కూడా మన పరాజయానికి కారణమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.ఎన్.మాలిక్ సలహాపై భారత వైమానిక దళాలను రంగంలోకి దింపేందుకు నెహ్రూ అనుమతించలేదు. అలా చేస్తే చైనాను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ భావించారు! అదొక పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది. భారత్–చైనా యుద్ధం జరిగి 60 ఏళ్లయింది. ఇప్పుడిక అసలు ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏవైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామని చెప్పడమే న్యాయంగా ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలను చూపవచ్చు. ముఖ్యంగా, 1967లోనే చైనా నాథు లా పాస్, చో లా పాస్ మార్గాలు వెళ్లే హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కండలు తిప్పడం మొదలు పెట్టీ పెట్టగానే అక్కడి జననల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ సగత్ సింగ్ తన అధీనంలోని కంచె లోపలి భాగంలోకి ఎలాంటి విదేశీ చొరబాట్లను అనుమతించబోనని తన పై అధికారులకు ముందస్తు సమాచారం పంపించారు. అంటే తనిక ఎలాంటి ఆదేశాల కోసమూ ఎదురు చూడబోయేది లేదని. 20 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన చైనా 1986–87లో అరుణాచల్ ప్రదేశ్‌లోని సోమ్డోరోంగ్ లోయలోకి చొరబడింది. ఆర్మీ చీఫ్ జనరల్ సుందర్జీ మెరుపు వేగంతో ప్రతిస్పందించి భారత సేనల్ని గగనతలం గుండా సోమ్డోరోంగ్పై దింపారు. మన సైన్యం చైనా సేనల్ని చుట్టుముట్టింది. ప్రత్యర్థి మూకలు మారు మాట్లాడకుండా వెన కడుగు వేశాయి. ఆ ఘటన ప్రధాని రాజీవ్ గాంధీ రక్తాన్ని ఉత్తేజంతో ఉరకలెత్తించింది. అనంతర పరిణామంగా 1988లో జరిగిన రాజీవ్ చైనా పర్యటన, ఆ సందర్భంగా రెండు దేశాల మధ్య వరుసగా కుది రిన అనేక ఒప్పందాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల 2020లో గల్వాన్ లోయలో చైనా చొరబాట్లకు కూడా భారత్ మునుప టంత వేగంగానే స్పందించింది. చైనా మితిమీరి, పరిస్థితి ముదిరితే కనుక గల్వాన్‌లో మన సైనికులు దెబ్బకు దెబ్బ తీసిన విధంగానే వాణిజ్య పరమైన ఆంక్షలను విధించేందుకు కూడా భారత్ సిద్ధమైంది. గగనతలం నుంచి పోరుకు సైతం సన్నద్ధం అయింది. గతం నుంచి మనం ఇంకా నేర్చుకోవలసింది ఏమైనా ఉందీ అంటే అది చైనా ఉద్దేశాలను మరింతగా అర్థం చేసుకోగలగడం. అక్సాయ్ చిన్‌పై చైనా తన నియంత్రణను వదులుకునేలా చేయడానికి బీజింగ్‌తో భారత్ దౌత్యపరమైన సంభాషణలు జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అక్సాయ్ చిన్ వ్యూహాత్మకంగా చైనాకు ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్య నదులు, యురేనియం నిక్షేపాలు ఉన్న ప్రాంతం అది. అక్కడి నుంచే జి 219 హైవే వెళుతుంది. చైనాలోని రెండు కీలక ప్రాంతాలైన షిన్జాంగ్, టిబెట్లను ఆ దారి కలుపుతుంది. మరైతే అక్సాయ్ చిన్ సమస్యకు పరిష్కారం ఏమిటి? ముందుకు వెళ్లే దారేది? ఒక మార్గం అయితే ఉంది. 1959–60 ప్రతిపాదనల ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లడం. అప్పుడిక అక్సాయ్ చిన్ చైనాకు, అరుణాచల్ ప్రదేశ్ భౌగోళిక ప్రాంతాలు భారత్ భూభాగానికి వస్తాయి. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం. ప్రస్తుతం రెండు దేశాలకు శక్తిమంతమైన నాయకులే ఉన్నారు కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని, రాజకీ యంగా సరళమైన మనుగడ సాగించవచ్చు. అయితే వారు అలా చేయ డానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న. మరూఫ్ రజా వ్యాసకర్త వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు
జమ్మ-కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కెరాన్ సెక్టార్ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు శనివారం తిప్పికొట్టాయి. మిషన్ గంగానది ఒడ్డున కూడా అక్రమంగా ఆయుధాలను తరలించేందు ముష్కరులు ప్రయత్నించారు. పాక్ అక్రమిత కశ్మీర్(పీఓకే) నుంచి ఓ ట్యూబ్‌ను తాడుతో కట్టి దాని ద్వారా ఉగ్రవాదులు ఆయుధాలు తరలించాలని చుశారు. ఉగ్రవాదుల కుట్రకు భారత బలగాలు భంగం కలిగించి ఏకే 47 రైఫిల్స్‌తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను భారత్ స్వాధీనం చేసుకుంది. -
వ్యూహాత్మక మోహరింపు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. తూర్పువైపు బలగాలు సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్‌లో లద్దాఖ్‌లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి. దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆందోళన అక్కర్లేదు 1962లో అరుణాచల్‌ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు. భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్‌లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు. -
రష్యా విక్టరీ పరేడ్‌లో భారత సైనికులు
మాస్కో: భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పరేడ్‌లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని, ఇవి తనకు సంతోషకరమైన క్షణాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రష్యా అధినేత పుతిన్ సమక్షంలో రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో బుధవారం జరిగిన ఈ పరేడ్‌కు రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1941–1945 మధ్య వీరోచితంగా జరిగిన యుద్ధంలో సోవియట్ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తోపాటు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ అడ్మిరల్ హరి కుమార్, భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మ పాల్గొన్నారు. రష్యా విక్టరీ పరేడ్‌లో రష్యా సైనిక దళాలతోపాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17 దేశాలకు చెందిన సైనికులు కూడా పాలుపంచుకున్నారు. ఈ పరేడ్‌ను ఏటా మే 9న నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈసారి జూన్‌లో నిర్వహించారు. -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్‌గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్‌లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్‌లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
ఏకం చేసిన ఘనత పటేల్‌దే
న్యూఢిల్లీ: దేశవిభజన తర్వాత వందలాది స్వతంత్ర రాజ్యాలుగా మిగిలిపోయిన భారత్‌ను ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రిగా ఉన్న పటేల్ సరైన సమయంలో ప్రతిస్పందించడంతో జమ్మూకశ్మీర్‌ను విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్టోబర్ మాసాంతపు ’మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసంగించిన మోదీ.. ఈ నెల 31 సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ‘రన్ ఫర్ యూనిటీ’ మారథాన్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు మనం భారత్‌ను ఒక దేశంగా చూస్తున్నామంటే సర్దార్ పటేల్ తెలివితేటలు, వ్యూహాత్మక నిర్ణయాలే కారణం. అక్టోబర్ 31న çపటేల్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడమే ఆయనకు మనం ఇవ్వబోయే నిజమైన నివాళి. గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనది. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎత్తయిన రెండో విగ్రహంగా ఉన్న న్యూయార్క్‌లోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తులో పటేల్ విగ్రహం ఉండనుంది. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అక్టోబర్ 31నే. ఈ సందర్భంగా ఇందిరాజీకి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. అభివృద్ధితోనే నిజమైన శాంతి.. ‘యుద్ధం లేకపోవడం నిజమైన శాంతి కాదు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తులకు అందడమే నిజమైన శాంతికి సూచిక. ప్రపంచశాంతి గురించి ఎక్కడైనా ప్రస్తావించాల్సి వస్తే అందులో భారత్ పాత్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధంలో మనకు ఎలాటి సంబంధం లేకపోయినా భారతీయ సైనికులు కదనరంగంలో దూకారు. ఈ యుద్ధంలో కోటి మంది సైనికులతో పాటు మరో కోటి మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రపంచానికి శాంతి ప్రాముఖ్యత అర్థమయింది. గత వందేళ్లలో శాంతి అన్న పదానికి నిర్వచనమే మారిపోయింది. ఇప్పుడు శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఇందుకోసం ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం తదితర సమస్యల పరిష్కారినికి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. క్రీడారంగంలో రాణించాలంటే స్పిరిట్ (స్ఫూర్తి), స్ట్రెంత్ (శక్తి), స్కిల్ (నైపుణ్యం), స్టామినా (సామర్థ్యం) ఉండటం కీలకమన్నారు. సైనిక చర్యలో ఆలస్యం ఉండొద్దన్న సర్దార్ ‘కశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాక్ బలగాలను తరిమికొట్టేందుకు భారత సైన్యాన్ని పంపడంలో జరుగుతున్న జాప్యంపై సర్దార్ పటేల్ అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత సైనిక చర్యలో ఎలాంటి ఆలస్యం ఉండరాదని అప్పటి ఫీల్డ్ మార్షల్ మానెక్ షాకు పటేల్ సూచించారు. ఆతర్వాత వెంటనే రంగంలోకి దిగిన భారత బలగాలు కశ్మీర్‌ను పాక్ దురాక్రమణ నుంచి కాపాడాయి. భారత్‌కు ఏకం చేయగల, దేశ విభజన గాయాలను మాన్పగల శక్తిఉన్న వ్యక్తిగా పటేల్‌ను 1947, జనవరిలో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ కీర్తించింది. స్వదేశీ సంస్థా నాలను దేశంలో విలీనం చేసే సామర్థ్యం కేవలం పటేల్‌కే ఉందని మహాత్మా గాంధీ సైతం గుర్తించారు. హైదరాబాద్, జునాగఢ్, ట్రావెన్కోర్.. ఒకటితర్వాత మరొకటి ఇలా 562 స్వదేశీ సంస్థానాలను పటేల్ భారత్‌లో విలీనం చేశారు. ఇందులో పూర్తి ఘనత పటేల్‌కే దక్కుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
చైనా-భారత్ ఘర్షణ: సిక్కింలో ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భూటాన్‌లో రోడ్డు విషయంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గురువారం సిక్కిం పర్యటన చేపట్టారు. ఆయన రెండురోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారని, రాష్ట్రంలో ఉన్న ఫార్మేషన్ హెడ్ క్వార్టర్స్‌లో టాప్ ఆర్మీ కమాండర్లతో భేటీ అయి సరిహద్దుల్లోని పరిస్థితి, కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్మీ చీఫ్ రావత్ సిక్కిం రాక మామూలు పర్యటనే అని ఆ వర్గాలు వెల్లడించాయి. సిక్కిం సెక్టార్‌లోని భూటాన్ భూభాగంలో చైనా సైన్యం రోడ్డు నిర్మిస్తుండటంతో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణాన్ని భూటాన్, భారత్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ.. భారతీయులు చేపట్టే మానస సరోవర్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో సిక్కిం సెక్టార్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. చదవండి: చైనా దుందుడుకుతనం చదవండి: మోదీ అమెరికా టూర్: డ్రాగన్ కుతకుత! చదవండి: పెట్రేగిన చైనా.. మానస సరోవర్ మార్గం బంద్ -
చైనాలోకి భారత దళాలు
చైనా ఆరోపణ బీజింగ్: భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ చైనా మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. సైనికులు వెంటనే వెనక్కు వెళ్లాలంది. తాజా ఘర్షణాత్మక వాతావరణానికి చూపే పరిష్కారంపైనే భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్ యాత్రకు అనుమతించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చైనా పేర్కొంది. ప్రస్తుతానికి భద్రతా కారణాల వల్లనే మానస సరోవర్ యాత్రకు వచ్చిన భారతీయులను అనుమతించలేదని చైనా తెలిపింది. ‘మా ప్రాంత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ అంశంలో భారత్ కూడా చైనాతో కలిసి నడుస్తుందనీ, చైనా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయ సైనికులను వెంటనే వెనక్కు పిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. న్యూఢిల్లీలోనూ, బీజింగ్‌లోనూ దౌత్యపరంగా తమ నిరసన, వైఖరిని భారత్‌కు తెలియజేశామని ఆయన వెల్లడించారు. ‘భారత యాత్రికులకు సౌకర్యాలు, భద్రత కల్పించడానికి చైనా ఇప్పటివరకు ఎంతో చేసింది. తాజాగా భారత దళాలు చైనా భూభాగంలోకి ప్రవేశించి, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. అయితే భద్రతా కారణాల వల్లనే ప్రస్తుతం భారతీయ యాత్రికులను చైనా మీదుగా వెళ్లనీయడం లేదు’ అని కాంగ్ అన్నారు. -
సరిహద్దులో భారత్, చైనా సైనికుల కొట్లాట
- సిక్కింలో బరితెగించిన డ్రాగన్.. వీడియో వైరల్ - ఇండియన్ చెక్‌పోస్టు ధ్వంసం.. అక్రమంగా చొరబడే యత్నం - తిప్పికొట్టిన భారత బలగాలు.. ఘటనపై సర్వత్రా ఆగ్రహం గ్యాంగ్‌టక్: సరిహద్దులో డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సిక్కింలోని భూటాన్ సరిహద్దు వద్ద జరిగినట్లు భావిస్తోన్న ఘటనలో చైనీస్ సైన్యం.. భారత బలగాలను రెచ్చగొట్టడం, ప్రతిగా మనవాళ్లు డ్రాగన్లను అవతలికి నెట్టేయడం లాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన భారత యాత్రీకుల బృందాన్ని భూటాన్ సరిహద్దుల్లో అడ్డుకున్న చైనా తీరును భారత్ నిరసించిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సర్దుమణగకముందే డ్రాగన్స్ దూకుడుకు సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది. భారత బలగాలను రెచ్చగొడుతూ, ఉద్దేశపూర్వకంగా సరిహద్దు దాటి ఇవతలికి వచ్చిన చైనీస్ సైనికుల తీరుపై సర్వత్రా ఆగ్రహ్యం వ్యక్తమవుతోంది. సిక్కిం-భూటాన్ సరిహద్దులోని ‘డోకా లా’ ప్రాంతంలో ఈ కొట్లాట జరినట్లు సమాచారం. అయితే ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టతే రాలేదు. కాగా, పదిరోజుల కిందట ఇదే డోకాలా ప్రాంతంలో భారత్ పునర్నిర్మించిన ఓ చెక్‌పోస్టును చైనీస్ ఆర్మీ ధ్వసం చేసినట్లు తెలిసింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా నిరసించినందునే ప్రతీకారంగా చైనా.. భారత యాత్రీకులను అడ్డుకుందనే విమర్శలున్నాయి. కైలాస మానస సరోవర యాత్రీకులను చైనీస్ సైనికులు అడ్డుకున్న ఘటనలో మొదట ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. అటుపై వాతావరణ సమస్యలున్నందువల్లే యాత్రను ఆపేసినట్లు చైనా ప్రకటించింది. ఇక సైనికుల కొట్లాటకు సంబంధించి వైరల్‌గా మారిన వీడియోపై ఇరుదేశాల అధికారారులు స్పందించాల్సిఉంది. సిక్కిం సరిహద్దులోని భూటాన్ నిజానికి స్వతంత్ర దేశం. కానీ దాని స్వతంత్రతను గుర్తించని చైనా.. ఇప్పటికే కీలక భూభాగాలను స్వాధీనం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తోంది.