పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం | Indian Army neutralises Pakistan BAT team infiltration in Keran sector | Sakshi
Sakshi News home page

పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

Published Sun, Aug 4 2019 4:50 AM | Last Updated on Sun, Aug 4 2019 4:50 AM

Indian Army neutralises Pakistan BAT team infiltration in Keran sector - Sakshi

శ్రీనగర్‌: నియంత్రణ రేఖ వెంబడి భారత్‌ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్‌ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు. వీరిలో పాక్‌ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్‌ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు.

కశ్మీర్‌ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్‌నాథ్‌ యాత్రను భగ్నం చేసేందుకు పాక్‌ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్‌ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్‌ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్‌ ఆర్మీకి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు.  

నలుగురు జైషే ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా, షోపియాన్‌ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్‌ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.   గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి.

ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్‌ షాబాజ్‌గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్‌లోని పండూషన్‌ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్‌లో జైషే ఉగ్రవాదులు మంజూర్‌ భట్, జీనత్‌ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్‌ జాతీయుడని, జైషే మహమ్మద్‌ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement