seven dead
-
భవనంలో మంటలు.. ఏడుగురు మృతి
ముంబై: ముంబైలోని ఓ నివాస భవనంలో శుక్రవారం వేకువజామున చెలరేగిన మంటల్లో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో 68 మంది గాయపడ్డారు. గోరెగావ్ వెస్ట్‌లోని ఏడంతస్తుల నివాస భవనంలో తెల్లవారు జామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకుని ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి అగ్ని కీలలు భవనాన్నంతటినీ చుట్టుముట్టాయి. పార్కింగ్ ప్లేస్‌లోని దుకాణాలు, ద్విచక్ర వాహనాలతోపాటు, భారీగా నిల్వ ఉంచిన పాత దుస్తులు తగులబడిపోయాయి. వివిధ అంతస్తులతోపాటు టెర్రస్‌పై చిక్కుకున్న సుమారు 30 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఊపిరాడకనే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 68 మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్‌యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి
అలస్కా: అమెరికాలోని అలస్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు ఢీకొని కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాస్కాకు సమీపంగా కెనాయ్ ద్వీపకల్పంలోని సోల్డోట్నా నగరంలో ఉన్న విమానాశ్రయం వద్ద రెండు విమానాలు ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. అలస్కా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ రిపబ్లిక్ సభ్యుడు గ్యారీ నాప్ ఒక విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. మరో విమానంలో దక్షిణ కెరొలిన నుంచి నలుగురు పర్యాటకులు, కాన్సాస్ నుంచి ఒక పర్యాటక గైడ్, సోల్డోట్నా నుంచి ఒక పైలప్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. రెండు విమానాలు సోల్డోట్నా నగరంలోని విమానాశ్రయం వద్ద ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదానికి గురైన విమానాల్లో ఒకటి హవిలాండ్ డీహెచ్సీ-2గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్(ఎఫ్ఏఏ) గుర్తించింది. అదే విధంగా ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏ, జాతీయా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మృతి చెందిన గ్యారీ నాప్(67) రిపబ్లికన్, స్టేట్ హౌజ్‌లో సభ్యుడుగా కొనసాగుతున్నారు. -
కుప్పకూలిన యుద్ధ విమానం, ఏడుగురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలో యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఈశాన్య అమెరికా రాష్ట్రం కనెక్టికట్‌లోని బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నిన్న (బుధవారం, అక్టోబర్ 2) ఉదయం 9:54 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానంలో టేకాఫ్ అయిన పదినిమిషాలకే సాంకేతి కసమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎమర్జన్సీ ల్యాండింగ్నకు యత్నిస్తున్న సమయంలోనే కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నారని ప్రజారక్షణశాఖ కమిషనర్ జేమ్స్ రోవెల్లా వెల్లడించారు. ఈ విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడ్డాడనీ..విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించిందనీ తెలిపారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటల పాటు మూసివేశారు. According to our pilot a plane crash on the runway in Hartford has closed the airport and has everyone scrambling. pic.twitter.com/khAGbq50z5 — Aaron Katzman (@aaron_katzman) October 2, 2019 -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్‌గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్‌లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్‌లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
‘అనంత’ విషాదం
తనకల్లు/ నల్లచెరువు: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 42వ జాతీయ రహదారి నెత్తురోడింది. మినీ బస్సును లారీఢీకొట్టడంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తనకల్లు– నల్లచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రగుంటపల్లి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 7 గంటలకు 20 మందికి పైగా ప్రయాణికులతో మినీ బస్సు తనకల్లు నుంచి కదిరికి బయలుదేరింది. అయితే ఎర్రగుంటపల్లి చెరువు మలుపు వద్దకు రాగానే అనంతపురం నుంచి మదనపల్లి వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి మినీ బస్సును బలంగా ఢీ కొంది. దీంతో మినీ బస్సు ముందుభాగం నుజ్జనుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ఉన్న తనకల్లుకు చెందిన పండ్ల వ్యాపారి ఖాదర్‌బాషా (43), చిట్‌ఫండ్ ఉద్యోగి నగేష్ (32), భారతమ్మ (44), కాటేపల్లికి చెందిన మహబూబ్‌బాషా (55), ఎన్పీ కుంట మండలం యాదుళోళ్లపల్లి జయమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. మినీ బస్సు– లారీ మధ్యలో చిక్కుకున్న కాటేపల్లి మహబూబ్‌బాషా మృతదేహాన్ని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎన్పీకుంట మండలం యాదుళోళ్లపల్లికి చెందిన రామచంద్రారెడ్డి (58) కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో గుర్తు తెలియని వ్యక్తి (55) తనకల్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 10 మందిలో తనకల్లుకు చెందిన బాబ్జాన్, రాఘవేంద్ర, శ్రీనివాసులు, మస్తాన్‌వలి, రెడ్డిశేఖర్, మహబూబ్‌బాషా, శివ గంగాదేవి, గుంజువారిపల్లి దామోదర్, మించలివారికోట శ్రీనివాసులు, కొక్కంటి క్రాస్‌కు చెందిన తిరుపాల్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కదిరి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, రూరల్ సీఐ రెడ్డెప్ప, ఎస్ఐలు రంగడు, రమేష్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లచెరువు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు తనకల్లు మండలం వాసులు మండల కేంద్రమైన తనకల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో నలుగురు తనకల్లుకు చెందినవారే ఉన్నారు. అలాగే తనకల్లుకే చెందిన మరో 10 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండటంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆడబిడ్డలను చదివించాలని తనకల్లు స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉండే ఖాదర్బాషాకు భార్య అమ్మజాన్తో పాటు నగీనా, హర్షియా సంతానం. ఖాదర్‌బాషా సైకిల్‌పై పండ్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. శుక్రవారం కదిరిలో పండ్లు కొనుగోలు చేసేందుకు మినీ బస్సులో బయల్దేరాడు. అయితే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇంటి పెద్దను కోల్పోయానని, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదని భార్య అమ్మజాన్ కన్నీటి పర్యంతమైంది. -
అమెరికా @ 12" మంచు
షికాగో: భారీ మంచు తుపాను, చలిగాలుల కారణంగా అమెరికాలో ఏడుగురు మృతి చెందగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 500 పైగా విమాన సర్వీసులు రద్దు కాగా 5,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ తీవ్రత రానున్న రోజుల్లో న్యూమెక్సికోతోపాటు దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చలితోపాటు భారీ వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. లూసియానా, కెన్సాస్, నార్త్ డకోటా, టెన్నిస్సీ, మిన్నెసొట్టా ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా 6,500 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 800పైగా సర్వీసులు రద్దయినట్లు వివరించారు. మంచు కారణంగా చాలా చోట్ల రహదారులను కూడా మూసి వేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నకిలీ మద్యం సేవించి ఏడుగురి మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. నకిలీ మద్యం సేవించి బుధవారం నదియా జిల్లాలో ఓ మహిళతో సహా ఏడుగురు వ్యక్తులు మరణించారు. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌధురిపురాలో ఈ ఘటన జరిగింది. నకిలీ మద్యం సేవించడంతోనే వారు మరణించారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతుండగా, మరణాలకు కారణమేంటన్న వివరాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయని నదియా జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటీవల నాటు సారా విక్రయించే చిన్న దుకాణాలు వెలిశాయని, వీటిలో మద్యం సేవించేందుకు ప్రజలు వీటి ముందు గుమికూడుతున్నారని స్ధానికులు తెలిపారు. చౌధురిపురాలో ఓ దుకాణంలో మద్యం సేవించిన కొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని, వారిని ఆస్పత్రికి తరలించగా నలుగురు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని స్ధానికులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారని చెప్పారు. మద్యం దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు పెద్దమొత్తంలో నాటు సారా, నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం
విల్మింగ్టన్: అమెరికా తూర్పుతీరాన్ని తాకిన ఫ్లోరెన్స్ హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. ఫ్లోరెన్స్ కారణంగా ఇప్పటివరకూ అమెరికాలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ట్రెంట్, నూస్ నదులు పొంగిపొర్లుతుండటంతో ఉత్తర కరోలినాలోని న్యూబెర్న్ పట్టణంలో చాలా మంది 10 అడుగుల ఎత్తైన వరదలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. న్యూబెర్న్ నుంచి ఇప్పటివరకూ 400 మందిని రక్షించామనీ, మిగిలినవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కాగా, ఫ్లోరెన్స్ హరికేన్ తీవ్రత ‘ఉష్ణమండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ గంటకు 112 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, కుంభవృష్టి సంభవిస్తుందని జాతీయ హరికేన్ కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. మరోవైపు ఈ విషయమై ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ స్పందిస్తూ.. ‘ఫ్లోరెన్స్ విధ్వంసం మరో 2–3 రోజులు కొనసాగే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 7.6 లక్షల మంది చీకట్లో మగ్గుతుండగా, 21,000 మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఫ్లోరెన్స్ ప్రభావంతో కుంభవృష్టి కురవడంతో పాటు అకస్మాత్తుగా వరదలు పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఫ్లోరెన్స్ దెబ్బకు అతలాకుతలమైన ప్రాంతాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని దాదాపు 17 లక్షల మంది ప్రజలను అధికారులు ఇప్పటికే ఆదేశించారు. ఫ్లోరెన్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అమెరికా విపత్తు నిర్వహణా సంస్థ(ఫెమా)ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఫిలిప్పీన్స్ అతలాకుతలం మనీలా: మంగ్‌ఖుట్ టైఫూన్ ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ 12 మంది దుర్మరణం చెందగా, ఆరుగురు గల్లంతయ్యారు. గంటకు 170 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సహాయక చర్యల కోసం రెండు సీ–130 హెర్క్యులస్ విమానాలతో పాటుæహెలికాప్టర్లను అందు బాటులో ఉంచారు. 50 లక్షల మందిపై టైఫూన్ ప్రభావం చూపుతోంది. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
-
వడదెబ్బకు ఏడుగురి మృతి
ఏటూరునాగారం/గార్ల/లింగంపేట: వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘణపురం గ్రామానికి చెందిన గీకురు సారయ్య (65), మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్దారం తండాకు చెందిన బానోత్ తార (45), కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లికి చెందిన పిట్ల నారాయణ, వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం జక్కలొద్ది గ్రామ సమీపంలో ఓ యాచకుడు(40), నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన కుంచెపు నడిపన్న (47), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి తండాకు చెందిన బానోతు రాములు (35), ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గొల్లగూడెంకు చెందిన కొత్తపల్లి రాఘవులు(45) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. -
వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి రక్తసిక్తం
సాక్షి, జనగామ: వరంగల్–హైదరాబాద్ 163వ జాతీయ రహదారిపై 12 గంటల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో హమాలీ మృతి చెందాడు. అమ్మల దర్శనానికి వెళ్లొస్తూ.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ న్యూ హఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్ బి బ్లాకుకు చెందిన జినిగేష్పురం పరమేశ్ తన భార్య రుక్మిణి(35), తల్లి సత్తమ్మ (60), అన్న కుమార్తె మౌనిక, డ్రైవర్ బ్యాగరి రాజు(23)తో సొంత కారులో వన దేవతలను దర్శించుకోవడం కోసం జనవరి 31వ తేదీన మేడారం వెళ్లారు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు బయలు దేరారు. ఇక సమ్మక్క–సారలమ్మ జాతర కోసం హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన 23 మంది మినీ బస్సులో మేడారం వస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్దకు రాగానే కారు, మినీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న పరమేశ్ భార్య శివమణి, తల్లి సత్తెమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ రాజు అందులోనే ఇరుక్కుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. పోలీసులు బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పరమేశ్, అన్న కుమార్తె మౌనికను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక బోల్తా పడిన మినీ బస్సులోని శ్యామల అరుణ, శ్యామల ప్రమీల, శోభ, కనుకనల శిరీష, శ్యామల వనజ, కనుకనల శోభతో పాటు డ్రైవర్ నరేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. హఫీజ్ పేట్లో విషాద ఛాయలు చందానగర్: మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా జనగాం వద్ద కారు – వ్యాన్ ఢీకొన్న ఘనటలో హఫీజ్ పేట్ బి బ్లాక్‌కు చెందిన ముగ్గురు చనిపోయారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిలో ఒకే ఇంటికి చెందిన అత్తాకోడల్లు ఉన్నారు. సత్యమ్మ, ఆమె కోడలు శివరాణిలతో పాటు డ్రైవర్ రాజు ఉన్నారు. ప్రమాదంలో సత్యమ్మ కుమారుడు పరమేశ్వర్ తీవ్ర గాయాలు పాలై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ సత్యమ్మ మనుమరాలికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. నిడిగొండ వద్ద ముగ్గురు.. వెంకటాయపాలెం వద్ద ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇదే జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. సాయంత్రం 4 గంటల సమయంలో కారు, పాల కంటైనర్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అడ్వొకేట్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ లెక్చరర్ వెలివెళ్లి సుబ్బారావు(69), తన భార్య దుర్గాదేవి(63) హైదరాబాద్‌లో ఉన్న కుమారుడిని చూడటం కోసం కారులో కాజీపేటకు చెందిన ఇండికా కారు డ్రైవర్ హబీద్(44)తో కలిసి వెళుతున్నారు. ఈక్రమంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి జనగామ నుంచి వరంగల్ వైపు వస్తున్న పాల కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు, దుర్గాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి.. జిల్లాలోని లింగాల ఘనపురం మం డలం నెల్లుట్ల వద్ద గుర్తు తెలియని వాహ నం ఢీకొట్టి హమాలీ దుర్మరణం పాల య్యాడు. కుందారం గ్రామానికి చెందిన వల్లాల నాగరాజు(35) జనగామ జిల్లా కేంద్రంలో హమాలీగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై కుందారం వెళుతున్నాడు. ఈ క్రమంలో నెల్లుట్ల సమీపంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందారు. -
కాబూల్‌లో పేలుడు..ఏడుగురి మృతి
ఆఫ్ఘనిస్తాన్ : కాబూల్ నగరంలోని సర్-ఇ- కారెజ్ మార్కెట్లో శుక్రవారం మధ్యాహ్నాం జరిగిన పేలుడులో ఏడుగురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. ఎవరిని లక్ష్యంగా దాడి చేశారో ఇంత వరకూ తెలియరాలేదు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఘటనలో మూడు వాహనాలు, చాలా దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. గత నెల నవంబర్ 16న భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఎనిమిది పోలీసులతో కలిపి 15 మంది చనిపోయారు. -
కూలిందా..? పేలిందా..?
♦ తిప్పాపూర్ మృతులంతా స్థానికేతరులే ♦ ఏడు ప్రాణాలు పోయినా ఏడుపే లేదు ♦ సొరంగంలో చిక్కి ముక్కలైన శరీరాలు ♦ అంతా గోప్యం.. రక్షణ శూన్యం ♦ సబ్ కాంట్రాక్టుల చేతిలో పనులు ♦ నీటిపారుదల శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం సిరిసిల్ల/ఇల్లంతకుంట : బతుకుదెరువు వెతుక్కుంటూ పొట్టచేత పట్టుకుని వచ్చిన కూలీ బతుకుకూలిపోయింది. ఏడు నిండు ప్రాణాలు పోయినా.. ఏడ్చేందుకు ఒక్కరైనా లేని దయనీయం. మృతులంతా 35 ఏళ్లలోపు యువకులే. నా అనేవారే లేని గుట్టల మధ్య కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రాణాలను ఎత్తిపోశారు. శవాలను బట్టల్లో చుట్టి అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. అయినవారు ఎవరూ లేక ఏడ్చేవారు లేకపోవడం బాధాకరం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద సాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో బుధవారం ఏడుగురు కూలీలు బలయ్యారు. ఒక్కసారిగా కూలిన బండరాళ్లతో కూలీల శరీర భాగాలు ముక్కలయ్యాయి. ఏం జరిగిందో ఊహించేలోపే ఏడు ప్రాణాలు గాలిలో కలిసిన ఘటన విషాదాన్ని నింపింది. సొరంగం మృత్యుకుహరం.. మధ్యమానేరు జలాశయం నుంచి మల్లన్నసాగర్‌కు సాగునీటిని పంపింగ్ చేసే సొరంగం పనులు మృత్యుకుహారంగా మారింది. బుధవారం ఎప్పటిలాగే పనుల్లోకి వెళ్లిన 27 మందిలో భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన ఎలక్ట్రిషియన్ సందీప్(25), జార్ఖండ్‌కు చెందిన గౌట్మా(24), హకీం(26), బీహార్‌కు చెందిన పురమ్సింగ్(32), జిలిటెన్స్ బ్లాస్టర్ జితేందర్(25), ఒడిశాకు చెందిన సూపర్వైజర్ హరి(35), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హరిరామ్ (35) మృతిచెందారు. బీహార్‌కు చెందిన గోధన్ (30) చికిత్స పొందుతున్నాడు. సొరంగంలో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. సొరంగంలో పనులు ముగింపుదశకు చేరాయని, బుధవారం గడిస్తే.. మళ్లీ యంత్రాలతోనే పనులు చేసేది ఉందని నీటిపారుదలశాఖ ఈఈ ఆనంద్ తెలిపారు. నీటి పంపింగ్ మోటార్లు బిగింపు పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. సొరంగమార్గం భూఉపరితలం నుంచి 150 మీటర్ల లోతులో.. మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు కిలోమీటర్ల జంక్షన్ వద్దనే ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సొరంగం చీకటితో నిండి మసక మసక వెలుతురు ఉంది. ఉబికివచ్చే నీటి ఊటలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సొరంగంలో పనిచేసిన కూలీలు వివరించారు. ఆక్సిజన్ లభించక ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకమున్నాయని తెలిపారు. దినదినగండంగా.. నిత్యప్రమాదాల మధ్య పనిచేసినట్లు కూలీలు తెలిపారు. అనూహ్యంగా ఏడుగురు బలి కావడంతో ఆ సొరంగాన్ని చూస్తేనే భయమేస్తోందని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుడు ఒకరు చెప్పారు. మృతులంతా యువకులే.. సొరంగంలో మరణించిన వారంతా 35 ఏళ్లలోపు యువకులు కావడం మరో విషాదం. ఇందులో చాలామందికి పెళ్లికూడా కాలేదు. జార్ఖండ్‌కు చెందిన గౌట్మా(24) మూడు నెలల కిందట తిప్పాపూర్ సైట్‌కు పనికి వచ్చాడని అతని సోదరుడు దేవినీస్ తెలిపారు. డ్రిల్లింగ్ పనిచేసే గౌట్మాకు ఇంకా పెళ్లికాలేదు. ఇలా ఏడుగురు మృతుల్లో చాలామందికి వివాహం కాలేదు. కుటుంబపోషణ కోసం వచ్చి బలికావడం బాధాకరం. తిప్పాపూర్ సొరంగం పనులు చేసే కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పనిని బట్టి కాంట్రాక్టర్ చెల్లిస్తారని సమాచారం. ప్రమాదకరమైన పని కావడంతో స్థానికులు ఎవరూ ఈ పని చేయరనే భావంతో కాంట్రాక్టర్లు పొరుగు రాష్ట్రాల కూలీలను తెచ్చారు. కనీస మౌలిక వసతులు లేకున్నా..రేకుల శిబిరంలో తలదాచుకుంటూ.. అక్కడే తింటూ.. అక్కడే పనిచేస్తూ.. కాలం వెల్లదీయడం కూలీల పని. ఈ క్రమంలో విధి ఇలా కాటేయడంతో విగతజీవులగా వారివారి స్వస్థలాలకు చేరుకోవాల్సి రావడం విషాదం. సబ్ కాంట్రాక్టర్ చేతిలో పనులు.. కాళేశ్వరం ప్యాకేజీ–10ను హెచ్‌సీసీ అనే సంస్థ కాంట్రాక్టు పొందగా.. ప్రతిమ ఇన్ఫ్రా అనే సబ్ కాంట్రాక్టు సంస్థ పనులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సబ్ కాంట్రాక్టు సంస్థ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. సంఘటన సమాచారాన్ని ఎందుకు సకాలంలో అందించలేదని కలెక్టర్ కృష్ణభాస్కర్ నీటిపారుదలశాఖ ఈఈ ఆనంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు డీఐజీ రవివర్మ, ఎస్పీ విశ్వజిత్ సొరంగంలోకి వెళ్లి వచ్చారు. గుట్టల వద్ద ఏడుగురు మరణించారని తెలియడంతో తిప్పాపూర్ వాసులు సొరంగం వద్దకు తరలివచ్చారు. ఘటనా స్థలానికి సిరిసిల్ల ఆర్డీవో ఎన్.పాండురంగ, తహసీల్దార్ శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ గుడిసె అయిలయ్య, ‘సెస్’ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, ప్రవీణ్, వెంకటకృష్ణ, నరేశ్‌కుమార్, సురేందర్‌రెడ్డి వచ్చారు. సాయుధ పోలీసుల పికెటింగ్ ఘటనా స్థలంలో సాయుధ పోలీసుల పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్గార్డ్స్ పోలీసులతో పాటు ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన సాయుధ పోలీసులను రక్షణగా ఉంచారు. శవాలను షిఫ్ట్ చేసిన అనంతరం సొరంగంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు. స్థానికులు చూసేందుకు వచ్చినా వారిని అక్కడి నుంచి పంపించారు. అంతా గోప్యం.. రక్షణ శూన్యం.. సొరంగం తవ్వే క్రమంలో సింగరేణి తరహాలో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం (ఎన్ఐఆర్ఎం) పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉంది. కానీ రక్షణ చర్యలు తీసుకోకుండా సొరంగం తవ్వకాలు సాగించడంతో ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. సొరంగం తవ్వేందుకు మిషన్ బూమర్ ఉండగా.. బండలను పేల్చేందుకు జిలిటెన్లు వినియోగిస్తారు. జిలిటెన్ పేలినప్పుడు భారీ శబ్దం రావడంతో భూమి కంపించి పైకప్పు కూలిందా..? లేక రాతిపొరల్లోకి గాలి చేరడంతో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన తరువాత పోలీసు అధికారులు చేరుకుని శవాలను బట్టల్లో చుట్టి తరలించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను ఎవరినీ సొరంగంలోకి అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాద ఘటనపై అంతా గోప్యంగానే ఉంచారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రమాదం జరిగిందని చెబుతున్న అధికారులు.. సాయంత్రంవరకూ ఎందుకు బయటపెట్టలేదో అంతుచిక్కడం లేదు. రెవెన్యూ అధికారులకు సైతం సాయంత్రంవరకూ సమాచారం లేకపోవడం గమనార్హం. కలెక్టర్ కృష్ణభాస్కర్ సిరిసిల్ల నుంచి బయల్దేరగా.. దారి తప్పిపోయి అరగంట ఆలస్యంగా తిప్పాపూర్ సొరంగం వద్దకు చేరారు. మొత్తంగా ఏడుగురిని బలి తీసుకున్న ఘటనపై పొంతన లేని కథనాలు పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులు వీరే.. ప్రమాదంలో మృతిచెందినవారిలో జార్ఖండ్ రాష్ట్రం తూర్పుసింగ్భమ్ జిల్లా జందా గ్రామానికి చెందిన హికిమ్ హండ్సా (26), సిందేగా జిల్లా రాంజోల్ గ్రామానికి చెందిన గాట్మాటోప్నో, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బగ్‌బన్‌పూర్‌కు చెందిన రామకష్ణన్ సాహు(35), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా సౌత్పూర్కు చెందిన హరిచంద్ నేతన్(35), పశ్చిమ్‌బంగ రాష్ట్రం బురద్ద్వాన్ జిల్లాకు చెందిన జితేందర్‌కుమార్(25), జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన యాసం సందీప్ (25), జార్ఖండ్ రాష్ట్రం రాంగడ్ జిల్లా బర్ఖాంగ గ్రామానికి చెందిన పూరన్‌సింగ్(40) ఉన్నారు. జార్ఖండ్ జిల్లా ముస్బాని గ్రామానికి చెందిన బుడాన్ సోరెన్ (38)కు కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. -
సౌదీని ముంచెత్తిన వరదలు
-
మంటల్లో హోటల్.. ఏడుగురు మృతి!
-
మంటల్లో హోటల్.. ఏడుగురు మృతి!
గోండియా: మహారాష్ట్రలోని గోండియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. కిచెన్‌లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పలువురు హోటల్లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలానికి చెరుకున్న అగ్ని మాపక సిబ్బంది 15 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన హోటల్ నుంచి ఓ వ్యక్తి నిచ్చెన సహాయంతో మరో బిల్డింగ్ మీదకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. #WATCH: Man escapes from a hotel building which caught fire in Maharashtra's Gondia. 6 people had died. pic.twitter.com/08fPe6DOmg — ANI (@ANI_news) December 21, 2016 -
శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి
-
శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి
చెన్నై: కొద్ది గంటలపాటు చెన్నై మహానగరంతో పాటు ఉత్తర తమిళనాడును అతలాకుతలం చేసిన వర్దా తుపాను చెన్నై నగరాన్ని దాటేసింది. దీంతో ప్రచండ గాలుల వేగం కూడా తగ్గుముఖం పడుతోంది. సోమవారం మధ్యాహ్నం తీరం దాటే ముందు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రస్తుతం 15-25 కిలోమీటర్ల వేగానికి తగ్గాయి. తుపాను చెన్నైను దాటి వెళ్లిపోయినట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురంలలో వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వర్దా ధాటికి నగరంలో ఏడుగురు చనిపోయినట్లు సమాచారం. వీరిలో 3 సంవత్సరాల బాలుడితో పాటు నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. వర్దా తుపాను చెన్నై వాసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో భారీగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ప్రధానరహదారుల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు చెట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొట్టివక్కం, పలవక్కం, ఫోర్ షోర్ ఎస్టేట్, రోయపురంలలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా గోడలు కూలిపోయిన సంఘటనలు జరిగినట్లు రిపోర్టులు కూడా అందాయి. దీంతో చెన్నై మొత్తం అంధకారంలోనే మగ్గుతోంది. కరెంటు వ్యవస్ధను పునరుద్ధరించేందుకు ఒక రోజు పడుతుందని టీఎన్ఈబీ అధికారులు చెప్పారు. బీసెంట్ నగర్, కేకే నగర్, ఖదేర్ నవాజ్ ఖాన్ రోడ్, అడమ్ బక్కం, మెరినాల్లో వీచిన భారీ గాలులకు సెల్ టవర్లు కుప్పకూలాయి. -
దేవుడా..!
► కారు, లారీ ఢీ ►ఏడుగురి మృతి ►మృతుల్లో నవ వధువు ►ముగ్గురికి తీవ్ర గాయాలు ►కన్నీరుమున్నీరైన బంధువులు పెళ్లి పందిరి వాడనే లేదు. కాళ్లపారాణి ఆరనే లేదు. అంతలోనే విధి ఆ జంటను విడదీసింది. నవ వధువును ప్రమాదరూపంలో పొట్టన పెట్టుకుంది. మరో ఆరుగురిని కానరానిలోకాలకు పంపేసింది. తీవ్ర గాయాలతో వరుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన శుక్రవారం తిరువణ్ణామలై కొత్త బైపాస్ రోడ్డు యేందల్ ఎడపాళ్యం గ్రామం రింగ్‌రోడ్డు వద్ద చోటు చేసుకుంది. –తిరువణ్ణామలై తిరువణ్ణామలై: కారును, లారీ ఢీకొన్న ప్రమాదంలో నవవధువు సహా ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువణ్ణామలై సమీపంలో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా ఉలుందూ రు పేటకు తాలుకా పూమలైనూర్ గ్రామానికి చెందిన వాసుదేవన్(30) తిరుకోవలూర్ ఆర్టీవో కార్యాలయం లో ఉద్యోగి. ఇతనికి శశికళ(27)తో ఈనెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ దంపతులు గురువారం రాత్రి బంధువులతో కలిసి కారులో తిరుమలకు బయలుదేరారు. కారు తిరువణ్ణామలై కొత్త బైపాస్ రోడ్డు యేంద ల్ ఎడపాళ్యం గ్రామం వద్ద వస్తుండగా తిరుకోవలూరు రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం వేకువజామున ఒంటి గంటకు హŸసూరు నుంచి పుదుచ్చేరికి లోడుతో వెళుతున్న లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న నవ వధువు శశికళ, అళగిరి గ్రా మానికి చెందిన ఏలుమలై(39), భార్య సెల్వ కుమారి(37), కుమార్తె దర్శన(8), ఏమం గ్రామానికి చెందిన సేట్టు(60) భార్య కొలంజి(57), కారు డ్రైవర్ విజయకుమార్(20) ఏడుగురు సంఘటన స్థలంలో మృతి చెందారు. నవ వరుడు వాసుదేవన్, ఏమం గ్రామానికి చెందిన వీరన్, మృతి చెందిన ఏలుమలై కుమారుడు హాసన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సహ వాహన దారులు వెంటనే తిరువణ్ణామలై పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని అక్కడికి చేరుకుని తీవ్ర గా యాలైన ముగ్గురిని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రశాంత్ ము వడనేరే, వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిం చారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పోలీసులు లారీ డ్రైవర్ ఏలుమలైని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
విమానాలు ఢీ : ఏడుగురు మృతి
బ్రటిస్లావా : స్లోవేకియాలో ఎయిర్ షో కోసం గురువారం ప్రాక్టీసు చేస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు విమానంలోని పలువురు ప్రయాణీకులు ప్యారాచుట్ల ద్వారా కిందకి దూకేశారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ రెండు విమానాల్లో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపింది. విమాన శిథిలాలు చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని పర్వత ప్రాంతంలో పడి ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం మూడు హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టిందని వివరించింది. ఎయిర్ షో నిర్వహించిన ల్లవ్వా పట్టణం రాజధాని బ్రటిస్లావాకు 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. -
మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాలని, మృతదేహాలను తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగానికి కేసీఆర్ తెలిపారు. జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన ఇన్నోవా, మహారాష్ట్రకు చెందిన టవేరా వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగంగా ఢీకొనటంతో వాహనాలు నుజునుజ్జు అయ్యాయి. ప్రమాదంలో కేరళకు చెందిన ఒక మహిళ, మహారాష్ట్ర వాసుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, కార్లలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మహారాష్ట్ర వాసులు తిరుపతి నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.