
ప్రతీకాత్మకచిత్రం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. నకిలీ మద్యం సేవించి బుధవారం నదియా జిల్లాలో ఓ మహిళతో సహా ఏడుగురు వ్యక్తులు మరణించారు. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌధురిపురాలో ఈ ఘటన జరిగింది. నకిలీ మద్యం సేవించడంతోనే వారు మరణించారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతుండగా, మరణాలకు కారణమేంటన్న వివరాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయని నదియా జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటీవల నాటు సారా విక్రయించే చిన్న దుకాణాలు వెలిశాయని, వీటిలో మద్యం సేవించేందుకు ప్రజలు వీటి ముందు గుమికూడుతున్నారని స్ధానికులు తెలిపారు. చౌధురిపురాలో ఓ దుకాణంలో మద్యం సేవించిన కొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని, వారిని ఆస్పత్రికి తరలించగా నలుగురు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని స్ధానికులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారని చెప్పారు. మద్యం దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు పెద్దమొత్తంలో నాటు సారా, నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment