
వెంకటాయపాలెం వద్ద ప్రమాదానికి గురైన కారు
సాక్షి, జనగామ: వరంగల్–హైదరాబాద్ 163వ జాతీయ రహదారిపై 12 గంటల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో హమాలీ మృతి చెందాడు.
అమ్మల దర్శనానికి వెళ్లొస్తూ..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ న్యూ హఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్ బి బ్లాకుకు చెందిన జినిగేష్‌పురం పరమేశ్ తన భార్య రుక్మిణి(35), తల్లి సత్తమ్మ (60), అన్న కుమార్తె మౌనిక, డ్రైవర్ బ్యాగరి రాజు(23)తో సొంత కారులో వన దేవతలను దర్శించుకోవడం కోసం జనవరి 31వ తేదీన మేడారం వెళ్లారు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు బయలు దేరారు. ఇక సమ్మక్క–సారలమ్మ జాతర కోసం హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన 23 మంది మినీ బస్సులో మేడారం వస్తున్నారు.
ఈ క్రమంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్దకు రాగానే కారు, మినీ బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న పరమేశ్ భార్య శివమణి, తల్లి సత్తెమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ రాజు అందులోనే ఇరుక్కుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. పోలీసులు బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పరమేశ్, అన్న కుమార్తె మౌనికను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక బోల్తా పడిన మినీ బస్సులోని శ్యామల అరుణ, శ్యామల ప్రమీల, శోభ, కనుకనల శిరీష, శ్యామల వనజ, కనుకనల శోభతో పాటు డ్రైవర్ నరేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
హఫీజ్ పేట్‌లో విషాద ఛాయలు
చందానగర్: మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా జనగాం వద్ద కారు – వ్యాన్ ఢీకొన్న ఘనటలో హఫీజ్ పేట్ బి బ్లాక్‌కు చెందిన ముగ్గురు చనిపోయారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిలో ఒకే ఇంటికి చెందిన అత్తాకోడల్లు ఉన్నారు. సత్యమ్మ, ఆమె కోడలు శివరాణిలతో పాటు డ్రైవర్ రాజు ఉన్నారు. ప్రమాదంలో సత్యమ్మ కుమారుడు పరమేశ్వర్ తీవ్ర గాయాలు పాలై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ సత్యమ్మ మనుమరాలికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
నిడిగొండ వద్ద ముగ్గురు..
వెంకటాయపాలెం వద్ద ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇదే జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. సాయంత్రం 4 గంటల సమయంలో కారు, పాల కంటైనర్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అడ్వొకేట్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ లెక్చరర్ వెలివెళ్లి సుబ్బారావు(69), తన భార్య దుర్గాదేవి(63) హైదరాబాద్‌లో ఉన్న కుమారుడిని చూడటం కోసం కారులో కాజీపేటకు చెందిన ఇండికా కారు డ్రైవర్ హబీద్(44)తో కలిసి వెళుతున్నారు. ఈక్రమంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి జనగామ నుంచి వరంగల్ వైపు వస్తున్న పాల కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు, దుర్గాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి..
జిల్లాలోని లింగాల ఘనపురం మం డలం నెల్లుట్ల వద్ద గుర్తు తెలియని వాహ నం ఢీకొట్టి హమాలీ దుర్మరణం పాల య్యాడు. కుందారం గ్రామానికి చెందిన వల్లాల నాగరాజు(35) జనగామ జిల్లా కేంద్రంలో హమాలీగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై కుందారం వెళుతున్నాడు. ఈ క్రమంలో నెల్లుట్ల సమీపంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందారు.