మట్టి పనికిపోతే.. బస్సు మృత్యువై వచ్చింది | TSRTC Bus Hits Daily Labourers Four People Passed Away Injures Many In Yadadri | Sakshi
Sakshi News home page

మట్టి పనికిపోతే.. బస్సు మృత్యువై వచ్చింది

Published Mon, Mar 7 2022 2:56 AM | Last Updated on Mon, Mar 7 2022 2:56 AM

TSRTC Bus Hits Daily Labourers Four People Passed Away Injures Many In Yadadri - Sakshi

అంకర్ల కవిత, ఊరెల్ల శ్యాం, ఊరెల్ల లావణ్య, అంకర్ల వరలక్ష్మీ

సాక్షి, యాదాద్రి: వారంతా కూలీలు.. జాతీయ రహదారి మధ్యలోని మీడియన్‌పై మట్టిపని చేస్తు న్నారు.. వాహనాలకు సూచికగా రోడ్డుపై బారికేడ్లు పెట్టారు.. ఓ మహిళాకూలీ హెచ్చరికగా ఎర్రజెండా పట్టుకుని కూడా నిలబడింది.. అంతా మరో గంట లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరే వారే. అంతలోనే వారిని ఆర్టీసీ డీలక్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కూలీపనికని వచ్చి.. 
ఆలేరు వద్ద జాతీయ రహదారిపై మీడియన్‌లో మొక్కలు నాటేందుకు వీలుగా మట్టిని తొలగించే పని ఇటీవల ప్రారంభమైంది. ఆదివారం ఉదయం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన ఎనిమిది మంది కూలీలు అదే ప్రాంతానికి చెందిన ఊరెళ్లి శ్యామ్‌ ఆటోలో పనికి వచ్చారు. శ్యామ్‌ భార్య లావణ్య కూడా కూలిపనికి వచ్చింది. సాయంత్రం వీరందరినీ తిరిగి రాయగిరికి తీసుకెళ్లేందుకు శ్యామ్‌ అక్కడికి వచ్చాడు. సుమారు 4 గంటల సమయంలో వరంగల్‌ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఆర్టీసీ డీలక్స్‌ బస్సు (ఏపీ 36 జెడ్‌ 0275) కూలీలపైకి దూసుకొచ్చింది.  

ఎర్ర జెండా హెచ్చరికను దాటి.. 
రోడ్డు పక్కన పని జరిగే ప్రాంతంలో ఎర్రజెండా ఊపుతూ నిలబడిన అంకర్ల లక్ష్మిని తొలుత బస్సు ఢీకొట్టింది. తర్వాత  కవిత, లావణ్య, శ్యామ్‌లపైకి దూసుకెళ్లింది. లక్ష్మి (37) అక్కడికక్కడే చనిపోగా.. కవిత, లావణ్య తీవ్రగాయాలతో ఎగిరిపడ్డారు. శ్యామ్‌(32) బస్సు కింద ఇరుక్కోగా 200 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందా డు.  లావణ్య(27), కవిత(32) ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. 


ఘటనాస్థలంలో రోదిస్తున్న మృతుల బంధువులు   

ట్రాక్టర్‌ను, జేసీబీని ఢీకొని.. 
మితిమీరిన వేగంతో కూలీలపై నుంచి దూసుకుపోయిన బస్సు.. రోడ్డుపక్క మట్టి నింపుకొంటున్న ట్రాక్టర్‌ను, దాని తర్వాత ఉన్న జేసీబీని ఢీకొట్టి ఆగిపోయింది. ఆ ధాటికి ట్రాక్టర్‌ తిరగబడింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నా రు. వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, చనిపోయిన కూలీలకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువులు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పోలీసులు సైమన్‌పై కేసు నమోదు చేశారు.

దంపతులు.. తోడి కోడళ్లు.. 
రోడ్డుప్రమాదంలో మృతిచెందిన నలుగురిలో ఆటోడ్రైవర్‌ ఊరెళ్లి శ్యామ్, లావణ్య దంపతులు. మరో ఇద్దరు అంకర్ల లక్ష్మి, అంకర్ల కవిత ఇద్దరూ తోడి కోడళ్లు. 3 కుటుంబాల్లోనూ చిన్న పిల్లలున్నారు.  దంపతులైన లావణ్య, ఊరెళ్ల శ్యాం మృతిచెందడం తో వీరిద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. వీరికి సొంత ఇళ్లు లేదు. పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు.  

మంత్రి దిగ్భ్రాంతి.. ఎమ్మెల్యేల పరామర్శ 
ప్రమాద ఘటనపై రవాణామంత్రి పువ్వాడ అజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదే శించారు. బాధితులను ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే లు సునీతామహేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పరామర్శించారు. 

బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది  
వరంగల్‌ వైపు నుంచి బస్సు వేగంగా వచ్చి నలుగురిని ఢీకొట్టింది. నేను ట్రాక్టర్‌ నడుపుతున్నా. బ స్సు ముందు ఎర్రజెండా చూపుతున్న మహిళను.. ఆపై మరో ఇద్దరిని ఢీకొట్టింది. అదే వేగంతో శ్యాంను ఢీకొట్టింది. 15 రోజులుగా ఎర్రజెండా పాతి పని చేస్తున్నాం. కానీ, ఈ రోజిలా జరిగింది. 

–స్వామి, ట్రాక్టర్‌ డ్రైవర్‌ ప్రత్యక్ష సాక్షి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement