Border Action Team
-
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..
న్యూఢిల్లీ/శ్రీశ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) దాడికి చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పి కొట్టాయి. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఒక పాకిస్తానీ యుడు హతం కాగా, మరో ఇద్దరు పీఓకేలోకి పరారయ్యారు. ఈ ఘటనలో ఒక జవాను నేలకొరగ్గా ఆర్మీ కెప్టెన్ సహా నలుగురు గాయపడ్డారు. శనివారం ఉదయం ప్రతికూల వాతావరణాన్ని అనువుగా మలుచుకుని బ్యాట్ సభ్యులు కుప్వారా జిల్లాలోని కామకారి సెక్టార్లో ఎల్వోసీని దాడి భారత భూభాగంలోకి ప్రవేశించారు. ట్రెహ్గామ్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ బలగా లు దీటుగా స్పందించాయి. రెండు పక్షాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. బ్యాట్‌లోని ఒక పాకిస్తానీ హతం కాగా, మరో ఇద్దరు పీవోకేలోకి పలాయనం చిత్తగించారు. ఆర్మీ కెప్టెన్ సహా తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే శ్రీనగర్‌లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. రైఫిల్ మ్యాన్ మోహిత్ రాథోడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్యాట్‌లో సాధారణంగా సుశిక్షితులైన పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌తోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు. అమానవీయ చర్యల కు పాల్పడుతూ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతతకు భంగం కలిగించడమే వీరి పని. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటనలు పెరిగిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.మోదీ కొత్త ప్రభుత్వంలో 14 ఉగ్రదాడులు: ప్రియాంకజమ్మూకశ్మీర్లో ఉగ్రమూకల దాడులు పెరిగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పో వడం, మరో నలుగురు గాయపడటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక 49 రోజుల్లో కశ్మీర్లో జరిగిన 14 ఉగ్రదాడుల్లో 15 సైనికులు అమరుల య్యా రన్నారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. -
సరిహద్దుల్లో పాక్ పాశవికం
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) పాశవిక చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికులకు నిత్యావసరాలను అందించే పోర్టర్లే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం విచక్షణారహితంగా మోర్టార్లు ప్రయోగించింది. దీంతో గుల్పూర్ సెక్టార్‌లోని కస్సాలియాన్ గ్రామానికి చెందిన పోర్టర్లు మొహమ్మద్ అస్లాం, అల్తాఫ్ హుస్సేన్(23) చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో అస్లాం(28) శరీరాన్ని ఛిద్రం చేసిన బీఏటీ అతని తలను వెంట తీసుకెళ్లిందని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశామని, వారి అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన పోర్టర్లు సలీం, షౌకత్, అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. సైనికుడనే వాడెవడూ ఇలాంటి హేయమైన చర్యలకు దిగడనీ, వీటికి సరైన సమయంలో సైనికరీతిలో స్పందిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పేర్కొన్నారు. సామాన్యులను పాక్ సైన్యం పొట్టనబెట్టుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాగా, సరిహద్దుల వెంట చొరబాటు, ఉగ్ర చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా ఏర్పాటైన బీఏటీలో పాక్ సైనికులతోపాటు ఉగ్రవాదులు కూడా సభ్యులుగా ఉంటారు. -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్‌గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్‌లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్‌లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
భారత్‌లోకి చొరబడి కాల్పులు
సరిహద్దులో పాకిస్తాన్ కిరాతకం ► ఇద్దరు జవాన్ల మృతి ► ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీల హతం జమ్మూ: పాకిస్తాన్ ఆర్మీ గురువారం మరోసారి సరిహద్దులో రెచ్చిపోయింది. ఏకంగా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని దాటి వచ్చి భారత జవాన్లపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఎల్ఓసీని దాటి 600 మీటర్లు భారత భూభాగంలోకి చొరబడిన బీఏటీ (బోర్డర్ యాక్షన్ టీమ్) దళాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి. బీఏటీకి మద్దతుగా పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బీఏటీ సభ్యులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, ఉగ్రవాదులను కలగలిపి భారత జవాన్లపై దాడులు చేయడానికి ఏర్పరచిన బృందమే బీఏటీ. గురువారం దాడి చేసిన బీఏటీలో ఐదు నుంచి ఏడు మంది సభ్యులు ఉన్నారనీ, భారత శిబిరాలకు దాదాపు 200 మీటర్ల దూరం వరకు వారు వచ్చారని ఓ ఆర్మీ అధికారి చెప్పారు. భారత జవాన్లు ప్రతికాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. మిగిలినవారు తప్పించుకుని వెనక్కు వెళ్లిపోయారు. భారత గస్తీ బృందాలపై దాడులు చేయడానికే వారు సరిహద్దును దాటి వచ్చారని అధికారి చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. కాగా, చనిపోయిన ఇద్దరు జవాన్లు మహారాష్ట్రకు చెందిన వారే. ఒకరు ఔరంగాబాద్‌కు చెందిన నాయక్ జాదవ్ సందీప్ (34) కాగా, మరొకరు కొల్హాపూర్‌కు చెందిన సిపాయి మనే సావన్ బల్కు (24). జాదవ్‌కు భార్య ఉండగా, సావన్ అవివాహితుడు. ఈ ఏడాది పూంచ్‌లో బీఏటీ దాడి చేయడం ఇది మూడోసారి. మే 1న పూంచ్‌లోని కృష్ణ ఘాటీలో బీఏటీ ఇద్దరు జవాన్ల తలలు నరికింది. ఫిబ్రవరి 18న ఓసారి బీఏటీ దాడి చేసింది. గతంలోనూ బీఏటీ పలు దాడులు చేసి జవాన్ల తలలు నరకడం, వారి శరీరాలను ముక్కలు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది.