ఏకం చేసిన ఘనత పటేల్‌దే | United India Result Of Patel's Strategic Wisdom | Sakshi
Sakshi News home page

ఏకం చేసిన ఘనత పటేల్‌దే

Oct 29 2018 2:19 AM | Updated on Oct 29 2018 4:39 AM

United India Result Of Patel's Strategic Wisdom - Sakshi

న్యూఢిల్లీ: దేశవిభజన తర్వాత వందలాది స్వతంత్ర రాజ్యాలుగా మిగిలిపోయిన భారత్‌ను ఏకం చేసిన ఘనత సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రిగా ఉన్న పటేల్‌ సరైన సమయంలో ప్రతిస్పందించడంతో జమ్మూకశ్మీర్‌ను విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్టోబర్‌ మాసాంతపు ’మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసంగించిన మోదీ.. ఈ నెల 31 సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ మారథాన్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు మనం భారత్‌ను ఒక దేశంగా చూస్తున్నామంటే సర్దార్‌ పటేల్‌ తెలివితేటలు, వ్యూహాత్మక నిర్ణయాలే కారణం. అక్టోబర్‌ 31న çపటేల్‌ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడమే ఆయనకు మనం ఇవ్వబోయే నిజమైన నివాళి. గుజరాత్‌లో నర్మదా నదీతీరాన నిర్మించిన సర్దార్‌ పటేల్‌ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనది. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎత్తయిన రెండో విగ్రహంగా ఉన్న న్యూయార్క్‌లోని ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’కి రెండింతల ఎత్తులో పటేల్‌ విగ్రహం ఉండనుంది. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అక్టోబర్‌ 31నే. ఈ సందర్భంగా ఇందిరాజీకి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ తెలిపారు.

అభివృద్ధితోనే నిజమైన శాంతి..
‘యుద్ధం లేకపోవడం నిజమైన శాంతి కాదు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తులకు అందడమే నిజమైన శాంతికి సూచిక. ప్రపంచశాంతి గురించి ఎక్కడైనా ప్రస్తావించాల్సి వస్తే అందులో భారత్‌ పాత్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధంలో మనకు ఎలాటి సంబంధం లేకపోయినా భారతీయ సైనికులు కదనరంగంలో దూకారు. ఈ యుద్ధంలో కోటి మంది సైనికులతో పాటు మరో కోటి మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రపంచానికి శాంతి ప్రాముఖ్యత అర్థమయింది. గత వందేళ్లలో శాంతి అన్న పదానికి నిర్వచనమే మారిపోయింది. ఇప్పుడు శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఇందుకోసం ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం తదితర సమస్యల పరిష్కారినికి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. క్రీడారంగంలో రాణించాలంటే స్పిరిట్‌ (స్ఫూర్తి), స్ట్రెంత్‌ (శక్తి), స్కిల్‌ (నైపుణ్యం), స్టామినా (సామర్థ్యం) ఉండటం కీలకమన్నారు.

సైనిక చర్యలో ఆలస్యం ఉండొద్దన్న సర్దార్‌
‘కశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాక్‌ బలగాలను తరిమికొట్టేందుకు భారత సైన్యాన్ని పంపడంలో జరుగుతున్న జాప్యంపై సర్దార్‌ పటేల్‌ అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత సైనిక చర్యలో ఎలాంటి ఆలస్యం ఉండరాదని అప్పటి ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షాకు పటేల్‌ సూచించారు. ఆతర్వాత వెంటనే రంగంలోకి దిగిన భారత బలగాలు కశ్మీర్‌ను పాక్‌ దురాక్రమణ నుంచి కాపాడాయి. భారత్‌కు ఏకం చేయగల, దేశ విభజన గాయాలను మాన్పగల శక్తిఉన్న వ్యక్తిగా పటేల్‌ను 1947, జనవరిలో ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ కీర్తించింది. స్వదేశీ సంస్థా నాలను దేశంలో విలీనం చేసే సామర్థ్యం కేవలం పటేల్‌కే ఉందని మహాత్మా గాంధీ సైతం గుర్తించారు. హైదరాబాద్, జునాగఢ్, ట్రావెన్‌కోర్‌.. ఒకటితర్వాత మరొకటి ఇలా 562 స్వదేశీ సంస్థానాలను పటేల్‌ భారత్‌లో విలీనం చేశారు. ఇందులో పూర్తి ఘనత పటేల్‌కే దక్కుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement