సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద అభివాదం చేస్తున్న మోదీ
కేవాడియా: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా దాడి ఘటనలో వాస్తవాలను పాకిస్తాన్ పార్లమెంట్‌లో అక్కడి నేతలు అంగీకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన జవాన్లు వీర మరణం పొందితే దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం స్వప్రయోజనాల కోసం నీచ రాజకీయాలకు తెరతీశారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. భారత భూభాగాన్ని కాజేయాలని చూస్తున్న శక్తులకు సరిహద్దుల్లో మన సైనికులు సరైన సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇండియాలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను, వారి నీచ రాజకీయాలను దేశం మరచిపోదని చెప్పారు. పొరుగు దేశం పాకిస్తాన్ పార్లమెంట్‌లో వాస్తవాలను అంగీకరించిన తర్వాత అలాంటి వ్యక్తుల నిజ స్వరూపం బట్టబయలైందని పేర్కొన్నారు.
సైనిక దళాల మనోసై్థర్యాన్ని దెబ్బతీయకండి
పుల్వామా దాడి తర్వాత తనపై కొందరు వ్యక్తులు విమర్శలు చేసినా, దారుణమైన పదాలు ఉపయోగించినా మౌనంగానే ఉన్నానని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారని అన్నారు. సైనిక దళాల మనోస్థై్ౖథర్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మీ స్వలాభం కోసం జాతి వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులుగా మారకండి అని రాజకీయ నాయకులకు హితవు పలికారు.
రామాలయం నిర్మాణానికి ప్రజలే సాక్షులు
సోమనాథ్ ఆలయ నిర్మాణం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు సర్దార్ పటేల్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆ యజ్ఞం అయోధ్యలో కొనసాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రజలు సాక్షులుగా నిలుస్తున్నారని తెలిపారు.
సీప్లేన్ సేవలను ప్రారంభించిన మోదీ
కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు సీప్లేన్ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు. ఐక్యతా శిల్పం నుంచి సీప్లేన్‌లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్‌జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్–కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. ఒక వైపు ప్రయాణానికి రూ.1,500 రుసుం వసూలు చేస్తారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది.
కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన
అహ్మదాబాద్: నిర్ణయాలు తీసుకునేటప్పు డే దేశ హితాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రొబేషనరీ సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అనే మంత్రాన్ని పాటించాలని ఉద్బోధించారు. నిత్యం వార్తల్లో ఉండేం దుకు ప్రయత్నించకూడదని చెప్పారు. రొటీ న్‌కు భిన్నంగా పనిచేస్తేనే గుర్తింపు వస్తుం దన్నారు. మోదీ శనివారం కేవాడి యా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొబే షనరీ సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశిం చి మాట్లాడారు. పాలనలో మీలాంటి అధికారుల పాత్ర వల్లే దేశం ప్రగతి సాధిస్తోందని అన్నారు. ప్రజలు సాధికారత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వారి జీవితాల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కేవలం విధానాలపైనే(పాలసీలు) ఆధార పడి ప్రభుత్వం నడవకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment