Statue of Unity
-
ఐక్యతా విగ్రహం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్టాచ్యు ఆఫ్ యూనిటీ పరిసరాల్లో టూరిస్టులను తిప్పే 15 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఛార్జింగ్ చేస్తుండగానే మంటలు అంటుకున్నట్లు వస్తున్న వార్తలను స్టాచ్యు ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్మెంట్, టూరిజం గవర్నెన్స్ అథారిటీ తిరస్కరించింది. ఛార్జింగ్ పాయింట్‌కు 35 అడుగుల దూరంలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఐక్యతా విగ్రహం వద్దకు వచ్చే టూరిస్టుల కోసం 90 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వాటికి స్థానిక ట్రైబల్ మహిళలు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. ‘గురువారం తెల్లవారుజామున కెవాడియా గ్రామం సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన 15 ఆటో రిక్షాలల్లో మంటలు చెలరేగాయి. అందుకు గల కారణాలు తెలియరాలేదు. ఛార్జింగ్ స్టేషన్‌కు 35 అడుగుల దూరంలో వాటిని నిలిపి ఉంచారు. దాంతో ఛార్జింగ్ చేస్తుండగా మంటలు వచ్చాయనేందుకు సరైన ఆధారాలు లేవు.’ అని ఓ ప్రకటన జారీ చేసింది ఎస్ఓయూఏడీటీజీఏ. మంటలపై సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇతర వాహనాలకు వ్యాపించకముందే మంటలను ఆర్పివేసింది. ఈ సంఘటనపై ఆటో రిక్షాలను నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
ఇండియా@75: ఐక్యతా ప్రతిమ ప్రతిష్ఠాపన
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ 31న గుజరాత్లో ‘ఐక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ను ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఐక్యతకు ప్రతీకగా ప్రతిష్టించారు. అక్టోబర్ 31 పటేల్ జయంతి కాగా, 182 అనే సంఖ్య గుజరాత్ రాష్ట్రంలోని 182 నియోజక వర్గాలకు సంకేతం. విగ్రహ నిర్మాణ పనులు 2013 అక్టోబర్ 31న మొదలయ్యాయి. నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్‌కు అభిముఖంగా ఉండేలా 19 వేల చదరపు కిలో మీటర్ల వ్యాసార్థంలో, 2989 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ఐక్యతా ప్రతిమను నిర్మించారు. ఇందుకోసం 75 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్, 5 వేల 700 టన్నుల ఉక్కు, 18 వేల 500 టన్నుల స్టీల్ రాడ్లు, 22 వేల 500 టన్నుల రాగి పలకలు అవసరం అయ్యాయి. దాదాపు 2,500 మంది కార్మికులు పని చేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతల ఎత్తులో నిర్మించిన ఈ సర్దార్ పటేల్ ఐక్యత స్మారక ప్రతిమను ఆ ఒక్క ఏడాదిలోనే (2018–2019) 2 కోట్ల 80 లక్షల మంది దేశ విదేశీయులు సందర్శించారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు అటల్ బిహారి వాజ్‌పేయి, నటి శ్రీదేవి, జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య, ఎం. కరుణానిధి, సోమనాథ్ చటర్జీ, మృణాల్‌సేన్.. కన్నుమూత. మహిళల్ని శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు. నానాపటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఇండియాకూ విస్తరించిన మీటూ మహిళా ఉద్యమం. ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ 24 ఏళ్ల అవని చతుర్వేది. (చదవండి: చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య) -
RRR: ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ సాక్షిగా తారక్, చెర్రీల దోస్తీ.. పోటోలు వైరల్
ఆర్ఆర్ఆర్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో ఐదు(మార్చి 25) రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. రోజుకో నగరం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో నిర్వహించారు. నేడు(మార్చి 20) బరోడా(గుజరాత్), ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి కర్ణాటక నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్లారు. ఈ త్రయం గుజరాత్‌లోని స్టాచ్యు ఆఫ్ యూనిటీ దగ్గర సందడి చేసింది. అక్కడే మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వ్లెడించారు. ఆర్ఆర్ఆర్ టీమ్ గుజరాత్లో ల్యాండ్ అయినా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.కాగా ఈ ప్రోగ్రాంకి గాను అక్కడి యూనిట్ ఏకంగా ఆర్ఆర్ఆర్ స్టిక్కర్స్ తో పలు కార్లను రోడ్ షో నిమిత్తం రెడీ చెయ్యడం మరింత ఆసక్తిగా మారిపోయింది. The RRR fleet…Enroute Kevadia, Gujarat.#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/4UrX7rIDUA — RRR Movie (@RRRMovie) March 20, 2022 ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. #RRRMovie team interacts with the media at the Statue of Unity.#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/eEW7mABdGi — RRR Movie (@RRRMovie) March 20, 2022 -
ఐక్యతా శిల్పం సందర్శన ఐదు రోజులపాటు నిలిపివేత
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా శిల్పం సందర్శనను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1వ తేదీ దాకా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాలను(రాష్ట్రీయ ఏక్తా దివస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐక్యతా శిల్పంతోపాటు సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాల్లోనూ సందర్శకులకు ఐదు రోజులపాటు అనుమతి ఉండదని వెల్లడించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా సందర్శకుల రాకను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: హమ్మయ్య.. ముంబై నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది) -
ఐక్యతా విగ్రహాన్ని ఎంతమంది సందర్శించారో తెలుసా?
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ‘స్టాచ్యూఆఫ్ యూనిటీ’ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు, 50 లక్షల మందికి పైగా సందర్శకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించినట్టు రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, అన్ని వయస్సుల జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోందని గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌గుప్తా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కెవాడియాలోని సర్దార్ సరోవర్ డ్యాం వద్ద, ప్రపంచంలోనే అతిపెద్దదైన, 182 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018, అక్టోబర్ 31 న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతానికి అదనపు హంగులు జోడించారు. ఈ ప్రాంతానికి రైలు, విమానాల రాకపోకలను మెరుగుపర్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది కొత్త రైళ్ళను, అహ్మదాబాద్ నుంచి సీప్లేన్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులపై కోవిడ్ ప్రభావం పడింది. కోవిడ్ ఆంక్షల కారణంగా ఏడు నెలల సుదీర్ఘ కాలం అనంతరం గతయేడాది అక్టోబర్ 17న తిరిగి సందర్శకులకు అనుమతించారు. ఈ యేడాది జనవరి 18న దేశంలోని పలు ప్రాంతాల నుంచి 8 రైళ్ళను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎక్కువ మంది సందర్శించారని ప్రకటించారు. ప్రస్తుతం పెరిగిన రవాణా సౌకర్యాల కారణంగా ఒక సర్వే ప్రకారం రోజుకి లక్ష మంది పర్యాటకులు కెవాడియాను సందర్శించొచ్చన్నారు. చదవండి: సోనియాపై కేసును మూసేయాలి -
స్వేచ్ఛా విగ్రహం కంటే ఐక్యతా విగ్రహమే ఘనం
అహ్మదాబాద్: అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా 8 రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రైళ్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలిందని వివరించారు. దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి–చందోడ్, చందోడ్–కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్–కేవాడియా సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. కేవాడియా అనేది ఇకపై మారుమూల చిన్న పట్టణం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారబోతోందని స్పష్టం చేశారు. పర్యావరణ హిత రైల్వే ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు కేవాడియా రైల్వే స్టేషన్ ఒక ఉదాహరణ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్–కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్లో ప్రత్యేక ఏమిటంటే ఇందులో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు. -
దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?
కేవాడియా: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా దాడి ఘటనలో వాస్తవాలను పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడి నేతలు అంగీకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన జవాన్లు వీర మరణం పొందితే దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం స్వప్రయోజనాల కోసం నీచ రాజకీయాలకు తెరతీశారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. భారత భూభాగాన్ని కాజేయాలని చూస్తున్న శక్తులకు సరిహద్దుల్లో మన సైనికులు సరైన సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇండియాలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను, వారి నీచ రాజకీయాలను దేశం మరచిపోదని చెప్పారు. పొరుగు దేశం పాకిస్తాన్ పార్లమెంట్లో వాస్తవాలను అంగీకరించిన తర్వాత అలాంటి వ్యక్తుల నిజ స్వరూపం బట్టబయలైందని పేర్కొన్నారు. సైనిక దళాల మనోసై్థర్యాన్ని దెబ్బతీయకండి పుల్వామా దాడి తర్వాత తనపై కొందరు వ్యక్తులు విమర్శలు చేసినా, దారుణమైన పదాలు ఉపయోగించినా మౌనంగానే ఉన్నానని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారని అన్నారు. సైనిక దళాల మనోస్థై్ౖథర్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మీ స్వలాభం కోసం జాతి వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులుగా మారకండి అని రాజకీయ నాయకులకు హితవు పలికారు. రామాలయం నిర్మాణానికి ప్రజలే సాక్షులు సోమనాథ్ ఆలయ నిర్మాణం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు సర్దార్ పటేల్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆ యజ్ఞం అయోధ్యలో కొనసాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రజలు సాక్షులుగా నిలుస్తున్నారని తెలిపారు. సీప్లేన్ సేవలను ప్రారంభించిన మోదీ కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు సీప్లేన్ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు. ఐక్యతా శిల్పం నుంచి సీప్లేన్‌లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్‌జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్–కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. ఒక వైపు ప్రయాణానికి రూ.1,500 రుసుం వసూలు చేస్తారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అహ్మదాబాద్: నిర్ణయాలు తీసుకునేటప్పు డే దేశ హితాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రొబేషనరీ సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అనే మంత్రాన్ని పాటించాలని ఉద్బోధించారు. నిత్యం వార్తల్లో ఉండేం దుకు ప్రయత్నించకూడదని చెప్పారు. రొటీ న్కు భిన్నంగా పనిచేస్తేనే గుర్తింపు వస్తుం దన్నారు. మోదీ శనివారం కేవాడి యా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొబే షనరీ సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశిం చి మాట్లాడారు. పాలనలో మీలాంటి అధికారుల పాత్ర వల్లే దేశం ప్రగతి సాధిస్తోందని అన్నారు. ప్రజలు సాధికారత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వారి జీవితాల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కేవలం విధానాలపైనే(పాలసీలు) ఆధార పడి ప్రభుత్వం నడవకూడదన్నారు. -
అమ్మకానికి పటేల్ విగ్రహం..!
గాంధీనగర్ : భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన ఐక్యత విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. విగ్రహం ధరని రూ.30వేల కోట్లుగా నిర్ధారించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో బాధితులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నిధులను ఉపయోగించాలని భావించారు. అయితే పటేల్ విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో పెట్టింది ఓ నెటిజన్. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఓఎల్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఎమర్జెన్సీ... స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో.. ఫేక్ పోస్ట్‌గా గుర్తించి ఒఎల్ఎక్స్ సంస్థ ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించింది. కాగా పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. కాగా ఓఎల్ఎక్స్ లో దీని ఖరీదుని రూ.30వేల కోట్లుగా నిర్ధారించడంతో తొలుత చూసిన వారంతా షాక్‌కి గురయ్యారు. భారత్ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ దీవిలో దీన్ని నిర్మించారు. కాగా దీనిని ఆవిష్కరించిన దగ్గర నుంచి పర్యటకులు ద్వారా ఇప్పటి వరకు 82 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని నిర్వహకులు తెలుపుతున్నారు. -
టైమ్స్ టాప్ 100లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’
సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ ఏటా రూపొందించే ‘వరల్డ్ టాప్ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ కాగా మరొకటి ముంబైలోని ‘సోహో హౌస్’. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల క్రితం ఒకే రోజు 34000 మంది టూరిస్టులు ఈ విగ్రహాన్ని సందర్శించడం విశేషం. ఈ రెండు అంశాలను పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సోహో హౌస్ ఐరోపా, అమెరికా ఖండాల బయట, ఆసియాలోనే మొదటిది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అరేబియా సముద్ర తీరంలో పదకొండు అంతస్థులతో నిర్మితమైంది. ఇందులో లైబ్రరీ, ఓపెన్ రూఫ్ టాప్ బార్‌తో పాటు 34 మందికి సరిపోయే సినిమా థియేటర్ కూడా ఉంది. దీని నిర్మాణంలో వాడిన ఫర్నిచర్, నిర్మాణ శైలి, భవనంలోని కళాకృతులతో ఈ భవనం ప్రత్యేకత కలిగి ఉంది. వాస్తవికత, ఆవిష్కరణ, కొత్తదనం, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజీన్ ఏటా ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రదేశాలను ఎంపిక చేస్తుంది. -
స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ‘టైమ్’ గుర్తింపు
న్యూయార్క్: గుజరాత్ తీరంలో ఏర్పాటైన 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ముంబైలోని సోహో హౌస్‌లకు ప్రఖ్యాత టైమ్ మేగజీన్ రూపొందించిన టాప్–100 ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాల రెండో జాబితాలో చోటు లభించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 597 అడుగుల ఎత్తైన విగ్రహం గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఏర్పాటుచేయడం తెల్సిందే. అలాగే, అమెరికా, యూరప్‌లలో కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్ సొంతం. సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్ బార్, స్విమ్మింగ్‌పూల్ ఉన్నాయి. 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్ క్లబ్ ప్రత్యేకతలు. -
నెహ్రూను తగ్గించాలని కాదు
సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్‌కోట: భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్ పటేల్ తమ నాయకుడని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఇప్పటివరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో 75 శాతం పోలింగ్.. గతంలో పుణే, అహ్మదాబాద్, జమ్మూలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో ఒక్క బాంబు దాడి జరిగినట్లైనా మీరు విన్నారా? కశ్మీర్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. నేను పటేల్ విగ్రహాన్ని నెహ్రూను తక్కువ చేయడానికి నిర్మించలేదు. పటేల్ విగ్రహం ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు(కాంగ్రెస్ నేతలు) ఇకపై ఇతరులను తక్కువ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. గుజరాత్ నన్ను దృఢంగా మార్చింది 2017లో చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత సందర్భంగా కటువుగా, దృఢంగా వ్యవహరించేలా గుజరాత్ నన్ను తయారుచేసింది. గుజరాత్ ప్రజలు నాలో నైతిక విలువలను పెంపొందింపజేశారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామనీ, కశ్మీర్లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (అఫ్సా) తొలగిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అదే జరిగితే అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు చంపేయరా? వైష్ణోదేవి ఆలయాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకోగలరా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో మరోసారి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. బాగల్‌కోట, ఛిక్కొడి, బెళగావిల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కేంద్రంలో కాంగ్రెస్ బలహీన, నిస్సహాయ ప్రధానిని నియమించాలని అనుకుంటోంది. బలమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఢిల్లీ(కేంద్రం) వైపు చూడండి. బలహీనమైన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే బెంగళూరువైపు చూడండి’ అని తెలిపారు. ఆమ్రేలీలో పార్లమెంటు భవంతి ఆకృతిలో జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని మోదీ -
మంచిని పంచుదాం..పెంచుదాం!
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా సానుకూల(పాజిటివ్) విషయాలను వైరల్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతికూల అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభమని వ్యాఖ్యానించారు. ప్రజల ఉమ్మడి కృషి కారణంగా భారత్ 2018లో పలు అద్భుతాలను సాధించిందన్నారు. ఆశయం బలంగా ఉంటే ఎదురయ్యే అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతాయని తెలిపారు. 2019లో కూడా భారత అభివృద్ధి, పురోగతి ఇలాగే సాగాలని ..సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. 2018లో చివరి మాసాంతపు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ పలు అంశాలపై ముచ్చటించారు. ఏడాదిలో అనేక విజయాలు... ‘మనమంతా కలిసి సానుకూల అంశాలను వైరల్ చేద్దాం. ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు, మహనీయుల గురించి తెలుసుకుంటారు. ప్రతికూల వార్తలు, అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభం. కానీ చుట్టూ సానుకూల విషయాలను వ్యాప్తిచేసే ప్రయత్నం నిజంగానే జరుగుతోంది. చాలా వెబ్సైట్లు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నాయి. ఇలాంటి వార్తల లింక్స్‌ను విస్తృతంగా పంచుకోండి. తద్వారా సానుకూలతను వైరల్ చేయవచ్చు’ అని మోదీ సూచించారు. 2018లో ఎన్డీయే ప్రభుత్వ సాధించిన కీలక విజయాలపై మాట్లాడుతూ..‘ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను ఆవిష్కరించాం. దేశంలోని ప్రతీపల్లెకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రజల దృఢ సంకల్పంతో పరిశుభ్రత అన్నది 95 శాతం దాటింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోటపై ఎగురవేస్తున్నారు. కానీ స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశచరిత్రలో తొలిసారి అక్టోబర్ 21న ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించాం. తొలి భారత హోంమంత్రి సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటుచేశాం. ఈ ఏడాదే భూ, జల, వాయు మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది’ అని మోదీ వెల్లడించారు. యువతకు గొప్ప అవకాశం... యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాపై స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం సందర్భంగా భక్తితో పాటు పరిశుభ్రత కూడా పరిఢవిల్లుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి యువతకు కుంభమేళా గొప్ప అవకాశం’ అని పేర్కొన్నారు. అలాగే ఈసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరవుతారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో∙గాంధీ జాతి వివక్షపై మొదటిసారి పోరాడి, మహాత్ముడిగా మారారని గుర్తుచేశారు. అండమాన్ ప్రజలు దేశానికే ఆదర్శం అండమాన్ దీవుల్లో మోదీ పర్యటన కార్ నికోబార్ / పోర్ట్‌బ్లెయర్ : 2004లో విరుచుకుపడ్డ సునామీ దుష్ప్రభావం నుంచి అండమాన్ ప్రజలు శరవేగంగా కోలుకున్నారని ప్రధాని కితాబిచ్చారు. అండమాన్ దీవుల్లో ఉంటున్న ప్రజల సంక్షేమానికి, భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కార్ నిరోబార్ దీవుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రశంసించిన మోదీ, ఈ విషయంలో అండమాన్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంగా ప్రజలు ప్రధాన భూభాగాన్ని, ద్వీపాలను వేరుగా చూస్తారనీ, తనకు మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల కంటే పోర్ట్బ్లెయరే ప్రధాన భూభాగమని అన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా రూ.50 కోట్లతో గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్ నికోబార్‌లోని బీజేఆర్ స్టేడియంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. కొబ్బరి పొట్టు కనీస మద్దతు ధరను రూ.7 వేల నుంచి రూ.9 వేలకు పెంచామన్నారు. ఈ సందర్భంగా సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. సావార్కర్ గదిలో ధ్యానం.. పర్యటనలో భాగంగా పోర్ట్‌బ్లెయర్‌లోని సెల్యూలర్ జైలును సందర్శించిన ప్రధాని.. బ్రిటిష్ పాలనలో స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న హిందుత్వవాది వీర సావార్కర్‌ను బంధించిన గదిలో నేలపై ధ్యాన ముద్రలో కూర్చున్నారు. ఆతర్వాత జైలు సెంట్రల్ టవర్ వద్ద గోడపై చెక్కిన అమరుల పేర్లను పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి వెనుదిరిగారు. కాలాపానీగా పిలిచే ఈ జైలును 1896–1906లో నిర్మించారు. ఈ పర్యటనలో భాగంగా చెన్నై–పోర్ట్‌బ్లెయర్ మధ్య ఫైబర్ కేబుల్, 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ మోడల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. అలాగే అండమాన్ దీవుల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రితో పాటు 50 మెగావాట్ల ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ) ప్లాంట్‌ను స్థాపిస్తామని తెలిపారు. మూడు ద్వీపాలకు కొత్త పేర్లు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేస్తున్నట్లు పోర్ట్‌బ్లెయర్‌లోని నేతాజీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..‘స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి ప్రస్తావించాల్సి వస్తే నేతాజీ పేరును గర్వంగా ప్రకటిస్తాం. ఆయన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి తొలి ప్రధాని. ఆయన అండమాన్ గడ్డపై భారత్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేశారు. అండమాన్ నుంచి దేశం స్ఫూర్తి పొందుతోంది. 1943లో ఇదే రోజున అండమాన్, నికోబార్ దీవులను షహీద్, స్వరాజ్ దీవులుగా గుర్తించాలని నేతాజీ సూచించారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవంగా మొబైల్ ఫోన్ల ఫ్లాష్లైట్లను ఆన్ చేయాలని కోరడంతో స్టేడియం ఒక్కసారిగా వెలుగుజిలుగులతో కాంతులీనింది. అనంతరం మెరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు. -
మరో భారీ విగ్రహం.. ఈసారి కర్ణాటక వంతు
బెంగళూరు: దేశంలో నగరాల పేర్ల మార్పు, పోటాపోటిగా అతిపెద్ద విగ్రహాల నిర్మాణాల జోరు ఊపందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో నర్మదా నది తీరాన ఆవిష్కరించిన 597 అడుగుల ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వివిధ రాష్ట్రాలు కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంతకాకున్నా భారీ విగ్రహాలే నిర్మించేలా సన్నాహకాలు ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలు విగ్రహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా తాజాగా కర్ణాటక కూడా ఈ జాబితాలోకి చేరింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని రాజా సాగర రిజర్వాయర్‌లో 125 అడుగుల కావేరీ మాత విగ్రహాన్ని నిర్మించాలని జేడి(ఎస్)-కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇక్కడే ఓ మ్యూజియం కాంప్లెక్స్‌ను, రెండు గ్లాస్ టవర్స్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సుమారు 1200 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుచేయడం లేదని, విరాళాల ద్వారా సేకరిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే పటేల్ విగ్రహ నిర్మాణం కోసం భారీ ఖర్చుచేయడం పట్ల విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు కర్ణాటకలో తమ సంకీర్ణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్ట్‌పై ఏం సమాధానం చెబుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మోదీపై రమ్య వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా చీఫ్ దివ్య స్పందన అలియాస్ రమ్య గురువారం వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని పక్షి రెట్టతో పోల్చుతూ ఆమె చేసిన ట్వీట్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడగా, కాంగ్రెస్ పార్టీ మౌనం దాల్చింది. గుజరాత్లో నర్మదా నదీతీరాన బుధవారం సర్దార్ పటేల్ స్మృత్యర్థం నిర్మించిన 182 మీటర్ల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని మోదీ బుధవారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నలుపురంగులో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం దగ్గర తెల్లటి దుస్తులతో మోదీ ఫొటోలు దిగారు. పటేల్ విగ్రహం కాళ్లదగ్గర మోదీ నిలబడ్డ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న రమ్య..‘అది పక్షి రెట్టేనా?’ అని ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిజమైన సంస్కృతి ఇదేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. మరోవైపు తన ట్వీట్‌ను సమర్థించుకున్న దివ్య.. దీనిపై వివరణ ఇవ్వబోననీ, అది అడిగే అర్హత బీజేపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. -
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ: వారికి వచ్చిన నష్టం ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలు వ్యాపించి దిగంతాలకు తాకేలా అత్యంత ఎల్తైన అద్భుత కళాఖండంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వాతంత్య్ర సమర యోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తే ఆ పరిసరాల్లోని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? విగ్రహావిష్కరణ సభను అడ్డుకునేందుకు సిద్ధమైన వారిలో దాదాపు మూడు వందల యాభై మంది ఆదివాసీ రైతులను ముందుగానే అరెస్ట్ చేసి పోలీసులు ఎందుకు 20 గంటల పాటు నిర్బంధించారు ? వారికి వచ్చిన నష్టం ఏమిటీ? వారికి బుధవారం నాడు విగ్రహావిష్కరణ రోజే తక్షణం ముంచుకొచ్చిన నష్టం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సరోవర్ డ్యామ్ గేట్లు తెరవడం. సర్దార్ సరోవర్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో సర్మదా నది నీళ్లతో నిండుగా కనిపించడం కోసం సరోవర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ కారణంగా సమీపంలో మూడు గ్రామాల్లోని దాదాపు 30 మంది రైతుల పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయని పిపాలయ పోలీసు స్టేషన్ నిర్బంధం నుంచి బుధవారం సాయంత్రం విడుదలైన రైతు నాయకుడు లఖాన్ ముసాఫిర్ తెలిపారు. ఆయనతోపాటు 24 మంది ఆదివాసీలను పిపాలయ పోలీసు స్టేషన్లో 20 గంటలపాటు నిర్బంధించారు. నర్మదా జిల్లా అంతటా దాదాపు 350 మంది ఆదివాసీ రైతులను పోలీసులు నిర్బంధించారని పటేల్ విగ్రహానికి 8 కిలోమీటర్ల దూరంలోని గురుదేశ్వర్ గ్రామానికి చెందిన లఖాన్ తెలిపారు. పటేల్ విగ్రహం ఉన్న పరిసర ప్రాంతాలను టూరిస్ట్ జోన్‌గా అభివద్ధి చేయడం వల్ల ఇల్లు వాకిలినే కాకుండా పచ్చటి పంట పొలాలను కూడా కోల్పోతున్నామని ఆదివాసీ రైతులు ఆందోళన చేస్తున్నారు. నీటిలో మునుగుతున్న 13 గ్రామాలు సర్దార్ పటేల్ విగ్రహం పరిసరాల్లో టూరిజం అభివద్ధిలో భాగంగా ‘వాలీ ఆఫ్ ఫ్లవర్స్’ను, ‘టెంట్ సిటీ’ నిర్మాణ పనులు చేపట్టారు. టెంట్ సిటీలో ప్రతి రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అతిథి గహంతోపాటు పర్యాటక శాఖల గెస్ట్‌హౌజ్‌లు, ప్రైవేటు, ప్రభుత్వ రిస్టారెంట్లు నిర్మిస్తారు. బోటు షికార్ల కోసం ఓ సరస్సు నిర్మాణం పనులు కూడా చేపడుతున్నారు. ఈ పనుల సాకారం కోసం పటేల్ విగ్రహం ఉన్న కెవాడియాకు సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో, గురుదేశ్వర్ గ్రామానికి సమీపంలో ఓ చిన్న డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత సరోవర్ డ్యామ్ నుంచి నీళ్లను విడుదల చేసి చిన్న డ్యామ్ వరకు నీళ్లు నిండుగా ఉండేలా చేస్తారు. దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిన్న డ్యామ్ నిర్మాణం వల్ల ఇప్పటికే ఆరు గ్రామాలు నీటిలో మునిగిపోగా, డ్యామ్ నిర్మాణం పూర్తయి, నీటిని విడుదల చేస్తే మరో ఏడు గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. పటేల్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా దాదాపు 20 గ్రామాలు నష్టపోతుంటే పరోక్షంగా పరిసరాల్లో 70 ఆదివాసీ గ్రామాలు నష్టపోతున్నాయి. అందుకనే ఆ గ్రామాల ప్రజలంతా బుధవారం నాడు అన్నం వండుకోకుండా పస్తులుండి నిరసన తెలిపారు. 22 గ్రామాల సర్పంచ్ల లేఖ భారత దేశ కీర్తి ప్రతిష్టల కోసం తరతరాలుగా ఇక్కడే జీవిస్తున్న తమ కడుపులు కొట్టవద్దంటూ ఇటీవల 22 గ్రామాల ప్రజలు తమ సర్పంచ్ల సంతకాలతో ప్రధాని పేరిట ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘మా పరిసర గ్రామాల ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని పలు గ్రామాలకు పాఠశాల, వైద్యశాలల వసతులే కాకుండా కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదు. ప్రజలు కష్టపడి సంపాదించి పన్నులు కడితే ఆ సొమ్మును మీరు ఇలా వధా చేయడం భావ్యం కాదు. పటేల్ ప్రాజెక్టు పూర్తయితే మా వ్యవసాయానికే కాదు, మాకు మంచినీటి కూడా సరోవర్ నది నుంచి ఒక్క చుక్కా దొరకదు. సరోవర్ కెనాల్ నెట్‌వర్క్‌ను (20 వేల కిలోమీటర్ల కెనాల్‌ను పూర్తి చేయాల్సి ఉంది) పూర్తి చేయడానికి నిధులు లేవనే సర్కార్, పటేల్ ప్రాజెక్టుకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి ? అందుకనే మిమ్మల్ని 31వ తేదీన అతిథిగా ఆహ్వానించడం లేదు. అయినా మీరొస్తే మీ కార్యక్రమాన్ని మేం బహిష్కరిస్తాం’ అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. నష్టపరిహారం ఊసేలేదు! పటేల్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇంకా తేల్చడం లేదు. ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ నష్టపరిహారం కోసం ఆర్జీలు పెట్టుకుంటే పరిశీలిస్తాంగానీ, ప్రాజెక్టు వద్దూ నష్టపరిహారం వద్దంటే తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 1990 దశకంలో సరోవర్ డ్యామ్‌ను నిర్మించడం వల్ల గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని 42 వేల కుటుంబాలు, దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులకు ఎక్కడో దూరాన పట్టాలిచ్చారని, వ్యవసాయం చేసుకునే భూమికి, ఇళ్ల స్థలాలకు మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం ఉందని ఆదివాసీ రైతులు తెలిపారు. దేశాన్నే కుదిపేసేలా ఆందోళన చేస్తే వారికి దక్కింది ఆ మాత్రం నష్టపరిహారమని, ఇక తమకు ఏపాటి పరిహారం దొరకుతుందని వారు ప్రశ్నించారు. -
బాహుబలి
-
తమిళం ఖూనీ.. తెలుగుకు చోటేది..
సాక్షి, చెన్నై : అత్యంత ప్రతిష్టాత్మకంగా నర్మదా నదీ తీరంలో ప్రతిష్టించిన ఉక్కుమనిషి విగ్రహం శిలా ఫలకంలో తమిళంకు అవకాశం దక్కినా, అక్షర దోషాలు, అర్థాన్నే మార్చేస్తూ ఖూనీచేసేలా ఉండడం తమిళనాట చర్చకు దారితీసింది. అయితే, అందులో తెలుగుకు అవకాశం కల్పించక పోవడంపై జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేలకు గుజరాత్లో భారీ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. నర్మదా నదీ తీరంలో 182 మీటర్లతో బ్రహ్మాండంగా ప్రతిష్టించిన నిలువెత్తు విగ్రహాన్ని బుధవారం మోదీ ఆవిష్కరించారు. ఇందులోని శిలాఫలకంలో తమిళానికి చోటు కల్పించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. పలు భాషల్లో ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్న నామకరణంతో నినాదాన్ని పొందుపరిచారు. అయితే, తమిళంలో ఒట్ట్రుమై శిలై అని పొందుపరచాల్సి ఉండగా, స్టేట్టుక్కో ఒప్పి యూనిటి అని ముద్రించడం విమర్శలకు దారితీసింది. అక్షర దోషం పక్కన పెడితే, అర్థమే మార్చేస్తూ, తమిళంను ఖూనీ చేశారన్న చర్చ తమిళనాట ఊపందుకుంది. కొన్ని తమిళ మీడియాల్లో వార్త కథనాలు తెర మీదకు వచ్చాయి. ఇక, తమిళం ఖూనీ చేస్తూ అక్షరాలను పొందుపరచడంపై విమర్శలు బయలుదేరినా, ఆ శిలాఫలకంలో తెలుగుకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తమిళ అక్షర దోషాలు, తమిళంకు శిలా ఫలకంలో చోటు కల్పించినట్టుగా వచ్చిన సమాచారాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించడం గమనార్హం. కాగా, అక్షర దోషాలను అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లగా, ఆగమేఘాల మీద తొలగించారని వాదించే తమిళులూ ఉన్నారు. తెలుగుకు అవమానం జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ఓ ప్రకటనలో పేర్కొంటూ, 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్యభారతాన్ని నిర్మించి, స్వతంత్ర భారతావని రూప శిల్పి పటేల్ అని కొనియాడారు. ఆయనకు 182 మీటర్ల ఎత్తులో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.అయితే, దేశంలో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాషకు ఆ శిలాఫలకంలో స్థానం కల్పించకపోవడం వేదన కల్గిస్తోందన్నారు. ఇది యావత్ తెలుగు వారికి తీరని అవమానం అని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఉక్కుమనిషికి నిలువెత్తు నివాళి
కెవాడియా (గుజరాత్): సమైక్య భారత నిర్మాత, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు సమున్నత గౌరవం... విచ్ఛిన్నంగా ఉన్న భారత భూభాగాల్ని ఏకం చేసిన ధీశాలికి నిలువెత్తు నివాళి. పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల(597 అడుగులు) సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంకు సమీపంలో సాధు బెట్ అనే దీవిలో కొలువుదీరిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు జాతీయ పతాక రంగులు వెదజల్లుకుంటూ విగ్రహానికి సమీపంగా దూసుకెళ్లిన దృశ్యాలు కనువిందు చేశాయి. ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ప్రకృతి సోయగాల నడుమ, సంప్రదాయ దుస్తుల్లో పటేల్ ఠీవిగా నడుస్తున్నట్లున్న ఈ విగ్రహాన్ని.. సాధు కొండల్లో నక్షత్ర ఆకారం లోని పునాదిపై నిర్మించారు. సమైక్య భారత కలను నిజం చేయడానికి తమ రాజ్యాల్ని వదులుకున్న రాజ వంశాల జ్ఞాపకార్థం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని మోదీ గుజరాత్ ప్రభుత్వానికి సూచించారు. పటేల్ విగ్రహం మన దేశ ఇంజినీరింగ్, సాంకేతిక నైపుణ్యాలకు నిలువుటద్దం అని కొనియాడారు. నర్మదా డ్యాంకు సమీపంలో నివసిస్తున్న గిరిజనులకు ఈ విగ్రహం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఆ ప్రాంతంలో పర్యాటక రంగం ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లి, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించిన మోదీ..విగ్రహం పాదాల వరకు వెళ్లి పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు. విగ్రహం కింది భాగంలో నిర్మించిన మ్యూజియంతో పాటు, 135 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేసిన పర్యాటకుల గ్యాలరీని సందర్శించారు. భారత మనుగడకు భరోసా భారత్‌ను ముక్కలు చేయాలనుకున్న కుట్రలకు ఎదురునిలిచిన పటేల్ ధైర్యానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆనాడు దేశ అస్థిత్వంపై సందేహాలు వ్యక్తం చేసినవారికి భారత మనుగడపై అచంచల భరోసాను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై కూడా ప్రధాని ధ్వజమెత్తారు. పటేల్ లాంటి జాతీయ హీరోలకు స్మారకాలు నిర్మించడం ద్వారా తాము ఏమైనా నేరాలకు పాల్పడ్డామా? అని ప్రశ్నించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన తరువాత మోదీ 55 నిమిషాలు ప్రసంగించారు. 550 సంస్థానాలను విలీనంచేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవల్ని కొనియాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. పటేల్ భౌగోళిక సమైక్యతకు పాటుపడితే తమ ప్రభుత్వం జీఎస్టీ లాంటి సంస్కరణల ద్వారా ఆర్థిక సమైక్యతకు కృషిచేస్తోందని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో జాతి హీరోల గౌరవార్థం నిర్మించిన పలు స్మారకాల్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’కు స్ఫూర్తి ‘భారత జాతిని విచ్ఛిన్నం చేయాలనుకున్న కుట్రలను అడ్డుకున్న పటేల్ ధైర్యం, శక్తిసామర్థ్యాలు, అంకితభావాన్ని ఈ విగ్రహం ప్రపంచానికి, భావి తరాలకు చాటిచెబుతుంది. ఇదే స్ఫూర్తితో ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ సాధన దిశగా ముందడుగు వేయాలి. జాతి హీరోలకు స్మారకాలు నిర్మించాలన్న మా ఆశయాల్ని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పటేల్ లాంటి యోధుల సేవల్ని కీర్తించినందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే మేము ఏమైనా నేరం చేశామా అని అనిపిస్తుంది. జాతిని ఏకం చేసిన గొప్ప వ్యక్తికి తగిన గౌరవం దక్కాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దేశ విభజనకు జరుగుతున్న దుష్ట ప్రయత్నాలకు ప్రజలంతా గట్టి జవాబు ఇవ్వాలి. ఒకవేళ ఆనాడు పటేల్ వల్ల దేశం ఏకం కానట్లయితే హైదరాబాద్‌లో చార్మినార్ సందర్శనకు, గుజరాత్‌లోని జునాగఢ్‌లో సింహాల్ని చూసేందుకు, సోమనాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు ప్రజలకు వీసాల అవసరం వచ్చి ఉండేది’ అని మోదీ అన్నారు. డీజీపీల సదస్సు ఇక్కడే! ఈ సంవత్సరం జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీల వార్షిక సమావేశానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమ షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా, పటేల్ విగ్రహం వద్దే ఈ సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర హోం శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశాలున్నాయి. విగ్రహం సమీపంలోని కెవాడియా గ్రామంలో గుడారాల్లో డీజీపీలు, ఐజీలకు బస కల్పించాలని యోచిస్తున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సివిల్ సర్వీసుల పితగా పేరొందిన సర్దార్ పటేల్ పేరిట హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారులకు శిక్షణనిచ్చే అకాడమీ(ఎన్పీఏ)ని నెలకొల్పారు. ఐక్యతా విగ్రహం విశేషాలివీ.. ► విగ్రహ నిర్మాణానికి వాడిన సామగ్రి: 70 వేల టన్నుల సిమెంట్, 24,500 టన్నుల ఉక్కు, 1,700 మెట్రిక్ టన్నుల కంచు ► నిర్మాణ వ్యయం: రూ. 2,989 కోట్లు ► విగ్రహం ప్రాజెక్టు విస్తీర్ణం: 20,000 చదరపు మీటర్లు ► పర్యాటకులు సమీపంలోని ప్రకృతి అందాల్ని చూసేందుకు విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఏర్పాటు ► ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తయిన చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం రెట్టింపు ఎత్తయినది. ► పెద్ద రాయిని తొలిచి విగ్రహాన్ని చెక్కాలని భావించినా, అంతటి కఠినమైన రాయి లభించకపోవడంతో సిమెంట్, స్టీల్, కంచుతో నిర్మించారు. ► గుజరాత్ సీఎంగా ఉండగా పటేల్‌కు భారీ విగ్రహం నిర్మించాలని మోదీ సంకల్పించారు. 2013లో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ► లార్సెన్ అండ్ టుబ్రో సంస్థ రికార్డుస్థాయిలో 33 నెలల్లో కట్టింది. ► 2 వేలరకాల పటేల్ ఫొటోల్లో ఒకదాని ఓకే చేసి దానిలా విగ్రహాన్ని మలిచారు. ► విగ్రహాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించారు. ఒకటో జోన్లో మోకాళ్ల కింది భాగం, రెండో జోన్లో తొడలు(149 మీటర్లు), మూడో జోన్లో పర్యాటకుల గ్యాలరీ(153 మీటర్లు), నాలుగో జోన్లో మెయింటెనెన్స్, ఐదో జోన్లో తల, భుజాలు ఉన్నాయి. 4, 5 జోన్లలోకి ప్రవేశం నిషేధం. ► విగ్రహంలో ఏర్పాటుచేసిన లిఫ్ట్ సెకనుకు 4 మీటర్ల వేగంతో సందర్శకులను 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీకి తీసుకెళ్తుంది. ► పర్యాటకుల గ్యాలరీలోకి ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు. ► సందర్శకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాంతో పాటు 12 కి.మీ పొడవైన గరుడేశ్వర రిజర్వాయర్‌ను వీక్షించవచ్చు. ► విగ్రహం దగ్గరికి వెళ్లాలంటే రూ.120, విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీలోకి వెళ్లాలంటే టికెట్ రూ.350 చెల్లించాలి. ► విగ్రహ ప్రవేశంలోని మ్యూజియంలో పటేల్ జీవిత విశేషాలు, స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాలపై ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గాంధీకి భారీ విగ్రహం ఏదీ?: విపక్షాలు న్యూఢిల్లీ: ఉక్కుమనిషి సర్దార్ పటేల్ మాదిరిగా జాతిపిత మహాత్మా గాంధీకి భారీ విగ్రహం ఎందుకు ఏర్పాటుచేయలేదని విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. పటేల్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని బీజేపీ హైజాక్ చేసిందన్నాయి. పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూనే, ఆయన చలవతో ఏర్పడిన వ్యవస్థలను కేంద్రం ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని నాశనంచేయడం ద్రోహానికి ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. దళిత నాయకుల విగ్రహాలు ఏర్పాటుచేసినప్పుడు తనపై విమర్శలు గుప్పించిన బీజేపీ, ఆరెస్సెస్‌లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీకి ఎక్కడా సర్దార్ పటేల్ అంతటి భారీ విగ్రహం లేదని, బీజేపీ అలాంటి నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేదో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కోరారు. పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆయన్ని తమవాడిగా చెప్పుకునే హక్కు బీజేపీకి లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే బీజేపీ పటేల్ విగ్రహంతో రాజకీయాలు చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పటేల్, గాంధీ, అంబేడ్కర్.. ఇలా ఒక్కోసారి ఓ మహానాయకుడిని బీజేపీ గుర్తుచేసుకుంటుందని, అవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని అన్నారు. పటేల్ భారీ విగ్రహం పాదాల చెంత నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కింది భాగంలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో మోదీ విగ్రహం లోపల పర్యాటకుల గ్యాలరీ నుంచి సర్దార్ సరోవర్ డ్యాం విహంగ వీక్షణం -
‘ఉక్కుమనిషి’కి సమున్నత నివాళి
‘ఉక్కు మనిషి’, ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం అలుపెరగకుండా శ్రమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అతి ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. నర్మదా నదీతీరాన సర్దార్ సరోవర్ డ్యాం సమీపాన ఈ భారీ విగ్రహం కోసం 3,400మంది కార్మికులు నలభై రెండు నెలలుగా రాత్రింబగళ్లు శ్రమించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అందరూ ఊహించినట్టు నరేంద్ర మోదీ తన 55 నిమిషాల ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదు. అలాగని తనను విమర్శిస్తున్నవారిని ఊరకే వదిలేయలేదు. తమ ప్రభుత్వం జాతీయ నేతలకు సము న్నతమైన స్మృతి చిహ్నాలను నిర్మించాలని ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుంటే దీన్నంతటినీ కొందరు రాజకీయ సులోచనాలతో పరికించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. ‘‘మేమేమైనా తీవ్రమైన నేరం చేశామా అని మాకే అనిపించే స్థాయిలో వీరి విమర్శలుంటున్నాయి’’ అని మోదీ అన్నారు. పటేల్ ఈ దేశాన్ని సమైక్యపరచకపోతే జునాగఢ్‌లో సింహాలను చూడ్డానికి, గుజరాత్‌లోని సోమ నాథ్ దేవాలయంలో ప్రార్ధించుకోవడానికి, హైదరాబాద్‌లో చార్మినార్ చూడటానికి వీసాలు తీసు కోవాల్సి వచ్చేదని ఆయన ప్రజలకు గుర్తుచేశారు. సర్దార్ పటేల్ విషయంలో బీజేపీకి ఉన్న అభిప్రాయాలు, వాటి వెనకున్న కారణాలు ఎవరికీ తెలియనివి కాదు. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ కాలం నుంచే ఈ అభిప్రాయాలున్నాయి. అయిదేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్న సభలో నరేంద్రమోదీ మాట్లాడుతూ పటేల్ తొలి ప్రధాని అయివుంటే ఈ దేశ ముఖచిత్రం మరోలా ఉండేదంటూ వ్యాఖ్యానించినప్పుడు దానిపై పెద్ద దుమారమే లేచింది. అంతేకాదు...దేశానికి ఇప్పుడు కావలసింది ‘పటేల్ తరహా సెక్యులరిజం’ తప్ప ‘ఓటు బ్యాంకు సెక్యులరిజం’ కాదని కూడా అప్పట్లో ఆయన చెప్పారు. ఈ బాణాలు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను, కాంగ్రెస్‌ను ఉద్దేశించినవేనని ఎవరికైనా అర్ధమవుతుంది. నెహ్రు గురించి బీజేపీకి లేదా మోదీకి మాత్రమే కాదు...వేరేవారికి కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి. నెహ్రూ కేబినెట్లో పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆ రోజుల్లోనే నెహ్రూ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆయన బదులు పటేల్ ప్రధాని అయివుంటే బాగుండేదని అన్నారని ఆజాద్‌కు కార్యదర్శిగా పనిచేసి, అనంతరకాలంలో కేంద్ర విద్యామంత్రిగా ఉన్న హుమాయూన్ కబీర్ ఒక సందర్భంలో చెప్పారు. నిజానికి పటేల్ భావ జాలానికీ, ఆజాద్ భావజాలానికీ ఏమాత్రం పొసగదు. లౌకికవాదిగా ఆయన జవహర్లాల్ నెహ్రూకే సన్నిహితుడు. పటేల్ ప్రవచించిన స్వేచ్ఛా వ్యాపార విధానాలను నెహ్రూతోపాటు వ్యతిరేకించినవాడు. స్వాతంత్య్రోద్యమానికి సారధ్యంవహించి, అనంతరకాలంలో దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుల్లో ఇలా విరుద్ధ భావజాలాలు, అవగాహనలు ఉండేవి. అందులో అసహజమూ లేదు. వైపరీత్యమూ లేదు. అందరి ఉమ్మడి లక్ష్యమూ సమున్నతమైన, పటిష్టమైన నవభారత నిర్మాణమే. వారంతా పదహారణాల దేశభక్తులు. కశ్మీర్ విషయంలో, విభ జన సమయంలో పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన రూ. 64 కోట్ల పరిహారం విషయంలో, అలీనో ద్యమంవైపు మొగ్గుచూపడంలో, చైనాతో చెలిమి విషయంలో వారిమధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే తప్ప అభిప్రాయభేదాలు కాదు. భారత్‌లో విలీనమయ్యేదిలేదన్న పలు సంస్థానాలను దారికి తేవడంలో పటేల్ పాత్ర ఎనలేనిది. చివరివరకూ మొండికేసిన హైదరాబాద్, జునాగఢ్ సంస్థానా ధీశులపై బలప్రయోగానికి పూనుకున్నారు. అయితే నరేంద్రమోదీ, బీజేపీ సర్దార్ పటేల్ పేరెత్తినప్పుడల్లా ఆయన తమవాడని తరచు భుజాలు తడుముకుంటున్న కాంగ్రెస్‌ను గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు...సామ్యవాద, లౌకిక భారత్‌ను నిర్మించడానికి నెహ్రూ చేసిన ఎనలేని కృషి దాచేస్తే దాగనివి. అలాగని అదే స్వాతంత్య్రోద్యమంలో ఆయనతో సమానంగా పాలు పంచు కున్న షహీద్ భగత్‌సింగ్, నేతాజీ సుభాస్‌చంద్ర బోస్, ఆజాద్, సర్దార్ పటేల్, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల కృషిని తక్కువ చేసి చూడటం లేదా విస్మరించటం క్షమిం చరాని నేరం. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ నాయకుల పట్ల అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారి వర్ధంతులూ, జయంతులనాడైనా వారి కృషిని ఘనంగా స్మరించుకోవాలని, ఈ దేశ నిర్మాణానికి వారు దోహ దపడ్డ తీరును చాటిచెప్పాలని ఆ పార్టీ, దాని నేతృత్వంలోని ప్రభుత్వాలూ ఏనాడూ అనుకోలేదు. మొక్కుబడి నివాళులతో సరిపెట్టడమే రివాజైంది. కనీసం 2009లో బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీని రంగంలోకి దింపి, ఆయన్ను ‘అభినవ సర్దార్’గా అభివర్ణించడం మొదలుపెట్టా కైనా కాంగ్రెస్ మేల్కొనలేదు. ఎప్పటినుంచో తనకలవాటైన విధానాలనే కొనసాగించింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగప్రవేశం చేసి, పిడుగులు కురిపిం చడం మొదలెట్టాక పటేల్ చరిత్రను, ఇతర నాయకుల చరిత్రను పఠించడం ప్రారంభించింది. ఇటు బీజేపీ కూడా సర్దార్ పటేల్‌కు ప్రాముఖ్యం ఇస్తూనే చరిత్రలో నెహ్రు స్థానాన్ని తక్కువ చేసి చూపడానికి వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరకంగా ఆ పార్టీ కాంగ్రెస్ ఇంతక్రితం చేసిన తప్పునే మరో పద్ధతిలో చేస్తోంది. గత పాలకులు విస్మరించిన స్వాతంత్య్రోద్యమ సారథు లను, వారి కృషిని వెలికితీయాల్సిందే. దాన్నెవరూ కాదనరు. కానీ అందుకోసం నెహ్రూ వంటి శిఖరసమానుల పాత్రను తగ్గించి చూపనవసరం లేదు. నరేంద్రమోదీ బుధవారం ప్రతిష్టించిన ‘ఐక్యతా ప్రతిమ’ 597 అడుగులతో ఇప్పటికైతే ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం. ఈ ప్రతిమ కాలావధుల్ని దాటి ఐక్యతా పరిమళాలు వెదజల్లాలంటే... జన హృదయాల ఐక్యతకు అది స్ఫూర్తి నీయాలంటే ఆ దిశగా ప్రభుత్వాల కార్యాచరణ ముఖ్యం. -
ఉక్కుమనిషి విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని
-
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
-
కలిసి ఉండాలనే సందేశమే ఈ విగ్రహం : మోదీ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగం.. ‘ఈ ఏడాది సర్దార్ పటేల్ జయంతి మరింత ప్రత్యేకమైనది. 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో ఈ రోజు ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. భూమి పుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ, స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. సర్దార్ పటేల్ కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహా విగ్రహాన్ని వాస్తవ రూపంలోకి తేవడానికి రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసిన వారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహా విగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐకమత్యానికి, మన మాతృ భూమి భౌగోళిక సమగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ఐక్యతా విగ్రహం సంకేతంగా నిలుస్తోంది. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ.. అదే కలిసి వుంటే ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చుననే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగమించగలం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఆధునిక భారతదేశ నిర్మాత, మహోన్నత ఐక్యతావాదికి ప్రత్యేక నివాళి. 1947 సంవత్సరాన్ని తీసుకుంటే.. ఈ ఏడాది మొదటి అర్ధభాగం భారతదేశ చరిత్రలోనే కీలక సమయం. వలస పాలన తప్పనిసరి పరిస్థితుల్లో ముగియనున్న సమయమది. అంతే కాదు భారతదేశ విభజన కూడా తప్పనిసరి అయింది. అయితే అంతుపట్టని విషయమేమిటంటే భారతదేశం నుంచి విడిపోయే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయేమోననేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార కొరత సర్వసాధారణమైంది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగించిన విషయం భారతదేశ ఐక్యత ప్రమాదంలో పడడం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నూతన ప్రస్థానం మొదలైంది. కానీ ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే వుండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు సర్దార్ పటేల్. ఆ వెంటనే ఆయన పరిపాలనాపరమైన నియమ నిబంధనల తయారీకి ఒక వేదికను రూపొందించారు. రాష్ట్రాల వ్యవహారాలను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్ మెంట్) ఏర్పడింది. నాటికి దేశంలో గల 550 సంస్థానాలతో సంప్రదింపులు చేయడమే ఈ విభాగం ముఖ్యమైన పని. పరిమాణం, జనాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి పరంగా చూసినప్పుడు ఈ సంస్థానాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. సర్దార్ పటేల్ తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని ఎంతో ఖచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారు. సమయం చాలా తక్కువ. చేయాల్సిన పని బ్రహ్మాండమైనది. కానీ ఆ పనిని చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన సర్దార్ పటేల్. భారతదేశం సమున్నతంగా నిలబడాలన్న ఆకాంక్షతో పని చేశారు. ఒకదాని తర్వాత మరొకటి...అప్పటికి వున్న అన్నిసంస్థానాలతో సర్దార్, ఆయన బృంద సభ్యులు సంప్రదింపులు జరిపి...అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారు.సర్దార్ పటేల్ అవిశ్రాంతంగా పని చేయడంవల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోంది.’ అని ప్రధాని ప్రసంగించారు. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే పొడవు.. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. 30 పవిత్ర నదీ జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఐక్యతా విగ్రహం విశేషాలు.. విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2979 కోట్లు విగ్రహం ఎత్తు : 597 అడుగులు (82 మీటర్లు) మొత్తం మెటీరియల్ : 3550 టన్నుల ఇత్తడి, 18 వేల టన్నుల రీ ఇన్ఫోర్స్డ్ స్టీల్ ,6 వేల స్ట్రక్చరల్ స్టీల్, 2 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. 250 మంది ఇంజనీర్లు.. 3400 మంది వర్కర్లు 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు. 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు. -
పటేల్ మహా విగ్రహానికి నిరసన సెగ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో గిరిజన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారన్న అనుమానంతో నర్మదా జిల్లాలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. భిలిస్తాన్ టైగర్ సేన(బీటీఎస్) జిల్లా అధ్యక్షుడు మహేశ్ గాగుభాయ్, ఉపాధ్యక్షుడు మహేంద్ర వాసవతో పాటు మరో రెండు సంఘాలకు చెందిన సభ్యులు అరెస్టైన వారిలో ఉన్నారు. గాంధీయవాది చునీ వైద్య కుమార్తెలు నీతా విరోధి, మోదితా విరోధిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా ఆందోళనలకు జనాన్ని పోగు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) చెందిన ఝగదియా ఎమ్మెల్యే చోటూభాయ్ వాసవ కుమారుడు మహేశ్ వాసవ 2017లో బీటీఎస్‌ను స్థాపించారు. అత్యంత ఎత్తైన పటేట్ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాపీ జిల్లాలోని య్యరా ప్రాంతానికి చెందిన 10 మంది శిరోముండనం చేయించుకుని మద్దతు తెలిపారు. విగ్రహంతో ఒరిగేదేంటి? ‘సర్దార్ పటేల్‌కు మేము వ్యతిరేకం కాదు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం. గుజరాత్లో గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాసింది. రాజ్యాంగంలోని 244(1) ఆర్టికల్‌ను ప్రభుత్వం అమలు చేయాలన్న మా ప్రధాన డిమాండ్. దీన్ని అమలు చేసిన తర్వాత పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోండి. ‘ఐక్యతా విగ్రహం’తో గిరిజనులకు ఏవిధంగా మేలు జరుగుతుంది? గిరిజనుల సమస్యలపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. గిరిజనుల హక్కుల సాధన కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం. ఫలితంగా ఎంతో మంది గిరిజనుల మద్దతు పొందగలిగామ’ని చోటూభాయ్ వాసవ పేర్కొన్నారు. తన కుమారుడు మహేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనాజీ గమిత్, ఆనంద్ చౌదరితో కలిసి సూరత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీకి బహిరంగ లేఖ కాగా, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ నర్మదా సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుతో సహజ వనరులను నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై 22 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు సంతకాలు చేశారు. స్థానిక గిరిజన నాయకులు కూడా ఐక్యతా విగ్రహావిష్కరణను వ్యతిరేకించారు. ‘ఈ రోజును బ్లాక్ డే పాటించాలని గిరిజనులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలోని గిరిజనులు ఈరోజు నిరహారదీక్ష చేయనున్నారు. మా ఆందోళన ఒక్కరోజుతో ఆగదు. మరిన్ని రోజుల పాటు పోరాటం కొనసాగిస్తాం. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి సమస్యలపై కూడా ఆందోళన కొసాగుతుంద’ని చోటూభాయ్ స్పష్టం చేశారు. -
భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక
న్యూఢిల్లీ: ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం) కేవలం సర్దార్ వల్లభ్‌భాయ్‌కి మాత్రమే ఘన నివాళే అని కాకుండా భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకూ గొప్ప ప్రతీక అని నిర్మాణరంగ దిగ్గజం ఎల్అండ్టీ పేర్కొంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన చైనా స్ప్రింగ్ దేవాలయాల్లో ఉన్న బుద్ధ విగ్రహం (153 మీ.) నిర్మాణానికి 11 ఏళ్లు పడితే..ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ ఎల్అండ్టీ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని కేవలం 33 నెలల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించింది. విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీ.) కంటే ఇది రెట్టింపు ఎత్తు ఉంటుంది. రూ.2,989 కోట్లతో నిర్మితమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని అక్టోబర్ 31న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ స్టాట్యూను 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్లో 149 మీ. విగ్రహమే ఉంటుంది. మూడో జోన్లో 153 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్లో పటేల్ భుజాలు, తల ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు.