పటేల్ విగ్రహం, శిలాపలకం
సాక్షి, చెన్నై : అత్యంత ప్రతిష్టాత్మకంగా నర్మదా నదీ తీరంలో ప్రతిష్టించిన ఉక్కుమనిషి విగ్రహం శిలా ఫలకంలో తమిళంకు అవకాశం దక్కినా, అక్షర దోషాలు, అర్థాన్నే మార్చేస్తూ ఖూనీచేసేలా ఉండడం తమిళనాట చర్చకు దారితీసింది. అయితే, అందులో తెలుగుకు అవకాశం కల్పించక పోవడంపై జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేలకు గుజరాత్‌లో భారీ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. నర్మదా నదీ తీరంలో 182 మీటర్లతో బ్రహ్మాండంగా ప్రతిష్టించిన నిలువెత్తు విగ్రహాన్ని బుధవారం మోదీ ఆవిష్కరించారు. ఇందులోని శిలాఫలకంలో తమిళానికి చోటు కల్పించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. పలు భాషల్లో ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్న నామకరణంతో నినాదాన్ని పొందుపరిచారు. అయితే, తమిళంలో ఒట్ట్రుమై శిలై అని పొందుపరచాల్సి ఉండగా, స్టేట్టుక్కో ఒప్పి యూనిటి అని ముద్రించడం విమర్శలకు దారితీసింది. అక్షర దోషం పక్కన పెడితే, అర్థమే మార్చేస్తూ, తమిళంను ఖూనీ చేశారన్న చర్చ తమిళనాట ఊపందుకుంది. కొన్ని తమిళ మీడియాల్లో వార్త కథనాలు తెర మీదకు వచ్చాయి. ఇక, తమిళం ఖూనీ చేస్తూ అక్షరాలను పొందుపరచడంపై విమర్శలు బయలుదేరినా, ఆ శిలాఫలకంలో తెలుగుకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తమిళ అక్షర దోషాలు, తమిళంకు శిలా ఫలకంలో చోటు కల్పించినట్టుగా వచ్చిన సమాచారాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించడం గమనార్హం. కాగా, అక్షర దోషాలను అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లగా, ఆగమేఘాల మీద తొలగించారని వాదించే తమిళులూ ఉన్నారు.
తెలుగుకు అవమానం
జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ఓ ప్రకటనలో పేర్కొంటూ, 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్యభారతాన్ని నిర్మించి, స్వతంత్ర భారతావని రూప శిల్పి పటేల్ అని కొనియాడారు. ఆయనకు 182 మీటర్ల ఎత్తులో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.అయితే, దేశంలో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాషకు ఆ శిలాఫలకంలో స్థానం కల్పించకపోవడం వేదన కల్గిస్తోందన్నారు. ఇది యావత్ తెలుగు వారికి తీరని అవమానం అని ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment