Telugu language
-
నిజంగా హర్షణీయం!
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. దాని పర్యవసానాల్లో ఒకటి, బయటికి వెళ్లే పనిలేకుండా చేయగలిగే పనుల గురించి ఆలోచించడం. అలాంటి ఒక కారణంతో మొదలైన ‘హర్షణీయం’ తెలుగు పాడ్‌కాస్ట్, సమస్త సాహిత్య ప్రపంచాన్ని తెలుగు గడపలోకి తెచ్చిపెట్టింది. అంతేనా? అనువాద ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే ఏ భాషవారికైనా ఒక ఆన్ లైన్ నిధిగా రూపొందింది. 2020 మార్చ్‌లో ముందు తెలుగులో ప్రారంభమై, తర్వాత తెలుగు– ఆంగ్లంగా మారి, అటుపై ఆంగ్లంలోకి కూడా వ్యాపించిన ఈ పాడ్‌కాస్ట్ ‘నూరు మంది అనువాదకుల’ సిరీస్‌ను ఇటీవలే ముగించుకుంది. ఇందులో మలయాళం, తమిళం, కన్నడం, గుజరాతీ లాంటి భారతీయ భాషల్లోంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నవారితో పాటు– థాయి, ఉజ్బెక్, వియత్నమీస్, హంగేరియన్, తుర్కిష్, నార్వేజియన్, మంగోలియన్, కిస్వాహిలీ లాంటి భాషల ఆంగ్లానువాదకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. దోస్తోవ్స్కీ ఉపరితల అంశాల మీద సమయం వృథా చేయరని చెబుతారు, గతేడాదే ‘బ్రదర్స్ కరమజోవ్’కు మరో ఆంగ్లానువాదం వెలువరించిన మైకేల్ ఆర్. కట్జ్. మనిషిని మలిచే కీలక క్షణాలు, విశ్వాసం, నైతికత, హింస, తీవ్రోద్వేగాల మీద దోస్తోవ్స్కీ దృష్టి ఉంటుందని అంటారు. పంతొమ్మిదో శతాబ్దపు రష్యన్ సాహిత్యాన్ని బోధించే మైకేల్ సుమారు 20 రష్యా నవలల్ని అనువదించారు. దోస్తోవ్స్కీ ‘నోట్స్ ఫ్రమ్ అండర్‌గ్రౌండ్’లోని తొలి 30 పేజీలు అనువాదానికి అసలు లొంగనివని ఆయన అభిప్రాయం. ఒక పుస్తకం పుట్టించే తక్షణ స్పందనే దాన్ని అనువాదానికి పూనుకునేలా చేస్తుందని చెబుతారు అరుణవ సిన్హా. పదహారేళ్ల కాలంలో సుమారు 80 పుస్తకాల్ని బంగ్లా నుంచి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. సగటున ఏడాదికి ఐదు పుస్తకాలు! ఒక దానిలో దిగితే అందులో మునిగిపోవడమే ఇంత వేగంగా అనువదించడానికి కారణమంటారు. ఫుట్‌నోట్ ఇవ్వాల్సి రావడాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు హిందీ, ఉర్దూ నుంచి అనువాదాలు చేసే అమెరికన్ డైసీ రాక్వెల్. భాషల మీద ప్రేమతో ఆమె దాదాపు పదిహేను భాషలు నేర్చుకున్నారు. ఇంకా, కరీమ్ అబ్దుల్ రహమాన్ (కుర్దిష్), జెస్సికా కోహెన్ (హీబ్రూ), లోలా రోజర్స్ (ఫిన్నిష్) లాంటివాళ్లు ఈ పాడ్‌కాస్ట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. అనువాద క్రాఫ్ట్తో పాటు మొత్తంగా అనువాద ఎకో సిస్టమ్ గురించి ఇంత విస్తారంగా ఒకేచోట మాట్లాడిన పాడ్‌కాస్ట్ ప్రపంచంలో ఇంకోటి లేదని ఐస్లాండిక్ అనువాదకురాలు విక్టోరియా క్రిబ్ కితాబునివ్వడం హర్షణీయం అందుకున్న ప్రశంసల్లో ఒకానొకటి.మూడు దశాబ్దాలుగా స్నేహితులైన ఇంజినీరింగ్ క్లాస్మేట్లు హర్ష, అనిల్, గిరి ఉద్యోగాలు చేస్తూనే, పాఠకులుగా తమ అభిరుచితో ‘హర్షణీయం’ మొదలుపెట్టారు. ఇందులో హర్ష కథకుడు, అనిల్ అనువాదకుడు, గిరి సాంకేతిక నిపుణుడు. వక్తలను ఎంచుకోవడం, ప్రశ్నలు కూర్చుకోవడం ముగ్గురూ కలిసి చేస్తారు. ఎడిటింగ్ బాధ్యత కుదిరినవాళ్లు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు మాత్రం అనిల్ చేస్తారు. సాహితీవేత్తలను ఇంటర్వ్యూలు చేయడంలో ప్రొఫెసర్ మృణాళిని ‘అక్షర యాత్ర’ తమకు స్ఫూర్తి అంటారు. ముందు తెలుగు రచయితల సంభాషణలతో మొదలుపెట్టి, తర్వాత ఇరవై నాలుగు రాష్ట్రాల్లోని పర్యావరణవేత్తల అభిప్రాయాలకు వేదికై, బిభూతీభూషణ్ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవలను యాభై వారాలు ఆడియోగా ఇచ్చి, తర్వాత అనువాదకుల వైపు మళ్లారు. లోప్రొఫైల్‌లో ఉండే అనువాదకుల మెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ సంపాదించడం, వాళ్లకు తమ వివరాలు చెబుతూ సందేశాలు పంపడం, ఒక్కోసారి ఎనిమిది నెలల తర్వాత కుదురుతుందని చెబితే వేచివుండి(ఉదా: మైకేల్ కట్జ్) మళ్లీ సంప్రదించడం, ప్రశ్నలు ముందే పంపడం, విదేశీయుల సమయాన్ని బట్టి రాత్రుళ్లు మాట్లాడటం, వివాదాల జోలికి పోకుండా పుస్తకాల మీదే ఫోకస్ పెట్టడం వీళ్ల పనితీరు. ఎక్కువ అనువాదాలు జరిగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ అనువాదకులు కూడా సహజంగానే ఈ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకున్నారు. ‘ది హర్షణీయం పాడ్‌కాస్ట్ అండ్ ఇట్స్ ఇటాలియన్ లిటరేచర్ ఇన్ ట్రాన్ ్సలేషన్ ’ పేరుతో ‘ద గ్లోబల్ లిటరేచర్ ఇన్ లైబ్రరీస్ ఇనీషియేటివ్’ 2024 నవంబర్‌లో వీళ్ల పాడ్కాస్ట్ట్ను ప్రస్తావించడం విశేషం. కొన్నింటికి కాలం కూడా కలిసిరావాలి. ఇంకో కాలంలో అయితే ఇలాంటిది జరిగే అవకాశం లేదు. కొన్ని మెయిల్స్‌తో, ఒక్క ఫోన్‌కాల్‌తో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో సంభాషించడం ఎలా సాధ్యం? కాని కలిసొచ్చే కాలంలో కూడా ఎంతమంది ఇలాంటి పనికి పూనుకున్నారు? అందుకే వీళ్ల పని హర్షణీయం.తెలుగు భాషలోని 56 అక్షరాలన్ని దేశాల వారితోనైనా మాట్లాడాలని సరదాగా వీళ్లు పెట్టుకున్న లక్ష్యం నెరవేరింది. అనువాదకుల సిరీస్‌లో భాగంగా, గతేడాది ప్రతిష్ఠాత్మక బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లాంగ్‌లిస్ట్‌లోని పదముగ్గురు అనువాదకులతోనూ సంభాషించారు. ఈ ఏడాది లాంగ్‌లిస్ట్‌లోని రిఫరెన్సుల్ని సాక్షాత్తూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ అడ్మినిస్ట్రేటర్ ఫియమెత్తా రోకో ఇచ్చి ఇంటర్వ్యూలకు సహకరించడం వీళ్ల విశ్వసనీయతకు చిహ్నం. ఈ సంభాషణలు ఈ ఏప్రిల్‌లోనే ప్రసారం అవుతాయి. అక్కడివాళ్లను ఇక్కడికి తెస్తున్నారు సరే, తెలుగువాళ్లు అటుపోయే మార్గమేమిటి? ‘తెలుగులో గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ముందు ఆంగ్లంలోకి అనువాదం కావడం; ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ప్రచురితం కావడం అతిపెద్ద సవాలు. దానికి నాణ్యమైన అనువాదకులతో పాటు నిబద్ధత ఉన్న ప్రచురణకర్తలు అవసరం’ అని చెబుతారు అనిల్. తెలుగు సాహిత్యంలో ఆ వాతావరణం క్రమంగా చోటుచేసుకుంటోందనీ, రెండేళ్లలో సానుకూల మార్పు చూడబోతున్నామనీ అంటారు. ఇది ఇంకోరకంగా హర్షణీయం. -
నూరేళ్ల గ్రంథాలయం
పాల్వంచ సంస్థానంలో కుక్కునూరులో ఉన్న ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం (1925 మార్చి 25) గోదావరి తీరంలో ఉన్న ‘అమరవరం’లో ‘గౌతమి ఆశ్రమం’తో పాటు ఈ గ్రంథాలయాన్నీ, ఒక పత్రికా పఠన మందిరాన్ని, ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అమరవర వాస్తవ్యులు, ఆంధ్ర భాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి బహూకరించారు. వీటితో పాటు రెండు చెక్క బీరువాలు, బెంచీలు, బల్లలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు తమ పత్రికలను ఈ గ్రంథాలయానికి అందించడంతో పాటు దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు. అందుకే ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ అని దీనికి పేరుపెట్టారు. తరువాత ఈ గ్రంథాలయాన్ని కుక్కునూరుకు మార్చారు. గ్రంథాలయంలోని పత్రిక పఠన మందిరంలో ‘ఆంధ్ర పత్రిక, భారతి, నీలగిరి, తెలుగు, ఆంధ్ర రంpని, జన్మ భూమి, త్రిలింVýæ, సుజ్ఞాన చంద్రిక, బ్రహ్మానందిని, ఆంధ్ర అభ్యుదయం, శ్రీ శారద ధన్వంతరి, కృష్ణా పత్రిక’ వంటివి... కోటగిరి వెంకట అప్పారావు, మాజేటి రామచంద్ర రావు తదితరుల సహాయ సహకారాలతో గ్రంథాలయానికి వచ్చేవి. దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, పోతన జయంతి, శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ‘గ్రంథాలయ యాత్ర’ చేపట్టి విరాళాలు సేకరించి గ్రంథాలయం ఉన్నతికి కృషి చేశారు. 1960-70 కాలం వరకు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించు కున్నారు. 1970 తరువాత అనుకున్నంత స్థాయిలో ఈ గ్రంథాలయం తన ప్రతిభను కనపరచలేకపోయింది, కారణం ఆర్థిక వన రులూ, మానవ వనరుల కొరత, నాటి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవడం వంటి కారణాలతో 1980–85 మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయంలో విలీనం చేశారు. అప్పటికే ఆ గ్రంథాలయంలో ఉన్న చాలా విలువైన గ్రంథ సంపద అంతరించి పోయింది. – డా. రవి కుమార్ చేగొనితెలంగాణ గ్రంథాలయ సంఘం కార్యదర్శి(నేటితో దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయానికి వందేళ్లు) -
తెలుగులోనూ కుంభమేళా సమాచారం
రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్‌లో 88878–47135 ఫోన్ నంబర్‌కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. భక్తుని ఫోన్ నంబర్ ‘కుంభ్ సహాయక్ యాప్’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. -
సంగీతఝురిలా.. తెలుగు భాష
వన్‌టౌన్ (విజయవాడపశ్చిమ): తెలుగు భాష వినసొంపైనదే కాకుండా.. సంగీతంలా మనసులను పరవశింపజేస్తుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మహాసభలను ప్రారంభించి మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. జాతి మనుగడకు, వికాసానికి భాష ప్రధానమైన పాత్ర పోషిస్తుందని, తెలుగు భాష సంగీతంలా మనసుకు హత్తుకుంటుందని చెప్పారశ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సీ నారాయణరెడ్డి వంటి గొప్ప కవులు రచయితలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భానుమతి వంటి నటులు, మంగళంపల్లి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి తెలుగు దిగ్గజాల గొప్ప వారసత్వం మనదన్నారు. తెలుగు భాషా వికాసానికి అడ్డంకిగా ఉన్న జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు వారిలో అద్భుత ప్రతిభ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగువారు అద్భుతమైన ప్రతిభను కనబరిచి సమాజానికి స్ఫూర్తినిచ్చారని భారత రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. సాహితీవేత్త పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నూతన సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకుని తెలుగు రచనలను మరింత విస్తృతం చేసుకోవాలని సూచించారు. హోసూరు (తమిళనాడు) ఎంపీ కే గోపీనాథ్ మాట్లాడుతూ తెలుగు భాష పరిపుష్టికి తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ మాట్లాడారు. తొలుత ‘మార్పు’ పేరుతో ముద్రించిన మహాసభల సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. -
తెలుగు వారిని తక్కువ చేసినట్లే హిందీతో పోల్చి చూడకూడదు : రాహుల్
వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్‌సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది. ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు. -
'అమ్మ భాష'కు.. పాప్ అప్!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి ప్రాణం పోస్తుంది అమ్మ. ఆ బిడ్డకు తొలిగురువు అమ్మే అవుతుంది.. చిట్టి పలుకులు... బుజ్జి మాటలు నేర్పిస్తుంది.. అందుకే మనం మాట్లాడే భాషను అమ్మ భాషగా పరిగణిస్తాం... అదే ఒక భాషకు లిపి కావాలంటే వందల ఏళ్లు పడుతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఆమె జన్మ పరిపూర్ణమైనట్టు.. ఒక భాషకు లిపి రూపుదిద్దుకుంటేనే ఆ భాషకు పరిపూర్ణత వస్తుంది.అలా లిపి ఉన్న మన తెలుగు భాషకు, లిపికి వేల ఏళ్ల చరిత్ర ఉంది.. మానవుడు ఎన్నో మార్పులకు లోనైనట్టే.. మన తెలుగు లిపిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలక్రమంలో కొన్ని అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికే కొన్ని అక్షరాలు వాడుకలో లేవు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న అక్షరాల్లో తెలుగు లిపి ముందు వరుసలో ఉంది. దీనికి కారణాలు అనేకం. ఆ విశేషాలు తెలుసుకుందాం..తెలుగు లిపికి ప్రాణం పోస్తున్న ఆర్కిటెక్ట్..ప్రమాదంలో ఉన్న తెలుగు లిపిని బతికించుకునేందుకు ఇప్పటికే అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరే శశి గూడూరు. తెలుగు లిపిని పిల్లలతో పాటు భవిష్యత్తు తరాలకు గుర్తుండి పోయేలా ప్రయత్నిస్తున్నారు ఆయన. అందుకోసం వినూత్నంగా అచ్చులు, హల్లులతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ముఖ్యంగా పుస్తకం తెరవగానే అక్షరాలు త్రీడీ రూపంలో పాప్–అప్ అయ్యేలా తయారు చేశారు.చెరగని ముద్ర వేసేలా.. టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరుకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. మాతృభాషపై ఆయనకున్న మమకారంతో కళాక్షరిక అనే పుస్తకాన్ని రూపొందించారు. డిజైనింగ్‌లో ఆయనకున్న నైపుణ్యం మొత్తాన్ని రంగరించి దీన్ని తీసుకొచ్చారు. ‘క’అక్షరం నుంచి ‘క్ష’వరకూ తెలుగు హల్లులు పుస్తకం తెరవగానే పాప్–అప్ అవుతాయి. తెలుగులో ఇలాంటి పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఆ సందేశమే ప్రేరణ... ఆన్లైన్లో ఒక త్రీడీ కార్డు దొరికిందని, అందులో గుర్రం బొమ్మ ముందుకు దూసుకొస్తున్నట్టు ఉందని, అప్పుడే ఈ పుస్తకం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని వివరించారు. ఇంగ్లి‹Ùలో ఇలాంటి ప్రయోగాలు చేశారని, అందుకే తెలుగులోనూ ఇలా ఎందుకు తయారు చేయకూడదనే సంకల్పంతో ఈ బుక్‌ను తీసుకొచ్చానని చెప్పారు.ముఖ్యంగా ‘ఱ’అక్షరం వాడకం పూర్తిగా తగ్గిపోయిందని, ఆ అక్షరాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశానని, పుస్తకం తెరవగానే మళ్లీ ఉద్భవిస్తున్నట్టు రూపకల్పన చేశానని శశి చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబేలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసే సమయంలో తెలుగుపై ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలుగు అక్షరాలు చిన్నపిల్లలతో పాటు, పెద్ద వారి మనసులోనూ చెరగని ముద్ర వేయాలన్న కోరికతోనే పాప్–అప్ పుస్తకాన్ని రూపొందించారు.తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవి... తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శశి గూడూరు చెప్పారు. తెలుగులో పలు రకాల ఫాంట్లు డిజైన్ చేశారు. అనేక డిజైన్లు రూపొందించారు. అచ్చుల్లో బొమ్మలు ప్రతిబింబించేలా శశి తయారు చేసిన పుస్తకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. యువతలో తెలుగుపై క్రేజ్ పెరిగేందుకు టీషర్టులపై తెలుగులో అక్షరాలను వినూత్నంగా డిజైన్ చేసి ప్రింట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగులపై కూడా ఆలోచనాత్మకంగా డిజైన్లు రూపొందించి, అవగాహన కల్పిస్తున్నారు.పలు లోగోల రూపకల్పన..తెలుగు భాష పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న శశి గూడూరు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తన సేవలందించారు. టీ–శాట్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ పర్యాటక శాఖ లోగోలను శశి గూడూరు రూపొందించారు. అలాగే తెలుగులో ఐదు రకాల ఫాంట్లను తయారు చేశారు. తనకు చేతనైనంతగా తెలుగుకు సేవ చేస్తున్నానని, భవిష్యత్తులో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని శశి గూడూరు చెబుతున్నారు. -
దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు!
సాక్షి: "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది.కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం. ఎంత ఎంత ఎడమైతే... అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు,తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం. మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు. మూడు భారతీయ భాషల విశేషం.. తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు,అని ఎందరెందరో కీర్తించారు. మిగిలిన భాషలను గౌరవిస్తూనే,మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.సర్వమత సహనం వలె,సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి, 10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి. ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్,స్పానిష్,జర్మన్, ఫ్రెంచ్,అరబిక్,రష్యన్,పోర్చుగీస్, జపనీస్,హిందీ,ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి. భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. జనని సంస్కృతంబు సకల భాషలకు.. "జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు. ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో,రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది. భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది. విద్యా బోధనలో, ఉద్యోగ, ఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం. ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. తల్లిభాష తల్లిపాల వంటిది.. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. వ్యాకరణం లేకపోతే పునాదిలేని భవనంలా భాషలు దెబ్బతింటాయి. నిన్నటి వరకూ మైసూర్లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు. వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత. - మాశర్మ -
తూర్పు తీరంలో వెల్లివిరిసిన ‘ తెలుగు రేఖలు’
ప్రపంచానికి తూర్పు వైపున ఉన్న ఆస్ట్రేలియాలో వైభవోపేతంగా తెలుగు వెలుగులీనుతోంది. ఆరు దశాబ్దాలుగా ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలుగు భాషా,సాహిత్యాలను, తెలుగు వారి అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన వారు ఎందరో ప్రముఖులు తమ మేధాసంపత్తితో, ప్రతిభాపాటవాలతో ఆస్ట్రేలియా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. విశ్వవిపణిపైన తెలుగు కీర్తి బావుటాను ఎగురవేస్తున్నారు.సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఎన్నో కష్టాలను,బాధలను అనుభవించారు. కానీ ఆ ఆరవై ఏళ్లల్లో వందలు, వేలు,లక్షలుగా తెలుగు వారి ప్రస్తానం సాగింది. ఆస్ట్రేలియాదేశంలోనే మన భాషకు ఒక సామాజిక గుర్తింపు, హోదా లభించాయి. ఈ 60 ఏళ్ల పరిణామాలపైన ప్రముఖ రచయిత, మెల్బోర్న్లో నివసిస్తున్న కొంచాడ మల్లికేశ్వరరావు రచించిన అద్భుతమైన పుస్తకం ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. మొదటి తరం అనుభవించిన కష్టాలను మొదలుకొని నేటి తరం చేరుకున్న ఉన్నతమైన విజయ శిఖరాల వరకు సమగ్రంగా చర్చించింది. మల్లికేశ్వరరావు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో తెలుగుభాష అభివృద్ధి కోసం విశేషకృషి చేస్తున్నారు. భువనవిజయం వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి నాటకాలను, కవిసమ్మేళనాలను, సాహిత్య చర్చలను నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు భాష గుర్తింపు కోసం ఆస్ట్రేలియా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అక్కడి తెలుగు సంఘాలతో కలిసి పని చేశారు. తెలుగు భాషాసంస్కృతులను ప్రాణప్రదంగా భావించే ఆయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ల తెలుగు వసంతాల ప్రస్తానం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం. అంతేకాదు. ఆస్ట్రేలియాకు వెళ్లే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుంది. -
బ్రిటిష్ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇచ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..! మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ అండ్ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
సీబీఎస్ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి. -
తెలుగు వారు ఎంతో ప్రేమను చూపించారు: రెబ్బా మోనికాజాన్
‘‘సామజవర గమన’ సినిమా సక్సెస్ టూర్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వెళ్లాం. నాకు తెలుగు భాష రాకపోయినా అక్కడి ప్రజలు నా పట్ల ఎంతో ప్రేమ,ఆప్యాయతను చూపించారు.అలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను’’ అని రెబ్బా మోనికాజాన్ అన్నారు. శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన రెబ్బా మోనికాజాన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయ్యాక కొన్ని యాడ్స్ చేశాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. దక్షిణాదిలో నేను ఇతర చిత్రాల్లో నటించినా ‘సామజవరగమన’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా తర్వాతి సినిమాకి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతాను’’ అన్నారు. -
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి తెలుగులో తొలి తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలిసారి ఓ తీర్పు తెలుగు భాషలో వెలువడింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్ మచ్చ బొల్లారంలోని ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును తెలుగులో ఇచ్చింది. ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బాహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు. ఇదిలాఉండగా, దేశంలో ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి స్థానిక భాషలో తీర్పునిచ్చింది. కేసు ఇదీ.. మచ్చబొల్లారంలో సర్వే నంబర్ 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 ఎకరాల భూమి ఉండేది. వీరారెడ్డికి ఇద్దరు కొడుకులు. వీరారెడ్డి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరోసగం తీసుకున్నారు. 2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యుటేషన్ చేయాలని ఒక కుమారుడు కె.చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. సాలమ్మ రాసిన వీలునామాపై మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ వారసత్వ చట్టం–1956 ప్రకారం హిందూ మహిళ తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి (4.08 ఎకరాలు)ని భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం–1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మను 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు. వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. -
కన్నడ గడ్డ.. తెలుగు భాషకు అడ్డా
అనంతపురం: ప్రస్తుత కాలంలో మాతృభాషకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ పట్టణంలో కన్నడ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఒక్కరూ కన్నడతో పాటు తెలుగు మాట్లాడతారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులు, కొత్త వారితో తప్ప వ్యవహార శైలి తెలుగులోనే ఉంటుంది. తెలుగు భాషతో పాటు తెలుగు పండుగలు, సంప్రదాయాలు కూడా అనుసరిస్తారు. పావగడ చుట్టూ ఆంధ్ర సరిహద్దు ఉంటుంది. కేవలం పశ్చిమ వైపు మాత్రమే చిత్రదుర్గం వెళ్లే మార్గం ఉంటుంది. మిగతా ఎటు వెళ్లినా ఆంధ్ర టచ్ చేయాల్సిందే. ఫలితంగా వివాహ సంబంధాలన్నీ ఆంధ్ర వాళ్లతోనే ఉండటంతో తెలుగు భాష ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. జిల్లా సరిహద్దుగా.. పావగడ తాలూకా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉంది. పశ్చిమ వైపు మినహా ఎటు వెళ్లినా 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఆంధ్ర సరిహద్దు వస్తుంది. పావగడ జనాభా (2011 ప్రకారం) 30 వేలు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుమకూరు జిల్లాలోని శిరా, మధుగిరి ప్రాంతాలు సమీపంలో ఉంటాయి. అయితే ఆ ప్రాంతాలకు వెళ్లాలన్నా మధ్యలో ఆంధ్ర పల్లెలు దాటాల్సిందే. మైసూరు రాష్ట్రం నుంచి.. పాత మైసూరు రాష్ట్రంలో పావగడ అంతర్భాగం. అప్పటి నుంచి తాలూకా కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీగానూ ఉంది. పావగడ తాలూకా పరిధిలో 150 గ్రామాలు ఉన్నాయి. చారిత్రకంగానూ పావగడకు పేరుంది. శనేశ్వరాలయం ప్రసిద్ధి. చుట్టుపక్కల ప్రజలు శనేశ్వరాలయ సందర్శన కోసం భారీగా వస్తుంటారు. పావగడలో ప్రాచీన కాలంలో కట్టిన కోట (700 మీటర్ల ఎత్తులో) ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. -
విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మాతృభాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు భాషను ప్రోత్సహిస్తూనే సువిశాల ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా సిలబస్‌లో మార్పులు తెచ్చామని చెప్పారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన 30 మంది కళాకారులను, భాషాకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ‘మాతృభాషా సేవా శిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అ«ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూనే ఇతర భాషల ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. ఆంగ్లం నేర్చుకుని తెలుగును విస్మరించాలనే అభిప్రాయం సీఎంకు లేదన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. కల్లూరి భాస్కరం, డాక్టర్ విజయలక్ష్మీ పండిట్, డాక్టర్ ఓలేటి పార్వతీశం, పెరుగు రామకృష్ణ, డాక్టర్ కప్పగంతుల రామకృష్ణ, ఉపద్రష్ట రమణ, వేంపల్లి షరీఫ్, నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, గుంటూరు రామరాజు, డాక్టర్ పాములపాటి వెంకట శేషయ్య, పి.వి.గుణశేఖర్, డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, షేక్ అహ్మద్ జయా, వెంకట్ పూలబాల, వెంకటేష్ కులకర్ణి, ఎం.ఎ.రజాక్, సత్యవోలు రాంబాబు, టేకుమళ్ల వెంకటప్పయ్య, బి.అశోక్ కుమార్, కట్టెకోల చిన నరసయ్య, రమేష్ ఆడ్రికడర్ల, పొక్కులూరు సుబ్బారావు, కరణ్ శర్మ, గాజుల సత్యనారాయణ, అన్నవరపు బ్రహ్మయ్య. హర్మోహీందర్ సింగ్ సహనీ, డాక్టర్ కె.జి.ఆర్. శేషుకుమార్, డాక్టర్ కె.ఎస్. గోపాలదత్త, డాక్టర్ తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యమూర్తి ఉన్నారు. -
నిఘంటు నిర్మాణంలో కొత్త పోకడలు
మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. పాల పాకెట్టు, పాల వ్యాను– ఇలా వాడమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ఇక పత్రికల్లో సరేసరి. ఆంబులెన్స్ సేవలు, అకౌంట్ బదిలీ, కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు– ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న మిశ్రమ పదాలను వివరిస్తుంది సరికొత్త ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’. ‘‘నిఘంటు రచన మతి చెడిన వృత్తి కాదు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా, నిఘంటు నిర్మాణం జరగాలి. ‘నా బొందో’ అంటూ కేంద్రీకరించి మరీ జరగాల్సిన పని. ఇందుకు నైఘంటికుడి మనస్సు నిర్మలంగా ఉండాలి. సందేహ నివృత్తి చేయగల స్పష్టత ఉండాలి. కానీ, ఒకటి మాత్రం నిజం. అప్పుడప్పుడూ ఈ వృత్తి, నిఘంటుకారుడి బుర్ర తినేస్తుంది. నిద్రాహారాలకు నోచుకోని పని రాక్షసుడిగా మారుస్తుంది’’. – ఫ్రాన్స్ సాహిత్య చరిత్రను, ఫ్రెంచి భాషా పద వ్యుత్పత్తి శాస్త్ర నిఘంటువును రూపొందించి ‘నా నిఘంటువును ఎలా నిర్మించాను’ అన్న అత్యుత్తమ గ్రంథాన్ని రచించిన ఎమిలీ లిత్రే. ఇప్పుడు మనం చర్చించుకునేది ఒక్కో అక్షరానికే కాదు, ఒక్కో పదానికి ఉన్న భిన్నార్థాలను గురించే కాదు, బహుశా ఇతర భాషా నిఘంటువులలో కూడా రాని, ఒక్క తెలుగులో మాత్రమే ఇటీవల వెలువడిన తొలి ‘తెలుగాంగ్ల మిశ్ర సమాస నిఘంటువు’ గురించి. పత్రికా భాషా నిఘంటువులు అనేక భాషల్లో ఎన్నో ఉండవచ్చు. కానీ, రెండు భాషలతో కూడుకున్న మిశ్ర సమాస నిఘంటువులు మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రత్యేక నిఘంటువును విద్యారంగంలో, బోధనా రంగంలో ఉస్మానియా, హైదరాబాద్, ద్రవిడియన్ విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా గడించిన అనుభవంతో ఆచార్య పులికొండ సుబ్బాచారి రూపొందించారు. పత్రికలు నిత్యం వాడుతూ పాఠకులకు అందించే కొత్త కొత్త మిశ్ర సమాసాల లోగుట్టును బయట పెట్టారు. ఆఫీసరమ్మ ఏ భాష? పదాల వాడకంలో మనకు తెలియకుండానే ఒక తెలుగు, ఒక ఆంగ్ల పదం కలగలిసిపోయిన ‘సమోసా’ల్లాంటి మిశ్రమ సమాసాలు దొర్లి పోతూంటాయి. ఉదాహరణకు ‘ఆంబులెన్స్ సేవలు’, ‘అకౌంట్ బదిలీ’, ‘ఈడీ లేఖ’, ‘ఈ’ పుస్తకం (ఎలక్ట్రానిక్ పుస్తకం), కొత్త నోటు, ట్విట్టర్ ఖాతా, గవర్నరమ్మ, ఆఫీసరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, డిగ్రీ పరీక్షలు, డ్వాక్రా మహిళలు, పెళ్లి ఫొటోలు, పెళ్లి వీడియోలు, పేపరు ప్రకటన, ప్లాస్టిక్ చెత్త, పాల పాకెట్టు, కోళ్ల ఫారం, యూనియన్ ఎన్నికలు, సమ్మె హారన్, సీల్డు కవర్ ముఖ్యమంత్రి, స్పీకర్ నిర్ణయం – ఇలా కొల్లలుగా వచ్చి పడుతున్న తెలుగాంగ్ల మిశ్రమ సమాసాలకు ఆధారాలు, అర్థ వివరణలను సుబ్బాచారి ఎంతో శ్రమపడి అందు బాటులోకి తెచ్చారు. ఇందులో 1,600 సమా సాలకు పొందికైన వివరణలున్నాయి. సంప్ర దాయ వ్యాకరణాలు చూపించని సంధి సమాసాల నియమాలను రచయిత ప్రత్యేకించి చూపారు. ఇంతకు ముందు తెలుగు భాషలో ఉన్న అందమైన పదాలకు ‘ఒక్క పదం – అర్థాలెన్నో’ మకుటంతో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి తెలుగు పదాల అందచందాలను, ప్రత్యే కతను తెల్పడానికి విశిష్టమైన తొలి ప్రయత్నం చేశారు. నిఘంటు చరిత్ర ప్రాచీనం ఇలా ఒక్కో పదానికే కాదు, ఒక్కో ‘వర్ణా’నికి (అక్షరానికి) కూడా భిన్నార్థాలుంటాయన్నాడు క్రీ.శ. ఒకటో శతాబ్ది నాటి చైనీస్ నైఘంటికుడు హ్యూషెన్. ప్రపంచంలో తొలి ద్విభాషా నిఘంటువు క్రీ.పూ. 2000 ఏళ్ల నాటి సుమేరియన్, అక్కాడియన్ ప్రతి. ప్రపంచంలో తొలి త్రిభాషా నిఘంటువు సుమేరియన్ – బాబిలోనియన్ – హిట్డయిట్ భాషల్లో వెలువడింది. అలాగే ఔషధ శాస్త్రానికి సంబంధించిన ఔషధీ నిఘంటువు (ఫార్మకోపియా) తొలిసారిగా మెసపటోమియా మట్టి ఫలకలపై వెలుగు చూసిందంటారు. ఎటు తిరిగీ మానవాళి విజ్ఞాన, వికాస దశల్లోకి కాలిడిన తర్వాతనే శబ్ద, రూప నిర్ణయంతో అకారాది క్రమంలో నిఘంటువులు వెలువడుతూ వచ్చాయి. మహా కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగునాట వైద్య భాషకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని వెల్లడించారు. మన చరకుడి ఆయుర్వేద వైద్య శాస్త్రం, శుశ్రుత కృషినీ మరవలేం. వన మూలికల ప్రాశస్త్యం తెలిపిన తొలి భారతీయ రచన ‘అధర్వ వేదం’ (ఇనుపరాతి యుగం) నాటిది. అనారోగ్యం అనేది ‘విధి నిర్ణయం కాద’ని చెబుతూ, మానవ ప్రయత్నం ద్వారా, సంకల్ప బలం ద్వారా జీవితాన్ని పొడిగించడం సాధ్యమని చరకుడు తన వైద్య సంపుటం ‘చరక సంహిత’లో స్పష్టం చేశాడు. వ్యవహార నిఘంటువు ఆధునిక యుగంలో అలాంటి గొప్ప ప్రయత్నంలో భాగమే, సరికొత్త ప్రత్యేక మిశ్ర సమాస నిఘంటు నిర్మాణం అనీ, ఇది ‘ఆహ్వానించదగిన’ పరిణామమనీ అన్న భాషా శాస్త్రజ్ఞులు, మిత్రులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వర్రావు అభిభాషణతో ఏకీభవించని వారుండరు. తెలుగు వినియోగంలోకి వచ్చేసిన ‘పాల క్యాను, పాల మీటరు, పాల పాకెట్టు, పాల వ్యాను, పాల ట్యాంకరు’ లాంటి కొత్త సమాసాలు చేయమని ప్రజలకు ఎవరూ చెప్పలేదు. లేదా ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వినియోగించుకోవాలని వారు భావించనూ లేదు. వారి జ్ఞానంలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాన్ని నేరుగా తెలుగు పదంలో కలిపి వాడుకున్నారు. ‘ఇలా వాడొద్దు, ఇంగ్లిష్ పదాన్ని తెలుగు చేసుకొని వాడుకోమని ఎవరైనా పండితుడు చెప్పినా లేదా ప్రభుత్వం వారు నిర్దేశించినా ఫలితం ఉండదు. జన వ్యవహారాన్ని ఎవరూ మార్చలేరు. ఇది అనివార్యంగా జరుగుతూ ఉన్న భాషా పరిణామం అని అర్థం చేసుకోవా’లన్న సుబ్బాచారి వ్యవహార పరిజ్ఞానం మెచ్చుకోదగింది. భాషా పరిణామం అనేది ‘సమాజ సహజ పరిణామంలో భాగంగా’ జరుగుతున్నది కాబట్టే, ఇలా తెలుగాంగ్ల పదాల కలయికతో మిశ్రమ సమాసాలు అనివార్యమవుతున్నాయి. కాబట్టి భాషావేత్తలు ఈ పరిణామాన్ని విధిగా అధ్యయనం చేయవలసి ఉందన్న రచయిత భావన ప్రశంసనీయమైనది. ముందు పదాల విదేశీకరణం, దేశీయ పదాలు క్రమంగా ఉనికిలోకి వచ్చిన తరువాత దేశీకరణ, అవసరాన్ని బట్టి మిశ్ర భాషా సమాసాలూ భాషా పరిణామంలో అనివార్యమని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే – సకల భాషా, సంస్కృతుల సమ్మేళనమే ఒక మిశ్ర సమాస నిఘంటువు! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..
(డెస్క్ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు. యువతలో సాహిత్యాభిలాష ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు, గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు. ఆనాడే అక్షరాంకురార్పణ అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్ 1939 మార్చి 15న డిక్లరేషన్ ఇచ్చారు. పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు. ఎందరో మహానుభావుల ప్రశంస నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం. ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ 2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు. ఆంధ్రి విశిష్టతలు ► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్ సీఆర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి. ► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది. ► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి. ► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది. ► ప్రెస్ అకాడమీ ఆర్కివ్స్ వెబ్సైట్లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం. – మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం -
నిజంగా తెలుగు భాషపై అంత ప్రేమ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా?
విజయవాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలలో తెలుగు భాష ప్రాశస్త్యం, చిన్నతనం నుంచే తెలుగు నేర్చుకోవల్సిన అవసరం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. తెలుగు భాష వికసించాలని కోరుకోవడం తప్పు కాదు. మంచిదే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ తదితర ప్రముఖులు ఈ సభలలో పాల్గొని తమ సందేశాలు అందించారు. వెంకయ్య నాయుడు అయితే శ్వాస ఆగితే, భాష ఆగితే అంటూ ప్రాసతో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ప్రముఖులిద్దరని కాదు.. అక్కడ మాట్లాడినవారిలో పలువురు పరోక్షంగా ఎపిలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది. ఏపీలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్దులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపద్యంలో దానిని ఏదో రకంగా వ్యతిరేకిస్తున్నవారు ఈ సభలో తెలుగు గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఎపి ప్రభుత్వం తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. తెలుగుదేశం నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పాలకులు ఇకనైనా మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య నాయుడు తదితరులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మృతభాష అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వక్తల కుటుంబాలకు చెందినవారు ఎంతమంది తెలుగులో ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగు సంస్కృతి కోసం సభలు పెట్టవచ్చు. కానీ తెలుగు భాషకు ఏదో అయిపోతోందన్న భావన కలిగించే యత్నమే బాగోలేదు. ఏ భాష ఎప్పుడూ మరణించదు. అందులోను కోట్ల మంది మాట్లాడే భాష అంత తేలికగా పోయేటట్లయితే, ఈ పాటికి చాలా భాషలు కనుమరుగు అయి ఉండేవి. వెంకయ్య నాయుడు కాని, రమణకాని, లేదా బుద్ద ప్రసాద్ కాని, ఇలాంటి ప్రముఖులంతా తమ మనుమలు, మనుమరాళ్లను సభకు తీసుకు వచ్చి వీరిని తెలుగు భాషలోనే తాము చదివిస్తున్నామని చెప్పగలిగి ఉంటే వారిని అంతా మరింతగా మెచ్చుకునేవారు. వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టులో తెలుగులోనే పాఠశాల నడుపుతున్నామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఒకవేళ అలా జరుగుతుంటే అభినందించాల్సిందే. తెలుగుకు సంబంధించి ఏ వార్త వచ్చినా పూనకం పూనినట్లు వార్తా కధనాలు, బానర్లు పెట్టే ఈనాడు అధినేత రామోజీరావు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూలలో తెలుగు మీడియంలోనే ప్రాధమిక విద్యను చెబుతామని ప్రకటించి ఉంటే గొప్పగా ఉండేది కదా? పోనీ రామోజీరావు లేదా, ఆయన వద్ద పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టులు ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో తెలపగలిగి ఉంటే ఎవరైనా విశ్వసించవచ్చు. తెలుగు భాషపై అంత ప్రేమ ఉన్న ప్రవాసాంధ్రులు తమ పిల్లలను అమెరికాలో కూడా తెలుగులోనే చదివిస్తున్నారా? లేదా వారిని ఇండియాకు తీసుకు వచ్చి స్వరాష్ట్రంలో తెలుగు స్కూళ్లలో చదివిస్తున్నారా? అమెరికాలో మనవాళ్లు తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిదే. ఇళ్ల వద్ద తెలుగు మాట్లాడిస్తే స్వాగతించవలసిందే. కొంతమంది కళలపట్ల ఆసక్తికలిగిన తల్లిదండ్రులు తెలుగులో పద్యపఠనం తదితర ప్రక్రియలను బోధిస్తున్నారు. ఇది సంతోషించవలసిన అంశమే. కాని అత్యధిక శాతం తెలుగువారి పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు మర్చిపోతున్నారు. వచ్చినా ఏదో పొడి, పొడి మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా వారికి ఎలా తెలుగు నేర్పించాలా అన్నదానిపై తానా లేదా ఇతర తెలుగు సంస్థలు దృష్టి పెడితే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి వారు సభలు పెట్టి విమర్శలు చేస్తే మొత్తం మారిపోతుందా? ఎపిలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు. దానికి స్పష్టమైన కారణం ఉంది. ఆంగ్ల మీడియం ఉన్న స్కూళ్లకే 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు.దాంతో ప్రభుత్వ స్కూళ్లు కేవలం పేదలకు, ఆర్థికంగా స్తోమత లేని బలహీనవర్గాలకే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసిపి ప్రభుత్వం కాని, కెసిఆర్ ప్రభుత్వం కాని ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టాయి. కెసిఆర్‌కు ఈ విషయంలో ఇబ్బంది రాలేదు కాని, ఎపిలో జగన్ ను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన, వామపక్షాలు చాలా ఇబ్బంది పెట్టే యత్నం చేశాయి. తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా చేసినా ఏదో రకంగా జగన్ ముందుకు వెళ్లకూడదని చివరికి కోర్టులను కూడా అడ్డం పెట్టుకుని టిడిపి చేసిన యాగీ ఇంతా ,అంతా కాదు. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు నానా రభస చేశాయి. పోనీ ఈ మీడియా సంస్థల యజమానుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగులో చదువుతున్నారా అంటే అదేమీ లేదు. వీరిలో అత్యధికులు హైదరాబాద్, ముంబై వంటి నగరాలలో కార్పొరేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. ఎపిలో మాత్రం ఆంగ్ల మీడియం పెట్టకూడదని యాగీ చేశారు. వీరెవరూ ప్రైవేటు స్కూళ్లు ఆంగ్ల మీడియం మాత్రమే అమలు చేస్తున్నప్పుడు నోరు మెదపలేదు. అంతదాకా ఎందుకు! తెలుగు గురించి చంద్రబాబు గారు చాలా ఉపన్యాసాలు చేశారు కదా? ఆయన కుమారుడు లోకేష్‌ను ఏ మీడియంలో చదివించారు? ప్రస్తుతం ఆయన మనుమడు దేవాన్ష్‌ను కాని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? బుద్ద ప్రసాద్ వంటి వారు ముందుగా ఈ విషయంలో సలహా ఇవ్వవలసింది వీరికి కదా! ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని చెబుతున్న ఈ పెద్దలు, తమ వాళ్లు మాత్రం ఆంగ్లంలో చదివినా బాగా చదవగలరని, మిగిలినవారు అర్ధం చేసుకోలేరని ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు. వీరంతా ఒక్కసారి కాకినాడ జిల్లా బెండపూడిలోని ప్రభుత్వ స్కూల్కుకు వెళ్లి, అక్కడ పిల్లలు, ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలో కూడా ఎలా రాణిస్తున్నది తెలుసుకుంటే బాగుంటుంది. వారిని ఇలాంటి సంఘాలు ప్రోత్సహించి, ఏ సందేశం ఇచ్చినా వినబుద్ది అవుతుంది. చిన్నతనంలోనే ఏమి నేర్పినా పిల్లలకు బాగా వంటపడుతుందని అంటారు. తెలుగు గురించి ఇంతలా బాధ పడుతున్నవారు పాటించి చూపిస్తే కదా మిగిలినవారు ఆచరించే అవకాశం ఉండేది. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రవాసాంద్రులు తెలుగు భాష గురించి ఏ కార్యక్రమం చేసినా సంతోషమే. దానికి ముందుగా అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించగలిగితే , అప్పుడు వారు ఏమి చెప్పినా విలువ పెరుగుతుంది కదా! - హితైషి -
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. పూర్తి వివరాలు
‘‘స్వభాషను పరిరక్షించుకుందాం- స్వాభిమానాన్ని పెంచుకుందాం’’ అనే నినాదంతో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ) సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు జరుగనున్నాయి. ఈ నెల 23, 24 తేదీలలో శుక్ర, శనివారాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర శాసన సభ మాజీ ఉప సభాపతి డా॥ మండలి బుద్ధ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డా॥ జి.వి. పూర్ణచంద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు వెల్లడించారు. ఈ మేరకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశములో వారు మాట్లాడారు. ఉద్దేశం ఇదే ఈ సందర్భంగా.. ప్రపంచ నలుమూలల నుంచి సుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ, భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ సభలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర, సిద్దార్ద అకాడెమీ మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయని వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరౌతున్నారని వివరించారు. పూర్తి వివరాలు ఇక డా॥ జి.వి. పూర్ణచంద్ మాట్లాడుతూ మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుబడిన రాజరాజనరేంద్రుడి పేరు పెట్టామన్నారు. ఆదికవి నన్నయ వేదిక పై ప్రారంభసభ, సమాపన సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత, అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వివరించారు. 23 ఉదయం 10 గంటలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహాసభలను ప్రారంభిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగు వెలుగుల సభలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్. వి. రమణ పాల్గొంటున్నారని తెలిపారు. పద్మశ్రీ గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ రామమోహనరావు, డా॥గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్, గేయరచయితలు అందెశ్రీ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి పాల్గొంటున్నారని తెలిపారు. యువ అవధానులతో ‘‘కుదురాట-కొత్తవెలుగు’’, 10 మంది యువ గజల్ కవుల ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి సుధాకర్, డాపప సప్పా దుర్గాప్రసాద్, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు డా॥ఎస్.పి.భారతి సోదాహరణ ప్రసంగాలు వుంటాయని పేర్కొన్నారు. కళారత్న కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్ధాపకులు డా॥ జంపా కృష్ణ్ణ కిషోర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, ఉపాధ్యాయులు-భాషాపరిరక్షణ, తెలుగు బోధన, సామాజికమార్పులు-తెలుగు కవిత, విమర్శ, చరిత్ర, అంతర్జాలంలో తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు రాష్టేతర తెలుగు ప్రముఖులతో సదస్సులు ఉంటాయని వివరించారు. ప్రతినిధులకు రెండు రోజులు కమ్మని తెలుగు విందు ఏర్పాట్లు చేశామని, 100కి పైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు వివరించారు. శుభోధయం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్, ప్రపంచ మహాసభలు పేరుతో వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెల్లడి చేస్తామని వివరించారు. -
బైజూస్‌పై బురద రాతలు
సాక్షి, అమరావతి: ఆధునిక నైపుణ్యాలను సంతరించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా బైజూస్ పాఠ్యాంశాలతో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంటే ‘ఈనాడు’ వక్ర భాష్యాలు చెబుతోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి వివిధ పథకాల ద్వారా విద్యార్థుల చదువులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. గత సర్కారు హయాంలో అస్తవ్యస్థమైన విద్యా రంగాన్ని వివిధ పథకాలతో సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బైజూస్ భాగస్వామ్యం ద్వారా అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండడంతో సహించలేక‘ఈనాడు ’విషం చిమ్ముతోంది. ఇందులో నిజానిజాలివీ.. బైజూస్‌తో బోలెడు ప్రయోజనాలు బట్టీ చదువుల స్థానంలో ఆహ్లాదంగా చదువుకునేలా తరగతి గదిని రూపొందించాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌ను స్మార్ట్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. బైజూస్ కంటెంట్ టీచర్లు, పిల్లలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి నాణ్యతతో రూపొందించారు. దీనివల్ల తరగతి గది బోధనలో నాణ్యత పెరగటంతో పాటు బడిలో నేర్చుకున్న అంశాలు ఇంటి వద్ద పునఃశ్చరణ చేయడానికి అవకాశం కలుగుతోంది. పిల్లలు ఎప్పుడైనా పాఠశాలకు హాజరు కాలేకపోతే వీలైన సమయంలో నేర్చుకునేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించిన చిత్రాలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నేర్చుకునేలా దోహదం చేస్తాయి.పాఠ్య పుస్తకాలలో ఇచ్చిన సమాచారాన్ని చిన్న విభాగాలుగా రూపొందించడం వల్ల సంక్లిష్ట అంశాలను సులువుగా నేర్చుకుంటారు. 471కి పైగా వీడియోలతో నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి. గొప్ప వరం.. బైజూస్ ద్వారా ఉచితంగా పాఠాలు అందించడం పేద పిల్లలకు గొప్ప వరం. ఈ లెర్నింగ్ కోసం పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా ట్యాబ్‌లను సమకూరుస్తుండడం సాహసోపేత నిర్ణయం. – ఎన్.మహేంద్రరెడ్డి, టీచర్, తంగేగుకుంట, శ్రీసత్యసాయి జిల్లా రెండు భాషల్లో చక్కగా.. బైజూస్ వీడియో పాఠాలను అన్ని తరగతుల వారు వింటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చక్కటి ఉదాహరణలతో స్థాయికి తగ్గట్లు వీడియో అంశాలున్నాయి. – కె.పుష్పవతి, సైన్స్ టీచర్, ఎంసీయూపీ స్కూల్, ఏలూరు చాలా బాగుంది.. బైజూస్ కంటెంట్ చాలా బాగుంది. విద్యార్థులకు, టీచర్లకు ఎంతో సహాయపడుతుంది. వీడియోలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అద్భుత అనుభూతి కలిగిస్తున్నాయి. – సంధ్య, ప్రిన్సిపాల్, ఏపీఎమ్మెస్, అక్కివరం, విజయనగరం అద్భుతంగా నేర్చుకుంటున్నారు... బైజూస్ యాప్ ద్వారా పిల్లలకు వీడియో పాఠాలు చెబుతున్నాం. కంటెంట్ చాలా బాగుంది. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. పిల్లలు బడికి హాజరు కాని సందర్భాల్లో ఇది చాలా సహాయపడుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇంటి వద్ద పాఠ్యాంశ బోధన జరగడం అద్భుతంగా ఉంది. – ఎం.నరసింహారెడ్డి, హెచ్.ఎమ్, జెడ్పీ హైస్కూల్ సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా అబద్ధం 1 బైజూస్ కంటెంట్ కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది ఇది పూర్తి అవాస్తవం. పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ ఉంది. భాషను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. అబద్ధం 2 పిల్లల సందేహాల నివృత్తికి అవకాశం లేదు పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం బోధించాక సంబంధిత వీడియోను విద్యార్థులు పరిశీలించిన అనంతరం ఇంకా సందేహాలుంటే మరుసటి రోజు నివృత్తి చేస్తున్నారు. వలస వెళ్లిన పిల్లలు కూడా కంటెంట్‌ను ఫోన్లో చూసుకొని తర్వాత స్కూలుకు వచ్చి టీచర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. అబద్ధం 3 టీచర్లకు రూ.500 చాలదు ఈ ప్రస్తావన సరికాదు. కంటెంట్ ఉన్న వీడియోలు ప్రయోగాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినవైనందున విషయ పరిజ్ఞానార్జనకు మరింత ఉపయుక్తం. టీచర్లకు వీడియోలు అర్థం కావనడం వారిని అవమానించడమే. -
CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు
తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్ దంపతులైన డేవిడ్ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్ 10న బ్రౌన్ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. ఫ్రెంచ్ కాథలిక్ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్‌లోకి అనువదించి ‘వెర్సేస్ ఆఫ్ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్‌లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకునేలా చేశారు. బ్రౌన్ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు. తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్‌కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్లా, జాన్హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్ పేరును ప్రస్తావించనే లేదు. భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్ మద్రాస్ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్‌లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్ రచనలన్నీ రెవరెండ్ టైలర్ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్‌లో ముద్రించారు. ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్‌బార్న్ గ్రోవ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..) - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖ సాహితీ పరిశోధకులు (సీపీ బ్రౌన్ 225వ జయంతి సంవత్సరం) -
ఈ తెలుగు మాట్లాడుతున్నామా?
అమ్మకు జ్వరంగా ఉంటుంది. స్కూల్లో అన్నం గంట కొట్టినప్పుడు ఇంటికెళితే బువ్వ ఉండదని ముందే తెలుసు. ఆ సంగతి ఎవరికీ చెప్పక నీళ్ల కుళాయి వైపు నడుస్తూ రెండు గుక్కలే ఈ పూటకు అనుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు కనిపెట్టి– ‘రారా. నా టిపినీలో తిందువు’ అని పిలుస్తాడు. భలేవాడు వాడు. పక్క పాపిట దువ్వుకుని, స్లిప్పర్లు టపాటపాకొట్టి నడుస్తూ, ఊరికూరికే నవ్వుతూ, మన స్నేహాన్ని ఇష్టపడుతూ. ఆ పూట వాడి ముద్దల్లో మనకు వాటా. పొరుగూరిలోనే ఉంటాడు. ఏదో ఉద్యోగం చేస్తున్నాడని విని ఉంటాము. కలిసి చాలా ఏళ్లయివుంటుంది. ‘ఏరా... ఎలాగున్నావు’ అని ఫోన్ చేసి అడగడం మంచి తెలుగు వాక్యం. తియ్యటి తెలుగు వాక్యం. పలుకుతున్నామా? ఆ పిల్ల తూనీగే. పక్కింట్లో ఉంటుంది. అక్కా అని పిలిస్తే తప్ప పలకదు. ఆదివారం వస్తే ‘రావే అమ్మాయ్’ అని గోరింటాకు పెట్టేది. ఇంట్లో పూసే రోజాపువ్వు బడికి వెళుతున్నప్పుడు జడలో గుచ్చేది. సినిమా పత్రికలో ఉన్న హీరోయిన్ ఫొటో చూపించి ‘ఈ డ్రస్సు నీకు భలే ఉంటుంది’ అని చెప్పేది. ‘భయంగా ఉందక్కా’ అనంటే, ‘తొక్కు’ అని సైకిల్ నేర్పించింది. టీచరట. రిటైరైందట. అమెరికాలో పిల్లల దగ్గర ఉందట. వాట్సప్ కాల్ చేసి ‘అకా... నీ గుర్తుగా ఇంట్లో ఎర్రగులాబీ వేశా. చూడ్డానికి ఎప్పుడొస్తావు?’ అని అడగడం అలాంటిలాంటి తెలుగు కాదు. తేనె తెలుగు. మేనమామ ఒకడు ఆ రోజుల్లో హిప్పీ క్రాఫుతో ఇంటికొచ్చేవాడు. ‘సినిమాకెళ్దాం పదండి’ అని తీసుకెళ్లేవాడు. టక్ చేసి కాలేజీకెళితే హీరోలా చూస్తారట. ‘మావయ్యా’ అని పిలిస్తే చాలు హాజరయిపోయేవాడు. ఒకసారి నాన్నతో ఎవరో గొడవపడితే ‘ఖబడ్దార్’ అని చూపుడువేలు ఆడించి వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆర్థికంగా కూడా బాగలేడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. మనమేం శ్రీమంతులం కాము. కాని వెళ్లి, దగ్గర కూచుని, చేయి పట్టుకుని ‘మావయ్యా.... సాహసవంతుడు సినిమా చూపించిన సాహసవంతుడివి నువ్వు. ఏం కాదు. లేచి తిరుగుతావు. నీకేం కావాలో నేను చూస్తాను. అందాక ఇది ఉంచు. కాదంటే నామీదొట్టే’ అని పలికే తెలుగు ఉంది చూశారూ... దేవతలు ఆశీర్వదించే తెలుగు అది. అవునండీ... ఆఫీసులో కొలీగే. కలిసి క్యాంటీన్‌కు వెళ్లేవారు. కలిసి భోజనానికి వెళ్లేవారు. కలిసి పని పంచుకుని చేసవతల పడేసేవారు. ఏదో మాటా మాటా అనుకున్నారు. మాట్లాడ్డం మానుకున్నారు. కాని ఎన్నాళ్లు? రోజూ కనపడాలే. పక్కనే ఉండాలే. ముఖం చూడాలే. ఇక చూసి చూసి ఎవరో ఒకరు డెస్క్ దగ్గరికెళ్లి ‘క్షమించు గురూ. ఏదో పొరపాటైంది. ఇంతకు ముందులానే ఉందాం. నీతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంది నాకు’ అన్నామనుకోండి... ఆ తెలుగు అతి సువాసనతో నిండిన తెలుగు. ‘అమ్మా... ఫోన్లు మాట్లాడేటట్టయితే స్పీకర్ పెట్టుకు మాట్లాడు. చెవికి ఇబ్బంది ఉండదు. అస్తమానం టీవీ చూడకు. మొన్నామధ్య నువ్వు చేసే పూర్ణాలు గుర్తుకొచ్చాయిగానీ అంత రుచితో ఇక్కడ ఎవరు చేయగలరనీ’. ‘నాన్నా... నా కోసమని కొత్తచొక్కా కొన్నాను. కాని బ్లూ కలర్ మీకే బాగుంటుందనిపించింది. పంపుతున్నా. వేసుకోండి’. ‘ఓ నా బంగారు చెల్లీ... ఈ అన్న పెళ్లయ్యాక మారిపోయాడని అనకు. చిన్నప్పుడు పార్కులో ఉయ్యాలూగుతూ కింద పడబోతుంటే పట్టుకున్నాను. ఇప్పుడూ అంతే, పక్కనే ఉంటాను’. ‘పెద్దొదినా... మీరిద్దరూ పిల్లలతో భోజనానికి ఎందుకు రారు మా ఇంటికి. పట్టింపులు పెట్టుకోకండి దయచేసి’... ‘ఏమే మూగమొద్దు. క్లాస్మేట్లందరం టూర్కెళ్దామంటే ఏ సంగతీ చెప్పవేమే’... ఎంతమంచి తెలుగు వాక్యాలో చూడండి ఇవి. పలకడం మరిచిపోతున్న వాక్యాలు. పలకక్కర లేదనుకుంటున్న వాక్యాలు. వ్యవహారంలో నుంచి తొలగిపోతున్న వాక్యాలు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాక్యాలు. బంధం గట్టిగా ఉంటే బలగం గట్టిగా ఉంటుంది. బంధం పట్ల ఆపేక్ష ఉంటే నిలబెట్టుకోవాలన్న తలంపు ఉంటుంది. ‘అ’ ఒక్కటే లేదు. ‘ఆ’ పక్కనే ఉంది. ‘అచ్చులు’ మాత్రమే లేవు. ‘హల్లుల’ను తోడు చేసుకున్నాయి. ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జయంతి. వ్యవహారిక భాష కోసం ఆయన జీవితాన్ని ధారబోశాడు. ప్రతి తెలుగువాణ్ణి తెలుగు కోసం గుప్పెడు ఊపిరి ఇమ్మన్నాడు. కాని జీవన వ్యవహారాల పట్ల ఉండే అక్కరను బట్టే భాష పట్ల అక్కర కూడా ఉంటుంది. మన బంధాలతో ఎలా ఉన్నామో భాషతో కూడా అలాగే ఉంటాము. జన్మ సంబంధాలు, రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు, సాటి వర్గ కుల మత సంబంధాలు... వీటికి ఎంత ప్రేమ, గౌరవం ఇస్తామో భాష పట్ల కూడా అంతే గౌరవం ఇస్తాము. ఒకటి ఉండి ఒకటి లేదు అనేది ఉండదు. అన్నీ ఒక తానులో బట్టలే. ఇల్లంటే డోర్ కర్టెన్, బెడ్రూమ్, టాయిలెట్ అని మాత్రమే కాక ‘పుస్తకాల అర’ కూడా అనుకోనంత వరకు, కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే అని కాక అనేక అనుబంధాలు కూడా అని తలవనంత వరకు, బంధాలతో ఆత్మీయత భాషతో పాశంలోనే జీవన మాధుర్యం ఉంది అని ఇవి రెండూ ఎంతకూ చెల్లించలేని, ఎగవేతకు కుదరని రుణాలని చిత్తంతో నమ్మనంత వరకూ తెలుగువారి జీవితం, తెలుగుతో నిండిన జీవితం సంపూర్ణం అనిపించుకోదు. ఎవరైనా స్నేహితునికి ఫో¯Œ చేసి ‘మంచి తెలుగు పుస్తకం ఏదైనా కొనుక్కు వద్దామా’ అనండి. ఇవాళ్టికివాళ అంతకు మించిన పుణ్యప్రదమైన తెలుగు మరొకటి లేదు. అనుబంధాల తెలుగు వెలుగు గాక! -
మాతృ భాషలో వాదనలు తప్పు కాదు
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్‌లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్‌లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్ జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్‌ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు. -
తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు
టంగుటూరు: పట్టుదల, ధైర్యం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన గడ్డం మేఘన చెప్పారు. విజయ సాధనలో ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. భారత దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, అమ్మాయిల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. వారు పట్టుదల, ధైర్యంతో కష్టపడితే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్, తల్లి ఉష. వ్యాపార రీత్యా 21 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె చెప్పిన విషయాలు.. యువతకు చాలా ఐడియాలు ఉంటాయి. వీటిని న్యూజిలాండ్ పాలకులు గుర్తిస్తారు. మూడేళ్లకోసారి యూత్ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో 120 మంది ఎంపీలు ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారు. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు అర్హులు. వీరికి చదువు, నాయకత్వ లక్షణాలు ఉండాలి. నేను స్కూలు స్థాయిలోనే హెడ్‌గా ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. స్నేహితులతో కలిసి అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరిస్తాను. రిప్యూటీ సెంటర్ ద్వారా ఇరాన్, ఇరాక్, సిరియా తదితర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్ధుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. చిన్నారులకు చదువులో సాయం చేస్తాం. ఇవే నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి. జూలైలో పార్లమెంటులో ప్రసంగం జూలైలో రెండు రోజులు మాకు పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్, జనరల్ డిబేట్లో, సెలెక్ట్ కమిటీలో పాల్గొంటాం. పలు సూచనలు చేస్తాం. అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మంత్రులను, ప్రధానిని సైతం నిలదీయొచ్చు. మేము సభ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై మంత్రులు, ప్రధాని చర్చిస్తారు. వాటిని బిల్లులు చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్‌లో ఇళ్ల సమస్య ఎక్కువ. పేదలకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిపోవడంలేదు. దీనిపైనే తొలి ప్రశ్న వేస్తాను. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీకి విరాళం చీమకుర్తి మండలం పల్లామల్లిలోని మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ బాలల కోసం చేస్తున్న మంచి పనులు చూసి రూ. 60 వేలు విరాళంగా ఇచ్చాను. పాఠశాలకు మరో రూ.2 లక్షలు ఇస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే శాయశక్తులా చేస్తాను. తెలుగంటే బాగా ఇష్టం ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తాను. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రాలేదు. తెలుగంటే బాగా ఇష్టం. అందుకే ఇక్కడ తెలుగు బాగా నేర్చుకున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష చాలా గొప్పవి. అక్కడే పుట్టి పెరిగినా వీటిని మరిచిపోలేదు. యూత్ ఎంపీకి చేసుకున్న దరఖాస్తులో కూడా నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా దేశ సంస్కృతి సంప్రదాయాలను పొందుపరిచాను. -
ఫ్రెంచ్ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సులో పాల్గొనేందుకు ఫ్రెంచ్ రాజధాని పారిస్‌కు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఓ విశిష్ట అతిథి భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డేనియల్ నెగర్స్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో డేనియల్ నెగర్స్ కొన్నేళ్లుగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారు. వేల మైళ్ల దూరాన ఉంటూ తెలుగు భాషపై మమకారం చూపించడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
తెలుగు పదాల ‘మల్లెతోట’లో మల్లీశ్వరి!
ఇంగ్లిష్ మాతృభాషగా పెరిగిన ఇంగ్లండ్ ప్రజలు 300 ఏళ్ళపాటు ఫ్రెంచి, గ్రీక్, జర్మన్ వలస భాషల దాష్టీకం నుంచి తమ మాతృ భాష ఇంగ్లిష్‌ను రక్షించుకోవడానికి పడిన పాట్ల నుంచే తెలుగుభాషను కాపాడుకోవడా నికి తెలుగువాడు పాఠాలు నేర్చుకోవాలి! ప్రపంచాన్ని ఏలుతూ వచ్చిన ఇంగ్లిష్ వాడికి, 16–17 శతాబ్దాల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని, మాతృభాషా రక్షణకు నడుం బిగించాల్సి వచ్చిందని 3,000 సంవత్సరాల ప్రాచీన పునాదులున్న తెలుగువారు మరిచిపోరాదు! ఆదివాసీ భాషలు సహా ప్రపంచ భాషా కుటుంబంలో ప్రతి ఒక్క పదమూ ఒక్కొక్క ఆణి ముత్యమని ఐక్యరాజ్యసమితి సాధికార ప్రకటన విడుదల చేసిందని మరువరాదు. మరోవైపునుంచి విభజించి పాలించే బుద్ధి విభక్తులతో ప్రారం భమై తెలుగు భాషనే గాక తెలుగు సమాజాన్ని వృత్తుల విభజనతో పాటు కులమతాల కుంపట్లు తెరిచి శాశ్వత బానిసత్వానికి వర్గ విభజనకు సరిపడా ‘కాంక్రీటు’ గుప్పించారు స్వార్థపరులు. ప్రకృతుల (ప్రజల)తో ఎదుగుతూ వచ్చిన భాష ‘వికృతుల’తో ఎందుకు విల విలలాడవలసి వచ్చింది? ప్రాచీన భారతం సంస్కృతం కాదు, ప్రాకృతం మాత్రమేనని మహామహా పండితులే ఎందుకు నిర్వచించ వలసివచ్చింది? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనే బుద్ధిహీనుడు బతకనేల అని కాళోజీ ఎందుకు నోరారా శపించవలసి వచ్చింది? అలాగే తెలుగు పదసంపదను మరచిపోయి తిరుగుతున్న తెలుగు వాడికి ఒక పదానికి ఎన్నో అర్థాలను చూపించి తెలుగు నుడులకు ‘గుడులు’ కట్టి మరీ కోట్లాదిగా చూపించి తెలుగుల వెన్నును కాపా డుతూ వచ్చిన తెలుగు ప్రముఖులలో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఒకరు! ఒక్కో తెలుగు పదానికి అర్థాలెన్నో, తెలుగు‘నుడి గుడి’ గ్రంథాల ద్వారా దశాబ్దన్నర కాలంలో తెలుగుభాషకు మల్లీశ్వరి కృషి చేస్తూ వచ్చిన అమూల్యమైన కృషి, ప్రాథమిక విద్యాస్థాయిలోనే భాషా బోధనా పద్ధతులు ఎలా ఉండాలో ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిన విద్వక్మణి మల్లీశ్వరి ఎన్నో పురస్కారాల గ్రహీత, కవయిత్రి, ప్రసిద్ధ సమీక్షకురాలూ, నాడు తెలుగువాడైన (ముంగండ) మల్లినాథసూరి షాజహాన్ కొలువులో పలువురు ముస్లిం, సంస్కృతి కవుల్ని దిమ్మ తిరిగేలా ఓడించి నిలబడిన జెగజ్జెట్టీ! నేడు ఎవరి కొలువుల్ని ఆశ్ర యించకపోయినా సొంత ప్రతిభతో, తేజస్సుతో తననుతాను నిరూ పించుకుని తెలుగు మల్లెతోటను వాడిపోకుండా నవంనవంగా ఉంచుకున్న సాహితీమూర్తి మల్లీశ్వరి. అందుకే ప్రాచీన సూక్తి పుట్టింది. పరుల కోసమే నదులు ప్రవహిస్తాయి, గోవులూ పాలు పిండుతాయి. చెట్లూ ఇతరుల కోసమే పూలు పూస్తాయి. ఈ సంప్రదాయపు ప్రాకృ తిక సత్యాన్ని గుర్తించిన చిరంజీవి మల్లీశ్వరి, మనం మరచిపోతున్న తెలుగు అందచందాలతో సహస్రాధికంగా తెలుగులు చిమ్మే తెలుగు పదాలకు అనంతమైన నుడులకు నానుడులకు ప్రయోజనకరమైన గుడులు కట్టారు. అసలు ఎందుకు, తెలుగు భాషామతల్లికి వన్నెచిన్నెలు తొడిగిన తెలుగు శతక వాంఙ్మయాన్ని అటకమీద పెట్టేసి తిరుగుతున్న మనల్ని రక్షించే నాథుడికోసం, చీకట్లో వెతుక్కుంటున్నాం. తెలుగు పదాలకు అరసున్నల బెడదను రుద్దిన సంస్కృత ప్రియులకు జవాబుగా 300 ఏళ్ళ కిందటే శ్రీనాథుడి శాసనాల్లో (13–14 శతాబ్దిల్లో) ఈనాడు మనం వాడే ‘సున్న’ అంకెనే (0) సుఖంగా వాడాడు! కనీసం తెలుగు భాషను, ప్రజలను శ్రీనాథుడి కన్నా ముందు అనేక శతాబ్దులుగా తీర్చిదిద్దించి వచ్చిన 10 శతకాలలోని సజీవ స్రవంతిని కూడా పక్కన పెట్టేసి తిరుగుతూ వచ్చాం. వేమన శతకం నుంచి ఆంధ్రనాయక శతకం దాకా తెలుగు ప్రజలను నీతులతో, హెచ్చరికలతో అప్రమత్తం చేసి ఎన్నో మంచి బుద్ధుల నుంచి మరలకుండా ఈ రోజుదాకా కట్టిపడవేస్తున్నాయి. అలాగే వాసిరెడ్డి మల్లీశ్వరి 2016లోనూ, 2018 లోనూ తెలుగులో ఒక్కొక్క పదానికి ఎన్నేసి అర్థాలున్నాయో, ఒక్కో పదాన్ని భిన్న అర్థాలలో, విభిన్న సందర్భాలలో ఎలా ఉపయోగించ వచ్చునో ఈ రెండు గ్రంథాలలోనే పెక్కు సామెతలతో, ఆమెతలతో సంధించి వందలు, వేలాది ఉదాహరణలతో రసమయం చేసింది మల్లీశ్వరి. ‘హల్లు’తో కాకుండా ‘అచ్చు’తో పదాల ప్రారంభ ఉపసం హారాలతో వేల సంవత్సరాలు ప్రాచీన చరిత్ర గల భాషగా అజంత భాషగా ఎలా వర్థిల్లుతూ వస్తోందో నిరూపిస్తూ అందుకు దన్నుగా తెలుగు సామెతలను, వివిధ కవుల పద్యాలనూ సోదాహరణంగా ఉదహరించారు. ఆమె కృషి వెనక దాదాపు 20 ఏళ్ల సాధన ఉంది. మల్లీశ్వరి అన్నట్టు నేడు తెలుగు ఇళ్లలో, స్కూళ్లలో, తరగతి గదుల వాతావరణంలో తెలుగుభాష వాడకం తగ్గి, ఆంగ్లభాష వాడకం పెరిగి అమ్మ–నాన్నల స్థానాన్ని, మమ్మీ–డాడీలు ఆక్రమిం చడం వల్ల మరుగున పడిపోతున్న తెలుగు పదాలను, వాటికి గల అనేకానేక అందమైన అర్థాలను నేటి తరానికి అందించి మనసుకెక్కిం చాలన్న తలంపుతో ఈ రెండు పుస్తకాలలోనూ అనితరసాధ్యమైన ప్రయత్నం జరిగింది. అంతమాత్రాన అన్యభాషాదూషణకు ఆమె ప్రయత్నించలేదు. తెలుగు భాషలో ఉన్న ఎంతో అందమైన పద సంపదను ఒంట పట్టించుకోగల తెలుగు విద్యార్థులకు ఉద్దీపనగానే మల్లీశ్వరి ప్రశంసనీయమైన ప్రయత్నం జరిగింది. ఇంగ్లిష్‌లో ‘భిన్నార్థ దీపిక’గా చెప్పుకునే ‘ధిసారస్’కు ఏ మాత్రం తీసిపోనివి మల్లీశ్వరి రెండు అత్యుత్తమ సంపుటాలు. పదప్రయోగ వైచిత్రిలో అఖిల భారత స్థాయిలో ఆంగ్లభాషా పండితుడు, పరిశోధకుడు, పార్లమెంటు సభ్యుడైన శశిథరూర్ ‘ధిసా రస్’ను అనుసరించి తన పేరిటనే ‘ధరూరోసరస్’ అనే కొత్త ప్రయో గాలకు సాహసించాడు. అర్ధగౌరవాన్ని హాస్యాస్పదంగా మార్చే ఈ నోరుతిరగని శశిథరూర్ ప్రయత్నాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురణ కర్త మేరూ గోఖలే... పాఠకుల్ని అదరగొట్టి, చెదరగొట్టే థరూర్ ప్రయ త్నాన్ని, భిన్నార్థ దీపిక కాదు.. ‘నిరంకుశోపాఖ్యానం’ (టిరనోసరస్) అని వ్యాఖ్యానించింది! కానీ మన మల్లీశ్వరి ప్రాచుర్యంలో ఉన్న తెలుగు పదసంపద అర్ధగౌరవాన్ని ఒక ఉపాధ్యాయురాలిగా తన రెండు సంపుటాలలోనూ నిలబెట్టారు. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు
‘డిజిటల్ హ్యుమానిటీస్’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్ సాఫ్ట్ కాపీ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు. (చదవండి: బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’) ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్మేకర్ సాఫ్ట్వేర్ స్థానంలో యునికోడ్ ఫాంట్స్ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్మేకర్లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్‌లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్‌కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి. (చదవండి: రైతు ఆదాయంపై అర్ధసత్యాలు) ఇప్పటికే యంత్రానువాదం (మిషన్ ట్రాన్స్లేషన్) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్ ఫ్రీ అప్లికేషన్స్ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి. – డా. ఎస్. చంద్రయ్య, టి. సతీశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు,లోకేష్ తెలుగు భాష కోసం ఏమీ చేయలేదు : లక్ష్మీపార్వతి
-
ప్రవాస తెలుగు పురస్కారాలు.. ఎంట్రీలకు ఆహ్వానం
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ మరియు వీధి అరుగు ఆధ్వర్యంలో 2021 ఆగష్టు 𝟐𝟖, 𝟐𝟗లలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విదేశాలలో నివసిస్తూ తెలుగు భాషా , సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారికి ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందిస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే ఈ పురస్కారాన్ని అందిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి మీరు చేసిన వివరాలను ఈ కింది లింకు ద్వారా లేక ఈ-మెయిల్ ద్వారా పంపాలని సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగులు కోరాయి. https://tinyurl.com/pravasa , pravasatelugupuraskaralu2021@gmail.com -
ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ
సాక్షి, విశాఖపట్నం/కొరుక్కుపేట (చెన్నై): తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. భాషతో సాంకేతికతని అనుసంధానం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఇందుకు తెలుగు సంస్థలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించారు. విశాఖలో ఉన్న వెంకయ్య నాయుడు ఈ వర్చువల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల వెలుపల ఉండే తెలుగు జనాభా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఉందని గుర్తు చేశారు. వెయ్యికి పైగా తెలుగు సంస్థలు భాషా పరిరక్షణకు పాటుపడుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీదకు తీసుకురావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆలిండియా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డా.సీఎంకే రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు తదితరులు పాల్గొన్నారు. -
లాక్డౌన్లో ‘పుష్ప’ కోసం నటుడు ఫహద్ ఫాసిల్ కసరత్తు!
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీలో ఆయనకు డబ్బింగ్ చెప్పేందుకు ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్, హీరో తరుణ్‌తో ఇటీవల పుష్ప టీం చర్చలు జరిపినట్లు ఫిలీంనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. తాజా బజ్ ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఫహాద్ తెలుగు నేర్చుకునే పనిలో పడ్డాడట. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని రోజు తెలుగు భాషపై కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అయితే ఇందులో ఫహాద్ అవినీతి పోలీసు అధికారిగా, చిత్తూరు యాసలో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ యాసపై పట్టుసాధించేందుకు రోజు ప్రాక్టీస్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడట. అంతేకాదు దీనికి ప్రత్యేకంగా కోర్స్ కూడా తీసుకుంటున్నాడని వినికిడి. కాగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పుష్పను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి
అట్లాంటా: తెలుగు జాతి, సంప్రదాయం ప్రపంచ పటంపై వెలుగుతోంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగుకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడ అధికారికంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది సందర్భంగా ఆ రోజును తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగువారి సేవలను జార్జియా ప్రభుత్వం ప్రశంసించింది. దాంతోపాటు తెలుగు సంప్రదాయం, భాష బాగుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ స్టెయిర్స్ ఆఫ్ జార్జియాలో జరిగిన ఉగాది వేడుకలో తెలుగు వారికి దానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అధికారులు అందించారు. జార్జియాలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వైద్యులు, ఇంజనీర్లుగా జార్జియా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 మంది అక్కడి విద్యా రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఉన్నారు. భారతదేశ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే తెలుగు వారుగా గుర్తింపు పొందుతున్నారు. ఏప్రిల్ 12వ తేదీని తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు పాటలు, ఆటలు, సాహిత్య పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. -
‘ఆదిపురుష్’ కోసం తెలుగు నేర్చుకుంటున్న ‘సీత’!
‘అందరికీ నమస్కారం.. బాగున్నారా! యాక్చువల్లీ ఐ డోంట్ నో తెలుగు. నెక్ట్స్ టైమ్ ఐ విల్ స్పీక్ ఇన్ తెలుగు..’ అంటూ తెలుగు చిత్రాల్లో నటించే పరభాషా తారలు అనడం పలు వేడుకల్లో విన్నాం. ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన బాలీవుడ్ భామ కృతీ సనన్ కూడా అలానే అన్నారు. ఆ తర్వాత కూడా పెద్దగా తెలుగు నేర్చుకోలేదామె. ఇప్పుడు నేర్చుకునే పని మీద ఉన్నారు. ఔం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన కృతీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ది రాముడి పాత్ర. కృతీది సీత పాత్ర. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూటర్ని పెట్టి, కృతీకి తెలుగు నేర్పిస్తోందట చిత్రబృందం. సో.. ఈ సినిమా వేడుకలో ‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు వచ్చేసింది’ అని కృతీ అంటారేమో చూడాలి. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్.. తొలిసారి తెలుగులో
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఏ సెషన్‌లోనైనా పరీక్షలు రాసుకునేలా, అన్నింటిలో ఉత్తమ స్కోర్ ఏది వస్తే దానినే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్ మాత్రమే కాకుండా మొదటిసారిగా 12 భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది. తెలుగులో పరీక్షలు రాసేందుకు 374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జేఈఈ మెయిన్ నిర్వహించినప్పుడు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవగా ఈసారి ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో జరిగే మొదటి సెషన్లో 6,61,761 మంది పరీక్ష రాయనున్నారు. ఇంకా మూడు సెషన్లలో పరీక్షలు రాసే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి సెషన్లో పరీక్షలు రాసే వారి సంఖ్య తగ్గింది. ఇక మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రెండో సెషన్ పరీక్షలు, ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో మూడో సెషన్ పరీక్షలు, మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నాలుగో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. మేలో సీబీఎసీఈ 12వ తరగతి పరీక్షలు ఉన్నందున జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లోనే ఎవరైనా విద్యార్థులకు 12వ తరగతి పరీక్ష ఉంటే విద్యార్థులు తెలియజేయాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే మొదటి సెషన్ జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యేందుకు నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండగా మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఏపీ విద్యార్థులు 87,797 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ నుంచి 73782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం తెలంగాణలో 12 కేంద్రాలను, ఏపీలో 20 కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఏపీ పరిధిలో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో ఏర్పాటు చేశారు. పరీక్ష విధానం ఇలా.. ఈసారి కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఏ అదనంగా 15 ప్రశ్నలు ఇస్తోంది. మొత్తంగా 90 ప్రశ్నలు ఇవ్వనుండగా అందులో విద్యార్థులు 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. బీఈ/బీటెక్ పరీక్షను తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ ఉంటాయి. సెక్షన్–ఏలో 20 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే వాటన్నింటికీ సమాధానాలు రాయాలి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. సెక్షన్–బీలో నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రతి సబ్జెక్టులో 10 చొప్పున న్యూమరికల్ వ్యాల్యూ జవాబుగా ఉండే ప్రశ్నలు ఇస్తారు. అందులో 5 చొప్పున ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇదీ పరీక్షల సమయం... ♦ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో రోజూ రెండు షిఫ్ట్‌లలో ఆన్లైన్ పరీక్షలు ♦మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ♦రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ♦కచ్చితంగా అరగంట ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలి. పరీక్ష ప్రారంభ సమయం తరువాత విద్యార్థులను అనుమతించరు. ♦మొదటి షిఫ్ట్ పరీక్షకు విద్యార్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రం, హాల్లోకి అనుమతిస్తారు. ♦రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు అనుమతిస్తారు. -
దక్షిణామూర్తి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్ చైతన్యపురిలోని తన గృహంలో శనివారం కన్నుమూశారు. తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ పొందిన దక్షిణామూర్తి అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెయింట్’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. దక్షిణామూర్తి 1935 డిసెంబర్ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా చైతన్యపురి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన శనివారం రాత్రి 7.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం వీవీ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. సంతాపం ప్రకటించిన సీఎం జగన్ పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్నారని, ఆయన అనువదించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
అమెజాన్ ఇక తెలుగులో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.ఇన్ తాజాగా తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పోర్టల్ ఇంగ్లిష్, హిందీలో సేవలు అందిస్తోంది. ఆన్లైన్ షాపింగ్‌లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. రానున్న పండుగల సీజన్లో మరో 20–30 కోట్ల మంది వినియోగదార్లను చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది. కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్లను తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు జరిపేందుకు మార్గం సుగమం అయిందని అమెజాన్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిశోర్ తోట ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు భాషల చేరిక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్ సైట్స్‌లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్ సర్వీసు సిబ్బందితో తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో మాట్లాడవచ్చు. -
గిడుగు జయంతిని జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే
సాక్షి, అమరావతి: తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘గ్రాంథికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని, పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యులకందించిన గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగును సన్మానించుకోవడమే’ అని పేర్కొన్నారు. నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు సినీ హీరో అక్కినేని నాగార్జునకు సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యంత ప్రశంసనీయమైన నటుల్లో ఒకరైన నాగార్జునకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఆస్ట్రేలియా స్కూళ్లలో తెలుగు భాష
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషకు అరుదైన గౌరవం లభించింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టం కట్టింది. అంతేకాకుండా తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో 5 పాయింట్లు అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ ఫర్ ట్రాన్సిలేటర్స్ అండ్ ఇంటర్‌ప్రెటర్స్ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఇది శాశ్వత నివాసానికి ప్రామాణికం. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో ఉన్న సుమారు లక్ష మందికి పైగా తెలుగు వాళ్లకే కాకుండా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లేవాళ్లకు చక్కటి అవకాశమని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకులు, మీడియా, కమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి మల్లికేశ్వర్‌రావు కొంచాడ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో తెలుగు భాష గుర్తింపు కోసం తాము చేసిన కృషికి ఫలితం లభించిందని ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటి వరకు వివిధ నగరాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్లు మన పిల్లలకు తెలుగును బోధించేందుకు ప్రత్యేకంగా ‘మన బడి’వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, ఇక నుంచి ఆ అవసరం ఉండబోదన్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ,తమిళ భాషలకు అక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించగా, 4వ భాషగా తెలుగు ఆ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్లాండ్,సౌత ఆస్ట్రేలియా, తదితర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ప్రయోజనం లభించనుంది. భావి తరాలకు బాటలు.... ఆస్ట్రేలియాలో తెలుగు భాషా వికాసం కోసం చాలాకాలంగా అనేక సాహిత్య, సాం స్కృతిక సంస్థలు కృషి చేçస్తూ భావి తరాలకు బాటలు వేస్తున్నాయి.‘తెలుగుమల్లి’ సాహిత్య మాసపత్రిక, ‘భువనవిజయం’ వంటి సాంస్కృతిక సంస్థలు ఈ క్రమంలో తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవితాన్ని, చరిత్రను దశదిశలా చాటేలా గత పదేళ్లుగా భువనవిజయం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు వివిధ నగరాల్లో పని చేసే తెలుగు అసోసియేషన్లు ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్యగా ఏర్పడి గత ఆరేడేళ్లుగా తెలుగు భాష గుర్తింపు కోసం అక్కడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో విభిన్న సంస్కృతులకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు సైతం మరో కలికితురాయిగా నిలిచింది. 2014లో దరఖాస్తు... ‘‘ తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు అందజేశాం.కానీ అప్పటి జనాభా లెక్కల ప్రకారం మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేపట్టాం. తెలుగు వాళ్లనందరినీ ఒక్కటి చేయగలిగాం.సుమారు లక్ష మందికి పైగా ఉన్నట్లు తేలింది. దీంతో తెలుగు భాషకు సమున్నతమైన గుర్తింపు లభించింది.ఇది తెలుగు వారికి ఒక పర్వదినం’’ అని మల్లికేశ్వర్‌రావు చెప్పారు. ఈ కృషిలో డాక్టర్ కృష్ణ నడింపల్లి, శివ శంకర్ పెద్దిభొట్ల, వాణి మోటమర్రి తదితరులు కూడా ఉన్నారు. -
స్టార్ మాలో రామాయణం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, బంధాలలోని గొప్పతనాన్ని, విలువలతో కూడిన జీవన విధానాన్ని చెప్పే ఇతిహాసం రామాయణం. తండ్రిమాటను జవదాటని కుమారుడు...ఆ కుమారునిపై అవాజ్యమైన ప్రేమను కురిపించే తండ్రి, పతి బాటలలోనే సతి అనే ఇల్లాలు... ఇలా ఎన్నో బంధాలు, మరెన్నో జీవనసత్యాలను తెలియజేసే మహోన్నత పౌరాణిక గాథ రామాయణం. భారతీయ జీవనగమనంలో అంతర్భాగమైన ఈ పుణ్యగాథ నేటి తరానికి మార్గనిర్ధేశకం. టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనంగా 1980లలో రామానంద్ సాగర్ తీసిన రామయణ్ గాథను ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతుంది. అంతర్జాతీయంగా ఓ పౌరాణిక గాధకు అత్యధిక వీక్షణ రేటింగ్ తెచ్చుకోవడం ద్వారా గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న రామాయణ్‌ను లాక్డౌన్ కాలంలో పునః ప్రసారం చేశారు. అయితే హిందీ భాషలో ఉండటం, భావం అర్థం అయినా భాష అర్థంగాక పోవడం వంటి సమస్యలను కొంతమంది అభిమానులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందిస్తూనే రామానంద్ సాగర్ తీసిన 'రామాయణ్' సీరియల్‌ను స్టార్ మా ఛానెల్ తెలుగులో ప్రసారం చేయబోతుంది. ఈ సీరియల్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అనకాపల్లికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ. తన యుక్త వయసులో తాను ఈ సీరియల్‌ను దూరదర్శన్‌లో ఆదివారం పూట వీక్షించేవారమంటూ, అప్పట్లో ఇంటిల్లిపాది ఈ సీరియల్‌నూ క్రమం తప్పకుండా చూసేవారమని, మరలా ఇన్నాళ్లకు లాక్డౌన్లో మరలా ప్రసారం చేయడం చూశామన్నారు. భాష అర్థంగాకపోవడం కొంత సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో ప్రసారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెనే మాట్లాడుతూ భారతీయ జీవనశైలికి ప్రతిరూపం రామాయణం. కనుమరుగవుతున్న కుటుంబ బంధాల వేళ పరమ పవిత్రమైన రామాయణ మహాకావ్యం మనందరికీ జీవనముక్తి మార్గం చూపడమే కాదు బంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా చూపుతుందన్నారు. ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతుంది. -
ఆంగ్లమా... తెలుగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది. వారి మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో టిక్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. ► హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈనెల 21న జీవో 20 జారీ చేశారు. దీన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ► 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1–6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి. ► అమ్మ ఒడి కార్యక్రమం కోసం పాఠశాలలు, గ్రామం, మండలాల వారీగా సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఫార్మాట్లో లిఖిత పూర్వకంగా సేకరించాలి. కోవిడ్ నేపథ్యంలో తగిన ప్రోటోకాల్‌ను పాటించాలి. ► మాధ్యమంపై తల్లిదండ్రుల సంతకాలతో సేకరించిన ఫార్మాట్ హార్డ్ కాపీలను పాఠశాల, మండలాల వారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో భద్రపరచాలి. ► మండల విద్యాధికారులు ఈ సమాచారాన్ని ఫారం–1 ద్వారా క్రోడీకరించాలి. జిల్లా స్థాయిలో క్రోడీకరించిన సమాచారాన్ని ఫారం–2లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి. ► ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులందరికీ ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశారు. ప్రొఫార్మాలో సమాచారం ఇలా ఇవ్వాలి... ► జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి. ► తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మీడియం కావాలో ఎంచుకుని పత్రంలో టిక్ చేయాలి. ► 2020–21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్లను ఇచ్చింది. మూడు ఆప్షన్లు ఇవీ.. 1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం 2. తెలుగు మీడియం 3. ఇతర భాషా మీడియం ► ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్ చేయాలి ► ఎంపిక చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి ► తల్లి/తండ్రి/సంరక్షుకుడు∙సంతకం తప్పనిసరిగాచేయాలి. ► కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి. -
తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్
సాక్షి, అమరావతి : గత రెండ్రోజులుగా కోవిడ్-19 నియంత్రణకు ఇంగ్లిష్ భాషలో మాత్రమే వినిపిస్తున్న కాలర్ ట్యూన్ ఇప్పుడు తెలుగులోనూ వినిపించనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడారు. నమస్తే అంటూ మొదలై.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జనసమర్థంలోకి వెళ్లవద్దని చెప్పడం, వైరస్ లక్షణాలున్న అనుమానితులను గుర్తించడం వంటి పలు అంశాలతో కూడిన చక్కటి వాయిస్‌ను రూపొందించారు. సుమారు యాబై సెకన్ల పాటు ఈ కాలర్ ట్యూన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అన్ని మొబైల్ ఫోన్లలోనూ కోవిడ్ నిరోధానికి పాటించే జాగ్రత్తలు తెలుగులోనే రానున్నాయి. ఇప్పటివరకు ఇంగ్లీష్‌లో వచ్చే ఈ కాలర్ ట్యూన్ అర్థం కాక సామాన్యులు ఇబ్బంది పడుతుండేవారు. (బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా) హోమియో మందుల పంపిణీ కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఏపీ సచివాలయంలో మంగళవారం ఆర్సెనికం ఆల్బమ్–30 పేరున హోమియో మందులు పంపిణీ చేశారు. ప్రాంతీయ ఉపసంచాలకులు వెంకట్రామ నాయక్ నేతృత్వంలో 1,500 మందికి హోమియో మందులు అందించామని సెక్రటేరియట్ వైద్యులు వెంకట్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మీ, సత్యబాబు తెలిపారు. ఈ హోమియో మందు రాష్ట్రంలోని అన్ని వైద్య కేంద్రాల్లో, హోమియో షాపుల్లో లభిస్తోందన్నారు. భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ఆమోదించిందని వెల్లడించారు. -
అమ్మ భాష తెలుగు.. అక్షరమై వెలుగు
మాతృభాష గొప్పదనం మాటల్లో వర్ణించలేనిది. భావ వ్యక్తీకరణకు సులభమైన.. సులక్షణమైన మార్గం అమ్మభాష. అందుకే గాంధీ మాతృభాష గురించి ఇలా అన్నారు.. మాతృభాషా తృణీకారం.. మాతృదేవీ తిరస్కారం అని రెండు పంక్తుల్లో మాతృభాష ప్రాశస్త్యాన్ని చాటిచెప్పారు. ప్రతి జాతి సంస్కృతి వికాసానికి మూలం మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం పెరిగింది. అయితే మనగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తపడాలి. తమతమ మాతృభాషలను కాపాడుకోవాలని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. సాక్షి, విజయవాడ : మాతృ భాషతోనే జాతి సాంస్కృతిక సంపద వెలుగొందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది భాషలు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషల ఉనికి ప్రమాదంలో పడటం ఆందోళన కలిగించే అంశం. మాతృ భాష కోసం బెంగాల్ యువకుల ఆత్మబలిదానం రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి పునాది పడింది. నేపథ్యం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి 21న నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ సభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. లక్ష్యాలు ప్రపంచంలోని చిన్నాచితకా దేశాలతో పాటు అతి పెద్ద దేశాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి దేశానికి, ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ భాష ఉంటుంది. భాషా సాంస్కృతిక వైవిధ్యం కాపాడుకోవడం, బహు భాషల ప్రభావాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం భాషా వికాసానికి లక్ష్యాలుగా ఉండాలని మేధావులు సూచించారు. ►మాతృభాషా వికాసానికి ప్రభుత్వాలు నడుంబిగించాలి. ►అంతరించిపోతున్న భాషలను గుర్తించి కాపాడుకోవాలి. ►మౌఖిక భాషలకు అక్షర రూపం కల్పించాలి. ►ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా భాషా సదస్సులు నిర్వహించాలి. ►పాలనాభాషాగా ప్రజలు మాట్లాడే భాష ఉండాలి. ►భాషకు అనుబంధంగా ఉన్న మాండలికాలను ప్రోత్సహించాలి తెలుగు భాషాభివృద్ధిలో మన కవులు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినవారిలో కృష్ణానదీ తీరప్రాంతమైన పెనుగంచిప్రోలులో జని్మంచిన ఉద్యమకర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, తెలుగులో తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ ముఖ్యులు. నిద్రాణమైన తెలుగు జాతిని మేల్కొలిపిన కొమర్రాజు 1876 మే 18న పెనుగంచిప్రోలులో జని్మంచిన కొమర్రాజు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం రచయిత, విజ్ఞాన మండలి స్థాపకుడు. భువనగిరిలో ప్రాథమిక విద్య అభ్యసించి నాగపూర్‌లో అక్కాబావలతో ఉంటూ మరాఠీ భాష నేర్చుకున్నాడు. 1900లో బీఏ, 1902లో ఎంఏ ఉత్తీర్ణులయ్యారు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు రాశారు, తెలుగు, మరాఠీ, ఇంగ్లిషు, సంస్కృతం, బెంగాల్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1901లో శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయమైన పుస్తక భాండాగారాన్ని నెలకొల్పిన తొలి తెలుగు వ్యక్తి. 1906లో విజ్ఞాన చంద్రిక మండలిని, 1910లో విజ్ఞాన చంద్రిక పరిషత్‌ను స్థాపించారు. 1916లో రచించిన తెలుగు విజ్ఞాన సర్వస్వం పుస్తకం దక్షిణ భారతదేశంలో సంచలనం సృష్టించింది. 11 భాషా విషయక పుస్తకాలు, 2 చారిత్రక గ్రంథాలు, ఇతర శా్రస్తాలతో 20 పుస్తకాలు రాశారు. 1923లో ఆరోగ్యం క్షీణించి తిరిగిరాని లోకాలకేగారు. తొలి తెలుగు కథారచయిత్రి బండారు అచ్చమాంబ కొమర్రాజు సోదరి అయిన అచ్చమాంబ దేశంలోనే తొలి తెలుగు కథారచయిత్రి. ఆమె అనేక రచనల్లో స్త్రీవిద్య, వితంతు పునరి్వవాహం వంటి సాధక విషయాలతో హిందూసుందరి, జనాన అనే పత్రికల్లో వ్యాసాలు రాశారు. 1901లో మహిళా సంఘాన్ని స్థాపించిన తరువాత ఆమె 1902లో అబల సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని వెలువరించింది. 1901 నుంచి 1903 వరకు ధనత్రయోదశి, గుణవతి వంటి 10 కథలు రాశారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా గౌరవం అందుకున్నారు. ఆమె కథల్లో భావోద్వేగాలు, స్త్రీవాదాలు, హక్కులు మొదలైన వైవిధ్యభరితాలు ఆనాడే కనపడేవి. 1904లో ఆమె రాసిన బీద కుటుంబం అనే కథ నాటి సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. స్పష్టమైన అభిప్రాయాలతో రచనలు కొనసాగించి తొలి తెలుగు కథా రచయిత్రిగా సుస్థిర స్థానాన్ని పొందారు. -
తల్లిభాష నిలవాలి ఇంగ్లిష్తో గెలవాలి!
తల్లి భాషమీద తెలుగువారికి భావోద్వేగం ఉన్నంత పట్టుదల లేదు. వీరభక్తి పొంగి పొర్లేపాటి వివేకం లేదు. విధిగా ఏం చేసి భాషను బతికించుకోవచ్చో వివేచన లేదు. పాలకుల్లోనూ గాలి మాటలు చెప్పడము న్నంత కార్యాచరణ లేదు. తల్లి భాషగా తెలుగు బాగుకు, భాషాభివృద్ధికి ప్రభుత్వాల పరంగా చేస్తున్నది పెద్ద బండిసున్న. రెండు వేల ఏళ్లకు పైన వాడుకలో, వెయ్యేండ్లకు పైబడి సాహిత్యంలో తెలుగు నిలిచిందంటే... కవి–పండితులు, ఇతర సాహిత్యకారులు, భాషాభిమానులు, సామాన్యుల నిరంతర కృషి, సాధన, వ్యాప్తి, వ్యవహారమే తప్ప పనిగట్టుకొని ప్రభుత్వాలు చేసిన గొప్ప మేళ్లేమీ లేవు. నిర్దిష్ట కార్యాచరణే లేదు. సర్కార్లు చేసిన మేలు లేకపోగా... అధికారుల ఆంగ్ల ఆధిపత్యధోరణి వల్ల ఇన్నాళ్లు తెలుగుకు జరిగిన ద్రోహమే ఎక్కువ! ఇక భాష వివిధ రూపాల్లోకి, మాండలి కాల్లోకి మారుతూ కూడా మౌలికంగా తన స్వభావాన్ని నిలుపుకొని ఈ నేలపై మనుగడ సాగిస్తోందంటే, అందుకు తెలుగు సమాజపు అవస రాలే కారణం. సామాన్యుల నుంచి సంపన్నులు, మహా విద్యావంతుల వరకు రోజువారీ వాడుక, వ్యవహారం వల్ల, అంతో ఇంతో వారి సాహితీ సృజన, ఆసక్తి వల్ల తెలుగు నిలిచింది. ఇప్పుడు తల్లి భాష గురించి తల్లడిల్లే వారిది, ఆంగ్ల భాషను తిట్టిపోసుకునే వారిదీ ఆవేశమే తప్ప సమగ్ర ఆలోచన కాదు. అసలు తెలుగుకు గడ్డుకాలం దాపురిం చడంలో లోపమెక్కడుందో గుర్తించే తెలివిడీ కాదు. తెలుగుపై సాను భూతి ప్రకటనలో ఆడంబరమే తప్ప కనీసం తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలోనూ ఆచరణ శూన్యం! తెలుగు మాతృభాషలోనే ప్రాథ మిక విద్యాబోధన జరగాలనే వాదనలో హేతువుంది. మామూలుగా చూసినపుడు ఆ ప్రతిపాదన బాగానే కనిపిస్తున్నా... అలా చదివిన వారు ప్రాథమిక విద్యో, మాధ్యమిక విద్యో ముగిశాక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో చూడాలి. తర్వాతి కాలంలో వారెంతగా ఆంగ్లంపై ఆధారపడాల్సి వస్తున్నదో పరిశీలించాలి. అప్పటిదాకా తెలుగులో సాగించిన విద్యాభ్యాసం తమ తదనంతర ఉన్నత విద్యకు, ఉద్యోగం–ఉపాధి పొందడానికి ఎలా ప్రతిబంధకమౌతోందో గమనిం చాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ దాటాక కూడా తెలుగు మాధ్య మంలోనే కొనసాగడానికున్న అవకాశాలు–పరిధులు, వనరులు–పరి మితులు, ఇతర సాధన సంపత్తి–కొరత ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించాలి. వాటన్నిటికీ మించి, ఉన్నత–వృత్తి విద్యా కోర్సుల్లో విధి లేని పరిస్థితుల్లో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వల్ల వారు ఎదు ర్కొంటున్న కష్ట–నష్టాలు బేరీజు వేయాలి. అప్పుడుగాని, మన వాళ్ల భావావేశంలో కొరవడుతున్న సంబద్ధత, తెలుగే కావాలంటూ ఇంగ్లీషు ను ఈసడించుకోవడంలో లోపిస్తున్న హేతుబద్ధత అర్థం కావు. పోటీకి సమస్థితి కల్పించాలి జర్మనీ, జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ... ఇలా అభివృద్ధి చెందిన దేశాలను ఉటంకిస్తూ, వారంతా తల్లిభాషలో ప్రాథమిక విద్య బోధన వల్లే అత్యంత సృజనతో ఎదుగుతున్నారనే వాదన ఉంది. అది నిజమే! ప్రాథమిక విద్య తల్లి బాషలోనే సాగాలన్నప్పుడు, ఇతరేతర సదుపా యాలు, వనరుల కల్పన, సన్నద్ధత ఎంతో అవసరం. పోటీదారుల మధ్య సమ, సానుకూల వాతావరణమూ ముఖ్యమే! ఆంగ్ల–తెలుగు మాధ్యమ విద్యార్థులకు విద్య–ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వ్యత్యాసా లకు తావులేని సమస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. అవసరమైతే తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రోత్సాహకాలివ్వాలి. రిజర్వేషన్ కల్పించాలి. ఆయా దేశాల్లో లేని ఒక విచిత్ర పరిస్థితి బ్రిటీష్ వలస దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కొఠారీ విద్యా విధాన ప్రభావం వల్ల ఇంగ్లీషు చదువులొక పార్శ్వంలో వృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ వంటి స్థానిక భాషలకు, విశ్వ భాషగా పరిగణించే ఇంగ్లీషుకు మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. పైన పేర్కొన్న అభివృద్ధి సమాజాల్లో ఈ పంచాయతీ లేదు. వారికి తల్లి భాషలోనే అన్నీ ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతో పోటీ పడే వారెవరూ ఉండరు. దేశంలోని అన్ని స్థాయిల వారికీ తల్లి భాషలోనే పోటీ! ఇక భాషాపరమైన వ్యత్యాసాలు, వివక్షకు తావెక్కడ? మన దగ్గర ఇప్పటికీ సంపన్నులు, ఎగువ మధ్య తరగతి, అంతో ఇంతో ఆర్థిక స్తోమత కలి గిన వారు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన జరిపిస్తుంటారు. అది సైన్స్–టెక్నాలజీ అయినా, సామాజిక శాస్త్రా లైనా, వృత్తి కోర్సులయినా... ప్రపంచ స్థాయి విషయ వనరులు, ఆధు నిక సమాచారం, కొత్త పరిభాష ఆంగ్లంలోనే లభిస్తుంది. కానీ, తెలుగు వంటి స్థానిక భాషల్లో శాస్త్రీయ పరిశోధనల లేమి, భాష ఎదుగుదల లేకపోవడం, భాషాంతరీకరణలు, అనువాదాలు ఎప్పటికప్పుడు జర గకపోవడం, పారిభాషక పదకోశాలు, నిఘంటువులు సరిగా నిర్మాణం కాకపోవడం వల్ల విషయ వనరుల కొరత ఉంటుంది. బోధన కూడా ఆ స్థాయిలో ఉండదు. భావ ప్రసరణ నైపుణ్యాల్లోనూ వెనుకబాటుత నమే! దాంతో, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలప్పుడు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో పోటీ పడలేని స్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకుంటుంది. ఇందుకు నేపథ్యం... పేద, దిగువ మధ్య తర గతి పిల్లలు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన దొరకని సర్కారీ బడుల్లో, తెలుగులోనే చదువుకోవాల్సి రావడం. ఒక స్థాయి దాటిన తర్వాత వారికి కష్టాలు ఎదురవుతున్నాయి. అవకాశపు తలుపులు మూసుకు పోతున్నాయి. తెలివి, చొరవ, ఆసక్తి, వాటన్నిటికీ మించి అవసరం ఉండి కూడా పోటీని తట్టుకోలేక చతికిలపడుతున్నారు. అందుకే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధ నను వారు స్వాగతిస్తున్నారు. ఇవేవీ ఆలోచించకుండా సర్కారు బడుల్లో తెలుగే మాధ్యమంగా ఉండాలని, ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదనే వాదన సరికాదు. అది కడకు ఉన్నవారికి–లేనివారికి మధ్య దూరం పెంచడమే! అవకాశాల్లో వివక్షను పెంచి పోషించడమే అవుతుంది. పేదవర్గాలకు చెందిన తెలుగు మాధ్యమ విద్యార్థుల అవ కాశాల్ని కర్కశంగా నలిపేయడమే అవుతుంది. బతికుంచుకునే ఏ యత్నమూ జరగట్లే! భాష ఎన్నో ప్రయోజనాలు కలిగిన మానవ పనిముట్టు. ఇతర జీవుల నుంచి మనిషిని వేరుపర్చే ప్రత్యేక లక్షణం భాషది. మరే జీవీ మనిషి లాగా భాషనొక సాధనంగా మార్చుకొని తన రోజువారీ అవసరాలు తీర్చుకున్నది లేదు. భాషలెన్ని ఉన్నా... తల్లి భాష ఎంతో ముఖ్య మైంది. రోజువారీ వ్యవహారాల్లోనే కాక మనసు ప్రకటించడం, బంధా లల్లుకోవడం, వక్తిత్వ వికాసం, ఊహ పరిధి విస్తరణ, మానవ సంబం ధాల వృద్ధి... ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు భాష వల్లే సాధ్యం. ఇలా పరస్పర భావ ప్రసరణకే కాకుండా వారసత్వంగా వస్తున్న సంప్ర దాయ విజ్ఞానాలను భవిష్యత్తరాలకు అందించడానికి, భద్రపరచడా నికీ భాష సాధనం. ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ తల్లి భాషా దినోత్సవంగా ప్రకటించడానికి ప్రేరణ మన బెంగాలీలే! తూర్పు పాకిస్తానీయులు తమ తల్లి భాష బంగను జాతీయ భాషగా గుర్తించాలని 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో ఆందోళన చేస్తున్నపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు యువకులు బలయ్యారు. దాంతో కదిలిపోయిన పాక్ ప్రభుత్వం బంగను ఒక జాతీయ భాషగా ప్రకటించింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డపుడు బంగ భాషే అక్కడ అధికార భాషయింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తల్లి భాషను కాపాడుకునే నిర్మాణాత్మక ప్రయత్నమేదీ తెలుగు సమాజంలో జరగటం లేదు. రాను రాను తెలుగు చదివే, రాసే వారి సంఖ్య రమా రమి తగ్గిపోతోంది. తెలుగుపట్ల కొత్తతరం ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తెలుగు నేర్చుకొండని తలిదండ్రులూ తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రతి తరగతిలో తెలుగు ఒక తప్పనిసరి ‘విషయం’గా నిర్బంధం చేస్తూ ఆదేశాలి చ్చారు. ఇదివరకు అలా లేదు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంకా ఫ్రెంచ్ తదితర భాషల్లోంచి ఏదైనా ఒకటి ఎంపిక చేసుకునే అవ కాశమిస్తూ వచ్చారు. దాంతో, తేలిగ్గా ఉంటుందని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఏ హిందీనో, సంస్కృతమో, ఫ్రెంచో ఎంపిక చేసు కోవడం మన పిల్లలకు అలవాటయింది. దాంతో తెలుగుకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు తెలుగును నిర్బంధం చేయడం వల్ల విధిగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తల్లి భాష పరిరక్షణలో ఇదో ముందడుగు. ఇంకెంతో చేయాలి ఉన్నత విద్య ప్రవేశాల్లో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల కల్పనలోనూ తెలుగులో అభ్యర్థులకుండే ప్రావీణ్యానికి అదనపు వెయిటేజీ మార్కు లివ్వాలి. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక పరిశోధనలు, పరిణామాల సమాచారం నిరంతరం తెలుగులోకి తర్జుమా అయ్యేట్టు చూడాలి. ఇంటర్నెట్తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో తెలుగు అందుబాటులో ఉండేట్లు ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగును ఓ ఆధారపడదగ్గ భాషగా నేటి యువతరానికి విశ్వాసం కల్పించాలి. అధికార భాషా చట్టం నిర్దేశిస్తున్నట్టు, ప్రభుత్వ ఉత్త ర్వులు, ఆదేశాలు, నివేదికలు, విధివిధానాలు, నిత్య వ్యవహారాలు... ఇలా అన్నీ తెలుగులోనే జరిగేలా కట్టడి చేయాలి. స్థానిక న్యాయ స్థానాల్లో తెలుగులోనే తీర్పులు వెలువడేలా చూడాలి. వారికెంత ఇంగ్లీష్ వచ్చినా, తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడు కోవాలి. తల్లి భాషలో మాట్లాడటాన్ని తక్కువ చేసి చూడకూడదు. మాండలికాల్ని ఆదరిస్తూనే ఓ ప్రమాణభాష రూపొందించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి ఒకరు మరొకరికి నేర్పండి’ (ఈచ్ వన్ టీచ్ వన్) అంటోంది. తల్లిభాష వ్యాప్తికి ఇదొక చక్కని అవకాశం. తల్లి భాష తెలుగును కాపాడుకోవ డమంటే ప్రపంచపు కిటికీ ‘ఇంగ్లీషు’ను వ్యతిరేకించడం కాదు. తెలు గును విని, మాటాడి, చదివి, రాయగలిగితే చాలు. మహా కథకుడు కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘తల్లిభాషలో ఒక ఉత్తరం రాయటం చాతగాని వాడు ఎన్ని డాక్టరేట్లు సంపాదించినా నిరక్షరుడే!’ (నేడు అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవం) ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకం కాదు
సాక్షి, నెల్లూరు: ఇంగ్లిష్ మీడియంకు తాను వ్యతిరేకిని కాదని, ముందు మన మాతృభాషను మరిచిపోకుండా ఉంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఏ భాష ఉన్నా ప్రభుత్వం మాత్రం మాతృభాషతో పాటు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలన్నారు. పరాయి భాషలను తానెప్పుడూ వ్యతిరేకించబోనని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో జరిగిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగు భాషాభిమానులతో జరిగిన కార్యగోష్టి ముగింపు సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భాష ప్రాచీనతను, విశిష్టతను పరిరక్షించుకోవడం మన ప్రధాన లక్ష్యం కావాలన్నారు. మైసూరు నుంచి ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా తరలించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిద్ధపడి రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిందని.. తాను నెల్లూరుకు వచ్చేలా కృషిచేశానని వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలో అన్ని సౌకర్యాలతో కేంద్రం ఏర్పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ.. తిక్కన పుట్టిన నెల్లూరుకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శబ్ధాల్లోనే శక్తి ఉంటుందని, ఆ శబ్ధాలను పరిరక్షించుకోవాలన్నారు. భారతీయ భాషలు ఎన్ని ఉన్నాయో వాటిన్నింటినీ పరిరక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం స్థలం ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకరించారని.. త్వరలోనే ఈ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటుచేస్తామని రమేష్ చెప్పారు. మాతృభాషలోనే ప్రాథమిక శిక్షణ ఉండాలని.. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమన్నారు. మాతృభాష, మాతృభూమి, మాతృదేశం అనేవి ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యమైనవన్నారు. -
ఇక తెలుగులోనూ జేఈఈ మెయిన్!
సాక్షి, హైదరాబాద్: మాతృ భాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు జేఈఈ మెయిన్ పరీక్షలను 9 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిం చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఆదేశాల మేరకు ఈ కసరత్తును ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్/హిందీ లేదా గుజరాతీలో ఇచ్చే జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు న్నట్లు ఎంహెచ్ఆర్డీ గుర్తించింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తుండటంతో ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2021 జనవరి నుంచి జేఈఈ మెయిన్‌ను ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్టీఏను ఎంహెచ్ఆర్డీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎన్టీఏ కసరత్తు ప్రారంభించింది. దాదాపు లక్షన్నర మందికి పైగా తెలుగు విద్యార్థులు రాసే ఈ పరీక్షలను తెలుగులోనూ నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. వచ్చే ఏప్రిల్‌లో మాత్రం మూడు భాషల్లోనే.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌నూ మూడు భాషల్లోనే నిర్వహిస్తోంది. ఇంగ్లిష్, హిందీతోపాటు గుజరాతీలోనూ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 2013లో జేఈఈ మెయిన్ అమల్లోకి తెచ్చినపుడు తమ భాషలోనూ పరీక్ష నిర్వహించాలని గుజరాత్ కోరడంతో గుజరాతీలోనూ పరీక్ష నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలు అప్పట్లో అడగకపోవడంతో తెలుగులో నిర్వహించడం లేదు. 2018 వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ పరీక్షలను నిర్వహించగా, 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మూడు భాషల్లోనే ఈ పరీక్షలను నిర్వహించింది. వచ్చే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ను కూడా మూడు భాషల్లోనే నిర్వహిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. 11 భాషల్లో నిర్వహించేలా.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, మాతృ భాషల్లో చదువుకున్న వారు నష్టపోకుండా ఉండేందుకు 11 భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఆ 11 భాషల్లో 9 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. 2021 జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. 2021 జనవరి తరువాత కూడా ఇకపై ప్రతి ఏటా 11 భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇంకా ఏమైనా రాష్ట్రాలు అడిగితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసి ఇచ్చే అంశాలను కూడా ఎన్టీఏ పరిశీలిస్తోంది. ‘ఆ జవాబులు సరైనవే’ జేఈఈ మెయిన్ పరీక్షలోని 5 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు ‘కీ’లో పేర్కొన్న 5 సంబంధిత జవాబులు సరైనవేనని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. 5, 5.0, 5.00, 5.000, 5.0000, 05, 05.0, 05.00, 05.000, 05.0000 జవా బులన్నీ సరైనవేనని ఓ ప్రకటనలో ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు దీన్ని గమనించాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. -
తెలుగు భాషకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు
సాక్షి, అమరావతి: తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాము కూడా తెలుగు భాషా ప్రేమికులమేనని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇంటరీ్మడియెట్‌లో తెలుగు ఉందని, తెలుగు బీఏ, ఎంఏ ఉందని, తెలుగులో పీహెచ్డీ కూడా చేయవచ్చని గుర్తుచేశారు. ఆయన శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల వేదికపై మండలి బుద్ధప్రసాద్, మరికొందరు టీడీపీ నేతలు మాట్లాడిన తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. తెలుగు భాషను విస్మరిస్తున్నారంటూ కొందరు కక్షపూరితంగా ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు భాష తల్లిలాంటిదని, తమ ప్రభుత్వం తెలుగును ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కన్నతల్లిని ఎలా ప్రేమిస్తారో... తెలుగు భాషను సైతం అలాగే ప్రేమిస్తారని పేర్కొన్నారు. పేదల వర్గాల కోసమే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే శక్తి లేని బడుగు, బలహీన వర్గాల కోసమే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతోందని అంబటి రాంబాబు చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలో చదువుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశి్నంచారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చేలా పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలుగు భాషకు అన్యాయం, ద్రోహం జరిగినట్లుగా కొందరు మాట్లాడుతున్నారని తప్పపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జీవో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని జీవో ఇచ్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. తెలుగుపై అంత ప్రేమ ఉంటే ఆ జీవో ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ పాఠశాలలను నిరీ్వర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే కదా అని ప్రశి్నంచారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతికూలంగా రాయడమే కొన్ని పత్రికలు పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. పత్రికాధిపతుల పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు? వారు నిర్వహించే కళాశాలలు ఏ మీడియంలో ఉన్నాయో చెప్పాలని మండిపడ్డారు. తెలుగు రచయితల సభల పేరుతో తప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతంలో మీడియా వారిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని ఈ దాడిని, తాము ఖండిస్తున్నామన్నారు. -
తెలుగు భాషపైన నిజమైన ప్రేమేనా?
ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులకు హఠాత్తుగా తెలుగు భాషపైన ఎక్కడ లేని ప్రేమ పుట్టు కొచ్చింది. తెలుగు భాష సంస్కృతి అంతమైపోయిందన్న ఆందోళనతో నిద్రకూడా పోవడం లేదు. ఇప్పటికిప్పుడు తెలుగు పైన ఇంత అభిమానం ఎందుకు కలిగింది? ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్య మంలో ఉంటుందన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన వల్లనే గదా. తెలుగు మాట్లాడితే జరిమానా విధిస్తూ, ఎండలో నిలబెట్టి శిక్షిస్తూ, తెలుగు వాసనని కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్న కార్పొరేట్ స్కూళ్లలో సంపన్న వర్గాల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నప్పుడు తెలుగు భాషకు ఏ అపకారం, అపచారం జరగలేదా? ఇప్పుడు పేదలు, బలహీనవర్గాలు, దళిత, మైనారి టీల పిల్లలు ఇంగ్లిష్‌లో చదువుకుంటేనే తెలుగుకు అంత పెద్ద ఉపద్రవం వచ్చి పడబోతున్నదా? తెలుగు భాషపైన ఇప్పుడు అలవిమాలిన ప్రేమని ఒలకబోస్తున్న గత ప్రభుత్వం తెలుగు భాషాభి వృద్ధికి ఏం చేసింది? ఓరియంటల్ కళాశాలలు వరుసగా మూతప డుతున్నాయి. భాషా ప్రవీణ, విద్వాన్ వంటి కోర్సుల సిలబస్‌లో తెలుగు భాషకు సంబంధిం చిన సిలబస్‌ను తగ్గించి ఇంగ్లిష్‌ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. మరి పద్నాలుగేళ్లు సీఎం రాజ్య మేలిన చంద్రబాబుకు, ఆయన అనుచరు లకు, వంత పాడుతున్న మేధావులకు ఆనాడే తెలుగు భాషకు జరిగిన అపచారం తెలీలేదా? మరో విషయం. టెన్త్, ఇంటర్ తరగతుల్లో సంస్కృతం పేపర్ ఎందుకొచ్చింది? ఎవరి ప్రయోజనం కోసం వచ్చింది? తెలుగు పేపర్‌ను వదిలేసి విద్యార్థు లంతా సంస్కృతం పేపర్లోకి పరుగులు తీసే పరి స్థితి ఎందుకేర్పడింది? విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ సంస్థలు ర్యాంకుల పంట పండించు కోవడం కోసం కాదా? దీంతో తెలుగు బడులకు మనుగడ లేక, తెలుగు పండితులకు గౌరవం లేక, తెలుగు భాష ఇంత చులకనైపో తుంటే, పలుచనై పోతుంటే ఇన్నేళ్లుగా చూస్తూ కూర్చున్నారు కదా.. ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడే అర్హత వీరికి ఎక్కడినుంచి వచ్చింది? గ్రామీణ ప్రాంతాల బడుల్లో సరిపడినంత విద్యార్థులు లేరన్న నెపంతో గత ప్రభుత్వం వేలాది బడులను మూసివేసింది. దాంతో పేద విద్యార్థులు అప్పులు చేసి ప్రైవేటు బడులకు పరు గులు తీయవలసి వచ్చింది. ఆ మాత్రం శక్తి కూడా లేని వేలాదిమంది పసివాళ్లు బడిబాటే మర్చి పోవాల్సి వచ్చింది. ఇంత నిర్దయగా నిరుపేదలు, బడుగు, బలహీనుల బిడ్డలకు చదువుని దూరం చేసి గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు పసి బిడ్డల చదువుల గురించి కాకుండా వాళ్ల భాష గురించి బాధపడటం ఎంత విచిత్రం. మాతృభాషలో విద్యాబోధనే ఉత్తమం అని మేధావులు, భాషా శాస్త్రవేత్తలు చెబుతోంది నిజమే. అయితే మాతృభాషలోనే ఉన్నత విద్య అభ్యసిస్తున్న జర్మనీ, జపాన్, రష్యా వంటి పలు దేశాల పరిస్థితి వేరు. ఈ దేశాలు ఆంగ్లేయుల పాలనకు తలొగ్గలేదు. ఇంగ్లిష్ నేర్చుకునే అవసరం వారికి ఏర్పడనందున శాస్త్ర, సాంకేతిక జ్ఞాన మంతా వారి మాతృభాషలోనే లభ్యమవుతుంది. కానీ భారత్ వంటి దేశాల పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ వలసగా మనం ఉండటంతో ఇంగ్లిష్ మనపై బలవంతంగా రుద్దారు. భారతీయులు అనివార్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవలసి వచ్చింది. ఇంగ్లిష్‌లో మాట్లాడటం గొప్ప అన్న భావన స్థిరపడి పోయింది. ఇంగ్లిష్ రానివాళ్లు ఆత్మన్యూనతలో ఉండిపోయారు. అంతగా పాతుకుపోయిన ఆంగ్ల భాషను ఇప్పటి కిప్పుడు తోసెయ్యగలమా? వారు చెబుతున్నట్లే తెలుగు భాషని ఉద్ద రిద్దాం. ‘ఆంధ్రదేశంలోని ప్రతి పాఠశాలలోనూ ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి, ఏ మినహాయింపూ లేకుండా ప్రతి తెలుగువాడూ తెలుగు మాధ్యమంలోనే చదువుకోవాలి’ అనే నినా దంతో ముందుకురండి. ఆ ఉద్యమాన్ని చేపట్టండి. కనీసం ఒక ప్రకటన చేయగలరా? చేయలేరు. ఇంగ్లిష్ మీడియం బడుల్ని పల్లెత్తు మాటనలేరు. ఇంగ్లిష్తో విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలకు నష్టం జరిగే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఎందు కంటే ఆ వ్యాపార సంస్థలు మన వాళ్లవి. అక్కడ చదువుకోవలసింది మన పిల్లలు. ఏమిటీ ద్వంద్వ నీతి? లెక్కలు, సైన్సు, సోషల్ ఇంగ్లిష్‌లో బోధిం చినంత మాత్రాన తెలుగు అంతమైపోతుందా? ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వాళ్లు మాత్రమే తెలుగును బ్రతికించాలా? ఇంగ్లిష్ మాధ్యమంలో చదివే సంపన్నులకు ఆ బాధ్యత లేదా? పైగా అంబేడ్కర్ అంత గొప్పవాడు కాలేదా? పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాలేదా? సీవీ రావు సైంటిస్ట్ కాలేదా? అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాలేదా? వారంతా వారి వారి మాతృభాషల్లో ప్రాథమిక విద్య అభ్యసించినవాళ్లే కదా అంటూ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లని ఉదా హరణగా చూపిస్తున్నారు. ఇదెలా ఉందంటే కార్పొ రేట్ విద్యా సంస్థలు ఒకటి రెండు ర్యాంకులు చూపించి తమ వద్ద చదివితే అందరికీ ఇలాంటి ర్యాంకులు వస్తాయన్న భ్రమని కల్పించి దోచు కుంటున్నట్టుగా ఉంది. స్వయం ప్రతిభతో, అసా ధారణ మేధస్సుతో రాణించే వాళ్లకు ఇవేవీ వర్తిం చవు. పైగా వారు చదువుకునే రోజుల్లో ఊళ్లో ఒకే బడి ఉండేది. అందరికీ ఒకే సిలబస్ ఉండేది. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వృద్ధి చెందేవారు. ఇప్పుడా పరిస్థితి ఉందా? విద్యార్థి లోక మంతా నిట్టనిలువునా రెండుగా చీలిపోలేదా? సంపన్నులందరూ ప్రైవేట్ బడుల్లోకి, పేదలు, బలహీన వర్గాలూ ప్రభుత్వ బడుల్లోకి అనివా ర్యంగా నెట్టబడలేదా? ఈ విభజన ఎవరి ప్రయో జనం కోసం జరిగింది? ఈ తెలుగు వాదం చేస్తున్న పెద్దలెవరైనా వాళ్ల పిల్లల్ని ఒక్క సంవత్సరం ఆ బడుల్లో చదివించగలరా? తమిళ మాధ్యమంలో చదివిన వారికి తమిళులు 20 శాతం రాయితీ ఇస్తు న్నారు. కన్నడిగులు 10 శాతం ఇస్తున్నారు. తెలు గుపైన అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వం వారి నెందుకు ఆదర్శంగా తీసుకోలేదు. ఇప్పుడు 90 శాతం మంది ప్రజల్ని పీడించి దోపిడీ చేస్తున్నాయి విద్య, వైద్య రంగాలు. వాటిని సమూలంగా సంస్కరించే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు 9 రకాల వసతులు సమకూరుస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. తెలుగు భాష బాగుండాలి అనేవారు అంతకంటే ముందు తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకోవాలి. వ్యాసకర్త, పాటిబండ్ల ఆనందరావు, మొబైల్ : 98498 98800. -
ఇంగ్లీష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యత
సాక్షి, కృష్ణా: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఇంగ్లీష్ తో పాటు తెలుగుభాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి మంత్రి స్పష్టం చేసారు. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు సురేష్ హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అంశం పై కూలంకుష చర్చ జరిగిందని చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యాప్రమాణాలు అందిస్తామని స్పష్టం చేశారు. అభ్యాసన ఫలితాలు, ఫౌండేషనల్ లెర్నింగ్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు రూపొందించబడుతున్నాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు మూడు స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగిస్తామన్నారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోందని ఆదిములపు సురేష్ తెలిపారు. -
చంద్రబాబును ఫాలో అవుతున్న పవన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. ‘ఇంగ్లీష్‌ను వద్దనడం లేదు.. మాతృభాష వదలొద్దు అంటున్నాం’ అంటూ ఆయన నిన్న ట్వీట్ చేశారు. సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున మద్దతు రావడంతో చంద్రబాబు ఇప్పటికే యూటర్న్ తీసుకున్నారు. తాజాగా పవన్ కూడా చంద్రబాబునే అనుసరించారు. ఈ నెల 21వ తేదీన కొమనాపల్లి సభలో సీఎం జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలకు జనసేన పార్టీ సమాధానం అంటూ పవన్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ అరవిందరావు ‘తెలుగు వర్దిల్లతేనే వెలుగు’ అన్న పేరు తో తెలుగు భాషా పరిరక్షణ’, గురించి రాసిన వ్యాసం,అన్ని కోణాలలో చాల విశ్లేషణాత్మకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని లోని అంశాలని పరిశీలించాలి’ అంటూ పవన్ బుధవారం మరో ట్వీట్ చేశారు. -
అమ్మ భాషకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి/ఒంగోలు మెట్రో: తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి. మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది. భాష, సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు. తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు. తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు, డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది తప్ప.. చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు’ అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు. తెలుగుకు మళ్లీ వెలుగులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా వికాసానికి గట్టి చర్యలు చేపట్టారు. పరిపాలనలో తెలుగు వినియోగం, భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు. దానికి తెలుగు, హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్సా్నరాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. తెలుగు అకాడమిని పునరుద్ధరించారు. ప్రముఖ రచయిత్రి, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నారు. అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ అకాడమీని కూడా పునరుద్ధరించనుంది. భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు, విద్యా వేత్తలు, సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాష పురోగతికి బాటలు ‘ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది’ అని గురజాడ చెప్పినట్టు ప్రభుత్వం ఒక మహిళ అయిన నందమూరి లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ బాధ్యతలు అప్పగించింది. తద్వారా తెలుగు భాష పురోగతికి బాటలు వేసింది. – సింహాద్రి జ్యోతిర్మయి, ఉపాధ్యక్షురాలు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సంతోషం కలిగిస్తోంది సీఎం వైఎస్ జగన్.. మదర్సాల ఉన్నతికి చర్యలు చేపట్టడమే కాకుండా ఉర్దూ అకాడమీని పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీటిని గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం ముదావహం. – డాక్టర్ షాకీర్, విద్యావేత్త తెలుగు అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తెలుగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. భాషావేత్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విధంగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. దాంతో భావితరాలకు కూడా తెలుగును మరింత చేరువ చేసింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో తెలుగు భాషను ఏమాత్రం విస్మరించ లేదు. – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే అధికార భాషా సంఘాన్ని నియమించింది. తెలుగు అకాడమీని పునరుద్ధరించింది. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. అంతమాత్రాన తెలుగును తీసేయడం లేదు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేశారు. – నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమి అధ్యక్షురాలు -
ఉన్నతి ఉపాధి కోసం.. ఇంగ్లిష్ మీడియం
రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది చదువుతున్న ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్ ఇంగ్లిష్‌లోనే ఉంది. శాస్త్ర పరిశోధనా రంగం, వాటికి ప్రామాణికమైన జర్నల్స్, ఇంటర్నెట్ సమాచారం, ఇతరత్రా రిఫరెన్స్ సమాచారం అంతా కూడా అదే భాషలో అందుబాటులో ఉండటం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన విధానాన్ని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో సామాజిక విద్యా విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నత అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునేందుకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యమే చోదక శక్తి అని గుర్తించింది. జూలీ డియల్డన్- 2014 సర్వేతోపాటు పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ దృష్ట్యా ఇంగ్లిష్‌లో భాషా పరిజ్ఞానమే కాకుండా.. విజ్ఞాన సర్వస్వాన్ని మన విద్యార్థులు ఒడిసి పట్టేందుకు వీలుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు, మరికొందరు వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది. మాతృ భాషతోనే విజ్ఞాన సముపార్జన సాధ్యమని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇంగ్లిష్తో విజ్ఞాన అనుసంధానం ఇంగ్లిష్‌లోని విజ్ఞాన సర్వస్వాన్ని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు తమ మాతృభాష ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఆ దేశాల్లో జాతీయ భాష ఒక్కటే అన్నది గుర్తుంచుకోవాలి. బహుభాషలకు నెలవైన మన దేశంలో అందరూ మాట్లాడగలిగే భాష అంటూ లేదు. అధికారికంగా 22 భాషలున్నాయి. ఈ పరిస్థితిలో ఇంగ్లిషు భాషలో ఉన్న విజ్ఞాన సర్వస్వాన్ని అన్ని భాషల్లోకి అనువదించడం అన్నది ఆచరణ సాధ్యం కాదని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలోనూ గత 70 ఏళ్లలో పాలించిన ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాద్యమంలో పాఠశాల విద్య చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో తప్పనిసరిగా ఇంగ్లిష్ మాద్యమంలోనే చదవాల్సి వస్తోంది. దీంతో ఆ భాషలో విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడంతో మన విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా తల్లిదండ్రులు కేవలం ఇంగ్లిష్ మీడియం కోసమే ప్రయివేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రయివేటు స్కూళ్లకు మళ్లారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ల ఉనికి ప్రశ్నార్థంగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇంగ్లిష్‌తోనే ఉన్నత అవకాశాలు దేశ ప్రస్తుత జనాభా దాదాపు 136 కోట్లు. ఇంత జనాభాకు తగిన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కేవలం మన దేశంలోనే కల్పించడం ఆచరణ సాధ్యం కాదన్నది గుర్తించాలి. దాదాపు 30 కోట్ల మంది సరైన ఉపాధి అవకాశాల కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విదేశాలు, దేశంలో నెలకొల్పే విదేశీ కార్పొరేట్ సంస్థలపై ఆధారపడక తప్పదని జాతీయ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అందుకు ఇంగ్లీషులో పరిజ్ఞానం తప్పనిసరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులకు, దేశంలోని ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులకు లభిస్తున్న అవకాశాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటోందని విద్యావేత్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ వాస్తవాలను గుర్తించే పలు దేశాలు ఇంగ్లిష్ మాద్యమంలో విద్యా బోధన వైపు మరలుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం వేగంగా విస్తరిస్తోందని బ్రిటీష్ కౌన్సిల్ కోసం జూలి డియల్ డన్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రధానంగా భారత ఉప ఖండంతోపాటు బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు 55 దేశాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. జూలి డియల్ డన్ సర్వే మేరకు.. - 55 దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలు 53 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 88 శాతం ఇంగ్లిష్‌లో విద్యా బోధన చేస్తున్నాయి. ఉన్నత విద్యలో ప్రభుత్వ విద్యా సంస్థలు 70 శాతం, ప్రైవేట్ విద్యా సంస్థలు 90 శాతం ఇంగ్లిష్ బోధన సాగుతోంది. - 55 దేశాల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు అనుకూలంగా ప్రజాభిప్రాయం మారుతోంది. గత పదేళ్లలో 62 శాతం మంది ప్రజలు ఈ మీడియం వైపు మొగ్గు చూపారు. - ఇటలీ 10 ఏళ్ల క్రితమే ఇంగ్లిష్‌లో విద్యాబోధనను విస్తృతంగా చేపట్టింది. జర్మనీ, ఫ్రాన్స్‌దేశాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయి. - శ్రీలంక 2001లోనే ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఇంగ్లిష్ మీడియం బోధనను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా నిర్వహిస్తోంది. విద్యాబోధన వేరు.. భాష పరిరక్షణ వేరు ఇంగ్లిష్‌లో విద్యాబోధనకు మాతృభాష పరిరక్షణకు ముడి పెట్టడం సరికాదని విద్యావేత్తలు తేల్చి చెబుతున్నారు. విద్య, సంస్కృతి, సాహిత్యంలను వేర్వేరుగా చూడాలని సూచిస్తున్నారు. ఇంగ్లిష్తో తెలుగు భాషకు ముప్పు అనే సందేహాన్ని దివంగత భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు గతంలోనే కొట్టిపారేశారు. కనీసం వెయ్యి మంది మాట్లాడే భాష ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆయన సాధికారికంగా విశ్లేషించారు. అలాంటిది దాదాపు 9 కోట్ల మంది మాతృ భాష అయిన తెలుగుకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంగ్లిష్ మీడియంతో తెలుగు ఉనికికి ముప్పు అనేది ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పెద్దిరాజు చెప్పారు. నష్టపోతున్న ప్రతిభావంతులు ఉత్తరాంధ్రతోసహా మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నారు. వారికి విషయ పరిజ్ఞానం ఉంటోంది. కష్టపడేతత్వం ఉంది. కానీ ఇంగ్లిష్‌లో విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడంతో కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు పొందలేక నష్టపోతున్నారు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదివక పోవడమే వారికి ప్రతికూలంగా మారింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అందివస్తున్న అవకాశాలను మన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటే పూర్తిగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడమే మార్గం. - ప్రసాదరెడ్డి, ఇన్చార్జ్ వీసీ, ఆంధ్రా యూనివర్సిటీ కేరళ, ఒడిశాలే ఆదర్శం ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు రాణించి ఉన్నత స్థానాలు చేరుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తప్పనిసరి. యూపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో భావ వ్యక్తీకరణ అన్నది అత్యంత కీలకం. ఆ విషయంలో తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. దీన్ని అధిగమించి మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనే పరిష్కార మార్గం. మన కంటే వెనుకడిన ఒడిశా కూడా ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో అద్భుత ఫలితాలు సాధిస్తోంది. కేరళ విద్యార్థులు అత్యధికంగా జాతీయ, అంతార్జతీయంగా రాణించడానికి కూడా ఇదే కారణం. - ప్రొఫెసర్ నారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ సామాజిక విద్యా విప్లవం ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన రాష్ట్రంలో సామాజిక విద్యా విప్లవానికి నాంది అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ప్రాథమిక విద్య దశలో విద్యార్థుల్లో గ్రహణ శక్తి ఎక్కువుగా ఉంటుంది. ఆ సమయంలో ఇంగ్లిష్తో సహా ఏ భాషలో అయినా సులువుగా పరిజ్ఞానాన్ని సముపార్జించుకోగలుగుతారు. అదే ఓ వయసు వచ్చిన తర్వాత నేర్పుతామంటే అది పడికట్టు పదాలకే పరిమితమవుతుంది. ఇది గుర్తించే జర్మనీ, ఫ్రాన్స్‌లతోపాటు చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన వైపు మొగ్గు చూపిస్తున్నాయి. విద్య, భాష పరిరక్షణ, సాహిత్యం అన్నవి వేర్వేరు. వాటిని కలిపి చూడకూడదు. రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే తెలుగు భాషకు ముప్పు అనిగానీ విద్యార్థుల వికాసానికి భంగం అని గానీ ఎవరూ మాట్లాడ లేదు. కార్పొరేట్ కాలేజీల్లో తెలుగు బదులు సంస్కృతం సబ్జెక్టు పెడుతుంటే ప్రశ్నించలేదు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృ భాషకు, విద్యార్థుల వికాసానికి భంగం వాటిల్లుతోందని కొన్ని సంస్థలు గగ్గోలు పెట్టడం సరికాదు. తెలుగు భాష పరిరక్షణకు గ్రంథాలయాలను పటిష్ట పరచాలి. - కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నిర్మాత -
తెలుగుసహా 9 భాషల్లోకి ‘సుప్రీం’ తీర్పులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పులు దేశంలోని తొమ్మిది ప్రాంతీయ భాషల్లోకి అనువాదమవుతున్నాయని, వాటిని కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని లోక్‌సభలో చెప్పారు. ‘సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తుతం, తొమ్మిది స్థానిక భాషలలోకి అనువదిస్తున్నాం. అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నాం’ అని చెప్పారు. కార్మిక, అద్దె ఒప్పందం, భూములు, సర్వీస్ మేటర్స్, నష్టపరిహారం, నేరాలు, కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ కేసులు, వ్యక్తిగత, ఆర్థిక, కౌలు రైతుల వివాదాలు, వినియోగదారుల హక్కుల సంరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటు ఉంచుతామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
తెలుగుకు పట్టం కట్టండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు భాషకు పట్టం కట్టాలని, అందులో భాగంగా నేటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా ప్రతి స్కూల్లో పిల్లలు తెలుగు భాషను తప్పనిసరి నేర్చుకునేవిధంగా ప్రోత్సహించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకూ తెలుగును తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఎస్సీఈఆర్టీతో కలసి తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త కార్యాచరణ చేపట్టింది. గతేడాది నుంచి అన్ని స్కూళ్లలో తెలుగు అమలు దిశగా రెండు సంస్థలు దృష్టి సారించాయి. తెలంగాణ ప్రజల భాష, సాహిత్యం, చారిత్రక, సాంస్కృతిక జీవితం ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలనే లక్ష్యంతో తెలుగును తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆ లక్ష్యం అన్ని పాఠశాలలకు చేరుకునేవిధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు పిల్లలకు తెలుగు నేర్పించే ఉపాధ్యాయుల కోసం ఎస్సీఈఆర్టీతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను, వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘తెలుగు తప్పనిసరి’కి అడుగులు ఇలా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించింది. కానీ ఇంటర్మీడియెట్ స్థాయిలో అమలుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. తమిళనాడులో పదో తరగతి వరకే తమిళం తప్పనిసరి భాషగా అమలు కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కూడా ఒకటి నుంచి పదోతరగతి వరకు పరిమితం చేశారు. తెలుగు భాషేతరుల కోసం ఎస్ఈఆర్టీ గతేడాది ఒకటి, ఆరోతరగతి పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయగా, ఈ ఏడాది రెండు, ఏడో తరగతులకు కూడా అందజేశారు. ‘‘తెలుగు అమలు తీరును పర్యవేక్షించేందుకు గతేడాది నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాం, కొన్ని స్కూళ్లు మినహా చాలా వరకు తెలుగును తప్పనిసరి చేశాయి. కేంద్రీయ విద్యాలయ వంటి విద్యాసంస్థల్లో మాత్రంపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అమలు చేయనున్నట్లు చెప్పారు’’అని సిధారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఏముంది? హిందీ, కన్నడం, తమిళం, మరాఠీ వంటి ఇతర మాతృభాషల విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకొనేందుకు వీలుగా వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, చిన్న చిన్న పదాలతో పుస్తకాలను ముద్రించారు. ఏడో తరగతి స్థాయిలో చిన్న చిన్న గేయాలను పరిచయం చేశారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ఆచార సాంప్రదాయాలు, తెలంగాణ కళలను కూడా పరిచయం చేయనున్నట్లు సిధారెడ్డి తెలిపారు. 2023 నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయిలో తెలుగు అమలులోకి వస్తుందన్నారు. ‘‘తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పించడాన్ని ఒక బాధ్యతగా భావించాలి. ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడి వారైనప్పుడు ఈ ప్రాంత ప్రజల భాషలోనే మమేకం కావడం వల్ల మానవసంబంధాలు బలపడు తాయి. అందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ స్కూళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేసేందుకు సిద్ధంగా ఉంది’’అని చెప్పారు. -
తెలుగును చంపేస్తున్నారు: మాజీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)పై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీపీఎస్సీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ వింతగా వ్యవహరిస్తోందని, ప్రశ్నా పత్రాల్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇంగ్లీషులోనే ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సబ్జెక్టు ప్రశ్నా పత్రాలు ఇంగ్లీషులోనే ఉన్నా.. జనరల్ నాలెడ్జికి సంబంధించి మాత్రం తెలుగులోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రశ్నాపత్రం ఉండదు..ఇంగ్లీషులోనే ఉంటుంది అనే విషయాన్ని నోటిఫికేషన్లో ఎక్కడా ఇవ్వలేదని చెప్పారు. హాల్ టిక్కెట్లు వచ్చాక ప్రశ్నాపత్రాలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని చెబుతున్నారు.. దీని వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు మీడియం విద్యార్థుల పీక కోయడానికే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పరిపాలనలో తెలుగుకు చేసిన సేవ శూన్యమన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా తెలుగును ఒక పాఠ్యాంశంగా చేస్తానన్న చంద్రబాబు ఆ హామీని అమలు చేయలేకపోయారని విమర్శించారు. చివరికి అమరావతి హైకోర్టు శిలాఫలకాలను కూడా ఇంగ్లీషులోనే వేశారని, తెలుగు భాషను పూర్తిగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలలో కూడా ఇంగ్లీష్‌లో పెట్టడం అన్యాయమన్నారు. -
యూకేలో తెలుగు భాష అభివృద్ధికి ఎన్ఎస్డీ కృషి
లండన్ : యూకేలో తెలుగు భాష అభివృద్ధికి నవసమాజ్ దర్పణ్ (ఎన్ఎస్డీ) ముందడుగువేసింది. యూకేలో తెలుగు భాష నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవని గమనించి నవసమాజ్ దర్పణ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. యూకేలో నివసిస్తున్న భారతసంతతి యువత, భవిష్యత్తుతరాల వారిలో తెలుగు భాష సజీవంగా ఉండేందుకు తమ వంతు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్ఎస్డీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ శ్రీకాంత్ పంజాల తెలుగు కిండర్‌గార్టెన్ పుస్తకాలను తురాక్ లైబ్రెరీస్ సర్వీస్ మేనేజర్ రోజలిన్ జోన్స్‌కు ఉచితంగా అందించారు. ఈ పుస్తకాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా డిస్ప్లేలో ఉంచుతామని జోన్స్ తెలిపారు. ముందుగా ఇంగ్లండ్‌లో ఎస్సెక్స్ కౌంటీలో తురాక్ డివిజన్లోని లైబ్రరీలలో పుస్తకాలను పంపిణీ చేశామని, త్వరలో యూకే వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని లైబ్రెరీలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు శ్రీకాంత్ తెలిపారు. -
సినిమా పాటరాయడం చాలా కష్టం..
‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది’.. ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని’.. అంటూ నిరాశా చీకట్లను తరిమేసే స్ఫూర్తిదాయక పాటలు రాయాలన్నా.. పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా... అని తల్లి ప్రేమ మాధుర్యాన్ని గుమ్మరించాలన్నా.. తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చే తల్లి చిరునవ్వులా.. అని అద్భుతమైన గీతం రాయాలన్నా...ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా... అంటూ సమకాలీన రాజకీయాలను స్పృశించాలన్నా..మెగాస్టార్ చిరంజీవి అభిమానుల జాతీయ గీతంగా పేర్కొనే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అని ఉర్రూతలూగించాలన్నా..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది.. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది.. అని చీరకట్టు గొప్పతనానికి జైకొట్టాలన్నా..తెలుగు సినిపరిశ్రమలో ఇప్పుడు ఒక్కరికే సాధ్యం.. ఆ ఒకే ఒక్క రచయిత చంద్రబోస్.. చంద్రబోస్ కాదు.. చంద్ర‘భేష్’ అని తెలుగు సినీ పాట గర్వంగా తలెత్తుకునేలా చేసిన వేటూరి సుందరరామమూర్తితోనే ప్రశంసలు అందుకున్న కవి.మారుమూల పల్లె.. సాధారణ కుటుంబ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్‌లో జేఎన్టీయూ థర్డ్ ర్యాంక్ సాధించి కూడా కేవలం గానం, కవిత్వంపై మక్కువతో సినిమా పాట బాట పట్టారు చంద్రబోస్.మనిషిలో ప్రేరణ, స్ఫూర్తి రగిలించే సోలో, యుగళగీతాలు, సామాజిక సందేశాలు.. ఇలా ఏపాటైనా ఆలవోకగా రాసేసి సినిమా కవిగా వచ్చే ఏడాది పాతికేళ్ళ ప్రాయంలోకి అడుగుపెడుతున్న చంద్రబోస్ సోమవారం విశాఖలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. చదువు.. చదువు.. చదువు... చదువే ఓ మూలధనం.. విద్యార్ధులే కాదు.. సమాజంలో ఎవరైనా.. ఏ రంగంలోని వారైనా.. వారికిష్టమున్న రంగం కావొచ్చు.. అంశంకావొచ్చు.. చదవాల్సిందే.. అధ్యయనం చేయాల్సిందే. ‘పరుగెత్తు..నడువు.. లేదంటే పాకుతూవెళ్లు.. అంతేకానీ ఒకే చోట కదలకుండా కూర్చోకు’.. అని మహాకవి శ్రీశ్రీఅన్నట్లే నా సృజనతో నేను చెప్పేది ఒకే ఒక్క మాటచదవు.. చదువు.. చదువు.. తెలుగుపాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు తెలుగు సినీ పాటకు జాతీయస్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదనే అభిప్రాయం నాలో ఉంది. జాతీయ అవార్డులు పొందుతున్న మిగిలిన భాషా చిత్రాల పాటలను నేను అనువదించి వింటుంటాను. ఆ సాహిత్యమూ తెలుసుకుంటాను. కచ్చితంగా వాటికంటే మన తెలుగు పాటలేమీ తీసిపోవు. అంతకంటే మంచి సాహిత్యమే మన పాటల్లో ఉంది. కానీ ఎందుకో మొదటి నుంచి తెలుగుపాటకు తగినంత గుర్తింపు దక్కడం లేదు. బహుశా మన పాటను భుజానికెత్తుకునే వాళ్ళు అక్కడ లేకపోవడం వల్లనేమోనని అనుకుంటాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. పాట విషయమే తీసుకుందాం. తమిళ మాతృక సినిమాలో ఆ పాటకు ఎంతో గుర్తింపునిచ్చారు. ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఎన్నో అవార్డులు వచ్చాయి. వాస్తవానికి మాతృకలోని పాట కంటే తెలుగు పాటే ఎక్కువమందికి చేరువైంది. ఆ పాట కంటే మన తెలుగు పాటే బాగుందని విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ జాతీయ స్థాయి అవార్డే కాదు.. రాష్ట్రంలోనూ రాలేదు. కానీ ఆ పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణలోని యువతి ప్రణీత 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఎన్నో రోజులు చికిత్స పొందింది. ఆ సమయంలో ఆమె ప్రతిరోజూ భక్తి గీతాలతో పాటు మౌనంగా ఎదగమనే పాటతో పాటు నేనున్నాను సినిమాలోని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. అనే పాటలు విని సాంత్వన పొందానని చెప్పినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ ఆ రెండు పాటలూ నేను రాసినవే. ఏ అవార్డు ఇంతటి గౌరవాన్ని అందిస్తుంది..చెప్పండి. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు కంటే ప్రజలు ఇచ్చే గుర్తింపునకే విలువ ఎక్కువ జానపదమే... జ్ఞానపథం మన సాహిత్యానికి గానీ. సంస్కృతికి గానీ జానపదమే ప్రధానం.. అందుకే నేను జానపదమే జ్ఞానపథం అంటాను. సాహిత్యం జీవనాడిగా ఉందంటే అందుకు జానపదమే కారణం. నేను ఎదిగిన పల్లె వాతావరణం కావొచ్చు, నేను రాసిన పాట పామరులకీ అర్ధం కావాలనే ఆశ కావొచ్చు.. జానపదమే నన్ను ప్రభావితం చేసింది. నాకు సంగీతం అనువంశికంగా కాదు.. అనుసృజనగా వచ్చింది. రంగస్థలం పాటలు రాయలేదు..అశువుగా చెప్పా వాస్తవానికి నేను పాటలు పాడదామనే సినీరంగానికి వచ్చాను. మొదట లక్ష్యం అదే.. కానీ ఆ వైపు అవకాశాలు రాకపోవడంతో ఓ మిత్రుడి సలహా మేరకు పాటలు రాశా ను. మొదటిసారి 1995లో డి రామానాయుడు నిర్మించిన తాజ్‌మహల్ సినిమాలో పాట రాసేందుకు దర్శకుడు ముప్పలనేని శివ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా పాటలు రాస్తూనే ఉన్నాను. 24 ఏళ్ళ కెరీర్లో 3300 పాటలు రాశాను. ఒక్కోసారి ఓ పాట రాసేందుకు నాలుగైదు రోజు లు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రంగస్థలం సినిమాలోని అన్ని పాటలూ నేనే రాశాను. విచిత్రమేమిటం టే పేపర్‌పై పెన్ను పెట్టి ఒక్క పాట కూడా రాయలేదు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నేను కూర్చుంటే... ఆశువుగా అర్ధగంటలో ఒక్కో పాట చెప్పేస్తే.. వాళ్లు రికార్డ్ చేసేశారు. ఆ పాటల్లో ఎంతటి సాహిత్యముంది.. స్ఫూర్తి రగిలించే పాటలు నేనే ఎక్కువ రాశా నా లిరిక్స్‌లో నవరసాలూ ఉంటాయి. హాస్యం, శృంగారం, క్రోధం, శాంతం, కరుణ భయం,. బీభత్సం.. అన్నీ ఉంటాయి. కానీ నాకు మనిషికి ప్రేరణనిచ్చి.. స్ఫూర్తిని రగిలించి సందేశాన్నిచ్చి ముందుకు నడిపించే పాటలంటేనే ఇష్టం. నిరాశ, నిస్పృహలను పారదోలే స్ఫూర్తి సాహిత్యంతో 35పాటలు రాశాను. బహుశా తెలుగు సినిమా సాహిత్యంలో అలాంటి పాటలు ఎక్కువ రాసింది నేనే అని అనుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ వచ్చిందని భావిస్తాను.. కొత్త రచయితలూ... సినిమా రంగంలోకి రావాలనుకునే కొత్త రచయితలూ ముందు బాగా చదవండి. కవిత్వానికి మూమూలు మాటకు తేడా ఏమిటో తెలుసుకోవాలి. మాట కవిత్వం ఎలా అవుతుంది.. ఎందుకు అవుతుంది. అయ్యేందుకు మనం ఏం ప్రయోగం చేయాలో ఆలోచించాలి. సినిమా పాటలకు ఉండే నాలుగు లక్షణాలు క్లుప్తత, గాఢత, స్పష్టత, సరళత.. ముందుగా ఇవి అలవర్చుకోవాలి. ఇక సినిమా పాటలకు ఛందస్సు అవసరం లేదు..యతిప్రాస ఉంటే చాలు. ఉదాహరణకు.. ’ మా బాధలను ఓదార్చే తోడుండేవాడివిరా... ఇది మామూలు మాట.. ’’మా బాధలను ఓదార్చే నువ్వుంటే బాగుండురా... ’ ఇది కవిత్వం.. బాలసాహిత్యమే మనిషికి పునాది బాలసాహిత్యమే ఏ మనిషికైనా పటిష్ట పునాది వేస్తుంది. అంతకుమించిన సాహితీ సంపద లేదు. బాలలకు లేతప్రాయంలో శబ్దసంపద, ఊహాశక్తిని పెంపొందించే నైతిక రుజువర్తనను అందించాలి. నీతి కథలు చదివించాలి. సాహిత్యం మనల్ని పరిపుష్టం చేస్తుంది. బాల్యంలో బొమ్మరిల్లు, బుజ్జాయి, చందమామ, బాలమిత్ర.. భాగవతం, బాలసాహిత్యం వంటివి చదివితే ఎదుగుదలలో తిరుగుండదు. ఒకప్పుడు పిల్లలకు వాటితోనే విద్యాభ్యాసం మొదలుపెట్టించేవారు. మాతృభాషకు మించింది ఏదీ లేదు.. ♦ భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్టు.. ♦ మాతృభాషతోనే వేగంగా బుద్ధి వికాసం ♦ తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదు ♦ మన పాటను భుజానికెత్తుకునే వాళ్లు అక్కడ లేకపోవడం వల్లనేమో.. ♦ జాతీయ అవార్డులు సాధిస్తున్న ఇతర భాషల పాటల కంటే తెలుగు పాటేం తీసిపోదు ♦ సినిమా పాట రాయడం అవధానం కంటే పెద్ద ప్రక్రియ ♦ పాటలు పాడదామని వచ్చి రచయితగా మారాను ♦ చిరంజీవి సైరాలో పాట రాస్తున్నా విశాఖలో ఉండి ఎన్నో పాటలు రాశాను మాతృభాషను నిర్బంధంగా చదివించాలి మాతృభాషకు మించింది ఏముంది.. భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్లే.. నాన్నా అన్న పిలుపులో ఉండే గాఢత డాడీలో ఉండదు. అమ్మా అన్న పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీలో ఉండదు. పిలుపు మారినప్పుడు బంధం కూడా మారుతుంది. మాతృభాషతో బుద్ధి వికాసిస్తుంది. ఆలోచనలు విస్తరిస్తాయి. పరభాషతో బుద్ధి వికాసం అంత త్వరగా రాదు. అందుకే మాతృభాషను నిర్బంధంగా చదివించాలని నేను భావిస్తాను. కనీసం ప్రాధమిక విద్యాబోధనైనా తెలుగులో కచ్చితంగా> జరిగి తీరాలి. ఆస్ట్రేలియాలో మాతృభాషలో చదువుకున్న వారికి అక్కడి ప్రభుత్వం 130 డాలర్లు బహుమతిగా అందిస్తోంది. అక్కడ స్థిరపడిన ఏ భాషకు చెందిన వారైనా వారి మాతృభాషలో చదువుకుంటే ప్రోత్సాహం అందిస్తోంది. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే కాదు.. మనందరిదీ. సినిమా పాటరాయడం చాలా కష్టం.. మామూలు పాటలు రాయడం వేరు.. సినిమా పాటలు రాయడం వేరు. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్‌ను పట్టుకుని. దర్శకుడు ఇచ్చే సందర్భాన్ని అర్ధం చేసుకుని, హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను మెప్పించేలా సినిమా పాట ఉండాలి. అందుకే సినిమా పాట రాయడం చాలా కష్టం. అది ఓరకంగా అవధానం కంటే పెద్ద ప్రక్రియ. ఇటీవలికాలంలో సినిమా కవులకు సోషల్ మీడియా సాహిత్యం సవాల్ విసురుతోంది. వాట్సాప్‌లో ప్రపంచస్థాయి కవిత్వాలు నీతులు, శుభాషితాలు. ఛలోక్తులు.. ఇలా పలు రూపాల్లో కవిత్వం వెల్లువెత్తుతోంది. దాన్ని మించి సినిమాలో చెప్పాలి. అందునా ఇప్పుడు కాలం మారింది. వేగం పెరిగింది. సినిమాకు మహారాజపోషకులైన యువత ఆలోచనలు మారాయి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కవిత్వం రాయాలంటే కత్తిమీద సాములా అయింది. సినిమాల్లో యుగళగీతాలు తగ్గాయి,, సిట్యుయేషన్ సాంగ్స్ వస్తున్నాయి. పాట సినిమాలో అంతర్భాగంగా వచ్చేదే అయినప్పటికీ అది సినిమా కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చైతన్యపరుస్తుంది. ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం ♦ సినీ కవుల్లో ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే ఎన్నో పాటలు రాశాను. నాలుగైదు మాటలతోనే గొప్ప అర్థం వచ్చేలా.. అందరికీ అర్థమయ్యేలా రాయడం ఆత్రేయ సాహిత్యం నుంచే నేర్చుకున్నాను. ఓ సందర్భంలో ఆయన రాసిన సాహిత్యం గురించి.. ప్రియుడి సన్నిహితులు చనిపోతే ప్రేయసి ఇలా ఓదారుస్తుంది.. ♦ ‘రారయ్య పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు’ ఇదీ సాహిత్యం గొప్పతనం మరో సందర్భంలో ♦ నీకు నాకూ పెళ్ళంట...నింగీ నేలకు కుళ్ళంట...ఎందుకంటేయుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసింది ఎప్పుడూ లేవంట..మరో సందర్భంలో నీకూ నాకూ పెళ్ళంట.. నదికి కడలికి పొంగంట..యుగయుగాలు వేరైనా అవి కలవనది ఎపుడూ లేదంట ♦ ఇలా అనల్పమైన అర్ధం ఇవ్వాలనే స్ఫూర్తిని ఆత్రేయ నుంచే పొందాను. పెద్ద పెద్ద సమాసాలతో సంక్లిష్టమైన పదాలతో పాటలు రాయను. నేను రాసిన ప్రతి మాట అమ్మకు అర్ధమవ్వాలని అనుకుంటా.. అమ్మకు అర్ధమైతే అందరికీ అర్ధమైనట్టే. సైరాకు రాస్తున్నా...విశాఖలో ఎన్నో పాటలురాశాను సుందరమైన విశాఖ నగరంలో నాకు వృత్తిరీత్యా ఎంతో అనుబంధముంది. ఆర్య, బన్ని సినిమాల్లోని పాటలతో పాటు ఇటీవల ట్రెండింగ్ సాంగ్‌గా మారిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఫ్రెండ్షిప్పై వచ్చే ట్రెండు మారినా ఫ్రెండు మారడే పాటను ఇక్కడే రాశాను. ఇలా ఎన్నో పాటలను విశాఖలో కూర్చుని రాశాను. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాకి రాస్తున్నాను. పాట రాయాలని నేను వైజాగ్‌లో ఉన్నప్పుడే పిలుపువచ్చింది. -
కామర్స్‌లో కంగు.. సివిక్స్‌లో చిత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ ఫలితాల్లో ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఎక్కువగా బోల్తా కొట్టారు. సైన్స్ గ్రూప్ విద్యార్థులతో పోల్చితే వీరు ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక శాతం ఫెయిలయ్యారు. ముఖ్యంగా కామర్స్‌లో కంగు తినగా.. సివిక్స్‌లో చేతులెత్తేశారు. ఎకనామిక్సలో తికమకపడ్డారు. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఇదే పరిస్థితి. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు చతికిలబడగా.. సైన్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం దూసుకెళ్లారు. సాధారణంగా సైన్స్ గ్రూపు విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్ గ్రూప్‌లో పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తోంది. ద్వితీయ సంవత్సరం కంటే.. ఫస్టియర్ ఆర్ట్స్‌లోనే ఎక్కువ శాతం మంది ఫెయిలయ్యారు. కామర్స్‌లో ఏకంగా 40.53 శాతం మంది విద్యార్థులు చేతులెత్తేశారు. ఆ తర్వాత సివిక్స్‌లో. ఈ సబ్జెక్టులో దాదాపు 37.56 శాతం మంది అనుత్తీర్ణత సాధించారు. ఇక ఎకనామిక్స్‌లోనూ విద్యార్థులు ఇదే వరుసకట్టారు. 36.58 శాతం మంది ఫెయిలయ్యారు. కీలకమైన ఈ మూడు సబ్జెక్టుల్లో నెగ్గడానికి కష్టపడ్డ విద్యార్థులు.. హిస్టరీ విషయానికి వస్తే కాస్త మెరుగ్గా కనిపించారు. ఈ సబ్జెక్టులో 14.20 శాతం మందే పాసకాలేకపోయారు. మాతృభాషలోనూ.. ప్రధాన సబ్జెక్టుల విషయాన్ని పక్కనబెడితే మాతృభాష తెలుగులోనూ ఆశించిన స్థాయిలో విద్యార్థులు నెగ్గలేకపోయారు. ఇంగ్లిష్, సంస్కృతం, హిందీ భాషల్లో కంటే తెలుగులోనే అధిక శాతం మంది ఫెయిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో ఇదే వరుస కనిపించింది. ఫస్టియర్‌లో దాదాపు 20 శాతం మంది చేతులెత్తేయడం.. తెలుగు భాషపై విద్యార్థులకు పట్టు ఏపాటిదో అర్థమవుతోంది. -
ఆముక్తమాల్యద తాళపత్రం.. తమిళనేలపై భద్రం
‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలగొకండ ఎల్లనృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స’’ఐదొందల ఏళ్లక్రితం శ్రీ కృష్ణదేవరాయల కలం నుంచి జాలువారిన పద్యమిది. పది హేనో శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రపంచానికి చాటారు. కానీ... తెలుగంటే ఎంతో అభిమానాన్ని చాటుకున్న కృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ఆముక్తమాల్య దలో మాతృభాషపై తన మమకారాన్ని మరోసారి చాటారు. ఈ పద్యకావ్యం గురించి తెలియని తెలుగువారుండరేమో. ఈ అక్షరా లను నిక్షిప్తం చేసిన తాళపత్రగ్రంథం ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి చాలా తక్కువ మం దికి తెలుసు. ఇది తమిళనాడులోని తంజా వూరులో ఉన్న సరస్వతి మహల్ గ్రంథాల యంలో కొలువుదీరి ఉంది. ఈ తెలుగు గ్రంథం తమిళ రాష్ట్రంలో ఉన్నా దాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలు పొరపాటున చెదల బారినపడో, వాతావరణ ప్రభావానికి గురయ్యో, అనుకోని ఇతర ప్రమాదాలబారిన పడో ధ్వంసమైతే శాశ్వతంగా అవి అదృశ్య మైనట్టే. దాని ఫొటో ప్రతులు రూపొందిం చాలని ఎనిమిది దశాబ్దాల క్రితమే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు. కానీ ఆయన ఆలోచనను కూడా ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయకపోవ టం విడ్డూరమే. – సాక్షి, హైదరాబాద్ వందల్లో గ్రంథాలు... తంజావూరు గ్రంథాలయంలో 778 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వీటిల్లో 455 గ్రంథాలను తర్వాత పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ మరో 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. వీటిల్లో సనాతన వైజ్ఞానికశాస్త్రం, గణితం, పురాణాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిల్లోని ప్రత్యేకతలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాగితంపై రాసిన ఒరిజినల్ గ్రంథాలు 44 ఉన్నాయి. వీటిల్లో పుస్తకరూపంలో తీసుకు రానివి 26 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన తెలుగు గ్రంథాలు తమిళనేలపై ఉన్నా వాటిని జనంలోకి తెచ్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. అసలు.. ఆ పుస్తకాల సారాంశమేంటో తెలుసుకునే కసరత్తు కూడా జరగలేదు. వాటిని భాషావేత్తలు పరిశోధిస్తే సమాజానికి తెలియని ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సర్వేపల్లి కాంక్షించినా... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకపూర్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉండగా, 1933లో తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలోని తెలుగు గ్రంథాల గురించి తెలుసుకున్నారు. వాటిల్లో అచ్చు కానివి, బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని వెళ్లి శోధించి వాటి జాబితా రూపొందించారు. వాటిల్లో అముద్రిత గ్రంథాలను ముద్రించాలని నాటి ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిస్థాయి వరకు వెళ్లటం, బిజీగా గడపటంతో ఆ గ్రంథాలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల కొందరు భాషాభిమానులు సర్వేపల్లి రూపొందించిన జాబితాను గుర్తించారు. కానీ, రెండు తెలుగు ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. భాషాభిమానుల నుంచి విన్నపాలను అందుకున్నా ఆ దిశగా ఆసక్తి చూపకపోవటం విడ్డూరం. గణితశాస్త్రంలో మన ఘనత.. గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది సనాతన భారతమే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణితంలో ఘనతను సాధిస్తుందీ మనవారే. అలాంటి గణితం పద్యరూపంలో ఉందంటే నమ్ముతారా.. గణితంలోని ఎన్నో అంశాలను పద్యాల ద్వారా గొప్పగా వివరించి ఆ శాస్త్రంలో ప్రత్యేకతలను పరిచయం చేసింది ‘గణిత చూడామణి’. 19 వ శతాబ్దంలో ఇలాగే ఇది తళుక్కున మెరిసి పూర్వీకులను గణిత పం డితులుగా మార్చింది. తంజావూరు గ్రంథా లయంలో దిక్కూమొక్కూలేక పడి ఉన్న తెలుగు తాళపత్రగ్రంథాల్లో ఎన్ని గొప్ప విషయాలున్నాయో, అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయోనని భాషాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనాలి.. ‘నేను ఓ సదస్సు కోసం వెళ్లినప్పుడు తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తాళపత్రగ్రంథాలను చూసి పులకరించి పోయాను. ఆముక్తమాల్యద లాంటి ఒరిజినల్ ప్రతులున్నాయని తెలుసుకుని సంబరపడ్డాను. వాటిల్లో ముద్రితం కానివాటిని వెంటనే ముద్రించటంతోపాటు తాళపత్ర గ్రంథా లను డిజిటలైజేషన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి నివేదించాను. కానీ, ఇప్పటి వరకు ఆ కసరత్తు ప్రారంభం కాకపోవటం బాధాకరం’ డాక్టర్ రాజారెడ్డి, వైద్యుడు, చరిత్రపరిశోధకులు ముందుకు సాగని మహాసభల స్ఫూర్తి.. ప్రపంచ తెలుగు మహాసభలలో ఎంతోమంది భాషాభిమానులు ప్రాచీన తెలుగుగ్రంథాల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అముద్రిత తెలుగు గ్రంథాలను గుర్తించి వాటిని కాపీ చేసి ప్రజల ముంగిటకు తేవాలని కోరా రు. ఈ క్రమంలోనే లండన్ లైబ్రరీలో దాదాపు 8 వేలకు పైచిలు కు తెలుగు పుస్తకాలున్నాయని, వాటిల్లో కొన్ని తెలుగునేలపై లభించటం లేదని గుర్తించి వాటిని కాపీ చేయాలని ప్రస్తావిం చారు. కానీ ఆ దిశగా అసలు అడుగు పడకపోవటం విచిత్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇలాగే వెలుగు చూసింది... రాజనీతి, పాలన, సమాజం... ఇలా ఎన్నో అంశాలను స్పృశిస్తూ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచిన గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసిన ఈ మహత్ గ్రంథం క్రీస్తుపూర్వంలో ఆవిష్కృతమైనా ఆ తర్వాత క్రీ.శ.12 వ శతాబ్దం వరకు దీనిని ప్రపంచం అనుసరించింది. ఆ తర్వాత ఆ గ్రంథ ప్రతులే కనిపించలేదు. కానీ, వందల ఏళ్ల తర్వాత ఆ గ్రంథం తాళపత్ర రూపం మైసూరులో ప్రత్యక్షమైంది. అక్కడి గ్రంథాలయంలో అనామకంగా పడి ఉన్న ఆ సంస్కృత గ్రంథాన్ని శ్యామశాస్త్రి గుర్తించి 1909 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించి పుస్తకరూపమిచ్చారు. -
తెలుగు భాషా సేవలో వైఎస్ ఆదర్శప్రాయుడు
తెలుగుదేల యన్న దేశంబు తెలు గేను / తెలుగు వల్లభుండ తెలుగొ కండ / ఎల్ల నృపులు గొలువ నెఱు గవే బాసాడి / దేశ భాషలందు తెలుగు లెస్స అని... అన్నది మన తెలుగు రాయడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషా మాధుర్యాన్ని, గొప్పదనాన్ని చాటిచెప్పిన రాయలు చరిత్రలోనే కాదు, సాహిత్య చరిత్రలోనూ శాశ్వ తమైన కీర్తిని సొంతం చేసుకున్నాడు. కానీ భారత దేశం పరాధీనమైనప్పుడు దేశ భాషలు అడుగంటిపోయాయి. ఆంగ్ల భాష అందలమెక్కింది. మాతృభాషలో మాట్లా డటం అవమానం గానూ, ఆంగ్లంలో మాట్లాడడం గొప్ప గానూ భావించే దౌర్భాగ్యం ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా కొన్ని భాషలకు స్వాతంత్య్రం రాలేదు. పరభాషను పట్టుకుని పాకులాడుతూనే ఉన్నాం. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహా త్మాగాంధీగారు స్వదేశీ భాషలను బలోపేతం చేసుకోవా ల్సిన అవసరం ఉందని ప్రబోధించారు. అందుకనుగుణం గానే భారత ప్రభుత్వం ప్రాంతీయ భాషలకు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భాషాభిమానులైన తమిళులు ప్రాచీన భాషా హోదాను తెచ్చుకుని తమ భాషలో ఉన్న ప్రాచీన సాహిత్య శాస్త్ర విజ్ఞానాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో పదిల పరు చుకుంటున్నారు. మన తెలుగు వాళ్లకు మన మాతృ భాషకు ప్రాచీన హోదా సాధన మీద అంతగా పట్టింపు లేకుండా గడిచిపోయింది. కానీ 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించారు. అదే సంవ త్సరంలో ఆయన ప్రారంభించిన ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి చెందిన మూడు సెంటర్ల (ఇడుపుల పాయ, నూజి వీడు, బాసర)లో ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుగును ‘ఆప్షనల్ సబ్జెక్టు’గా చదవడానికి అవకాశమిచ్చారు. అలా ఆయన తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నారు. ఏ కోర్సు చదివినా మనకు సంస్కారాన్ని నేర్పేది మాతృభాష మాత్రమేనని నమ్మారాయన. తాను నమ్మినదే ఆచరించి చూపించారు. ప్రాచీన హోదాతో ఏమొస్తుంది? తెలుగుకు ప్రాచీన హోదా వస్తే అటు భాషోద్ధరణ పరంగానే కాకుండా, ఉద్యోగాల కల్పన వంటి అనేక రకాల ప్రయోజనాలుంటాయి. – తెలుగు చక్కగా రాయడం, చదవడం వచ్చిన వారికి ఉన్న చోటనే ఉపాధి లభిస్తుంది. నెలరోజుల శిక్ష ణలో కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు తెలుగు టైప్ నేర్పిస్తే వాళ్లు ప్రాచీన ప్రతులను టైప్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరచడానికి మార్గం సుగమం చేయగలు గుతారు. – తాళపత్ర ప్రతులను యథాతథంగా రాసి ఇవ్వగలి గిన లేఖకులున్నారు. వారి చేత తాళపత్ర గ్రంథాల్లోని సమాచారాన్ని పేపర్ మీద రాయించుకుని, వాటిని కంప్యూటర్లో భద్రపరచడం ద్వారా తెలుగు భాషలో ఉన్న విలువైన విషయాలను భావి తరాల కోసం భద్ర పరచడం సులువవుతుంది. – తెలుగు రాష్ట్రాల్లో పండితులు, మహా పండితులు, మహామహా పండితులు ఉన్నారు. టైప్ చేసిన ప్రతులను పండితులు ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు దిద్ది, కాపీలను సరిచేస్తారు. ఇక మహా పండితులు, మహా మహా పండి తులు కాపీలను ఎడిటింగ్ చేసి పుస్తక రూపంలోకి తేవడా నికి సహకరిస్తారు. ద్విభాషా పండితులు అనువాదం చేసి ఇతర భాషల్లోకి మన గ్రంథాల్లో ఉన్న విలువైన సంగతు లను విస్తరింపచేస్తారు. – ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని డిజి టలైజేషన్ నిపుణులు అందిస్తారు. సర్వర్మెయింటెనెన్స్, వెబ్ క్రియేషన్, వెబ్ మెయింటెనెన్స్, మ్యాటర్ క్లాసిఫికే షన్ వంటి పనుల అవసరం రీత్యా ఇంజనీరింగ్ విద్యార్థు లకు ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉన్న చోటనే ఉపాధి లభిస్తుంది. గ్రామాల్లో ఉన్న వాళ్లు అక్కడే ఉండి సేవలందించవచ్చు. కొత్త డిక్షనరీలు వస్తాయి భాషాభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే, భాషలో ఉన్న పదాలన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తమై వాటి కోసం డిక్షనరీలు తయారవుతాయి. ఇప్పుడున్న డిక్షనరీలు పరిమితమైన పదాలలోనే ఉన్నాయి. ఆ డిక్షనరీలు విస్తృతమవుతాయి. తెలుగు పలుకుబడులు, సామెతలు మొదలైన అనేక భాషావిశేషాలు వెలికి వస్తాయి. తెలుగు భాషలో ఉన్న సమస్త విషయాలు తెలుగువారి ముంగిట నిలుస్తాయి. ధనం, సమయం వృథా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మన చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాస్త్రాలు అందుబాటులోకి వస్తాయి. తెలుగులో పరిశోధనలు వేగవంతమవుతాయి. మన భాషలో ప్రాచీన కాలం నుంచి నిక్షిప్తమైన సమాచార మంతా వెలుగులోకి వస్తుంది. నిధులున్నాయి... ఆచరణ లేదు కేంద్రం నుంచి 2008–2019 వరకు సంవత్సరానికి 100 కోట్లు చొప్పున తెచ్చుకోవాల్సి ఉండింది. వాటిని సాధించడానికి తెలుగు భాషపై అభిమానం ఉండాలి, ఆచరణ ఉండాలి. ఆ నిధులతో భాషాభివృద్ధి, ప్రాచీన భాషా పరిరక్షణ, ఉపాధి కల్పన, తెలుగు భాషా సభల నిర్వహణ, తెలుగు భాషా పండితులకు ప్రతిభా పురస్కా రాలు మొదలైనవెన్నో నిర్వహించవచ్చు. ఇలాంటి కార్యక్ర మాల ద్వారా కొత్తతరానికి మాతృభాష ప్రాధాన్యతను తరచుగా గుర్తు చేస్తున్నట్లవుతుంది. ఈ రకంగా మాతృ భాషాభిమానం చాటుకున్న నాయకులు శ్రీకృష్ణదేవరా యల వలే శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు పొందగలుగుతారు. గ్రంథ రచన పరిశ్రమ పూర్వం రాజులు భాషాభిమానంతో గ్రంథ రచనను ఒక పరిశ్రమగా నిర్వహించేవారు. ఎప్పటికప్పుడు పాతబ డిన తాళపత్రాలలోని విషయాన్ని తిరిగి కొత్త తాళపత్రాల మీద రాయించేవారు. ఈ ప్రక్రియ పండితుల పర్యవేక్ష ణలో జరిగేది. ఎందరికో ఉపాధి దొరికేది. సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషను పరిరక్షించుకోవడానికి ఇంతగా శ్రమించేవాళ్లు. అలాంటి సంస్కృతిని తిరిగి ప్రవేశ పెట్టు కుని భాషను, సంస్కృతి, సాహిత్యాలను కాపాడుకోవడా నికి ప్రాచీన హోదా ఒక మంచి అవకాశం. వైఎస్ఆర్ ప్రాచీన హోదా సాధించారు. దానిని ఆచరణలో పెట్టే బాధ్యతను తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసు కోవాల్సిన అవసరం ఉంది. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడనేది వాడుకలో ఉన్న మాట. బృహదారణ్యకోపనిషత్తు ‘పు’ అంటే పూర్ణం చేయడం అని, ‘త్ర’ అంటే రక్షించడం అని చెప్పింది. అంటే... తండ్రి పూర్తి చేయలేకపోయిన మంచి పనిని తనయుడు పూర్తి చేసి రక్షించాలని అర్థం. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చేవిధంగా వైఎస్ జగన్ ప్రయత్నించాలనీ, అందుకు సన్నద్ధంగా తగిన ప్రకటన చేయాలని కోరుతూ... ప్రొ‘‘ కె. కుసుమారెడ్డి వ్యాసకర్త విశ్రాంత తెలుగు ఆచార్యులు, ఓయూ -
రాజమండ్రి ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆచార్య యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తెలుగు భాషా ద్రోహి అని మండిపడ్డారు. తెలుగు భాషను ఉద్ధరిస్తానని ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఆఖరు రోజున రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చకుండా రాజమండ్రి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సాంస్కృతిక పీఠానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికి అవసరమైతే రాజమండ్రిలో ఆమరణ దీక్ష చేపడతానని ఆయన అన్నారు. -
తెలుగు మళ్లీ వెలగాలి
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటీ ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యే లోగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అప్పటికి హిందీ తర్వాత తెలుగు భాష దేశంలో ద్వితీయస్థానంలో ఉండేది. మరాఠీ మూడో స్థానంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అద్వితీయ భాషగా వెలుగొందగలదని తెలుగు ప్రజలందరూ ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు ఎన్నాళ్లో నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పట్టుమని పదిహేనేళ్లలోగానే తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. బెంగాలీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడినా, దేశ భాషల్లో తెలుగు తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం కాదు సరికదా, కనీసం పదిలపరచుకోవడంలోనూ విఫలమై, నాలుగో స్థానానికి పడిపోయింది. హిందీ అప్పటికీ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బెంగాలీ రెండో స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తుండగా, మరాఠీ మూడో స్థానానికి ఎగబాకింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. ఈ లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న దశాబ్ద కాలంలో– అంటే, 2001–11 కాలంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యలో 9.63 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో నేపాలీ (1.98 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మలయాళం (5.36 శాతం), సింధీ (9.34 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్న ఆనందం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలతో ఆవిరైనట్లేనంటూ తెలుగు భాషాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు విద్యావేత్తలు ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలు పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చెబుతున్నారు. ఖరగ్‌పూర్, భిలాయి, ఒడిశా తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, దేశ భాషల్లో తెలుగు రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంటుందని, అంతేకాని నాలుగో స్థానంలో కాదని ఆయన మీడియాతో అన్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను అంతిమంగా స్వీకరించలేమని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు భాషాభిమానులు తమ తమ స్థాయిలో స్పందిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీ హవా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన దశాబ్ద కాలాన్నే తీసుకుంటే, 2001 –11 మధ్య కాలంలో హిందీ మాతృభాషగా గల వారి జనాభాలో ఏకంగా 10 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల రెండో స్థానంలో ఉన్న బెంగాలీ మాతృభాషగా గల వారి జనాభా కంటే ఎక్కువే. మన దేశంలో మాట్లాడే చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ ఆధునిక భాష. మిగిలిన భాషల కంటే దీనికి గల చరిత్ర చాలా తక్కువ. సంస్కృత భాష నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో పుట్టిన అపభ్రంశ రూపమైన సౌరసేని భాష హిందీకి మూలమని చెబుతారు. ప్రామాణిక రూపంలోని హిందీ రచనలు పదహారో శతాబ్దిలో మొదలయ్యాయి. మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో ఉండగా, అంటే పద్దెనిమిదో శతాబ్దిలో మాత్రమే హిందీ ఆస్థాన గౌరవాన్ని అందుకోగలిగింది. బ్రజ్‌భాష, అవధి, మైథిలి వంటి స్థానిక భాషలను, మాండలికాలను కలుపుకొని ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో విస్తరించింది. తెలుగుతో పాటు ప్రాచీన హోదా అందుకున్న ఆరు భాషల్లో ఏ భాష కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు సరికదా, జనాభాలో తమ శాతాన్ని కూడా పెంచుకోలేకపోతున్నాయి. హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 161 శాతం మేరకు పెరిగింది. ఇదేకాలంలో తెలుగు సహా దక్షిణాదికి చెందిన ద్రావిడ భాషలు మాట్లాడేవారి జనాభాలో 81 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. మరోవైపు 2001 నుంచి 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారి జనాభా దాదాపు రెట్టింపయింది. హిందీ మాట్లాడేవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడుతున్నా, వారు తమ మాతృభాషను కాపాడుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా హిందీని మాతృభాషగా చదువుకోగల వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. తెలుగు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటున్నా, ఆ రాష్ట్రాల్లో ఒకటి రెండు తరాలు గడిచే సరికి తెలుగును మాతృభాషగా నిలబెట్టుకోగలుగుతున్న వారి సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తోంది. తెలుగులో విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు తప్పనిసరిగా అక్కడి స్థానిక భాషలనే మాతృభాషగా స్వీకరిస్తున్నారు. సంఖ్య పెరిగినా తగ్గిన జనాభా శాతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1951 నాటితో పోల్చుకుంటే 2011 నాటికి తెలుగు మాట్లాడే వారి జనాభా సంఖ్యపరంగా రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగింది. దేశజనాభాను మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1951 నాటికి 9.24 శాతం ఉంటే, 2011 నాటికి 6.93 శాతానికి పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందీ ప్రచారం జరిగినట్లుగా మరే భాషకూ ప్రచారం జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి మాత్రమే గట్టి ప్రతిఘటన ఎదురైంది. బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి భాషలు తమ తమ రాష్ట్రాల్లో తమ ఉనికి బలంగా కాపాడుకోగలిగాయి. ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రాబల్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టడంలో తెలుగు, కన్నడ వంటి భాషలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటికి రెండో స్థానంలో ఉన్న తెలుగు, 1971 నాటికి మూడో స్థానానికి పడిపోయినప్పుడైనా, తాజాగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినప్పుడైనా తెలుగు భాషోద్ధరణ కోసం, కనీసం భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. తెలుగు భాషోద్ధరణ పేరిట 1975 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినా, వాటి వల్ల తెలుగు ప్రజలకు ఒరిగినదేమీ లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల వెలుపల ఉంటున్న తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యావకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉంటున్నా, వారిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదివరకటి కాలంలో అ‘ద్వితీయం’గా వెలుగొందిన తెలుగు భాష ప్రాభవం ఇప్పుడు క్రమంగా మసకబారుతుండటానికి వెనుకనున్న కారణాలను విశ్లేషించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఉంది. తెలుగు చరిత్రలో మైలురాళ్లు తెలుగు భాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే ఉనికిలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దికి చెందిన శాతవాహనుల కాలం నాటి ప్రాకృత పద్యసంకలనం ‘గాథాసప్తశతి’లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు, ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగులోని స్పష్టమైన తెలుగు శిలాశాసనం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శిలా శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం ‘నాగబు’. శతాబ్దాల తరబడి వాడుక తర్వాత క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో తెలుగులో గ్రంథరచన మొదలైంది. మహాభారత ఆంధ్రీకరణకు నన్నయ శ్రీకారం చుట్టాడు. నన్నయ మహాభారత రచన ప్రారంభించడానికి ముందే తెలుగులో కొన్ని జానపద గీతాలు, పద్యాలు ప్రచారంలో ఉండేవి. నన్నయ ప్రారంభించిన మహాభారత ఆంధ్రీకరణను పదమూడో శతాబ్దికి చెందిన తిక్కన, పద్నాలుగో శతాబ్దికి చెందిన ఎర్రన పూర్తి చేశారు. తెలుగులో గ్రంథరచన మొదలైన దాదాపు మూడు శతాబ్దాల కాలంలో చాలామంది కవులు ఎక్కువగా పురాణాల ఆధారంగానే కావ్యాలు రాశారు. పదిహేనో శతాబ్ది నుంచి పదహారో శతాబ్ది వరకు గల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ‘శ్రీనాథయుగం’గా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు, పోతన, గౌరన, జక్కన, తాళ్లపాక తిమ్మక్క వంటి కవులు తెలుగు ఛందస్సును పరిపుష్టం చేశారు. శ్రీనాథ యుగంలో కూడా సంస్కృత కావ్య, నాటకాల అనువాదం ప్రధానంగా కొనసాగింది. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. పదహారో శతాబ్ది మన సాహిత్య చరిత్రలో‘రాయలయుగం’గా ప్రసిద్ధి పొందింది. రాయల కాలంలో అత్యధికంగా ప్రబంధ కావ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కాలాన్ని ప్రబంధ యుగం అని కూడా అంటారు. స్వయంగా కవి అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థాన కవులైన పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు తదితరులు కూడా ప్రబంధ కావ్యాలు రచించారు. తర్వాతి కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం పుంజుకుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో చాలామంది తెలుగులో కృతులు, కీర్తనలు రచించారు. ఆధునిక యుగంలో తెలుగు తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం 1796లో విడుదలైంది. అయితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత మాత్రం పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మాత్రమే ప్రారంభమైంది. అప్పటికి దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుండటంతో ఇంగ్లిష్ కవిత్వం ప్రభావంతో నాటి యువకవులు భావకవిత్వం పేరిట కొత్తరీతిలో ప్రణయకవిత్వాన్ని విరివిగా రాశారు. బ్రిటిష్ అధికారి అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని, మరుగున పడిపోయిన వేమన పద్యాలను వెలుగులోకి తేవడమే కాకుండా, వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. తొలి ఇంగ్లిష్–తెలుగు నిఘంటువును స్వయంగా పరిష్కరించి, ప్రచురించాడు. తెలుగునాట ఏ విశ్వవిద్యాలయాలూ, సాహితీ సంస్థలూ చేయలేనంతగా తెలుగు భాషోద్ధరణకు సీపీ బ్రౌన్ కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ ద్వారా తెలుగులో నవలా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధునిక యుగంలోని తొలినాటి రచనలు ఎక్కువగా గ్రాంథికభాషలోనే ఉండేవి. సాహిత్యాన్ని పామరులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కొందరు రచయితలు వ్యావహారిక భాషోద్యమానికి తెరతీశారు. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని ఉధృతంగా సాగించడంతో చాలామంది కవులు, రచయితలు వాడుక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుడిపాటి వెంకటచలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారు తమ రచనల ద్వారా వ్యావహారిక భాషావ్యాప్తికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి శిష్యుడైన తాపీ ధర్మారావు తన సంపాదకత్వంలో వెలువడిన ‘జనవాణి’ పత్రిక ద్వారా పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. ‘జనవాణి’కి ముందునాటి పత్రికల్లో మామూలు వార్తలను కూడా సరళగ్రాంథిక భాషలో రాసేవారు. పత్రికల్లో తాపీ ధర్మారావు తెచ్చిన ఒరవడిని అనతికాలంలోనే మిగిలిన పత్రికలూ అందిపుచ్చుకున్నాయి. ప్రాచీన హోదాకు వైఎస్ కృషి, బ్రిటిష్ హయాంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రావిన్స్‌లో అంతర్భాగంగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం పాలనలో ఉండేది. తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన దరిమిలా, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకొని 1956 నవంబర్ 1న విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తెలుగు తన ‘ద్వితీయ’ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం తెలుగు ప్రజలకు సంతోషకరమే. అయితే, బోధనలోను, పరిపాలనలోను తెలుగు భాషా వ్యాప్తి, విస్తరణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా కృషి చేస్తేనే తెలుగు తిరిగి అ‘ద్వితీయ’ స్థానంలో వెలుగొందగలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
టీడీపీ చట్టాన్ని ఉల్లంఘించింది: యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం తెలుగును అవమానించిందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వానికి తెలుగంటే గౌరవం లేదని విమర్శించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై తెలుగులో ముద్రించలేదని ఆరోపించారు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన శిలాఫలకంపైన కూడా అక్షరాలు తెలుగులో కాకుండా ఇంగ్లీంష్‌లోనే ముద్రించారని ధ్వజమెత్తారు. చట్టప్రకారం శిలాఫలకాలపై ప్రాంతీయ భాషనే వాడాలని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషను ఎక్కడా వాడటం లేదన్నారు . చంద్రబాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని, దీనికి కారకులయిన వారిపై చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. -
సాహితీ సేనాని
విద్వాన్ బూతపాటి కిరణశ్రీకి తెలుగు భాషంటే ప్రాణం. తెలుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటాలనే దృఢ సంకల్పం. తెలుగు పండితునిగా విద్యార్ధుల్లో ఆయన స్థానం సుస్థిరం. అక్షరాలు సమాజాన్ని మారుస్తాయన్న అచంచల నమ్మకం ఆయనది. రచనలు, అనువాదాలు చేస్తూనే.. నవయుగ కవి చక్రవర్తి, పద్మ విభూషణ్ గుర్రం జాషువా కవిత్వం పట్ల, జీవిత విధానం పట్ల మక్కువతో విశ్రాంత జీవితాన్ని సమాజాన్ని మలిచేందుకు వినియోగిస్తున్నారు. జాషువా పేరిట తొలి ప్రజాగ్రంథాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. జాషువా విగ్రహాన్నీ ప్రతిష్ఠించారు. భవిష్యత్ తరానికి సాహితీ సిరులను అందించడంలో అలుపెరగని అవిశ్రాంత ఉపాధ్యాయుడు కిరణశ్రీ. జాషువా సేవలో తరించారు కిరణశ్రీ సొంత ఊరు అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. తల్లిదండ్రులు నాగరత్నమ్మ, జాన్. ఆయన తండ్రి ఆంగ్లేయుల కాలంలోనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు. కిరణశ్రీ ప్రాధమిక విద్య ఉయ్యలవాడలోనే సాగింది. సంజీవరాయునిపేటలో ఎస్ఎస్ఎల్సి పూర్తిచేశారు. 1968–71ల మద్య పద్మభూషణ్ గుర్రం జాషువాకు శిష్యునిగా సేవలందించారు. అప్పుడే తెలుగుభాషా మాధుర్యాన్ని చవి చూసి, భాషపై మక్కువ పెంచుకున్నారు. జాషువాతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రి, అమరేంద్ర, ప్రసాదరాయ కులపతి వంటి మహాపం డితుల సహచర్యం ఆయనకు లభించింది. చిన్నవయస్సులోనే వారితో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు. విద్యార్థులపై చెరగని ముద్ర చదువు పూర్తయ్యాక బెస్తవారిపేట క్రైస్తవ మిషనరీ కళాశాలలో సెకండరీగ్రేడ్ పూర్తిచేశారు కిరణశ్రీ. అనంతరం ద్వితీయశ్రేణి తెలుగు పండిట్‌గా 1973లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఓవైపు బోధిస్తూనే తాను విద్యార్ధిగా మారి డిగ్రీలను సాధించారు. ముప్పైమూడేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. తెలుగు నుడికారాలను, ఉచ్చారణ, పద్యపఠన, చందస్సులను బోధించడంలో ప్రతి విద్యార్థ్ధిపై తనదైన చెరగని ముద్రవేశారు. పదవీ విరమణ అనంతరం వెలుగు ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేశారు. 2012లో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ తెలుగు అనువాదకునిగా అనేక జీవోలను తెలుగులోకి అనువదించారు. విగ్రహం ఏర్పాటుకు పదేళ్లు! నెల్లూరులో జాషువా కవితా పీఠాన్ని 1984లో ప్రారంభించారు కిరణశ్రీ. 2008లో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. పదేళ్లపాటు సుదీర్ఘ పోరాటంతో 2018 సెప్టెంబర్‌లో నెల్లూరు నగరంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, కన్ఫెడరేషన్ అండ్ యునెస్కో క్లబ్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు, జాషువా కవితాపీఠం, అధికారభాషా సంఘం రాష్ట్ర, జాతీయ సంస్థల్లో అనేక కీలక పదవులను నిర్వహిస్తున్న సమయంలో కూడా జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన పలు అవరోధాలను అధిగమించాల్సి వచ్చిందన్నది నిజం. పురస్కారాలు.. పుస్తకాలు కిర ణశ్రీ రచించిన పలు పుస్తకాలను ప్రభుత్వం పాఠ్యగ్రంథాలుగా తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడో తరగతి విద్యార్థుల కోసం ‘అణిముత్యాలు’ అనే తెలుగు ఉపవాచక పుస్తకానికి గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘పిచ్చివాడు’ అనే నాటకం సుమారు యాభై పరిషత్‌ల అవార్డులను అందుకుంది. ‘మడివేలు మాచయ్య’ పద్యనాటకం పండితుల ప్రశంసలు సైతం అందుకుంది. అనువాదకునిగా ఆయన ఎనభైకి పైగా గ్రం«థాలను తెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషను సజీవంగా ఉంచాలని, విశిష్టమైన తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాలని నిర ంతరం కృషి చేస్తున్న కిరణశ్రీ వంటి వారి అడుగుజాడల్లో ఈతరం వారు నడవడం ఎంతైనా అవసరం. – మౌంట్‌బాటన్, సాక్షి, నెల్లూరు -
దుఃఖిస్తున్న తెలుగు తల్లి
ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మారిషస్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా ఇలా ఎక్కడకు వెళ్లినా అక్కడ తెలుగు వారు తమ భాషా సంస్కతులను కాపాడుకునేందుకు చేస్తున్న కషి చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అనేక దేశాల్లో తెలుగు వారు తమ పిల్లలకు తెలుగు నేర్పేం దుకు తహతహలాడుతున్నారు. ఆ దేశాల్లో తెలుగు సదస్సులకు హాజరైనప్పుడు అక్కడి పిల్లలు చక్కటి తెలుగులో మాటా ్లడుతుండటం విని నేను దిగ్భ్రమ చెందుతుంటాను. ఇవాళ ఇక్కడ మెల్బోర్న్లో వంగూరి చిట్టెం రాజు ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్, లోకనాయక్ ఫౌండే షన్, ఆస్ట్రేలియా తెలుగు సంఘం కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఆరవ ప్రపంచ సాహితీ సదస్సులో ఆస్ట్రేలియా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పెద్దలూ, పిల్లలూ పాల్గొని దాన్ని విజయవంతం చేయడం చిన్న విషయం కాదు. కానీ నేనూ నా రాష్ట్రం నుంచి మీకు ఏ సందేశం ఇవ్వగలను? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సంస్కృతులు అద్భుతంగా పరిఢవిల్లుతున్నాయని చెపితే అది నన్ను నేను మోసగించు కున్నట్లవుతుంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పరిపాలన సాగిస్తున్నాయి. తెలంగాణలో తెలుగు వెలిగి పోతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి ముఖం వెలవెలబోతోంది. ఇక్కడ ఒక ఖండంలో, పరాయిగడ్డపై, మన స్వంత ప్రాంతాలను విడిచివచ్చిన మీరు ఒక్కటై తెలుగు భాషను సంస్కృతినీ అద్భుతంగా కాపాడుతూ, ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నందుకు నేను పులకించి పోతున్నాను. కాని అదే సమయంలో మాతృ భూమిలో తెలుగు భాష పరిస్థితిని తలుచుకుని నాకు దుఃఖం కలుగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడేభాష అయినప్పటికీ ప్రాంతీయభాషగా తెలుగు నిరాదరణకు గురైంది. అన్నింటా అధికార భాషగా ఉర్దూ పీఠం వేసుకుంది. అమ్మ భాషకోసం తెలంగాణలో నాటితరం భారీ ఉద్యమాలు,పోరాటాలు చేయాల్సి వచ్చింది. తెలుగు ప్రజలకు కనీసం సభలూ సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారు తెలంగాణలో తెలుగు వైభవానికి కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ తెలుగుకు అత్యున్నత స్థాయి కల్పించారు. జలగం వెంగళరావు ప్రధమ ప్రపంచ మహాసభలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాలు పురుడు పోసుకోవడానికి దోహదం చేశారు. కాని ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత నందమూరి వారసులమనీ, అమరావతిని రాజధానిగా నెలకొల్పామనీ చెప్పకుంటున్న వారి రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు ఆదరణ తగ్గిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీఓ నంబర్ 21ను విడుదల చేసింది. ఈ మేరకు చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెలుగులో తప్పనిసరిగా బోధన జరగాలని ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి దేశ విదేశాలనుంచి తెలుగు సాహితీవేత్తలను పిలిచి సత్కరించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుంది. తెలుగుపై మమకారం లేని బాబు పాలన కాని ఎన్టీఆర్ వారసులు నడుపుతున్న ప్రభుత్వంలో తెలుగు భాష అమలు మాటేమిటి? తెలుగు అనే పదాన్ని తన సంస్థకు తగిలించుకున్న ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుని నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ ఆ భాషా పరి రక్షణకు ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రకటించిన వాగ్దా నాలను నెరవేర్చిన పరిస్థితులు కనపడటం లేదు. పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ పాలనా భాషగా తెలు గును అమలుచేస్తామని, నవ్యాంధ్రలో తెలుగు విశ్వ విద్యా లయం ఏర్పాటు చేస్తామని సీఏం స్వయంగా పలుసార్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక తెలుగు కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలుగు పండితుల శిక్షణా కళాశాలలు ఏర్పాటు చేస్తామని, తెలుగు ప్రాచీన తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ చేస్తామని ఏవేవో ప్రకటనలు గుప్పించారు. ఏ ఒక్కదాన్నీ ఆమలు చేయలేదు. పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ మీ డియంను ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి ఆంగ్లభాషపై ఉన్న మమకారంలో నూరో వంతు కూడా తెలుగు భాషపై లేదని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడాల్సిన అవసరం కనపడదు. తెలుగు భాష అంటే తమకు పట్టింపు లేదని, తమకు ఆంగ్ల భాషా వ్యామోహమే ఉన్నదని, తాము, తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివారు కనుక ప్రజలను తెలుగులో చదవమని చెప్పే అధికారం తమకు లేదని, తెలుగు నేర్చు కుంటే బతుకుతెరువు లభించదని ఆనాడే ప్రకటించి ఉంటే ఇవాళ వారిని నిలదీసి ఎవరూ అడిగేవారు కాదు. కానీ తెలుగు భాషను కాపాడతామని, తెలుగులోనే ప్రధానంగా వ్యవహారాలు సాగిస్తామని 2014లోనే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాట నిజం కాదా? అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాల మాటేమిటి? ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాసంస్థల్లో తెలుగు భాషను తప్పని సరి చేస్తాం, ఆ మేరకు జీవోలు జారీ చేస్తామని నాలుగేళ్ల పాటు వాగ్దానాలు గుప్పించలేదా? పైగా, మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధనను రద్దు చేస్తూ రెండేళ్ల క్రితం జీవో జారీ చేశారు. ఇవాళ మాతృభాష మా జన్మహక్కు అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో మాతృభాషను ప్రధాన భాషగా విద్యాబోధన చేస్తుంటే మన రాష్ట్రంలో మాతృభాష మీడియంను రద్దు చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంగన్వాడీలలోను తెలుగు లేకుండా చేశారు. తెలుగు భాషను కూకటివేళ్లతో పెకలించేందుకు ఇవాళ ప్రభుత్వంలో మంత్రులు కూడా కంకణం కట్టుకున్నట్లు కనపడుతున్నారు. ఒక కార్పొరేట్, వ్యాపార సంస్కృతి ఇవాళ ఏపీలో తెలుగు భాషను పూర్తిగా కబళించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ప్రతి ఏడాది ఆగస్టు 29 వచ్చేసరికి గంభీరమైన వాగ్దా నాలకు కొదువ ఉండదు. పాఠశాలలనుంచి ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో విద్యాబోధన తప్పని సరిచేస్తామన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. పాఠశాలల్లో తెలుగు ప్రవే శించడం మాట దేవుడెరుగు, పసిపిల్లలను కూడా అమ్మా అనే బదులు మమ్మీ అనడమే సరైనదని చెప్పారు. తెలుగుకు పీఠాలు కడతామని మరో వాగ్దానం చేశారు. తీరా చూస్తే ఆ పీఠం సమాధి అన్న విషయం అర్థమవుతోంది. ప్రత్యేక కేంద్రం కోసం కేటాయిస్తామన్న పదివేల చదరపు అడుగుల భూమి అంటే తెలుగును పూడ్చి పెట్టడానికి ఏడడుగుల స్థలం కోసం అన్వేషణగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్ప టికైనా ఏపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా తెలుగు అమలుకు కంకణం కట్టుకోవాలి. ఇవాళ తెలుగుభాష ఉనికిని కాపాడేం దుకు ప్రభుత్వాలు విదేశాల్లో తెలుగు సంస్థలనుంచి నేర్చుకో వాల్సిన అవసరం కనపడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి తనను కబళిస్తున్న భాషా హంతకులనుంచి రక్షించమని విలపిస్తోంది. అమ్మ జోలపాట అంతర్ధానమవుతోంది. చెదలు పట్టిన పెద్ద బాలశిక్ష పుటలు చేతులు చాచి రెపరెప కొట్టుకుంటూ ఆర్తనాదం చేస్తున్నది. నినాదాల ఘోషలోభాష మరణిస్తోంది. వాగ్దానాల హోరులో అక్షరాల ఆర్తనాదం కలిసిపోయింది. కూలిన పాఠశాల భవనాల మధ్య మహాకవులూ, కవిసామ్రాట్టులూ కవిత్ర యాలూ, కవికోకిలలూ ఆత్మలై సంభాషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాక తెలంగాణలోనో, అమెరికా లోనూ, ఆస్ట్రేలియాలోనో, మారిషస్‌లోనో పుడితే మళ్లీ జీవిస్తామేమోనని చర్చించుకుంటున్నాయి. (నవంబర్ 3,4 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆచార్య యార్లగడ్డ లక్ష్షీ్మప్రసాద్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు) వ్యాసకర్త రాజ్యసభ మాజీఎంపీ, ఏపీ హిందీ అకాడెమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
తమిళం ఖూనీ.. తెలుగుకు చోటేది..
సాక్షి, చెన్నై : అత్యంత ప్రతిష్టాత్మకంగా నర్మదా నదీ తీరంలో ప్రతిష్టించిన ఉక్కుమనిషి విగ్రహం శిలా ఫలకంలో తమిళంకు అవకాశం దక్కినా, అక్షర దోషాలు, అర్థాన్నే మార్చేస్తూ ఖూనీచేసేలా ఉండడం తమిళనాట చర్చకు దారితీసింది. అయితే, అందులో తెలుగుకు అవకాశం కల్పించక పోవడంపై జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేలకు గుజరాత్లో భారీ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. నర్మదా నదీ తీరంలో 182 మీటర్లతో బ్రహ్మాండంగా ప్రతిష్టించిన నిలువెత్తు విగ్రహాన్ని బుధవారం మోదీ ఆవిష్కరించారు. ఇందులోని శిలాఫలకంలో తమిళానికి చోటు కల్పించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. పలు భాషల్లో ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్న నామకరణంతో నినాదాన్ని పొందుపరిచారు. అయితే, తమిళంలో ఒట్ట్రుమై శిలై అని పొందుపరచాల్సి ఉండగా, స్టేట్టుక్కో ఒప్పి యూనిటి అని ముద్రించడం విమర్శలకు దారితీసింది. అక్షర దోషం పక్కన పెడితే, అర్థమే మార్చేస్తూ, తమిళంను ఖూనీ చేశారన్న చర్చ తమిళనాట ఊపందుకుంది. కొన్ని తమిళ మీడియాల్లో వార్త కథనాలు తెర మీదకు వచ్చాయి. ఇక, తమిళం ఖూనీ చేస్తూ అక్షరాలను పొందుపరచడంపై విమర్శలు బయలుదేరినా, ఆ శిలాఫలకంలో తెలుగుకు చోటు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తమిళ అక్షర దోషాలు, తమిళంకు శిలా ఫలకంలో చోటు కల్పించినట్టుగా వచ్చిన సమాచారాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించడం గమనార్హం. కాగా, అక్షర దోషాలను అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లగా, ఆగమేఘాల మీద తొలగించారని వాదించే తమిళులూ ఉన్నారు. తెలుగుకు అవమానం జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ఓ ప్రకటనలో పేర్కొంటూ, 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్యభారతాన్ని నిర్మించి, స్వతంత్ర భారతావని రూప శిల్పి పటేల్ అని కొనియాడారు. ఆయనకు 182 మీటర్ల ఎత్తులో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.అయితే, దేశంలో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాషకు ఆ శిలాఫలకంలో స్థానం కల్పించకపోవడం వేదన కల్గిస్తోందన్నారు. ఇది యావత్ తెలుగు వారికి తీరని అవమానం అని ఆవేదన వ్యక్తంచేశారు. -
అమెరికాలో తెలుగు వెలుగు
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష తెలుగు భాషేనని ఓ అమెరికా సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010–17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది. సెన్సస్ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్‌లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010–17 కాలంలో ఇంగ్లిష్ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 భాషల్లో ఏడు దక్షిణాసియావే కావడం విశేషం. ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు. కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో యూఎస్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం వెళ్తున్నారని బీబీసీ తెలిపింది. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్‌లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్‌లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ఇలినాయీస్ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో తెలుగు మాట్లాడే వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదలుకొని మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు నీనా దావులూరి వరకు ప్రముఖులెందరో ఉన్నారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాదీలే. -
అగ్రరాజ్యంలో వెలిగిపోతున్న ‘తెలుగు’
వాషింగ్టన్ : తెలుగు భాష అంతరించి పోతుందని భాషాభిమానులంతా భయపడుతున్నారు. కానీ మన భాషకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని అమెరికన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచమంతా ‘ఆంగ్ల జపం’ చేస్తుంటే దీనికి భిన్నంగా అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం మన తెలుగు భాష వెలిగిపోతుందంటున్నాయి సర్వేలు. అవును 2010 - 2017 మధ్యన అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య దాదాపు 86 శాతం పెరిగినట్లు అక్కడి సర్వేలు వెల్లడించాయి. అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న భాషల మీద జరిపిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్న జనాలు తాము కేవలం ఆఫీసుల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో మాట్లాడతామని.. ఇంట్లో తమ మాతృ భాషలోనే సంభాషిస్తామని వెల్లడించారట. ఈ క్రమంలో ‘టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వెజెస్ ఇన్ అమెరికా’ అనే లిస్ట్‌లో తెలుగు భాష స్థానం సంపాదించుకుంది. గత ఏడాది అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 4 లక్షలని.. 2010తో పోల్చుకుంటే ఇది రెట్టింపయ్యిందని సదరు సర్వేలు వెల్లడించాయి. ఇందుకు కారణం 1990 నుంచి ఐటీ గ్రోత్ పెరుగుతుండటంతో భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో డిమాండ్ భారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ఇంజనీర్లు అమెరికా వస్తోన్నట్లు.. అందువల్లే తెలుగు మాట్లాడే వారి సంఖ్య బాగా పెరిగిందని సర్వేలు వెల్లడించాయి. బీబీసీ కూడా ఇది వాస్తవమేనని తేల్చింది. ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ సీయీవోగా పని చేస్తోన్న సత్య నాదేళ్ల, ఇండియన్ - అమెరికన్ మిస్ అమెరికా నినా దావులురి వంటి ప్రముఖులు తెలుగు వారే కావడం విశేషం. అమెరికాలో అత్యధికంగా మాట్లాడుతున్న సౌత్ ఏషియన్ భాషలలో హిందీ ప్రథమ స్థానంలో ఉండగా.. ఉర్దూ, గుజరాత్, తెలుగు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అగ్రరాజ్యంలో మనదే హవా..!
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు బాష మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా పెరుగుతోంది. గత పదేళ్లల్లో పోలిస్తే అమెరికాలో అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా తెలుగు రికార్డు సృష్టించింది. 2010-2017 మధ్య ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారు 86శాతం పెరిగారు. ఈ మేరకు అమెరికన్ థింక్ టాంక్ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది అమెరికాలో నాలుగు లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇది 2010లో తెలుగు మాట్లాడేవారితో పోలిస్తే రెట్టింపు అయ్యింది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి పది భాషల్లో ఏడు భాషలు దక్షిణాసియాకు చెందినవి కావడం విశేషం. కాగా అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో మాత్రం తెలుగు స్థానం సంపాదించలేక పోయింది. విద్యా, ఉద్యోగాల కోసం భారత్ నుంచి అత్యధికంగా అమెరికాకే వలస వెళ్తున్న విషయం తెలిసిందే. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే. 1990 నాటి నుంచి హైదరాబాద్‌లో ఐటీ విప్లవం మొదలైన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 700లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. అమెరికాను ఐటీ ఉద్యోగులను అత్యధికంగా సరఫరా చేస్తున్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. అమెరికా అందిస్తోన్న హెచ్-1బీ వీసాల ద్వారా భారతీయులే అత్యధికంగా లబ్ధిపొందుతున్నారు. సాఫ్టవేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల కూడా మన తెలుగు తేజమే. కాగా భారత్‌లో తెలుగు బాషా నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎనిమిది కోట్లకు పైమాటే. -
అమెరికాలో అన్నింటా తెలుగువారే!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది. ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్‌గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్‌లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు. బెంగాలీ, తమిళయన్లు తక్కువే! అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది. -
తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహన్ని నింపారు. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విధంగా అమిత్ షా ట్విటర్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలను ఆకర్షించేందుకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అక్కడి ప్రభుత్వం వ్యవహారించడం బాధాకరమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా నే తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా తెలంగాణ పేదలు ఈ అద్భుతమైన కార్యక్రమ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదల వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కార్యకర్తలు నిలదీయాలి. — Amit Shah (@AmitShah) September 24, 2018 -
ఆధిపత్య భాషల వెన్నుపోటుకి బలైన తెలుగు
‘తెలుగువారికి సొంత భాష లేదు. తెలుగు నేలమీద చెలామణిలో వున్న సాహిత్యం తెలుగు కాదు. అది సంస్కృత పురాణేతిహాసాలకు అనువాదమే. లేదా వాటికి అనుకరణే. తెలుగు భాషలో మౌలికమైన రచయితలూ కవులూ లేరు. వెయ్యేళ్ళుగా కవులుగా గుర్తింపు గౌరవం పొందుతున్న కవులెవరూ కవులు కారు. మనకున్నది అనువాదకులూ అనుకర్తలు మాత్రమే. నిజానికి మనం రాసే భాషే తెలుగు కాదు. సంస్కృతం ప్రాకృతం ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రభావానికి లోనై అది సహజత్వాన్ని కోల్పోయింది. అందుకే మన భాషలో డెబ్బై శాతం పరాయి భాషా పదాలే కనిపిస్తాయి.పరాయి భాషా పదాల్ని వాడీ వాడీ చివరికి తెలుగు మాటల్ని మరిచిపోయాం అందువల్ల యెంతో భాషా సంపదని కోల్పోయాం, సొంత సంస్కృతికి దూరమయ్యాం’. అరవై యేళ్లకి పూర్వం యెంతో ఆవేదనతో యీ అభిప్రాయాలు వ్యక్తం చేసి తెలుగు భాష దుస్థితికి కారణాలు అన్వేషించిన భాషా శాస్త్రవేత్త బంగారయ్య. చావు బతుకుల్లో ఉన్న భాషల జాబితాలో చేరడానికి తెలుగు సిద్ధంగా ఉందని భాషా వేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు గానీ ఈ వినాశనానికి బీజాలు వేసినవాడు వాగనుశాసన బిరుదాంకితుడు నన్నయేనని కుండ బద్దలు కొట్టినవాడు బంగారయ్య. వాడుకలో వున్న తెలుగును కాదని భారతానువాదాన్ని డుమువులు చేర్చిన సంస్కృత పదాలతో నింపి పెట్టిన నన్నయ ఆదికవి కాదు తొలి వెన్నుపోటుగాడని ఆయన తీర్మానించాడు. గాసట బీసటగా వున్న తెలుగుని నన్నయ ఉద్ధరించాడు అని చెబుతారుగానీ నిజానికి సంస్కృతంతో కలగాపులగం చేసి భాషని భ్రష్టు పట్టించాడనీ వందల యేళ్ళు అదే కొనసాగిందనీ మనవి కాని ఇతివృత్తాల్నీ మనవి కాని ఛందో రీతుల్నీ స్వీకరించడం వల్ల పరాయి భాషకి దాస్యం చేయడం వల్ల తెలుగు జాతి ఉనికే ప్రశ్నార్థకమైందనీ భాషమీద అలవికాని ప్రేమతో తెలుగు నానుడి కూటమి స్థాపించి తెలుగా ఆంధ్రమా?, నుడి–నానుడి వంటి గ్రంథాల ద్వారా ప్రచారం చేసిన బంగారయ్య అసలు పేరు సత్యానందం. సొంత పేరులో సంస్కృతం ఉందని బంగారయ్యగా మారాడు. ‘కాలా’ సినిమాలో పా. రంజిత్ ప్రతిపాదించిన వర్ణ సిద్ధాంతాన్ని అప్పుడే (1965) ‘నలుపుచేసిన నేరమేమిటి?’ అన్న గ్రంథం ద్వారా ప్రచారం చేశాడు. చనిపోడానికి (1992) కొద్ది కాలం ముందు దళిత అస్తిత్వానికి సంబంధించి అనేక మౌలికమైన ఆలోచనల్ని (chduled castes stabbed, Schduled castes: search for Identity) గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇన్ని చేసీ అనామకంగా అజ్ఞాతంగా ఉండిపోయిన భాషా తాత్వికుడు బంగారయ్య. బంగారయ్య గొప్ప విద్యావేత్త. ప్రజా సమూహాల ఉచ్చారణని ప్రామాణికంగా తీసుకొని సంస్కృ త వర్ణాలు వదిలేస్తే తెలుగు అక్షరమాల సగానికి సగం తగ్గి అమ్మ నుడి నేర్చుకునే పసి పిల్లల మీద భారం తగ్గుతుందని భావించాడు. అందుకు అనుగుణంగా వ్యాకరణం, నుడిగంటులు (నిఘంటువులు) నిర్మించుకొనే పద్ధతులు బోధించాడు. పిల్లలకు వాచక పుస్తకాలు ఎలా ఉండాలో నిర్దేశించాడు. భిన్న ప్రాంతాల మాండలికాలని కలుపుకుంటూ పోయినప్పుడే భాష పెంపొందుతుందని గ్రహించాడు. అరువు తెచ్చుకోకుండా అవసరానుగుణంగా కొత్త పదబంధాలను సొంత భాషలోనే నిర్మించుకోవచ్చని స్వయంగా ఎన్నో పదాల్ని పుట్టించి నిరూపించాడు. వస్తు రూపాల్లో తెలుగుదనం చిప్పిల్లే మూల రచనల కోసం పరితపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆజీవితం కృషి చేశాడు. కానీ ఆధిపత్య కులాల వర్గాల భాషా రాజకీయాల కారణంగా ఆయనకు రావలసిన గుర్తింపు రాలేదు. అయితే బంగారయ్య తెలుగు భాష పెంపుదల గురించి రచించిన గ్రంథాల్ని, చేసిన సూచనల్ని జయధీర్ తిరుమలరావు ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికా ముఖంగా ప్రకటించడంతో భాషోద్యమకారుల్లో చలనం వచ్చింది. స.వెం. రమేశ్ వంటి రచయితలు అచ్చమైన తెలుగులో కథలు రాసి (కతల గంప) యితర భాషా పదాలు లేకుండా పాపులర్ రచనలకు పాఠకుల మన్నన పొందవచ్చని నిరూపించాడు. హోసూరు మొరసునాడు మొ‘‘ ప్రాంతాల యువ రచయితలు దాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ బంగారయ్య నిరసించిన పరభాషా దాస్యం ఇప్పుడు చుక్కలనంటింది. పాలకులు ఒంట బట్టించుకున్న రాజకీయ ఆర్ధిక బానిసత్వం భాషకు సోకింది. ఒకప్పుడు సంస్కృతానికి తలవొగ్గాం, ఇప్పుడు ఇంగ్లిష్‌కి ఊడిగం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో ఏలికల చలవ వల్ల తెలుగు మీడియం స్కూళ్ళు మూతబడుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనకి కాలం చెల్లిందని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుని ఒక సబ్జెక్టుగా కుదించేసి భాషని ఉద్ధరిస్తున్నామని పాలకులు బుకాయిస్తున్నారు. తెలుగులో చదివితే పనికి రాకుండా పోతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాల పోటీలో నిలవాలంటే ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలని ఊదరగొడుతున్నారు. తల్లిభాషను కాపాడుకోవాల్సిన ఇటువంటి తరుణంలో ‘వాగరి’ బంగారయ్య ప్రతిపాదించిన భాషా వాదాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ నుడిని నానుడిని రక్షించుకోలేని జాతికి మనుగడ లేదు. ప్రతులకు: అన్ని పుస్తక దుకాణాల్లో లభ్యం (నేడు హైదరాబాదులో ఇందిరాపార్కు సమీపంలోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ సమావేశ మందిరంలో బంగారయ్య రచించిన నుడి–నానుడి గ్రంథావిష్కరణ) ఎ.కె. ప్రభాకర్ ‘ మొబైల్ : 76800 55766 -
నాని సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నా
‘‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన తర్వాత మోడలింగ్ చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు చూసిన నిర్మాతలు ‘చి.ల.సౌ’లో హీరోయిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నేను అప్పటి వరకూ చేసిన యాడ్స్ చూపించాను. ఆడిషన్స్ చేసి, నన్ను ఎంపిక చేశారు’’ అని కథానాయిక రుహానీ శర్మ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘చి.ల.సౌ’. సిరునీ సినీ కార్పొరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రుహానీ శర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. చాలా సంప్రదాయబద్ధంగా, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. యాక్టింగ్‌కి చాలా స్కోప్ ఉంది. నాకు తెలుగు రాకపోవడంతో మొదట్లో కష్టంగా అనిపించింది. తెలుగు నేర్చుకోవటానికి హార్డ్ వర్క్ చేశా. తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి హీరో నాని సినిమాలు చూశా. ప్రస్తుతం నా తెలుగు చాలా బెటర్ అయిందనుకుంటున్నా. సుశాంత్‌తో నటించడం సౌకర్యంగా ఉండేది. షూటింగ్ సమయంలో తను ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. మా నుంచి సరైన నటన రాబట్టుకోవడానికి రాహుల్ రవీంద్రన్ హార్డ్ వర్క్ చేశారు. పైగా రాహుల్ నటుడు కావడం వల్ల ఆయన సలహాలు మాకు ఉపయోగపడ్డాయి’’ అన్నారు. -
అమ్మభాష
-
దేశ భాషలందు చిక్కిపోతున్న తెలుగు...!
దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. తెలుగు స్థానాన్ని మరాఠి భర్తీచేసి మూడోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా గణనలో భాగంగా దేశంలోని మాతృభాషలకు సంబంధించి తాజాగా వెల్లడైన వివరాలను బట్టి ఈ అంశం వెల్లడైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది దేశంలో గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక భాషను తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ భాషగా ఎంపికచేసుకున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 7.19 శాతం మంది (మొత్తం దేశజనాభాలో) తెలుగును తమ మాతృభాషగా ఎంచుకున్నారు. అదే 2011 లెక్కలకు వచ్చేప్పటికీ అది 6.93 శాతానికి తగ్గిపోయింది. అదేసమయంలో మరాఠి మాతృభాషగా ఎంపిక చేసుకున్న వారు 6.99 శాతం నుంచి 7.09 శాతానికి వృద్ధి చెందారు. ఈ విధంగా తెలుగును మరాఠి భాష అధిగమించింది. తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హిందీ టాప్...సంస్కృతం లాస్ట్ దేశ జనాభాలో హిందీని మాతృభాషగా ఎంచుకుంటున్న వారు మాత్రం గణనీయంగా పెరిగారు. 2001 లెక్కల ప్రకారం 41.03 శాతమున్న వీరి సంఖ్య 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బాంగ్లా (బెంగాలీ) కొనసాగుతోంది. గతంలో 8.11 శాతమున్న బాంగ్లా మాట్లాడే వారి సంఖ్య తాజా లెక్కల్లో 8.3 శాతానికి పెరిగింది. దేశంలో గుర్తించిన (రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన) 22 భాషల్లో సంస్కృతం మాత్రం ఈ విషయంలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోడో, మణిపురి, కోంకణి, డోగ్రీ భాషలు మాట్లాడే వారి కంటే కూడా ఈ భాషను తక్కువమంది మాట్లాడుతున్నారు. కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు. రెండున్నరలక్షల మందికి ఇంగ్లిష్... మన దేశంలో మాతృభాషగా గుర్తించని ఇంగ్లిష్‌ను (షెడ్యూల్డ్ లాంగ్వేజేస్‌లో చేర్చని) మాత్రం 2.6 లక్షల మంది తాము మొదట మాట్లాడే భాష(ఫస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్)గా పేర్కొనడం విశేషం. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్నవారు లక్ష మందికి పైగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలుస్తున్నాయి. మనదేశంలో గుర్తింపు పొందని భాషల్లో రాజస్థాన్‌లోని కోటి మందికి పైగా భిలి / భిలోడి భాష మాట్లాడుతున్నారు. గోండీ భాషను 29 లక్షల మంది సంభాషిస్తున్నట్టు 2011 జనాభా గణన సమాచారాన్ని బట్టి వెల్లడైంది. గతంలోని జనాభా లెక్కల ప్రకారం ఆరోస్థానంలో ఉన్న ఉర్థూ కాస్తా ప్రస్తుతం ఏడోస్థానానికి పడిపోయింది. మొత్తం 4.74 శాతం మాట్లాడేవారితో గుజరాతీ భాష ఆరోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... భాష మాతృభాష మాట్లాడేవారు మొత్తం జనాభాలో శాతం హిందీ 52,83,47,193 43.63 బాంగ్లా 09,72,37,669 08.30 మరాఠి 08,30,26,680 07.09 తెలుగు 08,11,27,740 06.93 తమిళం 06,90,26,881 05.89 -
తెలుగు ప్రకటనలకు గూగుల్ సపోర్ట్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్నెట్లో తెలుగు ప్రకటనలు ఇచ్చేవారికి గూగుల్ ఇండియా శుభవార్త చెప్పింది. గూగుల్ యాడ్స్ ఫ్లాట్‌ఫామ్స్ అయిన యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్లలోని సాంకేతికతను ఇకపై తెలుగు ప్రకటనలకు కూడా అందించనున్నట్టు తెలిపింది. ప్రాంతీయ భాషలైన హిందీ, బెంగాలీ, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సాంకేతికత అందుబాటులో ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. తెలుగులో వెబ్సైట్లు, బ్లాగ్లు నిర్వహించేవారు ఇకపై గూగుల్ యాడ్ సెన్స్లోకి సైన్ ఇన్ అయి ప్రకటనలు పొందడమే కాకుండా తమ సైట్లలో ప్రకటనలు ఇచ్చేలా అడ్వర్టైజర్స్‌ను ఆకర్షించవచ్చని తెలిపింది. తద్వారా ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ‘గూగుల్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ సాంకేతికతపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి గూగుల్ ఇండియా వర్క్‌షాపులు కూడా నిర్వహించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు రాజన్ ఆనంద్ మాట్లాడుతూ.. భారత్‌లోని ప్రాంతీయ భాషాభిమానులకు ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడం కోసమే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. తద్వారా గూగుల్ యాడ్స్ ఫ్లాట్‌ఫాంపై భారతీయ భాషలకు మద్దతు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రాంతీయ భాషల్లో మెరుగైన సమాచారం అందించడం కోసం పరిశ్రమలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాల్సి ఉందన్నారు. దీంతో దేశ అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రకటనకర్తలకు కూడా తమ ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇవ్వడం సులభతరం అవుతుందన్నారు. -
తెలుగులోనూ ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తోన్న ‘ధరణి’వెబ్‌సైట్‌ను తెలుగు భాషలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి సంబంధించిన భూముల వివరాలన్నింటినీ పొందుపరిచే ఈ వెబ్‌సైట్‌ను అందరికీ అర్థమయ్యేలా తొలిసారి మాతృభాషలో రూపొందిస్తున్నారు. డాటా మొత్తాన్ని తెలుగులోనే అందుబాటులో ఉంచనున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా ఈ వెబ్సైట్ రూపొందిస్తున్నారు. జిల్లాకో మండలంలో.. కాగా, ధరణి వెబ్‌సైట్‌ను ఈనెల 19 నుంచి జిల్లాకో మండలంలో ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గుడిహత్నూర (ఆదిలాబాద్), పాల్వంచ రూరల్ (భద్రాద్రి కొత్తగూడెం), రాయికల్ (జగిత్యాల), రఘునాథపల్లి (జనగామ), మొగుళ్లపల్లి (భూపాలపల్లి), ఐజ (గద్వాల), యెల్లారెడ్డి (కామారెడ్డి), మానకొండూరు (కరీంనగర్), ముదిగొండ (ఖమ్మం), ఆసిఫాబాద్ (కొమురం భీం), కేసముద్రం (మహబూబాబాద్), దేవరకద్ర (మహబూబ్‌నగర్), నెన్నెల్ (మంచిర్యాల), రామాయంపేట (మెదక్), మేడిపల్లి (మేడ్చల్), బిజినేపల్లి (నాగర్‌కర్నూలు), కట్టంగూరు (నల్లగొండ), నిర్మల్ రూరల్ (నిర్మల్), బాల్కొండ (నిజామాబాద్), అంతర్గాం (పెద్దపల్లి), ఇల్లంతుకుంట (రాజన్న సిరిసిల్ల), శేరిలింగంపల్లి (రంగారెడ్డి), రామచంద్రాపురం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), చివ్వెంల (సూర్యాపేట), నవాబ్‌పేట (వికారాబాద్), పెబ్బేర్ (వనపర్తి), హసన్‌పర్తి (వరంగల్ అర్బన్), నర్సంపేట (వరంగల్ రూరల్), తుర్కపల్లి (యాదాద్రి) మండలాల్లో ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నారు. అదే రోజు నుంచి తహశీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే, ఈ బాధ్యతల అమలును పైలట్ ప్రాజెక్టు తరహాలో పరిశీలించాలా లేక రాష్ట్రంలోని అన్ని మండలాల్లో (సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలు) ఒకేసారి అప్పగించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని సేవలతో అనుసంధానం ధరణి వెబ్‌సైట్‌తో రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఫలానా భూమిపై జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు క్షణాల్లో అప్డేట్ అయ్యే లా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. ముఖ్యం గా కోర్‌బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, సర్వే సెటిల్మెంట్ తదితర వివరాలన్నింటినీ అందు బాటులోకి తెస్తున్నారు. బ్యాంకర్లు ఆన్లైన్లోనే రైతుల భూముల వివరాలు చూసు కుని రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పిం చేలా డేటా రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను ప్రయోగాత్మకంగా ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో అమల్లోకి తెస్తున్నారు. జగదేవ్‌పూర్ (సిద్దిపేట), ఘట్కేసర్ (మేడ్చల్), కొత్తూరు (రంగారెడ్డి), సదాశివపేట (కామారెడ్డి), కూసుమంచి (ఖమ్మం) మండలాలకు సంబంధించిన అన్ని భూముల వివరాలు ఆ రోజునుంచి ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. -
‘తప్పనిసరి తెలుగు’ సమీక్షకు కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రతి ఒక్కరూ చదివేలా చట్టం తెచ్చిన ప్రభుత్వం, అమలుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో, ఆరో తరగతిలో మొదటగా తెలుగును ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన పుస్తకాల రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పుస్తకాల రూపకల్పనకు అవసరమైన ఎడిటర్స్ కమిటీ, కంటెంట్ రైటర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సమీక్షించి, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అవసరమైన మార్పులను ఈ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్ర సిలబస్ పాఠశాలలతోపాటు ఇతర మీడియం పాఠశాలలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర సిలబస్ కలిగిన పాఠశాలల్లోనూ తెలుగు అమలుకోసం చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే చట్టానికి అనుగుణంగా నిబంధనలను జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
ఇంటర్ కాదు.. టెన్త్ వరకే తెలుగు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలనే నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంటర్‌కు బదులు పదో తరగతి వరకే పరిమితం చేయాలని నిశ్చయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేసేందుకు బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు వెల్లడించారు. మాతృభాష బోధన అమలుకు సంబంధించి తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధి విధానాలపై చర్చించారు. తొలి దశలో టెన్త్ వరకు.. ‘మాతృభాష తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవటం లక్ష్యంగా తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంలో చదవడం అందరికీ అనివార్యమవుతోంది. పిల్లల భవిష్యత్తును దెబ్బతీయవద్దు. అదే క్రమంలో తెలుగు కనుమరుగు కావద్దు. అందుకే ఇంగ్లిషు మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నాం. మొదట ఇంటర్మీడియెట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించాం. అయితే ఇంటర్ (10+2) అన్ని విద్యాసంస్థల్లో ఒకే మాదిరిగా లేదు. దీంతో ఇంటర్లో తెలుగును అమలు చేయడం ఇబ్బందిగా మారుతుంది. తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాతృభాష బోధన అమలును పరిశీలించిన అనంతరం మొదటి దశలో పదో తరగతి వరకు తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం’అని సీఎం వెల్లడించారు. సిలబస్ రూపొందించండి తరగతుల వారీగా తెలుగులో బోధించాల్సిన అంశాలకు సంబంధించి సిలబస్ రూపొందించాల్సిందిగా తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. భాషను కాపాడుకోవడంతోపాటు, మాతృభాష ద్వారా జీవితంలో ఉపయోగపడే విషయాలను విద్యార్థులకు బోధించాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశ భక్తిని పెంచే అంశాలు ఉండాలని వివరించారు. తెలుగు చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఓ తెలుగు పండిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె.తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ జి.కిషన్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్.వి.సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఎస్.ఇ.ఆర్.టి. అధికారి సువర్ణ వినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే విద్యాసంవత్సరం నుంచే.. కేసీఆర్ ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్ట్ బోధన తప్పనిసరి కానుంది. స్వయంగా తెలుగు భాషాభిమాని అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాతృభాషను బతికించుకునేందుకు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా తెలుగు సిలబస్ రూపొందించాలని తెలుగు వర్సిటీని, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్ కోరారు. సిలబస్‌లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు. -
‘తెలుగు తప్పనిసరి’ అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడంపై విద్యా శాఖ అధికారులు ఆలోచనల్లో పడ్డారు. తెలుగు అమ లుపై డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి ప్రభుత్వానికి పంపించినా, ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దానిపై చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారా? లేదా? అన్న దానిపై అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాతృభాష అమలుపై తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాతృ భాష అమలుపై కమిటీ అధ్యయనం జరిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారులతోనూ మాట్లాడి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతోపాటుగా పాఠ్య పుస్తకాల రూపకల్పనపైనా దృష్టి సారించింది. పదో తరగతి వరకు ఇంగ్లిషులో చదువుకుని ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం పుస్తకాల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. 2018–19 విద్యా ఏడాదిలో తెలుగును అమలుకు అవసరమైన నిబంధనలపై ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తారా? లేదా? అన్న దానిపై అధికారుల్లోనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
త్వరలో ‘తెలంగాణ భాషా బిల్లు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించింది. ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి నుంచి 12 తరగతుల వరకు తెలుగు తప్పనిసరిగా ఉండాల్సిందేనని, అందుకు తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి నేతృత్వంలో బృందం ఇటీవల తమిళనాడు వెళ్లొచ్చింది. అనంతరం బృంద సభ్యులు విద్యా భాషగా తమిళం ఎలా ఉందో.. తెలంగాణలో తెలుగు అంతకన్నా మెరుగ్గా ఉంచేందుకు ఒక నోట్‌ను తయారు చేసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకి ఇచ్చారు. ఆయన దాన్ని ముసాయిదా బిల్లు రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకొన్న తర్వాత దాన్ని కేబినెట్ ముందు ఉంచనున్నారు. కేబినెట్ దీన్ని ఆమోదించిన తర్వాత దీనికి ‘తెలంగాణ భాషా బిల్లు’గా నామకరణం చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కఠినతరమైన జీవో ఒకటి రానుంది. ఇది 1 నుంచి 12 వ తరగతుల వరకు నిర్వహించే పాఠశాలల ముంగిటకు చేరుతుంది. -
లోకేశ్‌కు యార్లగడ్డ చురకలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పొరుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ వేనోళ్ల కీర్తించే తెలుగుభాష ఆంధ్రప్రదేశ్‌లో ధౌర్భాగ్యపరిస్థితిని ఎదుర్కొంటోందని బహుభాషా కోవిదుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను నమ్ముకోకుండా తెలుగువారే తమ భాషా, సంస్కృతులను కాపాడుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) 11వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు, రజతోత్సవ వేడుకలు అధ్యక్షురాలు వీఎల్ ఇందిరాదత్ అధ్యక్షతన చెన్నైలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి, తెలుగువారైన పి.బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. ‘తెలుగుభాష, సంస్కృతి’ అంశంపై యార్లగడ్డ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ.. ‘‘ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి సిలికాన్‌కు వెళ్లి అక్కడున్న ఆంధ్రులను తెలుగు భాషను కాపాడండి, మా కూచిపుడి నృత్యాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా చేయిస్తాం.. మీరు సహాయం చేయండని కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు పట్టిన దుస్థితి. ఏపీలో తెలుగుభాషను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని అంగన్వాడీ పాఠశాలలనూ ఆంగ్లమాధ్యమంగా మార్చే దుర్భర పరిస్థితిలో మేమున్నాం. ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను నిందించి ప్రయోజనం లేదు. మళ్లీ ఎన్నికల్లో గెలవాలి, కొడుకుని, మనవడిని, మునిమనవడిని సీఎంగా చేసుకోవాలి. ఆ స్థానంలో నేనున్నా అదే పని చేస్తాను. భాషా ప్రయోజనాలు కాపాడుతున్న ప్రభుత్వాల జీవోలను పట్టుకెళ్లి ఏపీలో ఇవ్వండి. ఈ సభలకు విదేశాల నుంచి హాజరైన చాలామంది తెలుగుభాష, సంస్కృతులపై మేమేదో తెలుగును ఉద్ధరిస్తామని మావైపు చూస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతిపై మీకేదో సహాయం చేస్తామని మీరు భారత్‌కు వస్తుంటే, మేమేమో మీ దేశాలకు వచ్చి మిమ్మల్ని అర్థించడం యథార్థమైన విషయం’ అని పరోక్షంగా లోకేశ్‌కు యార్లగడ్డ చురకలంటించారు. డాక్టర్ వైఎస్సార్‌ది ప్రత్యేక స్థానం ‘తెలుగు భాష, సంస్కృతిని కాపాడిన వారే చరిత్రలో స్థానం పొందుతారు. అలాంటి వారిలో మొట్టమొదట వ్యక్తి జలగం వెంగళరావు. తరువాత మండలి కృష్ణారావుతోపాటు, ఎన్టీఆర్ తెలుగును అజరామరం చేశారు. తెలుగుకు ప్రాచీనహోదా సాధించిపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డిది ప్రత్యేక స్థానం’ అని అన్నారు. -
అమరావతిలో తెలుగుకు ప్రాధాన్యమివ్వాలి
సాక్షి, విజయవాడ: అమరావతిలో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో 29వ పుస్తకమహోత్సవాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అమరావతి రహదార్లపై రాకపోకలు తెలియజేసే సూచికలు తెలుగులోనే ఉండాలని చెప్పారు. బతుకుదెరువుకు ముందు మాతృ భాషపై పట్టుసాధించి, తర్వాత హిందీ, ఇంగ్లీషు అదనంగా నేర్చుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకుంటే ఉన్నత శిఖరాలకు వెళతారనుకుంటే పొరపాటన్నారు. నిత్యజీవితంలో పుస్తకానికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. విజయవాడలో గత 29 ఏళ్లుగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నేడు కొన్ని సినిమాల్లో వాడే పదాలు ఏమాత్రం గౌరవప్రదంగా ఉండటం లేదన్నారు. అటువంటి పదాలు వాడకుండానే శంకరాభరణం, సీతారామయ్యగారి మనమరాలు వంటి మంచి చిత్రాలు కూడా వచ్చాయన్నారు. భాషా పరిరక్షణ సంవత్సరంగా 2018: సీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుభాష పరిరక్షణ సంవత్సరంగా 2018ని ప్రకటించారు. రాష్ట్రంలో సాంస్కృతిక, గ్రంథాలయశాఖలను కలిపి భాషను పరిపుష్టంచేస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ పుస్తకమహోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందన్నారు. -
‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా..
‘భాష అందరి జన్మహక్కు. తల్లి భాషను అందరూ నేర్వాలి. రోజులో తొలి పలుకు అమ్మ భాషదే కావాలి. అప్పుడే కన్నవారికి, విద్య నేర్పిన గురువుకు, పుట్టిన గడ్డ రుణం తీసుకొన్న వాళ్లం అవుతాం. ఖండంతరాల్లో స్థిరపడ్డా అమ్మ.. అమ్మే కదా.! నేను ఎక్కడ ఉన్నా నా మూలాలు తెలుగు నేలపైనే ఉన్నాయి’.. అంటున్నారు జయ పీసపాటి. హాంకాంగ్‌లో తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఆమె సిటీకి వచ్చిన సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. అవి జయ మాటల్లోనే.. సాక్షి,సిటీబ్యూరో: మా నాన్న యుద్ధనపూడి నాగేశ్వరరావుది విజయవాడ దగ్గర యుద్ధనపూడి, అమ్మ శ్యామలాదేవిది మచిలీపట్నం. నాన్న రైల్వేలో ఉన్నతోద్యోగి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర పనిచేశారు. నా పదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. నా చదవువంతా ఇక్కడే సాగింది. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంఏ పట్టా పొందా. 2002లో హాంకాంగ్‌కు పయనం నా భర్త రవిశంకర్ పిసపాటి మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజినీర్. బాంబే, గోవాల్లో పనిచేశారు. 2002లో ఉద్యోగ రీత్యా హాంకాంగ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాం. ఇద్దరు పిల్లలు. బాబు కృష్ణ ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. పాప సాహితి అక్కడే పదో తరగతి చదువుతోంది. తెలుగువారి కోసం వెతికా.. హాంకాంగ్‌లో నా భర్త డ్యూటీకి వెళితే రెండుమూడు నెలలుకు గాని రారు. ఓ రోజు అత్యవసర అవసర పనిపడింది. అక్కడ తెలుగువారి కోసం ఎంత వెదికినా కనిపింలేదు. ఎలాంటి తెలుగు అసోషియేషన్స్ కూడా లేవు. ఓ ఏడాది గాలించాక.. అక్కడే వర్శిటీలో పనిచేసే కేపీ రావు 15 తెలుగు కుటుంబాల వారిని వనభోజనాలకు పిలిచారు. అక్కడే మనవారిని కలిసి పరిచయం చేసుకున్నాను. హాంకాంగ్‌లో సమాఖ్య ఏర్పాటు చేశా.. తెలుగు వారి చిరునామాలు, ఈ మెయిల్స్, ఫేస్బుక్ ద్వారా అందరినీ కలిసేదాన్ని. అలా 2006లో ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఏర్పాటు చేశా. అప్పుడు 40 కుటుంబాలు అందులో చేరాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200 కుటుంబాలకు పెరింగింది. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా ఎవరు హాంకాంగ్ వచ్చినా తొలుత తెలుగు సమాఖ్యను సంప్రదిస్తారు. అందరి ఆలోచనలు మేరకు ఏటా వనభోజనాలు, ఉగాది, నవరాత్రులు, సంక్రాంతి, సత్యనారాయణ వ్రతాలు చేస్తాం. అన్ని తెలుగు పండుగులు చేస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు బహుమతులు ఇస్తుంటాం. చైనీయులకు తెలుగు నేర్పుతున్నా.. నేను ఉడ్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ప్రి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నా. అక్కడ అంతా ఇంగ్లీషు మీడియమే. హాంకాంగ్ వెళ్లినప్పటి నుంచి ఏటా తెలుగు క్లాసులు చెబుతున్నాను. మన వారితో పాటు చైనీయులు కూడా వచ్చి మన భాష నేర్చుకుంటున్నారు. కారణం ఏంటంటే.. అక్కడి చైనీస్ మన కూచిపూడి నాట్యం నేర్చుకొని నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆ నాట్యం కోసం మన తెలుగును కూడా నేర్చుకుంటున్నారు. అమెరికాలో మన తెలుగు కవి, రచయిత చిట్టెం రాజు పరిచయమయ్యారు. సిలికానాంధ్ర వారి ‘మనబడి’ని పరిచయం చేశారు. 2013 నుంచి 16 వరకు వారి తెలుగు తరగతులు నడిచాయి. తెలుగు సర్టిఫికెట్ కోర్సు కోసం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిని కలిశారు. వారు 50 మంది మినిమం ఉండాలన్నారు. ఇప్పుడు నేనే సొంతంగా తెలుగు తరగతులు తీసుకుంటున్నా. ‘హలో హాంకాంగ్’లో రేడియో జాకీగా.. ఎన్ఆర్ఐ వెబ్‌పోర్టల్‌లో తెలుగు వన్ డాట్ కామ్ ఉంది. దానికి అనుసంధానంగా ‘తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్’ నడుస్తోంది. అందులో ‘హలో హంకాంగ్’ లైవ్ కార్యక్రమం శని, ఆదివారాల్లో చేస్తారు. రేడియో జాకిగా పనిచేస్తున్నా. నేను వివిధ అంశాలపై తెలుగులో ఉపన్యాసం ఇస్తాను. ఇప్పటి వరకు సైనికుల కోసం జైహింద్, తెలుగు విశిష్టతపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చా. ఈ గ్లోబల్ రేడియో హైదరాబాద్ నుంచే రన్ అవుతోంది. భాషపై ప్రేమతో... నా భాషకు, దేశానికి ఏదో చేయాలనే తపన ఉంది. లలితమైన భాష రమ్యమైన భావం తెలుగుది. ఈ భాషలో ఉన్న మాధుర్యాన్ని వర్ణించలేం. భాష అందరి జన్మహక్కు.. అందుకే భాషా యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు భాషను పదిమందికి నేర్పడం నా సంకల్పం. నా తుది వరకు హాంకాంగ్ వేదికగా ఈ యజ్ఞం కొనసాగిస్తాను.. అంటూ ముగించారు. -
మారిషస్‌లో తెలుగు వెలుగులు
-
బోధనాభాష–పాలనాభాషగా తెలుగు
ప్రపంచ తెలుగు మహాసభల పేరిట హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా అధికారి కంగా జరిగిన అపూర్వ సాంస్కృతిక ఉత్సవం ఇది. తెలంగాణ గ్రామీణ ప్రజానీకం గుండె గొంతుకలో తెలుగు భాష ఇప్పటికీ సజీవంగా ఉండటం వల్లే ఈ సభలు ఇంతగా విజయవంతమయ్యాయి. తిరుపతిలో 2012లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలని నిర్ణయించిన తీర్మానం కనీస అమలుకు కూడా నోచుకోకపోవడం అప్పటి పాలకుల చిత్తుశుద్ధిని చెబుతుంది. ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తేనే పాలనాభాషగా తెలుగు గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యాసంస్థలు న్యాయస్థానాల ద్వారా ఏవో లొసుగులతో ఈ యజ్ఞానికి గండి కొట్టే ప్రయత్నం చేయకుండా ఆపాలి. మున్ముందుగా పాలనా భాషను పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా తక్షణం అమలు చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులన్నీ తెలుగులో వెలువరిస్తామని చెప్పినప్పటికీ అది నిరంతర ప్రక్రియ కావాలి. అందుకు అవసరమయ్యే భాషా నిఘంటువును అత్యాధునికంగా తయారు చేయించాలి. తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటాను ప్రకటించినప్పటికీ ఈ అంశాన్ని స్పష్టంగా ఏయే రకాలుగా అమలు చేస్తారో ఉత్తర్వులు ఇవ్వాలి. హైదరాబాద్, వరంగల్‌లో ఉన్న ప్రభుత్వ తెలుగు భాషా పండిత శిక్షణా కళాశాలను పునరుద్ధరించాలి. లబ్ధ ప్రతి ష్టులైన ఆచార్యులను అక్కడ నియమించాలి. ఐదు రోజుల సభలకు తండోపతండాలుగా వచ్చిన జనాల కోసం నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగేలా రవీంద్రభారతి లాంటి మరొక విశాల భవనాన్ని (కనీసం 5 వేల మంది ఒకేసారి పాల్గొనేలా) నిర్మించాలి. ఈసారి జరిగిన నిరంతర కవి సమ్మేళన ప్రక్రియ ఒక అపూర్వ ప్రయోగంలా నిలిచిపోతుంది. ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి దాకా కొనసాగిన కవి సమ్మేళనాలు కొత్త ప్రక్రియకు తెరలేపాయి. 42 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపే విధంగా తెలుగు విశ్వ విద్యాలయం, సాహిత్య అకాడమీల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థ పేర్లను తెలుగులోనే రాయాలనే ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి. తమిళనాడు తరహాలో న్యాయస్థానాల తీర్పులన్నీ ఇక నుంచి తెలుగులోనే వెలువడాలి. ప్రతి యేటా తెలుగు భాషా అభివృద్ధి కోసం పురస్కారాలు ప్రోత్సాహకాలు ఇస్తూ తెలుగు మహాసభలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తే తెలుగు వెలుగు నూరు వసంతాల పాటు గుబాళిస్తుంది. – డా‘‘ కె. రామదాస్, అఖిల భారత బీఎడ్, డీఎడ్ కళాశాలల ప్రధానాచార్యుల సంఘ ప్రధాన కార్యదర్శి -
భాషకు బ్రహ్మోత్సవం
తెలుగు ఉనికి నిజంగానే ప్రమాదంలో ఉందా? తేనెలూరే ఈ భాష మరో మూడు తరాల తర్వాత మరి వినిపించదా? సగటు తెలుగువాడిలో ఎక్కడో కలవరం! ఇంటా బయటా అన్ని స్థాయిల్లోనూ మార్పు రావాలి తప్ప ఇలా సభలూ సమావేశాలతో ఏమవుతుంది? ఎక్కడో తెలియని అనుమానం!! కానీ... ఇసుకేస్తే రాలనట్టుగా పోటెత్తిన జనం సాక్షిగా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రపంచ తెలుగు మహాసభలు సాగిన ఐదు రోజులూ తల్లి భాషకు అక్షరాలా బ్రహ్మోత్సవమే జరిగింది. ప్రారంభోత్సవానికే వన్నె తెచ్చిన బాణసంచా మిరుమిట్లు కూడా తెలుగు వెలుగుల ముందు చిన్నబోయాయి. ఎల్బీ స్టేడియం మొదలుకుని రవీంద్రభారతి దాకా వేదికలన్నీ తెలుగు సాహితీ రస ప్రవాహ ఝరిలో మునిగి తేలాయి. సాహితీ గోష్టి, కవి సమ్మేళనం, అవధానం... ఇలా అనేకానేక ప్రక్రియలతో ఆహూతులను ఉర్రూతలూగించాయి. ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన జనాన్ని నియంత్రించేందుకు ఒక దశలో పోలీసులూ రంగంలోకి దిగాల్సి వచ్చింది!! సభా వేదికల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశువుగా పాడిన పద్యాలు సభలకే వన్నె తెచ్చాయి. ఇదంతా కళ్లారా చూసిన భాషాభిమానుల మనసులు ఉప్పొంగాయి. మన తేనెలూరు తెలుగుకు వచ్చిన ప్రమాదమేమీ లేదని మహాసభల సాక్షిగా నిరూపితమైంది!! తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సభలు కావటంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎల్బీ స్టేడియంతో పాటు మరో ఐదు వేదికల్లో ‘న భూతో’ అన్న రీతిలో సభలను నిర్వహించింది. ప్రతి రోజూ 30 వేల మందికి పైగా సభలకు పోటెత్తినట్టు అంచనా. 1,500 మంది కవులు, 500 మంది రచయితలు పాల్గొన్నారని, 100 సదస్సులు నిర్వహించి 250 కొత్త పుస్తకాలు, భాషా ప్రక్రియలపై 10 సీడీలు, 10 ప్రత్యేక సంచికలు ఆవిష్కరించినట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రకటించారు. భావి సదస్సులకు ఈ సభలు మార్గదర్శక ముద్ర వేశాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడిక సగటు భాషాభిమానులంతా తెలుగుకు మరింతగా జవసత్వాలు కల్పించే దిశగా జనవరిలో ముఖ్యమంత్రి వెలువరించబోయే నిర్ణయాల కోసం ఆశగా, ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఇక ఏటా సంబురమే
సాక్షి, హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలో ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. డిసెంబర్లో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయని వివరించారు. ఇకపై ఏ మీడియమైనా, ఏ సిలబస్ అయినా ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌దాకా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. భాష పండితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. తెలుగు భాషాభివృద్ధికి జనవరిలో సమగ్ర ప్రణాళిక ప్రకటిస్తామని ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవం మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, ప్రపంచ తెలుగు మహాసభలు ఊహించిన దానికంటే ఘనంగా జరిగాయంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘ఎట్లా జరుగుతయో, ఎట్లా ఉంటుందో, మహా సభలను నిర్వహించే శక్తిసామర్థ్యా లు తెలంగాణ వాళ్లకు ఉన్నయో, లేవోననే సందేహాల మధ్య చాలా సంతోషంగా, అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పండించినం. ఒకప్పుడు సిటీ కాలేజీ విద్యార్థిగా ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక మూలన కూర్చుని ఇవే ప్రపంచ తెలుగు మహాసభలను తిలకించిన. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో మహా సభలు సగౌరవంగా జరిగినయి. మన తెలంగాణ తన భాషా వైదుష్యాన్ని, తేజో మయ సాహితీ వైభవాన్ని, పాండితీ ప్రకర్షను, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటింది. సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం అద్భుతంగా నెరవేరినం దుకు వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంది. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా గురుపూజ చేసి సంస్కారవంతంగా సభలను మనం ప్రారంభించుకున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ముగింపు సమావేశానికి వచ్చిన రాష్ట్రపతికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ నిబద్ధత సభల ద్వారా వెల్లడైంది తెలంగాణ భాష అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఈ సభల ద్వారా వెల్లడైంది. మన భాషను గౌరవించుకోవడమే గాక దేశంలోని అన్యభాషల ఉద్ధండులను, జ్ఞానపీఠ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను గొప్పగా సన్మానించుకున్నాం. తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలనూ ఈ సభల్లో పదేపదే విన్నాం. నాకు కొంత బాధ కలిగింది. తెలుగు మృత భాష కాకూడదని ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అన్నారు. తెలుగు నేలలోనే, మన గడ్డమీదనే ఇలా మన మాతృభాషను మృత భాష అనో, బతికించుకోవాలనో వినాల్సి రావడం బాధాకరం. ఈ దుస్థితి మన భాషకు పట్టకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుంది. సభలు, సంబరాల తో సరిపెట్టకుండా, ఈ కృషిని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా కొనసాగిస్తుంది. భాషా పండితుల సమస్యల విషయంలో ఇమిడి ఉన్న చిన్న న్యాయపరమైన సమస్యను పరిష్కరిస్తాం. భాషా పండితులుగా రిటైరైన వారికి పెన్షన్‌లో కొంత కోత విధిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా రద్దు చేస్తాం. తెలుగు భాష అభివృద్ధికి, తెలుగును అద్భుతమైన జీవ భాషగా నిలిపి ఉంచడానికి కొన్ని ప్రకటనలు ఈ రోజు చేయాలని భావించా. మొన్నటి ఉపన్యాసంలో ఆ మాట చెప్పగానే చాలామంది, చాలా రకాలుగా కొన్ని వందలు, వేల సూచనలు పంపించారు. ఇప్పటికిప్పుడు అర్ధంతరంగా ప్రకటించడం కంటే జనవరి తొలి వారంలో భాషా, సాహితీవేత్తల సదస్సు నిర్వహించి, వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి కచ్చితమైన, నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటిస్తామని హామీ ఇస్తున్నా. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన మిత్రులు సిధారెడ్డికి, వారితో కలసి కృషి చేసిన బృందానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు, డీజీపీకి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశానికి, ప్రభుత్వాధికారులకు హృదయపూర్వక అభినందనలు. కిట్ల పంపిణీలో ఇబ్బందులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం. 42 దేశాల నుంచి, మన దేశంలోని 17 రాష్ట్రాల నుంచి, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మహాసభలకు తరలివచ్చిన ప్రతినిధులు, భాషావేత్తలు, పండితులు, కవులు, గాయకులు, కళాకారులందరికీ వందనం, అభివందనం, శుభాభివందనం. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు మహాసభలను సుసంపన్నం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ నవ్వుపై కేసీఆర్ పద్యం... పద్యంతోనే ముగించిన సీఎం ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆద్యంతం పద్యాలు పాడి అలరించిన సీఎం కేసీఆర్, ముగింపు కార్యక్రమంలోనూ మరో పద్యం పాడి ఆహూతుల మది దోచారు. నవ్వు, నవ్వుల తీరును వివరిస్తూ ఆయన చెప్పిన పద్యానికి సభికుల హర్షధ్వానాలతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. ‘‘మహాసభల ఆరంభంలో కొంత బెరుకుగా ఉన్నప్పటికీ సంతోషంతో, ఆనందంతో, సుసంపన్నమైన సందర్భంలో నవ్వులతో ఈ సంరంభాన్ని ముగించుకుంటున్నాం. కనుక నేను కూడా నవ్వుల పద్యంతో ముగిస్తున్నాను’అంటూ ప్రసంగం చివరలో ఆయన ఆలపించిన పద్యం... నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్ పువ్వుల వోలె ప్రేమరసమున్ విరజిమ్ము విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ -
దేశానికే వెలుగు తెలుగు
సాక్షి, హైదరాబాద్: ‘‘సజీవ భాష తెలుగు. ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మహత్తర దేశ పురోగతిలో తెలుగు వారి పాత్ర ఎనలేనిది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు బిడ్డల కృషి మహత్తరమైనది. దేశ సాహిత్యంలోనే గాక మానవ నాగరిక పరిణామ క్రమంలోనూ తెలుగు భాషకు విశిష్ట స్థానముంది. ఈ భాషా ప్రావీణ్యం ఖండాంతరాలు దాటి గొప్పగా వర్ధిల్లుతూ, తనకు ఎల్లలు లేవని నిరూపించింది. తెలుగువారు దేశ సరిహద్దులు దాటుకు వెళ్లి ప్రపంచ పురోగతిలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓగా గొప్పగా రాణిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్లే ఇందుకు నిదర్శనం’’అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా ఖ్యాతి పొందిన తెలుగు మున్ముందు మరింతగా తేజరిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ఖ్యాతిని సుస్థిరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించిందని శ్లాఘించారు. దేశ విదేశాలకు చెందిన తెలుగు భాషాభిమానుల మధ్య ఐదురోజుల పాటు కన్నులపండువగా సాగిన ఈ మహాసభల ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు ఎంతో ఆనందిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన సభల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లాల్‌బహదూర్ క్రీడామైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణం పోతన వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి... తెలుగు భాష ప్రాధాన్యాన్ని, తెలుగు సాహితీవేత్తల వైభవాన్ని, తెలంగాణ ప్రముఖులను తన ప్రసంగంలో ఆద్యంతం స్మరించుకున్నారు. తెలుగులో ప్రసంగం ప్రారంభం... రాష్ట్రపతి తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘సోదర సోదరీమణులారా నమస్కారం, దేశభాషలందు తెలుగు లెస్స’అని ఆయన అనగానే ప్రాంగణంలో కిక్కిరిసిన భాషాభిమానులు పెద్దపెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రపతి ఆంగ్లంలో ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘‘42 దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు సభలకు తరలి వచ్చారని తెలిసి అబ్బురపడ్డాను. ఈ ఐదు రోజుల పండుగలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. చెప్పారు. తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలను ప్రారంభించటం సంతోషాన్నిచ్చింది. ఐదు రోజుల పండుగతో మహత్తర తెలుగు భాషకు జనం ఘనంగా నీరాజనం పలికారు’’అంటూ అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాతృభాష అయిన తెలుగు 2008లో ప్రాచీన హోదా కూడా పొందిందని గుర్తు చేశారు. తెలుగువారు దేశానికెన్నో ఇచ్చారు తెలుగులో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక సాహితీ ప్రతిభ ఉండటం అభినందనీయమంటూ రాష్ట్రపతి ప్రస్తుతించారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తిగానే గాక తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి ఆ భాషకు విశిష్టమైన గుర్తింపు తెచ్చారన్నారు. ‘‘తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతులుగా దేశానికి గొప్ప సేవ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు వాడైనందుకు ఈ నేల ధన్యమైంది. నన్నయ వెయ్యేళ్ల క్రితమే తెలుగు వ్యాకరణ నియమాలు రూపొందించారు. మహా భారతాన్ని తెలుగీకరించారు. శతాబ్దంలో గురుజాడ అప్పారావు సంఘ సంస్కర్తగా దేశానికే గొప్ప సేవ చేశారు. రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇక సామాన్య ప్రజలో నిలదీసే తత్వాన్ని శ్రీశ్రీ తన అక్షరాలతో నూరిపోశారు. వట్టికోట అళ్వార్ స్వామి, దాశరథి వంటి దిగ్ధంతులెందరో సాహిత్యంతో పాటు సమాజానికీ సేవ చేశారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి త్యాగయ్య తెలుగు కృతులే కీలకం. ఇక భక్తి పారవశ్యానికి అన్నమయ్య కీర్తనలు ఊతం. అడవి బిడ్డల హక్కుల కోసం ఉద్యమించిన కుమ్రం భీం, అంటరానితనంపై పోరాడిన భాగ్యరెడ్డి వర్మ , జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, ఆంగ్లేయులను వణించిన అల్లూరి, సామాజిక, రాజకీయ వ్యవస్థపై సామూహిక ఉద్యమానికి తెరతీసిన స్వామి రామానంద తీర్థ.. ఇలా ఒకరేమిటి, తెలుగువారు ఈ దేశానికి ఎన్నో ఇచ్చారు’’అంటూ ప్రశంసించారు. నేల నలుచెరగులా తెలుగువారు... తెలుగు మాట్లాడేవారు దక్షిణాఫ్రికా నుంచి ఆగ్నేయాసియా దాకా విస్తరించి అద్భుతాలు సృష్టిస్తున్నారని రాష్ట్రపతి కీర్తించారు. ‘‘ఖండాంతరాల్లో తెలుగు వారు గొప్ప ప్రతిభను చూపుతూ దేశానికి కీర్తి తెస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాల్లోకీ ఎన్నికవుతున్నారు. ఇంజినీర్లుగా, వైద్యులుగా, సాంకేతిక నిపుణులుగా ప్రశంసనీయ స్థానంలో ఉన్నారు. 1920, 1930ల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేసిన ప్రసిద్ధ జీవరసాయన శాస్త్రవేత్త అయిన ఎల్లాప్రగడ సుబ్బారావూ ఇదే కోవలోకి వస్తారు. పిల్లలు తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలతో తెలుగులో మాట్లాడేందుకు మనబడి లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నాయి’’అన్నారు. ఉత్తర, దక్షిణాలకు తెలుగే వారధి ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అనుసంధానం కల్పిస్తూ వంతెనగా తెలుగు నిలుస్తోందని రాష్ట్రపతి అభినందించారు. ఎన్నో పరభాషా పదాలను ఇముడ్చుకుని సుసంపన్నమైంది తెలుగు. దేశంలోని ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలకు చిహ్నంగా, వాటి మధ్య వారధిగా హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడిది అంతర్జాతీయ నగరంగా కొత్త రూపు సంతరించుకుంటోంది’’అంటూ అభినందించారు. ఐటీ, ఫార్మా, సాంకేతిక పరిశ్రమ, ఫార్మా తదితరాల్లో దేశానికి హైదరాబాద్ ఎంతో సేవ చేసిందన్నారు. విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, సినిమా, వ్యాపార, వాణిజ్య, క్రీడా రంగాల్లో తెలుగు చక్కని గుర్తింపు పొందింది’’అన్నారు. బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి... హైదరాబాద్‌ను ప్రస్తుతిస్తూనే తనదైన చలోక్తితో సభికులను ఆకట్టుకున్నారు రాష్ట్రప్రతి. ‘‘హైదరాబాద్ అంటే... బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి గుర్తొస్తాయి. ఇక్కడి వంటలు ఎంతో ప్రీతిపాత్రమైనవి. హైదరాబాద్ వంటకాలకు ఢిల్లీలో ఎంతో పేరుంది. ముఖ్యంగా ఇక్కడి పచ్చళ్లు అక్కడి వారికెంతో ఇష్టం. క్రీడారంగంలో ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారులను హైదరాబాద్ అందిస్తోంది. సినీ రంగానికి బాహుబలి వంటి గొప్ప సినిమాను అందించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీతో సంయుక్తంగా టాప్‌లో తెలంగాణ నిలిచింది. తెలంగాణ వంటి కొత్త రాష్ట్రాన్ని వేగవంతంగా ప్రగతి పథంలో నిలిపేందుకు వ్యాపార, పారిశ్రామిక సామర్ధ్యమున్న ప్రాంతంగా వస్తున్న ఈ పేరు దోహదపడుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి నా అభినందనలు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు అద్భుతంగా విజయవంతమైంది. రానున్న నూతన ఆంగ్ల సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు గొప్ప ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నా. తదుపరి తెలుగు మహాసభల కోసం ఎదురుచూస్తుంటా’’నన్నారు. రాయప్రోలు రాసిన ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము’పంక్తులతో రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. -
తెలుగు భాషకు ప్రాచీన హోదా ఎలా వచ్చింది ?
-
అర చేతి తెరలోకి తెలుగొస్తుందా?
కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం అన్నది పాతమాట. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, అసలు తెలుగులోనే కంప్యూటర్లు ఎందుకు ఉండకూడదూ అని ఆలోచిద్దాం.కంప్యూటర్లు వాడుకలోనికి రావడం మొదలైననాటి నుండి వాటిలో (ఆంగ్లేతర) మానవ భాషల వినియోగానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత, ఇప్పటికైనా మామూలు తెలుగువాడు కంప్యూటర్ని తెలుగులోనే వాడుకోగలడా!? అయితే, ఎంతవరకూ వాడుకోగలడు? దీన్ని నాలుగు స్థాయుల్లో చూద్దాం. కంప్యూటర్ అంటే స్మార్టు ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు కూడా. ఒకటో స్థాయి: తెలుగు చూడటం, టైపు చెయ్యడం ఈ స్థాయిలో కంప్యూటర్లు తెలుగులో సమాచారాన్ని తెరపై చూపించగలగాలి. మనకి టైపు చేసే వీలు కల్పించాలి. నేడు మనం ఈ స్థాయిని చాలావరకు చేరాం అని చెప్పవచ్చు. అన్ని రకాల కంప్యూటర్లలోనూ (విండోస్, గ్నూ/లినక్స్, మ్యాకింటోష్), కొత్త స్మార్టు ఫోన్లలోనూ (ఆండ్రాయిడ్, ఐఓస్, విండోస్) ఇప్పుడు మనం తెలుగు సమాచారాన్ని చూడవచ్చు, వీటిలో టైపు చెయ్యవచ్చు కూడా. ఈ పరికరాలన్నీ కూడా ఇప్పుడు కనీసం ఒక తెలుగు ఫాంటుతో వస్తున్నాయి. ఇక టైపు చెయ్యడానికి మనం కీబోర్డు సెట్టింగులలో తెలుగు భాషను ఎంచుకుంటే చాలు. చాలా వరకూ తెలుగు ఇన్‌స్క్రిప్టు కీబోర్డు లేయవుట్లు ఉంటుంది. మనకి ఇప్పటికే ఆపిల్, మాడ్యులర్ వంటి లేయవుట్లు తెలిసివుంటే, వాటితోనూ టైపు చేసుకోడానికి అప్లికేషన్లూ దొరుకుతున్నాయి. అంతర్జాలంలో మనకు అన్ని అవసరాలకు ఉపయోగపడే తెలుగు సమాచారం అందుబాటులో లేదు. తెలుగు వార్తా పత్రికల సైట్లు, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపీడియా, మరి కొన్ని గాసిప్ సైట్లూ తప్ప అంతర్జాలంలో తెలుగు పెద్దగా లేదన్నది ఒక వాదన. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వెబ్ సైట్లూ అరకొరగానే తెలుగులో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాసేవారు బాగా పెరిగారు. రెండో స్థాయి: తెరపై మొత్తం తెలుగు కనబడటం ఈ స్థాయిలో కంప్యూటరు గానీ, ఫోను గానీ మామూలు అవసరాలకు వాడుకోడానికి ఆంగ్లం అవసరం ఉండకూడదు. తెలుగుకి సంబంధించినంత వరకూ మనం ఈ స్థాయిలో మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం. విండోస్, గ్నూ/లినక్స్ నిర్వాహక వ్యవస్థలను తెలుగు భాషలో వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొరకు తెలుగు భాషా ప్యాక్‌లు మైక్రోసాఫ్ట్ వారి సైటు నుండి దింపుకోవచ్చు. మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి ఏవో కొన్ని అప్లికేషన్లు మాత్రమే తెలుగులో లభిస్తున్నాయి. ఇక అంతర్జాలం విషయానికి వచ్చేసరికి, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సైట్లూ, ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, లిబ్ర ఆఫీస్ లోనూ కొంత వరకూ తెలుగు స్పెల్ చెకింగ్ అందుబాటులో ఉంది. కానీ తెలుగు వ్యాకరణాన్ని సరిచూసే వెసులుబాటు మాత్రం లేదు. మన దేశ కంపెనీలు పేటీఎమ్, 1ఎమ్జీ వంటి ఆప్స్ తెలుగులో కూడా ఉన్నాయి. వీటిని తెలుగులో వాడుకోడానికి, ఆయా ఆప్స్ సెట్టింగులలో మన భాషని తెలుగుగా ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్‌లో ఊర్లు, వీధుల పేర్లు ఈ మధ్య తెలుగులో కనిపిస్తున్నాయి. ఇదో శుభపరిణామం. ఇన్ని ప్రోగ్రాములూ ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నా వీటిలోని అనువాదాలు అందరికీ అర్థమయ్యే విధంగా లేవనీ అనువాదాలలో నిలకడ, నాణ్యత లోపించాయనీ కూడా ఫిర్యాదులున్నాయి. మనం వాడి చూసి, తప్పులనూ దోషాలనూ ఆయా కంపెనీలకు నివేదించాలి. తెలుగు బాగా తెలిసిన వారినీ, అనువాదాలపై పట్టున్న వారినీ ఈ స్థానికీకరణ ప్రక్రియలో భాగస్వాములను చెయ్యాలి. ఇంత చెప్పుకున్నా, రోజువారీ అవసరాలను పూర్తిగా తెలుగులోనే జరుపుకోగలమా అంటే లేదనే చెప్పాలి. ఈ దిశగా మనం ప్రభుత్వాలనూ, వ్యాపార సంస్థలనూ అడగాలి. తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే, వస్తూత్పత్తులూ, సేవలూ, వాటి సంబంధిత సమాచారమూ తెలుగులో కూడా ఉండేవిధంగా మన ప్రభుత్వాలు విధానపరంగా చర్యలు చేపట్టాలి. ఇంగ్లీషు లేకుండా కంప్యూటర్లు వాడుకోడానికి, కీబోర్డులు తెలుగులో కూడా ఉండాలి. గతంలో టీవీఎస్ కీబోర్డులు తెలుగు మీటలతో ఉండేవి. ఈ మధ్య సురవర వారు తెలుగు కీబోర్డులు అమ్మారు. అలాంటి ప్రయత్నాలు ఊపందుకోవాలి. భారతదేశంలో విక్రయించే స్మార్టు ఫోన్లలో తప్పనిసరిగా ప్రాంతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉంది. కానీ కంప్యూటర్లకూ, వెబ్ సైట్లకూ ఇలాంటి ఉత్తర్వులు ఏమీ ఉన్నట్టు లేవు. మూడో స్థాయి: కంప్యూటర్లు మన మాటల్ని అర్థం చేసుకొని తెలుగులోనే బదులివ్వగలగడం ఐఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కోర్టానా, అమెజాన్ అలెక్సా వంటి ఉత్పత్తులు/సేవలు మన మాటల్ని ఇంగ్లీషు (ఇంకొన్ని భాషల్లో) అర్థం చేసుకుని బదులివ్వగలుగుతున్నాయి. కానీ, ఇవి తెలుగులో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. తెరపై తెలుగు పాఠ్యాన్ని చదవగలిగే ఉపకరణాలు ఉన్నా, అవి చదివింది వింటే తెలుగు విన్నట్టు ఉండదు. తెలుగు తీయదనాన్ని అవి నేర్చుకోలేదు. అది నేర్పవలసింది తెలుగువారం మనమే కదా. ఇక తెలుగులో ఉన్న రకరకాల మాండలీకాల్నీ యాసల్నీ, మనందరం మాట్లాడే పద్ధతులనీ అర్థం చేసుకుని అదే రీతిలో బదులివ్వాలంటే, చాలా పరిశోధన జరగాలి. ఈ దిశగా, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులు, పరిశోధనలూ చెయ్యాలి. నాలుగో స్థాయి: తెలుగులోనే కంప్యూటరు ప్రోగ్రామింగ్ తెలుగులో కంపైలరు తయారుచేయడానికి, తెలుగులో ప్రాగ్రామింగు రాయడానికి ఔత్సాహికుల చిన్ని చిన్ని ప్రయత్నాలు జరిగినా, ఒక స్థాయి చేరుకోడానికి ఇప్పటివరకూ జరిగిన ప్రయత్నాలు సముద్రంలో నీటు బొట్టు కాదు కదా పరమాణువంత లెక్క. ఈ నాలుగో స్థాయిని ప్రస్తుతానికి చేరుకోలేనిదిగా వదిలేయవచ్చు. కానీ, మనం కంప్యూటర్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టుకోడానికి, పైపై ఆటోమేషన్‌లకు తేలిగ్గా వాడుకోగలిగేలా తెలుగు స్క్రిప్ట్ కూడా ఉంటే బాగుంటుంది. మూడో స్థాయి వరకూ మనం ఎదగడానికి, తెలుగు భాషకి ప్రత్యేకించి తీరని సాంకేతిక ఇబ్బందులంటూ ఏమీ లేవు; కేవలం మన భాషంటే తేలికభావం, నిర్లక్ష్యం, ఉదాసీనత తప్ప! ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నైనా మనందరం మన అమ్మ భాషకి పునరంకితమై ఈ దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి తెలుగు సామెతల సంకలనం 1868లో వెలువడిన ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’. సంకలన కర్త ఎం.డబ్ల్యూ. కార్. ఇందులో 2,200 సామెతలున్నాయి. పుస్తకం విజ్ఞానధనం పదిలపరచిన తాళం కప్పలేని ఇనప్పెట్టె. – సూర్యప్రకాశ్ నిజమైన కళ ఆత్మనే సంస్కరిస్తుంది. కాని ఆ సంస్కారం కంటికి కనబడదు. చూసి విలువ కట్టలేము. – చలం -
ఇలా చేద్దాం...!
గొప్ప చరిత్రతో వారసత్వ సంపద అయిన తెలుగు పదికాలు బతకాలి. భాషా పండుగలు ఇందుకెంతో మేలు చేస్తాయి. ఈ స్ఫూర్తి కొనసాగాలి. భాషను బతికించడానికి ఉద్యమాల సంగతెలా ఉన్నా, ఉన్న చట్టాల అమలు ముఖ్యం. 40 శాతం మంది మాతృభాషను చదవడం, రాయడం మానివేసినప్పట్నుంచి ఈ భాష అతి స్పల్ప కాలంలో మృతభాషగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి (యూఎన్)కి చెందిన ‘యునెస్కో’ హెచ్చరిం చింది. ఇంగ్లీషుపై ఇటీవలి మోజు, కార్పొరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తున్న ‘పోటీ’ మాయ, ఆశావహులైన తల్లిదండ్రుల భ్రమ, ప్రభుత్వాల అచేతన... వెరసి నేటితరంలో అత్యధికులు మాతృభాష రాయడం, చదవడం రాని దుస్థితిలోకి జారుతున్నారు. పరిపాలన వ్యవహారాలు తెలుగులో సాగాలని డిమాండ్ చేయలేని తరం తయారైనా ఆశ్చర్యం లేదు. కానీ, అక్షరాస్యతా శాతాలు, ప్రమాణాలను బట్టి చూస్తే తెలుగులో అధికారిక వ్యవహారాలే సామాన్యులకు మేలు. సృజన వృద్ధికి, మేధో పరిణతికి, సంస్కృతీ వికాసానికి, ప్రజాభాషలో పాలనా వ్యవహారాలకు.. తెలుగును కాపాడుకోవడమే కర్తవ్యం. ప్రాథమిక స్థాయి విద్యాబోధన మాతృభాషలోనే సాగాలని, 1993లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం 350 అధికరణమూ ఇదే చెబుతోంది. తెలుగును అధికార భాషగా 1966లో శాసనం ద్వారా ప్రకటించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1898)ని సవరిస్తూ కేంద్రం 1974లో చట్టం తెచ్చింది. నిబంధనలు 137 ప్రకారం సివిల్ కోర్టుల్లో, 272 ప్రకారం క్రిమినల్ కోర్టుల్లో (హైకోర్టు కాకుండా) అధికార భాష ఏముండాలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 1974లో ఇచ్చిన ఉత్తర్వు (జీవో:485) ప్రకారం క్రిమినల్ కోర్టుల్లో తెలుగును అధికార భాషగా పరిగణించాలి. కానీ, అమలు శూన్యం. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారమైనా, పౌరులు కోరేదైనా స్థానిక/అధికార భాషలో అందించాలి. పౌర సమాజం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఇవన్నీ సాధించుకోవాలి. ..: దిలీప్‌రెడ్డి వైతాళికులు భాగ్యరెడ్డివర్మ సంఘసంస్కర్తగా హరిజనోద్ధ్దరణకు కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ దళితుడు. 1932లో ఆయన రాసిన ‘వెట్టి మాదిగ’ ఒక దళితుని కథ. ఇది తెలుగులో దళితుడు రాసిన మొదటి కథ కూడా. 1914లో ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం స్థాపించారు. 1915లో సంఘసంస్కార నాటక మండలిని స్థాపించారు. ఈ మండలి ద్వారా హరిజన కళాకారులు నాటకాలను ప్రదర్శించేవారు. 1931లో ‘భాగ్యనగర్’ పత్రికను స్థాపించారు. 1937లో దీనిని ‘ఆది హిందూ పత్రిక’గా మార్చారు. సామాన్య ప్రజల్లో గొప్ప అభిమానాన్ని, ఆదరణను చూరగొన్న భాగ్య రెడ్డివర్మ ఆర్యసమాజం ద్వారా ప్రజల్లో అంటరానితనం, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, విగ్రహారాధన వంటి మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేశారు. తెలుగులో తొలి రాజనీతి గ్రంథం కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత సామంతులు, దండనాథులు చిన్న చిన్న రాజ్యాలను ఏర్పరుచుకున్నారు. ప్రతాపరుద్రుని సేనాని ముప్ప భూపతి సచ్చ రాష్ట్రానికి (కరీంనగర్ జిల్లా) అధిపతి అయ్యాడు. ఆ ముప్ప భూపతి ఆస్థాన కవి మడికి సింగన. పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమస్కంధం, వాసిష్ట రామాయణం, సకల నీతి సమ్మతం గ్రంథాలను రాశాడు సింగన. పురాణాల నుంచి అద్భుతమైన అంశాలను తీసుకుని కావ్యాన్ని రాయడం ఆయన ప్రారంభించిన కొత్త ప్రక్రియ. ఆయన రాసిన సకల నీతి సమ్మతం కూడా గొప్పప్రయోగం. సకల నీతి సమ్మతంలో సమాజానికి అవసరమైన సర్వనీతులూ పొందుపరిచాడు. ఇందులో ప్రస్తుతం మూడు ఆశ్వాసాలే లభిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ పరిస్థితి చక్కబడాలంటే పాలకులకు రాజనీతి పరిజ్ఞానం అవసరం. అందుకే చాణుక్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన విషయాలు, భోజరాజు అనుసరించిన రాజనీతి సూత్రాలు, కాకతీయులలోనే సమర్థుడైన మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారంలో చెప్పిన మంచి విషయాలు, మహాభారత రామాయణాది కావ్యాలలోని రాజనీతి అంశాలను, ఇతర గ్రంథాలలోని పాటింపదగిన సంగతులను క్రోడీకరించాడు సింగన. పాలకులు అనుసరించాల్సిన రాజనీతిని వారికి కరతలామలకం చేశాడు. - ప్రొ. కుసుమారెడ్డి షడ్రుచుల ‘పద్యా’న్నం! అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయి వోయ భ గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్రభంగ సం జనిత నవీన కాంతి వెదచల్లగ గద్గద ఖిన్న కంఠిౖయె అసలే సత్యభామ... ఆపై కోపం. నారదుడు తెచ్చిన పారిజాతం ఓ పువ్వే కావచ్చు. రుక్మిణి పక్కనుందని ఆ కృష్ణుడు ఇచ్చేయడమేనా? కోపం రాదేంటి. సత్య అలకను అల్లాటప్పగా చెప్పేందుకు తిమ్మనకు మనసొప్పలేదు. తైలవర్ణ చిత్రం గీసేందుకు ‘వర్ణా’లను సరిచూసుకున్నాడు. సత్య విసురుగా లేచింది... ఎలా? తోకతెగిన ఆడత్రాచులా, నేయిపోస్తే ఎగజిమ్మే జ్వాలలా! చింతనిప్పుల్లా కణకణమండే కళ్లు. కళ్ల ఎరుపు చెక్కిళ్ల ఎరుపుతో కలగలసి జేవురించిన మొహం. అదుపు తప్పిన స్వరం. ఇదీ సత్య ఉగ్రరూపం. ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం ముప్పిరిగొన్న గొంతుకతో సఖితో ఆరా తీయసాగింది. తిమ్మన్న సత్యభామను దూరంలో త్రాచులా, కాస్త దగ్గరలో ఎర్రబడిన కళ్లతో, అతి దగ్గరలో వణుకుతున్న స్వరంతో... మూడు దశల్లో త్రీడీ చిత్రంలా చూపాడు. పద్యం కవితోపాటు పాఠకుల్ని చెలికత్తెగా మార్చి సత్య వద్ద నిలబెట్టినట్టు లేదూ! సామెత ‘ఊరంతా వడ్లెండ బెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకొన్నదట’ ఇంకొకరిని అనుకరించి అభాసుపాలయ్యేవారిని ఉద్దేశించి ఈ సామెత ప్రయోగిస్తారు. -
భాషాభివృద్ధికి ఇలా చేద్దాం...!
తెలుగును అధికారిక వ్యవహారాల్లో తప్పనిసరి చేయాలనడం మాతృభాషా వ్యామోహమో, భాషా దురభిమానమో కాదు. ఇది, ఒక భాషా ప్రయుక్త సమాజ వికాసానికి సంబంధించిన అంశం. ప్రజాస్వామ్య పాలనలో ఫలాలు సంపూర్ణంగా సామాన్యులకు అందాలనే, నిజమైన పారదర్శక పాలన కోసమే! ప్రభుత్వానికి–అధికారులకు, నాయకులకు–అధికారులకు, ప్రభుత్వ వివిధ విభాగాలు–ప్రజలకు మధ్య జరిగే ఉత్తరప్రత్యుత్తరాలన్నీ మాతృభాషలో జరిగితే ప్రజలకు ఎంతో మేలు. చట్టసభల్లో, పాలకమండళ్ల్లలో, సభలు–సమావేశాల తీర్మానాల్లో, ప్రభుత్వ ఉత్తర్వుల్లో–ఆదేశాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో అంతటా మాతృభాషనే వాడాలి. అలా కాక అన్యభాషలో జరిగినపుడు దళారులు రాజ్యమేలుతారు. సదరు అన్యభాషతో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు, భాష రానివారి ప్రయోజనాలను పణంగా పెట్టి అనుచిత లబ్ధి పొందే ప్రమాదముంది. ఇక్కడ ఇంగ్లిషు–తెలుగు భాషల విషయంలో జరుగుతున్నదదే! దీన్ని పరిహరించి, సమత్వ సాధనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మాతృభాషాభివృద్ధి్దకి కృషి చేయాలి. అందుకోసం, కొన్ని వెసులుబాట్లు, రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇది అసాధారణమేమీ కాదు. విశ్వవ్యాప్తంగా ఉన్నదే! - ప్రభుత్వం నిధులు వెచ్చించి, భాషా శాస్త్రజ్ఞులు, సామాజికవేత్తలు, నిపుణులతో కమిటీ వేసి ముందు ఉన్నంతలో భాషను ప్రామాణీకరించాలి. - సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలుగే ఉపకరణం కనుక, అలా సాధించిన గ్రామాలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. - 1–12 తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేస్తామంటున్నారు కనుక ఉత్తీర్ణత కోసం (ఇప్పుడు సంస్కృతం, ఫ్రెంచ్ వంటివి చదువుతున్నట్టు) కాకుండా చిత్తశుద్ధి్దతో చదివేలా ఉన్నత విద్యలో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారికి అదనపు ప్రాధాన్యత (వెయిటేజీ/రిజర్వేషన్) కల్పించాలి. - తమ దైనందిన కార్యకలాపాల్లో తెలుగు రాసే అధికారులకు ప్రోత్సాహకాలు, వాడని వారికి జరిమానాలు విధించాలి. - తెలుగు పాత సాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, సామాన్యులకు చౌకగా అందుబాటులోకి తేవాలి. - దిలీప్ రెడ్డి పాతకాలంలో వార్తలు ఇలా రాసేవారు కొన్నాళ్ల కిందట కృష్ణలో వ్యసనకరమయిన వక సంగతి జరిగి అందువలన అనేక ప్రాణహాని హేతువ అయినది. సుమారు నూటికి జనం యెక్కి వక పడవ– బెజవాడ రేవు దాటేటప్పుడు యేటిన తెమికీ పోయి మహా వేగముతో వక పెద్ద రాతినట్టుకు తగిలి దాపు దాపుగా అందులో నుండిన బాటసార్లందరు చనిపోయినారు. ఆ పడవ నీళ్ల వడికి నిలువలేక బహువేగముగా పోతూ వొడ్డిగిలినందువలన నిముషములో నీరు నిండి ముణిగిపోయినది. ముగ్గురు మాత్రము తప్పి వచ్చినారు– ఇది బాజారి ఖబురుగా తెలిసినది గాని అధికారత్వేనా వకరికి సమాచారము అందలేదు. ఆ రేవున వుండే కృష్ణ వెడల్పు సుమారు కోశెడు దాకా ఉన్నది. అక్కడ సంభవించిన పడవ స్థితి వ్రాసి వచ్చినందు వలన నీళ్ల రేవులు పడవల మీద దాటేవారికి జాగ్రత్త కలుగవలెనని తెలియచేసినాము. – 1842 ఆగస్టు 11, వర్తమాన తరంగిణి వారపత్రిక(డాక్టర్ జె.చెన్నయ్య ‘తెలుగు దినపత్రికలు: భాషా సాహిత్య స్వరూపం’ నుంచి...) షడ్రుచుల ‘పద్యా’న్నం! ఏనుగులావెంత, యిల మావటీదెంత, తిమిరంబు బలమెంత,దీపమెంత ఘనసముద్రంబెంత, కర్ణధారకుడెంత, బహుకాననంబెంత, పరశువెంత పారెడు నీరెంత,పర్వతంబదిఝెంత, హరుడెంత, మదులపుష్పాస్త్రమెంత, భీకరఫణిఝెంత, వాకట్టు వేరెంత, బహురాజ్యమెంత, భూపాలుడెంత ఝెవ్వరికి దొడ్డుకొంచెంబు లెంచరాదు, నడచు నిటువంటివెల్ల నీ నాటకటములు –తాళ్లపాక తిమ్మనాచార్యులు ఎంత...చిన్న పదం. నువ్వెంత అంటే నువ్వెంత అంటుంటాం. కానీ ఈ పద్యంలో ఎంత... ఎంతో ఎంతెంతగానో కనిపిస్తుంది. కవి చమత్కారం సరే. దాన్ని ప్రదర్శించే శక్తి భాషకుఉండాలి కదా. తెలుగుకు ఆ సత్తా ఉంది. తాళ్లపాక అన్నమాచార్య కుమారుడు తాళ్లపాక తిమ్మనాచార్యులు రాసిన ఈ పద్యంలో ‘ఎంత’ ఎంత వింతలు చేసిందో చూడండి. ఏనుగు ఎంత లావుంది...మావటీడుని చూడగానే దారికొచ్చేస్తుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా పరిగెత్తించేందుకు చిన్న దీపం చాలు. సముద్రం ఎంత పెద్దదైతేనేం...దాన్ని చీల్చుకు వెళ్లే నావికుడు చిన్నవాడే. ఎంత గొప్ప హరుడైనా... మన్మథుడు వేసిన చిన్న పూబాణానికి చిత్తయ్యాడు. రాజ్యం ఎంత పెద్దదైనా...పాలించే రాజు ఒక మనిషే. ఇదీ తెలుగు పద్యమంటే! ఒక్కొక్క పాదం పూర్తవుతుంటే భావం విమానంలా పైకి లేస్తుంది. చివరి పాదంలో పెద్ద చిన్న అంటూ తేడాలు చూపడం సరికాదు అని ముగిస్తాడు. ఈ విషయం చెప్పేందుకు ఎంత చక్కని దారి ఎంచుకున్నాడో. భాషకు రససమర్పక శక్తి ఉంది కాబట్టే ‘ఎంత’ అనే చిన్న పదం ఇంతింతై మనసును ఆక్రమిస్తుంది. – రామదుర్గం -
ఇదే పురిటి గడ్డ
తెలుగు+ ఆణెము అనే రెండు పదాలతో ఏర్పడిన పదం తెలంగాణం. ఆణెమంటే దేశమని అర్థం. అతి ప్రాచీన కాలం నుంచి తెలంగాణ ప్రాంతం సాహిత్య రచనా వ్యాసంగానికి నిలయమై విరాజిల్లింది. ఎన్నో ప్రక్రియల్లో తొలి గ్రంథాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయంటే సాహిత్యరంగంలో తెలంగాణ ఎంత ప్రముఖమైందో ఊహించుకోవచ్చు. తొలి గ్రంథం తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహనులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 3వ శతాబ్దం వరకు సుమారు 500 సంవత్సరాలు పాలించినారు. క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటికే తెలంగాణలో సాహిత్య రచన ఆరంభమైంది. ప్రపంచ కథా సాహిత్యంలోనే తొలిగ్రంథంగా ప్రశస్తి పొందిన బృహత్కథ కథాకావ్యాన్ని గుణాఢ్యుడు కోటిలింగాల ప్రాంతంలో రచించాడని పండితుల అభిప్రాయం. పైశాచీ భాషలో రాసిన ఈ గ్రంథం మనకు ఇప్పుడు లభ్యం కాకపోయినా కథా సరిత్సాగరం, బృహత్కథా మంజరి మొదలగు గ్రంథాలు ఆ లోటును తీరుస్తున్నాయి. తొలి సంకలనం ఈ రోజుల్లో కవితా సంకలనాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఒకే రచయిత రచనలు కాక వివిధ రచయితల రచనలు ఇందులో చోటు చేసుకుంటాయి. వీటిని సంకలన గ్రంథాలంటారు. ఈ ప్రక్రియకు కూడా తెలంగాణమే ఆది బీజం వేసింది. సుమారు 270 మంది ప్రాకృత కవులు రచించిన ప్రాకృత గాథలను (శ్లోకాలను) శాతవాహన రాజైన హాలుడు గాథాసత్తసఈ (గాథా సప్తశతి) పేరుతో సంకలనం చేశాడు. ఇందులో పిల్ల, అత్త, పొట్ట, కుండ, కరణి, మోడి మొదలైన తెలుగు పదాలు చోటుచేసుకున్నాయి. తొలి కందం జినవల్లభుడు (క్రీ.శ. 940) వేయించిన కుర్క్యాల (కరీంనగర్ జిల్లా) శాసనంలో మూడు తెలుగు పద్యాలు కనిపిస్తున్నాయి. ఇవి తెలుగులో రచించిన తొలి కంద పద్యాలు. అందువల్ల కంద పద్యానికి పుట్టినిల్లు తెలంగాణమే అని చెప్పవచ్చు. ఒక పద్యాన్ని గమనించండి. జిన భవనము లెత్తించుట జిన పూజల్సేయుచున్కి జినమునులకు న త్తిన యన్నదానం బీవుట జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్ తొలి తెలుగు గ్రంథం 11వ శతాబ్దిలో నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతాన్ని తొలి తెలుగు గ్రంథంగా చెప్పుకుంటున్నాం. కానీ తెలంగాణలో అంతకుముందే అంటే 10వ శతాబ్దిలోనే జినవల్లభుని ప్రోత్సాహంతో మల్లియ రేచన ‘కవి జనాశ్రయ’మనే ఛందో గ్రంథాన్ని 113 కందాలలో రచించాడు. ఇందులోనే ఒక కవి స్తుతినీ, సుకవితా లక్షణాలనూ చెప్పడం వల్ల కావ్యాల్లో అవతారికా మార్గం వేసిన మొదటి కవి మల్లియ రేచనే. తొలి జంటకవులు జంటకవుల సంప్రదాయం కూడా మొదట ఏర్పడింది తెలంగాణలోనే. కాచ భూపతి, విట్ఠలరాజు అనే కవులు జంటగా రంగనాథ రామాయణంలోని ఉత్తరకాండను రచించారు. తెలుగులో తొలి వృత్తపద్యం తెలుగులో లభించిన తొలి వృత్తపద్య శాసనం విరియాల కామసాని శాసనం (క్రీ.శ.1000) వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో లభించింది. ఇందులో మూడు చంపకమాలలు, 2 ఉత్పలమాలలు కన్పిస్తాయి. తొలి సంకలనం తెలుగులో సంకలన ప్రక్రియకు ఆద్యుడు మడికి సింగన తెలంగాణ ప్రాంతం వాడే. ఈయన రచించిన సకల నీతి సమ్మతం తెలుగు సంకలన గ్రంథాల్లో మొట్టమొదటిది. ‘ఒక చోట గానబడగ సకల నయ శాస్త్రమతములు సంగ్రహించి గ్రంథమొనరింతు లోకోపకారముగను’ అని గ్రంథ విషయాన్ని పేర్కొన్నాడు. తొలి వచన సంకీర్తనలు వచన సంకీర్తన ప్రక్రియలో తొలుతగా సింహగిరి వచనాలను రచించిన కవి తెలంగాణకు చెందిన శ్రీకంఠ కృష్ణమాచార్యులు. ‘స్వామీ! సింహగిరి నరహరీ! నమో నమో దయానిధీ’ మకుటంతో ఈయన నాలుగు లక్షల భక్తి పూరిత వచనాలను రచించినాడని ప్రతీతి. కానీ ప్రస్తుతం 300లోపు గానే లభిస్తున్నాయి. తొలి పురాణ అనువాదం సంస్కృతంలోని పురాణాన్ని తొలిసారిగా తెలుగులో అనువాదం చేసిన కవి తెలంగాణకు చెందిన మారన మహాకవి. సంస్కృతంలోని మార్కండేయ పురాణాన్ని కావ్యగుణ శోభితంగా రచించి లె లుగులో తర్వాతి ప్రబంధ కవులకు మార్గదర్శకుడైనాడు. – ఆచార్య రవ్వా శ్రీహరి తొలి కల్పిత కావ్యం తొలి తెలుగు కల్పిత కావ్యానికి కూడా బీజం వేసింది తెలంగాణ ప్రాంతమే. సూరన ధనాభిరామం మొదటి కల్పిత కావ్యం. ధనం ముఖ్యమా? సౌందర్యం ముఖ్యమా? అనే విషయంపై కుబేరుడు, మన్మథుడు వాదించుకోవడం ఇందులో ప్రధాన వస్తువు. కవి రాచకొండ సామ్రాజ్యంలోనివాడు. తొలి నిరోష్ఠ్య రచన తెలుగులో మొదటి నిరోష్ఠ్య రచనా, మొదటి అచ్చ తెలుగు నిరోష్ఠ్య రచనా తెలంగాణలోనే ప్రారంభమైంది(అంటే పెదాలతో ఉచ్చరించే ప, బ, మ లాంటి అక్షరాలను మినహాయించి రాసినవి). ఆసూరి మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర అనే నిరోష్ఠ్య కావ్యాన్నీ, సీతా కల్యాణమనే అచ్చ తెలుగు నిరోష్ఠ్య కావ్యాన్నీ రచించాడు. తొలి వచన రచన, యక్షగానం తొలి తెలుగు వచన రచనౖయెన ప్రతాపరుద్ర చరిత్ర కూడా తెలంగాణలో వెలసిందే. ఏకామ్రనాథుడు కర్త. ఇది తెలుగు వచన రచనే కాక తొలి చారిత్రక గ్రంథం కూడా. రాయవాచకం కంటే ముందే వచ్చిన రచన. 16వ శతాబ్దికి చెందిన కందుకూరి రుద్రకవి దేవరకొండ తాలూకాలోని జనార్దన కందుకూరి గ్రామ నివాసి అని చారిత్రిక పరిశోధకులు బి.ఎన్.శాస్త్రి పేర్కొన్నారు. ఈయన రచించిన సుగ్రీవ విజయం తెలుగులో వచ్చిన మొదటి యక్షగానంగా పేర్కొనవచ్చు. తొలి బాటలు వేసిన పాల్కురికి తెలుగులో ద్విపద కావ్యానికి పురుడు పోసింది తెలంగాణయే. వరంగల్లు జిల్లా పాలకుర్తి నివాసి పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం మొదటి ద్విపద కావ్యమే కాక స్వతంత్రమైన తొలి వీరశైవ పురాణం కూడా. సాంఘికాంశాలు చిత్రించిన మొదటి సాంఘిక కావ్యంగా కూడా దీనికి ప్రసిద్ధి ఉంది. మకుట నియమం, సంఖ్యా నియమం శతకాలలో మొదటిదైన వృషాధిప శతకం కూడా తెలంగాణలో వెలువడిందే. పాల్కురికి సోమనాథుడే 108 చంపకోత్పల మాలికలతో రచించిన ఈ శతకం తర్వాతి కవులకెందరికో మార్గదర్శకమైంది. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో విశిష్టమైన రచనలు చేసిన ప్రతిభామూర్తుల్లో కూడా సోమనాథుడు ఆద్యుడే. ఆయన పండితారాధ్య చరిత్ర లె లుగులో మొదటి విజ్ఞాన సర్వస్వంగా భావించవచ్చు. ఉదాహరణ, రగడ ప్రక్రియల్లోనూ ఆయన గ్రంథాలే తొలి రచనలు. -
తెలుగుకు వెలుగేది?
అందమైన తెలుగు భాషకు నగరంలో అందలమేది? అచ్చంగా తెలుగు మాట్లాడడం..రాయడం మచ్చుకైనా కానరాకపాయె. ముందు వరుసలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగు భాష సరిగా అమలు కావడం లేదు. కేవలం బోర్డులకే పరిమితమైంది తప్ప...ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, పాలనపరమైన వ్యవహారాలు సైతం ఆంగ్లంలోనే జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పదిశాతం మాత్రమే తెలుగు అమలవుతుండడం గమనార్హం. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో నగరంలోని వివిధ కార్యాలయాల్లో తెలుగు భాష అమలుపై సాక్షి ప్రత్యేక కథనం... సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ మహా నగరంలో అధికార భాష అమలు అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులపై మాత్రమే తెలుగు అమలు కనిపిస్తుండగా...ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆంగ్ల భాష రాజ్యమేలుతోంది. కనీసం పరిపాలన పరమైన వ్యవహారాల్లో అధికార భాష తెలుగు అమలుకు కనీస ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలు మ్యానువల్ విధానం నుంచి ఈ–ఆఫీస్‌కు అప్డేట్ అవుతున్నా..తెలుగు సాఫ్ట్వేర్ ఏర్పాటును విస్మరించడం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు అధికార యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులకు సైతం ఆంగ్లంలో సమాధానాలు ఇస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. సాక్ష్యాత్తు ప్రభుత్వం పరంగా అధికార భాష తెలుగును తూచ తప్పకుండా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకునే నాథులే కరువయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా ఉండాలి... అధికార భాషా చట్టం–1966 ప్రకారం తెలుగు అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో శిలాఫలకాలు తెలుగులో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు పట్టికలు, ఉద్యోగుల సంతకాలు, సెలువు దరఖాస్తులు తెలుగులో రాయాల్సి ఉంటుంది. శిలాఫలకాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు, హోదా తెలుగులో ఉండేవిధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ గ్రేటర్ పరిధిలో సరిగా అమలు కావడం లేదు. తెలుగు సాఫ్ట్వేర్ ఎక్కడ? ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు ప్రోత్సాహాం కరువైంది. కంప్యూటర్లలో కనీసం తెలుగు స్టాఫ్‌వేర్ కూడా లేకుండా పోయింది. ఒకవేళ సాఫ్ట్వేర్ వేసుకున్నా తెలుగు టైపింగ్ వచ్చే ఉద్యోగులు కరువయ్యారు. దీంతో ఫ్రభుత్వ విభాగాల దస్త్రాలన్నీ ఆంగ్లంలోనే కొనసాగుతున్నాయి. జిల్లా స్థాయి కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ ఉత్సవ విగ్రహంగా తయారైంది. వివిధ శాఖల్లో అధికార భాష అమలుపై నెలవారీ నివేదికలు సైతం తెప్పించకోవడంలో విఫలమవుతున్నారు. మరోవైపు వివిధ శాఖలు సైతం నివేదికలు పంపించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. మూడు నెలలకోసారి జరగాల్సిన సమీక్షల ఊసే లేకుండా పోయింది. అమలు ఇలా... నగరంలో తెలుగు భాష అమలు కేవలం çపదిశాతానికి పరిమితమైంది. రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతాల్లో 40 శాతం, మేడ్చల్ పరిధిలో 40 శాతం అమలవుతోంది. హైదరాబాద్‌లో పౌరసంబంధాల శాఖ 80 శాతం, మహిళా శిశు సంక్షేమ శాఖలో 60 శాతం తెలుగు భాష అమలవుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో సుమారు 80 శాతం వరకు తెలుగు అమలవుతుండగా వంద శాతం పూర్తి చేసేందుకు కార్యాచరణకు సిద్ధమయ్యారు. మిగిలిన విభాగాల్లో ఆంగ్లంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వచ్చే లేఖలు, మెమోలూ ఆంగ్లంలోనే ఉంటున్నాయి. -
ఇలా చేద్దాం...!
తెలుగు భాషది ఎంతో గొప్ప చరిత్ర.. ప్రాచీన హోదా ఉంది. భాషా వైభవం ఇదని, మరే ఇతర ప్రపంచ భాషకూ తీసిపోని సంపూర్ణత్వం తెలుగు భాషకుందని చాటి చెప్పాలి. స్ఫూర్తి పంచాలి. కానీ, అది మాత్రమే సరిపోదు. ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. భాషను భద్రంగా భవిష్యత్తరాలకు అందించాలంటే.... తెలుగు జాతికి ఒక నమ్మకం కలిగించాలి. తెలుగును నేర్చుకోవడం వల్ల, తెలుగే మాధ్యమంగా పిల్లలకు ప్రాథమిక విద్యాభ్యాసం చేయించడం వల్ల పూర్ణవికాసం సాధ్యమనే విశ్వాసం కలిగించాలి. ఇంగ్లీషు మాధ్యమంగా ప్రాథమిక విద్య నేర్చిన వారి కన్నా తెలుగులో చదివితే ఏ విధంగాను నష్టపోము అన్న భరోసా తల్లిదండ్రులకు, సమకాలీన సమాజానికి కల్పించాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలూ మాతృభాషలోనే ప్రాథమిక విద్యనేర్పడం వల్ల అంతటి సృజన పరిఢవిల్లుతోందని శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన విషయాల్ని తెలియపరచాలి. అది సాకారం కావడానికి అవసరమైన వనరుల అందుబాటు, సాధన సంపత్తి సమకూర్చడం, ప్రోత్సాహకాలివ్వడం వంటివి ప్రభుత్వం నిరంతరం చేయాలి. ఇవి కొరవడటం వల్లే నమ్మకం సన్నగిల్లి అత్యధికులు తమ పిల్లలను తెలుగుకు దూరం చేస్తున్నారు. ఇంగ్లీషులో పెంచుతున్నారు. తెలుగుపై ప్రేమ, అభిమానం ఉండీ... ఇంగ్లీషుతోనే భవిష్యత్తు అనుకుంటున్నారు. తెలుగు లేకపోయినా ఒరిగే నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నారు. తెలుగు గొప్పతనం తెలియక కాదు. తెలుగుకింత వైభవముందని గ్రహించక కాదు. తెలుగులో తగిన సాంకేతిక సమాచారం లభించదు, పుస్తకాలుండవు, తర్జుమాలు–అనువాదాలు సరిగ్గా జరుగవు, పారిభాషిక పదకోశాలు దొరకవు, పరిశోధనలు లేవు. ఆధునికమైన ఏ అంశమూ తెలుగు భాషలో లభించదు... ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ నమ్మకం పెంచే కృషి నిరంతరం జరగాలి. . .: దిలీప్‌రెడ్డి -
తెలుగు అక్షరమే ‘వేగవతి’
రెండో మాట వేగశక్తిలో ఇతర భారతీయ భాషలకన్నా తెలుగుదే పైచేయిగా ఉండటమేగాక, కంప్యూటరీ కరణలో కూడా తెలుగు లిపి అత్యంత ప్రయోజనకర స్థాయిలో ఉండగలదని రూఢి అవుతోంది. తెలుగు అజంత భాష కావడం, ‘రస భావ సమర్పణ శక్తి’లో సంస్కృతానికి దీటైన భాష కావడం వల్లనే ప్రపంచ ప్రసిద్ధ జీవ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ హాల్డేన్ సహితం శాస్త్ర, సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష భారతీయ భాషల్లో ఒక్క తెలుగేనని యాభై ఏళ్లనాడే చెప్పాడు. ‘‘తెలుగు భాషకు చిరునామాలు–మన గ్రామాలు. ఒక భాష స్వీయ అస్తిత్వం ఆ భాషకు సంబంధించిన దేశీ పదాలలో వ్యక్తమవుతుంది...ఒక అవమానం నుంచి, తృణీకరణ నుంచి, ‘నాది తెలుగు కాదు’ అన్న విపరీత వాదనలో నుంచి ఉప్పొంగినది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అలాంటి స్థితిలో ఇంకొక చివరికి వెళ్లి ‘మా భాష వేరే!’ అని మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. అదొక భావోద్వేగపూరిత ప్రకటన.. ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని తీర్లుగా మాట్లాడినా తెలుగు తెలుగే. అంతటా ఉన్నది తెలుగే. సమన్వయం వల్లనే అసలు తెలుగు బయట కొస్తుంది.’’ – డాక్టర్ నలిమెల భాస్కర్, ఆచార్య నందిని సిధారెడ్డి ‘‘ప్రపంచ భాషలనే పాలపుంతలో ప్రతి పదమూ, అక్షరమూ ఒక నక్షత్రమే!’’ – ఐక్య రాజ్య సమితి విద్యా, సాంస్కృతిక సంస్థ ‘‘ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా! యాసలు వేరుగ ఉన్నా–మన బాస తెలుగు బాసన్నా! వచ్చిండన్నా వచ్చాడన్నా–వరాల తెలుగు ఒకటేనన్నా!’’ – డాక్టర్ సినారె ఇంతకూ మన తెలుగుకు అంత మాధుర్యం ఎలా వచ్చింది? ఒక్కటే సమాధానం– తెలుగు అక్షరంలో ఒదిగి ఉన్న శక్తి. వర్ణంలో, దాని ఉచ్చారణలో దాగిన వేగం.. వేగాతివేగం. అందుకే తెలుగు అక్షరం ప్రపంచ భాషలలో ‘వేగవతి’గా అవతరించింది. ఈ అక్షరశక్తిని నాలుగున్నర దశాబ్దాల నాడే ఆచార్య బీఎస్ రామకృష్ణ నిరూపించారు. తెలుగువాడైన రామకృష్ణ సుప్రసిద్ధ గణాంక, గణిత శాస్త్రవేత్త. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. ఆ రహస్యాన్ని ప్రచురించే అదృష్టం తెలుగువాడికంటే ముందు సుప్రసిద్ధ శాస్త్ర విషయాల పత్రిక ‘సైన్స్టుడే’కే దక్కింది. ప్రపంచ భాషలలో అక్షరశక్తిలో ఉచ్చారణకు అనువైన వేగశక్తి ఉన్నది తెలుగేనని ఆచార్య బీఎస్ నిరూపించారు. ‘క్షరము’(నశింపు)లేనిదే అక్షరం. కాబట్టి (న క్షరతీత్యక్షరమ్) వాక్కును పవిత్రశక్తిగా మలిచింది. బహుశా ఆ శాబ్దిక శక్తినే, అక్షరరూపంలో ‘బ్రాహ్మీ’ లిపినే సరస్వతిగా భావించి ‘సర్వ శుక్లా సరస్వతి’ అని పోతనామాత్యుడు సంభావించి ఉంటాడు. అందుకే భారతీయ భాషలకు పునాదులు నిర్మించిన ‘బ్రాహ్మీ’ లిపినీ, దాని నుంచే అవతరించిన తెలుగు లిపిని తోబుట్టువులుగా భాషా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. అన్ని పలుకుబడులూ విలువైనవే ‘పదాన్ని బానిసగా, రాగాన్ని రంభ’గా మలుచుకునే వారు ఈ లోకంలో లేకపోలేదు. మనం ప్రయోగించే పదం లేదా అక్షరాల వేగాన్ని కొలిచేవారూ, కొలవగల వారూ అరుదు. సర్వశాస్త్రాలకు మూలమైనది గణితశాస్త్రం (మ్యాథమేటిక్స్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్) అంటారు. కొలతలతో నిమిత్తం లేని ప్రపంచం లేదు. ప్రతి దానికీ కొలతలూ, కొలమానాలూ ఉంటాయి. తాజా పరిశోధనల ఫలితంగా మనిషి నవ్వును కూడా కొలిచే సాధనాలు సిద్ధమవుతున్నాయి. నవ్వుకు సైతం కొలతలు, కొలబద్దలు ఉన్నాయని హాస ప్రక్రియా శాస్త్రంలో (సైన్స్ ఆఫ్ ది లాఫ్టర్) విశేష పరిశోధన చేసిన జపాన్ దేశ ఆచార్యుడు యోజీ కిమూరా నిర్ధారించారు. ఆయన నవ్వును కొలిచే యంత్రాన్ని కనుగొన్నారు. దీనికే ఎహెచ్ అని పొట్టి పేరు పెట్టారు. ఆంగ్ల వర్ణమాల చిన్న బడిలోని ‘ఎ’(a) అక్షరం, పెద్దబడిలోని ‘హెచ్’(H) అక్షరం కలిపితే వచ్చినదే ‘ఎహెచ్’(aH). ఇదొక సంకేతం. నవ్వుకు కొలమానం. స్వేచ్ఛగా నవ్వగలిగే చిన్నారులలో ఈ శక్తి సెకనుకు 10 ఎహెచ్ ప్రమాణంలో ఉంటుందట. ఇది పెద్దల నవ్వు కన్నా రెట్టింపు లాస్యశక్తిని విడుదల చేసిందని ఆచార్య కిమూరా లెక్క గట్టారు. ఈ ప్రక్రియ మొత్తం భాష లేకుండా రాణిం చదు. శ్రీశ్రీ అన్నట్టు ‘పశువుకొక్క భాష/ శిశువుకొక్క భాష/ మానవుడికి మాత్రం సంఖ్యానంతపు పలుకుబళ్లు’. కాబట్టి ఆ భాషలనూ, పలుకుబడులనూ రక్షించుకోవడం తప్పనిసరి. వేగమూ, వేగంగా ఆలోచించడమూ మానవుడి లక్షణాలలో ఒకటి. అయితే ఈ వేగాన్ని అన్ని భాషలలోని పదాలు అందుకోలేవు. భావాల బట్వాడాకు, అంటే కమ్యూనికేషన్స్‌కు ప్రపంచంలో ఏ భాషకు మంచి సౌలభ్యం ఉంది? ఏ భాషా పదానికి, ఏ అక్షరానికి ఎంత వేగం ఉంటుంది? ఒక భాషాపదం లేదా అక్షరం వేగవతి కావాలంటే ఉండవలసిన ప్రమాణాలేమిటి? ఇత్యాది ప్రశ్నలకు గణితశాస్త్రం, గణాంకశాస్త్రాల ఆధారంగా లెక్కకట్టి ఇంగ్లిష్, రోమన్, జర్మన్ లిపులకూ, వాటి అక్షరాలకూ తెలుగు అక్షరానికీ మధ్య పోలిక చూడడమే కాకుండా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడ, మలయాళీ లిపులతో తెలుగు లిపినీ, తెలుగు పదాన్నీ పోల్చి వీటిలో భావాలను వేగాతివేగంగా బట్వాడా చేసే శక్తి తెలుగు అక్షరానికే ఉందని నిరూపించిన ఏకైక తెలుగు మేధావి ఆచార్య రామకృష్ణ. సైన్స్టుడే గమనించిన తరువాతైనా! ధ్వని–ప్రతిధ్వని శాస్త్రాలు, సమాచార సిద్ధాంత అనువర్తిత శాస్త్రం రామకృష్ణ అభిమాన విషయాలు. 1973లో ఈయన ‘భాషల శక్తి సామర్థ్యాలు’(ఎఫిషియన్సీ ఆఫ్ లాంగ్వేజెస్) పేరుతో రాసిన సిద్ధాంత రచనను ‘సైన్స్టుడే’ ప్రచురించిన తరువాత కూడా మనం కళ్లు విప్పలేకపోయాం. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి కమ్యూనికేషన్ ఇంజనీర్లు ఏ భాషను ఎంపిక చేసుకుంటున్నారన్న ప్రశ్నకు సమాధానంగా రామకృష్ణ రాసిన అద్భుత విశ్లేషణే ఆ రచన. పదాలలో దాగిన అక్షర వేగ రహస్యం ఈ ప్రచురణతోగానీ తెలియరాలేదు. దేవనాగరితోపాటు మరాఠీ లిపితో, శబ్దాలతో కూడా తెలుగు లిపిని పోల్చి ఏ లిపి రాతకూ, వాక్కుకూ దాని వేగం సమాచార బట్వాడాలో ఉపయోగపడుతుందో నిరూపించారు. ఏ భాషలో ఏ అక్షరం ఒకే పాఠంలో ఎక్కువసార్లు ఎంత శాతం మేర వాడుకలోకి వస్తూంటుందో తేల్చారు రామకృష్ణ. ఒక లిపిని మనిషి ఎంత వేగంగా రాయగలడో, ఆ వేగమే ఆ లిపి/అక్షరం ప్రాముఖ్యతకు ప్రమాణం అని చెప్పారాయన. అందరూ ఒకే వేగంతో అక్షరాన్ని/లిపిని రాయరు. కాబట్టి రెండు వేర్వేరు లిపులు రాయడానికి పట్టే అసలు కాలాన్ని గణాంకశాస్త్ర సాయంతో ఆయన లెక్కగట్టారు. రోమన్, ఇంగ్లిష్ లిపులలో వాటిని రాయడానికి పట్టే సగటు వేగాన్ని అంచనా కట్టి ఇలా నిగ్గు తేల్చారు. ఈ అన్ని భాషలలోకన్నా అచ్చులు, హల్లులతో కూడిన పదాలను తెలుగు లిపిలోనే వేగంగా రాయటం సులభమని నిరూపించారు. ఆయన ఉద్దేశంలో అక్షరం/భాష అంటే సంజ్ఞ లేదా గుర్తు లేదా నిర్ణీత ప్రమాణం. దాని మారుపేరే ‘కోడ్’. అంటే, ఒక్కొక్క అక్షరానికి అవసరమైన బిట్స్‌ను సమాచార ప్రమాణం లేదా కొలబద్ద అంటారు. అలాంటి ‘బిట్లు’ ఇంగ్లిష్‌కు 1 లక్షా 71 వేల 107 ఉంటే, వీటిని జర్మన్ లిపి లేదా అక్షరంలోకి అనువదించాల్సి వస్తే 2 లక్షల 7,500 ‘బిట్లు’ అవసరం అవుతాయి. మరోమాటలో చెప్పాలంటే, తక్కువ సంఖ్యలో ‘బిట్లు’ అవసరమైన భాష మాత్రమే తనపైకి అనంతంగా వచ్చి పడుతున్న కమ్యూనికేషన్స్ (సమాచార) ఒత్తిడిని తట్టుకొని నిలబడగలుగుతుందని రామకృష్ణ రుజువు చేశారు. భాషలోని ఈ పొదుపరితనాన్ని రాతలో ఆ భాషా లిపి లేదా అక్షరం వేగాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు– ఇంగ్లిష్‌లో ఒక అక్షరం 7.71 ‘బిట్ల’ సమాచారాన్ని అందించగల్గితే, తెలుగు అక్షరంతో అదే సమాచారాన్ని అందించడానికి కేవలం 1.14 బిట్లు సరిపోతాయి. అలాగే ఇంగ్లిష్‌లో ఒక అక్షరం ద్వారా సమాచారం అందించడానికి సగటున ఎన్ని ‘బిట్లు’ అవసరమవుతాయో అంతే సరిసమాన స్థాయిలో తెలుగు అక్షరానికి పట్టే ‘బిట్లు’, ప్రతి ‘బిట్టు’కు అవసరమైన అదనపు ‘బిట్లు’ కూడా కలిపి మొత్తం 1.18 బిట్లు (అంటే, 1.14+0.04) మాత్రమే సరిపోగా, హిందీలోకి అదే దామాషాలో బిట్లూ+ అదనపు బిట్లూ మొత్తం 1.56 బిట్లు, తమిళానికి మొత్తం 1.26 బిట్లూ అవసరమయ్యాయని రామకృష్ణ తేల్చారు. అంటే, ఇంగ్లిష్‌లో ఒక్కొక్క పదానికి పర్యాయపదాలు అనేకం ఉండగా, తెలుగులో మాత్రం ఒకే ఒక్క పదం ద్వారా ఎంతో సమాచారాన్ని, పర్యాయ పదాల్ని అందించవచ్చునని తేలింది. రాతలో లిపి అనేది వేగవంతమైన పాత్రకు సంబంధించింది. ఇంగ్లిష్‌ను రోమన్ లిపిలో రాయడానికి పట్టిన సగటు వేగం 176 సెకండ్లు కాగా, అదే ఇంగ్లిష్ లిపిని తెలుగులో రాయడానికి 166 సెకండ్లు పట్టింది. తెలుగును రోమన్ లిపిలో రాయడానికి 192 సెకండ్లు పడితే, దానిని తెలుగులోనే రాసుకుంటే తెలుగు లిపికి సగటు వేగం కేవలం 151 సెకండ్లు. అచ్చులు, హల్లులతో కూడిన తెలుగు శబ్దాలను తెలుగు లిపిలో ఇతర భాషా శబ్దాలకన్నా వేగంగా బట్వాడా చేయవచ్చునని చెబుతూ రామకృష్ణ ఇతర భారతీయ భాషల్లో తెలుగులిపిని రాతలోనూ, దాని వేగంతోనూ పోల్చినప్పుడు రుజువైన సగటు వేగం నిష్పత్తిని శాతంలో లెక్కకట్టి చూపాడు: తెలుగు 0.94 శాతం, తమిళం 1.07 శాతం, కన్నడం 1.05 శాతం, సంస్కృతం (దేవనాగరి) 1.06 శాతం, మలయాళం 0.95 శాతం. ఈ అక్షర వేగశక్తిలో మనకు దగ్గరగా పోలికకు వచ్చేది మలయాళం మాత్రమే. తెలుగుకున్న వేగం గొప్పది దీనిని బట్టి వేగశక్తిలో ఇతర భారతీయ భాషలకన్నా తెలుగుదే పైచేయిగా ఉండటమేగాక, కంప్యూటరీకరణలో కూడా తెలుగు లిపి అత్యంత ప్రయోజనకర స్థాయిలో ఉండగలదని రూఢి అవుతోంది. తెలుగు అజంత భాష కావడం, ‘రస భావ సమర్పణ శక్తి’లో సంస్కృతానికి దీటైన భాష కావడం వల్లనే ప్రపంచ ప్రసిద్ధ జీవ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ హాల్డేన్ సహితం శాస్త్ర, సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష భారతీయ భాషల్లో ఒక్క తెలుగేనని ఏభై ఏళ్లనాడే చెప్పాడు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఎంతసేపూ లాభాపేక్షతో కూడిన వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఆలోచనా వేగంతో వ్యాపారం దౌడు తీయాల’ని (బిజినెస్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ థాట్) సూత్రీకరిస్తే, మన రామకృష్ణ తెలుగు పదాన్ని దాని అక్షర వేగాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సమాచార వేగాన్ని బట్టి పదం కదం తొక్కాల’ని (వర్డ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్) కూడా సూత్రీకరించినట్టయింది. అందుకని తెలుగు అక్షర శక్తిని గుర్తించి, మాండలిక సొగసుల్ని, ‘యాస’ల సోయగాల్ని ఆనందిస్తూనే ప్రాంతీయ విభేదాలకు, సంకుచిత భావజాలానికి చోటివ్వకుండానే తెలుగుజాతి ఏకతానాదాన్ని బలంగా సర్వత్రా మీటాలి. అయితే తెలుగు అక్షర శక్తికి తగినట్టుగా విద్యాలయాల్లో ప్రాథమిక దశ నుంచి డిగ్రీ దశ వరకు తెలుగును ‘ఆప్షనల్’గా ఉంచడమా, తప్పనిసరి బోధనా భాషగా ఉంచడమా అన్నది ఇంకా ఎటూ తేలకుండా ఉండటం క్షేమదాయకం కాదు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇంటింటికీ ప్రపంచ తెలుగు మహాసభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సమాచారం ఇంటింటికీ చేరేలా తెలంగాణ సాహిత్య అకాడమీ విస్తృత ప్రచారం చేపట్టింది. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిం చగా తాజాగా తెలంగాణలోని 31 జిల్లాల్లో ప్రాచీన, ఆధునిక కవులు, రచయితలు, సాహితీవేత్తల ఫొటోలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయనుంది. మహాసభలు జరగనున్న హైదరాబాద్‌లో ఇప్పటికే 100 హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. నగరానికి వచ్చే అన్ని మార్గాల్లో ప్రముఖుల పేరుతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాకు చెందిన కవుల హోర్డింగ్‌లు, తోరణాలను మూడేసి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశాన్ని ప్రజలంతా అర్థంచేసుకునేలా ఈ నెల 13 వరకు అవగాహన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు, అతిథులకు రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలోనే మహాసభల సమాచారం తెలిసేవిధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సరస్వతీ ప్రార్థనతో ప్రారంభం మహాసభలు సరస్వతీ ప్రార్థనాగీతం తో ప్రారంభమవుతాయి. ఆ తరు వాత బమ్మెర పోతనామాత్యుడి విరచిత మహాభాగవతంలోంచి ఒక పద్యాన్ని రాగయుక్తంగా ఆలపిస్తారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ప్రసంగిస్తారు. ఆ తరువాత ఆచార్య ఎన్ గోపి వచన కవిత్వంపై మాట్లాడతారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక ఇతివృత్తంతో డాక్టర్ రాధారెడ్డి రాజారెడ్డి రూపొందించిన కూచిపూడి నృత్యరూపకం, తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలను సమున్నతంగా ఆవిష్కరించే దేశిపతి శ్రీనివాస్ రూపొందించిన నృత్యరూపక ప్రదర్శనలతో మొదటి రోజు వేడుకలు ముగుస్తాయి. తెలుగుదనం ఉట్టిపడేలా తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు నేటి తరానికి తెలిసేలా ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. వేదిక బయటవైపు 50 తెలంగాణ రుచుల స్టాళ్లు, మరో 20 పుస్తక ప్రదర్శన స్టాళ్లు, 20 హస్తకళల స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ బిర్యానీతోపాటు, అన్ని రకాల తెలంగాణ పిండివంటలు తెలంగాణ రుచులను స్టాళ్ల ద్వారా సబ్సిడీ ధరల్లో విక్రయిస్తారు. వైభవంగా వేడుకలు.... ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్లో సుమారు 50 వేల మంది పాల్గొంటారని అంచనా. రాష్ట్రం నలుమూలలతోపాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలిరానున్న సుమారు 8 వేల మంది ప్రతినిధులు, అతిథులు, తెలుగు భాష, సాహిత్యాభిమానులు వేడుకల్లో పాల్గొనేలా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు హాజరవుతారు. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగు భాషకు పట్టం కట్టిన ‘కురిక్యాల’శాసనం .................... జిన భవనము లెత్తించుట జిన పూజల్సేయుచున్కి జినమునులకున త్తిన అన్నదానం బీవుట జిన వల్లభుబోలగలరె జిన ధర్మపరుల్ .............................. దినకరు సరివెల్గుదుమని జినవల్లభునొట్ట నెత్తు జితన వినచున్ మనుజుల్గలరే ధాత్రిన్ వినుతిచ్చుడు ననియవృత్త విబుధ కవీన్ద్రుల్ .............................................. ఒక్కొక్క గుణంబు కల్గుదు రొక్కణ్ణి గాకొక్క లెక్కలేదెవ్వరికిన్ లెక్కింప నొక్కలక్కకు మిక్కిలి గుణపక్షపాతి గుణమణ గుణముల్ తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చిపెట్టిన కందపద్యాలివి. ఏ భాషకైనా ప్రాచీన హోదా రావాలంటే కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉండాలి. కరీంనగర్ జిల్లా బొమ్మలగుట్ట సమీపంలోని కురిక్యాల వద్ద లభించిన కురిక్యాల రాతి శాసనం ఆ ఆధారాన్ని అందించింది. క్రీస్తు శకం 946లోనే జినవల్లభుడు తెలుగులో రాసిన కందపద్యాలు వెయ్యేళ్లకుపైగా తెలుగు వాడుకలో ఉందని నిరూపించాయి. కురిక్యాల శాసనంపై సంస్కృతం, కన్నడం, తెలుగు మూడు భాషలలో ఈ పద్యాలు ఉన్నట్లు శాసనాల అధ్యయనంలో వెల్లడైంది. 2వ హరికేసరి కాలానికి చెందిన ఈ శాసనంలో జైనమత ప్రసిద్ధి, దేవాలయాలు, పూజావిధానాలు, తదితర అంశాలపై జినవల్లభుడు పద్యాలు రాసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. మహాసభల్లో ఉచితంగా ‘వాగ్భూషణం..భూషణం’ కేసీఆర్‌కు నచ్చిన పుస్తకం10 వేల కాపీలు ముద్రణ సభలు, సదస్సుల్లో అందరూ మెచ్చేవిధంగా ప్రసంగించాలంటే ఏం చేయాలి? ఎలాంటి ప్రసంగంతో సభికులను ఆకట్టుకోగలం? నాయకులుగా రాణించాలనుకునే వారి ప్రసంగాలు ఎలా ఉండాలి? ఇలాంటి వివరాలతో అప్పట్లో ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ‘వాగ్భూషణం..భూషణం’పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభల్లో విశేషంగా ప్రాచుర్యంలోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంతో నచ్చిన ఈ పుస్తకాన్ని మహాసభలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం 10 వేల కాపీలను ముద్రిస్తున్నారు. కేసీఆర్‌ను జనరంజకమైన నేతగా తీర్చిదిద్దడంలో ఈ చిన్న పుస్తకం ‘వాగ్భూషణం..భూషణం’ఎంతో దోహదం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. ఎస్ఈఆర్టీ రూపొందించిన ‘తెలంగాణ సాంస్కృతిక వైభవం’అనే మరో పుస్తకాన్ని కూడా అందజేయనున్నారు. ప్రతినిధులకు ఇచ్చే కిట్‌లో మహాసభల వివరాలతో కూడిన బ్రోచర్, తెలంగాణ సాంస్కృతిక వైభవం, తదితరాలు ఉంటాయి. బ్రోచర్లో 5 రోజుల కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తున్నారు. మహాసభలపై డాక్యుమెంటరీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణ చేయనున్నారు. దీనిని ‘తెలంగాణ వైభవం’పేరుతో డాక్యుమెంటరీగా రూపొందించి భద్రపరుస్తారు. ఐదు వేదికల్లో, ఐదు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలను మినిట్ టు మినిట్ చిత్రీకరిస్తారు. -
ఇంటర్లో తప్పనిసరి ద్వితీయ భాషగా తెలుగు
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా అమలు చేయడంపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ నివేదికను ఖరారు చేసింది. ఆదివారం ఇంటర్ బోర్డులో జరిగిన అధికారుల కమిటీ సమావేశంలో తెలుగు అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించింది. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక ప్రభుత్వాలు అధికార/ప్రాంతీయ భాషలను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా చదవాలని చేసిన చట్టాలను, నివేదికలను పరిశీలించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల పాఠశాలలు ఇంటర్లో తెలుగు తప్పనిసరి అమలుకు తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. కమిటీ సిఫార్సులు ఇవీ... ♦ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం వారికి ఎలాగూ తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంది. ఇంగ్లిష్, ఇతర మీడియంల వారికి తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయాలి. ద్వితీయ భాషగా దీన్ని ఎంచుకోవాలి. ♦ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు సీబీఎస్ఈకి లేఖ రాయాలి. 11, 12 తరగతుల్లో తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగాగానీ, ప్రధాన సబ్జెక్టుగాగానీ చదువుకోవాలి. ♦ పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా, తెలుగు మీడియంలో చదువుకున్న వారంతా ఇంటర్లో ద్వితీయ భాషగా తెలుగును కచ్చితంగా చదవాలి. ♦ పదో తరగతి వరకు తెలుగు మీడియం మినహా ఇతర మీడియంలలో చదువుకున్న వారు ద్వితీయ భాషగా 50 మార్కులకు తెలుగును, మరో 50 మార్కులకు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకోవచ్చు. -
తెలుగు వైభవాన్ని చాటేలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగు భాష వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. అందులో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికి సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొంటారని.. వారికి అవసర మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై బుధవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు ‘‘పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్ధండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగు భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందిన భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి’’ అని పేర్కొన్నారు. వందల ఏళ్ల నుంచి తెలంగాణలో తెలుగు భాష వర్ధిల్లుతూ వస్తోందని.. అనేక మంది పండితులు, కవులు, రచయితలతోపాటు నిరక్షరాస్యులు కూడా బతుకమ్మలాంటి పాటల ద్వారా జానపద పరంపరను కొనసాగించారని పేర్కొన్నారు. విస్తృతంగా ఏర్పాట్లు మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని.. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతీ చోట వినిపించాలని... ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడ ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గొప్ప చరిత్రను ఘనంగా చాటాలి తెలంగాణ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలని కేసీఆర్ పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగువారు ఉన్నారు. వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికాతో సహా తెలుగు వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో.. ఏపీతో సహా తెలుగువారున్న రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలి..’’అని అధికారులకు సూచించారు. -
తెలుగు భాషకు చిరునామాలు గ్రామాలు
రాబోవు పుస్తకం ఒక భాషకు సంబంధించిన స్వీయ అస్తిత్వం ఆ భాషకు చెందిన దేశి పదాల్లో వ్యక్తమవుతూ వుంటుంది. తెలుగులోనికి వచ్చి చేరిన సంస్కృతాంగ్ల ఉర్దూ మొదలైన భాషా పదాలతో తెలుగు సుసంపన్నం అయితే కావచ్చుగాక కానీ ఆ పదాల్లో తెలుగుదనం వుండదు. తల్లి, తండ్రి, ఊరు, పేరు, రాయి, రప్ప వంటి దేశి శబ్దాలు తెలుగు భాషా స్వరూప స్వభావాన్ని వెల్లడించే పదాలు. ఈ అసలు సిసలు తెలుగు పదాలు తెలంగాణ గ్రామీణ ప్రాంత భాషా వ్యవహారంతో అత్యంత సహజంగా అల్లుకుపోయాయి. ఎక్కడో నిఘంటువుల్లో చోటుచేసుకొని వున్న ఈ తెలుగు మాటలు నిసర్గ సుందరంగా పల్లీయుల నాల్కలపై నర్తిస్తాయి. అలాంటి కొన్ని మాటలు ఇక్కడ ‘మెయి’ పదమ్మీద ముందు దృష్టి పెడితే, దానికి దేహమనే అర్థం వుందని తెలుస్తుంది, ఇతర అర్థాలు సరేసరి. ఇది తెలంగాణలో పెయి అయింది. పెయికాక అంటే జ్వరం. పెయిసబ్బు అంటే టాయిలెట్ సోప్. స్నానం చేయడాన్ని పెయి కడుక్కునుడు అంటారు. ‘‘ఒళ్ళూ పై తెలియకుండా మాట్లాడుతున్నాడు’’ వంటి జాతీయంలోని పై తెలంగాణ పెయే! ‘‘వాన్ని ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్లకు చూపిచ్చినా మెరమెర పోతలేదు’’ వాక్యంలోని మెరమెర ఏమిటి? రోగం తాలూకు భయసందేహాదులు మెరమెర. ‘‘మనసుల ఊకే అదే విషయం మెరమెర వుంటే ఎవడు బాగుపడ్తడు’’ వంటి మాటల్లోని మెరమెర అంటే కూడా మనోవ్యధ, సంశయాదులే! శబ్దరత్నాకరం పై అర్థాల్ని ఖరారు చేసింది మరి! వర్షాకాలంలో ఉరుములు మెరుపులు సహజం. తెలంగాణ మారుమూల పల్లెల్లో మెరుపును మెరుము అంటారు. ‘‘ఉరుములు మెరుములు పాడుగాను! పిడుగులు మీదనే పడేటట్లు వున్నయి’’లోని మెరుము మెరుపే! నిఘంటువుల్లో మెరుపు, మెరుము రెండు పదాలూ చోటు చేసుకున్నాయి. ‘మెల్ల’ అంటే చూపు కంటి కడకు ఒరిగినది అని నైఘంటికార్థం. మెల్ల కన్ను ఉన్నవాణ్ణి మెంటకన్నోడు అంటారు. ఈ మెంటకన్ను ఎలా వచ్చింది? అది ముందు మెల్లట కన్ను. పుల్లటి కూర పుంటికూర (గోంగూర) అయినట్లు, తొల్లిటి చేయి తొంట చేయి (ఎడమ చేయి) అయినట్లు, మెల్లట కన్ను మెంట కన్నుగా మారింది. కన్నుచూపు కంటిచూపుగానూ, చన్ను పిల్లగాడు చంటి పిల్లగాడుగానూ, పన్ను నొప్పి పంటినొప్పి గానూ మారినట్లే మెల్లకన్ను మెంటగా అవతరించింది. వెనుకట వేసవి వచ్చిందంటే చాలు వీధి బాగోతాలు వేసేవారు. ‘‘అండ్ల నీది ఏమేషంరా? ఉత్తేషమా మేటేషమా?’’ అని అడిగేవారు. మేటేషం అంటే మేటి వేషం. మేటి ఎంత చక్కటి తెలుగు మాట. ప్రధాన పాత్రధారుణ్ణి మేటేషకాడు అనేవారు. పిల్లలు ఒకచోట చేరి ఆడుకుంటూ వుంటే ‘‘ఎంత సేపాయెరా ఈడ మాల్లెం బెట్టి. మీ అమ్మలు పిలుస్తున్నరు పోండ్రి’’ అంటారు పెద్దలు. ఇందులోని మాల్లెం మేళం నుండి వచ్చింది. దీన్ని ఉభయపదంగానూ, దేశ్య శబ్దంగానూ శబ్దరత్నాకరం పేర్కొంది. ఈ ప్రత్యేక సందర్భంలో మేళం అంటే సమ్మేళనం వంటి కలయిక. ‘మొక్కరము’ అనే పదానికి అర్థం స్తంభము అని. మరో అర్థం గడెమ్రాను. తెలంగాణలో ఈ మొక్కరాన్ని మొగురం అంటారు. ఇంటినిర్మాణంలో మొగురాలూ, వాటి మీద దూలాలూ, వాసాలూ, పెండెకట్టెలూ, సట్టమూ చాలా ముఖ్యమైనవి. ఈనాటి పిల్లర్సు చేసే పనిని ఈ మొగురాలు చేస్తాయి. మొగురము నిఘంటువుల్లో మొక్కరము, మొకరము రూపాల్లో కనిపిస్తుంది. ‘మొగులు’ ఎంత మంచి తెలుగు! తెలంగాణలో మేఘాలు కమ్ముకుంటున్న సందర్భాన్ని ‘మొగులైంది’ అంటారు. మొగులు అంటే మేఘం అని. ఇక ‘మొత్తు’ అనే దేశ్య సకర్మక క్రియ గురించి. దీనికి అర్థం కొట్టు అని. మొహం మొత్తడం తెలుసు మనకు. ఇది తెలంగాణలో ‘మొకం గొట్టుడు’. ఒకే ఆహార పదార్థాన్ని అదే పనిగా తిన్నప్పుడు మొకం గొడుతుంది మరి! తెలంగాణలో మూర్ఖుణ్ణి, మొండివాణ్ణి, పెడసరం మాటలు మాట్లాడేవాణ్ణి ‘మోర్దోపు మనిషి’ అంటారు. మోర్దోపు పదానికి యింకా ఎక్కువ అర్థ ఛాయలున్నాయి. కొన్ని పదాలకు పూర్తి వివరణ యివ్వలేని అర్థ స్ఫురణ వుంటుంది. శబ్దరత్నాకరంలో ‘మోర త్రోపు’ అని వుంది. మోర అంటే పశ్యాదుల దీర్ఘముఖమే గాక మనిషి ముఖం కూడాను. త్రోపు అంటే అటూ యిటూ ఊపడం. ఏ పని చెప్పినా నకారాత్మకంగా తన ముఖాన్ని ప్రక్కకు త్రోపడమే మోరత్రోపు. మనుషుల్నే గాక పశువుల్ని వుద్దేశించి కూడా ‘‘దీని పాడుగాని. ఇది మోర్దోపు ఎద్దు’’ అంటుంటారు. బోనాలు పండుగ సందర్భంలో ‘రంగం’ చెప్పడం ఒక ఘట్టం. మరి ఈ పదార్థం ఏమిటి! సోదె అని. భవిష్యత్తులో ఏం జరగనుందో రంగం ద్వారా బహిరంగం అవుతుంది. ‘‘బస్సు మస్తు రువ్వడి మీద పోతున్నది.’’ ఈ రువ్వడి ఏమిటి? వేగమే రువ్వడి. రువ్వు, వడి అనే రెండు పొడి పదాలు కలిసి రువ్వడి అయ్యింది. వడి అంటే వేగమే. రువ్వు అంటే విసిరేయడం–రువ్వడం. రువ్వితే ఎంత వడితో పోతుందో అంత వేగం అన్నమాట రువ్వడి. కలహశీలుర్ని ‘‘అరేయ్ రేగుతున్నాదిరా నీకు?’’ అని ప్రశ్నిస్తుంటారు. రేగు అంటే చెలరేగడం, ప్రకోపించడం. కోపతాపాదులు చెలరేగుతున్నాయా అని అడగడం! ‘రొప్పు’ క్రియకు నిఘంటువులు కూయు, తరుము మొదలైన అర్థాలిచ్చాయి. తెలంగాణలో రొప్పడం అంటే బండి నడపడం. నిఘంటువు చెప్పిన ‘తరుము’ అర్థానికి కొంత దగ్గరి అర్థము ఈ నడపడం. ‘‘వీడా! లండు పోరడు’’ వాక్యంలోని లండు మెండు తెలుగు దేశ్య పదమే! వాడెవడో సరిగా మాటవినడని అర్థం. నిఘంటువులు మాత్రం కుత్సితుడు అని అర్థం చెప్పాయి. ‘‘వానికి లత్త కొట్టింది’’ లోని లత్తకు దరిద్రం అని అర్థం. నిఘంటువుల్లో దెబ్బ, ఆపద అని రెండు అర్థాలున్నాయి. లత్త అంటే నష్టం అని కూడా కావచ్చును. ‘‘ఏమో లావు మాట్లాడుతున్నవేంది?’’ అన్న ప్రశ్నలోని లావుకు అర్థం అ«ధికంగా మాట్లాడ్డం అనే! ‘‘నా దగ్గర లిబ్బి ఉన్నదా ఏంది? ఏమో ఊకూకె పైసలు అడుగుతున్నవ్’’లో లిబ్బి అంటే ధనము, రాశి, నిధి అని! ఎండు చేపల్ని తెలంగాణలో ‘వట్టిచాపలు’గా వ్యవహరిస్తారు. యివి ‘వట్టు’ చేపలు. వట్టు అంటే ఇంకు, కృశించు అని. అంటే ఎండిపోయిన అని కదా! ‘‘ఈ పువ్వులు వల్లి పోయినై’’ లోని వల్లి పోవుడు ఏంది? అది వడలిపోవుడు. ‘వడలు’ క్రియ నుండి వర్ణ సమీకరణంలో వల్లు ఏర్పడుతుంది. పుష్పాదులు వాడిపోవడమే వడలడం– వల్లడం. కొన్ని సామాజిక వర్గాల్లో ‘వడుక లగ్గం’ అని అసలు లగ్గానికి ముందు చేస్తారు. ఈ వడుక వడుగు నుండి అడుగులు వేసింది. వడుగు అంటే బ్రహ్మచారి అని అర్థం. అతనికి చేసే ఉపనయనమే వడుక లగ్గం. ‘‘ఈ అంగిలాగులు ఒదలొదలు అయినై. సరింగ కుట్టలేదు’’ అనే వాక్యంలోని ఒదలు తెలుగులోని వదులు పదం నుండి వదలకుండా వచ్చింది. వదులు అంటే బిగువు తప్పడం, సడలడం, ఆంగ్లభాషలోని లూజ్‌గా వుండడం. ‘వరకు’ అనే దేశ్యపదానికి శబ్దరత్నాకరం ‘బంగారము లోనగువాని రేకు’ అని ఓ అర్థాన్ని వివరించింది. తెలంగాణలో మాత్రం పాలిథీన్ పేపర్ని వరకు కాయిదం అంటారు. వర్షానికి తడవకుండా వుండాలంటే అటువంటి వరకు కాగితాల్లో చుట్టచుట్టుకొని పెట్టుకునేవారు పూర్వం. బంగారు మొదలగువాని రేకులలో పాలిథీన్ పేపర్ రేకు కూడా ఒకటి అన్నమాట! పుస్తకాన్ని పూర్వం తెలంగాణలో ‘వయ్యి’ అనే వాళ్ళు. నిఘంటువులు ఈ ఉభయమూ దేశ్యమూ అయిన పదానికి లెక్క పుస్తకము, పుస్తకము, విధము మొదలైన అర్థాల్ని అందించాయి. ఈ వయ్యినే బెంగాలీలో ‘బయి’ అంటారు. ‘వహీ’ అంటారు మరాఠీలో. ఒరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో బయి అంటారు. తెలంగాణలో మాత్రం ‘పుస్తకము’ అనే పదం వయ్యిని మొత్తంగా మింగిపారేసింది. డాక్టర్ నలిమెల భాస్కర్ 9704374081 -
ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అంశంపై కడియం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న తెలుగు ప్రపంచ మహాసభల కంటే ముందుగానే తెలుగును అధికార భాషగా, 12వ తరగతి వరకు ప్రతీవిద్యార్థి తెలుగును ఒక సబ్జెక్టుగా చదివేలా రూపొందించాలని సూచించారు. ఆ విధానాన్ని ప్రపంచ మహాసభల్లో సీఎం కేసీఆర్ ప్రకటించేలా సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం స్పెషల్ ఆఫీసర్ దేశపతి శ్రీనివాస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నవంబర్ 15వ తేదీలోగా విధానాన్ని రూపొందించి, చట్టంలో తేవాల్సిన మార్పులపై ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు. విద్యా సంస్థలు, స్టేట్, సెంట్రల్, ఐసీఎస్ఈ సిలబస్, మీడియంతో సంబంధం లేకుండా 12వ తరగతి వరకు తెలుగును సబ్జెక్టుగా చదివేలా చట్టంలో మార్పులు చేస్తామని తెలిపారు. 2018 జూన్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, రాష్ట్ర సాంస్కృతిక, మీడియా సలహాదారు రమణాచారి, అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు వస్తేనే రాష్ట్రంలో ఉద్యోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగం కావాలంటే తెలుగు వచ్చి ఉండాలన్న నిబంధన పెట్టాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు భాషను కచ్చితంగా నేర్చుకోవాలనే నిబంధన పెట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో తన సూచనల మేరకే అక్కడి సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల ఉత్తర్వులు జారీచేశారని ఆయనను అభినందించారు. విజయవాడలో మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కేంద్ర ఉపరితల, జలరవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ఏడు జాతీయ రహదారులను జాతికి అంకితంచేసి.. ఆరు జాతీయ రహదారులు, కృష్ణా నదిపై అంతర్గత జలమార్గం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడారు. పాశ్చాత్య వ్యామోహంలో పడి మాతృభాషను తక్కువ చేయడం మంచిది కాదన్నారు. నదుల పరిరక్షణను జాతీయ ఉద్యమంగా చేపట్టాలని.. లేని పక్షంలో చరిత్ర క్షమించదన్నారు. రాష్ట్రంలో కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల్లో నీళ్లు లేవని.. ఇసుక ఏమవుతోందో అందరికీ తెలుసనని వెంకయ్యనాయుడు చురకలు అంటించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించవచ్చునన్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం భారీఎత్తున డ్రిప్, స్పింక్లర్ విధానాన్ని అమలుచేస్తున్నామని చెప్పారు. -
వెలుగుతున్న తెలుగు
సెల్ఫ్ చెక్ తెలుగు వాళ్లే తెలుగు భాషను మాట్లాడడం లేదని బాధపడుతుంటాం. కాని తెలుగు భాష తేజస్సుతో వెలుగుతూనే ఉంది. ప్రపంచీకరణ ప్రవాహంలో కొట్టుకుపోకుండా తెలుగు పదాల్లో దాగిన పొందికే దానిని నిలబెడుతోంది. 1. మనదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది మూడవస్థానం. ఎ. అవును బి. కాదు 2. ఏడు కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడుతున్నారు. ఎ. అవును బి. కాదు 3. మొదటి రెండు స్థానాల్లో హిందీ, బెంగాలీ ఉన్నాయని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 4. ప్రపంచ భాషల జాబితాలో మనది 15వ స్థానం. ఎ. అవును బి. కాదు 5. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, బహ్రెయిన్, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఇంగ్లండ్, ఫిజి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాలకు రెండు– మూడు తరాల క్రితం వలస వెళ్లిన కుటుంబాలు ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుతున్నాయి. ఎ. అవును బి. కాదు 6. శాతవాహనకాలంలో రాజులు అధికారులు ప్రాకృత భాషను మాట్లాడుతున్నప్పటికీ సామాన్యులు తెలుగునే మాట్లాడేవాళ్లు. ఎ. అవును బి. కాదు 7. రేనాటి చోళులు పూర్తిగా తెలుగులో వేసిన శాసనం కడపజిల్లా ఎర్రగుడిపాడులో దొరికింది. ఎ. అవును బి. కాదు 8. ప్రాచీన భాష హోదా కోసం చేసిన ప్రయత్నం 2008 అక్టోబర్ 31వ తేదీన ఫలించిందని మీకు గుర్తుంది. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఎక్కువ వస్తే మీకు మన భాష మీద గౌరవం, మూలాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువే అనాలి. ‘బి’ లు ఎక్కువైతే... ఒకసారి తెలుగుభాష మీద ధ్యాస పెట్టండి ప్లీజ్. -
తెలుగు భాష పరిరక్షణకు కృషి
► సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు విశాఖ–కల్చరల్ : తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు పిలుపునిచ్చారు. గురుద్వార్ జంక్షన్ సమీప శాంతినగర్‌లోని పరవస్తు పద్య పీఠం కార్యాలయంలో ఆదివారం ‘తెలుగు భాష–రక్షణ’ అనే అంశంపై ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. చాలా మందికి తెలుగు మాధ్యమాల్లో చదివితే మంచి ఉద్యోగాలు రావన్న అపోహ ఉందన్నారు. మాతృభాషలో పట్టు సాధిస్తే ఎన్ని భాషలైనా సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు. కమ్మనైన అమ్మభాషను మనమే చులకన చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన హోదా కోసం పట్టుబట్టిన మనమే.. అది దక్కాక బోధన భాషగా కూడా పనికి రాదనడంలో అర్ధముందా? అని ప్రశ్నించారు. తెలుగు వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు భాగస్వామ్యులై ఉద్యమించాలన్నారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేతి డాక్టర్ సూరపనేని విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, కళల పరిరక్షణ, అధ్యయనమే ధ్యేయంగా తెలుగు భాష ఖ్యాతిని ఇనుముడింపజేయాలన్న లక్ష్యంతో నిఘంటువును రూపొందిస్తున్నామన్నారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఠం అధ్యక్షుడు సూరి, తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ తెలుగులోనే ప్రవేశ పెట్టాలి
-
కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట!
తన కథను ఆంగ్లంలో చదివి వినిపించిన రాజిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన యువ సాహితీ–ది న్యూ హార్వెస్ట్ కార్యక్ర మంలో యువ రచయిత, ‘సాక్షి’ సాహిత్య పేజీ ఇన్చార్జి పూడూరి రాజిరెడ్డి తాను రాసిన కథను ఆంగ్లంలో వినిపించారు. 40 ఏళ్లలోపు వయసు గల రచయితలను ప్రోత్స హించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు తెలుగు భాష నుంచి పూడూరి రాజిరెడ్డికి ఆహ్వానం లభించింది. ఇలా 24 భాషలకు సంబంధిం చిన యువ రచయితలకు ఆహ్వానం రాగా వారు వారి ప్రచురణలను ఆంగ్లంలో చదివి వినిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపురానికి చెందిన పూడూరి రాజిరెడ్డి 2009లో ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ శీర్షికతో రాసిన కథ ‘సాక్షి’ ఫన్డే మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఈ కథను రాజిరెడ్డి ఎంచుకుని యువ సాహితీ కార్యక్రమంలో ఆంగ్లంలో ‘హీరో ఆఫ్ నాన్ స్టోరీ’ శీర్షికన చదివి వినిపించారు. ఈ కథలో కథానాయకుడు మల్లయ్య జీవితంలో నాటకీయతను చొప్పించకుండా మల్లయ్యకు ఉన్న తనదైన అస్తిత్వం, ఉనికిని కాపాడుతూ కథనం సాగుతుంది. మనిషిని మనిషిగా గుర్తించకుండా నాటకీయ తను చొప్పించే ప్రయత్నాలను వ్యంగ్యంగా చిత్రిస్తూ సాగుతుందీ కథనం. -
బాబు ప్రభుత్వం తెలుగు భాషకు ద్రోహం చేస్తోంది
-
తెలుగు భాష కోసం ఉద్యమిస్తాం
-
ఒకే సెల్ఫోన్లో రెండు సిమ్‌లు
ఏపీ, తెలంగాణలపై మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్య రాజాం: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఒకే సెల్ఫోన్లో రెండు సిమ్‌లు లాంటివని మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాల గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యా నించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో తెలుగుభాషను కాపాడుకోవాలన్నారు. 12వ తరగతి వరకూ తెలుగు భాషలోనే పాఠ్యాంశాలను బోధిస్తే బాగుంటుందని ఆయన ప్రభుత్వాలకు సూచించారు. మాధ్యమిక స్థాయి వరకూ తెలుగులో బోధన చేస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావ్యవస్థలోనూ, సమాజంలోనూ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జీఎంఆర్‌ఐటీ విద్యార్థులు ప్రపంచం చెప్పుకునేలా శాటిలైట్‌ను ప్రయోగిం చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ విద్యాసంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
మాతృభాషకు మరణ శాసనం
రెండో మాట అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిందని పరమానంద భరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫలమైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌరవించాలి. ‘ప్రపంచ భాషల పాలపుంతలో ప్రతి అక్షరమూ, ప్రతి పదమూ ఒక నక్షత్రమే. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించిపోతున్న వందలాది భాషల సంరక్షణ, ఉద్ధరణ ఉమ్మడి బాధ్యతగా అందరూ భావించవలసిన తరుణం వచ్చింది.’ – ఐక్య రాజ్యసమితి విద్యా సాంస్కృతిక మండలి ఆదేశం ప్రభుత్వ మునిసిపల్ పాఠశాలలన్నింటిలోనూ తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నం. 14 ఉత్తర్వును జారీ చేసింది. ఒక్క 2016–17 విద్యా సంవత్సరంలో పదవ తరగతికి మాత్రం ఈ జీవో వర్తించదు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్టు, ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమానికి చీడపీడలు పట్టించడానికి రెండు తెలుగు రాష్ట్రాల పాలకులూ కారకులు కావడమే విషాదం. మన మాతృభాషతో ఉన్న మాధ్యమాన్ని నవనవంగా పెంచుకుంటూ, వాక్కును నిత్య వాడకంలో సునిశితం చేసుకుంటూ తెలుగును అభివృద్ధి చేసి, పరిరక్షించవలసిన వాస్త వాన్ని వారు నిర్దాక్షిణ్యంగా నిరాకరిస్తున్నారు. ప్రపంచీకరణ మత్తు ఐక్య రాజ్యసమితి సకాలంలో చేసిన హెచ్చరికలను కొందరు పాలకులు పట్టిం చుకోకపోవడానికి కారణం ఉంది. మార్కెట్ దోపిడీ ఆర్థిక వ్యవస్థకు ఆంగ్లో– అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థలు తెర తీసి, వర్ధమాన దేశాలను ప్రపంచీకరణ మత్తులోకి దించడంతో పలు సమూహాల మాతృభాషల మీద ఇంగ్లిష్ పెత్తనం తీవ్రమైంది. వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్న స్థానిక భాషల మనుగడ ప్రశ్నార్థకం కావడం దాని ఫలితమే. విస్తృత ప్రపంచీకరణ నేప థ్యంలో ఆంగ్ల మాధ్యమం ఎంత వి«ధ్వంసానికి కారణమవుతున్నదో ప్రపంచ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే, విశ్లేషణల వల్ల సులభంగానే అవగతమవు తోంది. వివిధ దేశాలకు చెందిన 600 మాతృభాషల వృద్ధిక్షయాల గురించి చేసిన విస్తృత అధ్యయనమది. మాతృభాషకు ఆఫ్రికా ఖండమే జన్మనిచ్చిం దని కూడా వారు నిర్ధారించారు. ఆ ఖండంలో రాతియుగం నాటి ప్రజలు వాడిన మాండలీకం కూడా అదేనని కనుగొన్నారు. ఆ భాషకు కనీసం లక్ష ఏళ్ల క్రితం లిపి ఏర్పడి ఉంటుందని మొదట భావించినా, నిజానికి అది మరింత పురాతనమైనదేనని తేల్చారు. అయితే భాషలు దేనికవే వివిధ ఖండాలలో స్వతంత్రంగా కూడా స్థిరపడ్డాయి. 70 వేల సంవత్సరాల నాడే ఆఫ్రికా ఖండం నుంచి మిగిలిన భూభాగాలకు వలసలు జరిగాయనీ, అయితే అన్ని ప్రపంచ భాషలూ ఏకైక పురాతన భాష నుంచి జాలువారినవేనని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంతోనే దేశీయ భాషల మనుగడను ఆంగ్లం హరించివేయడాన్ని ఎవరూ సమ్మతించలేకపోతున్నారు. ఇప్పుడు జనాభా రీత్యా చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశం. అయినా పురాతన చరిత్ర కలిగిన పలు భాషలకు మంగళం పాడిన ఆంగ్లం సహా, ఇతర దేశీయ భాషల మీద చైనీస్ (మండారిన్) ఆధిపత్యం చలాయిం చజాలదు. కానీ ఇంగ్లిష్ మాదిరిగానే వ్యాపార, వలస భాష కాగలదు. ఈ తెలివిడితోనే అమెరికా, బ్రిటన్, జర్మనీలు చైనీస్‌ను శరవేగంగా నేర్పడానికి ఐదేసి వందల పాఠశాలలను ప్రారంభించిన సంగతిని విస్మరించరాదు. ఏ దేశమైనా ఆర్థికంగా బలోపేతమై దూసుకువచ్చినా, ఆ దేశ భాష మన దేశీయ మాతృభాషల స్థానాన్ని తొలగించి నిలబడలేదు. కాగా ఈ చారిత్రక సత్యాన్ని దేశీయ భాషలు మాట్లాడే ప్రాంతాలు త్వరగా గుర్తిస్తే మంచిది. పూర్తిగా పరాయి భాషను నెత్తిన పెట్టుకుని మాతృభాష మూలాలకు ఏ రీతిలో చేటు చేస్తున్నామో అప్పుడే అర్థమవుతుంది. ఆ మూలాలకు చేటు కలగని వ్యూహ రచనలో మాతృ ప్రతిపత్తిపైన సాధికారతను పునఃప్రతిష్టించుకోవాలి. అంతా ఇంగ్లిష్‌లోనే ఉందట మార్కెట్ లేదా సంత రాజకీయాలతో తమ ఆర్థిక గుత్తాధిపత్యాన్ని విస్తరిం చుకోవడానికి ఆంగ్లో–అమెరికన్లు ప్రపంచీకరణ ద్వారా వర్ధమాన దేశాల గ్రామసీమలను తమ సరుకులతో నింపడానికి ఇంగ్లిష్ మాధ్యమం ద్వారానే ‘వల’పన్నవలసి ఉంటుంది. మన చేతలను కట్టడి చేసి, మన బుద్ధులను శాసిస్తూ, మన దుస్తులను మార్చేసే సూత్రం మెకాలే విద్యా విధానం ద్వారా తెల్లవాడు ప్రవేశపెట్టాడు. అందుకే, ‘మన దుస్తులకూ, మన అలవాట్లకూ, మన తిండికీ అలవాటు పడిన భారతీయుడు మనకు శాశ్వతంగా లొంగి ఉంటాడు’ అంటూ మెకాలే ప్రకటించగలిగాడు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ఇప్పుడు మళ్లీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో కూడా ప్రవేశపెట్టడా నికి చెబుతున్న కారణం కూడా చిత్రంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ నిర్ణయం కొద్దిమంది విద్యార్థుల కోసమే గానీ, అసంఖ్యాక గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కాదు. ‘విద్యార్థులు, ఉపాధ్యా యులు, సాధారణ ప్రజానీకం యావత్తూ ఆంగ్ల మాధ్యమాన్నే ఉత్సాహంగా సమర్థిస్తున్నారు. అన్ని మునిసిపల్ పాఠశాలల్లోను విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సును విధిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని తల్లితండ్రులు, ఉపా ధ్యాయులు కోరుకోవడం వల్ల ఆ మాధ్యమాన్ని ప్రవేశపెట్ట వలసి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దిద్దడంలో ఆంగ్ల బోధనా మాధ్యమం అత్యంత కీలక పాత్ర వహిస్తుంద’ని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా జీవో (ఎంఎస్ నం.14)లో నిస్సిగ్గుగా ప్రకటించారు. మాతృభాషా రక్షణ ధ్యేయంతో అంతకు ముందు తీసుకువచ్చిన జీవో 86 దీనితో అటకె క్కింది. ఈ అనాలోచిత నిర్ణయం వెనుక చంద్రబాబుతో పాటు అసంఖ్యాక విద్యా సంస్థల సూత్రధారి కూడా ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. గతంలో ప్రాథమిక విద్య అన్ని దశలలోను, ప్రభుత్వ సంస్థలపైన త్రిభాషా సూత్రం మేరకే నామఫలకాలన్నీ (మొదట మాతృభాష, తరువాత హిందీ, ఆంగ్లం) ఉండేవి. ఇక ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలోను విద్య, భాష లకు సంబంధించి సరైన విధానం లేదని స్పష్టమవుతోంది. అసలు తెలుగు మాధ్యమంలో చదివేవారికి ఇంగ్లిష్ రాదని అనుకోవడం తెలివి తక్కువతనం. మాతరమంతా ఆంగ్లాంధ్రాలు రెండూ వచ్చినవారే. వీరిలో బహు భాషా వేత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాత్రం పోటీ పరీక్షలకు తయారుచేసే మిడిమిడి భట్టీయ జ్ఞానంతోనే తృప్తిపడుతున్నారు. ఇప్పుడు పోటీ పరీక్షలకు విద్యార్థుల్ని ‘రాపిడి’ పెట్టే లక్ష్యంతో తెలుగు మీడియంకే ఎసరు పెడు తున్నారు. తెలుగు మీడియం రద్దు నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలూ, మేధావులూ వ్యతిరేకించడం అందుకే. ఈ దేశంలో పార్లమెంటు తోగానీ, ఉన్నతాధికార గణాలతోగానీ, సంబంధిత సంస్థాగత నిపుణులతో గానీ నిమిత్తం లేకుండా నియంతలాగా సొంత నిర్ణయాలు తీసుకుని ఒక నాయకుడు తేరుకోలేని గందరగోళం మధ్య రకరకాల దారులు తొక్కుతుం డగా, మరొక రాష్ట్ర పాలకుడు ‘సహవాస దోషంతో’ నిరంకుశుడిగా ప్రజా మోదం లేని, చర్చకు ఆస్కారం లేని నిర్ణయాలతో ముందుకు సాగుతూం డటం దేశానికీ, రాష్ట్రాలకే అనర్థం. ప్రపంచీకరణ విధానాలను, ప్రజా వ్యతిరేక సంస్కరణలను పాలకులు బేషరతుగా నెత్తి కెక్కించుకున్న తరువాతనే స్థానిక పోటీ పరీక్షలలోనూ, కేంద్ర స్థాయి సివిల్ పబ్లిక్ పరీక్షలలోనూ మాతృ భాష లలో జవాబులు రాసే, రాయించే అవకాశాలను లేకుండా చేశారు, లేదా జీవశక్తిని పిండివేశారు. కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో, పారిశ్రామిక సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత 30 సంవత్సరాలుగా సెలక్షన్ కమిషన్ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రాలలో ఒకటైనప్పటికీ, హిందీ తర్వాత తెలుగు భాష రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ ఈ నియా మకాల్లో ఆంధ్రుల సంఖ్య కేవలం ఒక్కశాతం. పై సంస్థల్లోనేకాక, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఇతర ప్రభుత్వ సంస్థల్లోనూ, సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్ జీసీ, ఇండియన్ ఎయిర్‌లైన్స్, భారత్ సంచార్ నిగమ్ వగైరాలలో కేంద్ర సెలక్షన్ కమిషన్ అభ్యర్థుల నియామకాలు చేస్తుంది. కానీ అందుకు జరిపే పరీక్షల్ని హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితం చేయడంవల్ల హిందీయేతర భాషా రాష్ట్రాల ప్రజలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ప్రధానమంత్రులూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పట్టించుకోవడం లేదు. పరాయి భాష తురాయి కాదు అసలు విషయం–తెలుగు భాషకు ఎట్టకేలకు విశిష్ట భాషా ప్రతిపత్తి దక్కిం దని పరమానందభరితులమవుతున్న సందర్భంలో, మద్రాసు హైకోర్టులో ఒక తమిళుడు మన భాషా ప్రతిపత్తికి అడ్డుతగలడానికి ప్రయత్నించి విఫల మైనందుకు సంతోషిస్తున్న సమయంలో కూడా మనం విశ్రమించలేక పోతున్నాం. ఎందుకంటే, ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణల కత్తుల బోనులో ‘ప్రభుత్వం’ అనే శక్తి చిక్కుబడిపోయింది. ఫలితంగా తెలుగువాడి శ్వాసనూ, భాష ఎదుగుదలనూ విద్యాసంస్థల్లో దాని పురోగతినీ తెలుగు ఏలి కలే అడ్డుకొంటున్నారు. మాతృభాషను పెంచుకోవాలి, అన్యభాషల్ని గౌర వించాలి. ఏ మీడియంలో చదువుకోవాలో తేల్చవలసింది పాలకులూ తల్లిదం డ్రులూ కాదు, విద్యార్థులే. ఇక్కడొక సంగతి. ప్రసిద్ధ నటుడు బల్రాజ్ సాహనీ (పంజాబీ) విశ్వకవి రవీంద్రుణ్ణి ఉడికించడం కోసం సంభాషణకు దిగాడు: టాగూర్ అడిగారు, ‘ఇంతకీ నీదేభాష?’ ‘పంజాబీయేగానీ, అందులో చెప్పు కోదగిన సొగసు లేదు. అందుకనే ఇంగ్లిష్ రాస్తాను’ అన్నాడు బల్రాజ్. ‘నీవు పంజాబీని కించపరుస్తావా? గురునానక్ లాంటి మహాకవిని, గ్రంథకర్తను పంజాబీ భాషా సౌందర్యానికి హారతులందించిన విశిష్ట వ్యక్తిని కాదంటావా? తప్పు తప్పు. ఎంత ఇంగ్లిష్‌లో రాసినా నీది పంజాబీ మాధుర్యం సోకగల రచన కాదు. నా రచనలన్నీ మొదట బెంగాలీలోనేగానీ, ఇంగ్లిష్‌లో కాదు. నేను బెంగాలీ నుంచే ఇతర భాషల వారి కోసం ఇంగ్లిష్‌లో చేస్తానేగానీ.. ఎంత లేదన్నా తల్లిభాష తల్లిభాషే, పరాయి భాష ఎంత తురాయి కట్టుకున్నా పరా యిదే సుమా!’’ అన్నాడు విశ్వకవి. సీనియర్ సంపాదకులు, ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'
హైదరాబాద్: త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సకల హంగులతో కూడిన టీ-హబ్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. టీ వ్యాలెట్‌లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ వారంలోనే టీ-వ్యాలెట్ లోగోను ఆవిష్కరింపజేస్తామన్నారు. టీ-వ్యాలెట్ వినియోగానికి ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని చెప్పారు. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్‌సెంటర్ ద్వారా టీ-వాలెట్ సేవలు పొందవచ్చన్నారు. ఫోన్ లేకుండా కూడా టీ-వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. -
తెలుగు భాష వికాసం
తెలుగు భాషను తెనుగు, త్రిలింగం, ఆంధ్రం అని వ్యవహరిస్తారు. తెలుగు పదం ఆవిర్భావంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తెలుగు నేలపై శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం క్షేత్రాలున్నాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని కూడా పిలుస్తారు. ఈ త్రిలింగం నుంచే తెనుగు పదం పుట్టిందనేది కొందరి వాదన. తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు భాషను పలువురు కింది విధంగా కీర్తించారు. తెలుగు భాషా చరిత్రను సాహిత్యకారులు మూడు భాగాలుగా విభజించారు. అవి.. 1.ప్రాకృత భాష ప్రభావం - శాతవాహనుల కాలం నుంచి క్రీ.శ.11వ శతాబ్దం వరకు ఉంది. 2.సంస్కృత భాష ప్రభావం - క్రీ.శ. 11వ శతాబ్దం నుంచి క్రీ.శ.19వ శతాబ్దం వరకు ఉంది. 3.పాశ్చాత్య ప్రభావం - క్రీ.శ.19వ శతాబ్దం నుంచి. తెలుగు భాష ఆవిర్భావానికి సంబంధించి సాహిత్యకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రాకృత, సంస్కృత భాషల నుంచి తెలుగు భాష ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అయితే అత్యధిక మంది భాషావేత్తలు మాత్రం ద్రావిడ భాషా కుటుంబం నుంచి తెలుగు ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు, ఆంధ్ర పదాల మధ్య విడదీయలేని బంధం ఉంది. క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు (శాతవాహనుల కాలంలో) ప్రాకృత భాషనే రాజ భాషగా పరిగణించారు. శాతవాహన రాజుల్లో 17వవాడైన హాలుడు గాథాసప్తశతిని ప్రాకృతంలో రచించాడు. శాసనాల్లో తెలుగు భాష క్రీ.శ.6వ శతాబ్దం నుంచి క్రీ.శ.8వ శతాబ్దం వరకు వేయించిన శాసనాల్లోని తెలుగు భాష చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం క్రీ.శ.575లో రేనాటి చోడులు వేయించిన ధనుంజయని కలమళ్ల శాసనం. ఇది తెలుగు శాసనాల్లో అత్యంత ప్రాచీనమైంది. ఇందులోని పద్య రచన ప్రాథమిక రూపంలో కనిపిస్తుంది. వీరి కాలంలో సుమారు 33 శాసనాలు వచనంలో ఉన్నాయి. తూర్పు చాళుక్య రాజుల శాసనాల్లో తెలుగు వచనం కనిపించిన మొదటి శాసనం మొదటి జయసింహ వల్లభుని శాసనం (క్రీ.శ.641-673), కాగా రెండోది మంగిరాజు శాసనం (క్రీ.శ.682-706). వీరి తర్వాత చాళుక్య రాజులైన మూడో విష్ణువర్ధనుడు, గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, యుద్ధమల్లుడు, విమలాదిత్యుడు, రాజరాజనరేంద్రుడు వేయించిన తెలుగు శాసనాలు కూడా లభ్యమయ్యాయి. అయితే వాటిలో ప్రాకృత, సంస్కృత పదాలు అధికంగా కనిపిస్తాయి. అనంతర కాలానికి చెందిన అద్దంకి, ధర్మవరం, బెజవాడ, సామలూరు శాసనాల్లో వచనం, పద్యం కలిసి (మిశ్రమంగా) కన్పిస్తాయి. తొలి కాలానికి చెందిన శాసనాల్లో సంస్కృత తత్సమాలు, దీర్ఘ సమాసాలు ఉండగా, తర్వాతి కాలం శాసనా ల్లో దేశీయ పదాలు, మాండలికాలు అధికంగా ఉన్నాయి. రెండో దశకు చెందిన శాసనాల్లో ప్రాకృత, సంస్కృత ప్రభావం తగ్గింది. 9వ శతాబ్దం నాటి చాళుక్య భీముని కొరవి శాసనంలో తెలుగు లిఖిత సాహిత్యం కనిపిస్తుంది.గుణగ విజయాదిత్యుని సేనాని పంటరంగడు వేయించిన అద్దంకి శాసనంలో తరువోజ పద్యం కన్పించింది. పల్లెపాటలు, స్త్రీల పాటలు, దంపుడు పాటలు వంటివి తరువోజ ఛందస్సులోనే ఉన్నాయి. దీన్నుంచే ద్విపద (రెండు వరుసలు) పుట్టిందని ఆరుద్ర పేర్కొన్నారు. తరువోజ, ద్విపద, మధ్యాక్కర, సీసం వంటి వాటిని దేశీ ఛందస్సులుగా గుర్తించారు. గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో సీస పద్యం, ధర్మవరం శాసనంలో ఆటవెలది, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కర (సంస్కృతేతర) పద్యాలు కన్పిస్తాయి. తెలుగు సాహిత్యాభివృద్ధి - నన్నయ యుగం తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుని కాలంలో నారాయణ భట్టు సహకారంతో నన్నయ భట్టు వ్యాసుని సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. అనువాద ప్రక్రియ ఈ యుగం నుంచే ప్రారంభమైంది. ఆది, సభా పర్వాలతోపాటు అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని నన్నయ తెలుగులోకి అనువదించాడు. నన్నయ మరణానంతరం సుమారు 200 ఏళ్ల తర్వాత తిక్కన.. మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు. నన్నయ అసంపూర్తిగా వదిలిపెట్టిన అరణ్య పర్వాన్ని తిక్కన పూర్తి చేయలేదు. తిక్కన, నిర్వచనోత్తర రామాయణంను తెలుగు వచనంలో రచించాడు. ఇతనికి కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు వంటి బిరుదులున్నాయి. ఎర్రాప్రగడ ఇతడు క్రీ.శ.14వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ అసంపూర్తిగా రచించిన అరణ్య పర్వాన్ని ఎర్రాప్రగడ (ఎర్రన) పూర్తి చేశాడు. అలాగే హరివంశం, నృసింహ పురాణం వంటి ప్రబంధ కావ్యాలను రచించాడు. ప్రబంధ కావ్యాల మొదటి రచయితగా పేరుగాంచాడు. అందుకే ఇతడికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.సంస్కృత మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు తెలుగులోకి అనువదించి ‘కవిత్రయం’గా ప్రసిద్ధి చెందారు.వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి (కాకతీయ ప్రతాపరుద్రుడి కాలం నాటివాడు) రంగనాథ రామాయణం (ద్విపద) పేరుతో తెలుగులో రచించాడు. అదేవిధంగా మంత్రి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రాశాడు. నన్నయకు సమకాలికుడైన నన్నెచోడుడు కళ్యాణీ చాళుక్యుల సామంతుడు. ఒక చిన్న మండలాన్ని ఏలిన ఈ తెలుగు చోడ కవి యోధుడు కూడా. నన్నెచోడుడు ఒక యుద్ధంలో మరణించాడు. ఇతడు నన్నయకు పూర్వం వాడని కొందరి వాదన. ఇతడు కుమార సంభవం అనే వర్ణనాత్మక కావ్యం రచించి కవిరాజశిఖామణిగా పేరొందాడు.శైవమత కవైన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. ఇతని రచనల్లో మధురమైన పద చిత్రాలు, వర్ణనలు ఉంటాయి.నన్నెచోడుడు ఆ కాలంలో వాడుకలో ఉన్న దేశీయ పదాలు, దేశీయ ఛందస్సును అధికంగా ఉపయోగించాడు. అందువల్లే ఇతడు జాను తెనుగు రచయితగా పేరుగాంచాడు. మల్లికార్జున పండితారాధ్యుడు శివ భక్తుడు. శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగు శతక వాఙ్మయానికి ఒరవడి తీసుకొచ్చిన మరో శైవ కవైన యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంరచించాడు. ఆంధ్ర దేశంలో వీరశైవ మతాన్ని బాగా ప్రచారం చేసినవారిలో మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు ప్రసిద్ధులు. పాల్కురికి సోమనాథుడు తన కావ్యాలను దేశీ ఛందస్సు అయిన ద్విపదలో రచించాడు. వీర శైవ మత స్థాపకుడైన బసవడు ఇతని గురువు.పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకం, బసవ పురాణం (బసవేశ్వరుని జీవితం), పండితారాధ్య చరిత్రలను జాన తెలుగులోకి (ద్విపదలో) రచించాడు. అందువల్లే ఇతణ్ని ద్విపద సాహిత్య పితామహుడిగా పేర్కొంటారు. బసవ పురాణాన్ని వీర శైవమత గ్రంథంగా పరిగణిస్తారు.సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక తరహా జానపద గేయాలు, తుమ్మెద పదాలు, నివాళి పదాలు, వెన్నెల, గొబ్బి పదాలు, దంపుడు పాటలు, యక్షగానాలను పేర్కొన్నాడు. పల్లె పాటలు, జానపద నృత్యాలు, దేశీ నృత్యాల గురించి పండితారాధ్య చరిత్రలో వర్ణించాడు. శరీనాథుడు, పోతన తెలుగు సాహిత్యంలో తొలి కవిసార్వభౌముడుగా శ్రీనాథుడు ప్రసిద్ధి చెందాడు. ఇతడు సంస్కృత, తెలుగు భాషల్లో నిష్ణాతుడు. రెడ్డి రాజుల కాలంలో విద్యాధికారిగా నియమితుడయ్యాడు. సంస్కృత సాహిత్య గోష్టిలో విజయనగర రాయల ఆస్థాన కవుల్లో ఒకడైన డిండిమ భట్టును ఓడించి కవిసార్వభౌముడనే బిరుదు పొందాడు. శ్రీహర్షుడు సంస్కృత భాషలో రచించిన శృంగారనైషధ గ్రంథాన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు. కాశీ ఖండం, భీమేశ్వర పురాణం, హరివంశం, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం వంటి గ్రంథాలను తెలుగులో రచించాడు. క్రీడాభిరామం ఒక వీధి నాటకం. ఇది ఆనాటి సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది. బమ్మెర పోతన (క్రీ.శ.1450-1510) మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్రుల అభిమాన కవిగా మారాడు. తెలుగు సాహిత్యంలో ఆంధ్ర మహాభాగవతం గ్రంథం అపూర్వమైంది. ఇందులో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను సామాన్య ప్రజలు కూడా ఉటంకిస్తారు. పోతన, శ్రీనాథుని బావమరిది అని కొందరి అభిప్రాయం. పోతన రాజాస్థానాలను ఆశ్రయించలేదు. భాగవత గ్రంథాన్ని ఏ రాజుకీ అంకితమివ్వలేదు. ఇతడు వీరభద్ర విజయం, భోగినీ దండకం అనే గ్రంథాలను కూడా రచించాడు. ఈ కాలంలోనే గౌరన ద్విపదలో హరిశ్చంద్రోపాఖ్యానం, పినవీరభద్రుడు శృంగార శాకుంతల నాటకాన్ని తెలుగులో రచించారు.గోల్కొండనేలిన కుతుబ్‌షాహీలు తెలుగు సాహిత్యాన్ని పోషించారు.ఇబ్రహీం కుతుబ్‌షా.. కందుకూరు రుద్రయ్యను పోషించాడు. ఇతడు జనార్దనాష్టకం, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం గ్రంథాలనుతెలుగులో రచించాడు.ఈ కాలంలోనే పొన్నగంటి తెలగనార్యుడు అచ్చతెలుగులో యయాతి చరిత్ర రచించాడు.కంచెర్ల గోపన్న (రామదాసు) దాశరథీ శతకాన్ని రచించాడు.మల్లారెడ్డి.. పద్మ పురాణం రాశాడు. -
ఇక అన్ని దుకాణాల పేర్లు తెలుగులోనే!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని దుకాణాల పేర్లన్నీ ఇక తెలుగులోనే ఏర్పాటు చేయాలంటూ జీవో జారీ అయింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రతిచోట అన్ని దుకాణాల శిలాఫలకాలపై ఆంగ్ల భాష అక్షరాలే ఎక్కువగా దర్శనమిచ్చేవి. తెలుగు భాష అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇకపై దుకాణాల శిలాఫలకాలపై తెలుగు అక్షరాలే ఉండేలా చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే తెలుగు భాష అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై అన్ని దుకాణాల శిలాఫలకాలు తెలుగులోనే దర్శనమివ్వనున్నాయి. -
తిరుపతి నుంచే ఉద్యమం
– తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘ఆవేదన దీక్ష’ – సబ్‌కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టిన యార్లగడ్డ – మద్దతు పలికిన ప్రజాసంఘాలు, కవులు, రచయితలు, కళాశాలలు తిరుపతి: తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం మళ్లీ మొదలైంది. ఇందుకు తిరుపతి వేదికైంది. తెలుగు భాషా వికాసం కోసం అవిరళ కృషి సల్పిన గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటోన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై నిరసలు పెల్లుబుకుతున్నాయి. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా భాష గురించి పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన భాషా కోవిదులు, సాహితీవేత్తలు భాషా పరిరక్షణ కోసం ఉద్యమమే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చారు. సోమవారం తిరుపతి సబ్‌కలెక్టరేట్ ఎదుట ‘తెలుగు ఆవేదన దీక్ష’ పేరిట పలువురు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. తెలుగు భాషా పరిరక్షణ నేత, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన దీక్షను ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా జరిపే ఉద్యమానికి తిరుపతి నుంచే శ్రీకారం చుట్టారు. హామీలను గాలికొదిలిన సర్కారు... 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు గుప్పించింది. ఒకటి నుంచి ఇంటర్ వరకూ రెండో భాషగా తెలుగును తప్పనిసరి చేస్తామనీ, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామనీ, తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు, తెలుగు భాషా పీఠం ఏర్పాటు వంటి 20కి పైగా హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రెండేళ్లు గడిచినా వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. పైగా అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలోనూ శిలాఫలకాలను ఆంగ్లంలో సిద్ధం చేశారు. దీంతో రాష్టంలోని తెలుగు భాషాభిమానులకు రక్తం ఉడికింది. వెంటనే తెలుగులో శిలాఫలకాలను తయారు చేయించి సీఆర్డీఏ అధికారులకు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధి కోసం చేసేదేమీ లేదన్న విషయాన్ని అర్థం గుర్తించిన వీరు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటమే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముందుకొచ్చారు. తిరుపతిలో ఆవేదన దీక్ష నిర్వహించిన తరువాత జిల్లాల వారీగా పర్యటనలు జరిపి భాషాభిమానులను చైతన్యవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు కూడా ఇందుకు మద్దతు పలికారు. తిరుపతిలోని రాయలసీమ, చైతన్య కాలేజీలతో పాటు పలు స్వచ్చంద సంస్థలు, అభ్యుదయ రచయితల సంఘం, తెలుగు భాషోద్యమ సమితి నిర్వాహకులు, ఎక్స్ టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా బాసటగా నిలిచారు. తెలుగు భాషను పరిరక్షించుకుంటామని సామూహికంగా శపథం చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరం కాపాడాలి... ప్రభుత్వ ప్రకటించిన విధంగా విద్యా రంగంలో, పరిపాలనా రంగంలో తెలుగు అమలు చేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ప్రభుత్వ పరంగా తెలుగు భాష మనుగడ వికాసం కోసం చేయాల్సిన కార్యకలాపాలు తక్షణం చేపట్టాలి. మాతృభాష అయిన తెలుగు భాష పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం బాధాకరం. తెలుగు భాష దెబ్బతింటే భాష చుట్టూ పెనవేసుకున్న జాతి, సంస్కృతి, సాహిత్యం, కళలు, ఆచారాల మనుగడకు ప్రమాదమే. –– గంగవరం శ్రీదేవి, తెలుగు భాషోద్యమ సమతి అధ్యక్షురాలు. భాషా వికాసంతోనే మాతృభాష పరిరక్షణ భాషా వికాసంతోనే మాతృభాష పరిరక్షణ సాధ్యం. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష నిరీర్యం అయ్యే పరిస్థితి కలగడం దౌర్భాగ్యం. ఆయా రాష్ట్రాలు తమ మాతృభాషాభివృద్దికి విశేష కృషి చేస్తుంటే ఇక్కడ పాలకులు నిర్లక్ష్యం చేయడం అమానుషం. కనుమరగుతున్న మాతృభాష వికాసం కోసం ప్రభుత్వం తక్షణం స్పందించాలి. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలి. తెలుగు మాద్యంలో చదివిన వారికి 5 శాతం మార్కులు అదనంగా ఇవ్వాలి. గాంధీ మొదలు, గిడుగు వరకు వారి మాతృభాషను భాగా నేర్చుకున్నారు కాబట్టే ఆంగ్లం ఇతర భాషలు భాగా నేర్చుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు అమలు చేయాలి. –పేరూరు బాలసుబ్రమణ్యం, రచయిత ప్రాచీన పీఠాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి మైసూరులోనున్న ప్రాచీన తెలుగు భాషా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో వారి భాషా మాద్యం చదివి వారికి ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించి వారి మాతృభాషను పరిరక్షిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో సైతం తెలుగు మాద్యం చదివిన వారికి ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి. అధికార భాషా సంఘానికి అధికారాలు, నిధులు పెంచాలి. ప్రత్యేకంగా తెలుగు భాషామంత్రిత్వ శాఖాను నియమించాలి. – శ్రీమన్నారాయణ, అధ్యాపకుడు. -
'తెలుగుపై ప్రభుత్వానికి చిన్నచూపు'
విశాఖపట్నం : భవిష్యత్తులో తెలుగు భాషను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి రానుందని లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మంగళవారం విశాఖపట్నంలో పోలవరపు కోటేశ్వరరావు రచించిన కృష్ణవేణి నృత్య రూపకానికి సంబంధించి ఏర్పాటులో భాగంగా లక్ష్మీప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రానున్న రోజుల్లో తెలుగు సంస్కృతి గూర్చి తెలుసుకునేందుకు విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును సబ్జెక్ట్‌గా బోధించాలని ప్రభుత్వానికి చెబితే... తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమని యార్లగడ్డ ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. కార్మిక దినోత్సవం మేడే నాడు మహాకవి శ్రీశ్రీ గృహాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 24న కూచిపూడి అకాడమీ ఆఫ్ సెయింట్ లూయిస్ (అమెరికా) కు చెందిన వింజమూరి సుజాత బృందంచే విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో కృష్ణవేణి 'నృత్యరూపకం' ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. ఈ బృందంలో అమెరికాకు చెందిన నలుగురు కళాకారులు ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించే క్రమంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కళాకారులు వింజమూరి సుజాత, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
'తెలుగు భాషను బతికించుకుందాం'
కొరుక్కుపేట: తెలుగును బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని టామ్స్ వ్యస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ పేర్కొన్నారు. నిర్బంధ తమిళ విద్యా చట్టంలో మార్పులు చేసి మాతృభాష తెలుగులో చదువుకునేందుకు ప్రభుత్వం సడలింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జనోదయం, టామ్స్ సంయుక్త ఆధ్వర్యంలో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ) -2009 గురించి ప్రత్యేక వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు. దీనికి స్థానిక నుంగంబాక్కంలోని స్టెర్లింగ్ రోడ్డులో ఉన్న బ్రదర్స్ హోలీగ్రాస్ హాలు వేదికైంది. జనోదయం ప్రాజెక్టు డెరైక్టర్, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నైలోని డీపీఐ ఆవరణలో ఉన్న ఎస్సీఈఆర్టీ రీడర్ ఎన్ సత్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తి రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి అవగాహన తీసుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో పలురకాల పథ కాలను తీసుకొచ్చారని తెలిపారు. అయితే ఆ పథకాల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో సద్వినియోగ పరుచుకోలేకపోతున్నార న్నారు. ఆరేళ్ల వయస్సు నుంచి 14 ఏళ్ల వారు ఉచితంగా విద్యను అభ్యసించేలా ఈ చట్టంలో ఉన్నాయని తెలిపారు. గొల్లపల్లి ఇజ్రాయేల్ మట్లాడుతూ జనోదయం సంస్థ ద్వారా ఆది ఆంధ్రఅరుంధతీ ప్రజల పిల్లలంతా విద్యా వంతులు కావాలని లక్ష్యంతో రాత్రిపూట బడులు, ప్రత్యేక కోచింగ్ నిర్వహించడం చేపట్టామన్నారు. టామ్స్ ద్వారా పారిశుధ్య కార్మికుల పిల్లల విద్యకోసం పనిచేస్తుందని తెలిపారు. టామ్స్ సంస్థ కృషి ఫలితంగా ఆది ఆంధ్రులకు మూడు శాతం రిజర్వేషన్ సాధించామని అన్నారు. రాష్ట్రంలో తెలుగుభాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని, దీనిని తెలుగువారంతా ఐకమత్యంతో కృషి చేయాలని అన్నారు. నిర్బంధ తమిళ విద్యా చట్టంతో మాతృభాషను చదువుకోలేక పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలుగులో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. టామ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొలబంటి రవణయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ఉద్యోగ సమాచారాన్ని విద్యార్థులకు వివరించారు. వందన సమర్పణను టీఎన్సీడబ్యూఎస్ జనరల్ సెక్రటరీ ఎల్ సుందరం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా క్లాసికల్ నృత్యకారిణి కాదంబరితోపాటు టామ్స్ అధ్యక్షులు ఎన్.విజయకుమార్, జనోదయం ప్రాజెక్టు ఆఫీసర్ వి.శంకర్నారాయణన్, టామ్స్ దేవదానం, జేమ్స్, జయరాజ్, పాల్కొండయ్య, జయరామ్,ఆదామ్, నాగరత్నం, మాస్ సంస్థ జగ్గయ్య పాల్గొన్నారు. -
శంకరంబాడికి పుష్పాంజలి
తిరుపతి కల్చరల్: తెలుగు తల్లి, తెలుగు భాష విశిష్టతను చాటుతూ రాష్ట్ర గేయాన్ని అందించిన గొప్పకవి శంకరంబాడి సుందరాచార్యులకు పలువురు సాహితీ వేత్తలు ఘన నివాళులు అర్పించారు. శంకరంబాడి 103 జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శంకరంబాడి సాహితీ పీఠం ఆధ్వర్యంలో తిరుచానూరు రోడ్డులోని లక్ష్మీపురం సర్కిల్ ఉన్న శంకరంబాడి విగ్రహానికి ప్రముఖ అవధాని మేడసాని మోహన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ‘మా తెలుగుతల్లికి... మల్లెపూదండ...’ గేయాన్ని డాక్టర్ జి.సుహాసిని ఆలపించారు. ఈ సందర్భంగా శంకరంబాడి సాహితీ పీఠం గౌరవాధ్యక్షుడు ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి తిరుపతి నగరంలో జన్మించడం మనందరి అదృష్టమన్నారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి.మస్తానమ్మ మాట్లాడుతూ గొప్ప సాహితీ వ్యక్తులను నేటి తరానికి తెలియజేయడమే పీఠం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమలో పీఠం ప్రధాన కార్యదర్శి దేవరాజులు, సాహితీ వేత్తలు సాకం నాగరాజు డాక్టర్ కె.రెడ్డెప్ప, శ్రీమన్నారాయణ, ఆముదాల మురళి పాల్గొన్నారు. -
తెలుగు ప్రాచీనమే: మద్రాసు హైకోర్టు
- మద్రాసు హైకోర్టు తీర్పు - తెలుగుకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని మద్రాసు హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. తెలుగు ప్రాచీనమేనని స్పష్టం చేసింది. తెలుగుతోపాటు వివిధ ప్రాంతీయ భాషలకు ప్రాచీన హోదాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనన్ను కొట్టివేసింది. తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా తదితర భాషలకు కేంద్రం కల్పించిన ప్రాచీన హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్ గాంధీ అనే సీనియర్ న్యాయవాది మద్రాసు హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర, సంస్కృతి, వ్యాకరణం, సాహిత్య విలువలు.. వీటిల్లో ఏ ఒక్క అర్హతా లేని భాషలకు కేంద్రం ఇష్టారాజ్యంగా ప్రాచీన హోదా కల్పించిందని, దీనిని రద్దుచేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. ఏ ప్రాతిపదికన ఆయా భాషలకు ప్రాచీన హోదా కల్పించారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం వివరణ తరువాత ఇరుపక్షాల వాదనలు గత నెలలోనే విన్న మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహదేవన్ సోమవారం తీర్పు ప్రకటించారు. ఒక భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై కేంద్రం కొన్ని నిబంధనలు రూపొందించిందని, ఆ మేరకు భాషా పండితుల అధ్యయనం ఆధారంగా తెలుగు, ఒరియా, కన్నడం, మలయాళంలకు ప్రాచీన హోదా ప్రకటించిందని న్యాయమూర్తులు ధ్రువీకరించారు. కేంద్రం నిర్ణయం సక్రమమా, కాదా పరిశీలించేందుకు హైకోర్టుకు అంతటి భాషా నిపుణులు లేరు కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ‘తెలుగు’కు ఇది శుభదినం: యార్లగడ్డ తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం సంతోషకరమని పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇది తెలుగు ప్రజలకు శుభదినం అని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో యార్లగడ్డ విలేకరులతో మాట్లాడారు. మాతృభాషపై ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగును ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రపంచ భాషగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. కేసును మద్రాసు కోర్టు కొట్టివేయడంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీలకు యార్లగడ్డ మిఠాయిలు ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. -
'ఆంగ్ల వ్యామోహం వీడి తెలుగుకు రండి'
హైదరాబాద్: ప్రాచీన హోదా పొందేందుకు తెలుగు భాషకు అన్ని అర్హతలున్నాయని మద్రాసు హైకోర్టు స్పష్టం చేయడంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం అతి ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చింది. అయితే, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఈ కేసును రవీంధ్రనాధ్ అనే న్యాయవాది వాదించారు. కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేసిన రామకృష్ణ ఇప్పటికైనా తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు. ఆంగ్ల భాషా వ్యామోహాన్ని విడిచిపెట్టి విస్మరిస్తున్న ప్రాచీన తెలుగుకు న్యాయం చేయాలని అన్నారు. ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు అభినందనకరం : కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు భాషకు ప్రాచీన భాష హోదాను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామమని జగదీశ్వరరెడ్డి అన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ‘యాపీ’డేస్
*పిల్లలకు అక్షరాలు నేర్పటానికి ‘యాప్’ *రంజిత్ బృందాన్ని మెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ: తెలుగు భాష అంతరించిపోతుందనో, నేటి చిన్నారులు, రేపటి పౌరులు మాతృభాషకు దూరమవుతారనే దిగులు ఇంకెంతమాత్రం అక్కరలేదు. అక్షరాలు కళ్లముందు ప్రత్యక్షమై మనసుకు హత్తుకునే ‘యాప్’ను సృష్టించారు నవ్యాంధ్ర ఇంజనీర్లు రంజిత్ కొల్లు, కిరణ్, వెంకట్. గన్నవరానికి చెందిన కొల్లు రంజిత్ మిత్రులతో కలసి తాను రూపొందించిన కూల్ స్లేట్ యాప్‌ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట ప్రదర్శించారు. దాదాపు పదినిమిషాలు ఈ యాప్ వివరాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మగ్గులు, టీషర్టులు, ఇంట్లో ఉపయోగించే వస్తువులు, ఆట వస్తువులపై ముద్రించవచ్చని రంజిత్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ నేర్చుకోవటం కళకాదని, నేర్చించటం కూడా ఒక కళేనని ....అందులో రంజిత్ విజయం సాధించారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగా ఉపయోగించుకోవాలని తాను తరచూ చెబుతుంటానని సీఎం వ్యాఖ్యానించారు. ఇటువంటి ఆధునిక ఆవిష్కారాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ యాప్‌పై అధ్యయనం చేసి విద్యాసంస్థలలో ఎలా ఉపయోగించుకోవచ్చో తనకు తెలియజేయాలని సీఎంఓ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కాగా కూల్ స్లేట్ యాప్‌ను మాతృభాషా దినోత్సవమైన ఈనెల 29న ప్రారంభిస్తామని కొల్లు రంజిత్ తెలిపారు. తెలుగు భాషనే గుండె ఘోషగా భావిస్తూ చిన్నారులకు తెలుగు అక్షరాలు నేర్పటానికి కూల్ ఫెబెట్స్.కామ్ పేరుతో వెబ్ సైట్‌ను రూపొందించారు. -
తెలుగు దివ్వెను వెలుగనిద్దాం
సమకాలీనం ప్రాథమిక స్థాయి విద్యాబోధన తల్లిభాషలోనే జరగాలని సుప్రీంకోర్టు 1993లోనే స్పష్టమైన తీర్పిచ్చింది. రాజ్యాంగం 350 అధికరణం ఇదే నిర్దేశిస్తోంది. అయినా పాలకులు పట్టించు కోవడం లేదు. పాఠశాల స్థాయిలోనూ ఇంగ్లిష్ మాధ్యమ విద్యా బోధనకే వారు దోహద పడుతున్నారు. తెలుగును నిర్బంధంగా నేర్పించే విధానాలే మన రాష్ట్రంలో లేవు. భాషా ప్రయుక్త ప్రాతిపదికతో ఏర్పడ్డ తొలి రాష్ట్రమే అయినా తెలుగువారికి భాషపైన శ్రద్ధ లేదని ఎన్నోసార్లు, ఎన్నో స్థాయిల్లో రుజువైంది. ‘‘తెలుగు వెలది పలుకు తీయని పలుకులు, వినినయంత రాగధునులు దూకు; తెలుగు పలుకు కన్న తీయనిదున్నదా...?’’ అని ప్రశ్నించాడు మహాకవి దాశరథి. లేదని ఆయన భావన, ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ప్రశంసలం దుకున్న తెలుగుభాషకు ఇప్పుడు తెగుళ్లు పట్టుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, ప్రపంచీకరణ ప్రభావం, ఇంగ్లిష్ పట్ల వ్యామోహం, విద్యా సంస్థల్లో పెరిగి పోయిన వ్యాపార దృష్టి, కొత్తతరం నిరాదరణ, ప్రసారమాధ్యమాల అశ్రద్ధ... వెరసి తెలుగు భాష మనుగడ ఆందోళన కలిగించే స్థితికి చేరుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేస్తున్న తీరు తెలుగు భాషను మరింత సంక్షోభంలోకి నెడుతోంది. ఈ తాజా పరిణామం వల్ల సర్కారు బడుల స్థానే గ్రామీణ ప్రాంతాల్లో సహితం ప్రయివేటు బడులు, అంటే దాదాపు అన్నీ ఆంగ్ల మాధ్యమ బడులే వెలుస్తున్న క్రమంలో ఒక తరమే తెలుగుకు దూర మయ్యే దుస్థితి కనిపిస్తున్నది. సరైన మాతృభాషా భూమిక లేకుండా అన్య భాషల్లో చదివి పట్టాలు పొందుతున్న మన కొత్తతరం... ఉపాధికి, ఉద్యోగాల కవసరమైన ప్రతిభ సంపాదిస్తున్నారేమో! కానీ, సహజ సిద్ధమైన సృజన, నైపుణ్యాలు కొరవడుతున్నాయి. దీన్నెవరూ తీవ్రంగా పరిగణించడం లేదు. ఇలా మాట్లాడటం అతిశయోక్తి అనుకునే భాషా ఉదారవాదులు కొందరుంటారు. ‘‘భాష ఎలా చస్తుంది? మరీ చోద్యం కాకపోతే....?!’’ అని వారు విస్మయం ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలోని ఏడువేల భాషల్లో దాదాపు 65 శాతం భాషలు కాలక్రమంలో మృతభాషలయినట్టు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ‘ఒక భాషకు చెందినవారు ఆ భాషను వాడుకలో పెట్టుకో నప్పుడు, సంభాషణల్లో, తమ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో (కమ్యూనికేటివ్ డొమైన్స్) తల్లిభాషను వాడే వారి సంఖ్య తగ్గిపోతున్నప్పుడు, ఒక తరం తమ భాషను తర్వాతి తరానికి వారసత్వంగా అందించే స్థితిలో లేనప్పుడు ఆ భాష తీవ్ర ప్రమాదంలో పడినట్టే’ అని ‘యునెస్కో’ నివేదిక స్పష్టం చేసింది. ప్రపం చీకరణ, ఆర్థిక సరళీకరణల తర్వాత సుమారు 40 నుంచి 50 శాతం మంది తెలుగు పిల్లలు తల్లిభాషకు దూరమైనట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు తెలుసని చెప్పే వారిలోనూ అరకొరగా చదవడం, అంతకన్నా అధ్వా నంగా రాయడం మాత్రమే వచ్చిన వారి శాతం ఎక్కువే. ఒక భాష వాడుక నుంచి క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఆ భాష/జాతి తాలూకు సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ, పర్యావరణ సంబంధిత విలక్షణమైన ప్రత్యేక పరిజ్ఞానం, విలువైన ఆచరణలు వంటివీ కోలుకోలేని నష్టానికి గుర వుతాయి’ అని కూడా యునెస్కో హెచ్చరించింది. భాష అంటే మాటలు కాదు! భాషకూ మనిషికీ ఉన్న సంబంధం మానవ సమాజం పుట్టినప్పట్నుంచీ ఉంది. తల్లీ–పిల్లల సంబంధం నుంచి మొదలై... మానవ సంబంధాలన్నిం టినీ సూత్రబద్ధం చేసేది భాష మాత్రమే! భాష పరమ ప్రయోజనం మాన వుల మధ్య భావప్రసరణలకు ఒక వాహకంగా ఉపయోగపడటం. ఇక నాగరి కతా వికాసం, మానవాభ్యుదయం, సంస్కృతీ–సంప్రదాయాల కొనసా గింపు, కళల సంరక్షణ–వృద్ధి, మనిషి మానసికోల్లాసమీమడం వంటి వన్నీ భాష వల్ల సాధ్యపడుతున్నవే! భాష ఇంకా జన సమూహాల్ని జాతులుగా కట్టి ఉంచుతోంది. తమలో తమ భావవినిమయానికి అవసరమైన తల్లిభాషతో పాటు ఇతర జన సముదాయాలతో సంబంధాలకు అన్యభాషలు, ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ అనుసంధాన భాషలు ప్రాధాన్యత సంతరించుకుం టున్నాయి. విదేశాలకు వెళ్లేటప్పటి అవసరాలకే కాకుండా, ఉన్నచోటే ప్రపంచ పరిణామాలతో సంబంధం కలిగి ఉండాలన్నా, విషయ పరిజ్ఞానం పెంచు కోవాలన్నా.. ఇంగ్లిష్ వంటి అన్యభాషలు తెలిసి ఉండటం అవసరమైంది. రోజువారీ సంభాషణల్లో ఉన్నట్టు మాత్రమే పైకి కనిపించినా, తల్లిభాషలో అనేకానేకాంశాలు ఇమిడి ఉంటాయి. తల్లిభాష ఆలంబనగానే సాహితీ– సాంస్కృతిక విప్లవాలు సాధ్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి చెందిన దాదాపు అన్ని సమాజాలు, దేశాల్లోనూ తల్లిభాషతోనే విద్యా వికాసం, పరస్పర భావప్రసరణ జరిగాయి, జరుగుతున్నాయి. ప్రజల అను భూతులు, ఆలోచనలు, జీవన విధానానికి సంబంధించిన సమస్త విషయాలు తల్లిభాషలో గాఢంగా ప్రతిబింబిస్తాయి. అసాధారణ సుఖదుఃఖాలు కలిగిన పుడు భావాలు శక్తిమంతంగా తల్లిభాషలోనే వ్యక్తమవుతాయి. అన్య భాషలు తెలిసి ఉండటం వల్ల ప్రయోజనమే! ఇతరులపై ఆధారపడనవసరం లేకుండా ఆయా సందర్భాల్లో కమ్యూనికేషన్ పరమైన అవసరాలను అది తీరుస్తుంది. ఇంగ్లిష్ వంటి అంతర్జాతీయ భాష తగినంత లోతుపాతులతో తెలిసి ఉండడం తప్పనిసరి అదనపు ప్రయోజనం/అవసరంగా మారింది. తల్లిభాష అబ్బినంత తేలికగా, సులభంగా అన్యభాష రాదు. నేర్చుకోవడం అసాధ్యం కాకపోయినా.. అది మాతృభాష తర్వాతిదే అవుతుంది. పట్టుదలగా నేర్చు కుంటే అన్యభాషనూ లోతుగా నేర్చుకోవచ్చు. అంత మాత్రాన అన్య భాష లపై ఆసక్తి, మోజు తల్లిభాష ప్రయోజనాల్ని పణంగా పెట్టి కాకూడదు. ఆంగ్ల భాషా వ్యామోహం తెలుగు వికాసానికి అడ్డంకిగా మారింది. తల్లి భాష ప్రాధాన్యం రుజువైన సత్యం పాఠశాల విద్యా బోధన ఏ భాషలో జరగాలనేదానిపై సందేహాలకతీతంగా స్పష్టత ఉంది. తల్లి భాషలోనే జరగాలన్నది విశ్వసమాజం అంగీకరించి, అను సరిస్తున్న సత్యం. తల్లి భాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో సహజ సృజన విక సిస్తూనే, విషయ పరిజ్ఞానం పొందగలుగుతారనేది శాస్త్రీయంగా రుజువైంది. 1959 ఆగస్టు 11న ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ‘అంగ్రేజీ హటావో’ సదస్సులో డాక్టర్ రామ్మనోహర్ లోహియా ఓ గొప్ప మాట చెప్పారు. ‘‘విషయపరిజ్ఞానం లోతుల్లోకి వెళ్లి వాటిని అవగాహన చేసుకోవడానికి ఎంత సమయం, శ్రద్ధ అవసరమవుతాయో, అదంతా మన పిల్లలు పరాయి భాష అయిన ఆంగ్ల పరిజ్ఞానాన్ని సంపాదించడానికే వెచ్చించాల్సివస్తోంది’’ అన్నారు. తల్లిభాషలో పాఠశాల విద్యాబోధన జరగాలన్న సిద్ధాంతం ఈ అంశం ఆధారంగా బలపడ్డదే! ప్రాథమిక స్థాయి విద్యాబోధన తల్లిభాషలోనే జరగాలని సుప్రీంకోర్టు 1993లోనే స్పష్టమైన తీర్పిచ్చింది. రాజ్యాంగం 350 అధికరణం ఇదే నిర్దేశిస్తోంది. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. పాఠశాల స్థాయిలోనూ ఇంగ్లిష్ మాధ్యమ విద్యా బోధనకే వారు దోహద పడు తున్నారు. తెలుగును నిర్బంధంగా నేర్పించే విధానాలే మన రాష్ట్రంలో లేవు. భాషా ప్రయుక్త ప్రాతిపదికతో ఏర్పడ్డ తొలి రాష్ట్రమే అయినా తెలుగువారికి భాషపైన శ్రద్ధ లేదని ఎన్నోమార్లు రుజువైంది. అన్నివైపులా కృషి జరగాలి క్రీ.శ.625 నుంచి నన్నూరేండ్లకు పైబడి ఈ నేలనేలిన తూర్పు చాళుక్యరాజులు తెలుగును అధికార భాషగా ప్రకటించి పట్టం కట్టారు. ఈ 1,400 ఏళ్లలో భాష పలు మార్పులకు గురవుతూ వచ్చింది. ఏపీ శాసనసభ 1966లో తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ ప్రత్యేక చట్టం తెచ్చింది. అప్పట్నుంచి చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు రకరకాల ఉత్తర్వులు, ఆదేశాలు, ఇస్తున్నప్పటికీ తెలుగును పరిరక్షించడంలో ఆశించిన ఫలితాలు రాలేదు. వ్యక్తులు, కొన్ని సంస్థలు తమ స్థాయిలో కృషి చేస్తున్నా అది సమగ్రంగా జరగలేదు. ప్రాథ మిక విద్య తప్పనిసరిగా తెలుగు మాధ్యమంగానే జరగాలన్న కోరిక ఆచర ణకు నోచట్లేదు. 2003లో ప్రభుత్వ విద్యాశాఖ ఒక ఉత్తర్వు (జీవో ఎమ్మెస్ నం: 86) జారీ చేసింది. పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగును ఒక (ప్రథమ/ ద్వితీయ/తృతీయ) భాషగా నేర్పాలనేది సదరు ఉత్తర్వు ఉద్దేశం. దాని అమలు కూడా నీరు కారింది. ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా టెలివిజన్, వెబ్, బ్లాగ్ వంటి వాటిలో తెలుగు భాషా పరిరక్షణ, వృద్ధికి ఎటువంటి ప్రత్యేక చర్యలూ లేవు. పైగా భాషను సంకరపరిచి వారే దెబ్బతీస్తున్నారు. అన్యభాషా పదాల్ని వినియోగించ కూడదని కాదు. ఇతర భాషా పదాల ఆదానప్రదానాలతో భాష పరిపుష్టమైన సందర్భాలెన్నో ఉంటాయి. అంతి మంగా ప్రజలు మాట్లాడే భాషే ప్రామాణికం అవుతుంది. లోపాలు, కొరతలు లేకుండా విషయం వారికి అర్థం అవడమే భాష అంతిమ లక్ష్యం కావాలి. తేలికైన, ప్రజలకు పరిచయమున్న తెలుగు ప్రత్యామ్నాయ పదాలున్నా వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఆంగ్లపదాల్ని వాడటం, వాటినే ప్రోత్సహించడం తెలుగుకు నష్టం కలిగిస్తోంది. ఈ విషయాల్లో కొంత పరిశోధన జరగాలి. విస్తారంగా వాడకంలో ఉన్న వైవిధ్యభరిత మాండలిక పదాల్ని మలుబడిలో ఉంచాలి. వాటితో పదకోశాలు, నిఘంటువులు తయా రుచేయాలి. కొత్తగా ఆవిర్భవిస్తున్న అన్యభాషా పదాలకు సమానార్థక తెలుగు పదసృష్టి జరగాలి. కొత్తగా పుట్టుకొచ్చే రంగాలు, వ్యవహారాలకు సంబం ధించిన పారిభాషక పదకోశాల్నీ తెలుగులో రూపొందించాలి. ఈ భాషా కృషిలో ప్రభుత్వం, విద్యావేత్తలు, కవి–రచయితలు, విద్యాసంస్థలు, యువ తరం, వారి తల్లిదండ్రులు, ప్రసారమాధ్యమాలు ఇలా.. అందరూ శ్రద్ధ తీసుకోవాలి. బాధ్యతను నెత్తినెత్తుకోవాలి. ఈ విషయంలోనూ మనకు ఆదర్శ మయ్యేలా మహాకవి దాశరథి ఇదుగో ఇలా చెప్పారు. ‘‘..జగాన అనేకములైన భాషలన్ తెలిసి, తెలుంగునందుగల తేట తనమ్మును తెల్పు బాధ్యతన్ తలపయి మోపికొంటి కద! దాశరథీ కరుణా పయోనిథీ!’’ (నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి) ఈ మెయిల్: dileepreddy@sakshi.com -
తిండి బజార్లు
ఈ మధ్య తెలుగు భాషా వికాసానికి ఇంటర్నెట్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నా ఉద్దేశం ఒక్క భోజనం విషయం లోనే తెలుగు వ్యాపారస్తులు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారని చెప్పగలను. మరీ తొలి రోజుల్లో భోజనశాలలు లేవు. కేవలం మాధవ కబళమే. లేదా ఉంచ వృత్తి. అడిగితే లేదనకుండా ప్రతివారూ ఒక కబళం పెట్టేవారు. కొందరు ఉదారంగా వారాలిచ్చేవారు. తరువాత వచ్చినవి పూటకూళ్లమ్మ ఇళ్లు. ఆవిడకి పేరు లేదు. ఆవిడ నరసమ్మయినా, లక్ష్మమ్మయినా పూట పూటకీ కూడు పెట్టే అమ్మే. గురజాడవారూ పూటకూళ్లమ్మకి పేరు పెట్టలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి తల్లిగారు పేరు సబ్బమ్మ. ఆవిడ పూటకూళ్లు పెట్టి కొడుకుకి చదువు చెప్పించారని విన్నాను. ఆమె కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. దరిమిలాను సత్రాలు వచ్చాయి. కరివెనవారి సత్రం, ఉసిరికల సత్రం, గరుడా వారి సత్రం, కనకమ్మ సత్రం, సుంకువారి సత్రం - ఇలాగ. ఘంటసాల వంటి గాన గంధర్వుడిని పెట్టి పోషించిన మహారాజావారి సత్రం ఇప్పటికీ విజయనగరంలో ఉంది. తరువాత వచ్చిన హోటళ్లవారు ఇంత గొప్ప ఆలోచనల్ని చేయలేదని చెప్ప గలను. నా చిన్నతనంలో కోమల విలాస్, కొచ్చిన్ కేఫే, గణేష్ హోటల్, ఉడిపి హోటల్ బొత్తిగా నేలబారు పేర్లు. ఇప్పుడిప్పుడు భోజనశాలలు రుచుల్ని మప్పాయి. ఒక హోటల్ పేరు ‘పకోడీ’. నేనయితే పేరుకి మరికాస్త రుచిని జతచేసి ‘ఉల్లి పకోడీ’ అనేవాడిని. మరొక హోటల్ ‘అరిటాకు’. ఇంకొకటి ‘వంటకం’. ఇంకో హోటల్ ‘ఆవకాయ్’. మరీ కస్టమర్ల మన స్సుల్లోకి జొరబడిన వ్యాపారి తన దుకా ణాన్ని ‘ఇక చాలు’ అన్నారు. ఏమిచ్చినా ఎవరూ అనలేని మాట. తింటున్న ప్పుడు అలవోకగా వినిపించే మాట. ఇక ‘వంకాయ’ తెలుగువాడి జాతీయ వంటకం. ఒక వ్యాపారి తన హోటల్ని ‘వంకాయ’ అన్నాడు. బొత్తిగా నేల బారుగా ఉంటుందేమోనని మరొకాయన ఇంగ్లిషులో ‘బ్రింజాల్’ అన్నాడు. హైదరాబాదులో జూబ్లీహిల్స్‌లో ‘కారంపొడి’ అనే బోర్డు చూశాను. పక్కనే మరో హొటల్ ‘ఉలవచారు’. మరొక హొటల్ పేరు ‘గోంగూర’. ఈ లెక్కన ‘పప్పుచారు’, ‘కందిపప్పు’, ‘పనసపొట్టు’, ‘కొరివి కారం’, ‘చెనిక్కాయ పచ్చడి’కి చాన్సుంది. ఎవరెక్కడ ఏ మర్యాద చేసినా అత్తారింటికి సాటిరాదు. అందుకే ఒక హోటల్ పేరు ‘అత్తారిల్లు’. మరొకాయన అక్కడ ఆగక ఇంట్లోకే జొరబడ్డాడు - ‘వంటిల్లు’. అమెరికాలో తెలుగువారిని రెచ్చగొట్టే హోట ల్ని మా మిత్రుడొకాయన కాలిఫోర్నియాలో ప్రారంభించారు. ఆ పేరు చదవగానే తప్పిపోయిన మనిషి కనిపించినంత ఆనందం కలుగుతుంది. పేరు ‘దోశె’. మరొక దేశభక్తుడు తన హోటల్ని ‘జైహింద్’ అన్నాడు. ఓనరుని బట్టి పేరొచ్చిన హోటల్ ‘బాబాయి హోటలు’. తమిళులు ఈ విషయాల్లో వెనుకబడ్డారని తమరు భావిస్తే పొరబడ్డారనక తప్పదు. చెన్నైలో ఒక హోటల్ పేరు ‘వాంగో! సాపడలామ్’ (రండి, భోంచేద్దాం). కట్టుకున్న పెళ్లాం కూడా ఇంత ముద్దుగా పిలుస్తుందనుకోను. మరొకా యన కసిగా ‘కొల పసి’ అన్నాడు. కొలై అంటే చంపడం. పసి అంటే ఆకలి. ‘చంపుకు తినే ఆకలి’ హోటల్ పేరు. మరో హోటల్ ‘కాపర్ చిమ్నీ’ (రాగి గొట్టాం). ఈ లెక్కన ‘ఇత్తడి మూకుడు’, ‘ఇనుప తప్పేలా’, ‘సిలవరి బొచ్చె’ వంటి పేర్లకి అవకాశముంది. ఇంగ్లిష్‌వారు - దాదాపు అందరూ సినీమా ప్రియులు. నవలా సాహిత్యంలోనే తలమానికంగా నిలిచిన ‘టు కిల్ ఏ మాకింగ్ బర్డ్’ (రచయిత్రి హార్పర్ లీ ఈ మధ్యనే కన్నుమూసింది), హాలీవుడ్ సినిమాగా కూడా చాలా పాపులర్. ఆ పేరు ఒరవడిలో ‘టెక్విలా మాకింగ్ బర్డ్’ అని ఒక రెస్టారెంటు పేరు. టెక్విలా మెక్సికన్ మత్తు పానీయం. బ్రాడ్ పిట్ అనే పాపులర్ హీరో గారి పేరు గుర్తుకొచ్చేలాగ ఒకాయన ‘బ్రెడ్ పిట్’ అని తన హోటల్ పేరు పెట్టాడు. ‘ది గాడ్ ఫాదర్’ హాలీవుడ్లో చరిత్రను సృష్టించిన చిత్రం. ఒక రెస్టారెంటు పేరు ‘ది కాడ్ ఫాదర్’ అన్నారు. కాడ్ ఒక ప్రముఖమయిన చేప పేరు. ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ పాపులర్ చిత్రం. మిమ్మల్ని ఆకర్షించిందా? ‘ప్లానెట్ ఆఫ్ గ్రేప్స్’కి దయచెయ్యండి. ఇదీ మిమ్మల్ని అలరిస్తుంది. ఇంకొకాయన ‘పన్’లో ముళ్లపూడిని తలదన్నే మహానుభావుడు. Let us eat అంటే ‘భోంచేద్దాం’ అని పిలుపు. ఈయన తన హోటల్‌కి ‘లెట్టూస్ ఈట్’ (Lettuce Eat) అన్నాడు. లెట్టూస్ ఒకానొక ఆకుకూర. భాషకి జన్మస్థలం నోరు. నోటినుంచి వచ్చే భాషనీ, వ్యాకరణాన్నీ, ధ్వనినీ, వ్యంగ్యాన్నీ సంధించి ఊరించే వ్యాపారులు ఇటు భాషకీ, దానిని ఉద్ధరిస్తున్న మనకీ గొప్ప ఉపకారాన్ని చేస్తున్నారని మనం గర్వపడాలి. - గొల్లపూడి మారుతీరావు -
మాతృభాషతోనే బంగారు తెలంగాణ
అవసరమైన వనరులు, వసతులు కల్పించడంద్వారా విద్యాలయాలను సముద్ధరించకుండా ఆదరాబాదరాగా కేజీ నుంచి పీజీ విద్యను ఆంగ్లమాధ్యమంలో జరుపుతామని పాలకులు ప్రకటించడం, దానికోసం సన్నాహాలు చేయడం, బాహాటంగా ప్రకటనలు చేయడం అప్రజాస్వామికమే కాదు.. అది చట్టవిరుద్ధం కూడా అవుతుంది. ఒకప్పటి నిజాం జమానా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఉర్దూను పరిపాలనా భాషగా శాసనపరంగా నిర్ణయించి దానికనుగుణంగా ఉర్దూను బోధనాభాషగా చేపట్టారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బి. రామకృష్ణారావు హయాంలో తెలుగును పరిపాలనాభాషగా శాసన పరంగా నిర్ణయించి తదనుగుణంగా తెలుగు భాషను బోధనా మాధ్యమంగా చేపట్టి ఆనాటి ఉర్దూ భాష ద్వారా విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వ రంగ విద్యాల యాలన్నీ తెలుగు మాధ్యమంలోకి మార్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వపరంగా కేజీ నుంచి పీజీ వరకు ఇకపై ఇంగ్లిష్ మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుందని పదేపదే ప్రకటించారు. ఈ మధ్యే తెలుగు మీడియం పాఠ్యాంశాలను ఇంగ్లిష్ మీడి యంలోకి మార్చే ప్రక్రియలు కూడా చేబడుతున్నారని సమాచారం. కానీ తెలుగు మీడియంను ఇంగ్లిష్ మీడి యంలోకి మార్చాలంటే మొదట శాసనసభలో దానిపై చర్చించి శాసనపరమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి మొట్టమొదట తెలుగును పరిపాలనా భాషగా వదిలివే యాలి. అలాగే ఉర్దూ కూడా అధికార భాష కనుక దాన్ని కూడా వదిలివేయాలి. తర్వాతే ఇంగ్లిష్‌ను అధికార భాషగా శాసనపరంగా నిర్ణయించి ప్రకటించాలి. పరిపాలనా రంగానికి చెందిన ఇంత పెద్ద నిర్ణ యాన్ని ప్రభుత్వపరంగా తీసుకోవడానికి ముందు ప్రజా భిప్రాయం కోసం ఒక ఒపీనియన్ పోల్ లాంటిది నిర్వ హించాలి. అంతకంటే ముందుగా, అత్యధికులు పరిపా లనా భాష గురించి, దానికి అనుబంధమైన విద్యా బోధన గురించి ఎలాంటి భావాలు వ్యక్తపరుస్తారో మౌఖిక చర్చల ద్వారా, లిఖితపూర్వక సర్వేల ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలి. వరంగల్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణోద్యమ సమాఖ్య సభలో ఈ విషయంపై లోతుగా చర్చించింది. ఇంగ్లిష్ మీడియంను తీసుకురావడానికి ముందుగా విద్యార్థుల విద్యాప్రమా ణాలు పెరగడానికి అనేక లోటుపాట్లతో నడుస్తున్న ప్రభుత్వ విద్యాలయాలన్నింటినీ వనరులు, వసతులు, అధ్యాపకులరీత్యా సరిదిద్దిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యాప్రమాణాలు మరింత తగ్గుతాయని, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని సమాఖ్య హెచ్చరించింది. అలాంటివేవీ చేయకుండా ఆదరాబాదరాగా కేజీ నుంచి పీజీ విద్యను ఇకపై ఆంగ్లమాధ్యమంలో జరుపు తామని ప్రకటించడం, దానికోసం సన్నాహాలు చేయడం, బాహాటంగా ప్రకటనలు చేయడం అప్రజా స్వామికమే కాదు.. అది చట్టవిరుద్ధం కూడా అవుతుంది. ఇలాంటి నిర్ణయాలు సరికావని ప్రభుత్వం దృష్టికి, ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకు రావడానికి విస్తృత చర్చలు, సర్వే లేదా ఒపీనియన్ పోల్ వంటిది నిర్వహించి వాటికనుగుణంగా శాసనాలు చేయాలని, అంతవరకు కేజీ నుంచి పీజీ విద్యను తెలుగు లోనే కొనసాగించాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఇంగ్లిష్ మీడియం కంటే తెలుగు మీడియం బహుజను లకు మంచిదని ఈ వ్యాసకర్త ఇప్పటికే అనేక వ్యాసాలు రాసి, ప్రచురించారు. భాషా మాధ్యమంలో మార్పులు చేయడానికి ముందుగా ప్రభుత్వం చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై శిథిలావస్థలో ఉన్న అనేకానేక ప్రభుత్వ విద్యాలయాలను వెంటనే పునరుద్ధరించడం తక్షణ కర్తవ్యం. అంతేకాని తెలుగు మాధ్యమం కంటే కష్టమైన ఇంగ్లిష్ మీడియం చేపట్టడం సరైంది కాదు. అంతవరకు ఇప్పుడున్న తెలుగు మాధ్యమాన్నే కొనసాగిస్తూ, ప్రైవేట్ రంగ విద్యాలయాలకు నిర్దేశించే గుర్తింపు నిబంధనలను ప్రభుత్వరంగ విద్యాలయాలకు కూడా తు.చ. తప్ప కుండా వర్తించజేస్తూ వాటిని పాటించకపోతే రెండిం టిపై సమానంగా చర్యలు తీసుకోవాలి. నిర్దేశిత నిబంధ నలను అన్ని విద్యాలయాలు కచ్చితంగా పాటించడానికి పకడ్బందీగా పర్యవేక్షణ అమలు చేయవలసి ఉంటుంది. జూన్ 25-27 తేదీల్లో వరంగల్‌లో తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ ఆధ్వర్యాన తెలం గాణలో తెలుగు మాధ్యమ విద్యాబోధనపై వివిధ స్వచ్ఛంద సంస్థలు సమావేశమై తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణోద్యమ సమాఖ్యగా ఏర్పడినాయి. అంపశయ్య నవీన్, సుప్రసన్నాచార్య, అనుమాండ్ల భూమయ్య, కె. యాదగిరి, కోదండరామారావు, ఈ వ్యాస రచయిత తదితరులు పాల్గొన్న ఈ సమావేశం ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవాలని కొన్ని ప్రతి పాదనలు కూడా చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి జిల్లాలోని విద్యా, సామాజిక సాంస్కృతిక లక్ష్యా లతో స్థాపితమైన రాజకీయేతర స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ ఉద్యమాన్ని అందించాలని, ప్రతి జిలా కేంద్రంలో జిల్లా పరిరక్షణోద్యమ శాఖను స్థాపించి, అడపాదడపా చర్చాగోష్టులు జరిపి అవసరమైన కార్య క్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. అలాగని సమాఖ్య ఇంగ్లిష్ భావనను వ్యతిరేకిం చడం లేదు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోంది. కేంద్ర, ప్రైవేట్ రంగ విద్యాలయాల్లో కూడా తెలుగు, ఇంగ్లిష్ మాధ్య మాల్లో విద్యాబోధన జరపాల్సి ఉంది. కేసీఆర్ బోధనా మాధ్యమం గురించి ఇంతవరకు తీసుకున్న నిర్ణయా లను ఆపి సావధానంగా వాటి గురించి చర్చించాలి. - డాక్టర్ వెల్చాల కొండలరావు వ్యాసకర్త కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర తెలుగు మాధ్యమ పరిరక్షణ సమాఖ్య మొబైల్ : 98481 95959 -
బ్రౌన్ సేవలను భావితరాలకు తెలియజెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాషకు సీపీ బ్రౌన్ అందించిన సేవలను యువతకు, భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. సీపీ బ్రౌన్కు ప్రాచుర్యం కల్పించడం ద్వారా ఆంగ్ల భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్న వారికి కనువిప్పు కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లండన్‌లోని కెన్సల్ గ్రీన్ సిమెట్రీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించిన సీపీ బ్రౌన్ సమాధిని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో కలసి జస్టిస్ చలమేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల భాషను అవసరం మేరకు నేర్చుకోవాలని, మాతృభాషను మాత్రం విస్మరించకూడదని సూచించారు. బ్రౌన్ సమాధికి ప్రాచుర్యం కల్పించే ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన ఆర్థిక వనరులను తాను సమకూరుస్తానని జస్టిస్ చలమేశ్వర్ హామీ ఇచ్చారు. -
తెలుగుభాషకు అద్భుత భవిష్యత్తు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు బాష పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా సిలికానంధ్ర నిర్వహిస్తున్న 'మనబడి' స్నాతకోత్సవం ఆదివారం శాన్‌హూసేలోని పార్క్‌సైడ్ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనబడి విద్యార్థులకు వారు పట్టాలు ప్రదానం చేశారు. అమెరికా, కెనడా, హాంకాంగ్ మొదలైన దేశాల్లోని 1019 మంది విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారు. ముఖ్య అతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. మనబడి నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయమైందని చెప్పారు. తెలుగుభాష భవిష్యత్ గొప్పగా ఉండబోతోందని ఆయన అన్నారు. ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంతా అంటారని, కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలుపెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రశంసించారు. 150 మందితో మొదలుపెట్టిన నేడు ఆరువేల మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ విద్యావ్యవస్థను నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి నిర్వాహకులను కొనియాడారు. 2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్థులకు తెలుగుభాషపై గల అంకితభావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007 లో ప్రారంభమైన 'మనబడి' ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. మనబడి పదికి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250కి పైగా శాఖలతో వందకు పైగా భాషా సైనికులతో భాషా ఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని మనబడి అధ్యక్షులు రాజు చామర్తి తెలిపారు. ఈ ఏడాది ఆరువేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి ముందుకు కొనసాగుతోందని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు అన్నారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి వై. రెడ్డి శ్యామల, ప్రజాసంబంధాల అధికారి జుర్రు చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, అధ్యక్షులు సంజీవ్ తనుగల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీరాం కోట్నీ, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగునే లాగేస్తే మిగిలేదేంటి?
ఇప్పుడు పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్యముంది. అది వారు సులభంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం. ఆ కాస్త తెలుగును కూడా లాగేస్తే వారి భవిష్యత్తు ఏంటి? తెలుగు భాష కొన్ని శతాబ్దాలుగా తెలంగాణాలో అందరూ విరివిగా మాట్లాడుతున్న, సగటు పౌరులు అనేకానేక అవ సరాలకు ఉపయోగి స్తున్న ప్రజా భాష, అది బోధనా మాధ్యమంగా గత అరవై ఏళ్లకు పైగా నిలదొక్కుకున్న భాష. మరి అలాంటి భాషను అకస్మాత్తుగా ఇంగ్లిష్ భాషతో భర్తీ చేస్తే అది ఎన్ని సామాజిక సంక్షోభాలకు దారి తీస్తుందో మన ప్రభుత్వం సావధానంగా ఆలోచిస్తు న్నట్లు లేదు. అది మన సమాజంలోని అనేకానేక రంగాలను ఎలా దెబ్బతీస్తుందో, వాటిలో పనిచేసే వారి గతి, వాటిలో పెట్టుబడులు పెట్టిన వారి గతి ఏమి కాబోతోందో ప్రభుత్వమే కాదు, సమాజం కూడా ఆలోచిస్తున్నట్లు లేదు. ఈ భాషా సమస్య ఏ కొందరి సమస్యో కాదు, ఇది ఒక పదేళ్ళలో అందరినీ ముంచే, అందరినీ ముసురుకునే సునామీ లాంటి సమస్య. అనేకా నేకులను అనేకానేక నష్టాలకు కష్టాలకు గురిచేసే సమస్య. అలాంటిదాన్ని అలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇపుడు చిన్నాచితకా బడుల్లో, పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్య ముంది. అది వారు సులభంగా, సునాయాసంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం, తక్కినవన్నీ లోటులూ, లొసుగులే. పాపం.. పసివారికి ఉండే ఒకే ఒక సౌకర్యం ఒక్క తెలుగు మీడియం మాత్రమే. అది కాస్తా లాగేస్తే మిగిలేదేముంది ఆ బడుల్లో? మన విద్యాలయాల ఉద్ధరణను మనం అలాంటి బడుల వసతి సౌకర్యాల ఉద్ధరణతో మొదలెట్టాలి కాని తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కాదు. దాని వలన జరిగేదీ లేదు, ఒరిగేదీ లేదు. పెపైచ్చు వారి విద్య ఇప్పటికన్నా అధ్వానమవుతుంది. అసలు అంత మంది అధ్యాపకులేరీ? ఇంగ్లిష్‌లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పగలిగేవారు ఏరీ?. వచ్చీరాని ఇంగ్లిష్‌లో వచ్చీ రాని వారు వచ్చీరాని విధంగా విద్య బోధిస్తే విద్యార్థులు ఇంటా బయటా దేనికి పనికొస్తారు? వారి పట్టాలు దేనికి పనికొస్తాయి? వారు న్యూనతా భావనకు లోనై ఇప్పటిలాగే భవి ష్యత్తులోనూ ఆత్మహత్యలకు పాల్పడరా? అసలు మీడియం ముఖ్యమా? వనరులు, వసతులు, సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సాంకేతిక పరికరాలు, క్రమశిక్షణ, సరైన విద్యా వాతావరణం, కార్యక్రమాలు ముఖ్యమా? విద్యాలయాలు అన్ని విధాలా బాగుంటే విద్యలు బాగుంటాయి, అవి బాగుండకపోతే ఇవి బాగుండవు. ఇతర ముఖ్యాం శాలను సమకూర్చకుండా, ఒక్క మాధ్యమం మాత్రమే ఏ అద్భుతాలనూ సాధించజాలదు. వాటిని గుర్తించి బాగుపరచడానికి ఇప్పటి పరిస్థి తుల్లో కనీసం రెండుమూడు దశాబ్దాలైనా పట్టొచ్చు. అందువలన మీడియంను గభాలున మార్చకుండా కొన్నాళ్ళు తెలుగు మీడియంను కొన సాగిస్తూ ఈలోగా వాటిని మెరుగు పరచుకుంటూ, మెల్లమెల్లగా అడుగులు వేయడం అవసరం. తెలుగు మీడియం విద్యాలయాలు తెలుగు మీడియం వలన వెనకబడలేదు వాటికి ప్రభుత్వ చేయూత సరియైనంత లభించనందునే వెనకబడి పోయాయి. కనుక మొదట ఆ విద్యాలయాల వసతి సౌకర్యాలు, వనరులు మెరుగుపరచండి. గవర్న మెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ మాత్రం తీసిపోవని నిరూపించండి. తొందరపడి మూకుమ్మడి కన్వర్షన్‌కు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తులను పాడుచేని అయ్యో ఇంత మంది భవిష్యత్తులు పాడుచేశామేమిటని ఆ తదుపరి నాలుక కరచుకోకండి. కనీసం అత్యధికులైన బీదవారికి, పల్లెటూరి వారికి, వెనకబడినవారికి చెందిన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతవరకే ఉన్న విద్యా విధానాన్ని కొన్నాళ్ళు అలాగే ఉంచి వాటిలో బోధనా అధ్య యన పరిస్థితులను మెరుగుపరచి అటు తదుపరి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదని గ్రహించండి. ఇంతవరకే పాడయిన వారిని ఇంగ్లిష్ మీడియం ద్వారా మరింత పాడు చేయకండి. సదరు సమాజం, స్థానిక ప్రజలు కూడా మొదట వసతులు మెరుగుపర్చడానికి పట్టుబట్టాలి కాని ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. వసతులు, వనరులు లేని ఇంగ్లిష్ మీడియం వారి పిల్లలకు ఇప్పటికన్నా ఎక్కువ హాని కలిగిస్తుందని, అలాంటి దాని వలన వారి పిల్లలు పట్నాలలోని మంచి వసతులు గల బడుల్లో చదివే వారితో పోటీపడ లేరని గ్రహించాలి. అలాంటి వనరులు, వసతులే కల్పిస్తే తెలుగు మీడియం స్కూళ్లూ అంతకన్నా బాగుం టాయని తెలుసుకోవాలి. ప్రభుత్వం ఉన్న వాటిని ఉద్ధరించడానికి ఒత్తిడి ఎక్కువ తేవాలి కాని కేవలం ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. తెలుగు మీడియం ఒకవిధంగా విద్యారం గంలో వెనకబడిన వారికి ఫార్వర్డ్ క్లాస్ వారితో పోటీ పడడానికి ఒక సబ్సిడీ లాంటిది, రిజర్వేషన్ లాంటిది. దానిని పోగొట్టుకోకండి. ఇంగ్లిష్ మీడి యంలో చేరగానే, చేర్పించినంత మాత్రాన్నే విద్యార్థి ఐ.ఐ.టి.కి పోతాడని, అమెరికాకు పోతా డనీ అనుకోకండి. అలా నెగ్గే వారి సంఖ్య ఆ మీడి యంలో చేరేవారి సంఖ్యలో ఎంతభాగమో తెలుసు కోండి. తక్కినవారు నెగ్గకపోవడానికి ప్రధానమైన కారణం ఇంగ్లిష్ భాష బరువేనని నెగ్గినవారినడి గితే మీకే తెలుస్తుంది. వారినడిగి తెలుసుకోండి. ఇపుడు సులభమైన తెలుగు మీడియం ఉండగానే అనేకానేక గవర్నమెంటు స్కూళ్ళలో పరీక్షా ఫలితాలు దారుణంగా ఉన్నాయి. ఇక ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాక దాని భారం వలన అవి మరింత దారుణంగా తయారవుతాయని అటు ప్రభుత్వమూ, ఇటు తల్లిదండ్రులూ, వారి పిల్లలు, సమాజం కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే తెలు స్తుంది. ఏళ్ళ తరబడి ఇంగ్లిష్ మీడియంలో చది వినా కూడా నూటికి 90 శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేకపోవడం, రాయ లేకపోవడం ఆ భాషాభారం వలననే అని తెలుసుకోండి. వ్యాసకర్త వ్యవస్థాపక కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ మొబైల్: 98481 95959 - డాక్టర్ వెల్చాల కొండలరావు -
తెలుగులోనూ జిరోధా ట్రేడింగ్ ప్లాట్‌ఫాం
త్వరలో కంటెంట్ కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా తాజాగా తెలుగు భాషలోనూ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ప్రాంతీయ భాషా క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను పరిచయం చేసే ప్రణాళికల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థ వీపీ (ఈక్విటీ అండ్ రీసెర్చ్ విభాగం) కార్తీక్ రంగప్ప తెలిపారు. తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లో తమ ‘కైట్’ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుందని, త్వరలో మరికొన్ని భాషల్లోనూ తేనున్నామని బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం తమకు 1 లక్ష పైగా క్లయింట్లు ఉండగా ఇందులో సుమారు 20 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని వివరించారు. ఇంత ప్రాధాన్యమున్న నేపథ్యంలోనే హైదరాబాద్, విజయవాడల్లో రెండు శాఖలతో పాటు వైజాగ్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 11 పార్ట్నర్ సపోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు కార్తీక్ చెప్పారు. త్వరలోనే జిరోధా వర్సిటీ పేరిట అందిస్తున్న కంటెంట్‌ను కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, క్లయింట్లను ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించే క్రమంలో ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై బ్రోకరేజీ ప్రస్తావనే లేకుండా చేశామని కార్తీక్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.80 కోట్ల ఆదాయం నమోదు చేశామన్న కార్తీక్.. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను పది లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
సిలికానాంధ్ర వర్సిటీకి కాలిఫోర్నియా అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, తెలుగు కళల విద్యాభ్యాసం, ఈ రంగాల్లో పరిశోధనల ప్రాతిపదికగా ఏర్పాటుచేసిన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వర్సిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. త్వరలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్, డిప్లమో, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు. రెండో దశలో తెలుగు భాషా శాస్త్రాల్లో మాస్టర్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు. 2007లో 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, ఈ ఏడాది 6,200 మందికి చేరుకుందని ప్రధాన బోధనాధికారి రాజు చమర్తి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యనందించాలనే లక్ష్యంతో సిలికాన్ వ్యాలీలో ఏర్పాటైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారి దీనబాబు కొండుభట్ల చెప్పారు. వివిధ కోర్సుల్లో చేరేందుకు చాలామంది తెలుగువారు తమను సంప్రదిస్తున్నారని వ్యవస్థాపక సభ్యులు గంటి అజయ్, కొండిపర్తి దిలీప్ పేర్కొన్నారు. -
తెలుగుకు అన్యాయంపై ‘ఆవేదన దీక్ష’
రాజమహేంద్రవరం : ‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదు. ఇది తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన శుక్రవారం మండుటెండలో ‘ఆవేదన దీక్ష’ చేశారు. తాము కొత్తగా ఏదీ కోరడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాష విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు, గద్దెనెక్కాక చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. 'తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా చెబుతున్న అమరావతి నిర్మాణ శిలాఫలకం, తాత్కాలిక రాజధాని శిలాఫలకాలు ఇంగ్లిషులోనే ఉన్నాయి. ఆంగ్ల శిలాఫలకాలకు నేను వ్యతిరేకం కాదు. అధికార భాషా చట్టం ప్రకారం ప్రభుత్వ శిలాఫలకాలు, రాతకోతలలో తెలుగు తప్పనిసరి. నేను తెలుగులో శిలాఫలకం తయారు చేయించి, గత నెల 26న విజయవాడలో ఆ శిలాఫలకాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సీఆర్డీఏ కార్యాలయంలో అందజేశాను. గత నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలుసుకుని ఉగాదిలోగా తెలుగు భాషలో శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కోరాను. తప్పక చేస్తానని ఆయన ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మన అసెంబ్లీలో బడ్జెట్‌ను ఇంగ్లిషులో ప్రవేశపెట్టారు. ఇది సిగ్గుచేటు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా చేస్తామని గోదావరి పుష్కరాల సమాపనోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ దిశగా అడుగు పడలేదు. ప్రభుత్వం తనకు తానే తెలుగు భాషకు వ్యతిరేకమని నిరూపించుకుంటోంది. ఇది ఎవరికీ వ్యతిరేక దీక్ష కాదు. నిరసన దీక్ష కాదు. మా ఆవేదనను వ్యక్తం చేయడానికి చేస్తున్న దీక్ష మాత్రమే. తెలుగు భాషా సాంసృ్కతిక రంగాలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి’ అని యార్లగడ్డ డిమాండ్ చేశారు. దీక్షలో రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పాల్గొన్నారు. -
తిక్కన ఇచ్చిన సున్నితపు త్రాసు
తెలుగు భాషకు ద్విత్వం ప్రాణాధారం. ‘క’కు కా వొత్తు, ‘త’కు తా ఒత్తు, ఇలా ఏ హల్లుకు ఆ హల్లే జత పడటం- అమ్మ, అక్క, అయ్య వంటి హల్లుల కలయిక తెలుగు పదాల ప్రాథమిక స్వభావం... ద్విత్వాక్షరాలుండే పదాలను ఎన్నుకోవడమే కాకుండా, ప్రాస స్థానంలో వాటిని వినియోగించే చమత్కారంతో తన రచనకు తెలుగుదనాన్ని సమకూర్చాడు తిక్కన. సున్నితపు త్రాసుతో తూచినట్టు సరయిన స్థానంలో తగిన పదం ఎలా వచ్చిపడుతుంది? రాస్తున్నది చరిత్రకు సంబంధించిన తొలి పేజీలు. అందులోనూ వస్తువు సైన్సు. దానికి ఆయన జవాబు ఆశ్చర్యానికి లోను చేసింది. ‘ఈ తెలుగు సామర్థ్యానికి కారణం పద్యం, మూలం పదమూడవ శతాబ్దపు తిక్కన’. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ పేరుతో ఎం.వి.రమణారెడ్డి ఒక పుస్తకం వెలువరించారు. వారి పై జవాబు ద్వారా, పదేళ్ళ క్రితం వారే వెలువరించిన ‘మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది’ గురించి తెలుసుకుని, దాన్నీ చదివాను. వామపక్ష మేధావి రమణారెడ్డి, తిక్కన చిత్రించిన తెలుగు ద్రౌపదిని విశ్లేషించడం ముచ్చట కల్గించింది. పద్యం అనగానే బూర్జువా బూజు ధోరణిలో కాకుండా, హేతుబద్ధమైనది గ్రహించాలనే రీతిలో ఆయన భారతాన్ని, అందునా తిక్కన భారతాన్ని ఇష్టపడి, అందులో ద్రౌపది పాత్ర చిత్రణలో ఎంత తెలుగుదనమున్నదో వివరించడం అర్థవంతంగా అనిపించింది. ‘‘...ఇక్కడ తిక్కన తెలుగు ఇల్లాలితో పాటు, తెలుగు తల్లిని కూడా ఆవిష్కరించాడు. అదివరకటి భారతీయ సాహిత్యానికి స్త్రీలో కనిపించింది కేవలం కామోద్రేకం మాత్రమే. సందర్భం ఒత్తిడి చేస్తే ఒకటి, రెండు సన్నివేశాల్లో ఇతర ఉద్రేకాలను వెల్లడించినా, వాటికి అంత ప్రాముఖ్యం ఆ సాహిత్యంలో కనిపించదు. 13వ శతాబ్దపు తెలుగు సాహిత్యం ఆ సంకుచితత్వానికి వీడ్కోలు పలికింది. అందుకు గాను ఇటు తిక్కన సోమయాజికీ, అటు పాల్కురికి సోమనాథునికీ భారత జాతి రుణ పడిపోయింది’’అని రమణారెడ్డి వ్యాఖ్యానిస్తారు. కీచకునితో అవమానపడిన ద్రౌపది, భీమసేనుడికి కర్తవ్య బోధ చేస్తుంది. తన పరిస్థితి ఏమిటో వివరించిన నేపథ్యంలో-ద్రౌపదిని తిక్కన ఎలా చిత్రించారో చెబుతూ చేసిన విశ్లేషణ ఇది: అంతకు ముందు అధ్యాయంలో కౌరవ సభలో జరిగిన పరాభవం గురించి బాధ పడిన ద్రౌపది నన్నయ్యకు కేవలం ఒక హరికథకురాలిగా కనబడుతుంది. ఇక్కడ రమణారెడ్డి అంటారు: ‘‘ఇప్పుడు గూడ భర్తను ఒక కర్తవ్యానికి ఉసిగొల్పడమే ఆమె ధ్యేయం. అయినా ఉద్రేకాన్ని వెళ్లగక్కే ఆ తీరులో ఆడ హరిదాసులా కాకుండా అచ్చం తెలుగింటి ఆడ బిడ్డలా కనిపిస్తుంది.’’ దీనికాధారం అయిన తిక్కన పద్యమిది: నన్ను పరాభవించి, సదనంబునకున్ జని కీచకుండు, ము న్నున్న తెరంగు తప్పక, సుఖోచిత శయ్యను నిద్రసేయ, నీ కన్ను మొగుడ్చు ఊరటకు కారణమెయ్యది భీమసేన? మీ అన్న పరాక్రమంబు వలదన్ననొకో దయమాలి తక్కటా? (నన్ను పరాభవించి ఆ కీచకుడు తన ఇంటికి జేరి సుఖంగా నిద్ర పోతున్నాడు- అవమాన పడింది పరాయి స్త్రీ కాబట్టి కలత లేకుండా వాడు సుఖంగా నిద్రబోగలుగుతున్నాడు- కట్టుకున్న పెళ్ళానికి ఇంత అవమానం జరిగితే నీ కంటికి కునుకు పట్టేంత నిబ్బరం ఎలా కలిగిందయ్యా? నా మీద జాలి మాత్రమైనా లేకుండా ఇలా పడుకున్నావంటే, పరాక్రమించొద్దని మీ అన్న పెట్టిన ఆంక్ష అడ్డు తగిలిందా ఏమి?) ఈ పద్యం ఆధారంగా రమణారెడ్డి విశ్లేషణ ఇలా సాగుతుంది: ‘‘... ఈ పద్యంలో తెలుగుదనం ఉట్టిపడటం కూడా గమనించదగిన మరో విశేషం. అది కేవలం తెలుగు పదాలను పలికించడంతో సాధించిన ప్రయోజనం కాదు. తత్సమాల మీదా, పొడవాటి సమాసాల మీదా నన్నయకు ఎంత మోజున్నా తెలుగు మాటలను ఆయన తక్కువేం వాడలేదు. అలాగే తిక్కన సంస్కృత పదాలను పూర్తిగా వదిలేయనూ లేదు. హల్లుల కలయికలో సంస్కృతానికి సంయుక్తాక్షరాల ప్రాధాన్యత మెండు. తెలుగు భాషకు ద్విత్వం ప్రాణాధారం. ‘క’కు కా వొత్తు, ‘త’కు తా ఒత్తు, ఇలా ఏ హల్లుకు ఆ హల్లే జత పడటం- అమ్మ, అక్క, అయ్య, చెల్లి, ఎర్ర, నల్ల వంటి హల్లుల కలయిక తెలుగు పదాల ప్రాథమిక స్వభావం... ద్విత్వాక్షరాలుండే పదాలను ఎన్నుకోవడమే కాకుండా, తరచూ ప్రాస స్థానంలో వాటిని వినియోగించే చమత్కారంతో తన రచనకు తెలుగుదనాన్ని సమకూర్చాడు. తెలుగు భాషకు నన్నయ కావ్య గౌరవం కలిగించగా, తిక్కన దానికి సాహిత్య సామర్థ్యాన్ని ప్రసాదించాడు.’’ ద్రౌపది పాత్ర ద్వారా తిక్కన ఎలా తెలుగుదనాన్ని చిత్రించారో వివరించడానికి ఈ 168 పేజీల పుస్తకం రాసినా-మొత్తం భారతాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది. వస్తువునూ, శైలినీ, భాషనూ త్రాసుతో లెక్కించినట్టు సాహిత్య సాము చేశారు రమణారెడ్డి. వారి భాష సున్నితపు త్రాసుకు తిక్కన స్ఫూర్తి కావచ్చు, కానీ దాన్ని మరింతగా సొంతం చేసుకొని ప్రపంచ విజ్ఞాన చరిత్రను తెలుగులో అందిస్తున్నారనే అంతరార్థం నాకు అవగతమైంది. - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 09440732392 -
సాంస్కృతిక కేంద్రాలే నివాళులు
తెలుగు భాషా, సంస్కృతులకు కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. వారి జన్మ స్థలాలనుఅభివృద్ధి పరడడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం. పాశ్చాత్య దేశాలు తమ చారిత్రక, సాంస్కృతిక రంగాలను మలుపు తిప్పిన మహా పురుషుల స్మారక స్థలాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా అభివృద్ధి పరిచాయి. మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, సంస్కృతులున్నాయి. ఇక్కడి సంస్కృతి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాచరిక వ్యవస్థ కొనసాగిన కాలంలోనూ ప్రజలు దాన్ని ప్రతిఘటించారు. ఒక జాతి చరిత్ర, సంస్కృతులు ఒక్క రోజులో నేర్పితేనో, నేర్చుకుంటేనో వచ్చేవి కావు. అవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తాయి. తెలంగాణలో ప్రజా సంస్కృతికి నాంది పలికిన యుగకర్తలు పాల్కురికి సోమన, బమ్మెర పోతన. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి కవులకు, కళాకారులకు సముచిత స్థానం దక్కలేదన్నది వాస్తవం. పైగా మన సాహితీ వేత్తలకు తమ ప్రతిభ, పాటవాల పట్ల ఉదాసీనత కూడా ఉంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండటమూ ఈ సంస్కృతి ప్రత్యేకతే కావచ్చు. తెలుగు భాషా, సంస్కృతులకు ఒక కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. ఎక్కడో కన్నడ ప్రాంతంలో వ్యాపించిన వీర శైవాన్ని ఆలంబనగా చేసుకొని, నన్నయ నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్న మార్గ కవితని కాదని దేశీ కవిత్వానికి పట్టం కట్టిన ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలకు అతీతంగా సాహిత్య సృజన కావించి సామాజిక వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు సాహిత్య స్థాయిని, స్థానాన్ని కల్పించిన వైతాళికుడాయన. సోమన, పోతనలకు మధ్య 200 సంవత్సరాల అంతరం ఉన్నా, భావజాలంలో అదే గుణాత్మకమైన మార్పు సాగడం విశేషం. సింగ భూపాలుని ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాచరిక వ్యవస్థను నిరసిస్తూ ‘ఇమ్మనుజేశ్వరాధముల్’ , ‘ధనమధాందుల కొలువేల తాపసులకు’ అనటం పోతనకే చెల్లింది. నన్నయ ఇత్యాధి కవులు రాజాస్థానాలలో ఉంటే సోమన, పోతనలు ప్రజాస్థానంలో నిలిచారు. అదే వీరి ప్రత్యేకత. వందల ఏళ్ళ క్రితమే ఇంతటి మహత్తరమైన భావజాలాన్ని తమ సాహిత్యం ద్వారా ప్రజలకు అందించిన మహాకవులను వారి జన్మ స్థలాలను విస్మరించి, వారి జయంతులను తూతూ మంత్రంగా ఇంత వరకు పట్టణాలలోనే జరిపారు. 1994లో నాటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య పేర్వారం జగన్నాథం వ్యక్తిగత చొరవ తీసుకొని పాలకుర్తిలో రెండు రోజులపాటు సోమనాథుని అర్ధ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మహాకవుల జన్మ స్థలాలైన పాలకుర్తి, బమ్మెరలను చూడాలని ఎంతోమంది రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సాహితీ ప్రియులు, పరిశోధకులు, ధార్మికులు వచ్చి ఆ గ్రామాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి చలించి పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటి అభివృద్ధి దిశగా ముందడుగు వేయడం హర్షణీయం. ప్రధానంగా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారిపై కేసీఆర్ ఈ బాధ్యత మోపారు. సాహిత్య సాంస్కృతిక రంగాలంటే నిత్యం తపించే రమణాచారి కృషితో సోమన, పోతన నడయాడిన ప్రదేశాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా మారుతాయి. పవిత్ర స్థలాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం కన్నా, వాటిని పరిశోధనా కేంద్రాలుగా మార్చడం మంచిది. భాషా, సంస్కృతుల పరిరక్షణకు, పరిశోధనకు అవి నెలవులు కావాలి. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతులు ప్రతిబింబించేలా అక్కడ ఒక మ్యూజియంలను ఏర్పాటు చేయాలి. నాటి నుంచి నేటి వరకు వచ్చిన సాహిత్యాన్ని ఆ ప్రాంతాలలోనే గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, వాటిలో భద్రపరచాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మరుగున పడిపోయిన మన కళారూపాలను వెలికి తీసేందుకు ఆడిటోరియంలను కూడా నిర్మించాలి. ఆ గ్రామాల్లోనీ మహాకవుల స్మారక చిహ్నాలను పరిరక్షించాలి. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను కల్పించిన నేపథ్యంలో తెలంగాణ కవుల రచనల్లోని విశేషాలను విశ్లేషించాలి. పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన భాషను, సంస్కృతిని సంరక్షించిన వారిమవుతాం. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశానికి అభినందనలు. లండన్ పక్కన్నే ఉన్న షేక్స్పియర్ జన్మ స్థలాన్ని ఒక పుణ్య స్థలంగా చూస్తారు. చైనాలో, అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో కవులను సాంస్కృతిక రాయబారులుగా చూస్తారు. మా వూరు పక్కననే బమ్మెర ఉంటుంది. కాబట్టి ఆనాటి మండలి చైర్మన్ చక్రపాణిని బమ్మెర తీసుకుపోయాను. బమ్మెర పోతన సమాధి దగ్గరకు కాలిబాటన నడచుకుంటూ పోయాం. ఆ మట్టిని చక్రపాణి తన సంచిలో వేసుకుని గర్వంగా వెళ్లాడు. ఇతర దేశాలలో మహాకవుల సమాధులను గొప్పగా చూసుకుంటారు. అలాంటి సత్కార్యాలకు ఆర్థిక వ్యవస్థ దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇక్కడి కవులను తమ గుండెల్లో దాచుకున్నారు. ఇప్పటికీ బమ్మెరలోని గ్రామ బావిని పోతన బావి అనే ప్రజలు పిలుచుకుంటారు. ప్రజల నోటి నుంచి వచ్చే ఆ మాటే ఆ మహాకవికి నిత్య సన్మానం. పాల్కురికి సోమనాధుడు రాసిన కావ్యం తను నివసించే గుట్టకు, ప్రకృతికే అంకితమిచ్చారు. అందుకే ఇప్పుడది పాలకుర్తి సోమనాథుని గుట్ట అయ్యింది. వాల్మీకి కావ్యం అంకితమిచ్చింది వల్మిడికి అంటారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగానే గాక సాంస్కృతిక కేంద్రంగా మార్చాలి. అక్కడ ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి. - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు చుక్కారామయ్య -
అమ్మ భాషంటే కంటగింపా?
రెండో మాట ‘ఒక భాషను నిత్యం వాడుకలో పెట్టుకోనప్పుడు, సంభాషణల్లో, తమ భాషీయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృభాషను వాడే వారి సంఖ్య అధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ఉనికి కాస్తా ప్రమాదంలో పడినట్లే లెక్క’ అని యూనెస్కో చాటింది. అందుకని తక్షణం జరగవలసిన పని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు అన్న తేడా లేకుండా రెండింటా మాతృభాషా మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయాలి. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో పిల్లలకు ప్రావీణ్యంగల ఉపాధ్యాయులు తల్లి భాషలో బోధించడమే ఉత్తమమైన విధానమని భాషా నిపుణులు భావిస్తున్నారు. అయినా, తల్లిదండ్రుల దృష్టి వేరే విధంగా ఉండి తమ పిల్లల్ని ఇంగ్లిష్ భాషా మాధ్యమంలో బోధిస్తున్న స్కూళ్లలోనే పెద్ద సంఖ్యలో చేరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లి భాషైన తె లుగును పక్కకు నెట్టేసి ఇంగ్లిష్‌ను ముందుకు నెడుతున్నారు. 2013-2016 మధ్య ఇంగ్లిష్ మాధ్యమంలో ఎస్ఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 60 వేలకు పెరిగితే అదే సమయంలో తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నా వారి సంఖ్య 40 వేలకు పడిపోయింది! ’’ వార్తలు (28-2-2016) దాదాపు 3,000 సంవత్సరాల చరిత్ర ఉండే తెలుగు జాతి తన మాతృ భాషను ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, పట్టభద్ర, పట్టభద్రానంతర విద్యా స్థాయిలలోనూ, వ్యవహారశైలిలోనూ కాపాడుకోలేక పోవడానికి కారణమేమై ఉంటుందని పైన తెల్పిన విపరిణామం ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా 13 ఏళ్లనాడే, ఈ మాసంలోనే ఐక్యరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక శాఖ చేసిన ప్రకటనలో దొరుకుతుంది! 21వ శతాబ్దం ముగిసిపోయే నాటికే విభిన్న చరిత్రలు గల అనేక ప్రపంచ దేశాల మాతృభాషలకు ‘కాలం మూడబోతోందని’ ఆ సంస్థ హెచ్చరించి ఉందని మరచిపోరాదు. ఎందుకంటే, సామ్రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాల మధ్య నలిగిపోతున్నందున, ఆ వ్యవస్థలను బతికించుకోవాలంటే ఆ సంక్షోభాల వలలోకి బడుగు వర్ధమాన స్వతంత్ర దేశాలను కూడా లాగాలి! తమ సరుకులను ఈ దేశాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేసి ఆ ‘సంతల’ స్వాధీనం ద్వారా రాజకీయ పెత్తనం మరి కొన్నేళ్లు నిలబెట్టుకోవడానికి ‘‘సరళీకృత’’ ఆర్థిక విధానాలను ప్రపంచంపై అవి రుద్దాయి. ‘తాటితోనే దబ్బనం’ అన్నట్టు ఈ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలు లాభాల వేటలో భాగంగా వర్ధమాన దేశాల ప్రజల భాషా మాధ్యమాన్ని కూడా (ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టి) మార్చి వేయాలి. అమ్మ భాషలకు అంగ్రేజీ గండం ఈ పరిణామం ఫలితంగానే క్రమక్రమంగా 7,000 ప్రపంచ భాషలలో సగానికి పైగా అంతరించాయనీ, కింది స్థాయిలో ఇంగ్లిష్ మాధ్యమం వ్యాప్తి వల్ల మాతృ భాషల ఉనికి మూలాలే దెబ్బ తినబోతున్నాయనీ ‘‘యునెస్కో’’ నిపుణుల పారిస్ సమావేశం హెచ్చరించింది. ఇంగ్లిష్ మాధ్యమం వల్ల మాతృభాషా మాధ్యమానికి, జాతుల తల్లి భాషలకు ప్రమాదం ఉండబోదని ‘విశాల హృదయం’తో భావించేవారు ఇప్పటికైనా తమ అభిప్రాయాన్ని మార్చుకొనక తప్పదని గ్రహించాలి. మన దేశానికి చెందిన విద్యాధిక శ్రేణులలోని కొందరు సహా అనేక దేశాల భాషా నిపుణులు, ఆచార్యులు, పాఠ్య ప్రణాళిక పరిశోధకులు పరభాషా మాధ్యమాన్ని ‘వ్యాపార’ కళగా చూడగల్గుతున్నారు. 2013-2016 మధ్య గత నాలుగేళ్ల వ్యవధిలోనే ఎస్ఎస్సీ ఇంగ్లిష్ మాధ్యమంలో చదివేవారి సంఖ్య పెరుగుతూ, ప్రభుత్వ తెలుగు స్కూళ్లలో తెలుగు మాధ్యమం కనుమరుగైపోవటం ఆందోళనకరం. మన పాత తరాల విద్యావంతులంతా ఉభయ భాషలూ నేర్చినవారే. ఎస్ఎస్సీతో విద్యాభ్యాసం ముగించిన పెద్దలు కూడా ఈనాటి పోస్ట్ గ్రాడ్యుయేట్ల కన్నా ఇంగ్లిష్‌లో పరిశుద్ధంగా మాట్లాడగలుగుతున్నారు. వారు తెలుగు భాషా మాధ్యమంలో మాధ్యమిక విద్యను అభ్యసించడం అందుకు ఒక ప్రధాన కారణం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించి... ప్రాథమిక, మాధ్యమిక దశల్లోనే గాక, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దశల్లో కూడా (ఇంజనీరింగ్, మెడిసిన్‌తో సహా) విద్యార్థులు మాతృభాషా స్పృహను కోల్పోకుండా కన్నడ సజీవశక్తిగా వర్ధిల్లే కనీస ఏర్పాట్లు చూసుకున్నారు. ‘పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’ భాషాపరమైన పరాయీకరణకు అలవాటు పడిన పాలకులకు, వారి పనుపున డూడూ బసవన్నలుగా ఉనికిని కాపాడుకునే కొందరు విద్యావేత్తలకు ఒక పాఠంగా యునెస్కో.. మాతృభాషల ప్రాధాన్యాన్ని ఇలా నినాదంగా వినిపించ వలసి వచ్చింది. ‘నేను నా అభిమాన భాషనే మాట్లాడతా/నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం/మా తల్లి భాషలోనే మా బిడ్డలకు నేర్పుతాం/ అసలు తామంటూ ఎవరో తెలియడం వారికి అవసరం గనక ’’! అంతే కాదు. ‘నవాజో’ జాతి పెద్దలు తమ పిల్లలకు మనిషి ఉనికి రహస్యాన్ని తెలుపడానికి ఉపయోగించే ఈ సామెతను కూడా అది 13 ఏళ్ల క్రితమే ఇలా ప్రచారంలో పెట్టింది. ‘నీవు శ్వాసించకపోతే గాలి లేనట్లే/నీవు నీ భాషలో మాట్లాడకపోతే ఈ ప్రపంచం లేనట్లే’! ఫ్రెంచి పదాలను వాడుకోకుండా పరాయి భాషా పదాలను వాడితే ఫ్రెంచ్ ప్రభుత్వం భారీ జరిమానా విధిస్తుందట. అలాగే మెక్సికన్లలో తల్లి భాషలోగాక, ఎరువు తెచ్చుకున్న భాషలో మాట్లాడితే నీ పేగు బంధాన్ని ఎక్కడ పాతిపెట్టావురా? అని ఎద్దేవా చేస్తారట. పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాల ద్వారా తల్లి భాషను ఎందుకు నిర్లక్ష్యం చేయరాదో, చేస్తే రాబోయే నష్టాలేమిటో చాలా వ్యంగ్యంగా చెప్పారు. ‘‘ఆంగ్లేయ భాష యేల చదువుకొంటివని నేను అధిక్షేపించను. ఇంతకన్న అధిక జ్ఞానమును కూడ నీవు ఆ భాషలో సంపాదింపుము. ఆంగ్లేయ భాషయే కాదు. ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకొనుము. నీ భాషకు వన్నె పెట్టుకొనుము. కానీ, ఆంధ్రుడివై ఉండియు ఆంధ్ర భాషలో ఆ అని నోరే మెదపలేనివాడవు కావద్దు. నాయనలారా, మనమెంత లక్షాధికారులమైనను, కోటీశ్వరులమైనను మన బతుకులు ముష్టి బతుకులే గాని మరియొకటి కాదు. ఈ ముష్టి దేవులాటలో వారి ఇంగ్లీష్ మాటలు కూడా ఎందులకు? ఆ ఏడుపేదో మాతృభాషతోడనే ఏడ్చిన మంచిది కాదా? మన ఏడుపు సహజంగానూ, సొంపుగానూ, స్వతంత్రముగానూ ఉండునే. ఏడుపులో కూడా మనకీ అస్వతంత్రత ఏమి ఖర్మము? పుట్టుక చేతనే కాక, బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత, ఆంధ్రులని అనిపించుకొనుడు’’ అని ఆయన హితవు చెప్పాడు. ‘‘అన్యభాషలు నేర్చి ఆంధ్రభాష రాదని సకిలించే ఆంధ్రుడా చావవెందుకురా’’ అని ప్రజాకవి కాళోజీ ధర్మాగ్రహంతో ప్రశ్నించాడు. తాజాగా కవి ఛాయారాజ్ ‘‘నా ప్రేమ, నా అభిమానం, మిత్రులకు అర్థం కావాలి/నా ఆగ్రహం, నా ఆవేశం శత్రువులకు అర్థం కావాలి/నా శ్రమ, నా శక్తీ నా భాషలోనే వ్యక్తం కావాలి/పుట్టుక దగ్గర, చావుదగ్గర పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’’! అందుకే ఈ మాతృభాషా రసాయనిక ప్రక్రియను అర్థం చేసుకున్న తర్వాతనే గాంధీ, విశ్వకవి రవీంద్రుడూ మాతృభాషలో పాలన, మాతృభాషలో బోధన, మాతృభాషలో న్యాయ స్థానాల తీర్పుల అవసరం గురించి నొక్కి చెప్పవలసి వచ్చింది. మళ్లీ మాతృ భాషా ఉద్యమం ఒకనాడు గిరీశం (కన్యాశుల్కం) తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు మీద ఖాతరీ లేదండీ అని ఫిర్యాదు చేశాడు గానీ, ఇప్పటి తెలుగోళ్ల పాలనలో కూడా ఇంగ్లిషు మాధ్యమం బడుల్లోనే కాదు, తెలుగు బడుల్లో కూడా వానాకాలం చదువులేననే అభిప్రాయం ప్రబలంగా ఉంది. ఉపాధ్యాయుల శిక్షణలోనూ అదే ధోరణి. ఉపాధి మిషపైన, టెక్నాలజీ పేరిట, ఇళ్లలో తల్లిదండ్రుల ధోరణీ ఇదే అమ్మా, నాన్న పదాలను భాషా మ్యూజియం వస్తువులుగా మార్చాం. తెలుగువాడు తన మాతృభాషా పరిరక్షణ కోసం నేటికి ఎందుకింత తపన పడవలసి వస్తోందో, ఉద్యమాలు చేయవలసి వస్తోందో ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది. ఒకనాడు ఇంగ్లిష్ భాషపై గ్రీకు, లాటిన్ ఫ్రెంచ్ భాషల పెత్తనాన్ని వదిలించుకోవడానికి ఇంగ్లండ్ ప్రజలకు 300 సంవత్సరాలు పట్టిందని మరవరాదు. నేడు మనమూ అలాంటి దుస్థితిలోనే ఉన్నాం. దేశీయ భాషల ఉన్నతిని, విద్యా, పాలనా స్థాయిల్లో మాతృభాషల వాడకాన్ని విస్తృతం చేయడానికి పాలకులు శ్రద్ధ చూపక పోవడానికి అసలైన కారణం ఉంది. బ్రిటిష్ పాలకుల విధానాలను వ్యతిరేకించేవారిపైన దేశద్రోహ నేరాన్ని (సెడిషన్) మోపడానికి కారకుడైన లార్డ్ మెకాలే దొరే గుమాస్తాగిరీ విద్యా విధానానికి పాదులు తీస్తూ (మినిట్ ఆఫ్ డిసెంట్) ‘మా తిండికి, మా వేషభాషలకు అలవాటు పడిన భారతీయులు మా ఇంగ్లిష్‌వారికి శాశ్వతంగా బానిసలుగా పడి ఉంటారు’ అన్నాడు. ఈ ప్రకటనకు మనం ఇప్పుడు ఆమోద ముద్ర వేస్తున్నామా? అందుకే ఒక భాషను కోల్పోవడమంటే దాని చుట్టూ అల్లుకున్న ప్రకృతిని, సంస్కృతిని, పద సంపదనూ కోల్పోవడమేనని ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కోడై కూస్తున్నారు. ఈ విషయంలో యునెస్కో మరొక అమూ ల్యమైన హెచ్చరికను కొసమెరుపుగా పేర్కొనక తప్పదు. ‘ఒక భాష తాలూకు భాషీయులు ఆ భాషను నిత్యం వాడుకలో పెట్టుకోనప్పుడు, సంభాషణల్లో, తమ భాషీయుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో మాతృ భాషను వాడే వారి సంఖ్య అధికంగా తగ్గిపోతున్నప్పుడు లేదా తన భాషను ఒక తరం మరొక తరానికి వారసత్వంగా అందించగల స్థితిలో లేనప్పుడూ ఆ భాష ఉనికి కాస్తా ప్రమాదంలో పడినట్లే లెక్క’ అని చాటింది. అందుకని తక్షణం జరగవలసిన పని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు అన్న తేడా లేకుండా రెండింటా మాతృభాషా మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేయాలి. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు.. abkprasad2006@yahoo.co.in -
మన తెలుగు భాషకు జేజేలు పలుకుదాం...!!
ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషల పరిరక్షణార్థం ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్స వంగా’’(ఫిబ్రవరి 21) ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ(విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ) యునెస్కో ప్రకటించింది. మాతృభాష కోసం కొంత మంది బెంగాలీ విద్యార్థులు పోరాడి ప్రాణాలను కోల్పోయారు. వారి త్యాగానికి నివాళిగా ఆ రోజున కనీసం అమ్మభాష గురించి ఆలోచించి ప్రణాళిక వేసి మాతృభాషల మనుగడకు ఆయా భాషలు మాట్లాడేవారు పూనుకోవాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రకటించారు. యునెస్కో సర్వేలో ఆంగ్లభాష అనే రోడ్డు రోలరు కిందపడి బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని తేలింది. ప్రపంచంలో సుమారు 7105 భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 2956 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో చెబుతున్నది. ఇందుకు కారణం పరభాష మీద మోజు- మాతృభాషపై శ్రద్ధ, ప్రేమ లేకపోవడమే. తెలుగు భాష పరిరక్షణకు నడుం కట్టకపోతే అంతరించే భాషల్లో చేరే అవకాశముంది. సృజనకూ, అమ్మభాషకూ ఆత్మీయ చుట్టరికం ఉంది. అమ్మభాషలోనే ఆలోచించగలిగినపుడే సృజన పురి విప్పుకుంటుంది కదా! జపాన్, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రెంచ్, అరబిక్, పార్సీస్, స్పెయిన్‌లాంటి దేశాలు వారి వారి మాతృభాషల సాయంతోనే ఆర్థికాభివృద్ధి చెంది ఖ్యాతిని గడిస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం! మాతృభాషను ప్రేమించు, భాషలన్నింటిని గౌరవించు, పరభాషను హరించకు అన్న రాజ్యాంగ స్ఫూర్తితోనైనా పాలకులారా! పరభాష మోజు వీడండి? ‘‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యి’’ అనే చందంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ‘‘అన్యభాష నేర్చి ఆంధ్రంబు రాదను సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’’ అన్న కాళోజీ మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు నేతలు వారి మాతృభాషలో మాట్లాడి ఓట్లేయించుకున్న వాళ్లే భావవ్యక్తీకరణ, భావోద్వేగాలకు ఆయువుపట్టు అమ్మభాషని మీకే ఎక్కువ తెలుసు? తెలుగు భాషకు చీకటంటూ లేనే లేదు. ప్రకాశం, ప్రచారం కల్పించాలనే చిత్తశుద్ధి పాలకులకు లేకపోవటమే చీకటి..! మాతృభాష మనుగడకు ఇప్పటికైనా కొన్ని చర్యలు తీసుకోవాలి. పాలకులతో పాటు తెలుగుజాతి కూడా నిండు మనస్సుతో యునెస్కో మాతృభాషల పరిరక్షణ ఇచ్చిన ప్రేరణ, మన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞపూని అమలుకు దిగాలి. శిశువుకి తొలి గురువు అమ్మ. ఆ అమ్మ ఒడి నుంచి నేర్చుకునే భాష మాతృభాష. అప్రయత్నంగా, ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే భాష ఇదే. దీని ద్వారానే రసానుభూతి, ఉత్తమ సంస్కారం, మానవతా విలువలు, సామాజిక నైతిక విలువలు పెంపొందుతాయి. భాష ఒక సమాజపు సొత్తు. ప్రతి తరం ఆ అద్భుత సంపదను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉండాలి. బిడ్డ శారీరకంగా ఎదగడానికి తల్లిపాలు ఎంత అవసరమో, మానసిక ఎదుగుదలకు అమ్మభాష కూడా అంతే అవసరం. ఏ భాషకైనా చతుర్విధ ప్రక్రియల ద్వారానే- వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంతోనే భాషాభివృద్ధి జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ శాఖలో పాలన, న్యాయ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రత్యేకంగా ఉపాధి, ఉద్యోగాలలో అవకాశాలు ఇవ్వాలి. 1-7 తరగతుల వరకు తెలుగు మాధ్యమంలో బోధన జరగాలి. కాదంటే.. కేజీ నుండి పీజీ వరకు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో తెలుగును తప్పనిసరి చేయాలి. విజ్ఞాన, సాంకేతిక, కంప్యూటర్ రంగాల్లో తెలుగు నిఘంటువు, ఆధునిక పరిజ్ఞానం ప్రతి ఆంగ్లపదానికి సమానార్థం వెతికే యజ్ఞం నిరంతరం సాగాలి. వ్యాపార ప్రకటనలు, దుకాణాల ముందు బోర్డులు తెలుగులో రాయించాలి. అమ్మభాష రాకపోతే అవతల భాషపై పట్టురాదన్న వాస్తవాన్ని అందరూ గ్రహించేటట్టు చేయాలి. గిరిజన ఆదివాసీ ప్రాంతీయ భాషలను రక్షించాలి. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ సంకల్పంతో చట్టాలను రూపొందించి భాష మనుగడకు చిత్తశుద్ధితో పాలకులు అడుగులేస్తే అనతికాలంలోనే అధికార భాషగా తెలుగు అమలు జరిగి తీరుతుందనడంలో సందేహంలేదు. మా పిల్లలు తెలుగులోనే మాట్లాడాలి, చదవాలి అనే భావన తల్లిదండ్రుల్లో రావాలి. వెర్రి ఆంగ్లమోజు తగ్గాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి భాష మనుగడకు ఉద్యోగ, ఉపాధి కల్పన చేసేలా పోరాడాలి. తెలుగు జాతిలో మరో భాష పరిరక్షణ ఉద్యమం స్వతంత్ర పోరాటాన్ని తలపించేలా చేయాలి. ‘‘మాతృభాష మాత్రమే మానవ పరిపూర్ణ వికాసానికి ప్రాణం పోస్తుందనేది’’ గొప్ప సత్యాన్ని మరవరాదు. కన్నడ, తమిళ రాష్ట్రాల పాలకుల భాషాభిమానాన్ని చూడండి! తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే, మాతృభాష ‘‘జ్ఞానాన్ని, సృజనాత్మకతను’’ పెంచుతుంది. ‘‘మాతృభాష కన్నయితే, ఆంగ్లభాష కళ్లజోడు లాంటిది.’’ అసలు కన్నంటూ ఉంటేగా కళ్లజోడుతో అవసరం ఉండేది! ఇప్పటి తీరుగా భాషమనుగడను గాలికి జాలికి వదిలితే జాతి, సంస్కృతి అంతమవుతుందనేది మరవరాదు? హాలుని గాథాసప్తశతి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం ప్రాంతానిది. అప్పటికే తెలుగు మాటలున్నట్లు చరిత్ర చాటుతుంది. లోతైన మూలాలు కలిగిన మురిపాల తెలుగు భాషను కాపాడుకోవడానికి నిష్టతో పనిచేద్దాం..! (అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా) మేకిరి దామోదర్, కన్వీనర్, తెలంగాణ సామాజిక రచయితల సంఘం మొబైల్ : 9573666650 -
తెలుగు విజయం
13 వేల మంది విద్యార్థులకు ఊరట హైకోర్టు స్పష్టమైన తీర్పు అందరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే గోపీనాథ్ విజ్ఞప్తి చెన్నై: నిర్బంధ తమిళంపై తెలుగువారు సాగించిన న్యాయపోరులో ఎట్టకేలకు విజయం సాధించారు. హైకోర్టు తీర్పుతో చట్టపరమైన ఉత్తర్వులు పొందడం ద్వారా మాతృభాషపై మమకారాన్ని నిలబెట్టుకున్నారు. నిర్బంధ తమిళం నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకున్న పదో తరగతి విద్యార్థుల మొర మద్రాసు హైకోర్టు ఆలకించింది. రానున్న పదోతరగతి పరీక్షల్లో మినహాయింపు కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న సుమారు 13 వేల మంది విద్యార్థులకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది. తమిళనాడులోని తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ తదితర 13 లింగ్విస్టిక్ మైనార్టీ భాషలకు చెందిన 40 శాతం మంది విద్యార్థులపై తమిళభాషను బలవంతంగా రుద్దేందుకు 2006 డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళం చట్టం తెచ్చింది. ఈ చట్టం కారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే లింగ్విస్టిక్ మైనార్టీ విద్యార్థులు బాధితులుగా మారిపోయారు. మా మాతృభాష మాటేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారికి ‘ఔట్ ఆఫ్ సిలబస్’గా చదువుకోండి అంటూ ప్రభుత్వం తేలిగ్గా తీసిపారేసింది. 2006 నాటి నిర్బంధ తమిళ చట్టం ప్రకారం 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసేవారు ఇతర పరీక్షలను తెలుగులో రాసినా తమిళం సబ్జెక్టు పరీక్షను విధిగా రాయాల్సి ఉంటుంది. తమిళ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం రాబోయే పదో తరగతి పరీక్షల్లో తమిళం సబ్జెక్టును విధిగా రాయాలనే నిబంధనను మాత్రం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద సుమారు 30 వేల మంది లింగ్విస్టిక్ మైనార్టీ విద్యార్థులు తెలుగా, తమిళమా అనే మీమాంసలో పడిపోయారు. మైనార్టీ ప్రజలను, వారి మాతృభాషను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టాన్ని అమలు చేయడంలో సాగిన నిర్లక్ష్యాన్ని లింగ్విస్టిక్ మైనార్టీల వారు కోర్టు దృష్టికి తెచ్చి పిటిషన్లపై ఏఐటీఎఫ్ తదితర తెలుగు సంఘాల నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్ తెలుగువారికి అండగా నిలవడంతోపాటూ ఇద్దరు పదోతరగతి విద్యార్థినులతో హైకోర్టులో ఇటీవలే మరో పిటిషన్ దాఖలు చేయించారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమించారు. కోర్టుకు హాజరైన ప్రభుత్వ అధికారులు చట్టం అమలులో లోపాలు లేవని, తమిళ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా సాగిందని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ వాదన నమ్మశక్యంగా లేదని భావించిన హైకోర్టు తెలుగువారి విన్నపాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబరు 24 సూచనగా చెప్పింది. అయితే హైకోర్టు సూచనలను ధిక్కరించిన ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయింది. మినహాయించాల్సిందే: హైకోర్టు : ప్రభుత్వ ధిక్కార ధోరణితో విస్తుపోయిన లింగ్విస్టిక్ మైనార్టీలు మరోసారి కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ సోమవారం స్పష్టమైన తీర్పునిచ్చారు. నిర్బంధ తమిళం నుంచి మినహాయించాలని కోరుతూ పాఠశాలలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల విజ్ఞప్తులను మన్నించాలని ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో ఇచ్చిన మినహాయింపును ఎంతకాలం పాటూ ఉంచాలో జ్యుడిషియల్ కమిషన్ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. మాతృభాషల రక్షణ ప్రభుత్వ బాధ్యత : నిర్బంధ తమిళం చట్టం అమలుపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మన్నిం చడంతోపాటూ లింగ్విస్టిక్ మైనార్టీల అందరికీ వర్తింపజేయాలని హోసూరు ఎమ్మెల్యే గోపీనాధ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని అన్నారు. లింగ్విస్టిక్ మైనార్టీల మాతృభాష పరిరక్షించడంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కోరారు. లింగ్విస్టిక్ మైనార్టీల గెలుపు : మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు లింగ్విస్టిక్ మైనార్టీల గెలుపని ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పేర్కొన్నారు. నిర్బంధ తమిళం చట్టంపై తాము సాగించిన పోరు వృథా పోలేదని అన్నారు. హైకోర్టు తీర్పుతో సుమారు 13 వేల మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయిందని తెలిపారు. న్యాయమే గెలిచింది : మాతృభాషను కాపాడుకునేందుకు తెలుగువారు సాగించిన అలుపెరుగని పోరులో న్యాయమే గెలిచిందని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ పేర్కొన్నా రు. ప్రతి ఒక్కరి మాతృభాషను గౌరవించడం ప్రభుత్వాధినేతల కనీస కర్తవ్యమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్బంధ తమిళంపై హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అందరికీ కనువిప్పు కాగలదని అన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం :నిర్బంధ తమిళం చట్టంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చాటుకునే ముఖ్యమంత్రి జయలలిత కోర్టు తీర్పును, తెలుగువారి ఆశలు, ఆశయాలను సైతం మన్నించాలని కోరారు. లింగ్విస్టిక్ మైనార్టీ ప్రజలకు జయ అండగా ఉంటే, రాబోయే ఎన్నికల్లో అదే ప్రజలు జయకు అండగా నిలిచి అఖండ మెజార్టీని కట్టబెడుతారని అన్నారు. -
విదేశీ వర్సిటీలు సరే, తెలుగు వర్సిటీ మాటేంటి?
తెలుగు విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోక ఎన్ని చేసినా వ్యర్థం సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో ‘సాక్షి’ ముఖాముఖి విజయవాడ : రాష్ట్రంలోని రెండు ప్రధాన యూనివర్సిటీల్లో పనిచేసే సుమారు 500 మంది అధ్యాపక సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు లేక చెంబులు, బిందెలు తాకట్టుపెట్టుకుని కాల్‌మనీ కోరల్లో చిక్కుతున్నారంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు, లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ కోసం తన అంతరంగంలోని తపనను యార్లగడ్డ ‘సాక్షి’ ముఖాముఖిలో ఇలా ఆవిష్కరించారు. సాక్షి: తెలుగు వర్సిటీ ఏర్పాటుకు మీ పోరాటం ఎలా ఉంటుంది? యార్లగడ్డ: పోరాటం అనే పెద్ద మాటలు నేను మాట్లాడలేను. అయితే రాష్ట్ర విభజన జరిగి దాదాపు సంవత్సరంన్నర గడిచిపోయింది. తెలుగు వర్సిటీ ఏర్పాటులో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అదే నా ఆవేదన. సాక్షి: తెలుగుకు ప్రాధాన్యం దక్కడంలేదంటారా? యార్లగడ్డ: కనీసం రాజధాని శంకుస్థాపన బోర్డులోనే తెలుగుకు చోటులేదు. అధికార భాష అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది శూన్యం. సాక్షి: తెలుగు యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం ఎందుకు? యార్లగడ్డ: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు పరిమితం చేసుకుని దానికి సురవరం ప్రతాపరెడ్డిగారి పేరు పెట్టుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రకటన చేశారు. వెంటనే ఈ విషయాన్ని మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లాను. సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి కేంద్రంగా తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. సాక్షి: సీఎం వాగ్దానం చేసి నెలలు గడిచింది కదా? యార్లగడ్డ: తెలంగాణ వాళ్లు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కూడా ఏపీలో ఉన్న 90 సెంటర్లకు సర్వీసులు నిలిపేశారు. జూలైలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పీఠాలకు సంబంధం లేదని ప్రకటించారు. జూలై నుంచి ఏపీలో ఈ వర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది 500 మందికిపైగా జీతాలు లేవు. వాళ్లు కుటుంబ పోషణ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కాల్‌మనీ బారిన పడుతున్నారు. అం బేడ్కర్ వర్సిటీకి సంబంధించి హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాక్షి: ప్రభుత్వంపై మీరు చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి? యార్లగడ్డ: నాది ఆగ్రహం కాదు. ఆవేదన. సెప్టెంబర్ 4న హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాధికారులు నవంబర్ 12 వరకు స్పందించకపోవడంతో హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు కోసం తహతహలాడిపోతున్నారు. వాటిని విద్యాసేవ కోసం స్థాపిస్తారా? రాష్ట్రంలో సొంత యూనివర్సిటీలను పట్టించుకోకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను పట్టుకొస్తానంటావ్. సాక్షి: డిప్లొమా ఇన్ జపాన్ భాష పెడతానంటావ్. డిప్లొమా ఇన్ ఫ్రెంచి భాష పెడతానంటారు. వంద భాషలు పెట్టండి. ముందు అమ్మభాష ఏది? యార్లగడ్డ: వర్సిటీల సిబ్బందికి జీతాలు అర్జెంటుగా ఇప్పించకపోతే మీరు ఎన్ని చేసినా వ్యర్థం. మీరు సమర్థులు అనిపించుకుంటారో లేక అసమర్థులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలని చెప్పడానికి నాకు ఎటువంటి మోహమాటం లేదు. వింటే సంతోషం. వినకపోతే ఎన్నికలొస్తాయ్ ప్రజలు చూసుకుంటారు. ఇది నా గొడవ కాదు. సాక్షి: మాతృభాష అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు? యార్లగడ్డ: అధికార భాషా సంఘానికి హరికృష్ణను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు అధికార భాషా సంఘం లేదు. దాని కార్యాలయం లేదు. అంచేత నేను ముఖ్యమంత్రిని కోరేదేమంటే అయ్యా తెలుగు భాషకు సంబంధించి మీ స్పీచ్ బాగుంది. కానీ ఆచరణ బాగాలేదు. దీనిపై దృష్టి పెట్టండి. -
తెలుగు: ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
ఒక విధంగా చూస్తే గాథాసప్తశతి తెలుగు భాషలోని ప్రథమ వాఙ్మయం- మౌఖికం. హాలుడు ఆ గాథలలోని సౌందర్యానికి ముగ్ధుడై వాటిని ప్రాకృత భాషలోనికి (రాజభాషలోనికి) ఆర్యావృత్తాలలోనికి అనువదించి ఉంటాడు. సింధూ నది ప్రాంతం నుండి ద్రావిడులు దక్షిణాదికి వలస వచ్చారని చరిత్ర చెప్పుతూ ఉంది. మరి వారు వలస రాకపూర్వం దక్షిణ భారతదేశమంతా జనశూన్యంగా ఉండినదా? జనావాసాలూ, జనాలూ లేనే లేరా? ఉండుంటే వారికొక భాష ఉండదా? వారి భాష ఏమైంది?దాక్షిణాత్య జనులు దక్షిణ భారతదేశం లోనే ఆవిర్భవించార నడమే సహజ సిద్ధాంతం. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదట వెలసిన ప్రముఖ ఆదిమానవులు నివాసం ఏర్పాటు చేసుకొన్న తుంగభద్రా, కృష్ణానదీ తీర పర్వతారణ్యాలే రామాయణంలో చెప్పబడిన కిష్కింధ. రామునికి కిష్కింధలోనే జనావాసాలు కనబడ్డాయి. కిష్కింధ సమీపంలో ఋశ్య మూకమూ, మాల్యవంతమూ అనే కొండల పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు కూడ హంపి వద్ద ఉన్న రెండు కొండలకు ఆ పేర్లే ఉన్నాయి. కిష్కింధలో నివాసం చేసుకొని ఉండినవారే రామాయణంలో చెప్పబడిన వానరులు. వారే ఆధునిక చరిత్రకారులు చెబుతున్న ద్రావిడులు. వాల్మీకి ఈ వానరులకు తోకలున్నట్లు వర్ణించినాడు కానీ అది కావ్య సౌందర్యానికే కావచ్చు. వారు మామూలు కోతులైతే వాల్మీకి వారిని అంతటి బృహత్కాయులుగా, శక్తిమంతులుగా వర్ణించి ఉండడు. అలా వర్ణిస్తే అది హాస్యాస్పదమౌతుంది. కాబట్టి వారు నిస్సం దేహంగా బృహత్కాయులైన, అనాగరికులైన ఆదిమానవులే. వారు మాట్లాడుతూ ఉండిన భాషే మూల దక్షిణ భారతభాష. ఆధునిక చరిత్రకారులు చెప్పే మూల ద్రావిడ భాష. ఉత్తరాది వారి నాగరికత దక్షిణాది నాగరికత కంటే చాలా ప్రాచీనమైనది. దక్షిణాదిలో భాషలు ఇంకా శైశవ దశలో ఉండగానే ఉత్తరాది వారి సంస్కృతంలో గొప్ప వాఙ్మయమే- వేదాలు- వెలిసింది. దక్షిణాదిలో ఒక పరిపాలనా వ్యవస్థ లేని కాలంలోనే ఉత్తరాదిలో రాజు, మంత్రులు, సేనాధిపతి, సైన్యమూ, పన్నులు, ఉద్యోగులు మొదలైన పాలనా వ్యవస్థ ఏర్పడింది. శ్రీరాముడు వనవాసం నెపంతో దక్షిణాదికి వచ్చి గోదావరీ తీరంలో నిలవడమూ, ఖరదూషణాదులను చంపడమూ, అందుకు ప్రతీకారంగా రావణుడు సీతను అపహరిం చడమూ, రామలక్ష్మణులు కిష్కింధ వాసులతో సఖ్యం చేసుకోవడమూ, వారి సాయంతో లంకకు వెళ్ళి రావణుని వధించి తిరిగి అయోధ్యకు చేరుకోవడమూ భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం. ఇది ఒక విధంగా రాజకీయ వ్యవస్థ లేని దక్షిణ భారతదేశాన్ని ఆర్య సంస్కృతి లోనికి లాగుకొనే ప్రయత్నం. రాజకీయ, సాంస్కృతిక దండయాత్ర. దక్షిణాదిలో మూలద్రావిడ భాష ఇంకా పరిపక్వమూ, వాఙ్మయ నిర్మాణ సమర్థమూ కాకముందే సంస్కృత భాష దక్షిణాదిపైన ఉప్పెనలా విరుచుకుపడింది. ఉత్తరాదికి సమీపంలో ఉన్న నేటి తెలుగు కన్నడ ప్రాంతాల మీద సంస్కృత ప్రభావం ఎక్కువగా పడింది. సంస్కృతం ఆధిక్యత క్రింద అచ్చమైన మూల ద్రావిడ పదాలు అనేకం మాయమై పోయాయి. భాష యొక్క మూల లక్షణాలైన క్రియా పదాలు, సర్వనామాలు మొదలైనవి మాత్రం ఎలాగో చెక్కుచెదరకుండా నిలిచాయి. తెలుగు కన్నడ ప్రాంతాలకు దక్షిణంగా ఉండిన తమిళ ప్రాంతం పైన సంస్కృత భాషా ప్రభావం అంతగా పడలేదు. తమిళం మూలద్రావిడ భాషకు దగ్గరగా నిలబడింది. తెలుగు, కన్నడం ఇంచుక దూరంగా జరిగిపోయాయి. ఇవికాక మూల ద్రావిడ భాష నుండి అనేక చిన్న చిన్న భాషలు చీలిపోయాయి. ఈ రీతిగా దక్షిణాది భాషలలో విభిన్నత్వం ఏర్పడటానికి చాలా కాలమే పట్టి ఉండవచ్చు. దాక్షిణాత్య భాషల వారు తమకంటూ ఒక లిపిని తయారుచేసుకొన్న సందర్భంలో తెలుగు భాష మాట్లాడేవారు తమ ఉచ్చారణకు అవసరమైన ముప్పై ఆరు అక్షరాలనేకాక సంస్కృత పదాల ఉచ్చారణకు అవసరమైన మరో ఇరవై అక్షరాలను కలుపుకొని తమ వర్ణ సమామ్నాయాన్ని రూపొందించుకొన్నారు. ఇక లిపి విషయానికొస్తే దక్షిణాది లిపులు కూడా బ్రాహ్మీలిపి నుండి పరిణమించినవే అంటున్నారు కొందరు భాషాశాస్త్రవేత్తలు. కానీ అది అంత సమర్థనీయంగా కనిపించదు. క్రీ.శ.575లో వేయబడిన కలిమెళ్ళ ధనంజయుని తొలితెలుగు శాసనంలోనూ, క్రీ.శ.848లో వేయబడిన అద్దంకి పండరంగని తొలి తెలుగు పద్యశాసనంలోనూ ఉన్న అక్షరాలను పరిశీలిస్తే ఆ శాసనాల లిపికీ బ్రాహ్మీలిపికీ పెద్దగా పోలికలు కనబడడం లేదు. న, ణ, డ మొదలైన మూడు నాలుగు అక్షరాలు మాత్రం నాగరి లిపిని పోలి ఉన్నాయి. తక్కినవన్నీ స్వతంత్రమైన లిపిగానే కనబడుతూ ఉన్నాయి. మాటలు సద్యఃస్ఫురణతో హఠాత్తుగా పుట్టుకొస్తాయి. మాటలు పుట్టడానికి అవసరమే తప్ప ప్రయత్నం అవసరం లేదు. లిపి అట్లా కాదు. లిపి వ్యాప్తి చెందాలంటే పరస్పర అంగీకారంతో అక్షర రూపాన్ని సృష్టించడం, జ్ఞాపకం పెట్టుకోవడం, పునఃప్రయోగం మొ దలైన అనేకాంశాలు అవసరమౌతాయి. మౌఖిక వాఙ్మయం వ్యక్తిగత సృష్టి- లిపి సామూహిక సృష్టి. బహుశా తెలుగు లిపికి ఈ విధమైన రూపకల్పన, అధికార ముద్ర శాతవాహనుల కాలం చివరి నుండి విష్ణుకుండినుల కాలం మధ్య ఏర్పడి ఉండవచ్చు. విష్ణుకుండినుల కాలంలోనూ తరువాత ఆంధ్రదేశాన్ని ఏలిన రాజులకాలం లోనూ తెలుగు లిపి పరిపుష్టంగా శాసనాలలో కనబడుతూ ఉంది. తెలుగువాడైన శాతవాహన రాజైన హాలుడు క్రీ.శ. మొదటి శతాబ్దంలో గ్రామీణ ప్రజలు పాడుకుంటూ ఉండిన ఏడు నూర్ల గాథలను ‘గాథాసప్తశతి’ పేరుతో సంకలనం చేశాడు. ఆ గాథలన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రాకృత భాషతో పని ఏమి? వారు ఆ గాథలను తెలుగులోనే రచించి ఉంటారు. ఒక విధంగా చూస్తే ఇదే తెలుగు భాషలోని ప్రథమ వాఙ్మయం- మౌఖికం. హాలుడు ఆ గాథలలోని సౌందర్యానికి ముగ్ధుడై వాటిని ప్రాకృత భాషలోనికి (రాజభాషలోనికి) ఆర్యావృత్తాల లోనికి అనువదించి ఉంటాడు. ఆనాడే గనుక తెలుగు భాషకు లిపి ఉండుంటే, హాలుడు ఆ గాథలను తెలుగులోనే యథాతథంగా తెలుగు గ్రామీణులు రచించిన ఛందస్సులోనే గ్రంథస్థం చేసి ఉండుంటే, తెలుగు భాషను రాజభాషగా చేసుకొని ఉండుంటే, ఈనాడు భారతఖండంలో తెలుగు యొక్క ప్రాబల్యమూ, తెలుగు వారి యొక్క కవితా వైభవమూ ఎంతో ఉజ్జ్వలంగా ఉండేవి. (చరిత్ర, తెలుగు, సంస్కృతం మీద సాధికారత ఉన్న కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళె ‘తెలుగు: ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా?’ చిరుపొత్తం రాశారు. అందులోని కొన్ని భాగాలే పై వ్యాసం.) -
తెలుగు కోసం న్యాయపోరు
చెన్నై : విద్యా సంబంధ దయనీయ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు తమిళ రాష్ట్రంలోని తెలుగువారు న్యాయపోరాటానికి దిగక తప్పలేదు. మాతృభాషపై మమకారాన్ని కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. నిర్బంధ తమిళం ముసుగులో మైనారిటీ ప్రజల మనోభావాలను కాలరాస్తున్న పాలకుల్లో కనువిప్పు కలిగించేందుకు అవిశ్రాంతపోరు అనివార్యమైంది. తమిళనాడులో తమిళం ప్రధాన భాషకాగా ఇంగ్లిషు, హిందీ వంటి జాతీయ, అంతర్జాతీయ భాషలను మినహాయిస్తే 13 మైనారిటీ భాషలున్నాయి. రాష్ట్ర జనాభాలో తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ తదితర 13 లింగ్విస్టిక్ మైనారిటీ భాషలకు చెందినవారు 40 శాతం వరకు ఉన్నారు. దేశం మొత్తం మీద త్రిభాషా సంప్రదాయం కొనసాగుతుండగా తమ కు హిందీ భాష వద్దంటూ 1970 కాలం లో తమిళనాడులో పోరాటం చేశారు. హిందీ అక్షరాలు కనపడితేచాలు వాటిపై తారుపూశారు. చివరకు రైల్వేస్టేషన్లలోని హిందీ అక్షరాలకు సైతం తారుపూతలో మినహాయింపు ఇవ్వలేదు. తమిళుల ఉద్యమానికి దిగివచ్చిన కేంద్రం ద్విభాషా సంప్రదాయానికి ఆమోదముద్ర వేసింది. తమిళనాడులోని అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లిషు, తమిళం భాషలే పరిమితమయ్యాయి. అంతటితో శాంతించని తమిళ పాలకులు (డీఎంకే ప్రభుత్వం) రాష్ట్రంలోని మైనారిటీ భాషల వారిని దెబ్బతీసేందుకు 2006లో నిర్బంధ తమిళం చట్టం తెచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకునే మైనారిటీ విద్యార్దులపై బలవంతంగా తమిళ భాషను రుద్దడమే ఈ చట్టం అంతరార్థం. మరి తమ మాతృభాష మాటేమిటని ప్రశ్నించిన వారికి ‘ఔట్ ఆఫ్ సిలబస్’గా చదువుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది. ప్రభుత్వానికి పట్టని భాషలో చదువుకుంటే ఫలితం ఏమిటనే వాదన మైనారిటీ వర్గాల్లో బయలుదేరింది. మాతృభాషాభిమానుల హక్కులను కాపాడేందుకు అఖిల భారత తెలుగు సమాఖ్య, సమాజ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి 2006లోనే సంయుక్తంగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేయడంతో సుప్రీం కోర్టు కెళ్లారు. దురదృష్టవశాత్తు రెండు కోర్టుల్లోనూ కేసు వీగిపోవడంతో మైనారిటీ భాషల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్బంధ తమిళంపైనా నిర్లక్ష్యం.. మైనారిటీ ప్రజలను, వారి మాతృభాషను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నిర్బంధ తమిళ చట్టాన్ని అనుసరించి కాంపోటెంట్ అథారిటీని ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. తమిళ సబ్జెక్టును బోధించాల్సిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం ఇందులో ప్రధానమైంది. అయితే చట్టం చేసిన ప్రభుత్వం అథారిటీ ఏర్పాటును అటకెక్కించేసింది. తమిళ ఉపాధ్యాయులు ఖాళీలను భర్తీ చేయలేదు.రాష్ట్రంలో మొత్తం 1500 మైనారిటీ భాషల వారి పాఠశాలలు ఉండగా, వీటిల్లో 900 తెలుగు పాఠశాలలు, 300 ఉర్దూ పాఠశాలలు, ఇతర భాషలవి ఉన్నాయి. మచ్చుకు ఒక్క మైనారిటీ పాఠశాలలో సైతం తమిళ ఉపాధ్యాయ నియామకానికి ప్రభుత్వం అనుమతించలేదు. 2006 నాటి నిర్బంధ తమిళ చట్టం ప్రకారం 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసేవారు ఇతర పరీక్షలను తెలుగులో రాసినా తమిళం సబ్జెక్టు పరీక్షను విధిగా రాయాల్సి ఉంటుంది. తమిళ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం రాబోయే పదో తరగతి పరీక్షల్లో తమిళం సబ్జెక్టును విధిగా రాయాలనే నిబంధనను మాత్రం అమలుచేసేందుకు సిద్ధమైంది. ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద 30 వేల మంది మైనారిటీ విద్యార్థుల మెడపై నిర్బంధ తమిళ చట్టం అనే కత్తి వేలాడుతోంది. ఏఐటీఎఫ్ నేతృత్వంలో సాగుతున్న న్యాయపోరులో భాగంగా కోర్టుకు హాజరైన అధికారులు చట్టం అమలులో లోపాలు లేవని, తమిళ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా సాగిందని బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు క్వాలిఫైడ్ తమిళ ఉపాధ్యాయుల నియామకంపై పూర్తిస్థాయి ఆధారాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో తమిళులకు పెద్దపీట.. ఏపీలో తమిళ విద్యార్థులకు పెద్ద గౌరవమే దక్కుతోంది. చిత్తూరు జిల్లాలో 11,170 మంది తమిళ విద్యార్థులు చదువుకుంటున్నారు. 66 తమిళ పాఠశాలలు, 6 కాలేజీలున్నాయి. ఎస్వీ యూనివర్సిటీలో 20 పీజీ సీట్లతో తమిళ విభాగమే ఉంది. 2003లో కార్వేటినగరంలో తమిళ టీచింగ్ ట్రైనింగ్ కాలేజీ ఏర్పడింది. ఈ కాలేజీలో మొత్తం 50 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా నాన్ లోకల్ కోటా కింద తమిళనాడుకు 20 శాతం కేటాయించారు. మాతృభాషల కోసం మరో పోరు.. మాతృభాషను కాపాడుకునేందుకు కొంతకాలంగా పోరు సాగిస్తున్నట్లు అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్) అధ్యక్షులు, లింగ్విస్టిక్ మైనారిటీ ఫోరం చైర్మన్ డాక్టర్ సీఎంకే రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 2012లో సీఎం జయలలితకు రాసిన ఉత్తరం ద్వారా ఒత్తిడికి గురైన ప్రభుత్వం అదే ఏడాది కాంపోటెంట్ అథారిటీని నియమించగా అనేక లోపాలు బయటపడ్డాయని తెలిపారు. 2013-14లో కోర్టుకు వెళ్లడంతో కేవలం 20 శాతం పాఠశాలల్లో తమిళ ఉపాధ్యాయులను నియమించిందని చెప్పారు. తమిళభాషను నేర్చుకునేందుకు మైనారిటీలు వ్యతిరేకంగా కాదని, అయితే మాతృభాషకు సైతం అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వివరించారు. 2006 నుంచి నిర్బంధ తమిళం చట్టం అమలుచేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు తమిళంపై పూర్తిస్థాయి పట్టు సాధిం చేవారని, ఈ పరిస్థితి లేనందున కోర్టు ద్వారా పోరు సలుపుతున్నట్లు చెప్పారు. 9వ తరగతి వరకు మైనారిటీ భాషలను చదువుకుని పదో తరగతిలో అకస్మాత్తుగా తమిళం రాయించడం ద్వారా 30వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కాలరాసినట్లు అవుతుందన్నారు. -
నిర్బంధ తమిళ చట్టంపై ఉద్యమిద్దాం
♦ తెలుగు భాషను పరిరక్షించుకుందాం ♦ ‘మాతృభాషను కాపాడుకుందాం’లో వక్తలు సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది’ గుర్తొచ్చినప్పుడు ఆహా.. ఓహో అనడం, తెలుగు కనపడాలి.. వినపడాలనే రాతలతో సరిపెట్టుకోవడం కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందంటే సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు అభిమానుల పోరాటాలతోనే ఉమ్మడి ఏపీలో అధికార భాషా సంఘానికి ఊపిరి వచ్చిందని, అదే స్ఫూర్తితో అంతా కదిలి తమిళనాడు సీఎం జయలలిత ఇంటి ఎదుట ఆందోళనకు ఉపక్రమిస్తే కానీ తిమిళనాట తెలుగు భాష బతికిబట్టకట్టదని వారు వాపోయారు. తమిళ పాఠశాలల్లో నిర్భంధ తమిళ చట్టంపై ఉద్యమించాల్సిందేనని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తమిళనాడు తెలుగు యువశక్తి, తమిళనాడు తె లుగు సంఘాల ఆధ్వర్యంలో ‘మాతృభాషను కాపాడుకుందాం’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో భాషాభిమానులు క్రిష్ణారెడ్డి, రామారావు, జర్నలిస్టు సంఘాల నేతలు ఎం. సోమయ్యతో పాటు పలువురు సాహితీ వేత్తలు, రచయిత పాల్గొన్నారు. తెలుగు వెండి తెరతోనే జయకు ఖ్యాతి... తల్లిదండ్రులను ఎవరైనా తక్కువ చేసినా, అవమానించినా ఊరుకుంటామా? లక్షలాది మంది తెలుగు వారున్న తమిళనాడులో తెలుగు వెలగాల్సిందే. తమిళనాడు సీఎం జయలలిత తొలుత తెలుగు వెండి తెరపైనే ఖ్యాతి గడించారు. తమిళనాడు ప్రజల్లో ఐక్యత ఎక్కువ. పాఠశాలల్లో నిర్భంద తమిళ చ ట్టాన్ని మనమూ సంఘటితంగా అడ్డుకుందాం. - వడ్డేపల్లి కృష్ణ, ప్రముఖ రచయిత జయ ఇంటి వద్ద ఆందోళన... ఇప్పటికే చాలాసార్లు ఆందోళన చేశాం. అయినా దిగిరాలేదు. ఇక సీఎం జయలలిత ఇంటిని ముట్టడించాల్సిందే. సమస్యను అక్కడే పరిష్కరించుకుందాం. తమిళనాడులో 90 వేల మంది విద్యార్థులు తెలుగు మీడియం చదువుతున్నారు. ఇప్పుడు తమిళంలో పరీక్షలు రాయమంటే ఎలా?. వారి భవిష్యత్తు కోసం తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, ప్రజలు ఉద్యమించాలి. - సినీ నిర్మాత, అభ్యుదయ వాది తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు రాష్ట్రాల భాషా సాంస్కృతిక శాఖలు చర్చ జరపాలి భాష పట్ల అభిమానం ఉండాలి. కానీ ఇతర భాషల పట్ల దురాభిమానం తగదు. దీన్ని ఎవరూ అంగీకరించరు. నాడు తెలుగుకు ప్రాచీన హోదా రాకుం డా అడ్డుకున్నది తమిళనాడువారే. పక్కనే ఉన్న రాష్ట్రం తెలుగును రద్దు చేయడం జుగుప్సాకరం. తెలంగాణ, ఏపీల భాషా సాంస్కృతిక శాఖలు స్పందించి, తమిళనాడు సాంస్కృతిక శాఖతో చర్చించాలి. - బసవపున్నయ్య,టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డిసెంబర్ 1 లోపల స్పందించకపోతే... డిసెంబర్ 1 లోపల జయలలిత ఈ చట్టంపై స్పందించి.. తమిళనాట తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలి. లేకుంటే డిసెంబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తాం. 20 కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషను జాతీయ రెండో అధికార భాషగా గుర్తించాలి. - కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి -
తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి
- తమిళనాడులో తెలుగు మాధ్యమం ఉండాలి - జయలలితకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ సాక్షి, విజయవాడ బ్యూరో: తమిళనాడులో తెలుగుభాషాభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. తమిళనాడు ప్రభుత్వం విద్యావిధానం-సామాజిక కలుపుగోలు లక్ష్యాలను అమలు చేస్తున్నందున తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించాలని ఆయన కోరారు. తమిళనాడులో తెలుగువారి కోసం పాఠశాల స్థాయిలో తెలుగును రెండో బోధన భాషగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖకు ఆదేశాలిచ్చి భాషాపరమైన సహకారం అందించడం వల్ల చారిత్రకంగా, సాంస్కృతికపరంగా, జాతులపరంగా తమిళనాడులో ఉన్న ప్రవాసాంధ్రుల వికాసానికి మీ ప్రభుత్వం దోహపడినట్టు అవుతుందని తమిళనాడు సీఎంను కోరారు. ఏపీలో 60 పాఠశాలు తమిళ మీడియం ఉన్నాయని సీఎం వివరించారు. 18 నెలల్లో పూర్తి చేయాలి కాకినాడ ప్లోటింగ్ ఎల్ఎన్జీ స్టోరేజ్ రీ గ్యాస్‌ఫికేషన్ యూనిట్ (ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ)ను 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో షెల్ ఇండియా కంట్రీ చీఫ్ యూస్మిన్ హిల్టన్‌తో మాట్లాడారు. టెర్మినల్ నిర్మాణానికి నిధులు సమీకరణ, సకాలంలో పనులు పూర్తి చేయడం వంటి విషయాలను చర్చించారు. పెట్టుబడులకు ముందుకొచ్చిన ఐఎఫ్‌సీ ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీజీడీసీ)లో 30 శాతం పెట్టుబడులు పెట్టేం దుకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) ముందుకొచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో ఐఎఫ్‌సీ రీజినల్ హెడ్ జెస్సికా జోలెన్ పార్మర్ భేటీ అయ్యారు. 40 ఏళ్లుగా అంతర్జాతీయ రంగంలో పనిచేస్తున్నామని 15 ప్లాంట్లు నెలకొల్పామని జెస్సికా సీఎంకు వివరించారు. జ్వరాల తీవ్రతపై సీఎం టెలీకాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్వహణ, అపరిశుభ్రత, అంటువ్యాధుల తీవ్రతపై సీఎం చంద్రబాబు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లాస్థాయి వైద్యాధికారులు, కలెక్టర్లు, ఇతరమున్సిపల్ కమిషనర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ, విజయవాడల్లో స్ల్వైన్ప్లూ నిర్థారణ కేంద్రాలను నెల రోజుల్లో ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు. జనవరి 1 నుంచి అన్ని సేవలూ ఆన్లైన్లోనే గ్రామపంచాయతీలు నిర్వహించే 11 రకాల పౌరసేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆన్లైన్లోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. జనన, మరణాల నమోదు, ఇంటి పన్నుల చెల్లింపులు, వ్యాపార అనుమతులు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి అన్ని సేవలను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు: సీఎం పటమట(విజయవాడ): ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆర్టీసి ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినందుకు బుధవారమిక్కడ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) ఆధ్వర్యంలో సీఎంను సన్మానించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. -
తెలుగు భాషను రద్దు చేయడం అన్యాయం
-
ఓకే మణీ బంగారం!
భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కొంతమంది తారలకు బోలెడంత క్రేజ్. కేరళ కుట్టి నిత్యా మీనన్ సంగతి అక్షరాలా అదే! అమ్మడికి ఇప్పుడు మలయాళంలోనే కాదు... తమిళ, తెలుగు భాషల్లోనూ ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కాస్తంత బొద్దుగా, పొట్టిగా ఉన్నప్పటికీ, అందంతో పాటు, కళ్ళతోనే కోటి భావాలు పలికించగల నేర్పు ఆమె సొంతం. అందుకే, ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అయితే, పారితోషికం కన్నా కథ, తన పాత్ర నచ్చడం మీదే నిత్య దృష్టి అంతా! అలా చాలా సెలక్టివ్‌గా ఉండే ఈ యువ హీరోయిన్ ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలోని ‘రుద్రమదేవి’లో కనిపించనున్నారు. తాజాగా ఆమె మణిరత్నం కొత్త సినిమాకు ఓ.కె. చెప్పారు. ఆ మధ్య ‘ఓ.కె. బంగారం’ సినిమాలో మణి డెరైక్షన్‌లో చేసిన నిత్యకు ఆయన డెరైక్షన్‌లో వరసగా ఇది రెండో సినిమా. ఇంకా పేరు పెట్టని పగ, ప్రతీకారాల కథ ఈ డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. తమిళంలో తీస్తూ, తెలుగులో కూడా విడుదల చేయనున్న ఈ చిత్రంలో కార్తీ, ‘ఓ.కె. బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యారు. కథానుసారం ఈ హీరోలిద్దరూ ఒకరితో మరొకరు తలపడతారు. ‘‘ఇప్పటికే కీర్తీ సురేష్‌ను ఒక నాయికగా ఎంపిక చేశాం. ఇప్పుడు నిత్యా మీనన్ కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటి స్తాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. మొత్తానికి, మణిరత్నం ‘ఓ.కె. బంగారం’లో మొన్న సమ్మర్‌కి అందరినీ ఆకర్షించిన నిత్య ఇప్పుడు రవివర్మ కెమేరా, రెహమాన్ సంగీతంలో మళ్ళీ తెరపై వెలిగిపోనుంది. -
రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే..
గుంటూరు: తెలుగు రాష్ట్రంలో రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే మాతృభాష ఉన్నత స్థితికి చేరుకుంటుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష రక్షణ, అభివృద్ధి మహాసభ, సదస్సు జరిగింది. తమిళనాట భాష రాజకీయాలను శాసిస్తున్న కారణంగా ఆ భాష అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యునెస్కో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని అన్ని దేశాలకు సూచించిన విషయాన్ని ఉటంకించారు. సమస్యకు అసలు మూలాలు గుర్తించి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టినప్పుడే తెలుగు భాషకు మహర్ధశ అని వ్యాఖ్యానించారు. గాంధీజీ మాటలను గుర్తుంచుకోవాలి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాషను మరిస్తే పుట్టగతులుండవన్న మహాత్మగాంధీ మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమెరికాలోను తెలుగు వారు తమ పిల్లలకు శని, ఆదివారాల్లో తెలుగు భాష నేర్పి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతిక పదాలు తెలుగులోకి తర్జుమా చేయడం, మన భాషను పరిపుష్టం చేస్తాయని చెప్పారు. మంచి పదాలు ఇతర భాషల నుంచి, తీసుకోవడం, కొత్తపదాలు అనువదించడం, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన భాషలో అందించడానికి మీడియా కృషి చేస్తున్నదని, ఇంకా చాలా చేయాల్సిన ఉందన్నారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్ రావు తెలుగు భాషా పరిషత్ ఏర్పాటు చేసి తెలుగీకరించిన పదాలను, విషయాలను అన్ని పత్రికలకు అందించే బృహత్తర కార్యక్రమం కొన్నాళ్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మాతృభాషను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషోద్యమ సమాఖ్య చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. సభకు అధ్యక్షత వహించిన సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ఉపన్యసిస్తూ.. గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభ తీర్మానాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని కోరారు. -
అక్షరంతోనే 'పునాది'
తెలంగాణ స్వరాష్ట్రాన్ని సా ధించుకుని ఏడాది గడిచిపో యింది. అరవయ్యేళ్ల పోరా టంతో సాధించుకున్న స్వరా ష్ట్రంలో ఎక్కడివక్కడ సర్దుకో వడంలోనే ఈ ఏడాది కాలం గడిచిపోయింది. ఇక మనకు నచ్చినట్లుగా మన ఇంటిని తీర్చిదిద్దుకునే పని మొదలె ట్టాల్సి ఉంది. ఇలా తీర్చిదిద్దుకోవడంలో పుస్తకం పాత్ర కీలకం. తెలంగాణ పాటకు, ఆటకు, పోరాటానికి అక్షర రూపం ఇచ్చి తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో అక్షరం పోషించిన పాత్ర అనిర్వచనీయం. కవులు కవిత్వంతో, ఉద్యమకారులు రచనలతో ప్రజ లకు అక్షరాయుధాలను అందించారు. తెలంగాణ పున ర్నిర్మాణంలోనూ ఇలాంటి మహత్తర పాత్రను అక్షరం పోషించాలి. తెలంగాణ సాయుధ పోరాటం, ఆంధ్ర మహాస భలు, గోలకొండ పత్రిక.. ఇలా ఎన్నెన్నో మైలురాళ్ల తర్వాత అంతిమంగా స్వరాష్ట్రం వచ్చింది. దీన్ని అభి వృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఏ ఒక్కరిపైనో లేదు. ప్రభుత్వం ఒక్కటి మాత్రమే ఈ పని చేయలేదు. ప్రభు త్వం తాను చేయగలిగిన పనులు తాను చేస్తూంటే, మరోవైపున తెలంగాణ సమాజం తాను చేయగలిగిన పనులు తాను చేయాలి. తెలంగాణ పోరాట సమయం లో సొంత జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టినట్లే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ కనీసం ఓ పదేళ్లపాటు ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. కానీ వలసపాలనలోని విద్యావిధానం దుష్ఫలితా ల కారణంగా తెలంగాణలో ప్రస్తుతం తల్లి కడుపులో ఉన్నప్పుడే అడ్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. గుర్రాన్ని గంతలు కట్టి నడిపినట్లు పిల్లలను చిన్నప్ప టినుంచే ఎంట్రన్స్‌ల బాటలో నడిపిస్తున్నారు. చదు వంతా నిత్యం పరీక్షల చుట్టే తిరుగుతోంది. ఫ్యాక్టరీలు గా మారిన విద్యాసంస్థల్లో విషయం అర్థం చేయించ కుండా బట్టీ పెట్టిస్తున్నారు. పిల్లలకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పల్లీలు ఎక్కడ కాస్తాయో తెలీదు. చెట్లెక్కడం రాదు. పల్లె తెలియదు. మట్టివాసన తెలియదు. ఈ పరిస్థితి మారాలి. ముఖ్యంగా బట్టీ చదువులను వదిలించుకోవాలి.బట్టీ పట్టి పరీక్షలు పాస్ అయినవారు సమాజాన్ని మార్చలేరు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న వారిని అందించేందుకు మనం కృషి చేయాలి. ప్రధానంగా తెలంగాణ భావజాలాన్ని సర్వవ్యాప్తం చేయాలి. తెలంగాణ భావజాలం: తెలంగాణ భావజాలం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అది యావత్ తెలంగాణ ప్రజానీ కం సొత్తు. ఈ నేలపై పుట్టిన ప్రతీఒక్క పార్టీ, ప్రతీ ఒక్క ప్రజాసంఘం, ప్రతీ ఒక్క సామాజిక సంఘం తెలంగా ణ భావజాలాన్ని ఉపయోగించుకునే వీలుంది. ఈ క్రమంలో వాటికి తోడుండేది అక్షరమే. ఆ అక్షరా లను తెలంగాణ నుడికారంతో, మమకారంతో మేళవిం చడమే మనమిప్పుడు చేయాల్సిన పని. తెలంగాణ పున ర్నిర్మాణం అంటే ఆయా రంగాల్లో కంటికి కనిపించే అభి వృద్ధి మాత్రమే కాదు. అంతకు మించిన స్థాయిలో కం టికి కనిపించకుండా ఉండే భావజాల వ్యాప్తి కూడా. తెలంగాణలో జరిగే ప్రతిపనిలో ఇది కానరావాలి. పాఠ్య పుస్తకాలు, పాఠ్యేతర పుస్తకాల విషయంలోనూ తెలం గాణ ఆత్మ దర్శనమివ్వాలి. పుస్తకం తెరిస్తే తెలంగాణ ఆత్మ సంభాషిస్తున్నట్లు ఉండాలి. అక్షరాలను తెలంగాణ భావజాలం ఆవహించడం అంటే మితిమీరిన జాతీయ వాద ప్రచారం కాదు. ఇప్పటివరకు పరాయీకరణ చెం దిన వివిధ అంశాలను తెలంగాణ మయం చేయడమే. పరాయీకరణం: అరవై ఏళ్ల పరాయి పాలనలో మన భాష పరాయీకరణ చెందింది. మన రాజకీయం, సంస్కృతి సమస్తమూ పరాయీకరణకు గురయ్యాయి. ఇప్పటికీ ఇది తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు కృషి చేస్తూనే ఉంది. ఈ ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే బహు ముఖ దాడి తప్పదు. అది అక్షరాలతోనే సాధ్యం. పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే కేజీ నుంచి పీజీ దాకా ఈ 60 ఏళ్ల పరాయిపాలనలో కొనసాగిందంతా రెండున్నర జిల్లాల భాషనే. దాన్ని పదిజిల్లాల తెలంగాణ భాషగా మార్పు చేసుకోవాల్సిన అవసరముంది. పరాయి పాల కులు మన చరిత్రను వెలుగులోకి రానీయకపోవడమే కాకుండా మనం మాట్లాడుకునే భాషను కూడా యాస గా మాత్రమే పరిమితం చేశారు. దాన్ని ఇప్పుడు ఒక సంపూర్ణ సర్వస్వతంత్ర భాషగా తీర్చిదిద్దుకోవాలి. తెగిన పేగుబంధం: తెలంగాణలో ఒక మూడుత రాల చరిత్రను చూస్తే తాత తెలంగాణ భాష మాట్లాడే వాడు. ఇతరులు తెలంగాణ భాషలో మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. తండ్రి కాలానికి వస్తే తాను స్వయం గా తెలంగాణ భాష మాట్లాడలేనప్పటికీ, ఇతరులు మాట్లాడితే అర్థం చేసుకోగలిగాడు. మనవడి కాలానికి వస్తే తాను తెలంగాణ భాష మాట్లాడలేడు. అర్థం చేసు కోలేడు. మూడు తరాల చరిత్రలో తెలంగాణలో ఇలాం టి కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. పురిటి గడ్డతో పేగుబంధం తెగిపోతోంది. సొంతతల్లిపై మమ కారం లేని వారు అన్నింటా విలువలకు తిలోదకాలు ఇస్తుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకూడదనుకుంటే, మనబిడ్డలను ఈ నేలతల్లి బిడ్డలుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. అందుకు పాఠ్యపుస్తకాలు వేదికలు కావాలి. భాష, సామాన్యశాస్త్రం సాంఘికశాస్త్రం, గణి తం ఇలా బోధించే అంశం ఏైదైనా సరే అందులో తెలంగాణతనం ఉట్టిపడాలి. ఆంగ్ల, తెలుగు మాధ్య మాలు రెండింట్లోనూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి లాంటి వాటి గురించి వివరించాలి. ఇదంతా కూడా తెలంగాణ ఆత్మ తనను తాను పునర్నిర్మించుకోవడమే. పుస్తకాలకు పట్టం: ఈ సుదీర్ఘ ప్రక్రియ విజయవం తం కావాలంటే పాఠ్యపుస్తకాలు మాత్రమే కాకుండా ఇంకా చదువదగ్గ పుస్తకాలను అనుబంధంగా జాబితా రూపంలో ఇచ్చి వాటిని విద్యార్థుల చేత చదివించాలి. స్కూల్లో ప్రస్తుతం పుస్తకం చదవలేని పరిస్థితులున్నా యి. పుస్తక ప్రదర్శనలు ప్రోత్సహించాలి. వాటిలో మన పుస్తకాలకు పట్టం కట్టాలి. మన భాషలో రచనలు రావా లి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటకం వంటి అం శాలపై పాపులర్ రచనలను పెద్ద ఎత్తున తీసుకురా వాలి. తెలంగాణ పునర్నిర్మాణం లక్ష్యంగా ఒక మహో జ్వల రచన, పఠన ఉద్యమాన్ని నిర్మించాలి. పుస్తకాలు చదివే అలవాటుకు బాల్యంలోనే బీజం వేయకుంటే ఎన్నిరకాలుగా కృషి చేసినా ఫలితం రాదు. తెలంగాణ తెచ్చుకున్నాం. దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ముందుతరం వాళ్లకు ఈ పుస్తక పఠనం ద్వారానే తెలి యజేయగలం. దీన్ని సామాజిక బాధ్యతగా తీసు కోవాలి. (వ్యాసకర్త: ఎం వేదకుమార్ చైర్మన్, తెలంగాణ రిసోర్స్ సెంటర్) మొబైల్: 9848044713 -
భవిష్యత్ తెలిసిన భాషాశాస్త్రవేత్త
తెలుగు మాతృభాషగా ఉన్నవారు, అంటే తెలుగువాళ్లు నిఘంటువులను సరిగా ఉపయోగించుకోవడం కూడా అలవాటు చేసుకోలేదు. 1987 ప్రాంతంలో ఆచార్య జీఎన్ రెడ్డి (గోళ్ల నారాయణస్వామి రెడ్డి, 1927-1989) చెప్పిన మాట ఇది. చేకూరి రామారావు, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి భాషా శాస్త్రవేత్తల సమకాలికుడు జీఎన్ రెడ్డి. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా, విశేష పరిశోధకునిగా ఆయన చెప్పిన ఈ మాట, ప్రాచీన భాష హోదా వివాదం కంటే చాలా ముందునాటిదే. వైస్‌చాన్స్‌లర్ అయిన తొలి తెలుగు అధ్యాపకుడు ఆయనే. జీఎన్ చెప్పిన ఆ మాట అభిమానాలకూ, ఆభిజాత్యాలకూ, వివాదాలకూ అతీతమైనది. భాష వర్ధిల్లడానికీ, అసలు బతకడానికీ అవసరమైన శాస్త్రీయ పద్ధతుల గురించి అవగాహన ఉన్న భాషాశాస్త్రవేత్తగానే జీఎన్ ఈ మాట అన్నారని అర్థమవుతుంది. ఇంతటి కఠోరవాస్తవాలు చెబితే తెలుగువారు భరించే స్థితిలో లేరు. అందుకే తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించినప్పటికీ ఆయన గురించి ఇప్పటివరకు పుస్తకమంటూ రాలేదు. ఇన్నాళ్లకైనా డాక్టర్ డీఎం ప్రేమావతి ఆ లోటు తీర్చారు. ‘జీఎన్ రెడ్డి’ పేరుతో ఆమె రాసిన చక్కని పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురించింది. ఈ పుస్తకం, ఇందులో చివర ఉన్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ చదివాక తెలుగువాళ్లకి ఆ భాషకు చెందినవారిమన్న స్పృహ ఉంటే చాలా ప్రశ్నలు వస్తాయి. రావాలి. జీఎన్ విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం అభ్యసించారు. తెలుగు భాషకు సంబంధించి మన బోధన, పరిశోధన ఎంత వెనుకబడి ఉన్నాయో గ్రహించారు. తెలుగు భాషా బోధనే కాదు, పాఠ్య ప్రణాళిక కూడా సక్రమంగా లేదన్నదే ఆయన వాదన. ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషను బోధించే ఉపాధ్యాయులకు భాష స్వరూపం, దాని తత్వం గురించి ఉండవలసినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని ఆయన చెప్పారు (దాని ఫలితాన్ని మనం చూడడం లేదా!). విదేశాల్లో పదో తరగతి తరువాత మాతృభాషా బోధన అనివార్యం కాదు. ఎందుకంటే, అప్పటికే విద్యార్థి మాతృభాషలో ప్రావీణ్యం గడించి ఉంటాడు (చదవడంలో, రాయడంలో కూడా). ఈ అంశాన్ని మనం గమనించామా? బోధన స్థితి ఇలా ఉంటే, పరిశోధన కూడా ఉపరిశోధనగానే ఉండిపోయిందని ఆయన గుర్తించారు. భాషలో పరిశోధన అంటే కావ్య నాటక ప్రబంధాలకూ, కవులకూ పరిమితం కాదు. ఆ భాష మాట్లాడే ప్రజల అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, నమ్మకాలు, పేర్లు, జీవనం- అన్నీ పరిశోధనాంశాలేనంటారు. ఎస్వీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖను ఆ మేరకు తీర్చిదిద్దేందుకు యత్నించారు. జీఎన్ తెలుగును కూడా ఒక భవ్య భాషగా గౌరవించారు. ఇప్పుడు చాలామంది దృష్టిలో తెలుగు భవిష్యత్తులేని భాష. ఆయన ఆశకూ, మన నిరాశకూ మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకు జనించిందో ఈ పుస్తకం జవాబిస్తుంది. (నేడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో 10.30కి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. వివరాలకు ఫోన్: 040-23264028) - కల్హణ ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషను బోధించే ఉపాధ్యాయులకు భాష స్వరూపం, దాని తత్వం గురించి ఉండవలసినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని చెప్పారు జీఎన్. -
'విదేశాల్లో మనభాషకు మనబడి'
న్యూయార్క్: తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చేయాలన్న తపనతో విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మన తెలుగును అమెరికాలో ఎక్కువమంది నేర్చుకొనేలా, తెలుగుపై మక్కువ కలిగించటానికి, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాలిఫోర్నియాలోని బే ఏరియా ప్రాంతంలో తెలుగువారు నివసించే ప్రాంతాలయిన సన్నివేల్, శాన్ జోస్, క్యుపర్టినో ,శాంతా క్లారా, ఫ్రే మాంట్, శాన్ రామోన్, ప్లజంటన్ నగరాల్లో మనబడిలో చేర్పించండి.. తెలుగు భాష నేర్పించండి' అనే నినాదాలతో బస్సులు, రైళ్ళపై వ్రాసిన పెద్దపెద్ద ప్రకటనలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ తాము చేపట్టిన ఈ కార్యక్రమం అమెరికాలో నివసించే తెలుగువారినే కాకుండా భారతీయులను ఇతర జాతీయులను కూడా ఆకర్షిస్తోందని, రోజు సమాచారం కోసం వారు చేస్తున్న ఫోన్ కాల్స్ అందుకు నిదర్శనం అని చెప్పారు. ఇక మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ, భారత్ కు వెలుపల నివసిస్తున్న తెలుగువారంతా తమ పిల్లలు అమ్మ భాష తెలుగును తప్పకుండా నేర్చుకునేలా ప్రోత్సాహించి, తరతరాల భాష మనుగడకు వారి వంతు భాద్యతను పోషించాలని అభ్యర్థించారు. పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం గుర్తింపుతోపాటు, అమెరికాలోని వేక్ కౌంటీ మరియు ఫ్రేమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ వారి గుర్టింపు పొంది,1000 మందికి పైగా స్వచ్ఛంద భాషా సైనికులతో అమెరికాలోని 35 రాష్ట్రాలు,12కి పైగా దేశాలలో దాదాపు 4500 మంది విద్యార్ధులకు తెలుగు వ్రాయడం, చదవటం, మాట్లాడటం నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి 2015-16 విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 12 నుంచి తరగతులు ప్రారంభించటానికి ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. పిల్లలను మనబడిలో చేర్పించాలనుకొనే తల్లితండ్రులు manabadi.siliconandhra.org ని వెంటనే సందర్శించ వలసిందిగా కోరారు. -
స్పెషల్‌డ్రైవ్ : యాసావేషాలు పార్ట్ -1
-
తెలుగు భాష పరిరక్షణపై జాతీయ సదస్సు
తిరుపతి: తెలుగును జాతీయ భాషగా ప్రకటించాలనే అంశంపై జూన్ 13,14వ తేదీల్లో తిరుపతిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు తాళంబేడు సాయిశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుభాషా పరిరక్షణ సమితి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాశ్చ్య పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలోనే నిర్వహించనున్న ఈ సదస్సుకు హాజరు కాగల వారు ఈనెల 31వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 944163385 నంబరును సంప్రదించాలని కోరారు.