వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్‌సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది.
ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment