తిండి బజార్లు
ఈ మధ్య తెలుగు భాషా వికాసానికి ఇంటర్నెట్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నా ఉద్దేశం ఒక్క భోజనం విషయం లోనే తెలుగు వ్యాపారస్తులు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారని చెప్పగలను. మరీ తొలి రోజుల్లో భోజనశాలలు లేవు. కేవలం మాధవ కబళమే. లేదా ఉంచ వృత్తి. అడిగితే లేదనకుండా ప్రతివారూ ఒక కబళం పెట్టేవారు. కొందరు ఉదారంగా వారాలిచ్చేవారు.
తరువాత వచ్చినవి పూటకూళ్లమ్మ ఇళ్లు. ఆవిడకి పేరు లేదు. ఆవిడ నరసమ్మయినా, లక్ష్మమ్మయినా పూట పూటకీ కూడు పెట్టే అమ్మే. గురజాడవారూ పూటకూళ్లమ్మకి పేరు పెట్టలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారి తల్లిగారు పేరు సబ్బమ్మ. ఆవిడ పూటకూళ్లు పెట్టి కొడుకుకి చదువు చెప్పించారని విన్నాను. ఆమె కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు.
దరిమిలాను సత్రాలు వచ్చాయి. కరివెనవారి సత్రం, ఉసిరికల సత్రం, గరుడా వారి సత్రం, కనకమ్మ సత్రం, సుంకువారి సత్రం - ఇలాగ. ఘంటసాల వంటి గాన గంధర్వుడిని పెట్టి పోషించిన మహారాజావారి సత్రం ఇప్పటికీ విజయనగరంలో ఉంది. తరువాత వచ్చిన హోటళ్లవారు ఇంత గొప్ప ఆలోచనల్ని చేయలేదని చెప్ప గలను. నా చిన్నతనంలో కోమల విలాస్, కొచ్చిన్ కేఫే, గణేష్ హోటల్, ఉడిపి హోటల్ బొత్తిగా నేలబారు పేర్లు.
ఇప్పుడిప్పుడు భోజనశాలలు రుచుల్ని మప్పాయి. ఒక హోటల్ పేరు ‘పకోడీ’. నేనయితే పేరుకి మరికాస్త రుచిని జతచేసి ‘ఉల్లి పకోడీ’ అనేవాడిని. మరొక హోటల్ ‘అరిటాకు’. ఇంకొకటి ‘వంటకం’. ఇంకో హోటల్ ‘ఆవకాయ్’. మరీ కస్టమర్ల మన స్సుల్లోకి జొరబడిన వ్యాపారి తన దుకా ణాన్ని ‘ఇక చాలు’ అన్నారు. ఏమిచ్చినా ఎవరూ అనలేని మాట. తింటున్న ప్పుడు అలవోకగా వినిపించే మాట. ఇక ‘వంకాయ’ తెలుగువాడి జాతీయ వంటకం. ఒక వ్యాపారి తన హోటల్‌ని ‘వంకాయ’ అన్నాడు. బొత్తిగా నేల బారుగా ఉంటుందేమోనని మరొకాయన ఇంగ్లిషులో ‘బ్రింజాల్’ అన్నాడు.
హైదరాబాదులో జూబ్లీహిల్స్‌లో ‘కారంపొడి’ అనే బోర్డు చూశాను. పక్కనే మరో హొటల్ ‘ఉలవచారు’. మరొక హొటల్ పేరు ‘గోంగూర’. ఈ లెక్కన ‘పప్పుచారు’, ‘కందిపప్పు’, ‘పనసపొట్టు’, ‘కొరివి కారం’, ‘చెనిక్కాయ పచ్చడి’కి చాన్సుంది. ఎవరెక్కడ ఏ మర్యాద చేసినా అత్తారింటికి సాటిరాదు. అందుకే ఒక హోటల్ పేరు ‘అత్తారిల్లు’. మరొకాయన అక్కడ ఆగక ఇంట్లోకే జొరబడ్డాడు - ‘వంటిల్లు’. అమెరికాలో తెలుగువారిని రెచ్చగొట్టే హోట ల్‌ని మా మిత్రుడొకాయన కాలిఫోర్నియాలో ప్రారంభించారు.
ఆ పేరు చదవగానే తప్పిపోయిన మనిషి కనిపించినంత ఆనందం కలుగుతుంది. పేరు ‘దోశె’. మరొక దేశభక్తుడు తన హోటల్‌ని ‘జైహింద్’ అన్నాడు. ఓనరుని బట్టి పేరొచ్చిన హోటల్ ‘బాబాయి హోటలు’. తమిళులు ఈ విషయాల్లో వెనుకబడ్డారని తమరు భావిస్తే పొరబడ్డారనక తప్పదు. చెన్నైలో ఒక హోటల్ పేరు ‘వాంగో! సాపడలామ్’ (రండి, భోంచేద్దాం). కట్టుకున్న పెళ్లాం కూడా ఇంత ముద్దుగా పిలుస్తుందనుకోను. మరొకా యన కసిగా ‘కొల పసి’ అన్నాడు. కొలై అంటే చంపడం. పసి అంటే ఆకలి. ‘చంపుకు తినే ఆకలి’ హోటల్ పేరు. మరో హోటల్ ‘కాపర్ చిమ్నీ’ (రాగి గొట్టాం). ఈ లెక్కన ‘ఇత్తడి మూకుడు’, ‘ఇనుప తప్పేలా’, ‘సిలవరి బొచ్చె’ వంటి పేర్లకి అవకాశముంది.
ఇంగ్లిష్‌వారు - దాదాపు అందరూ సినీమా ప్రియులు. నవలా సాహిత్యంలోనే తలమానికంగా నిలిచిన ‘టు కిల్ ఏ మాకింగ్ బర్డ్’ (రచయిత్రి హార్పర్ లీ ఈ మధ్యనే కన్నుమూసింది), హాలీవుడ్ సినిమాగా కూడా చాలా పాపులర్. ఆ పేరు ఒరవడిలో ‘టెక్విలా మాకింగ్ బర్డ్’ అని ఒక రెస్టారెంటు పేరు. టెక్విలా మెక్సికన్ మత్తు పానీయం. బ్రాడ్ పిట్ అనే పాపులర్ హీరో గారి పేరు గుర్తుకొచ్చేలాగ ఒకాయన ‘బ్రెడ్ పిట్’ అని తన హోటల్ పేరు పెట్టాడు. ‘ది గాడ్ ఫాదర్’ హాలీవుడ్‌లో చరిత్రను సృష్టించిన చిత్రం. ఒక రెస్టారెంటు పేరు ‘ది కాడ్ ఫాదర్’ అన్నారు.
కాడ్ ఒక ప్రముఖమయిన చేప పేరు. ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ పాపులర్ చిత్రం. మిమ్మల్ని ఆకర్షించిందా? ‘ప్లానెట్ ఆఫ్ గ్రేప్స్’కి దయచెయ్యండి. ఇదీ మిమ్మల్ని అలరిస్తుంది. ఇంకొకాయన ‘పన్’లో ముళ్లపూడిని తలదన్నే మహానుభావుడు. Let us eat అంటే ‘భోంచేద్దాం’ అని పిలుపు. ఈయన తన హోటల్‌కి ‘లెట్టూస్ ఈట్’ (Lettuce Eat) అన్నాడు. లెట్టూస్ ఒకానొక ఆకుకూర. భాషకి జన్మస్థలం నోరు. నోటినుంచి వచ్చే భాషనీ, వ్యాకరణాన్నీ, ధ్వనినీ, వ్యంగ్యాన్నీ సంధించి ఊరించే వ్యాపారులు ఇటు భాషకీ, దానిని ఉద్ధరిస్తున్న మనకీ గొప్ప ఉపకారాన్ని చేస్తున్నారని మనం గర్వపడాలి.
- గొల్లపూడి మారుతీరావు