
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. దాని పర్యవసానాల్లో ఒకటి, బయటికి వెళ్లే పనిలేకుండా చేయగలిగే పనుల గురించి ఆలోచించడం. అలాంటి ఒక కారణంతో మొదలైన ‘హర్షణీయం’ తెలుగు పాడ్‌కాస్ట్, సమస్త సాహిత్య ప్రపంచాన్ని తెలుగు గడపలోకి తెచ్చిపెట్టింది. అంతేనా? అనువాద ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే ఏ భాషవారికైనా ఒక ఆన్ లైన్ నిధిగా రూపొందింది.
2020 మార్చ్‌లో ముందు తెలుగులో ప్రారంభమై, తర్వాత తెలుగు– ఆంగ్లంగా మారి, అటుపై ఆంగ్లంలోకి కూడా వ్యాపించిన ఈ పాడ్‌కాస్ట్ ‘నూరు మంది అనువాదకుల’ సిరీస్‌ను ఇటీవలే ముగించుకుంది. ఇందులో మలయాళం, తమిళం, కన్నడం, గుజరాతీ లాంటి భారతీయ భాషల్లోంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నవారితో పాటు– థాయి, ఉజ్బెక్, వియత్నమీస్, హంగేరియన్, తుర్కిష్, నార్వేజియన్, మంగోలియన్, కిస్వాహిలీ లాంటి భాషల ఆంగ్లానువాదకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి.
దోస్తోవ్‌స్కీ ఉపరితల అంశాల మీద సమయం వృథా చేయరని చెబుతారు, గతేడాదే ‘బ్రదర్స్ కరమజోవ్’కు మరో ఆంగ్లానువాదం వెలువరించిన మైకేల్ ఆర్. కట్జ్. మనిషిని మలిచే కీలక క్షణాలు, విశ్వాసం, నైతికత, హింస, తీవ్రోద్వేగాల మీద దోస్తోవ్‌స్కీ దృష్టి ఉంటుందని అంటారు. పంతొమ్మిదో శతాబ్దపు రష్యన్ సాహిత్యాన్ని బోధించే మైకేల్ సుమారు 20 రష్యా నవలల్ని అనువదించారు.
దోస్తోవ్‌స్కీ ‘నోట్స్ ఫ్రమ్ అండర్‌గ్రౌండ్’లోని తొలి 30 పేజీలు అనువాదానికి అసలు లొంగనివని ఆయన అభిప్రాయం. ఒక పుస్తకం పుట్టించే తక్షణ స్పందనే దాన్ని అనువాదానికి పూనుకునేలా చేస్తుందని చెబుతారు అరుణవ సిన్హా. పదహారేళ్ల కాలంలో సుమారు 80 పుస్తకాల్ని బంగ్లా నుంచి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు.
సగటున ఏడాదికి ఐదు పుస్తకాలు! ఒక దానిలో దిగితే అందులో మునిగిపోవడమే ఇంత వేగంగా అనువదించడానికి కారణమంటారు. ఫుట్‌నోట్ ఇవ్వాల్సి రావడాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు హిందీ, ఉర్దూ నుంచి అనువాదాలు చేసే అమెరికన్ డైసీ రాక్‌వెల్. భాషల మీద ప్రేమతో ఆమె దాదాపు పదిహేను భాషలు నేర్చుకున్నారు.
ఇంకా, కరీమ్ అబ్దుల్ రహమాన్ (కుర్దిష్), జెస్సికా కోహెన్ (హీబ్రూ), లోలా రోజర్స్ (ఫిన్నిష్) లాంటివాళ్లు ఈ పాడ్‌కాస్ట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. అనువాద క్రాఫ్ట్‌తో పాటు మొత్తంగా అనువాద ఎకో సిస్టమ్ గురించి ఇంత విస్తారంగా ఒకేచోట మాట్లాడిన పాడ్‌కాస్ట్ ప్రపంచంలో ఇంకోటి లేదని ఐస్‌లాండిక్ అనువాదకురాలు విక్టోరియా క్రిబ్ కితాబునివ్వడం హర్షణీయం అందుకున్న ప్రశంసల్లో ఒకానొకటి.
మూడు దశాబ్దాలుగా స్నేహితులైన ఇంజినీరింగ్ క్లాస్‌మేట్లు హర్ష, అనిల్, గిరి ఉద్యోగాలు చేస్తూనే, పాఠకులుగా తమ అభిరుచితో ‘హర్షణీయం’ మొదలుపెట్టారు. ఇందులో హర్ష కథకుడు, అనిల్ అనువాదకుడు, గిరి సాంకేతిక నిపుణుడు. వక్తలను ఎంచుకోవడం, ప్రశ్నలు కూర్చుకోవడం ముగ్గురూ కలిసి చేస్తారు. ఎడిటింగ్ బాధ్యత కుదిరినవాళ్లు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు మాత్రం అనిల్ చేస్తారు.
సాహితీవేత్తలను ఇంటర్వ్యూలు చేయడంలో ప్రొఫెసర్ మృణాళిని ‘అక్షర యాత్ర’ తమకు స్ఫూర్తి అంటారు. ముందు తెలుగు రచయితల సంభాషణలతో మొదలుపెట్టి, తర్వాత ఇరవై నాలుగు రాష్ట్రాల్లోని పర్యావరణవేత్తల అభిప్రాయాలకు వేదికై, బిభూతీభూషణ్ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవలను యాభై వారాలు ఆడియోగా ఇచ్చి, తర్వాత అనువాదకుల వైపు మళ్లారు.
లోప్రొఫైల్‌లో ఉండే అనువాదకుల మెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ సంపాదించడం, వాళ్లకు తమ వివరాలు చెబుతూ సందేశాలు పంపడం, ఒక్కోసారి ఎనిమిది నెలల తర్వాత కుదురుతుందని చెబితే వేచివుండి(ఉదా: మైకేల్ కట్జ్) మళ్లీ సంప్రదించడం, ప్రశ్నలు ముందే పంపడం, విదేశీయుల సమయాన్ని బట్టి రాత్రుళ్లు మాట్లాడటం, వివాదాల జోలికి పోకుండా పుస్తకాల మీదే ఫోకస్ పెట్టడం వీళ్ల పనితీరు. ఎక్కువ అనువాదాలు జరిగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ అనువాదకులు కూడా సహజంగానే ఈ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకున్నారు.
‘ది హర్షణీయం పాడ్‌కాస్ట్ అండ్ ఇట్స్ ఇటాలియన్ లిటరేచర్ ఇన్ ట్రాన్ ్సలేషన్ ’ పేరుతో ‘ద గ్లోబల్ లిటరేచర్ ఇన్ లైబ్రరీస్ ఇనీషియేటివ్’ 2024 నవంబర్‌లో వీళ్ల పాడ్‌కాస్ట్ట్‌ను ప్రస్తావించడం విశేషం. కొన్నింటికి కాలం కూడా కలిసిరావాలి. ఇంకో కాలంలో అయితే ఇలాంటిది జరిగే అవకాశం లేదు. కొన్ని మెయిల్స్‌తో, ఒక్క ఫోన్‌కాల్‌తో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో సంభాషించడం ఎలా సాధ్యం? కాని కలిసొచ్చే కాలంలో కూడా ఎంతమంది ఇలాంటి పనికి పూనుకున్నారు? అందుకే వీళ్ల పని హర్షణీయం.
తెలుగు భాషలోని 56 అక్షరాలన్ని దేశాల వారితోనైనా మాట్లాడాలని సరదాగా వీళ్లు పెట్టుకున్న లక్ష్యం నెరవేరింది. అనువాదకుల సిరీస్‌లో భాగంగా, గతేడాది ప్రతిష్ఠాత్మక బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లాంగ్‌లిస్ట్‌లోని పదముగ్గురు అనువాదకులతోనూ సంభాషించారు. ఈ ఏడాది లాంగ్‌లిస్ట్‌లోని రిఫరెన్సుల్ని సాక్షాత్తూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ అడ్మినిస్ట్రేటర్ ఫియమెత్తా రోకో ఇచ్చి ఇంటర్వ్యూలకు సహకరించడం వీళ్ల విశ్వసనీయతకు చిహ్నం.
ఈ సంభాషణలు ఈ ఏప్రిల్‌లోనే ప్రసారం అవుతాయి. అక్కడివాళ్లను ఇక్కడికి తెస్తున్నారు సరే, తెలుగువాళ్లు అటుపోయే మార్గమేమిటి? ‘తెలుగులో గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ముందు ఆంగ్లంలోకి అనువాదం కావడం; ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ప్రచురితం కావడం అతిపెద్ద సవాలు. దానికి నాణ్యమైన అనువాదకులతో పాటు నిబద్ధత ఉన్న ప్రచురణకర్తలు అవసరం’ అని చెబుతారు అనిల్. తెలుగు సాహిత్యంలో ఆ వాతావరణం క్రమంగా చోటుచేసుకుంటోందనీ, రెండేళ్లలో సానుకూల మార్పు చూడబోతున్నామనీ అంటారు. ఇది ఇంకోరకంగా హర్షణీయం.