సందర్భం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్‌లైన్‌లో పంపించటం అనువాదకుల పని.
ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది.
ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు.
అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.
మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్‌సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు.
ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది.
టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు.
అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్‌సైట్‌లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.
తడకమళ్ళ మురళీధర్
వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జి
మొబైల్: 98485 45970
Comments
Please login to add a commentAdd a comment