
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:
ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో సహాయ పడతాయి.
షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్‌ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.
చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.
న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.
– ఆగూరు ఉమామహేశ్వరరావు
సీనియర్ న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment