
1. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్ ప్రజలకు బదిలీ చేస్తారు.
2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.
3. ట్రంప్ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు.
కారు వేగాన్ని యాక్సిలరేటర్‌తోనూ, బ్రేక్ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.
4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్‌లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్ చట్టం (లేదా స్మూట్–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది.
రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది.
5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్ డాలర్లు. ఈ 87.4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.
ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.
తనకు తెలియదని తెలియదు!
6. ట్రంప్ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్‌కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.
7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.
ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.
8. ట్రంప్ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.
ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్ గ్రీన్ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్ ఫ్యాక్టర్’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.
వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్’ సౌజన్యంతో)