
జనతంత్రం
‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ధర్మ విజయం’.’’ నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట! (ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ చిత్రమిది)
‘‘విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సి వస్తున్నది. ఇదీ మన పరిస్థితని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సమర్థించారు. అభివృద్ధికిబ్రాండ్ అంబాసిడర్‌నంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళికా సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈపరిణామం.’’ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట! (ఇదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రం)
‘‘ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరూపేరూ లేని కంపెనీలు ఈ స్కీములో లైను కట్టాయి. ఐఎమ్జీ భారత్‌కు అయ్యలాంటి స్కెచ్.’’‘లూటీ’ కోసం కోటి విద్యలు’! (ఇది కొత్తపుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక)
‘‘మద్యాన్ని ఏరులై పారిస్తే లోకకల్యాణార్థమట. దాన్ని నియంత్రిస్తే మహా పాతకమట!’’వినేవాడు వెర్రివాడైతే, చెప్పేవాడు... ... ! (ఇదీ ఆంధ్రప్రదేశ్ సమాచార స్రవంతి)
రూపాయంటే నూరు పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే! ఆచరణకు నోచుకోకపోతే విలువుండదు. ఆచరణయోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆలిండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వేయాలి. మంచినీళ్లడిగితే మబ్బులవంక చూపెట్టి, ‘అదిగదిగో’ అన్న చందంగా కూటమి ప్రజాపాలన సాగుతున్నది. మరోపక్కన కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం య«థేచ్ఛగా జరుగుతున్నది.
రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లలో తొమ్మిదివేల కోట్లు ‘మూల విరాట్టు’ హుండీలోకి చేరుకునేవిధంగా మంత్రాంగం నడిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ, ఖండించే సాహసం గానీ ప్రభుత్వం చేయ లేదు. చేయదు. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అనే ధోరణి. రాజధాని కాంట్రాక్టుల్లో ఈ లెక్కన ఇరవై రెండున్నర శాతం హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళికా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37 వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది.
అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరిగిన, జరుగుతున్న భూభాగోత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55 వేల ఎక రాలకు తోడు మరో 45 వేల ఎకరాలతో అమరావతి పార్ట్–2ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులూ, తటస్థ రాజ కీయవేత్తలూ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు మూడింట రెండొంతులు. అక్కడ కోటీ ఇరవై లక్షలమంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి – తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది.
రాజధాని నిర్మాణానికి సంబంధించి నిన్ననే ‘ఈనాడు’ పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అచ్చేసింది. సరికొత్త సచి వాలయ టవర్ల నిర్మాణం కోసం రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లను పిలిచిందట! ఇందులో ఐదు ఐకానిక్ టవర్లుంటాయని ఆ గ్రాఫిక్ బొమ్మను కూడా అచ్చేశారు. రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా వెయ్యి కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈమధ్యనే కట్టిన తెలంగాణా సెక్రటే రియట్‌కయిన ఖర్చు కూడా వెయ్యి కోట్ల లోపే! అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చయితే అంత ప్రయోజనం అను కున్నారేమో గాని ఐదు ఐకానిక్ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ‘ఈనాడు’ రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది.

ఈ గ్రాండ్ సెక్రటేరియట్ నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుందట! దీనికోసం సీఆర్డీఏ అధికారులు రాయ గఢలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట! ఇక్కడ స్టీల్ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచిరాల్లి వర్క్‌షాపుల్లో ఫ్యాబ్రికేట్ చేయించాలని నిర్ణయించారట! ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు భగ్గుమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఉక్కు సంగతే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలను మోస గిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులనుఅందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్ తలూపింది.
‘పోలవరం ఆంధ్రుల జీవనాడి’ అని బాబు మాట్లాడు తూంటారు. ఇప్పుడా నాడి స్పందన కోల్పోయినట్టే! 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాల్వలకు పారుతాయి. ఇప్పుడా లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎమ్సీల నుంచి 115 టీఎమ్‌సీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అను సంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.
ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ‘గోదా వరి – బనకచర్ల అనుసంధానం’ అనే పాటను చంద్రబాబు పదేపదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోనివిధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్య మవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులైనా ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ‘సూపర్ సిక్స్’ హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘అభివృద్ధికి ఆరు మెట్లు’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళికా సంఘం బృందానికి కూడా తన ఆరు మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్టు ‘ఈనాడు’ రాసింది.
‘ఆరు మెట్ల’ అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం – బనకచర్ల అనుసంధానాన్నే ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపో యింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు – తాగునీటి ప్రాజెక్టట! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన గణాంకాలనే తీసుకుందాము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30 లక్షల 74 వేల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది.
2019 ఆగస్టు 15 – 2025 మే మధ్యకాలంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అదనంగా 39 లక్షల 34 వేల గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి.మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36 వేల గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా?
అభివృద్ధి మూడో మెట్టుగా పర్యాటక హబ్‌ల ఏర్పాటు, నాలుగో మెట్టుగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరాలుంటాయట! ఐదో మెట్టుగా నౌకా శ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు తదితరాలు. ఆరో మెట్టు – అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటకాభివృద్ధిపై ఆచరణే గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు.
నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీ వంటి ‘నేమ్ డ్రాపింగ్’ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే! మంత్రదండం చేతబూని ‘ఓపెన్ ససేమ్’ అనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు ఐదేళ్లు పట్టవచ్చు. పదేళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్టుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది. అనుయాయులు వీరతాళ్లు వేస్తారు.
ఇక ఐదో మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలట! కేవలం ఐదేళ్ల పదవీకాలంలోనే నాలుగు నౌకాశ్రయాలను, పది ఫిషింగ్ హార్బర్లను, ఆరు ఫిష్ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నిటిని పూర్తిచేసిన జగన్మోహన్రెడ్డి ఆచరణ ఎక్కడ? ఇంకో ఇరవై రెండేళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడ? మిడిమిడి జ్ఞానపు, మీడియా జ్ఞానపు మేధావులంతా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరో అభివృద్ధి మెట్టుగా గ్రోత్‌సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది.
ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటయితే మన నిరుద్యోగులకు ఉద్యోగా లొస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడంఆందోళన కలిగించే విషయం. టీసీఎస్‌కు భూకేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్‌లైన్‌లో ఇంకా చాలా ఉన్నాయట!
కాంట్రాక్టుల్లో కమీషన్లు, భూకేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్ రూట్స్ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలా కుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనంలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడమనే కార్య క్రమాన్ని కూటమి సర్కార్ తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్ అంటే ఏమిటి? ఎటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది అనే మౌలికమైన ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.
మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి, అమ్మకందారులు లబ్ధిపొందేలా ప్రవా హాలను ప్రోత్సహించే పాలసీలో స్కామ్ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరూవాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, పది గజాలకో పర్మిట్ రూమ్‌తో మహమ్మారి విలయతాండవంచేసింది. జగన్ సర్కార్ మద్య నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది.
కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదు. 43 వేల బెల్టు షాపులను ఎత్తేసింది. పర్మిట్ రూమ్‌లను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేట్ వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న: ‘మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తా’ అని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? ‘మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే’నని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? బుద్ధిజీవులే నిర్ణయించాలి!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com