![YS Jagan Mohan Reddy answers questions asked by the media](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/222.jpg.webp?itok=TwOXbjpB)
అందుకే చంద్రబాబు బటన్ నొక్కరు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
నాడు మేము బటన్ నొక్కి పేదల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లు జమ చేశాం
ఈ స్థాయిలో పేదల ఖాతాల్లో జమ చేసింది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
మిథున్‌ను ఏదో రకంగా కేసుల్లో ఇరికించాలన్నదే చంద్రబాబు లక్ష్యం
దుష్ప్రచారం చేస్తే పెట్టుబడులు వస్తాయా?
సాక్షి, అమరావతి: ‘ఎలాంటి లంచాలకు తావు లేకుండా బటన్ నొక్కి రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేసింది గత ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు బటన్ నొక్కలేక పోతున్నాడు? బటన్ నొక్కితే ఏమీ రాదు కాబట్టి.. కమీషన్లు అందవు కాబట్టి.. అందుకే ఆయన బటన్ నొక్కలేకపోతున్నాడు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగినా, అక్రమాలు జరిగినట్లు సృష్టించి.. దానితో ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్‌రెడ్డిని సీఎం చంద్రబాబు ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
‘మా ప్రభుత్వ హయాంలో వాల్యూమ్స్ తగ్గాయి.. రేట్లు షాక్ కొట్టేలా ట్యాక్స్‌లు పెంచాం. ఇందుకు కమీషన్లు ఇస్తారా? లేక వాల్యూమ్స్ పెంచి, రేట్లు పెంచారు కాబట్టి చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చారా? చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చారని ఈనాడు రాస్తుందా?’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
లేనిది ఉన్నట్టుగా చెబితే పెట్టుబడులు వస్తాయా?
పెట్టుబడులు రావాలంటే.. రాష్ట్రం కోసం గొప్పగా చెప్పడం మొదలు పెట్టాలి. నువ్వంతట నువ్వే రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా, నెగిటివ్‌గా చెప్పడం మొదలు పెడితే ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇస్తావ్? దావోస్ నుంచి నీతి ఆయోగ్ దాకా చంద్రబాబు స్టేట్‌మెంట్లు చూడండి. రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా దుష్ఫ్రచారం చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
జిందాల్ వంటి సంస్థలు వస్తుంటే వాళ్లపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసి పంపించేశాడు. వాళ్లు పది మందికి చెప్పరా? జిందాల్ లాంటి వాళ్లకే ఈ పరిస్థితి ఉంటే.. మిగిలిన వాళ్లెందుకు వస్తారు? ఇలాంటప్పుడు ఏ పరిశ్రమైనా ఎందుకు వస్తుంది? అసెంబ్లీ సమావేశాలు మేం ఎందుకు బహిష్కరిస్తున్నామనే దానికి స్పీకర్‌ను అడిగితే బాగుంటుంది. అందుకే మీడియా ద్వారా ప్రజల గొంతుక విన్పిస్తున్నాం.
సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవన్‌లు లేవు.. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. వైఎస్సార్‌సీపీ–2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలుగుతాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, వ్యక్తిత్వం ప్రధానం. కష్టకాలం ఎల్లకాలం ఉండదు. ఓపిక ఉండాలి. జిల్లాల పర్యటనకు ఇంకా సమయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment