
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. ధర్నాలు నిర్వహించనున్నారు.
16,347 పోస్టులతో డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన తొలి సంతకం అభాసుపాలైంది. 9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ అతీగతీలేదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.
విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు: కన్నబాబు
కాకినాడ జిల్లా: పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.4,800 కోట్లు ఫిజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.
‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆయన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ పథకాన్ని వైఎస్ జగన్ విస్తృతంగా అమలు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే. మోసపోయిన ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ను నిలదీయడానికి వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment