
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ముందు చెప్పినట్టుగా బాబు ష్యూరిటీ,, మోసం గ్యారెంటీ అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారని చెప్పుకొచ్చారు.
వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ స్పీచ్‌లో అబద్దాలు చెప్పించారు. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్దాలు చెప్పారు. ఇవ్వన్నీ ఎక్కడ ఇచ్చారు?. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలు, ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చిన ఉద్యోగులు, ఉద్యోగాలు ఎక్కడ?. చంద్రబాబు అనే వ్యక్తి చేసేదంతా మోసమే.. చెప్పేవన్నీ అబద్దాలే’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment