
మిర్చి రైతుల విషయంలోనూ గారడీ, మోసాలే: వైఎస్ జగన్
రైతుల నుంచి ఉద్యోగుల దాకా అందరికీ బాబు ధోకా
12న విద్యార్థుల ఫీజులపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు..
‘‘ఆ 143 ఎన్నికల హామీలు కాకుండా చంద్రబాబు ఇంకా ఏమన్నాడో తెలుసా..? జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలేవీ ఆగిపోవని, ఇంకా మెరుగ్గా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా అని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాత్రం సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తోందంటాడు. ఆదాయం వచ్చే మార్గం ఏదైనా ఉంటే తన చెవిలో చెప్పమంటాడు. ఈ రోజు ప్రతి ఇంట్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే.. జగన్ పలావ్ పెట్టాడు..! చంద్రబాబు బిర్యానీ అన్నాడు..! ఇవాళ పలావ్ పోయింది.. బిర్యానీ మోసంగా మారింది!!’’ - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రతి వ్యవస్థను నీరుగార్చి పిల్లల నుంచి పెద్దల దాకా రైతుల నుంచి ఉద్యోగుల వరకు మోసగించిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా.. ఈ పథకాలన్నీ ధ్వంసం చేశారు.
రూ.25 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ.2.5 లక్షలకు తగ్గిస్తున్నారు. నిజంగా వీరు మనుషులేనా? ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీలో భాగంగా నాడు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. జాతీయ స్థాయిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే మన హయాంలో రాష్ట్రంలో 4 శాతం మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
వ్యవసాయం నాశనం..
వ్యవసాయాన్ని నాశనం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, ఈక్రాప్, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, పాలవెల్లువ ద్వారా సహకార రంగంలో విప్లవం లాంటివన్నీ నీరుగార్చారు. నాడు అమూల్ రాకతో పాల సేకరణ రేట్లు ఏడుసార్లు పెరిగాయి. గేదె పాలు రూ.18.29 పెరిగితే, ఆవుపాలు రూ.9.49 పెరిగింది. ఇప్పుడు హెరిటేజ్ లాభాల కోసం అమూల్‌ను లేకుండా చేస్తున్నారు. పాడి రైతుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.
మిర్చిపై గారడీలు.
మిర్చి రైతుల విషయంలోనూ గారడీ, మోసాలే కనిపిస్తున్నాయి. 40 రోజులుగా మిర్చి రైతుల అవస్థలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు లేక పంట అమ్ముకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి దాకా ఒక్క రైతు నుంచి ఒక్క కేజీ మిర్చిని కూడా చంద్రబాబు కొనుగోలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ లేదంటారు.
అదే బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్‌లో జోక్యం చేసుకుని పరిష్కారం చూపించేశామంటారు. ఎవరికి పరిష్కారం చూపించారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? ఈ బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ కోసం రూ.300 కోట్లు ప్రతిపాదించారు. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి కేటాయించాం. సీఎం యాప్ ద్వారా ధరలపై నిరంతరం పర్యవేక్షించాం.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. క్వింటాకు రూ.300 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి వచ్చింది. మిర్చి, టమాటా, పత్తి, మినుము, కందులు పెసలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.
సంక్షేమ పాలన...
వైఎస్సార్‌సీపీ పాలనలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్‌తోపాటే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లు పారదర్శకంగా అందచేశాం. మరోవైపు నాలుగు పోర్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. రామాయపట్నం పోర్టు 70 శాతం పూర్తి కాగా మచిలీపట్నం, మూలపేట 30 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టాం.

మా హయాంలోనే ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాం. 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చేపట్టాం. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ప్రతి అవసరంలోనూ తోడుగా నిలిచాం. అమ్మ ఒడి, ఆరోగ్య ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కల్యాణమస్తు, షాదీ తోఫాతో అండగా నిలిచాం.ఐటీసీ, ప్రాక్టర్ గ్యాంబుల్, అమూల్ లాంటి సంస్థలను తీసుకొచ్చి మహిళల ఆదాయాన్ని పెంచేలా తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.వెయ్యిగ ఉన్న పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళ్లాం.
పిల్లల చదువుకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో ఎప్పుడూ చూడని సంస్కరణలు తెచ్చాం. నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలన్నీ మారాయి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణానికి బాటలు పడ్డాయి. 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను అందచేశాం.
6వ తరగతి నుంచి ప్రతి తరగతి డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు అందించాం. పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తూ విద్యాదీవెన, బోర్డింగ్, లాడ్జింగ్‌కు ఇబ్బంది లేకుండా వసతి దీవెన అందించాం. ఈరోజు విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. పిల్లలను ప్రోత్సహిస్తూ అమ్మఒడి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు ధ్వంసమైపోయాయి.
ఉద్యోగులకు తీవ్ర మోసం
ఉద్యోగులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశాడు. అధికారంలోకి రాగానే సీపీఎస్, జీపీఎస్ పునః సమీక్షిస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను తొలగించాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. 10 నెలలు గడిచినా ఐఆర్ ప్రకటించలేదు. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటో తేదీన జీతాలు ఒకే ఒక్క నెల ఇచ్చారు. ఈరోజుకు కూడా జీతాల కోసం ఉద్యోగస్తుల ఎదురు చూపులే! ఉద్యోగుల జీపీఎఫ్, జీఎల్‌ఐ డబ్బులను వీళ్ల అవసరాల కోసం వాడుకుంటూనే ఉన్నారు.
డీఏలు, జీపీఎఫ్‌లు, సరండర్ లీవ్‌లు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్‌ఎస్ బకాయిలు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మా హయాంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 3 వేల మందిని రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7 వేల మందికి డిపార్టుమెంటల్ రివ్యూ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా పూర్తి చేయలేకపోయాం. రోస్టర్, రిజర్వేషన్, లెంత్ ఆఫ్ సర్వీస్ అన్నీ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పూర్తి చేశాం.
ఆ 7 వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఎందుకు ఆర్డర్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 9–10 శాతం జీతాలు పెరుగుతాయి. రెండు డీఏలు, ఒక ఇంక్రిమెంట్ రూపేణా పెరుగుతాయి. కానీ.. జీతాలు పెరగని పరిస్థితి ఒక్క చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నెలకొంది.
పైగా బడ్జెట్‌లో దీనికి సంబంధించి కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించారు. బేసిక్ పే రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో రూ.35,439 కోట్లు అయితే పెరగాల్సింది పోయి రూ.35,431 కోట్లకు తగ్గాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్ (యూనివర్సీటీల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాలు) 2023–24లో రూ.3,927 కోట్లు కాగా 2025–26లో రూ.2,944 కోట్లు మాత్రమే. అంటే కొత్త వీసీలను నియమించింది ఉన్న ఉద్యోగస్తులను తొలగించేందుకేనా? రిటైర్డ్ ఉద్యోగులకూ కేటాయింపులు పెరగకపోగా తగ్గాయి.
బాబు బకాయిలు మేం చెల్లించలేదా?
బడ్జెట్ స్పీచ్ చూస్తే.. ఆర్థిక శాఖ మంత్రి బకాయిలు తీర్చామని, అదొక ఘన కార్యంగా చెబుతున్నారు. బకాయిలు చెల్లింపు ఏటా జరిగే ప్రక్రియ. చంద్రబాబు వదిలేసిన బకాయిలు రూ.42,187 కోట్లు మేము చెల్లించాం. డిస్కంలకు పవర్ సరఫరా చేసిన సంస్థలకు మరో రూ.21,541 కోట్లు.. ఈ రెండు కలిపితే రూ.63,724 కోట్లు. చంద్రబాబు వదిలి పెట్టిన ఈ బకాయిలు మేం చెల్లించలేదా?
12న ఫీజులపై కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు
ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా పిల్లలను చదువులకు దూరం చేస్తోంది. విద్యా దీవెన, వసతి దీవెనకింద గతేడాది రూ.3,900 కోట్లు చెల్లించాల్సి ఉండగా చంద్రబాబు రూ.3,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ సంవత్సరం మరో రూ.3,900 కోట్లు చెల్లించాలి. ఈ రెండూ కలిపితే రూ.7,100 కోట్లు కావాలి. మరి బడ్జెట్‌లో ఆయన పెట్టింది కేవలం రూ.2,600 కోట్లు. ఇప్పటికే ఆన్‌లైన్ వర్టికల్స్ ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వారికి కట్టాల్సిన డబ్బులు కట్టక వారు వెళ్లిపోయారు.
మరోవైపు విద్యా దీవెన ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసే పరిస్థితి దాపురించింది. విద్యాదీవెన, వసతి దీవెన కోసం పిల్లల తరఫున, తల్లిదండ్రుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. మార్చి 12న జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం.
Comments
Please login to add a commentAdd a comment