
శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్
సాక్షి, అమరావతి : తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరికను పరిశీలించడం సాధ్యం కాదని శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై ఆయన రూలింగ్ ఇచ్చారు. ‘శాసనసభ అనేది ప్రజలు అనే దేవుళ్లు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. స్పీకర్‌గా నా బాధ్యత ఈ దేవాలయానికి పూజారిగా పని చేయడం మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు.
ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్ ఇవ్వజాలడు’ అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది జూన్ 24 తేదీన రాసిన లేఖ అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం అన్నాడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ద వాదనలు చేస్తున్నారని, లేఖలో ఎక్కడా ప్రత్యేక అభ్యర్థన లేదని తెలిపారు. లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత హైకోర్టును ఆశ్రయించారన్నారు.
ఆ పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉందని చెప్పారు. అయితే ఇటీవల ఈ అంశంపై జగన్‌మోహన్‌రెడ్డి, వారి పార్టీ నాయకులు.. ఉత్తర్వులు జారీ చేయాలంటూ స్పీకర్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసిందని ప్రచారం చేస్తున్నట్టు వార్తలు రావడంతో తప్పుడు ప్రచారానికి రూలింగ్ ద్వారా తెరదించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఈ రూలింగ్‌లో స్పీకర్ ఇంకా ఏమన్నారంటే..
కనీసం 18 మంది సభ్యులుండాలి
‘జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు జూన్ 26 తేదీ వరకు మా సచివాలయానికి తెలపలేదు. అలాంటప్పుడు, జూన్ 26 కంటే ముందు, అందునా స్పీకర్ ఎన్నిక జరక్కముందే ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? జగన్‌మోహన్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్న ఎన్నో అంశాలు సత్యదూరాలు.
వాస్తవాలను, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే, 175 మంది సభ్యులున్న నేటి రాష్ట్ర శాసనసభలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు. ఈ విషయమై స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment