ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్‌ జగన్‌ లేఖ | YS Jagan letter to AP Assembly Speaker Ayyannapatrudu | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్‌ జగన్‌ లేఖ

Published Wed, Jun 26 2024 3:19 AM | Last Updated on Wed, Jun 26 2024 11:39 AM

YS Jagan letter to AP Assembly Speaker Ayyannapatrudu

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ

ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి

చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు, తగినంత సమయం లభిస్తాయి

విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా..

చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వచించారు.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు

నాడు ఉపేంద్ర, పీజేఆర్‌ విషయంలోనూ ఇదే జరిగింది

మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారా?

శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు

అంతరంగం అప్పుడే అర్థమైంది..
ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్‌ జగన్‌ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..

శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..
మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్‌లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. 

చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో  పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.

చట్టంలో స్పష్టంగా ఉంది.. 
ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్క్వాలిఫికేషన్‌ యాక్ట్‌ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. 

కానీ జూన్‌ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్‌ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ  చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్‌ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్‌ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.

వైఎస్సార్‌ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్‌ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. 

వైఎస్సార్‌ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.

ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. 
అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 208 కింద ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే  విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్‌ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. 

అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్‌ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement