సాక్షి, అమరావతి: శాసన సభలో వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ అధినేత, పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు 30కి వాయిదా వేసింది. జగన్ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని, ఈ అంశంపై స్వయంగా వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 11 సీట్లు వచ్చాయన్న కారణంతో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఇచ్చే విషయంలో స్పీకర్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందునే ఇలా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ రవి ముందుకు విచారణకు వచ్చింది. ఆ వెంటనే ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
తాను శాసన వ్యవహారాలు, న్యాయ శాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, విచారణ రెండు రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులు కూడా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారి వైఖరి ఏమిటో తెలుసుకోవాలన్నారు.
సింగిల్ జడ్జి ముందుకు నేహా రెడ్డి వ్యాజ్యం
విశాఖపట్నం భీమిలి సముద్ర తీరం సమీపంలో ఉన్న తమ ప్రహరీని కూల్చివేసేందుకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సింగిల్ జడ్జి విచారణ జరపడం సబబని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
నేహారెడ్డి వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి ముందుంచాలని, సోమవారం విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అధికారుల ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉంటే వాటిని సవాలు చేసే హక్కు నేహా రెడ్డికి ఉందని ధర్మాసనం తెలిపింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment