
వైఎస్ జగన్ రామగిరి మండల పర్యటనపై సర్కారు నిర్లక్ష్యం
ఆర్మ్‌డ్, సివిల్ ఫోర్సెస్, రూట్‌మ్యాప్ పోలీసులు ఏమైనట్లు?
డీఎస్పీ స్థాయి అధికారి హెలిప్యాడ్ ఇన్‌చార్జ్‌గా ఉన్నా పట్టించుకోని వైనం
తాము చేయాల్సిందంతా చేశామన్న ఎస్పీ రత్న
ఇంతకంటే ఏం చేయలేమని సమర్థించుకునే యత్నం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అప్పటికప్పుడు వేలల్లో జనం తరలి వచ్చేంతటి క్రేజ్ ఉన్న రాజకీయ నాయకుడు.. పైగా మాజీ ముఖ్యమంత్రి.. అలాంటి నేత హెలికాప్టర్‌లో వస్తే ప్రభుత్వం భద్రత కల్పించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు గురి కావడం తెలిసిందే. ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 8న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చారు.
ఈ సందర్భంగా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగిన అనంతరం ఒక్కసారిగా జనం దాని చుట్టూ గుమికూడారు. ఈ జనం తాకిడితో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బ తినడం, అందులో వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం సాధ్యం కాక రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో భద్రతలో డొల్లతనం స్పష్టంగా బట్టబయలైంది. సర్కారు పెద్దలు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల డీఎస్పీని ఇక్కడ ఇన్‌చార్జిగా వేయడం వల్లే ఇలా భద్రతను గాలికొదిలేశారన్న విమర్శలొస్తున్నాయి.
మూడంచెల ఫోర్స్ ఏమైంది?
వాస్తవానికి ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి లాంటి నాయకులు హెలికాప్టర్‌లో వచ్చినప్పుడు మూడంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. హెలికాప్టర్ దిగిన వెంటనే టు ప్లస్ ఎయిట్ (అంటే పది మంది) ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఉండాలి. వంద మీటర్ల సర్కిల్‌లో పరిస్థితిని బట్టి 40 నుంచి 50 మంది సివిల్ ఫోర్సెస్ ఉండాలి. ఈ పరిధిలోకి ఎవర్నీ అనుమతించకూడదు. ఇది కాకుండా జనాన్ని బట్టి రూట్‌మ్యాప్‌తో పోలీసులు రౌండ్స్ వేయాలి. జనం హెలిప్యాడ్ వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు నియంత్రించాలి.
ఈ పరిస్థితి మంగళవారం ఎక్కడా కనిపించలేదు. వందల మంది జనం హెలిప్యాడ్ వద్దకు వెళుతున్నా నియంత్రించే వారే లేరు. ఇక్కడ పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌ను హెలిప్యాడ్ ఇన్‌చార్జిగా వేశారు. ఈయన కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్యకు మేనల్లుడు. స్వయానా పల్లె రఘునాథరెడ్డి ఈయన్ను ఏరికోరి ఇక్కడికి తెచ్చుకున్నారు. గతంలో ఈయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
అలాంటి అధికారిని హెలిప్యాడ్ ఇన్‌చార్జిగా వేయడమేంటని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యేను అనుమతి లేదని హెలిప్యాడ్ వద్దకు పంపని డీఎస్పీ.. అనంతరం వందల మంది వెళుతుంటే ఎందుకు వదిలేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జనాన్ని నియంత్రించాల్సిన బాధ్యత లీడర్లదేనన్న ఎస్పీ
‘మేము చేయాల్సిందంతా చేశాం.. ఇంతకంటే ఏమీ చేయలేం’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ‘లీడర్లు ఎవరొస్తారో, ఎవరు రారో వాళ్లే చూసుకోవాలి. వాళ్లే బారికేడ్లు పెట్టుకోవాలి. వీవీఐపీ భద్రత వరకూ ఏం చేయాలో అవన్నీ చేశాం.
జనం ఎక్కువ మంది రావడం, తరలించడం, వారిని నియంత్రించడం లీడర్ల బాధ్యత. పబ్లిక్‌ను రానివ్వట్లేదు.. కాలినడకన వస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. లీడర్లతో చెప్పాం.. ఎక్కువ మందిని తేవొద్దని. డెమొక్రసీలో ఇంత కంటే మేం చెయ్యలేం’ అని ఎస్పీ ప్రకటించడం చర్చనీయాంశమైంది.