రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు | YSRCP slams government in Legislative Council | Sakshi
Sakshi News home page

రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు

Published Thu, Mar 6 2025 5:15 AM | Last Updated on Thu, Mar 6 2025 1:28 PM

YSRCP slams government in Legislative Council

శాసన మండలిలో ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన వైఎస్సార్‌సీపీ

2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు

అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి

సర్కారు వైఖరికి నిరసనగా వాకౌట్‌  

సాక్షి, అమరావతి: అన్నదాతల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం దేశంలో ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు ప్రభుత్వమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తూర్పారబట్టారు. పంటలు పండక, పండినవాటికి  మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అమలైన ఉచిత పంటల బీమాను ఎత్తేసి, ఎకరానికి రూ.650 చొప్పు­న బీమా భారం మోపారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, తోట త్రిమూర్తులు, వై.శివరామిరెడ్డి అడిగిన ప్రశ్న బుధవారం శాసన మండలిలో చర్చకు వచ్చింది. 

ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది. 2014–19 మధ్య రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్నదాత సుఖీభవ ప్రశ్నపై చర్చలో పాల్గొనబోమని, వైఎస్సార్‌సీపీ వాకౌ­ట్‌ చేస్తోందని ప్రకటించి, ఎమ్మెల్సీలతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు సభ్యులు అడి­గిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసా­న్‌’ కింద రూ.20 వేలు చొప్పున ఆరి్థక సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సొంత పొలం ఉన్న రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, ఇందులో పీఎం కిసాన్‌ కింద రూ.6 వేలు కేంద్రం వాటా అని వివరించారు. పీఎం కిసాన్‌ లబ్దిదారులు 42.04 లక్షల మంది ఉన్నారని, వీరికి 2024–25లో రూ.2,553.45 కోట్ల చొప్పున కేంద్రం చెల్లించిందని వెల్లడించారు. 

అన్నదాత సుఖీభవకు రూ.9,400 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమ­లు చేశారని,  ఐదేళ్లలో రూ.33,640 కోట్లను రైతులకు ఇచ్చారని వివరించారు.  ఉచిత పంటల బీమాలో ఏ రై­తు బీమా పరిధిలోకి వస్తున్నారో, రావడం లేదో తెలియడం లేదన్నారు. అందుకే ప్రైవేట్‌ కంపెనీని ఎంపిక చేసి, రైతుల ద్వారా ప్రీమియం కట్టించే విధానం తెచ్చామన్నారు. 

సమాధానాలు మాని.. రాజకీయ విమర్శలా?
గత ఐదేళ్లు వ్యవసాయ శాఖకు పూర్తిగా తాళాలు బిగించారని అచ్చెన్నాయుడు విమర్శించగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మంత్రిపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నపై సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలకు దిగుతారా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు కొడవలి కూడా ఇచ్చిన దాఖలాల్లేవన్నారు. ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ.. రైతు కుటుంబం నుంచి వచ్చి, వారి కష్టాలు తెలిసిన అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

ఏ విషయం చర్చకు వచ్చినా అధికార పార్టీ నేతలు ఆవు కథ చెబుతున్నారని, బీఏసీలో రైతుల సమస్యల మీద చర్చించాలని వైఎస్సార్‌సీపీ కోరిందని, అది తమ పార్టీ అంకితభావం అని వివరించారు. తమ ప్రభుత్వంలో రైతులకు జరిగిన మేలుకు నీతి ఆయోగ్‌ నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆర్బీకే వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వీటిని వక్రీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.  మంత్రికి తెలియకపోతే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. 

మంత్రులు సభలో ఒక మాట చెప్పి, బయట మరోటి చెబుతున్నారని రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చ పెట్టాలని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న 53 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తామని మంత్రి కమిట్‌ అయ్యారన్నారు. అర్హులైన అందరికీ పథకం ఫలాలు అందాలన్నదే తమ కోరికగా తెలిపారు.  

అప్పుడలా.. ఇప్పుడిలానా..?
ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో పీఎం కిసాన్‌తో కలిపి రూ.20 వేలు అంటున్నారు. పీఎం కిసాన్‌ 42.04 లక్షల మందికే ఇచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర దక్కే పరిస్థితి లేదన్నారు.  

‘వరికి రూ.2300 ఉంటే రూ.1500 కూడా దక్కడం లేదు. కంది కర్ణాటకలో రూ.8,500కు కొంటే ఇక్కడేమో రూ.5,500 మాత్రమే. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు.  మంత్రి నాదెండ్ల మనోహర్‌ జోక్యం చేసుకుని, ధాన్యం కొనుగోలు మీద ప్రత్యేకంగా చర్చకు రావాలన్నారు. రైతుల కష్టాలపై మాట్లాడుతుంటే వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా? అని శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతులపై మోపిన బీమా భారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని తోట త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 80 % మంది కౌలు రైతులే ఉన్నారని వారికీ అన్నదాత సుఖీభవ అందిస్తారా? లేదా? అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశి్నంచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement