జనతంత్రం
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.
దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్‌లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.
తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.
పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.
పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.
మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.
గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి.
మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.
విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.
నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.
వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..
విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.
భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment