పద్యం తెలుగువారి ఆస్తి. మరో భాషలో లేని ఈ సాహితీశిల్పాన్ని తెలుగువారు తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. పండితుల కోసం, శిష్ట పాఠకుల కోసం ఛందోబద్ధ పద్యాలు ఉంటే పిల్లలూ పామరులూ చెప్పుకోవడానికి శతకాలు ఉపయోగపడ్డాయి. సులభంగా, సరళంగా ఉండే శతక పద్యాలు కాలక్రమంలో ఇంటింటి పద్యాలుగా మారి జీవన మార్గదర్శకాలు అయ్యాయి. వేమన పద్యం రాని తెలుగువాడు లేడన్నది నిన్నటి వరకూ నిత్యసత్యం.
‘శతకం’ అంటే వంద అనే అర్థం. అలాగని శతకంలో కచ్చితంగా వంద పద్యాలే ఉండాలని లేదు. అంతకు మించి కూడా రాశారు. పద్యం చివర్లో ‘మకుటం’ ఉండడమే శతకాల విశిష్టత. ‘మకుటం’ అంటే కిరీటం. శతక పద్యంలో దీని స్థానం శిఖరాయమానం. పూర్వ మహాకవులే కాదు, ఇప్పటికీ ఎందరెందరో శతకాలు రాస్తూనే వున్నారు. తమ జీవితంలోని అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి, ఇష్టదైవాల గురించి, ప్రియమైన వ్యక్తుల గురించి, భావోద్వేగాల నుంచి వందల కొద్దీ శతకాలు పుట్టిస్తున్నారు.
శతక పద్యాలకు నన్నయ ఆద్యుడంటారు. ‘బహువన పాదపాబ్ది... అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే పద్యాలు నన్నయగారి భారతంలోని ‘ఉదంకోపాఖ్యానం’లో ఉంటాయి. ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు ముగుస్తాయి. ఈ పద్యాలన్నీ వరుసగా ఉంటాయి. అలా పద్యంలో ‘మకుటం’ పురుడు పోసుకుందని చెబుతారు. శతక పద్యాలకు ఎవరు ఆద్యులు అనేది పక్కనపెడితే నన్నయ నుంచి నేటి వరకూ వందల సంవత్సరాల నుంచి శతకాలు బతుకుతూనే ఉన్నాయి, బతికిస్తూనే ఉన్నాయి.
తెలుగు నేలపై ఎన్నో శతక పద్యాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ వేమన పద్యాలే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. బద్దెన కూడా అంతే ప్రసిద్ధుడు. ఆయన రాసిన సుమతీ శతకం తెలుగువారికి సుపరిచయం. అలాగే భర్తృహరి సుభాషితాలు సుప్రసిద్ధం. ‘సుభాషితాలు’ అంటే మంచి వాక్కులు అని అర్థం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని తెనిగించి మనకు అందించిన మహనీయులు ముగ్గురు. వారు ఏనుగు లక్ష్మణకవి, ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇక భక్త రామదాసు రాసిన దాశరథీ శతకం, మారన కవి రాసిన భాస్కర శతకం, ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, నృసింహకవి కలం నుంచి జాలువారిన శ్రీకృష్ణ శతకం, శేషప్పకవి రాసిన నరసింహ శతకం, కుమార శతకం, కాసుల పురుషోత్తమకవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం... ఇలా ఎన్నెన్నో శతకాలను, శతకకారులను చెప్పుకోవచ్చు. అన్నీ మణిమాణిక్యాలే, జీవితాలను చక్కదిద్దే రసగుళికలే.
శతకాలు ఎందుకు నిలబడ్డాయి? అలతి అలతి పదాలతో లోకహితమైన సాహిత్య సృష్టి వాటిలో జరిగింది కనుక. సమాజంలోని దురాచారాలను, చాదస్తాలను, మూఢవిశ్వాసాలను మూకుమ్మడిగా ఖండిస్తూ జనానికి వాటిలో జ్ఞానబోధ జరిగింది కనుక. మానవ నైజంలోని విభిన్న రూపాల ఆవిష్కరణ జరిగి తద్వారా మేలుకొల్పు కలిగింది కనుక. ఫలితంగా సద్భక్తి భావనలు కలిగి, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యెడ మనుషులకు గౌరవ మర్యాదలు పెరిగాయి కనుక. నీతులు, లోకరీతులు తెలిశాయి కనుక. అందువల్లే జనులు వాటిని చేరదీశారు. తోడు చేసుకున్నారు. ఇలాంటి పద్యాలు మానసికంగా, శారీరకంగా వికసించే బాల్యంలో పిల్లలకు ఎంతో అవసరమని పెద్దలు భావించారు కాబట్టి శతకాలు నాటి కాలంలో బట్టీ వేయించేవారు.
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
– (వేమన )
తాత్పర్యం : చూడడానికి ఉప్పు, కర్పూరం ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు. అట్లే, మనుషులంతా ఒకేరకంగా వున్నా, అందులో పుణ్యపురుషులు అంటే గొప్పవారు వేరు.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్
వడి గల యెద్దుల కట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ
– (బద్దెన)
తాత్పర్యం: మంచి జీతం ఇవ్వని యజమానిని నమ్ముకొని కష్టాలు పడేకంటే మంచి ఎద్దులను నమ్ముకొని పొలం దున్నుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకవచ్చు.
ఇలా ఎన్నో పద్యాలను తలచుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే శతక పద్యాలు చదువుకోవాలి. శతకాలను బతికించుకుంటే అవి మనల్ని బతికిస్తాయి.
– మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment