భాషోద్యమంలో పిడుగు గిడుగు! | 29th August Is Telugu Language Day As A Tribute To Gidugu Smriti | Sakshi
Sakshi News home page

భాషోద్యమంలో పిడుగు గిడుగు!

Published Tue, Aug 29 2023 1:30 PM | Last Updated on Tue, Aug 29 2023 3:18 PM

29th August Is Telugu Language Day As A Tribute To Gidugu Smriti - Sakshi

"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు.

తెలుగు వెలుగు గిడుగు
ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి.

ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు.

పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు.

పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు.

వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు.

అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు.

గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు.

కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.

తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక.


 

మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్

(చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement