నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ! | Biography And Success Story Of Drawing Artist Gopi | Sakshi
Sakshi News home page

'గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్' కాలపు మనిషి.. గోపి!

Published Tue, May 21 2024 12:33 PM | Last Updated on Tue, May 21 2024 12:33 PM

Biography And Success Story Of Drawing Artist Gopi

"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప.
     అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!

⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్‌స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.

⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.

⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.

⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.

⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!

⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.

⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.

⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.

గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....

⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.

⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.

⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.

⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.

⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.

⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.

⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది.  ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.

⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.

⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.

⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.

⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.

⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement