Anwar
-
భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం
కోల్‌కతా: ఆటగాళ్ల బదిలీకి సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన భారత ఫుట్‌బాల్ ప్లేయర్ అన్వర్ అలీపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చర్యలు తీసుకుంది. అతనిపై నాలుగు నెలల నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత అన్వర్ ఆ కాంట్రాక్ట్‌ను పాటించకుండా అనూహ్యంగా ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు మారాడు. మరోవైపు వచ్చే ఏడాది వరకు కొత్త ఆటగాళ్లను తీసుకోవడంపై నిషేధం ఉన్నా సరే... దానిని ధిక్కరించి ఢిల్లీ ఎఫ్‌సీ కూడా అన్వర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తించింది. దాంతో విచారణ జరిపిన ఏఐఎఫ్ఎఫ్ అన్వర్‌పై నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది. అన్వర్ అలీ నుంచి రూ.12 కోట్ల 90 లక్షలు నష్టపరిహారం పొందేందుకు మోహన్ బగాన్ క్లబ్ జట్టుకు అర్హత ఉందని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని ఈస్ట్ బెంగాల్ క్లబ్, ఢిల్లీ ఎఫ్‌సీ, అన్వర్ కలిసి చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశించింది. -
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
న్యూఢిల్లీ: భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మంగళవారం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ టెక్నాలజీతో సహకారంతోపాటు స్టార్టప్ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. మలేషియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ టుంకూ అబ్దుల్ రెహ్మాన్’లో ఆయుర్వేద విభాగాన్ని, యూనివర్సిటీ ఆఫ్ మలయాలో తిరువళ్లువర్ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా ఆయన తొలి భారత పర్యటన ఇదే కావడం విశేషం.త్వరలో యూపీఐ, పేనెట్ అనుసంధానం: భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, మలేషియా మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సెమీకండక్టర్, ఫిన్‌టెక్, రక్షణ పరిశ్రమ, ఏఐ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ఇరు దేశాలకు మేలని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. -
భారత్‌కు మలేషియా ప్రధాని.. పీఎం మోదీతో భేటీ
భారత్- మలేషియాల దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేదిశగా మరో ముందడుగు పడబోతోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ చేరుకున్నారు.ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) మలేషియా ప్రధానితో విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్తో సహా పలు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారతదేశం నుండి మలేషియాకు అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే అంశంపై కూడా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్‌తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే దీనిపై ఎటువంటి పురోగతి కానరాలేదు. ఆర్థిక మోసం కేసులో నాయక్ భారత్‌లో వాంటెడ్ గా ఉన్నాడు. మలేషియా ప్రధాని ఇబ్రహీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా ప్రధానిని కలుసుకున్నారు. #WATCH | Prime Minister of Malaysia Dato’ Seri Anwar bin Ibrahim arrives in New Delhi on a three-day state visit to India He was received by MoS V Somanna pic.twitter.com/rfXPn48Zph— ANI (@ANI) August 19, 2024 -
రవి పరంజపే : చిత్రకారుల సంపద..!
అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో.. బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది. ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల మధ్య ఉండేది ఆంజనేయుల్స్ కలక్షన్ ఆఫ్ ఆర్ట్. వందలాది దేశీయ విదేశీయ బొమ్మల కత్తిరింపు కలెక్షనది. అవన్నీ అలా తలకిందుంచుకుని నిద్దరోతే కలలోనైనా బొమ్మలొస్తాయేమోనన్నది హనుమంతుల వారి థీరి.ఆంజనేయులుగారి రూముకి వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మలని తీసి చూస్తూ ఉండటం నాకో ముచ్చట. అంతటి ఆ బొమ్మల కలెక్షన్ లో ఒకసారి నాక్కనబడిందో నలుపు తెలుపుల ఇంద్రచాపం. దూరాన మైసూర్ మహరాజవారి ప్యాలెస్, దసరా సంరంభం, ఏనుగులు అంబారీలతో సహా బారులు తీరాయి. కొమ్ములూదుతున్న నల్లని శరీరాలు, చత్రాలు పుచ్చుకుని రాజ సేవకులు, దారికిరువైపులా జనం.. 1970-80 మధ్యలో అచ్చయిన పత్రికా ప్రకటన తాలూకు బొమ్మ అది. బహుశా నేనపుడే కళ్ళు తెరవడం, నడక, ప్రాకటం లాంటి వయసులోవుంటా. బొమ్మలాగే కింది సంతకం కూడా చక్కగా వుంది రవి పరంజపే అని.ఆనాటి నుండి మొదలైంది రవి పరంజపే గురించిన అన్వేషణ, నాకు తెలిసిన వారికెవరికి తెలీని పేరిది. ఎక్కడి వారో, ఇప్పుడెక్కడ వున్నారో చేప్పేవారే లేరు. కాలం గడుస్తూ వుంది, గూగ్లింగ్ సాగుతొంది, "నహీ ఉదాస్ నహీ" హేమంత్ కుమార్ పాట వినబడుతూనే వుంది. కృషో, దీక్షో, పట్టుదలో, అదృష్టమో 1098/A రుతిక, మోడల్ కాలని, పూనే. ఇది పరంజపే పతా, ఫొన్ నంబర్‌తో సహ దొరికింది,.ఫోన్ చేసి ఆయనతో మాట్లాడా, ఎక్జైంటింగా వుంది ఆయన్ని వింటుంటే, దయగల గొంతు, ప్రేమగా మాట్లాడారు, పూనే రమ్మన్నారు, నా బొమ్మలు పట్టుకు రమ్మన్నారు. ఆ దినం నుండి రెండు నెలలపాటు చాలా మంది స్థానిక చిత్రకారులతో మాట్లాడా. వారందరికీ ఆయన బొమ్మల లింక్ పంపించా. ఆయన వర్ణ విన్యాసాలు వివరించా. అందరూ నాకు మళ్ళేనే థ్రిల్లయ్యారనిపించింది. చివరకు ట్రైను ఎక్కేరోజు నన్ను నేనే మోసుకుని బయలుదేరా.. చలో మహారాష్ట్ర్, జై మహారాష్ట్ర్.ఉదయం 6 గంటలకు దిగి చూస్తే రోమింగ్ లేక ఫోన్ డెడ్, మొబైళ్ల పుణ్యమాని వీధులో పబ్లిక్ బూతులు, ఎస్టీడి షాపులు లేవు, ఒకే ఒక్క కాల్ ప్లీజని సెల్లున్న వాడినెవడినైనా అడుక్కుంటే అలీబాబా 27వ దొంగని చూసినట్టు నా వైపు అదో లుక్కు. ఇదంతా వ్రాయదగ్గ మరో చావు. అఫ్జల్ గంజ్ టూ లంగర్ హౌజ్ వయా తార్నాక సూత్రం తెలిసిన ఆటో వాడి ఆటోలో 9:30 కు మొడల్ కాలనీలో ఆడుగు పెట్టా. ఇంటి నెంబర్ దొరక బుచ్చుకొడానికి చాతకాల(మధ్యలో వొ యధార్థ జోక్ బాపు గారిని కలవడానికి మద్రాస్ వెల్లినపుడు ఆయనకు ఫొన్ చేస్తే ఆయనన్నారు "ఫలానా కాలనీకి వచ్చి ఫలనా చోట ఆగి ఫలానా బాపు ఇల్లెక్కడని అడగకండి! ఎవరికీ తెలియదు, మలయాళి సూపర్ స్టార్ ముమ్ముట్టి ఇల్లు అడగండి ఎవరైనా చెబుతారు, ఆయన ఇంటి ఎదురిల్లే మాది, చాలా ఈజీ ". సిగ్గులేకుండా మేమలాగే బాపుగారి చిరునామా కనుక్కున్నాం కూడా.)పూనా లెఖ్ఖ కాస్త తేడాగా వుంది పరంజపే ఇల్లు అడిగీ అడగంగానే అరకిలొమీటర్ దూరం నుండే జనాలు సినిమా థియేటర్ అడ్రస్ చెప్పినంత ఈజీగా చేప్పేశారు .పరంజపేది పెద్ద బంగళా. భక్తిగా, ప్రాణంగా చేసిన బొమ్మల పని సంపాదించి పెట్టిన ఇల్లది. ఇంటర్నెట్లో చూసి వూహించుకున్న బొమ్మలు వేరు, ఇక్కడి వాస్తవం వేరు. ఇంటి గోడలనిండా గోడలంత పెద్ద పెద్ద పెయింటింగులు, ఇంటర్నెట్లో చూసి ఇది పెన్సిల్ పనని, ఇది సాఫ్ట్ పేస్టలతో వేసిందని ఊహించిన బొమ్మలన్ని అయన ఆయిల్స్ లో, ఆక్రిలిక్కుల్లో చిత్రించినవి! జిగేలని గులాబీలో మెరిసిపోతూ నీలంలోకి జరిగిన అ వర్ణ సమ్మేళనం ఆయిల్లొ ఎట్లా జరిగిందో, అసలెట్లా జరుగుతుందో అంతు చిక్కని రహస్యం ఆ పెయింటింగుల నిండా ఆవరించుకుని వుంది. బొమ్మలమీంచి పొడుగ్గా సాగిన గీతలు బొమ్మ వెనుక డిజైన్ లోకి అల్లుకుపోవడం కేవలం రంగుపెన్సిల్కే కదా సాధ్యం అనే సంభ్రమానికి ఫుల్ స్టాపిస్తూ ఆయన ఆ గీతల్ని బ్రష్ పుచ్చుకుని కేన్వాస్ మీదికి లాగాడనేదే నిజమంత నిజం.తను కథలకు, అడ్వర్టైజ్మెంట్లకు వేసిన నలుపు తెలుపు బొమ్మలు!! రోట్రింగ్ పెన్ 90 డిగ్రీల కోణంలో నిలపెట్టి లాగితే రావాల్సిన లైనది, అటువంటి లైన్ ను పాయింట్ బ్రష్ తీసుకుని మందం చెడకుండా గీశాడాయన.(తరువాత ఆ బొమ్మలన్నింటినీ కుంచె మాంత్రికుడు మోహన్ గారికి చూపి బ్రష్ తో గీశాట్ట! అంటే నిస్సహాయంగా నవ్వడాయన) బొమ్మల స్టడీ అంటూ వీధులెంట తిరుగుతూ ఆయిల్ పేస్టల్స్ తో చేసిన స్కెచ్‌లు మహా అరాచకం, ఆయన చేతిలోని మైనం వీధులు గట్టిన వైనం చూడాల్సిందే (అద్రుష్టవశాత్తు ఆయన బొమ్మలన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి) ఆయన వేసిన ప్రకృతి చిత్రాలు, కథల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్ డిజైన్లు, పొర్ట్రైట్లు, పెన్సిల్ స్కెచ్‌లు ఇదంతా ఒక ఎత్తైతే, ఆర్చిటెక్చర్ రంగంలో ఆయన గీసిన పర్ఫెక్టివ్ బొమ్మలు ఇంకా ఎత్తు. అవి వేయడం వెనుక కృషి, కష్టం గురించి చెప్పుకుంటూ పొతుంటే వినడానికే కష్టంగా వుంది, వేయడానికి ఆయన ఇంకెంత కష్టపడ్డారో చూస్తే తప్ప తెలీదు.ఒక శైలి కాదు, ఒక తరహాలో నిలవలేదు, ఇదే ఉపరితలమని భీష్మించుక్కూచ్చోలేదు, బొమ్మ రహస్యం తేల్చడానికి రంగు అంతు చూడటానికి ఈ చిత్రకారుడు చేసిన కృషి మాటలలో చెప్పలేనిది, వాక్యాలలో వ్రాయలేనిది. మాటల మధ్యలో, బొమ్మల మధ్యలో మీకు తెలుగు చిత్రకారుల గురించి తెలిసిందెంత అని అడిగా, ఆయనకేం తెలీదు, ఎవరి పేరూ వినలేదు (మనమేం తక్కువ గొప్పవాళ్ళమా మనమూ రవి పరంజపే పేరు వినలేదుగా, దీనానాధ్ దలాల్ గురించి తెలుసుకోలేదుగా). కళ్ళు మూసుకుని బాపు తదితర పెద్దల పేర్లు వల్లించా, చంకలోని సంచినుంచి బాపు కొన్ని తులనాత్మక బొమ్మలు లాంటి పుస్తకం చేతిలో పెట్టా, మాట్లాడక పుస్తకం అంతా తిరగేశారు, దయచేసి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని తీసుకున్నారు, మళ్ళీ వాటినొకమారు సుతారంగా తిరగేసి, ఏ బాపు సాబ్ మహాన్ హై బహుత్ కాం కియా ఇనోనే అన్నారు. మనకా సంగతి తెలుసు కాబట్టే ఏ రాష్ట్ర మేగినా ఎందు కాలిడినా బాపు గారే మన ట్రంప్ కార్డ్.బాక్ టూ పరంజపే.. ఆయనది ఒక బొమ్మ చూసినా, వంద చూసినా వినిపించేది సంగీతమే అది రేఖా సంగీతం. ఈయన వర్ణ జంత్రగాడు. ఈయనకు సంగీతమంటే ప్రాణం. భీం సేన్ జోషి నా మానసిక సాంగీతిక్ గురువు. 1951 నుండి అయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన గొంతునుంచి ఏదైతే నేను విన్నానో దాన్నే నా బొమ్మల్లో వినిపించాలని నా ప్రయత్నం అంటారు పరంజపే. దాన్ని నూటికి నూరుపాల్లు నిరూపించారు కూడా. ఒక చిత్రకారునిగా పరంజపేని చూడాలనుకున్న నాకు ఆయన అంతకు మించి ఎంతో వినిపించారు. జీవితం పట్ల ఆయనకున్న దృష్టి గొప్పది. మానవతం పట్ల విశ్వాసం ఆశాజనకమైనది. దేశ విభజనకు పూర్వం నుంచి ఈనాటి దాక మనుషుల, దేశాల మధ్య ఏర్పడిన గీతలు, వాటి వెనుక స్వార్ధాలు, జిన్నాను కాంగ్రేస్ నుంచి తప్పిచడానికి గాంధీజీ మద్దతించిన ఖిలాఫత్ కుట్ర, రాజకీయాల దగ్గర్నుంచి కేవలం స్థల, కాల సాపేక్షాలైనా మతాల వరకు నిరశించారు.ఆయన భావనలో ధర్మం గొప్పది. కులాల్ని, మతాన్ని పట్టుకు అదే ధర్మం అనుకుంటున్నారు. అసలైన ధర్మాన్ని తెలుసుకోవడానికి సౌందర్య భక్తి ఒక్కటే మార్గమని, ఆ దృశ్య సౌందర్యం, శ్రావ్య సౌందర్యమే తన ధర్మమన్నారు.. ఆఖరుగా సెలవు తీసుకుని వెనక్కు తిరిగి గుమ్మం దాటుతున్న నన్ను పిలిచారు.. ఏమని వెనక్కి తిరిగి చూస్తే చేతులు జోడించి "అన్వర్ అప్కే బాపు సాబ్‌కో మేరా ప్రణామ్ బోలో" అన్నారు.1935 కర్ణాటకలోని బెల్గాంలో పుట్టిన రవి పరంజపె.. కేబీ కులకర్ణి గారి శిష్యరికంలో బొమ్మల్లో ఓనమాలు దిద్దుకున్నారు, బ్రతుకు తెరువుగా బొమ్మల్ని ఎంచుకుని బొంబాయి చేరిన రవి పరంజపే శాశ్విత నివాసం పూనె అయ్యింది. బొమ్మలకు సంభందించిన ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించారాయన. లెక్కకు మించిన దేశ విదేశ పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2008లో ప్రతిష్టాత్మకమైన భైరు రతన్ దమని సాహిత్య పురస్కారం ఆయన ఆత్మ కథకు లభించింది. చిత్రకళకు సంభంధించి ఈయన ఇప్పటికీ అర డజనుకు పైగా పుస్తకాలు వెలువరించారు. చిత్రకారులు, చిత్రకళపై ఆసక్తి వున్నవారు తప్పక చూడదగ్గ, చదవదగ్గ, నేర్చుకోదగ్గ సంపద ఇందులో వుంది.2022 జూన్ 11వ తేదీన గొప్ప చిత్రకారులు రవి పరంజపే కళ్ళు మూసారు. ఆయన స్ఫూర్తి దీపాన్ని వారి సతీమణి పట్టుకు నిలబడ్డారు. ఆ దీప కాంతిలో దారి పోల్చుకుంటూ నేటికీ చిత్రకారులు అనేకులు ఆయన ఇంటికి వస్తారు. ఆయన బొమ్మలని చూస్తారు. ఉత్తేజితులవుతారు. వర్క్ షాపులు నిర్వహించుకుంటారు. బొమ్మల గురించి కథలు కబుర్లు మాటాడుకుంటారు. బొమ్మలు వేస్తారు. బొమ్మలని శ్వాసిస్తారు. రవి పరంజపే గారు తన జీవితకాలంలో కల్చరల్ ఐకన్. ఆయన మరణానంతరం ఆయన ఇల్లు ఒక సాంస్కృతిక కేంద్రం. రష్యన్ చిత్రకారుడు ఇల్యారెపిన్ గురించి మన తెలుగు ఆర్టిస్ట్ మోహన్ గారు ఇలా అన్నారు. "ఇల్యా రెపిన్ చిన్న వయసులోనే 'సక్సెస్' రుచి చూశాడు. దేశంలోనూ, బయటా గొప్ప విఖ్యాతి. ఎంత ఖ్యాతి అంటే జారిస్టు సెన్సార్ మందకు ఆయన బొమ్మలు మింగుడు పడకపోయినా ఏమీ చేయలేక పోయారు. 20వ శతాబ్దారంభానికి ఆయన పేరు ప్రఖ్యాతులు అత్యున్నత శిఖరాలకు చేరాయి. అయినా సరే 1900వ సంవత్సరంలో ఆయన అకాడమీనీ, భవంతులనీ, ప్రశంసలనీ, సంపదలనీ వదిలి పీటర్స్బర్కు దూరంగా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడే కుటీరంలో ఉన్నాడు.ఆయన వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. మాగ్జిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, పావెల్ బునిన్ ఆ కుటీరానికి వచ్చేవారు. మయకోవ్‌స్కీ, సెర్గీ ఎసెనిన్ లాంటి ప్రముఖులంతా ఈ కుటీరంలో రెపిన్తో గడిపేవారు. లియో టాల్‌స్టాయ్ ఆయనకు ఆప్తమిత్రుడు. రష్యాలోని ప్రముఖ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఇక్కడికొచ్చి ప్రసంగాలిచ్చేవారు. ఈ కుటీరంపై పోలీసు నిఘా ఉండేది. వేగుల సమాచారం ఎప్పటికప్పుడు జార్‌కు చేరుతుండేది. ఆ కుటీరం ఇపుడు రష్యాలో పుణ్యతీర్థం లాంటిది. ఏటా లక్షమంది జనం అక్కడికెళ్లి ఇది రెపిన్ ఇల్లు, ఇది రెపిన్ తోట అని భక్తితో చూసి వస్తారు. గురజాడ ఇల్లు చూడడానికి మనమిలా విజయ నగరం వెళ్తామా"? – అన్వర్. -
మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్ -
చిత్రం చెక్కిలిపై చెదరని సంతకం!
1968 మే నెలలో, ఇటువంటి రాళ్ళు పగిలే ఎండల్లోనే ఒక ప్రభుత్వ బృందం అనంతపురం జిల్లా బయలుదేరింది. అక్కడి లేపాక్షి, తాడిపత్రి తదితర ప్రాంతాలను సందర్శించి అప్పటి ప్రభుత్వ పత్రిక ‘ఆంధ్రప్రదేశ్’ లో వ్యాసాలు రాయడానికి, ఒక రిపోర్ట్ తయారు చేయడానికని. అందుకోసం ఆ జట్టులో రాసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్లు, బొమ్మలు వేయడానికి కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. తెలుగు చిత్రకళ చెదరని సంతకాలలో ఒకరైన శీలా వీర్రాజు (శీలావీ) ఆ బృంద సభ్యుల్లో ఒకరు. ఆయన లేపాక్షి సందర్శన ఒక చిత్రకారుడి హోదాలో కాదు, సమాచారశాఖలో ఒక ఉద్యోగిగా మాత్రమే. అయినా చిత్రకళ మీద ఉన్న అభిరుచి కారణంగా తన స్కెచ్ బుక్ పట్టుకుని కదిలారు ఆ పురాతన శిథిలాలయ క్షేత్రానికి.లేపాక్షి చేరి దేవాలయ చరిత్ర గురించి, శిల్పాల గురించి పూజారి చెబుతున్న వివరాలను ఒక చెవిన వింటూ, తన చేతనున్న స్కెచ్ బుక్‌ని బొమ్మలతో నింపేశారు శీలావీ. ఆయనకు ఆ దేవతలు, వారి కథలు – గాథలు, భక్తి, కైవల్యం, కైంకర్యం, ఏమీ పట్టలేదు. ఆయన అక్కడ చూసిందల్లా ఆ శిల్పాలనూ, కఠినమైన నల్లరాయికి ఉలి అంచు పరుసవేది తాకించి ఆ రాయీ రప్పా, బండలను వెన్న చేసి శిల్ప మూర్తులుగ మలచిన సంతకం తెలియని కళాకారుడి దప్పి మాత్రమే. పెద్ద శిలను లేపాక్షినందిగా మలచి, దాని మెడను చుట్టిన మంజీర శబ్దాలు మాత్రమే ఆయనకు వినపడ్డాయి.మోచేయి వంపులో స్కెచ్ పుస్తకాన్ని ఇరికించుకుని గంటల తరబడి బొమ్మను గీస్తే ఏం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎక్కగలిగే కాలి కింది మెట్టుగా పనికి వచ్చేనా? నలుగురు మనుషుల కళ్ల గుమ్మం గుండా వెళ్ళి గుండెను పలకరించేనా ఆర్ట్? కర్ట్ వానెగట్ అనే అమెరికన్ రచయిత బడి పిల్లలకోసం ఒక అద్భుతమైన లేఖను రాశారు. గుండెపొరలలో దాచుకుని పదేపదే తడుముకోవాల్సిన లేఖ అది. ఆ ఉత్తరంలో ఆయన పిల్లలను ఉద్దేశించి అన్నా, మనమందరం నేర్చుకోవలసిన పాఠం ఉంది.‘నాయనలారా మీరు ఏదైనా కళను అభ్యసించండి. అది పాడటం కావచ్చు. రాయడం కావచ్చు, బొమ్మలు గీయడం కావచ్చు, ఏదయినా కావచ్చు, కానీ కళలను అభ్యసించండి. డబ్బుకోసం, కీర్తికోసం, పెద్దపేరు కోసం కాదు. అనుభూతి చెందడం, మీలో ఏముందో తెలుసుకోవడం, టు మేక్ యువర్ సోల్ గ్రో వంటివాటి కోసం కళను తెలుసుకోండి’. జీవితాంతం శీలావీ అదే పని చేశారు. ఆయన కళ ద్వారా తన హృదయంలో దీపం వెలిగించుకున్నారు. దీపం దీపాన్ని వెలిగిస్తుంది అని నమ్మారు.రాయి ప్రకృతిది, రాయిని చెక్కిన ఉలి లోహం ప్రకృతిది. బొమ్మను గీసుకున్న కాగితం ప్రకృతిది; పెన్సిల్ ముక్క తాలుకు బొగ్గు, దానిని ఇముడ్చుకున్న కలప ప్రకృతిలో భాగాలే. కాగితం మీద బొమ్మ వేయడం అంటే ప్రకృతి ప్రకృతిని కౌగిలించుకోవడమే. శీలా వీర్రాజు లేపాక్షిలో రెండు రోజులు ఉన్నారు. ఆ రెండు రోజుల్లో దాదాపు యాభై స్కెచ్‌లు గీసుకున్నారు. మండే సూర్యుడి కింద నిలబడి, కాలే రాళ్ళ మీద కూచుని బొమ్మలు గీశారు. ఈ బొమ్మలన్నీ దాదాపుగా 30 సెంటీ మీటర్ల వెడల్పు, 42 సెంటీ మీటర్ల కొలతల్లో వేసిన పెద్ద బొమ్మలు. ఫౌంటైన్ పెన్ గీతల బొమ్మలివి. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని బొమ్మ వేస్తున్నప్పుడు చిత్రకారుడి చూపు వస్తువు వైపే ఉంటుంది. చేతి వేళ్ళు, ఇంకు పెన్ను ముక్కు మాత్రమే కాగితాన్ని చూస్తుంటాయి.మంచి చిత్రకారుడి దృష్టి ఏమాత్రం కాగితాన్ని చూడదు. అంత పెద్ద కాగితంపై తొట్రుపడకుండా పరుగెత్తిన వీర్రాజు గీత తీవ్రత మనల్ని విస్మయుల్ని చేస్తుంది. తోటి చిత్రకారులను కొంచెం భయపెడుతుంది కూడా. కేవలం రెండు రోజుల్లో అంత పెద్ద బొమ్మలను, అంత నైపుణ్యంగా వేయడం మాట కాదు అనుకుంటామా, శీలావీ ఇంకోలా అంటారు: ‘నేను అక్కడి శిల్పాలకు మాత్రమే స్కెచ్‌లు గీసుకున్నాను. గోడల మీద, పైకప్పు మీద రంగుల్లో చిత్రించిన పురాతన చిత్రాలు కూడా ఉన్నాయి. అచ్చమైన దేశీయ శైలి చిత్రాలవి. నేను వాటి జోలికి పోలేదు. సమయం చాలకపోవటం ఒక కారణమైతే, తీసుకెళ్లిన స్కెచ్ బుక్ పూర్తయిపోయి ఆ పల్లెటూళ్ళో డ్రాయింగ్ పేపర్లు దొరక్కపోవడం మరో కారణం’. ఈ రోజుల్లోలా విరివిగా దొరికే కాలమై ఉంటే ఈ బొమ్మలు చెప్పే కథ ఇంకోలా ఉండేది.కాలం గడిచి కథలు కంచికి చేరుతాయి. గాలిపటాన్ని దారం వదిలేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం శీలా వీర్రాజు కాలం చేశారు. ఆయన ఎగురవేసిన గాలిపటాన్ని తెగిపడనీయకుండా ఆయన సహచరి శీలా సుభద్రాదేవి ఎత్తిపట్టుకున్నారు. ఆయన చిత్రించిన ప్రతి బొమ్మల గాలిపటాన్నీ అకాశం ఎత్తుకు తీసుకు వెళ్ళి ప్రపంచానికి చూపించే పని ఆరంభించారు. శీలావీ లేపాక్షి స్కెచ్‌లతో పాటు రామప్ప, అజంతా–ఎల్లోరా, కోణార్క్ స్కెచ్‌లన్నీ కలిపి ఒక పెద్ద గాలిపటమంత పుస్తకం ప్రచురించారు. జూన్ ఒకటవ తేదీ శనివారం హైదరాబాదు రవీంద్రభారతిలో ఆ పుస్తక ఆవిష్కరణ, వీర్రాజు గారి సంస్మరణ.– అన్వర్, ఆర్టిస్ట్(హైదరాబాదులో రేపు శీలా వీర్రాజు సంస్మరణ సభ) -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్‌లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
సాహితీ విస్తరిలో అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”
వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.-అన్వర్ సాక్షి -
Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు..
మాది నంద్యాల. అనగనగా రోజుల్లో కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారుట. 14వ శతాబ్దంలో నందన అనే మహారాజు గారు మా మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేరొచ్చిందని కాల క్రమేణా అదే నంద్యాలగా రూపాంతరం చెందిందని అంటారు. చుట్టూ నవనందులు ఉన్నా మాకు మహనంది మీదే మక్కువ ఎక్కువ. ఒక్క రోజు సెలవు దొరికితే చాలు "పొదామా అంటే, పోదామా" అనుకుంటూ మేము పిల్లలమంతా అద్దె సైకిల్లు తీసుకుని పొద్దున మహనందికి తయారు. పోయి పెద్ద కోనేరులో ఈతలు కొట్టి అలిసి పోయి, సేద తీరడానికి చిన్న కోనేరులో ఈతలు కొట్టి తేరుకుని సాయంత్రానికంతా తిరిగి ఇళ్ళు చేరుకునేవాళ్లం. ఈతల మధ్యలో సమయం దొరికితే మహనందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని దండం పెట్టుకునేవాళ్లం. మీరు ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దండం పెట్టుకునేవాళ్లం అన్నాను అంతే కానీ కొరికలు కోరుకునే వాళ్లం అనలేదు. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికని, కోరికలు తీర్చుకోడానికే దేవుడుకి దండం పెట్టుకోవాలని మేము నేర్చుకోలేదు. ఒకరోజు గుడిలోకి వెళ్ళి నేనూ, నా ఫ్రెండు శంకర్ దండం పెట్టుకున్నాక.. శంకర్ కిందికి వంగి దేవుడి పళ్ళెంలో ఉన్న నోట్లని గుప్పిట నిండుగా పట్టుకుని ఆక్కడి నుండి పారిపోయాడు. నాకు కూడా అక్కడ ఉన్న ఒక అయిదురూపాయల నోటు టెంప్ట్ చేసింది కానీ , తీసుకోలేకపోయాను. అందుకు నా మీద దేవుడికి కోపం వచ్చి చేతకాని నన్ను ఆర్టిస్ట్ కమ్మని శపించి, ధైర్యం, చాకచక్యం పుష్కలంగా ఉన్న శంకర్‌ను ప్రముఖ పొలిటీషియన్ కమ్మని వరమిచ్చాడు. గుడిలో పులిహోర మాత్రం ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. శివుడు మా ప్రాంతపు ఎక్కువ దేవుడు. మా నూనెపల్లె నడిబొడ్డున శివాలయం ఉంది. తెల్లవారిన దగ్గర నుంచి "బ్రహ్మమురారి సురార్చిత లింగం | నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం | తత్-ప్రణమామి సదాశివ లింగమ్ |" అని ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. అప్పుడు నేనూ, నావంటి నూనెపల్లె పిల్లలం కలిసి శివాలయం ముందు నుండి ఆటలాడుతూ పరిగెడుతూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని పాడుకుంటూ మంచి నీళ్ళ బాయి దగ్గర మలుపు తిరగగానే మసీదు నుంచి అజాన్ రాగానే అల్లాహు అక్బర్ | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్| అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్| హయ్యా అలస్-సలాహ్| హయ్యా అలల్-ఫలాహ్| అల్లాహు అక్బర్. అని ముగింపు పాడుకునేవాళ్లం. ఆ రోజుల్లో మీరెవరు అని అంటే మేము నూనెపల్లె వాళ్లం అని మాత్రమే మా ప్రవర. మాది నిజానికి ప్రకాశం జిల్లా. మా జేజి నాయన తన కుటుంబాన్ని తీసుకుని బ్రతుకు తెరువుకోసం నూనెపల్లె చేరినపుడు ఆయనని వెల్ కం టు నూనెపల్లె అని స్వాగతించింది మా ఊరి మహాదేవుడు శివుడు, తన గుడి అరుగు మీద స్థలం చూపి నువ్వు ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చబ్బా! అన్నాట్టా. మా పెద్దల బ్రతుకు గిర్రున తిరగడానికి కుట్టు మిషన్ చక్రం కదిలింది ఈ శివాలయం గుడి నీడ నుండే. మామూలుగా పండగలన్నీ ఉదయపు సంబరాలయితే ఒక్క మహా శివరాత్రి మాత్రం సాయంత్రం నుండి మొదలయ్యే ఉత్సాహం. ప్రతి పండగకు ముందు పిల్లలమంతా కూడి రాబోయే పండగ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పుకునే వాళ్లమో! లెక్కే లేదు. అప్పుడు మా చొక్కాకు ఒక జేబు, నిక్కరకు రెండు జేబులు ఉన్నా ఆ మూడు జేబుల నిండా కబురులు తరగని అక్షయ నిధుల్లా పోటెత్తేవి. అప్పుడు మా ఊరి రోడ్లు ఎప్పుడూ ఎద్దుల బళ్లతోనూ, గుర్రపు జట్కాలతోనూ , రిక్షాల మూడు చక్రాలతోనూ, సైకిల్ బెల్లులతోనూ, సైడ్, సైడ్ జరుగు జరుగు అని హెచ్చరిస్తూ కదిలేవి. ఒకటీ రెండు బస్సులు ఉన్నా, అవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ పోతూ ఆగుతూ కదులుతూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి పండగకు మా ఊరి శివాలయం ముందు పందిరి కట్టి హరికథలు నడుస్తూ ఉండేవి. మామూలు రోజుల్లో చీకటి పడగానే త్వరగా నిద్రపోయే ఊరి రహదారులు పండగ రోజుల్లో మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉంటాయి. కథలు చెప్పడానికి వచ్చిన హరిదాసు గారి కథా గమనాన్ని, మృదుమధురమైన గానాన్ని, కాలి అందియలు ఘల్లు మనడాన్ని, చేతిలోని చిడతలు ఝల్లు మనడాన్ని, ఆ పిట్టకథలను, ఆ వేదాంత చర్చను, మధ్య మధ్యలో పాపులర్ సినిమాల పాటల చమత్కారపు పేరడీలను ఊరు ఊరంతా, దారి దారంతా గడ్డం క్రింద చేయిపెట్టుకుని అలా కళ్ళప్పగించి చూస్తూ, వింటూ ఉండేది. ఈ హరి కథల కోసమని చీకటిపడే సమయానికంతా ఊరిని, దారిని బందు పెట్టేవారు. ఇక ఆ రాత్రి ఆ దారిన ఒక వాహనం నడవదు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్క సైకిలు చక్రమూ తిరగదు. ఊరి జనం అంతా చేతికందిన చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు పట్టుకుని రోడ్దుని ఆక్రమించుకునేవారు. అందరికన్నా ముందు అక్కడికి చేరుకునేది నావంటి పిల్లలు. వారి వారి అమ్మా నాయనల కోసమో, అవ్వా తాతల కోసం కాదు. స్కూలు, ట్యూషన్ క్లాస్మెంట్ కోసమని, ప్రాణ స్నేహితుల కోసమని తగు మాత్రం స్థలం రిజర్వు చేసి పెట్టేవారు. ఎన్నయినా చెప్పండి మళ్ళీ రావు ఆ బంగారు రోజులు. ఆకాశానికి నక్షత్రాలు పూచే ఆ సాయంకాలాలు, అరచేతుల్లో గాజు మొబైల్ అద్దాలకు బదులు దేవుడు రాసిన గీతలు కనపడే రోజులు మరిక లేవు. ఇవన్నీ మామూలు రోజుల్లోని పండగల సాయంకాలాల గుడి బయటి దృశ్యాలు. హరికథల పండగ రోజుల్లో బాగా నిద్ర అనిపిస్తే ఇంటికి రావచ్చు. శివరాత్రి సంగతి వేరు. శివరాత్రి రోజున శివాలయం బయట రోడ్డుకి అడ్డంగా పెద్ద తెల్లని తెర కట్టేవారు. తెరకి అటూ ఇటూ జనం కూర్చునేవారు. చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు మామూలే. పిల్లలు ముందు గానే వచ్చి స్థలం రిజర్వు చేసి పెట్టడమూ మామూలే. ఆ రాత్రి శివాలయం ముందు మూడు ఆటలు సినిమాలు వేసేవారు. పౌరాణిక సినిమాలే వేసేవారు. మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం దక్షయజ్ఞం ఖచ్చితంగా ఉండేది. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా తప్పకా ఉండేది. మేము ఆ సినిమాని ఉప్మా, చట్ని, గారె, సాంబారుల కథ అని పిలుచుకుని, గట్టిగా నవ్వి ఆపై కళ్ళు మూసి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకునేవాళ్లం ఆ శివరాత్రి రాత్రులలో, ముఖ్యంగా దక్షయజ్ఞం సినిమా చూస్తున్నప్పుడు మా ఊరి శివాలయంలో ఉండే ఆ చంద్రచూడుడు, చంద్రశేఖరుడు, విషకంఠుడు, పినాకపాణి , మహాశివుడు క్లైమాక్స్ లో గుడి లోపలినుండి ఆ ఫలాన తెరమీదకు వచ్చి నందమూరి రామారావు ఒంటి మీదికి పూని శివతాండవం చేయిస్తాడు చూడు! తీవ్ర దుఃఖంతో, మహా కోపంతో, తన జూట నుండి ఒక కేశాన్ని పెరికి నేలకేసి కొడితే ఆ వెంట్రుక నుండి ఆయన పెద్ద కొడుకు వీరభద్రుడు పుట్టుకొస్తాడు చూడు. అది మాకు శివరాత్రి అంటే. ఆ ఒక్క దృశ్యం చూడడం కోసమే కదా సంవత్సరమంతా వేచి వేచి శివరాత్రి జాగారం చేసేది. ఈ రోజుల్లో లాగా ఏ క్షణన కావాలిస్తే ఆ క్షణాన కళ్ళముందుకి నర్తనశాలలు, పాండవ వనవాసాలు, వినాయక విజయాలు వచ్చే కాలం కాదు కదా. ఆ రోజుల్లో ప్రతి అనుభవానికి ఒక గొప్ప విలువ ఉండేది. లిప్త పాటు అదృష్టాల్ని ఒడిసిపట్టుకుని బ్రతుకు పుస్తకంలో మెరుపుల నెమలీకలా దాచుకుని తీరాల్సిందే. పండగ పూట సినిమాలు చూస్తూ జాగారం చెయడమేమిటి కలికాలం అని పెద్ద తరం వాళ్ళు విసుక్కుంటున్నా సరే, దారి మీద మూడాటల తెర ఆడుతూనే ఉండేది. సినిమా టాకీసులలో రాత్రి మూడాటలు ఆడుతూనే ఉండేవి, గుళ్ళల్లో పూజలు, అవధూతల ఆశ్రమాల్లో భజనలు కొనసాగుతూనే ఉండేవి. ఏదో ఒక రకంగా, ఒక రూపంగా భక్తి అనేది కళ్ల మీదికి నిదుర మూత వాలకుండా కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి ముగిసేది. ఆ తరువాతి పగటిని రాత్రిలా జనం అంతా నిద్రపోయేవారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే జాగారపు యామిని ప్రస్తుతం మరణించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో జనం మెలకువగానే ఉంటున్నారు. పగళ్ళు నిద్రపోతూనే ఉంటున్నారు. శివుడికి ఒకరోజు, రాత్రికి ఒక కాలం, సినిమాకి ఒక వారం అంటూ ఏమీ ఉండటం లేదు. శివరాత్రికి చలికాలం శివ శివ అని పారిపోతుంది అనేవారు. చలికాలం రాకముందే చలి పారిపోయే కాలం వచ్చినట్లుంది. భస్మాసురుడికి భయపడి శివుడు పరుగులెత్తాడు అని అనుకునేవారు. అసురుడి దాకా ఎందుకు మామూలు మనిషికి భయపడే చూసే పరమశివుడు ఎప్పుడో పారిపోయినట్లుగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఆలయాలు ఉన్నాయి కానీ, దేవుడులు అక్కడ ఉండటం లేరేమో అని గట్టి నమ్మకమే ఉంది. పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కానీ, అనుభవాలు మిగలడం లేదు నిన్నటి రాత్రికి ఈ శివరాత్రికి తేడా కనపడ్డం లేదు. మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. మద్రాసులో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అనేవి ఉన్నాయని. ఇప్పుడు నేను రాసుకున్నదంతా చచ్చిపోయిన మా నూనెపల్లె కథ, ఒక వదలని దుఃఖపు గీతి రాత. -
సైన్యం నీడలోనే... ‘ఆపద్ధర్మం’
పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉన్నా దానిపై సైన్యం ప్రభావం తప్పకుండా ఉంటుందనేది మరోసారి నిరూపితమయ్యింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హఖ్ కాకర్ అచ్చంగా ఒక ఎన్నికైన ప్రధానమంత్రిలా సైన్యానికి అనుగుణంగా వ్యవహరించడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇటీవల ‘మార్గల్లా డైలాగ్’లో పాల్గొని దీర్ఘకాలిక ప్రభుత్వాధినేత లాగా ‘ముసురుకుంటున్న భద్రతా సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు.చైనా ఎదుగుదలను అరికట్టే విషయంలో పశ్చిమ దేశాల విధానం విఫలమైందనీ, మరోవైపు, పాకిస్తాన్ ‘అంతిమ–ప్రత్యర్థి’ భారతదేశం ఈ సంఘర్షణను ప్రోత్సహించిందనీ ఆయన ఆరోపించారు. పాకిస్తాన్లో ఎవరూ ఆయన మాటలను విమర్శించడం లేదు. కారణం ఆయన సైన్యం ఏం కోరుకుంటున్నదో అదే చేస్తున్నారు కనుక! పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హఖ్ కాకర్, ఆ దేశంలో ఈ తాత్కాలిక పదవిని నిర్వహిస్తున్న ఎనిమిదో నేత. తాత్కాలిక ప్రధానమంత్రులూ, వారు సారథ్యం వహించే ప్రభుత్వాల పని ఏమిటంటే... ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయిస్తూ, రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన వ్యవధిలో ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌కు సహాయం చేయడం! తన పూర్వ ఆపద్ధర్మ ప్రధానుల మాదిరిగా కాకుండా, దేశ పాలనా వ్యవస్థకు చేరువగా ఉన్న కాకర్, ఎన్నుకోబడిన నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకుంటున్నారు. అంతర్జాతీయ సమావేశాలకు హాజరవుతున్నారు. దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైగా, చారిత్రక రాజకీయ ప్రక్రియలపై తన అవగాహనను వ్యక్తపరు స్తున్నారు. ఆ విధంగా ఆయన తన పరిమితులను దాటుతున్నారు. కానీ పాకిస్తాన్లో ఎవరూ దానిని ఎత్తి చూపడం లేదు. ఇందుకు కారణం ఆయన సైన్యం ఏం కోరుకుంటున్నదో అదే చేస్తున్నారు కనుక. మే 9 నాటి అవాంతరాల తర్వాత, పాకిస్తానీ రాజకీయ నాయ కులు లేదా వ్యాఖ్యాతలెవరూ, ఆగ్రహంతో ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను నిజంగానే అతిక్రమించడానికి సాహసించడం లేదు. ఇస్లామాబాద్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐపీఆర్‌ఐ) నవంబర్ 15న నిర్వహించిన ‘మార్గల్లా డైలాగ్’లో కాకర్ ప్రసంగించారు. ఈ సంభాషణ థీమ్ ఏమిటంటే, ‘ముసురుకుంటున్న భద్రతా సవాళ్లు’. ఐపీఆర్‌ఐ అనేది పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయానికి అనుబంధంగా ఉన్న జాతీయ భద్రతా విభాగం (ఎన్ఎస్డీ)కి చెందిన మేధావుల బృందం. భారతదేశంపై ముఖ్యంగా ఐపీఆర్‌ఐ నిర్వహించిన కార్యక్రమంలో కాకర్ చేసిన వ్యాఖ్యలు, భారతదేశంపై పాకిస్తాన్ అధికార వ్యవస్థ ప్రస్తుత ఆలోచనకు ప్రతిబింబం కావు. అందువల్ల, భారత రాజకీయ, భద్రతా వర్గాలను పరిగణనలోకి తీసుకోవడంలో పాకిస్తాన్ తన పూర్వపు ప్రాధాన్యాన్ని ప్రస్తుతం కొద్దిగా కోల్పోయిన ప్పటికీ, కాకర్ వ్యాఖ్యలను విస్మరించలేము. ముఖ్యంగా పాకిస్తానీ దౌత్య వేత్తలు, భద్రతా విశ్లేషకులు ఇప్పుడు ఈ అభిప్రాయాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలతో సహా వారి సంభాషణకర్తలను ఒత్తిడి చేయవలసి ఉంటుంది. చైనా ఎదుగుదలను అరికట్టే విషయంలో పశ్చిమ దేశాల విధానం విఫలమైందని అంచనా వేస్తూ, చైనా–పాశ్చాత్య ఘర్షణ నుండి పాకి స్తాన్ ఇక ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేదని కాకర్ నొక్కి చెప్పారు. మరోవైపు, పాకిస్తాన్ ‘అంతిమ–ప్రత్యర్థి’ భారతదేశం ఈ సంఘర్షణను ప్రోత్సహించిందని ఆయన అన్నారు. విస్తారమైన జనాభా కారణంగా చైనాను అదుపు చేయడంలో సహాయపడటానికి భారత్ తనను తాను ‘ముఖ్య పాత్రధారి’గా ప్రతిపాదించుకుంటోందని అన్నారు. సాంకేతికత బదిలీలు, పెట్టుబడులు, ఇతర ‘ప్రయో జనాలు’ పొందేందుకు ‘భారతదేశం పశ్చిమార్ధ గోళంతో సరసా లాడుతోంది’ అని ఆయన వ్యాఖ>్యనించారు. పాశ్చాత్య దేశాలు జనాభా కారణంగా చైనాతో పోటీలో భారతదేశాన్ని ఆకర్షణీయంగా భావిస్తే, దాదాపు 1.4 బిలియన్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండాన్ని లేదా యాభై కోట్ల మంది జనాభా ఉన్న ‘ది ఎకనామిక్ కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఈసీఓ)ను ఎందుకు పరిగణించలేదని కాకర్ ఆశ్చర్య పోయారు. ఇక కశ్మీర్ విషయానికి వస్తే, కాకర్ 2019 ఆగస్టు నాటి రాజ్యాంగ మార్పుల విషయానికి వెళ్లలేదు. అయితే కశ్మీరీ ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించడంలో అంతర్జాతీయ సమాజానివి ‘ద్వంద్వ ప్రమాణాలు’ అని ఆయన ఆరోపించారు. కశ్మీర్ సమస్యకు పరి ష్కారం చూపడం భారత్ లేదా పాకిస్తాన్ పని కాదనీ, కశ్మీరీలు తమ భవిష్యత్తును ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తామే నిర్ణయించుకోవాలనీ ఆయన అన్నారు. ఏ ‘వలసవాదం’ కూడా శాశ్వతంగా ఉనికిలో ఉండదని, ఎంత కాలం పట్టినా దాని అంతానికి కూడా ఒక రోజంటూ ఉంటుందని ఆయన తన చారిత్రక అవగాహనను చాటుకున్నారు. ఈ అన్ని అంశాల్లో, కాకర్ జమ్మూ కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ప్రామాణిక వైఖరిని మాత్రమే పేర్కొన్నారు. భారత్–చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై పాక్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని కాకర్ పేర్కొన్నారు. భారత్‌తో అనుసంధానతను విస్తరించడానికి లేదా వాణిజ్యం చేయడానికి పాకిస్తాన్ విముఖంగా లేదనీ, అయితే వివాదాస్పద అంశాలు ప్రతిబంధకంగా ఉన్నాయనీ ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్తాన్ల వాణిజ్యం ‘గౌరవ ప్రదంగా’ జరగాలని, యాచించడం ఒక ఎంపిక కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని గమనించిన కాకర్, భారత దేశం 8–10 శాతం వృద్ధి రేటును సాధించాలనుకుంటే, దానికి చౌకైన ఇంధన సరఫరా అవసరమన్నారు. మధ్య ఆసియా నుండి వచ్చే సరఫరాలను భారతదేశం విస్మరించలేదని సూచించారు. ఆ దేశాలు భారత్‌కు చమురును పాకిస్తాన్ మీదుగా రవాణా చేయవలసి ఉంటుందని ఆయన చెప్పకుండా వదిలేశారు. ఇంధన భద్రత కోసం సెంట్రల్ ఆసియన్ ఏజెన్సీ లేదా సహజ వాయువును లేదా చమురును తీసుకు వచ్చే ఇరాన్ పైప్లైన్లు భారత్ పరిశీలనలో నిజంగా లేవని పాకిస్తాన్ విశ్లేషకులు ఇప్పటికీ అర్థం చేసుకోకపోవడమే విచిత్రం. భారతదేశం అతి గర్వం అనే ‘హుబ్రిస్ వ్యాధి’తో బాధపడుతోందనీ, కానీ చరిత్ర ఎప్పుడూ వైఫల్యంతో ముగుస్తుందనీ కాకర్ ఆరోపించారు. ఇస్లామిక్ రాడికలిజంపై దృష్టి సారించిన అంతర్జాతీయ సమాజం హిందూత్వ ప్రమాదాలను ఎందుకు విస్మరించిందని కాకర్ ఆశ్చర్యపోతూ, కెనడియన్ అనుభవం చూపినట్లుగా, పశ్చిమార్ధగోళంలో ‘స్లీపర్ సెల్స్’ అని పేర్కొన్న భారతీయ డయాస్పోరాలోని ఆర్ఎస్ఎస్ మద్దతుదారులతో దానిని ముడిపెట్టారు. అయితే హిందూ మతంతో పాకిస్తాన్‌కు ఎలాంటి సమస్యా లేదని ఆయన పేర్కొన్నారు. కానీ జిన్నా, వాస్తవానికి చేసింది అదే మరి. అది విభజనపై ఆయన పట్టుబట్టడానికి దోహదపడింది. కాకర్ 1937 తదుపరి జిన్నా గురించి చదవాలి. భారతదేశంపై కాకర్ చేసిన వ్యాఖ్యలు ‘అంతిమ–ప్రత్యర్థి’ పట్ల పాకిస్తాన్‌కు ఉన్న అంతులేని శత్రుత్వాన్నీ, భారతదేశం ఎదుగుదల పట్ల దాని అసూయనూ చూపుతున్నాయి. భారత్‌తో వ్యాపారం చేయడం వల్ల పాకిస్తాన్ ప్రయోజనాలను పొందుతుందని పాక్ అధి కారిక వ్యవస్థ గ్రహించిందనీ, అయితే ‘కశ్మీర్ ఉచ్చు’ దానిని హేతు బద్ధంగా వ్యవహరించకుండా నిరోధిస్తున్నదనీ కూడా ఆ వ్యాఖ్యలు నిరూపించాయి. మూడు దశాబ్దాలు, అంతకంటే ఎక్కువ కాలం భార తదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రాయోజితం చేయడం అనేది పాకిస్తాన్లో భయంకరమైన ఆర్థిక పరిస్థితికి దారితీసింది. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏమిటంటే దాని ‘ప్రత్యర్థి’తో ఆర్థిక వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడమే! అయితే సైన్యం అలా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కాకర్ వ్యాఖ్యలు ఎటువంటి సూచనా చేయడం లేదు. ఈలోగా, గతం నుండి పక్కకు వైదొలుగుతూ, కొంతమంది పాకి స్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజాలు భారత క్రికెట్ గురించి మంచిగా మాట్లాడుతున్నారని గమనించడం కొత్తగా ఉంది. ముఖ్యంగా భారత దేశంలో క్రికెట్ ఆటను పెంపొందించే విధానాన్ని వారు ప్రశంసించారు. కానీ అలాంటి మనోభావాలు భారతదేశంపై పాక్ సైన్యం ఎత్తుగడల విషయంలో ఎటువంటి తేడానూ ప్రదర్శించవు. వివేక్ కట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి -
సమస్యలు పరిష్కరించకుంటే సమరమే
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించకుంటే సమరం చేయాల్సి ఉంటుందని తెలంగాణ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదల, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, కోశాధికారి డాక్టర్ కిరణ్ ప్రకాష్, ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎల్.రమేష్ ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు సహా అదనపు డీఎంఈ స్థాయి వరకు బోధనా వైద్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రతీ నెలా జరుగుతున్న సమీక్ష సమావేశంలో కేవలం లక్ష్యాలు ఇవ్వటమే కాక, వైద్యుల సమస్యల గురించి కూడా చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. సమస్యల విషయంలో గత ఏడాది నిరసన తెలిపినప్పుడు మంత్రి హరీశ్ రావు భరోసాతో వెనక్కి తగ్గినప్పటికీ, అందులో అనేక సమస్యలు అలాగే పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తామని, అప్పటినుంచి నిర్ణీత వారం రోజుల సమయంలో స్పందించకపోతే, ‘చలో హైదరాబాద్‘ అనే నినాదంతో పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. -
Kethu Viswanatha Reddy: నాయనా అని సంభోదిస్తూ మాటాడేవారు!
నాకు ఇష్టమైన కథకులలొ కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నా అదృష్టాల్లో ఒకటి చిన్నతనాన నే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం. ఆ కథకు నా బొమ్మ ఎంతబాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా . కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను నాయనా అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకరించి పోతాను నేను. పెద్దలు ఇష్టులు మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కోకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కోకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి మహాద్భుతమైన పరిమళాన్ని అందించారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళి కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. ఆ పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కోకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు . ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు కదా,పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డి గారు తన ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్ గా తన సేవలందించారు. పంజాగుట్ట లో ఉండేది ఆ అఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు . అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయితగా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దినపత్రిక చదవండి: కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం -
ఆ సంగతి, విరిగిన పాళీకి.. తడి వెలసిన కుంచెకు.. నాకు మాత్రమే తెలుసు!
అనగనగా అప్పుడు మా రాయలసీమలో గద్దర్ అనే పేరు విన్నాను అంతే, పాట అయితే అసలే తెలీదు. పోస్టర్ ఒకటి మా ఊరి ఆత్మకూర్ బస్టాండ్ గోడలపైకి, ఆర్టీసి బస్టాండ్ కాంపౌండ్ వాల్ మీదికి వచ్చి చేరింది. నల్లని పోస్టర్‌పై కసిరి దూకుతున్నట్టున్న అక్షరాలు ఆర్టిస్ట్ మోహన్‌వి. ఆ అక్షరాల మహాగ్రహం చూసి గద్దర్‌పై పేలిన తూటాపై నిరసన పుట్టింది నా రాయలసీమ బ్రతుకులో. అది ఆర్ట్ చేసిన పని. ఏ పల్లవి ఫాంట్ నుండో, అనుపమ బోల్డ్ నుండో ప్రేమ, కరుణ, దుఃఖం, కసి, క్రోధం జనియించవురా కంప్యూటర్ డబ్బా డిజైనుల్లారా! ఆకాశం ఊదే మెరుపుదెబ్బ వంటి అక్షరాలు కాగితంపై ఉరిమి చూడాలంటే ఆర్టిస్ట్ కావాలి. అది మోహన్ మాత్రమే అయి ఉండాలి. ఆ దారి చిత్తప్రసాద్ మాత్రమే వేసినది అయి ఉండాలి. అలా గోడమీది అచ్చు బొమ్మలు మాత్రమే చూసే నా బ్రతుకులో నెల తిరగ్గానే ఆ బొమ్మలేసే చేతిని, ఆ బొమ్మలు పుట్టే సింగల్ డెమీ, డబల్ డెమీ తెల్లకాగితాన్ని, రోట్రింగ్ పాయింట్ నిబ్బుని, రన్నింగ్ మేటర్ చెక్కే లక్సోర్ స్కెచ్ పెన్నుని, కొండచిలువలా సరసర పాకే అక్షరాల జైనా నేచురల్ హెయిర్ బ్రష్ నడకని… నేను, నావంటి అనేక నోరెళ్ళుకపెట్టు జాతి వాళ్ళం అలా చూస్తూనే ఉండేవాళ్లం. ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ… అనేకులింకా అభాగ్యులంతా, అనాథలంతా, అశాంతులంతా ఆ కాగితంపైనుంచి ఎర్ర ఝండాలపైకి, నీలి పోస్టర్లపైకి, బిగిసిన పిడికిళ్ళతో కదనుతొక్కేవారు. మోహన్‌కు ముందున్న కళ తాలూకు ఆ వంపులు, సొంపులు, వాలుకళ్ళు, పారాణి కాళ్ళు తప్ప ఏవీ ఎరగని ఆ సెక్స్ సింబల్ తెలుగు బొమ్మాయి నడుముకు చెంగు బిగించి పొలికేక నేర్పించింది, కళ్ళు ఉరమడం దిద్దింది మోహన్ కుంచె. తాడిత పీడిత కర్షక కార్మిక జనానికి రూపం రంగు, పరుగు, బిగింపు, పోరాటం అద్దింది మోహన్ సిరాబుడ్డి. ఎర్ర రంగును, నలుపు ఇంకును ఎక్కడ వాడాలో, కక్కే నిప్పుని కుంచె మొనకు ఆనించి అక్షరాల మెలికని, కొడవలి చివర కాగడాని ఎలా వెలిగించాలో తెలిపింది ఈ పోరాట చిత్రకళా శిఖరంపై ఎర్ర నెలవంకే! మసాబ్ ట్యాంక్ మహవీర్ ఆసుపత్రి దగ్గర బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుండి బయటకు వచ్చి చూస్తే గోడకు అంటుకుని ఉన్న కాగితపు బొమ్మ అవశేషాలు కనపడ్డాయి. మోహన్ గారు వేసిన పోస్టర్ అది. చిరిగిన పీలికల కాగితపు తుకడా. జనంలానే ఉంది. లేని న్యాయంలానే ఉంది, దిక్కులేని బ్రతుకు లానే ఉంది, ఈ రోజు మేడే అని దీనంగా వెళ్ళబోసుకున్నట్లు గా ఉంది. ఈ మేడే రోజున, ఇంతకు మునుపు మేడే రోజున అంతా అలానే వుంది. ఇక ముందు కూడా ఇలానే వుండవచ్చు. కడుపు కాలడం, కన్నెర్ర చేయడం, పేదవాడి కోపం, పేలుతున్న వీపు… అంతా అలానే ఉంది. కార్మికుడు, కర్షకుడు, మోటర్ మెకానిక్, మిల్లు కూలి, చీకటి పాట, పేలిన తూటా… అన్నీ అలానే ఉన్నై. రెపరెపల ఎర్ర ఝండా, నినాదాల పోస్టర్ మాత్రం అనాథలయిపోయాయి. ఈ జాతికి ఉండిన ఎర్ర పోస్టర్ తాలూకు ఒకే ఒక చిత్ర కళాకారుడు లేడు. ఇది అవశేషం, అపురూపం, దొరకని దృశ్యం… అంతరించిపోయిన గత మూడున్నర దశాబ్దాల పోరాట బొమ్మ చరిత్ర. ఆ ఎరుక మీకూ, దానికీ కూడా లేదు. అది మీకు తెలుసా? ఈ సంగతి, విరిగిన పాళీకి తెలుసు, తడి వెలసిన కుంచెకు తెలుసు, నాకు తెలుసు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
ఆ క్షణం నాకు వెన్ను నుంచి వణుకు పుట్టుకువచ్చింది..
ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచం తల తిప్పి ఆర్కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది . అటువంటి మహా చిత్రకారుడు ఆర్కే లక్ష్మణ్ కథ బొమ్మలనే సాధనగా, సాధనే జీవితంగా సాగిన లక్ష్మణ్ జీవితంలో లైఫ్ స్కెచింగ్ చోటు చేసుకున్నంతగా మరే భారతీయ వ్యంగ చిత్రకారుడి జీవితంలో ఈ సాధన రక్తంలో రక్తంగా కలిసిపోవడాన్ని విని ఉండలేదు. లక్ష్మణ్ పార్లమెంట్‌ని ఫొటోల్లో చూసి తన బొమ్మల్లోకి దింపలేదు. పార్లమెంట్ ఎదురుగా కూచుని దానిని అన్ని కోణాల్లో బొమ్మగా మార్చుకున్నాడు. రాజకీయనాయకులని, బ్యాంక్ ఉద్యోగస్తులని, చెట్టు కింద చిలుక జ్యోతిష్కుడిని, మెరైన్ డ్రైవ్ రహదారి అంచున కూర్చున్న మనుషులని ఎవరిని కూడా ఊహించుకుని వేసిన బొమ్మలు కావవి. అందరిని చూసాడు, తనలో ఇంకించుకున్నాడు. బొంబాయి నగరాన్నంతా కట్టల కొద్దీ స్కెచ్ పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు . జీవిత నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అందుకే తనది ఇక మరెవరూ దాటలేని నల్లని ఇంకు గీతల లక్ష్మణరేఖ ఐయింది. ఇరవైల ప్రాయంలో లక్ష్మణ్ జీవితంలోని కొన్నిపేరాల సంఘటనలు ఇక్కడ.. అప్పటికప్పుడు పత్రిక సంపాదకుడ్ని కలిసి నా గురించి ఆయనకు చెప్పుకున్నాను . అంతా విని ఆయన మరో మాట ఏమీ లేకుండా వెంటనే ‘కల్బాదేవి కాల్పులపై’ ఒక కార్టూన్ స్ట్రిప్ చిత్రించమని పని నాకు ఇచ్చాడు. కల్బాదేవి అనేది బొంబాయిలో బాగా పేరున్న ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడికి, మారణకాండకు ఈ ప్రాంతమే కేంద్రం. 14 సెప్టెంబర్ 1946న ఇండియన్ ఆర్మీ క్యాంపునకు సంబంధించిన ఇద్దరు సైనికులు సైనిక లారీలో తమ యూనిట్ నుండి ఆయుధాలతో సహా తప్పించుకుని బైకుల్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక టాక్సీని కిరాయికి తీసుకుని కల్బాదేవి వైపు వెళ్ళమన్నారు. ఆ టాక్సీ నారిమన్ అనే పార్సీ వ్యక్తికి చెందింది. ఆ సమయంలో ఆ టాక్సీలో అతనితో పాటు యుక్తవయస్కుడైన అతని కొడుకు కూడా ఉన్నాడు. హంతకులు నేరుగా టాక్సీని కల్బాదేవి వేపు తీసుకెళ్ళి, టాక్సీ నుండి దిగీ దిగగానే ఇద్దరూ తమ చేతిలో ఉన్న మెషిన్ గన్లతో రహదారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇటువంటి దారుణాన్ని ఊహించని డ్రైవర్, అతని కొడుకు ఇద్దరూ భయాందోళనలకు గురై టాక్సీని వదిలి పారిపోజూశారు. ఆ హంతకులు ఈ తండ్రీ కొడుకులు ఇరువురిని కూడా చంపేశారు. ఈ దారుణకాండలో దుకాణంలో కూచుని ఉన్న ఒక నగల వ్యాపారి, ఉదయాన్నే బడికి బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఒక మనిషి, టీ దుకాణంలో కూచుని టీ తాగుతున్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది పాదచారులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను బాంబే పోలీసులు సంఘటన జరిగిన రెండు నెలల్లో అరెస్టు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు కోర్టు వారిని విచారించి మరణశిక్ష విధించింది. ఇదంతా నేను బొంబాయి చేరుకునే సమయం ముందుగా జరిగింది. ఆ సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చాలా పెద్ద సంచలన వార్త. బ్లిట్జ్ ఎడిటర్ నాకు ఈ కథను క్లుప్తంగా చెప్పాడు. ఈ సంఘటన విచారణకు సంబంధించిన కోర్ట్ కాగితాల ప్రతులను కూడా నాకు అందచేశాడు. ఈ ఇతివృత్తాన్ని ఒక బొమ్మల కథగా తయారు చేయాలని, ఆ కథ ప్రతీ వారం తమ పత్రికలో రావాలని, ఇందుకు గానూ ఆయన నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. పంతొమ్మిది వందల నలభైలలో వేయి రూపాయలంటే చాలా పెద్ద డబ్బు. ప్రస్తుతం నేను మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య పత్రికవాళ్ళు నా కార్టూన్లకు పంపుతున్న డబ్బుతో బొంబాయిలో కాలం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు రాబోతున్న బ్లిట్జ్ డబ్బులు ఇవన్నీ కలుపుకుని బొంబాయిలో ఇంకొంత కాలం గడపవచ్చు కదా అని సంబరపడ్డాను. బొమ్మల కథకు అవసరమైన నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి కాల్పులు జరిగిన కల్బాదేవి ప్రాంతం గుండా నన్ను తీసుకెళ్లడానికి, కాల్పులు జరిగినపుడు అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులను, బాధితులను నేను కలుసుకుని మాట్లాడ్డానికి , వారి ద్వారా జరిగిన సంఘటన తబ్సీలు ఎక్కించుకోవటానికి గాను నా కోసం ఆ ప్రాంతపు ఆనుపానులు తెలిసిన వారిని కొంతమందిని సహాయంగా కల్బాదేవి ప్రాంతానికి పంపించాడు బ్లిట్జ్ ఎడిటర్. కల్బాదేవి అనేది దాదాపు అరకిలోమీటరు పొడవునా రద్దీగా ఉన్న రహదారి మార్గం. రోడ్డుపై బస్సులు, కార్లు, సైకిళ్లు, తోపుడు బళ్ళు, మనుష్యులు అనేకులు బిలబిలమని కదులుతూనే ఉన్నారు. వీధికి రెండు వైపులా పుస్తకాలు అమ్మేవాళ్ళు, గడియారాలు రిపేర్లు చేసే చిన్న చిన్న కొట్లవాళ్ళు, మంగలి షాపులు, టీ షాపులు, వెండిపని చేసే కంసాలి దుకాణాలు, బట్టలు అమ్మే వ్యాపారులు, ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు బారులు బారులుగా నడుస్తున్నాయి . వీధిలో అటూ ఇటూ చూసుకుంటూ నేను అక్కడ జరిగిన నరమేధం గురించి ఆలోచిస్తున్నాను. ముందస్తుగా ఎటువంటి ఘోరాన్ని ఊహించని ఒక ఉదయాన వీధి నడి బొడ్డున వచ్చి ఆగిన ఒక టాక్సీ నుండి నిప్పులు కక్కుతూ తుపాకులు సృష్టించిన భీకర మారణకాండని తలుచుకుంటే ఆ క్షణం నాకు వెన్ను నుండి వణుకు పుట్టుకువచ్చింది. కల్బాదేవి దారుణ సంఘటనను బొమ్మల కథగా మలచడానికి ఆ రహదారిలో నిలబడి నేనొక భ్రమను నా చుట్టూ అల్లుకున్నాను. ఆ సంఘటన జరిగిన రోజున ఆ నేరగాళ్ళు ప్రయాణించిన కారులో నేనూ అదృశ్యంగా ఉన్నట్టు, వారి సంభాషణ మొత్తం నా సమక్షంలోనే జరుగుతున్నట్టు, వారి తుపాకి నుండి వెలువడిన ప్రతి తూటా నా కళ్ళ ముందే దూసుకుపోయినట్టు – రవ్వలు కక్కే ఆ అంగుళమంత నిప్పుముక్క ఏ దుకాణపు తలుపును ఛేదించుకుంటూ పోయిందో! ఏ మనిషి కడుపును కుళ్ళపొడుస్తూ తన రక్తదాహం తీర్చుకుందో! మనుషులు ఆర్తనాదాలు చేస్తూ ఎలా కకావికలమయ్యారో, ఎలా కుప్పకూలిపోయారో! – అశరీరంగా నేను చూస్తున్నట్లు బొమ్మలు వేసేందుకు అనువయిన ప్రతి సన్నివేశాన్ని అనేకానేక కోణాల నుండి గమనించినట్లు ఒక అవాస్తవ భ్రాంతిని సృష్టించుకున్నాను . ఆ సమయంలో నేను మొదటి సారిగా కల్బాదేవి వీధిలో నడుస్తూ నిలువెల్లా వణికిపోయినవాడిని కాను. నా ఎరుక లేకుండా జరిగిపోయిన దానిని కూడా అవసరమైనపుడు ఊహాపోహలుపోయి కళ్ళముందుకు తెచ్చుకుని దానిని నల్లని గీతలతో పునఃప్రతిష్ట చేయగలిగిన చిత్రకారుడిని నేను. నేను లక్ష్మణ్‌ని. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. -
ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది!
ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది. ఎప్పుడో దాదాపూ యేభై ఏళ్ల వెనుకటి కల ఇది. అనగనగా ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయాక ఒక మూడేళ్లు ఖాళీగా ఇంట్లో కూచుంది. గోళ్ళు కొరుక్కునే అలవాటు అనేదొకటుంటుంది అని తెలీకపోవడం వల్ల ఆ పిల్ల ఆ మూడేళ్లూ వాళ్ళ చిన్న ఊళ్లో లైబ్రరీలో వున్న పుస్తకాలన్నీ కొరుక్కుని తినెయ్యడమే పనిగా పెట్టుకుంది. అలా చదివిన పుస్తకాల్లో ఒక చిన్న పుస్తకం ఆ చిన్నారిని అమితంగా ఆకర్షించింది. అవడానికి చిన్న పుస్తకమే గానీ ఆ వయసులో ఆ అమ్మాయిమీద ఆ పుస్తకం చూపిన ప్రభావం మరపురానిది. ఇవ్వాల్టి దినాన ఆవిడ డాక్టరయి, ప్రాక్టీసు పెట్టి చాలా ఏళ్లయిపోయినా , తను చిన్నప్పుడు చదివిన ఆ పుస్తకం, అందులోని విషయాలు ఆవిడకు గుర్తొస్తూనే వుండేవి. ఒక రకంగా తను డాక్టర్నవడానికి కూడా స్ఫూర్తిని ఇచ్చిందా పుస్తకం. ఆవిడ పేరు డాక్టర్ భార్గవి, ఆ పుస్తకం పేరు "ఒక డాక్టర్ కథ". అపుడాకాలంలో చదివింది కేవలం ఒక పుస్తకం కాదని అది సాధించి తీరవలసిన ఒక గొప్ప కల అని కూడా గ్రహించని ఆ నాటి అమాయక్కపిల్ల గట్టిగా పట్టుకున్న కల ఇది . కల చుట్టూ బోలెడన్ని ఆశలు, ఆత్రుతలు, ఆలోచనలు అన్నీ కలిసి ఒక ఊహగా దిద్దుకుని కాపాడుకున్న కల అది. ఇన్ని ఏళ్ల తరువాత, అనేక ప్రయత్నాల తరువాత ఆ కల ఒక రూపం దాల్చి ఈ రోజు ఒకటి , రెండూ , పది , వందల సంఖ్యగా మారి పాఠకుల చేతుల్లో నిలిచింది. ఈ రోజు మనందరి ముందున్న ఈ ఫలితం, డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి అనే ఒక మహానీయుడి కృషికి, దాని వెనుక జీవితానికి నూటా పద్నాలుగు పేజీల పుస్తక రూపం. నూరేళ్ల దీర్ఘ ప్రయాణం అనంతరం భౌతికంగా ఒక జీవితం ముగిసిపోతుందేమో కానీ.. ఇలా అక్షరాల ఆసరాగా పుటల మీదికి ఎక్కిన జీవితాలు అంత సులువుగా దూరమయ్యేవి కావు. సుమారు అర్థ శతాబ్దం మునుపు మానవ మస్తిష్క జ్ఞాపకాలు లో నుంచి మరుగయిన ఒకనొక గొప్ప వ్యక్తి జీవితం ఈ పుస్తకం రూపంలో బయటికి వచ్చినపుడు, మిగతా వారెవరికీ తెలీనంత, అందనంత, పొందనంత సంతోషాన్ని పొందిన వాళ్లము ప్రథమంగా ఇద్దరమున్నాము.. ఒకరు మా అమ్మ భార్గవి , ఇంకొకరు నేను. మా ఇద్దరమూ కాక నిజానికి మూడో వ్యక్తి కూడా ఒకరున్నారు. వాస్తవానికి ఈ పుస్తకం రంగూ, వాసనా, రుచి చూసి ఆయన కన్నా గొప్పగా పొంగిపోయేవారు మరొకరెవరూ ఉండలేరు. ఆయనే డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి గారు. ఎంత సంతోషపడి ఉండేవారో ఆయన ఈ పుస్తకాన్ని ఇలా చూసి ఉంటే. మీకు తెలియక పోవచ్చు. మాకు తెలుస్తుంది. నన్ను మా చిన్నాయన ఎంతో గొప్ప ప్రేమతో పెంచాడు. ఒక్కోసారి ఆయన పని మీద బయటికి వెళ్ళి అర్థరాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చేవాడు. ఎంత అర్థరాత్రి అయినా సరే - మహా ఆలస్యమయినా సరే, వస్తూ వస్తూ నా కొసమని ఏదో ఒక మిఠాయినో, పండో, తినుబండారమో తెచ్చి, బాగా నిద్రలో ఉన్న నన్ను లేపి మరీ ఆ తెచ్చినది తినపెట్టి ఆ తరువాతే నన్ను నిద్రపుచ్చేవాడు. అలా నిద్రలు పోయీ పొయీ నిద్రలోనే పెరిగి పెద్దయి పోయిన నా దగ్గరకు ఈ అమ్మ వచ్చింది. ఎంత నా పనిలో నేనున్నా, చచ్చేంత చావులో మునిగి తేలలేకున్నా సరే , జుట్టు పట్టి తేల్చి మరీ "అన్వర్ చూడు ఈ పుస్తకం ఎంత బావుంటుందో, ఆ పుస్తకం చదువు ఎంత హాస్యంగా ఉంటుందో " అని పట్టుబట్టి నాతో పుస్తకాలు చదివించే పని మా అమ్మది. ఆవిడకు అన్ని పుస్తకాలూ సమానమే, అయిననూ రెండు పుస్తకాలు మరీ ఎక్కువ సమానం. ఒకటి జమ్మి కోనేటి రావు గారి సూక్ష్మ క్రిమి అన్వేషకులు మరోటి చాగంటి సూర్యనారాయణ మూర్తి గారి డాక్టర్ కథ. మొదటి పుస్తకం "సూక్ష్మ క్రిమి అన్వేషకులు " అమ్మ దగ్గర ఉంది. డాక్టర్ కథ మాత్రం ఆవిడ దగ్గర లేదు. దాని గురించి ఆవిడ చెప్పడం, నేను వినడం తప్పా. సరిగా ఆరు నెలల క్రిందట ఆవిడ చేతికి శిధిలావస్థ లో ఈ పుస్తకం కాపి అందింది. అప్పటికీ రాత్రి పది అయి ఉంటుంది. పుస్తకం వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి, ఫలానా పుస్తకం పంపుతున్నాను చూడు, వెంఠనే చదువు అన్నది. సరేనమ్మా చదివి రేపు ఉదయం మాట్లాడుకుందాములే అన్నా. పుస్తకం చదవడం మొదలు పెట్టా. రేపు ఉదయం ఫోన్ చేస్తా అన్నవాడిని చదువుతూ చదువుతూ పేజీల మధ్య ఆగిపోయి సంతోషం పట్టలేక ఆ రాత్రి ఎన్ని సార్లు ఆవిడకు ఫోన్ చేసానో, ఆయన కథనం గురించి, చక్కని వాక్యం గురించి, హాయైన శైలీ గురించి ఎంతగా మురిసిపోయామో ... ఒక్కోసారి ప్రొస్ ఈజ్ బాటిల్డ్ వైన్ అంటారే! అంత నషాని ఇచ్చిందా పుస్తకం నాకు. సంతోషమంటే ఒకే ఒకరు తనతో తాను పంచుకోవడమా? గదిలో నాలుగు రెళ్ళ ఎనిమిది అద్దాలు ఏర్పాటు చేసుకుని ప్రతిబింబాల తోడుగా మురియడమా? కాదు కదా! ఒక చేయి చప్పట్లు పలకించలేదు. ఒక రెక్క రివ్వున ఆకాశం వైపు దూసుకోపోలేదు. పదిమందితో పంచుకోనిది ఏమానందం? నలుగురితో కలిసి రుచి చూడనీదీ ఏం భోజనం? ఒక పిట్టకథ చెబుతా. 1960 నాటి జగతి పత్రికలో "జియార్ ఫాన్ డీర్ ష్రింగ్ " గారి రచన ఒకటి అచ్చయ్యింది - అందులో పదమూడేళ్ళ హాన్స్ తన మిత్రురాలు పదహైదేళ్ల అమ్మాయి ఊటా కి కాస్త డబ్బు అప్పు పడతాడు. ఏం చేసయినా సరే ఆ అప్పు తీర్చాలని హాన్స్ పట్టుదల. సరిగ్గా అదే సమయం లో బయట పెద్ద తుఫాను- గాలి వానా. బయట కాలు అడుగుపెట్టడానికే లేదు. ఏం పని చేసేట్టు? ఎట్లా డబ్బు సంపాదించేట్టు? పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని హాన్స్ తాతగారు వాడికి ఇదిగో ఈ అద్భుతమైన పుస్తకం చదువు అని ప్రపంచ ప్రఖ్యాత హొమర్ విరచిత ఒడిస్సే అతని చేతిలో పెడతాడు. పదమూడేళ్ల పిల్లవాడికి ఎంత భారం? ఏమర్థమవుతుంది అంత మహాకావ్యం? అయితే వాడికి ఒక ఆలొచన వస్తుంది. ఆ పుస్తకాన్ని కంఠోపాఠం చేసి పేజీ పేజీ ఒప్పచెప్పితే తాతయ్య నాకేమైన డబ్బు ఇస్తాడేమో? అలా డబ్బులు సంపాదించి తన ప్రెండు ఊటా’ దగ్గర చేసిన అప్పు తీర్చేయవచ్చు కదా! అలా అని అలోచన చేసి ఆ పుస్తకాన్ని రాగయుక్తంగా కంఠస్థం చేయ మొదలు పెదతాడు ఆ బుల్లబ్బాయి. మిగతా కథ అంతా తరువాతి సంచికల్లో అని అక్కడిక్కకడ నన్ను మోసం చెసి వెల్లిపోయిందా సంచిక. ఎంత ప్రయత్నించినా నాకు తదుపరి సంచికలు దొరకలేదు. ఆ కథను అద్భుతంగా అనువాదం చెసినవారు , డాక్టర్ వి. ఎన్. శర్మ గారు. ఆయన పేరు మీద వెదికినా అసలేమి సమాచారం లేదు ఇంటర్నెట్లో. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే! ఒక చిన్న రొట్టె ముక్కనో, ఒక జామ పండునో, చివరికీ పిసరంత పిప్పరమెంట్ ను కూడా ముక్కలు చేసుకుని నలుగురితో పంచుకునే మనుష్యులము మనము. ఇక్కడ డాక్టర్ భార్గవి గారు పంచుకున్నదల్లా తన కలను. తను చదివి ఆనందించడమనేది సరి. కానీ తను పొందిన ఆనందాన్ని పదిమందికి పంచాలని ఉంటుందే! అందునా అదేమి తన స్వంత రచన కాదు. ఈ పుస్తకం వలన తనకు కొత్తగా తెచ్చుకునే, వచ్చిపడే పేరూ ఉండదు. పుస్తకం వేయడమంటే డబ్బు ఎదురు పోయడమే కానీ, రావడం కాదు కదా. పైన నేను చెప్పిన కథ లో నాకు తప్పి పోయిన హాన్స్, ఊటా, డాక్టర్ వి. ఎన్. శర్మ గారు వీళ్లంతా నాకు ఏనాడో ఒకనాడు దొరక్కపొతారా? అనే ఆశకు ఆలంబన ఇదిగో ఈ డాక్టర్ భార్గవి గారి వంటి వారు, ఇంకా ఎవరైనా ఇటువంటి అద్భుతమైన పుస్తకాలు తేక పోతారా అని. గాలి ఎట్లా వస్తుందో ముక్కు కు తెలీదు , గొప్ప పుస్తకాలకు తెలీని ఊపిరి పోసేది ఈ అమ్మ వంటి వారే! . కానీ ఏదీ అంత సులువుగా మొదలవదు. ముగియదు. ఈ పుస్తకం మళ్ళీ తేవడం కోసం డాక్టర్ భార్గవి ఎంత సంకల్పశక్తి తో ముందుకు సాగిందో , ఎన్నెన్ని అవాంతరాలు ఎదురయ్యి దిగాలు బొమ్మలా చిన్నబోయిందో నాకు తెలుసు. పాటలా గలగల సాగే మా అమ్మ, ఈ పుస్తకం కొసమని అపుడపుడూ బరువుగా దుఖంగా అయ్యేది. నేను దానిని భరించలేక ఉండే వాడిని. పుస్తకమొద్దు ఏమీ వద్దు, ఇప్పుడు అది బయటికి రాకపోతే మునిగి పోయేదేం ఉంది? నీ ఆరోగ్యం, ఆనందం పాడు కావడం తప్పా ఆని! కేకలు కూడా వేసేవాడ్ని. అన్నీ వింటూనే ఉండేది, భరిస్తూనే ఉండేది. నేను మొత్తుకోళ్ళు పెడతానని తెలిసీ కూడా ఏ రోజుకారోజూ పనిలో ప్రొగ్రెస్ చేస్తూనే ఉండేది. నాకు చెబుతూనే ఉండేది . ఈ ఆరు నెలలు ఈ పుస్తకం తప్పా మరో పనేం పెట్టుకోలేదు. అదిగో అక్కడ ఆ డాక్టరు గారి బంధువులెవరో ఉన్నారు అంటే అటు పరిగెత్తింది. అటు కాదు ఇటు అంటే ఈ వైపు పరిగెత్తింది. ఏ దిక్కునైనా దిక్కు చూపించే వారెవవరున్నారని తెలిసినా దిక్కులన్నీ కొలిచే పని పెట్టుకుంది. అలా మొదలు పెట్టి పేజీ పేజీ తడుము కుని ప్రాణంగా, ముచ్చట గా, ముద్దుగా పుస్తకాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. పుస్తకం చివరిదాకా వచ్చాక కూడా చాగంటి వారి ఫోటో దొరకలేదు. ఇద్దరమూ కలిసి దయ్యాల గది లాంటి ఒక చిన్న గదిలో కుప్పలుగా పొసిన ఫోటో గ్రాఫుల మధ్య దుమ్మూ, బూజు, ధూళి , అలర్జీల మధ్య ఎన్నో ఫ్రేముల మధ్య ఎప్పుడూ చూడని సూర్యనారాయణ గారిని వెదికే పని పెట్టుకున్నాము. ఆయన అక్షరాన్ని బట్టి, ఆయన శైలిని బట్టి ఆయనని పోల్చుకునే పని చేసాము. మా అమ్మ మొహమంతా మురికి, అలసట, కళ్లల్లో మాత్రం దొరికి తీరుతుందనే ఆశ. ఆశ గొప్పది. అది పొస్టల్ స్టాంపంత విశాలమైనది, స్టాంపు వెనుక పూసి ఉంచిన జిగురంత లోతైనది. శ్రీ చాగంటి సూర్యనారాయణ గారి పోస్టల్ స్టాంపంత ఫోటో దొరికినపుడు ఆ గదిలో మేము ఇద్దరమే ఉన్నాము. అమ్మ ఎంత సంతోషించిందో చెప్పగలిగిన భాష నా దగ్గర లేదు. నాకైతే ఇంకాస్త దురాశ కలిగింది. చాగంటి వారు ఈ పుస్తకాన్ని వారి సతీమణి వేంకట రమణమ్మ గారికి అంకితం ఇచ్చారు. ఆవిడ ఫోటో కూడా దొరికితే అంకితం పేజి లో పెట్టవచ్చు కదా అని. పాఠకుడి మనసుకి చదువుతో పాటూ కళ్లకి గొప్ప ఆనందం ఇవ్వడం కోసం ఈ పుస్తకాన్ని మాకు వీలయినంత అందంగా తేవడానికి ఇష్టపూర్వకంగా ప్రయత్నం చేసాము. పాతికకు పైగా బొమ్మలు వేసి కూడా మా లౌల్యం వల్ల పుస్తకం సింప్లిసిటి చెడకూడదని నిర్దాక్షిణ్యంగా ఆ బొమ్మలని పోగులు పెట్టాము. కథలో తగిలే ప్రతి ఉప శీర్షిక ని టక టక కీబోర్డ్ తో టైపాడించి పెట్టింది కాదు. కొత్తగా తయారు చేసింది. అందులో నింపిన కేవలం పాతిక శాతపు నలుపు రంగు రేపు ఈ పుస్తకంలో ప్రింట్ రూపంలో ఎలా వస్తుందో, అచ్చయిన పేపరుని చూస్తే తప్పా మాకూ తెలిసే అవకాశం లేదు. అయినా సాహసం చేశాం. పుస్తకం బాగా రాకపోతే , ప్రతులన్నీ తగలెట్టి మళ్ళీ కొత్త పుస్తకం వేద్దాం అనే ఉన్నాం. పుస్తకం తొలి పేజీలో రచయిత బొమ్మ పై పెట్టిన టైటిల్ డిజైన్ హెయిర్ లైన్ థిక్ నెస్ ఫాంట్ పరిస్థితీ అంతే, ఏది ఎలా అచ్చవుతుందో మాకు తెలీదు. కొత్తగా చేయాలనుకున్నాము. తన రచనతో మా మనసుల్లో కి గొప్ప స్థానంలో వచ్చి కూర్చున్న శ్రీ చాగంటి సూర్యనారాయణ గారి పట్ల మేము చూపించగలిగిన కృతజ్ఞత ఇది మాత్రమే. అదే చేశాము. ఈ పుస్తకపు పని చేస్తున్న రోజుల్లో నా బుర్రనిండా ఇద్దరు మనుషులే నిండి పోయారు ఒకరు నికోలా టెస్లా, 1856 ల నాటి మనిషి. మరొకరు ఈ చాగంటి సూర్యనారాయణ 1898 ల వారు. 2023 ల నాటి నాకు ఇప్పటి నా ప్రపంచంలో నేను మోయవలసిన ఆలోచనలు, ఇతరాలు చాలా ఉన్నాయి. కానీ నా బుర్రలో అవేమీ నన్ను ఆక్రమించుకొలేదు. ఈ ఇద్దరు మనుషులు తప్పా. ఎందుకా అంటే, వీరు చేసిన పనల్లా, అలోచించినదల్లా కేవలం మానవాళి గురించే. వీళ్లని గురించి నేను చేసిన ఆలొచనలు, వీరి గురించిన నేను చదివిన చదువు నన్ను ఎంతగానో సంతోషపెట్టింది. నన్ను ఎక్కడో పడనివ్వకుండా సజ్జన స్మరణ లో ఆపింది. ఇదంతా ఎందుకు తలపోసుకుంటున్నానంటే మనిషి అనేవాడు మిగలడు కానీ అతను సంకల్పించిన మానవీయమైన కార్యాలు నిలుస్తాయి. పుస్తకాలు కూడా అన్ని నిలబడవు, కేవలం అత్మశక్తి అక్షరాలలో నిలిచి మీ మనసులు తాకుతుందో,మనల్ని మనగా ఉంచ చూస్తుందో ఆ రచనలు మిగులుతాయి. ఇప్పుడు మీ చేతుల్లో అత్యంత సులువుగా పెంపుడు పావురాయిలా ఒదిగి కూచున్న ఆ పుస్తకం కోసం మేం ఎన్నెన్ని చెట్లు గుట్టలు ఎక్కినా, కొండా కోనలు గాలించినా అదంతా మా సంతోషం కోసమే. పంచడానికి మా వద్ద కేవలం సంతోషం మాత్రమే ఉంది. దయచేసి స్వీకరించండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
Bapu: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము
‘నేనయితే కింద సంతకం లేకపోయినా సరే! బాపు బొమ్మని గుర్తుపడతాను’ అని కొంతమంది అమాయకంగా అమాయకమై పోతుంటారు. అలా అవనవసరం లేదు. రేఖ పండిన చిత్రకారులకి సంతకం అవసరం లేదు. వారి బొమ్మే సంతకం అవుతుంది. మరి బాపు గొప్పతనమంతా సంతకంలో కాక మరెక్కడుంది అని మీరెవరైనా అడిగితే నేను ఇలా చెబుతాను. అనగనగా అనేక కథలు మన సాహిత్యానికి ఉన్నాయి. ఒకానొక బంగారు కాలంలో ఆ కథలన్నిటికీ అరచేయంత కొలత దగ్గరి నుండి, రెండు పేజీల వరకు వ్యాపించిన డబుల్ డమ్మీ ఇలస్ట్రేషన్లను బాపు బొమ్మలు కట్టేరు. తన క్రియేటివిటీతో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని అమరం చేశారు. కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశాన్ని అడుగుతాడు ‘ఏమి వాయ్! క్రియేషన్ అనగానేమీ?’ దానికి వెంకటేశం ఏమి చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు మాత్రం నేను చెప్పేది వినండి. క్రియేషన్ అనగా తెల్లని కాగితంపై మూడు అక్షరాల నల్లని అచ్చుగా మాత్రమే ఉండిన గిరీశం అనే ఒక పేరుకి ‘ఇదిగో ఇంత ఎత్తు, ఇది నుదురు, ఇలా పంచె అని కట్టి, చేతిలో చుట్ట పెట్టి మన మెవ్వరమూ ఎప్పటికీ ఊహించలేని ఒక ఊహకు రూపం ఇచ్చి మనకు పరిచయం చేయడమన్నది బాపు చేసిన క్రియేషన్. గిరీశం కానీ, మధురవాణి కానీ, సౌజన్యరావు పంతులు కానీ, బుచ్చమ్మ కానీ ఇలా ఉంటారు అని ఆ గురజాడ అప్పారావు తమ పుస్తకంలో ఎక్కడా వర్ణన చేయలేదు. కానీ బాపు వారందరికీ ఒక రంగూ, ఒక రూపం, ఒక లక్షణం, ఒక ధోరణి, ఒక రీతి ఇచ్చి వారిని బొమ్మలుగా మలిచి మనకు మప్పారు. ఒకసారి బాపు బొమ్మల్లో వారిని చూశాక... వారు అలా కాక మరి ఇంకోలా ఉండటానికి మన ఇమాజినేషన్లో కుదరదు. బాపు బొమ్మ అంటే ఒక సంతకం కాదు. పేరు కాదు. కాసింత కాగితం, కలం మాత్రమే కలిసి దిద్దిన కల్పన కాదు. అంత కాక మరెంత? అనడిగితే, అదీ చెబుతా. తొంబైల నాటి తరం మాది. మేము చదువుకున్న కథా సాహిత్యమంతా కొకు కథా సంపుటాలు, శ్రీపాద కథా సంపుటాలు, రావిశాస్త్రి కథా సంపు టాలు. మా తరానికి ఆ కథలు తొలినాళ్లల్లో అచ్చ యిన ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి లాంటి అనేకానేక పుస్తక పుటలు తిరగేయడం కుదరలేదు. తరవాత్తరువాత ఆ పాత పుస్తకాలు, అందులో వాటికి వేసిన బొమ్మలు చూసే అవకాశం దొరికినపుడు, ఒకోసారి ఇంటర్నెట్లో పైన కథ పేరు కూడా లేని చాలా బాపు బొమ్మలను చూసినపుడు... నా కళ్ళకు కనపడింది బొమ్మ కాదు అచ్చంగా కథలే. చలపతి, దాసూ పూర్వాశ్రమంలో సహధ్యాయులు, వారిద్దరి మధ్య పెద్ద స్నేహమేం ఏర్పడలేదు. చదువుల అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా చలపతికి దాసు కనపడతాడు. చలపతికి పెళ్ళి కావాల్సిన రాజ్యం అనే చెల్లెలు ఉంది. చలపతి దాసూని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో చలపతి, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు, రాజ్యం ఉంటారు. అ చదువుకున్న మధ్యతరగతి ఇల్లు, ఈ దంపతులు, ఆ పిల్లలు, వంటగదిలోంచి రెండు లోటాలతో కాఫీ తెస్తున్న రాజ్యం, కుర్చీలో కూచుని బుగ్గన సొట్టతో నవ్వుతున్న దాసు. ఈ బొమ్మని, వీటితో పాటూ అదే కథకు బాపు చిత్రించిన మరికొన్ని బొమ్మలని చూసిన నాకు ఒక్కసారిగా ఆ కథ మొత్తం నోటికి తగిలింది. బొమ్మ బొమ్మలో వెంకమ్మ, భాగ్యమ్మ, గోపీ, సత్యం అనే అందరినీ గుర్తు పట్టగలిగాను. ఈ కథే కాదు. బాపు వేసిన ఎన్నో బొమ్మల్లో ఆ కథలనూ, అందులోని మనుష్యులనూ గుర్తుపట్టి థ్రిల్లవుతూ వారిని చేయి పట్టి ఊపి షేక్ హాండ్ ఇచ్చిన అనుభవాలు నాకు కొల్లలు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) దీనిని మించిన మరో అద్భుత సంఘటనను మీకు చెబుతా. భారత దేశానికి గాలిబ్ కవితా, తాజమహలూ మరవరాని అందాలు అని ఒక మహానుభావుడు అన్నాడుట. మరి గాలిబ్ కవితకు ఏమిటి అందం? ఏ చేతులది చందం? అని వెదుక్కుంటూ బంగారం వంటి కవి దాశరథి, గొప్ప పబ్లిషర్ ఎంఎన్ రావు బాపును కలిశారు, ఆయనకు గాలిబ్ గీతాల అనువాదం ఇచ్చారు. వాటన్నిటికీ బాపు బొమ్మలు వేశారు. ఆ తరువాత ఆ పుస్తకం సాధించిన ఘన కీర్తి, తెలుగు వారి హృదయాలలో సంపాదించుకున్న సుస్థిర యశస్సు అందరికీ తెలిసినదే. అయితే చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం, బాపు బొమ్మకే అందిన అందలం ఏమిటంటే, దాశరథి గాలిబ్ గీతాల తెలుగు అనువాదం పుచ్చుకుని ఒక్క తెలుగు అక్షరం కూడా ఎరుగని ఎక్కడెక్కడి ఉర్దూ కవులూ కేవలం బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ ఉరుదూ మూలం చదివేవారుట. ఇంతకూ చెప్పదలుచుకున్నదేమిటంటే... ‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, మరియొకడు బాపుయగుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము.’ – అన్వర్ (డిసెంబర్ 16న బాపు జయంతి; తెలుగు యూనివర్సిటీలో బాపు–రమణ పురస్కారాల ప్రదానం) -
ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..
కాళ్ల సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ణి అలాగే పట్టించుకోలేదు. అతని కవిత నిరూపం, ఆయన గానం ఏకాంతం, కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్ పై జారిన చెమట చుక్క నిశ్శబ్దం. ఆయన మరణం కూడా పెద్దగా ఎటువంటీ చప్పుడు చెయ్యకుండా ప్రపంచాన్ని దాని మానన దాని రణగొణ ధ్వనుల్ని దానికే వదిలేసి మనకు సెలవన్నారు. చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్ ప్రింటర్. తన లోకపు నవ్వుల వేదాంతి కాళ్ళ సత్యనారాయణ నవంబరు 24 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి నిష్క్రమించారు. దాన్ని మనం మరణం అనుకోవచ్చు. గత ఇరవై రోజుల నుంచి మృత్యుశయ్యపై మేను వాల్చి ఉన్న ఈ మనిషి అంతకు రెండు రోజుల ముందే తన బాల్య మిత్రులు కడుపు గంగాధర్ కోరిక మేరకు తన జీవితానికి అక్షర రూపం ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు పేరాల రచన తరువాత ఈ పనిని మాత్రం ప్రపంచం ముందుకు ఎందుకు పరవాలి అనిపించిందో ఏమో! వ్యక్తిగతంగా ఒకరిద్దరు మిత్రులతో పంచుకున్న ఆయన, వారి గుడిసెలోని కిరసనాయలు దీపం ముందు పలికి మాటలు ఇవి. ఈ కాసిన్ని మాటల తరువాత నేను ఆయనతో ఆనాటి వాన చినుకులు అనే కథ ఒకటి వ్రాయించ ప్రయత్నించాను. నా మరో మిత్రులు వేమూరి సత్యనారాయణ గారి గత ముప్ఫయ్ ఏళ్లక్రితం నుంచి కంటున్న కల ఈ కథల పుస్తకం. బహుశా అంతా సవ్యంగా ఉండి ఉండుంటే ఆ పుస్తకంలో కాళ్ల గారి రిక్షావాడి కథ అందులో ఉండి ఉండేది. ‘ఓ జ్ఞాపకం. నేను రెండుమూడు తరగతుల్లో వున్నప్పుడే బొమ్మలెయ్యడం ఇష్టం. నాలుగైదు తరగతులకొచ్చేసరికి ఇష్టం పిచ్చిగా మారింది. ఆ వయసులో మా కుటుంబం బీదరికం కంటే దీనంగా వుండేది. రాత్రిపూట కోడిగుడ్డు చిమ్నీ కిరసనాయిల్ దీపం ముందు చదువుకుంటున్నట్టు నటించేవాణ్ని.అంతకుముందే మా అమ్మ హెచ్చరించేది ‘నాయనా కిరసనాయిల్ రేపటిక్కూడా అదే‘నని. ఆ దెబ్బకి ప్రాణం గిలగిల్లాడిపోయేది. రిక్షా తొక్కితొక్కీ మా నాన్నా, పాచి పనులు చేసి మా అమ్మా అలిసిపోయి, ఎప్పుడెప్పుడు నిద్రపోతారా అని చూసేవాణ్ని. అంతకు ముందే దీపాన్ని గోరంత చేశేవాణ్ని. వాళ్లు నిద్రపోయారన్న సంకేతాలు రాగానే...ఇక నా అస్త్రాలు (అంగుళన్నర పెన్సిల్ ముక్క, అరిగిపోయిన లబ్బరు, పొద్దున బడిలో పక్కోడి నోటు పుస్తకం లోంచి కొట్టేసిన తెల్లకాయితం)తీసేవాణ్ని ధైర్యంగా. కానీ నా ముందున్న ఆ గోరంత దీపాన్ని పెంచే ధైర్యం లేపోడంతో అది అలా మిణుకుతూనే వుండేది. ఐనా, ఎక్కళ్లేని ఉత్సాహంతో బొమ్మ మొదలెట్టేవాణ్ని. ఆ క్షణాల్లో, ఈ ప్రపంచంలో నేనొక్కణ్నే. ఎవరన్నా వుంటే... నాతరవాతే. అలాగ ఎంతసేపుండేవాడినో! నా పిచ్చి అమ్మా నాన్నలు ఒళ్లెరక్క నిద్రపోతుంటే అలివికానంత ఆనందంగా వుండేది. వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని కాదు, ఇక ఆ సమయంలో నాకు యే అడ్డూ లేదని. ఎలాటి కాలసూచికలూ లేని ఆ యింట్లో, నా లోకంలో వున్నప్పుడు, ఏదో కవుఁరుకంపు యీలోకంలోకి లాగింది. ఏదో కాలుతుంటే వచ్చే దుర్వాసన అది. ఆవేళప్పుడు ఏదో తగలబడుతున్నట్టనిపించి భయవేఁసింది. తీరా చూస్తే కాలింది నాజుత్తే, దానివల్లే కవుఁరుకంపు. ఏమయిందంటే,నాముందున్నది గుడ్డి దీపంబుడ్డి, దాని వెలుగెంత! నేను వేసేబొమ్మ కోసం బాగా కిందకి వంగితే చిమ్నీలోంచి వచ్చే సెగకి నా జుత్తు కాలిందన్నమాట. కొత్తాపాతల మధ్య తేడాలెప్పుడూ వుండేవనకుంటా. నాకైతే నాలుగు తరాల మనుషులు తెలుసు. వీళ్ల మధ్య అప్పుడప్పుడూ వెటకారాలూ వెక్కిరింతలూ నడిచేవి. ‘ఏ పింగూ లేపోతే క్రాపింగు' , ‘పుటోవులు దిగితే ఆయుర్దాయం తగ్గిపో‘ద్దని, అప్పుడప్పుడే మొదలౌతున్న ఫొటోగ్రఫీ మీద అపనమ్మకమూ, అల్యూమినియం పాత్రల్లో వండుకునీ తింటే అనారోగ్యం పాలవుతామనీ.... ఇలా ఎన్నో తేడాలు. ఐనా వాళ్ల cultural space కాపాడుకునేవారు. అందుకే నిన్నామొన్నటి వరకూ తోలుబొమ్మలు, కీలుబొమ్మలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, గొల్లసుద్దుల్లాటి కళా రూపాలు బతికొచ్చాయి. ఇప్పుడు, ఏ మాత్రం పసలేని అభిరుచుల్ని తృప్తిపరచడానికి టీవీతల్లే దిక్కు. ఇప్పుడు పెరిగిన సాంకేతిక జ్ఞానంతో ఇప్పడున్నవాటితో పాటు, పాతరూపాల్ని ఆధునికం చేసే ఓపికా సమయమూ ఈ తరానికి లేపోడం విషాదం. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి చదవండి: Sarah Baartman Life Story: విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను ఆడా మగ, ముసలీ ముతక గొడుగు మొనలతో పొడిచి.. -
మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతిచ్చిన బద్ధ శత్రువు
కౌలాలంపూర్: మలేసియా సీనియర్ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం(75) ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయెన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కక హంగ్ ఏర్పడటంతో రాజు జోక్యం చేసుకున్నారు. అన్వర్ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బద్ధ వ్యతిరేకి, దీర్ఘకాలం అధికారంలో ఉన్న యునైటెడ్ మలయీస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీంతో సందిగ్ధానికి తెరపడింది. నేషనల్ ప్యాలెస్‌లో గురువారం రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్‌తో ప్రమాణం చేయించారు. చదవండి: కిమ్‌కి అంత భయమా?.. ట్రంప్‌ని మించి పోయాడు! -
సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!
నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు. ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ చల్తాహై. ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు. తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో ఒకప్పుడు, ఒక మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . అయితే నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు. ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే ఉందా? మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది. -
నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా!
ఊరికే ఆ ద్వారం నుండి ఈ ద్వారం వరకు, ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు ఇంటిలోనుండి బయటికి బయటి నుండి ఇంట్లోకి అలా పరిగెడుతూ ఉంటానా, తలుపు పక్కనున్ను బియ్యం గచ్చులో చేయి పెట్టి ఇంత బియ్యం జేబులోకి, మరింత బియ్యం నోట్లో వేసుకుని నములుతూ ఉంటే బియ్యం ఎంత తియ్యగా ఉండేదో. పచ్చి బియ్యమే అంత తియ్యగా ఉంటే ఇంటి బయట కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వెలుతురూ, గాలి తగులుతూ గంజి వార్చి వండిన అన్నం ఇంకెంత రుచిగా ఉండాలి? గంజి అంటే గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసి కార్టూన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న వ్యాఖ్యా-బొమ్మల తొలి కార్టూను గంజి మీదే. పొలీసాయన చాకలాయన్ని గద్దిస్తూ ఉంటాడు. ఏమిరా అప్పిగా ! నా నిక్కరుకి గంజి పెట్టి ఇస్త్రీ చేయమన్నానా, గంజి పెట్టలేదే?" "మా ఇంట్లో తాగనీకే గంజి లేదు దొరా, ఇక నీ నిక్కరకు ఏమని పెట్టేది?" అప్పుడు అది చూసి భలే నవ్వుకున్నాం కానీ కాస్త ఆకలి, కాస్త గంజి మెతుకులు అనే పెద్ద మాటలు బుర్రకు పట్టాకా’అయ్యో! అనిపించింది. అలా గంజి వార్చి వండిన వేడి వేడి అన్నంలో చాలా నెయ్యి పోసి, ఎర్రపప్పు , ఎర్రెర్ర ఆవకాయ ఊర్పు కొంచెం కలిపి చిన్న చిన్న ఆవకాయ ముక్కలని గిల్లి ముద్దలుగా కట్టి కథలు చెబుతూ తినిపించేది మా జేజి. పప్పన్నం అయ్యాక పాలు చక్కర అన్నమో లేదా పెరుగన్నంలో బెల్లం ముక్కలు కలిపి తినిపిస్తే దానితో స్వస్తి. కథల్లోకి అన్నం నంజుకుంటున్నామా. అన్నం లోకి కథలు నంజుకుంటున్నామా అనేది విషయం కానే కాదు అది నాంది. అన్నం బావుండేది. కథలూ బావుండేవి. అయితే ఆ చిన్నప్పుడు బావోనివి కూడా ఉంటాయని తెలీదు కాబట్టి, బావున్నవి అప్పుడు బావున్నాయనే విషయం కూడా తెలీదు. పెరిగి పెద్దయ్యాకా ఈ ఇంటి వంట ఈ ఇంటి వంట ఆ హోటలు వంట ఈ రెస్టారెంట్ వంట తినవలసి వచ్చినపుడు అక్కడ కూర బావుంటుంది, ఇక్కడ చారు బావుంటుంది, ఆ ఇంటి వాళ్ళు పచ్చడి బాగా చేస్తారు, మా ఇంట్లో మటన్ మహత్తరం అనే సింగులర్ అప్రిషియేషన్సే అమృతం అనే భావనకు దిగ పడిపోయా. ఒకసారి మధ్యాహ్నం ఆకలి సమయాన మదరాసులో ఒక హోటలు వైపు దారి తీశారు మహా గొప్ప చిత్రకారులు సురేష్ గారు. బయట వేడిగా ఉన్నా, లోపల గాలి చల్లగా వీస్తుంది. అరవ సర్వర్ గారు వచ్చి అరిటాకు పరిచారు. వరుసగా పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తినడం మొదలు పెట్టా, తఠాలున వెలిగింది రుచి అనేది. ఆ రుచికి నెమలీకమీది తడి పచ్చదనంలా ఉంది అరటి ఆకు తళ్ళెం. అరటి పొలం మీదికి పొగ మంచు వచ్చి కొబ్బరి కోరులా కురిసినట్లుగా ఉంది తెల్లని అన్నం. గంగమ్మ శివుడి నెత్తి మీది నుండి జాలువారుతుండగా ఒక పక్క పాయ కుంకుమ తడిసిన రంగులో అన్నాన్ని తడుపుతుంది చారు. మరో పాయ తెల్ల విభూదితో కలిసిన మజ్జిగ ధార. నక్షత్రాలు చాలా తెలుసు కానీ తెల్లని నెలవంక ఒకటేగా, నూనెలో వేగి వంకర తిరిగిన చల్ల మిరపకాయలన్నీ చంద్ర వంకలే! ఆ కూరా, ఈ పచ్చడి, అక్కడ అప్పడం, ఇక్కడ నెయ్యి, వేలు ముంచి నోటి దాకా ఎత్తిన తీపి... ఏది తిన్నా బావుందే! ఎంత తిన్నా బావుందే! ఇది కదా భోజనం అంటే, సంపూర్ణం అంటే. ఇంతకాలం భోజనం అని, అన్నం అని పేరు పెట్టుకుని ఏం తింటున్నాం? దశాబ్దాలుగా తిండిముందు సర్దుకు పోతున్నాం అంతే. ప్రపంచంలో చాలా మందికి ఈ మాత్రం అన్నం కూడా గతిలేదు అని సర్దుకుపోయి బావుంది, బాలేదు అనే మాటలే మర్చిపోయాం. మంచి భోజనం మాదిరిదే మంచి కథ కూడా, గొప్ప కథ కూడా, అద్భుతమైన కథ కూడా. భోజనం మొత్తంలో అన్నమొక్కటి బావున్నట్టో, కూర బావున్నట్టో, చారు మజ్జిగ లేదా మజ్జిగ పులుసు బావున్నట్టో, ఏదో ఒకటి బావుంటే అది చాలులే అనుకునేట్టు అయిపోయింది కథా కాలం. వొస్తువు కొత్తగా ఉంది కదా? ఇతివృత్తం మంచిది ఎన్నుకున్నాడు, శిల్పం చూశావా? ఆ శైలి ఉందే! అబ్బో!! వచనంలో నడక కొత్త దారి దొక్కింది. ఈ కాలం మరీ అన్యాయం, కథ ఏవుందిలే! కథ రాసి వడ్డిస్తున్న పిల్లను చూడు, కత్తి కదూ! దేనికదేగా బావున్నాయి. మొత్తంగా బావుందో లేదో తెలీదు, తెలుసుకోవాలసిన అక్కరలేదు. ఈ రోజు బావుందని అనుకుంటున్న కథను అసలు కళ్లకద్దుకుని మళ్లా మళ్లా చదువుతున్నామా అసలు? నాకై నేను కథని వెదుక్కుని చదువుకుని ఎంత కాలం అయ్యింది? బలివాడ కాంతారావు గారి బయ్యన్న మాదిరి కథ ఒకటి వచ్చి గుండెలో మెత్తగా పడుకుని ఎంత కాలం అయ్యింది? అయితే ఒక అదృష్టమున్నది భోజనమైతే రోజూ తినాలి, మంచిది ప్రతి రోజూ దొరక్క పోవచ్చు, బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలి తప్పదు. అయితే కథలు మాత్రం కొత్త వాటి కొరకు ఎదురు చూడనక్కరలేదు, ప్రపంచంలో కథావాంగ్మయం అనేది ఒకటి పాతది చాలా తయారయ్యి ఉంది. మళ్ళా మళ్ళా చదువుకునెందుకు చాలా దయతో గొప్ప కథని దానం చేసి పోయిన కథకులు చాలా మందే ఉన్నారు. తరగని కథ చాలా ఉంది. కొత్త కథల కొరకు ఎదురు చూడాల్సినంత కథ ఏమీ తరిగిపోలేదు తరిగేదల్లా చదవడానికి సమయం లేని మన వయసు. ఉండండి, పాత కాలంలోకి పరిగెత్తి పోవాల్సిన శ్రమ తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను రండి. నార్మన్ గార్డ్స్ బై అనే మనిషి వచ్చి పార్క్ లో వచ్చి కూచుని మనుషులకేసి చూస్తున్నాడు. అది సంధ్యా సమయం. ఆయన దృష్టిలో సంధ్యా సమయం అంటే మనుషులు పగలంతా పోరాడి ఓడిపోయిన తమ అదృష్టాలను, చనిపోయిన తమ నమ్మకాలను చేతనయినంతవరకు లెక్కలు చూసుకునే సమయం, ఈ రోజుకు ఇక మనం మరణించి రేపటి పోరాటానికి మరలి పుడదామనుకుంటూ వంగిపోయిన భుజాలతో ఆశలు అడుగంటిన కళ్లతో బరువుగా ఇంటి వైపుకో, సారా కొట్టుకొ సాగే సమయం. వారిని చూస్తూ ఉంటే నార్మన్ గార్డ్స్ బై కళ్లకు ఈ లోకమనే ఆనందక్షేత్రంలో హక్కుగా ఉండవలసిన వాళ్ళెవరూ కనపట్టం లేదు. నిజానికి ఈ ఓడిపోయిన వాళ్లల్లో తనని తాను కూడా ఒకడిగా లెక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు గార్డ్స్ బై. అతనికి పోయిన గంటు అంటూ ఏమీ లేదు, డబ్బుకు కొదువా లేదు. అయినా మనిషి అనేవాడికి సంతోషపడ్డానికి ఒక కారణం కావాలి కానీ దిగాలు పడ్డానికి కారణం అవసరం లేదు, కారణం లేకపోయినా దుఖ కారణం కోరి తెచ్చుకునేంత సమర్దత ఒక మనిషిలో మాత్రమే ఉంటుంది. సరే, గార్ద్స్ బై పక్క బెంచి మీదికి ఒక ముసలాయన వచ్చి చేరాడు. ఆయనని చూస్తే మరీ ఘోరంగా ఉన్నాడు. మనిషి కుందించుకు పోయినట్లు, ఆత్మగౌరవం అడుగంటి పోయినట్లు ఉన్నాడు. దిగాలు దరిద్రం దురదృష్టం అనే ముగ్గురమ్మలు వచ్చి మూర్తీభవించిన మూర్తిలా ఉన్నాడు. పాపమని ఒక గులాబి పువ్వును తెచ్చి అతని కోటుకు అలంకరించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఆ పువ్వు బలవంతాన అతని గుండి బొత్తానికి ఉరివేసుకుని చచ్చి పోతానని బెదిరిస్తుంది. అంత దుర్భాగ్యంగా ఉన్నాడు అతను. అతను ఈ ప్రపంచంలోని పరమ ఏడుపుగొట్టు వాళ్లలో ఒకడు. కానీ ఈ ప్రపంచంలో ఒకడయినా అతడి గురించి ఏడుస్తారని మనం ఆశించలేనంత దిక్కుమాలిగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వెడితే, ఇంట్లో వాళ్లతో నిద్రపోయే సమయం వరకు ఎక్కువ చీవాట్లు తినాల్సి వస్తుంది కాబటి తక్కువ చీవాట్లు తినడం కోసం వీలయినంత ఆలస్యంగా ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకున్నట్టుగా ఉన్నాడితను అనుకుంటాడు గార్డ్స్ బై. మొత్తానికి ఒక సమయం తరువాత ఆ ముసిలాయన లేచి చీకట్లో కలిసిపోయాడు. అతని వెళ్ళిన కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ ముసిలాయన ఖాలీ చేసిన బెంచిలో కూచున్నాడు. ఇతని దుస్తులు బావున్నాయి, పైగా మంచి వయసు తాలూకు ఆరొగ్యం. అయితే ముఖంలో మాత్రం అంతకు ముందు మనిషికన్నా ఆనందం ఎక్కువగా ఏ మాత్రం లేదు. గార్డ్స్ బై ఇక ఉండబట్టలేక ఇతనితో మాట కలుపుతాడు. ఏమిటి విషయం, ఎందుకంత నిరాశ అని. ఇతగాడి కథ భలే విచిత్రంగా ఉంది. ఈ రోజే కొత్తగా ఈ ఊరికి పనిమీద వచ్చాడు. టాక్సీ డ్రైవర్ తనని ఇది మంచి హోటల్ అని ఒక హోటలులో దింపి వెళ్లాడు. బస బానే ఉంది. ఆ తరువాత స్నానానికి హోటల్ వారి సబ్బు వాడ్డం ఇష్టం లేక కొత్త సబ్బు కొనుక్కుందామని బయటికి వచ్చాడు. వస్తూ వస్తూ నాలుగు డబ్బులు మాత్రమే జేబులో వేసుకుని మిగతా అంతా తన పెట్టెలో భద్రపెట్టి దిగాడు. సబ్బు ఒకటి కొనుక్కుని ఆ వీధి ఈ వీధి సరదాగా చూసుకుంటూ ఒక బార్ లో దూరి చిన్న డ్రింక్ కూడా తాగాడు, అప్పటికే చీకటి పడింది. బార్ నుండి బయటికి వచ్చాకా అసలు సంగతి అర్థమయ్యింది. అసలే ఊరికి కొత్త . బసకు దిగిన హొటల్ అడ్రస్ గుర్తు పెట్టుకోలేదు, వీధి పేరు అవసరం అనుకొలేదు. సబ్బుకోసం దిగిన వాడు సబ్బు కొని వెనుదిరిగి పోక వీధులు కొలిచే పనిలో పడి, ఉన్న డబ్బుతో తాగి ఇప్పుడు ఈ చీకట్లో దిక్కు తోచక వచ్చి కూచున్నాడు. "ఇది నా కథ, కాబట్టి నా కథని నమ్మి నా పరిస్థితిని దిగమింగగలిగిన మీ వంటి ఏ మంచి మనిషయినా ఎదురయ్యి నాలుగు రాళ్ళు అరువిస్తే ఈ రాత్రి ఈ దగ్గరలోని ఏ హోటల్లోనో తల దాచుకుని, రేపు ఉదయమే నా బస వెదుక్కోగలను" అన్నాడు. "అదేలే! దాందేముందిలే! ఇటువంటి కథలకేం గొడ్డు పోయిందిలే? నువ్వు ఏ సబ్బు ముక్క కొసం ఇన్ని తంటాలు పడ్డావో ఆ సబ్బు ముక్క నాకు చూపిస్తే, నీ చిక్కు తీరిపోదూ" అన్నాడు గార్డ్స్ బై. యువకుడు గబ గబా జేబులు తడుముకున్నాడు, తనమీద తనే కొపడ్డాడు, చిరాకు పడ్డాడు, ఈ గందరగోళంలో సబ్బు ముక్క ఎక్కడో పడిపోయినట్లుంది అని తన దురదృష్టానికి తనే చింతించాడు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) "చూసావా? నువ్వు కథ బాగా చెప్పగలిగావు. నీ మాటల్లో సత్యం, కళ్లల్లో దీనత్వం కొట్టొచ్చినట్లు చూపించగలిగావు. అయితే నువ్వు మరిచి పొయిందల్లా కనబడినవాడికల్లా నీ దీన కథ వినిపించాలనుకోవడానికి ముందుగా ఒక సబ్బు ముక్కను సాక్ష్యంగా తోడు తెచ్చుకోడమే" అన్నాడు గార్డ్స్ బై వెటకారంగా. ఆ యువకుడు ఇదంతా వినదలుచుకోలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాస్యాస్పదంగా నవ్వుకుంటూ గార్డ్స్ బై కూడా అక్కడి నుండి ఇక వెళ్ళిపోదామని లేచాడు. అయితే ఉన్నట్టుండి నేల మీద పడి ఉన్న ఒక పొట్లం ఆకర్షించింది. ఏమిటా అని దానిని అందుకుని చూస్తే, పొట్లం కట్టి ఉన్న సబ్బు బిళ్ళ, అరెరే! ఎంత పని జరిగి పోయింది, అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిన దారి వైపు కదిలాడు గార్డ్స్ బై. అదిగో అతను అక్కడున్నాడు. అబ్బాయి నీ నిజాయితికి ఇదిగో సాక్షం దొరికింది. నీ అవసరంపై నా అపనమ్మకాన్ని నువ్వు మన్నిస్తావనే అనుకుంటాను. ఈ డబ్బు పట్టు నా అడ్రస్ కాగితం కూడా. నువ్వు డబ్బు నాకు ఎప్పుడు పంపించినా తొందరలేదు. అదృష్టం నీకు తోడుగా ఉండుగాక. యువకుడు ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. ఈ కథ వ్రాసిన వారు హెచ్ హెచ్ మన్రో అనే బ్రిటీష్ రచయిత. కలం పేరు సాకీ. నేను స్కూలు పిల్లవాడిగా ఉన్నప్పుడు సరిగా గుర్తు లేదు కానీ శారదా విద్యామందిరం లోనే నేతాజీ పబ్లిక్ స్కూల్ వారో దీనిని పిల్లలతో ఇంగ్లీష్ లోనే నాటకం వేపించారు. ఒక బ్రిటిష్ కథ మా చిన్న ఊరిలో ఒక చిన్న బడిదాకా ఎట్లా చేరిందా అని నా ఆశ్చర్యం. ఆ మధ్య కె.బి. గోపాలం గారు దీనిని తెలుగులోకి అనువదించారు. కథ ఎలా మొదలవాలి? ఎక్కడ ఆపెయ్యాలి ఈ రెంటి మధ్య ఏం జరగాలి అది ఎంత ఉండాలి అని కదా కథ. ఇక వినండి. "పాపం కుర్రవాడు అన్యాయమైన పరిస్తితులకు దొరికిపోయాడు, అదృష్టవశాత్తు అతని సబ్బు దొరికింది లేకపోతే నేను అతి తెలివితో ఆలోచించినట్లే అతని గోడు విన్న ప్రతి ఒక్కరు నాలా సాక్ష్యం అడిగితే అతనికి మానవ జాతిమీద ఏం నమ్మకం మిగిలేట్లు. "గార్డ్స్ బై కి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెను తిరిగి తను కూచున్న బెంచి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారు, మోకాళ్ళ మీద వంగి ఏమో చేస్తున్నాడు. (క్లిక్: అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..) 'ఎవరది?" అతను తల తిప్పి చూశాడు, ఇందాకటి దురదృష్ట మొహం పెద్దాయన. ఏమిటండి సంగతి?" "నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా" - అన్వర్ -
నా పేరు జోన్ జండాయ్; అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..
నేను నా జీవితంలో పొందే అతి కొన్ని చిరాకులతో పాటు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉన్నాను. నిన్నటి నా జీవితం నాకు జోన్ జండాయ్ ని బహుమతిని చేసింది. తెలుసుకున్న కొద్ది జీవితాన్నిమరింత సంతోషంలో ముంచెత్తే సాధారణ జీవన దూత ఈయన. జోన్ జండాయ్ ఒక రైతు, థాయ్‌లాండ్‌లో కెల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి గా ప్రపంచం ఈయనను తెలుసుకుంది. జోన్ జండాయ్ థాయ్‌లాండ్‌లోని యాసోథార్న్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన వ్యవసాయం చేస్తారు. ఇంకా మట్టి గృహాలను నిర్మిస్తారు. 2003 లో పన్ పన్ అనే విత్తన సంరక్షణ సంస్థను స్థాపించారు. జోన్ జోండాయ్ చేసిన ఒక ప్రసంగ పాఠాన్ని విని ఎంత సంతోష పడ్డానో మాటల్లో చెప్పలేక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ వ్యాస రూపం. - అన్వర్ జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే " Life Is Simple". అవును జీవితం అత్యంత సులభమైనది, సరదా అయినది. "జీవితం సులభం" అనే సులభతరమైన విషయం తెలుసుకోవడం మాత్రం నాకు అంత సులభంగా జరగలేదు. నేను ఇంతకు మునుపు బ్యాంకాక్‌లో ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు నా జీవితం చాలా కష్టంగా, చాలా చాలా సంక్లిష్టంగా ఉండేది. "జీవితం సులభం" అనే విషయం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించడానికి సమయం కూడా నాకు అప్పుడు లేదు. నా పేరు జోన్ జండాయ్. నేను ఈశాన్య థాయ్‌లాండ్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాను. నా చిన్నప్పుడు మా ఊరు, ఆ వాతావరణం, గాలి, మాట, వెలుతురు, పలకరింపు.. ప్రతీది సరదాగా, సులభంగా ఉండేది. అప్పుడు జీవితం సహజంగా ఉండేది కాబట్టి జీవితం అనేది సులభం అనే ఎరుక నాకు అప్పుడు లేదు. అత్యంత సహజమైన మానవ జీవితపు లక్షణాలు ఎప్పుడు ప్రత్యేక ఎరుక అయి ఉండవు కదా. ఒక రోజు మా ఊరికి టెలివిజన్ వచ్చింది. ఆ టీవి తో పాటు దానికి తీసుకు వచ్చిన పట్నవాసపు మనుషులూ వచ్చారు. ఆ యంత్రం, దానిని నడిపేవారు ఇద్దరూ కలిసి మాకు మునుపు తెలియని, ఆలోచించని, అసలు ఆ జ్ఞానమే లేని ఒక కొత్త మాట మాకు నేర్పారు "ఒరే! నాయనా మీరు మీరు కడు పేదవారు, కటిక దరిద్రులు. మీ జీవితాంతం వరకు మీరు ఇలా దరిద్రపు గొట్టుగా ఉండనక్కర లేదు. మీరు మేల్కోవాలి. మీ జీవితంలో విజయాన్ని వెంబడించాలి, విజయం యొక్క అయిదు మెట్లు ఎక్కాలి. ఆ అయిదు మెట్లు ఎక్కడానికి మీరు బ్యాంకాక్ వెళ్లాలి" అని చెప్పారు. (నేను మా నూనెపల్లె నుండి హైద్రాబాద్ వరకు దేకినట్లు అన్నమాట) కాబట్టి నేను బ్యాంకాగ్ వచ్చాను, నేను కడు దరిద్రుడిని అని తెలుసుకోడం నాకు ఎంతో చెడుగా అనిపించింది. నేను కటిక పేదరికం వాడిని అని తెలుసుకోడం నా మనసుకు భరించరాని కష్టం వేసింది. కాబట్టి ఎట్టి పరిస్తితుల్లో నేను బ్యాంకాక్‌కు వెళ్లాలి విజయం సాధించాలి. నేను బ్యాంకాక్‌కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం.. అక్కడికి చేరుకోవడం అప్పుడు నాకు చాలా గొప్పగా, గర్వంగా ఉండిది. మనం చాలా నేర్చుకోవాలి, గొప్ప చదువు చదువుకోవాలి మరియు చాలా కష్టపడాలి. అలా చేస్తూ ఉంటే ఆ పై మీరు విజయం సాధించవచ్చు అనే మాటలు పదే పదే నా చెవుల్లో ధరించిన నిత్య మంత్రాలు అయ్యాయి. అందుకని నేను చాలా కష్టపడటం ప్రారంభించాను. రోజుకు ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేవాన్ని. అంత కష్టపడి పని చేసి చివరికి నేను భోజనానికి సంపాదించుకున్నది కేవలం ఒక కప్పు నూడుల్స్ మాత్రమే. లేదా గిన్నెడు ఫ్రైడ్ రైస్. ఇంకా బ్యాంకాగ్ లో నేను నివసించిన గది ఎలా ఉండేది అనుకున్నారు! అది చాల చెడ్డగా ఉండేది. మహా మురిగ్గా ఉండేది. భరించలేనంత వేడిగా ఉండేది . ఆ వేడితో పాటు నాతో పాటు ఆ గది పంచుకుని ఉన్న చాలా మంది ఊపిరి వేడి . ఇటువంటి పరిస్తితుల మధ్య నేను ఇంకా చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాను. నాకు అప్పుడు ఓ అనుమానం కలిగింది. కష్టపడి పని చేయడం అనే సూత్రం వెనుక ఏదో తేడా ఉందని నాకు అనిపిచింది. నేను ఇంత కష్టపడి పనిచేస్తూ పోతున్న కొద్దీ నా జీవితం సులువు కావాలి కదా! కానీ ఇంకా ఎందుకు కష్టతరమవుతుంది? గిన్నెడు అన్నం, కాళ్ళు చాపుకోడానికి తగినంత స్థలం లేని గది ప్రాప్తం అవుతుంది ఎందుకని? కాబట్టి ఎక్కడో ఏదో తప్పుగా ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడి పని చేసి చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను కానీ నేను వాటిని నా వినియోగం కోసం పొందలేను. నేను సంపాదించే డబ్బుతో అవేమి కొనగలిగే శక్తి నాకు సమకూరడం లేదు. ఒక్క వళ్ళు వంచి పని చెయ్యడమే కాదు, నేను బుర్రా ఉపయోగించి చదువు, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. విద్యని అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి బయలుదేరాను. కానీ యూనివర్సిటీలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చదువుకోవడం అనే పనిని విద్యాలయాలు చాలా బోరింగ్ చేసి పెట్టాయి. నేను ఇక్కడ ఈ చదువుల భవనాల్లోని ప్రతి అధ్యాపకుడిలోను, వారు విశ్వవిద్యాలయంలో బోధించే విషయాలను చూసినప్పుడు, వారిలో చాలామందికి ఉన్నదంతా విధ్వంసక జ్ఞానం. నాకు యూనివర్సిటీలో ఉత్పాదక జ్ఞానం అసలు దొరకలేదు. ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజినీర్ కావడం అంటే అర్థం ఏమిటంటే.. మీరు ఈ భూమిని, ఈ సహజ సంపదని మరింత, వీలయినంత మరింత ఎక్కువ నాశనం చేసేవారిగా తయారు కావడం. ఈ విధ్వంసక వాస్తువేత్త వ్యక్తులు ఎంత ఎక్కువ తయారు అయితే వారు అంత ఎక్కువ పనిచేసి ఈ భూమి మీది, పర్వతాలు, నదులు, అడవులు మరింత నాశనం చేయడమే అన్నమాటే. ఈ పచ్చదనాన్ని, ఈ సహజ వర్ణాలని తమ బూడిదరంగు మెదడుల న్నుండి బయటికి తీసిన జ్ఞానంతో కొలతలు వేసి ఈ ప్రపంచమంతా కాంక్రీట్ నింపడం. కనుచూపు మేర అంతా బూడిద రంగు, బూడిద రంగు బిల్డింగులు, బూడిద రంగు రోడ్లు, బూడిదరంగు ఆకాశం, బూడిద రంగు జ్ఞానం.. భూమికి బూడిద రంగు కట్టడపు పన్ను, చెరువులోని నీటికి ఇంటి ట్యాంకర్ లలో బంధించిన పన్ను. వ్యవసాయానికి పురుగు మందుల విషపు పన్ను. జీవితం చాలా కష్టంగా ఉంది నేను నిరాశకు గురయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్‌లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు గంటలు, సంవత్సరానికి కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే మా థాయ్‌లాండ్‌లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది? అక్కడ రాత్రి పూటే కాదు మధ్యాహ్నపు భోజనం ముగించి ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతారు. (మా నూనెపల్లెలో వర్షాలు పడే రాత్రిళ్ళు తప్పనిస్తే, మేము ఎప్పుడూ ఇంటి గోడల మధ్యనో, తడికల మధ్యనో నిద్ర పోయిందే లేదు. నిద్ర అంటే అంతా మా ఊరి రోడ్ల మీదే, రాత్రుల్లు మా ఊరి దారులన్ని మంచాలు మొలిచిన పొలాల్లా ఉండేవి. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అయితే అర్ధరాత్రి ఊరి సెంటర్ లో టీ తాగడానికి అని పోతూ పోతూ తన ఇంటి రోడ్డు ముందు నిద్రపోతున్న మనిషిని మంచంతో సహా లేపుకు వెళ్ళి మరో ఇంటిముందు దింపేవాళ్ళం, కొంటెగా. ఆ ఇంటి ముసలమ్మ మా ఇంటి ముసలమ్మతో రాత్రంతా కబుర్లు చెప్పుకోడానికి మనవడితో మంచం మోపించుకు వచ్చి ఈ మంచం పక్కన ఆ మంచం కుదిర్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవారు. పిల్లలూ అంతే చంకలో దుప్పటి దిండు పెట్టుకుని పక్కింటి నేస్తుడితో మహా మహా ముచ్చట్లు ఆడటం లేదా రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం వింటూ అక్కడే బజ్జోడం. అర్థరాత్రి దాటాకా మనుషులు, మంచాలే కాదు మా ఊరి రహదారులూ, జట్కా బళ్ళు, సైకిల్ రిక్షాలు అన్నీ నిద్ర పోయేవి. కేవలం కీచు రాళ్ళ చప్పుడు, లేదా అప్పుడప్పుడు కప్పల బెకబెకలు. ఇప్పుడు రోడ్డులకు అసలు నిద్ర లేదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బండి గాన్లు దాన్లను తొక్కుతూనే పోతుంటాయి. హారన్లు రోడ్డులను దోమల్లా కుడుతూనే ఉంటాయి) మధ్యాహ్న భోజనానంతర నిద్ర మేల్కొన్న తర్వాత హాయిగా మేం వీధి అరుగులపై కూచుని కేవలం కబుర్లు చెప్పుకుంటాం. ముచ్చట్లు ఆడుకుంటాం. దారిన పోయే అందరి యోగక్షేమాలు విచారిస్తాం "ఏం బ్బా! మీ అల్లుడు ఎలా ఉన్నాడు, మీ భార్య, కోడలు ఎలా ఉన్నారు, మీ కోడి, మేకా ఎలా ఉన్నాయి" ఊళ్ళో జనాలకు ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు. చాలా మంది ప్రజలు తమకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి.. తమ జీవితాలను హాయిగా సంపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటారు, తీరిక, తీరుబడి ఉన్న ప్రజలు తమ జీవితంలో చాలా అందాలను చూస్తారు కాబట్టి వారు ఆ అందాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేసేవారు. కొంతమంది హాయిగా ఇంటి బయట కూచుని తమ కత్తి పిడిని నునుపు చేసుకునే వారు, వాటిపై బొమ్మలు చెక్కేవారు, బుట్టా, గంప చక్కగా అల్లుకునేవారు, తడికలకు, చాటలకు కాగితపు గుజ్జు పసుపు అలికేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ప్రజలు ప్రతి చోటా ప్లాస్టిక్‌ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ పీలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితంలో ఏదో తప్పు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నేను ఈ విధంగా జీవించలేను కాబట్టి నేను యూనివర్సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకని తిరిగి నా చిన్న ఊరికి తిరిగి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చిన్నతనంలో ఉన్నట్లుగా, నాకు గుర్తుండేలా జీవించడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ సంవత్సరానికి రెండు నెలలు పని చేయడం ప్రారంభించాను. వ్యవసాయంలో నాకు నాలుగు టన్నుల బియ్యం వచ్చింది. మేము మొత్తం మా కుటుంబంలో ఉన్నది ఆరుమందిమి. మేమంతా కలిపి సంవత్సరానికి అర టన్ను కంటే తక్కువ తింటాము. కాబట్టి మిగిలిన బియ్యాన్ని అమ్మవచ్చు. ఇంకా నేను రెండు చిన్న చేపల చెరువులు తీసుకున్నాను. మాకు ఏడాది పొడవునా తినడానికి హాయిగా చేపలు ఇక్కడ దొరుకుతాయి. అంతే కాక నేను నాకున్న అర ఎకరం కంటే తక్కువ చిన్న స్థలంలో ఒక చిన్న తోటను కూడా వేసాను. తోట పని కోసం రోజుకు 15 నిమిషాలు గడుపవలసి వస్తుంది. నేను ఈ తోటలో 30 కంటే ఎక్కువ రకాల కూరగాయలను పండిస్తున్నాను. అన్ని కూరగాయలను మేం ఆరుగురం ఎట్లాగో తినలేం కాబట్టి మాకు కావలసినవి కొన్ని ఉంచుకుని మిగతా వాటిని మార్కెట్లో అమ్మడం వల్ల కొంత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జీవితం ఇక్కడ చాలా సులభం. నేను ఏడేళ్లపాటు బ్యాంకాక్‌లో ఉండాల్సి వచ్చింది. గంటల తరబడి కష్టపడి పని చేశాను, అంత కష్టపడి పని చేసినా సంపాదించుకున్నది తినడానికి సరిపోలేదు.. కానీ ఇక్కడ, సంవత్సరానికి రెండు నెలలు మరియు రోజుకు 15 నిమిషాలు మాత్రమే పనిచేసి నేను ఇంట్లో ఆరుగురికి ఆహారం ఇవ్వగలను. జీవితం అంటే సులువుగా ఉండటం. ఇంకో ముఖ్యమైన విషయం. చిన్నతనంలో స్కూల్లో ఎప్పుడూ మంచి గ్రేడ్ సాధించని నాలాంటి తెలివితక్కువవారికి జీవితంలో ఇల్లు అనేది రాసిపెట్టి ఉండదని నేను అనుకున్నాను. నేనే కాదు ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకంటే తెలివైనవారు, ప్రతి సంవత్సరం క్లాసులో నంబర్ వన్ అయిన వారు మంచి ఉద్యోగం పొందుతారు. మంచి ఉద్యోగం వల్ల మంచి వేతనం లభిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఒక స్వంత ఇల్లు పొందడానికి అత్యంత అర్హులు. కానీ నాకు, నావంటి యూనివర్సిటి చదువు పూర్తి చేయలేని వారు కూడా ఒక ఇంటిని కలిగి ఉంటారా? నాలాంటి, తక్కువ విద్య ఉన్న వ్యక్తులకు ఇల్లు అనేది ఒక ఆశాజనకపు ఎప్పటికీ పూర్తి కాని కల. కానీ, ఇక్కడ నా పేద గ్రామంలో నాకడుపుకు, కుటుంబ అవసరాలకు ఆహార ఉత్పత్తి సాధించిన నేను ఇప్పుడు భూసంబంధమైన భవనాలు చేయడం ప్రారంభించాను, ఇళ్ళు కట్టడం అంటారా అది చాలా సులభం అయింది నాకు ఇక్కడ. నేను రోజూ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, రెండు గంటల సమయం ఇల్లు కట్టడానికి వెచ్చించాను. మూడు నెలల సమయంలో నాకు స్వంత ఇల్లు వచ్చింది. మట్టి, రాయి, గడ్డి, వెదురు కలిస్తే ఇల్లు. నేను చదువుకునేప్పుడు నా క్లాస్‌లో అత్యంత తెలివైన స్నేహితుడు ఒకరు, అతను తన ఇంటిని నిర్మించడానికి నాకు లాగానే మూడు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఇంటికి గృహ సంబంధమైన వస్తు సంచయంతో పాటు అప్పులూ చేయాల్సి వచ్చింది. అతను 30 సంవత్సరాల పాటు తన అప్పు చెల్లించాలి. కాబట్టి, అతనితో పోలిస్తే, నాకు 29 సంవత్సరాల 10 నెలల ఖాళీ సమయం అనేది మిగిలింది. జీవితం అనేది సులభమైనది. ఈ సులభమైన జీవితాన్ని దానిపై అప్పులు, వడ్డీల ఋణం వేసి బరువుగా ఎందుకు బ్రతుకుతున్నాము మనం. నా మొదటి ఇల్లు కట్టేంత ముందు వరకు కూడా అంత తేలికగా, సులువుగా ఒక ఇల్లు నిర్మించవచ్చని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం నేను ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఇల్లు మాత్రం నాకు చాలా ఉన్నాయి. సమస్య అల్లా ఈ రాత్రి నేను ఏ ఇంట్లో నిద్ర పోవాలి అనేదే. కాబట్టి, ఇల్లు అనేది ఒక సమస్య కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లలు, 13 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఒక పాఠశాల కట్టుకున్నారు. అదీను వారు స్వంతంగా చేసుకున్న ఇటుకలను ఉపయోగించి తరువాత నెలలో ఆ పాఠశాలకు ఒక లైబ్రరీ కూడా. కాబట్టి ఇల్లు కట్టుకోడం పెద్ద విషయం కాదు మమ్మల్ని చూసి ఒక ముసలి సన్యాసిని కూడా ఆమె కోసం ఒక గుడిసెను నిర్మించుకున్నది కాబట్టి జీవితం లాగే, ఇల్లూ కూడా సులభం, మీరు నన్ను నమ్మకపోతే పోనీ, మీరూ ఒకమారు ప్రయత్నించండి. జీవితం అంటే, నివాసం అంటే, హాయిగా బ్రతకడం చాలా సులువు. ఇంటి తరువాత తదుపరి విషయం దుస్తులు. నేను అందగాడిని కాదు కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదయిన దుస్తులు ధరించడం ఒక మార్గం అనిపించింది. బాగా కనిపించడం కోసం. నేను నాకు నచ్చిన ఒక సినీ నటుడిలా దుస్తులు ధరించడానికి ప్రయత్నించాను. అందుకని ఒక జత జీన్స్ కొనడానికికని డబ్బు ఆదా చేయడానికి ఒక నెల బాగా కష్టపడ్డాను. చివరికి ఆ దుస్తులు కొని వాటిని ధరించి అద్దంలో చూసుకుంటూ నేను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగాను. కుడి నుండి ఎడమవైపుకు మళ్ళాను. అద్దంలో నా చుట్టూ నేను తిరిగాను. నేను చూసిన ప్రతిసారీ నేను ఒకే వ్యక్తిని, ఆ పాత నేనుని మాత్రమే చూసాను. ఒక నెలపాటు చెమట రక్తం ధారవోసి కొన్న అత్యంత ఖరీదైన ప్యాంటు, చొక్కా కూడా నా మొహాన్ని, జీవితాన్ని మార్చలేదు. అద్దంలో కనబడిన నాకు నేను చాలా వెర్రివాడిని అనిపించింది. ఖరీదయిన దుస్తుల కొసం, అత్యంత ఆధునిక పొకడల వస్త్రాల వెంట పరిగెట్టి డబ్బు ఎంతగానయినా కూడపెట్టండి. అది మనల్ని ఏమాత్రం మార్చలేదు. నేను దాని గురించి మరింత తెలుసుకోవడం, ఆలోచించడం మొదలుపెట్టాను. మనం ఎందుకని ఫ్యాషన్‌ని అనుసరించాలి? ఆలోచించిన కొద్ది నాకు జవాబు దొరకలేదు. వంటిని కాపాడటమే దుస్తుల కేవల ఉద్దేశం. ఆ తర్వాత, 20 సంవత్సరాల వరకు, నేను ఏ బట్టలు కొనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ ప్రజల నుండి వచ్చినవే ప్రజలు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు, మరియు వారు ఇక్కడి నుండి వెళ్ళేప్పుడు వారు ఇక్కడ చాలా దుస్తులను వదిలివేస్తారు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు టన్నుల కొద్దీ బట్టలు ఉన్నాయి. ఏం చేస్తాం? వద్దనుకున్నవి ఎంత ఉండినా ఏం ప్రయోజనం. ఇలా ఆలోచించినప్పుడు నాకు మరింత స్వేచ్ఛగా అనిపిస్తుంది. అవసరానికి మించి ఏదీ వద్దు అనుకోవడంలో ఉన్నస్వేచ్చ మరి ఎందులో లేదు. ఇక చివరి విషయం ఏమిటంటే, అనారోగ్యం. నేను జబ్బుపడినప్పుడు సంగతి. అప్పుడు ఏమి చేయాలి? నేను నా పాత జీవితాన్ని కొత్త గా మొదలు పెట్టేముందు అంత సులువుగా మొదలు కాలేదు, దాని గురించి చాలా ఆందోళన చెందాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, మందు మాకులు, వైద్యం, ఆస్పత్రి.. వీటి ఖర్చులు! నేను దీని గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను, మానవుడికి అనారోగ్యం సాధారణమైనది, అనారోగ్యం అంత చెడ్డ విషయం ఏమీ కాదు. అనారోగ్యం అయింది అంటే దాని అర్థం- మన జీవితాల్లో, మనం గడుపుతున్న జీవిత విధానంలో మనం ఏదో తప్పు చేశామని మన శరీరం మనకు గుర్తుచేసే విషయం. అందుకే మనం అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, నాకు జబ్బు వచ్చినప్పుడు, నేను కాస్త ఆగిపోయి నా దగ్గరకు నేను రావాలి. దాని గురించి కాస్త ఆలోచించాలి. ఇదిగో ఇది నేను చేసిన తప్పు. కాబట్టి ఈ తరహా పని మరలీ చేయరాదు. డబ్బు లేకపోతే ఏవుంది, నన్ను నేను నయం చేసుకోవడానికి నీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. భూమి, దాని మన్ను నన్ను స్వస్థపరచడానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నాకు ఇది ఆరోగ్య స్వేచ్ఛ లాంటిది అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఉన్న జీవిత విధానంలో స్వేచ్ఛగా ఉన్నాను. నేను దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. నాకు భయం తక్కువ, నా జీవితంలో నేను కోరుకున్నది నేను చేయగలను. మునుపు గడిపిన బ్యాంకాగ్ జీవితం నాకు చాలా భయం కల్పించింది, దాని నీడన నేను ఏమీ చేయలేకపోయాను. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛగా భావిస్తున్నాను, నన్ను నేను ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా అనుకుంటున్నా, నాలాగా ఎవరూ లేరు, నన్ను నేను ఎవరిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. విజయానికి అడుగెట్టాల్సిన ఏ మెట్టు వెదకవలసిన అవసరం లేదు. నన్ను పోగొట్టుకుని ఎవరినో ధరించడానికని పూనుకుని అన్వేషణకు బయలుదేరాల్సిన అవసరమూ లేదు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం ఆ తర్వాత ఇక ఏం చేయాలి? నేను బ్యాంకాక్‌లో ఉన్నప్పటి జీవితపు మనస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, నా జీవితంలో అప్పుడు చాలా చీకటిగా అనిపించింది. ఆ సమయంలో చాలా మంది నాలాగే ఆలోచిస్తారని, అలోచిసూ ఉంటారని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి, నావంటి భావసారూప్యత కల వారిమి కలిసి చింగ్ మాయిలో "పన్ పన్ 'అనే కార్యశాలని ప్రారంభించాము (చియాంగ్ మాయి పర్వత ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక నగరం.) మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే ఆహారం, ఆహారం అంటే జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై దృష్టి పెట్టాం. ఇది "పన్ పన్లో "ప్రధానమైనది. విత్తనం తరువాత రెండవ విషయం ఏమిటంటే ఒక కూడిక కేంద్రాన్ని నెలకోల్పడడం. ఇది ఒక అభ్యాస కేంద్రం. ఇదెందుకు అంటే, మనం జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి, జీవితాన్ని సులభతరం చేసుకోడం తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకంటే మనం ఈ జీవితాన్ని వీలయినంత సంక్లిష్టంగా మరియు గొప్ప కంగాళిగా ఎలా గడపాలో నేర్పించాము. దానిని ఇప్పుడు ఆ సంక్లిష్టత బారినుండి విముక్తం చేయాలి. జీవితాన్ని ఎలా సులభతరం చేయవచ్చు? చేయడం సులభం, కానీ ఎలా సులభతరం చేయాలో చెప్పడం మాకు తెలియదు. ఎందుకంటే మనం దానిని విముక్తం చేయడానికి సూత్రాలు సులువుగా దొరకనంత చిక్కుగా చేసాము. గొలుసుల మీద గొలుసులు, ముడుల మీద ముడులు, వస్తువుల మీద వుస్తువులు... చెత్త చేసాము మనం జీవితాన్ని. అందుకని ఇప్పుడు ముడులు విప్పడం నేర్చుకోవడం మొదలుపెడదాము. అందరం కలిసి ఉండడం నేర్చుకుందాము. అన్నిటి నుండి డిస్కనెక్ట్ కావడం నేర్చుకుందాము. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఆలోచనా స్వేచ్చ మనకు తిరిగి రావాలి అందుకని మళ్లీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి, మన మనస్సు మరియు శరీరాన్ని మళ్ళీ కలపాలి. జీవితం అనేది సులభం. దానిని చూసి భయపడకండి. వెనక్కి రండి. మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు? కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు? ఈ నడుస్తున్న జీవన వ్యాకరణం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి. అవును మీరు సరిగా చదివారు. జంతువులతో సమానంగా పక్షులు ఒకటి లేదా రెండు రోజుల్లో గూడు కట్టుకుంటాయి. ఎలుక ఒక్క రాత్రిలో తన నివాస రంధ్రం చేస్తుంది. కానీ సృష్టిలో మనలాంటి తెలివైన మనుషులు ఒక ఇంటి కోసం 30 సంవత్సరాలు గడుపుతారు. అప్పులు చేసి మరీ జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటారు. ఇంత కష్టమైన జీవితంలో కూడా ఈ భూమి మీద వసించే చాలామంది వ్యక్తులకు తమ జీవితంలో ఒక ఇంటిని కలిగి ఉంటారని నమ్మలేము. కాబట్టి ఇదంతా తప్పు జరుగుతుంది. మనం మన ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? మనం మన సామర్థ్యాన్ని ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నాము? ఈ ఆలోచనలో నన్ను నేను వెదుక్కుంటూ వెనక్కి వచ్చాను. నేను ఒక సాధారణుడ్ని అయ్యాను అనుకుంటున్నాను. మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు. నిజానికి ఇప్పుడు ఈ రోజు నేను సాధారణంగా ఉండటానికి, మామూలుగా బ్రతకడానికి, సహజంగా ఉండేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రజలు నన్ను ఒక అసాధారణ వ్యక్తి అనుకుంటున్నారు లేదా పిచ్చివాడు, కానీ అదేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది నా సమస్య కాదు వారి సమస్య. జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) -
మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!
మొదటి సారి చదివి గొప్పగా ఉందిగా! అని అనుకున్న పుస్తకాన్ని, తొలిసారి చూసినపుడు అతి గొప్పది అనుకున్న సినిమాని , కలిసిన తొలిసారి ఒక అద్భుత వ్యక్తిని తెలుసుకున్నామనుకుని భ్రమించి. మళ్ళీ కలిసిన మరోసారి వీడేనా అవ్వాడు అనుకోవడం, ఇదేనా ఆ పుస్తకం! ఆ చిత్రరాజం ! అని నిరుత్సాహ పడిపోవడం అత్యంత సహజం. అంతే అది . ఆప్పుడెపుడో చదివిన గొప్ప పుస్తకం, ఎప్పుడో చూసిన ఒక సినిమా, రోజూ కలిసే అదే మనిషి- ఎప్పుడు , ఎన్నిసార్లు చూసినా, చదివినా, కలిసినా గొప్పగా అనిపించేలా చేసేవి చాలా తక్కువ మాత్రమే అంతే గొప్పగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తమలోని గొప్పని ఇంకా గొప్పగా ప్రతిసారి మనముందు ఆవిష్కృతమవుతాయి. కాదు అవి అలాగే ఉంటవి, మనం ఆ గొప్పని ప్రతిసారీ గొప్పగా చూస్తాము అని అనుకుంటాను. ఇప్పుడు చెప్పబొయే ఈ ‘డెపార్చర్స్’ అనే సినిమాని నేను పదికి పైగా సంవత్సరాల మునుపు చూసా. అప్పుడు కదిలి పోయా, ఎంతలా కదిలి పోయానో ఇప్పుడు గుర్తు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే నిలువెల్లా దుఃఖంలో నిండి స్వచ్చమైన దుఃఖపు నీరులా మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా ఇది. ఇంకో పదేళ్ల తరువాతయినా మళ్ళీ ఈ సినిమా చూసినపుడు అప్పుడు నాలో చెమ్మ మొత్తం ఇంకిపోయినా ఈ సినిమా ఆ నీటిని తిరిగి ఊరేలా చేస్తుందనే నమ్మకమే ఉంది. ఎలా చెప్పను ఈ సినిమా కథను మీకు? ప్రాణాలు కోల్పోయిన మనుషులని సైతం ప్రాణమున్న సీతాకోకచిలుక రెక్కలు తాకబోయినంత మృదువుగా తాకి అంతిమ వీడ్కోలు చెప్పే మనుషుల కథ ఇది. మన జీవితాలలో మనం ఎప్పటికీ ఎరుగని కొంతమంది అజ్ఞాత వ్యక్తుల కథ ఇది. ఎండుగట్టి కర్రలాగానూ, చల్లని మంచు రాయిలాగూను మారిన మన తండ్రినో, తల్లినో మిత్రుడినో, ఆత్మ బంధువు మృతదేహాన్ని మనం నిలువెల్లా శుభ్రం చేయగలమా? పంటి చిగుళ్ళు రుద్దడానికి ఈ వ్రేళ్ళకొసలు ఆ దంతాల అన్ని చివరలకు చేరగలవా? మాలద్వారం వద్ద అట్టగట్టిన ఆ కశ్మలాన్ని ఈ చేతుల వేళ్ళు తొలగించగలవా? ఆ దేహం మూలమూలలా మిగిలి ఉన్న మురికిని పారద్రోలేంత మెత్తగా ప్రేమగా ఒక అంతిమ స్నానం చేయించగలమా మనం? ఇంత ఎందుకు? అసలు చివరి ఊపిరి పోగానే సమస్తం రద్దు చేయబడిన ఆ మనిషిని ‘శవం’ అని కాకుండా ఇంకా మన మధ్య ఉన్న వారిలాగే అదే పేరుతో, బంధుత్వంతో, అనురాగంతో పిలవగలమా? సహించగలమా? వహించగలమా? ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోబయాషి మరియూ అతని భార్య మికా కొబయాషి ఇరువుతూ తమకు వచ్చిన గడ్డు రోజుల కాలంనుండి సినిమా మొదలవుతుంది. కోబయాషి ఒక యువ సంగీత వాయిద్యకారుడు. తను పనిచేస్తున్న సంగీత వాద్యబృందం ఆర్థిక సంక్షోభం వల్ల మూతపడుతుంది. ఉద్యోగం లేకుండా టోక్యో వంటి మహనగరంలో ఉండి భవిష్యత్తుని మళ్ళీ సంగీతంలోనే వెదుకోవడం కష్టమనిపించి భార్యతో కలిసి తన స్వంత ఊరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కథానాయకుడు. ఊర్లో కనీసం స్వంత ఇల్లు ఉంది. తల్లి రెండు సంవత్సరాలక్రితమే మరణించింది. అంతకు మునుపు తల్లి తన ఇంట్లోనే చిన్న హోటల్ నడిపేది. కోబయాషి తండ్రి ఈ పిల్లాడి చిన్నతనంలోనే ఇల్లువదిలి వెళ్ళిపోయాడు. అదంతా వేరే కథ. కానీ సినిమాలో గొప్పగా మనకు చెప్పిన కథే ఇదంతా , అదంతా సినిమా చూసి తెలుసుకుందురు . కానీ గమనిస్తే ఒకటనిపిస్తుంది మనకై మనం ’జీవితం’ ఇది అని, ఇలా ఉండాలని ఒకలా నిర్ణయించుకుంటాం. మన నిర్ణయాలతో జీవితానికి పని ఏం ఉంది. దాని దావన అది వెడుతూనే ఉంటుంది. చచ్చేవరకు -చచ్చినట్లు మనం దాని వెనుక నడవలసిందే. కొబయాషి చిన్నపిల్లాడుగా ఉన్నప్పటినుండి సంగీతమే తన జీవితం అనుకున్నాడు, సంగీతం లోనే తన భవిష్యత్తు ఉందని కూడా అనుకున్నాడు. సంగీతం అతనికి తండ్రి రక్తంనుండి అందుకున్న జన్యు సంపద. కానీ ఏవయ్యింది? తను ఏనాడు అనుకోనిది ఒకతి, తన చదువుకున్న చదువు ఇవ్వనిది ఒకటి , తన సంగీత ప్రపంచం ఊహించని ఒక ఉద్యోగం ఒకదానిలో అతను అనుకోకుండా కుదిరిపోవాల్సి వచ్చింది. ఎటువంటి ఉద్యోగం అనుకున్నారు అది? మరణించిన మృతదేహాలను ఖననం చేయడానికి లేదా దహనం చేయడానికి ముందు పరలోక ప్రవేశానికి సిద్ధం చేసే అంత్యక్రియల నిపుణుడు సకాషి అనే ఒక పెద్దమనిషికి సహయకుడి ఉండె ఉద్యోగం అది. (బహుశా మన చుట్టూ ఉన్న రకరకాల జనజాతుల్లో మరణానంతర అంతిమ సంస్కారాల్లో ఈ ఈ సినిమాలో చూపించి నటువంటి ఉన్నత అంతిమ వీడుకోలు సంస్కారపూరిత సాంప్రాదాయం ఉందో లేదో నాకు తెలీదు . మరీ ఇంతగా కాదు కాని చిన్న చిన్న మార్పులతో కొంత వరకు ముస్లీం జీవన విధానంలో వారు మరణించిన అనంతరం జరిపే క్రియాకాండలు చాలా పద్దతిగా, పరిశుభ్రంగా ఉండటం వరకు నేను ఎరుగుదును) ఈ సినిమాలో సకాషి పాత్రను ‘సుటోము యమజక ’ అనే ఒక అద్భుత నటుడు నటించారు. చెప్పుకోవాలంటే ఈయన మన హింది సినిమాల్లో ‘అశోక్ కుమార్’ వంటి వారు . చక్కని రూపు రేఖలు, హుందాతనపు నటన. ఈయన సినిమాలు నేను మునుపు రెండు చూసాను. ఏ టాక్సింగ్ ఉమన్, ఇంకా ‘టాంపొపొ’. రెండూ అద్భుతమైన సినిమాలు. ఈ రెండు సినిమాల దర్శకులు ‘జుజో ఇటామి’ ఈయన గురించి మరెప్పుడయినా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంత గొప్పగా ముచ్చటించుకోవాల్సిన మనిషి ఈతను. తిరిగి ఈ సినిమా దాకా వస్తే, మన ఈ మనుషుల ప్రపంచం ఎట్లా ఏడిచిందో చూశారా? నువ్వు ఎంత పనికిరానివాడివి, పనికి మాలినవాడివి అయినా క్షమిస్తారు. నేరగాడివి, మోసగాడివి, పచ్చి స్వార్థపరుడివయినా, పరాయి సొత్తుకోసం ప్రతి క్షణం కాచుకు కూచునే గుంట నక్కవయినా మన్నిస్తారు కానీ శవాన్ని తాకిని మనిషిగా, శవాన్ని కడిగిన మనిషిగా, శవానికి తలదువ్వి బట్టలు తొడిగి నిర్జీవమైన ఆ పెదాలపై చివరి జీవం లత్తుక అద్దిన వాడివిగా నిన్ను నీ స్నేహితులు, బంధుమిత్రులు అంతా ఒక అంటరానివాడిగా చూస్తారు. అంతదాకా ఎందుకు కేవలం శవదహనానికి వెళ్ళి వచ్చిన నిన్నే అంటక, నీ బట్టలు వదిలించి, నిన్ను తలారా స్నానం చేయించి కానీ నీ స్వంత ఇంటి గడప లోకి రానివ్వరే నీ వారు! అటువంటి నిర్జీవ ప్రపంచంలో ప్రాణం లేని వారితో సాగించే నిత్యౌద్యోగంలో మునిగే తేలే మనుషుల చావు వాసన భరించే వారెవరు? తన ఉద్యోగం ఏవిటో భార్యకు చెప్పకుండా చాలా కాలం కొబయాషి కాలం నడుపుతాడు. నిజం బయట పడిన రోజుని భార్య ‘మికా’ అతడ్ని వదిలి వెల్లి పోతుంది. ఏం కేవలం డబ్బు కోసమేనా అతడు ఆ ఉద్యోగం చేస్తున్నది? అయిష్టంగా, అనుకోకుండా ఆ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు, అయినవాళ్లందరు ఛీ, యాక్’ అని ముక్కు మూసుకుని దూరం వెళ్ళిపొయినా. ఆ పనిలోని ఒక లోతుని , ఒక మానవీయతని, ఒక గొప్ప కళని, కరుణని కనుగుంటాడు. అత్యంత ఇష్టంగా అందులో ఉండిపోతాడు. ఈ సినిమా అంతా బాధాపూరిత , వేదనా భరిత ఒకటిన్నర గంటల కాలపు ప్రయాణం అని భావించవద్దు. వేదన ఎక్కడ ఉంటుందో అక్కడ జీవితం సున్నిత తాలూకు హాస్యం ఉంటుంది. ప్రపంచంలో ఎంతటి వేదనాభరిత జీవనంలోనయినా వీలు చిక్కినప్పుడల్లా హాస్యం తొంగి చూస్తూనే ఉంటుంది. అది సాహిత్యంలో కానీయండి. జీవితాలవంటి సినిమాల్లో కానీయండి. ఈ సినిమా లోనూ అదే ఉంది. ఇంతకన్నా ఎక్కువగా సినిమా గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు. నాకు తెలుసు మీ టేస్ట్ గొప్పది మీరు తప్పక ఈ సినిమా చూస్తారని. కొసరు: ఈ సినిమా దర్శకుడి పనితనం, చిన్న చిన్న వివరనైపుణ్యం గురించి బొలెడు చెబుతా మచ్చుకు ఒకటి: సినిమా ప్రారంభంలో, తను పని చేస్తున్న ఆర్గెస్ట్రా రద్దు అయిపోయి ఉద్యోగం పోయిన సంగతి గురించి కోబయాషి తన భార్యకు తెలియజేసిన తరువాత, ఆమె ఆ రాత్రి భోజనం సిద్ధం చేయడానికి వంటగదికి వెళుతుంది అంతకు మునుపే వారి పొరుగింటి వారు ఆ రాత్రి వంటకోసమని ఈ దంపతులకు ఒక ఆక్టోపస్ ఇస్తారు, అది ప్రాణమున్న ఆక్టోపస్. దాన్ని చంపి తినడానికి చేతులు భార్యాభర్తలు ఇరువురు దానిని ఒక కాలువ దాకా తీసుకెళ్ళి దానిని నీటిలోకి విడిచి ఒక కొత్త జీవితాన్ని దానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆక్టోపస్ అప్పటికే చనిపోయినవుంటుంది, ఇంతా చేసీ కోబయాషి నీళ్ళల్లోకి వదిలింది ఒక చనిపోయిన జీవిని. సినిమా మనకు ఈ సన్నివేశం చూపిస్తూ చెప్పి చెప్పకుండానే కోబయాషి భవిష్యత్తులో తను చేయబోయే కొత్త ఉద్యోగమేమిటో ఒక సూచనగా మనకు అందిస్తారు దర్శకులు. - అన్వర్ -
నూట పాతికేళ్ళ యువకుడు
ఈ సంవత్సరం దామెర్ల రామారావు గారి 125వ జయంతి. ఆయన 28 సంవత్సరాల వయసులో అకాల మరణం చెందారు. బ్రతుకు గైర్హాజరులో ఈ నూటా పాతికకు ముందు, ఏభయ్, డెబ్భై అయిదు, నూరు సంవత్సరాల జయంతులు కూడా పూర్తి అయిపోయాయి. ఆయన తాలూకు నూటాపాతిక సంవత్సరాల వయసులో మూడింట దాదాపు ఒక వంతు వయసు అటుగా నాదిప్పుడు. నా చిన్నతనంలో మా తండ్రిగారో, చిన్నాయనలో నాతో ‘‘బాబూ, నీకు బొమ్మలంటే ఇష్టం కదా! ఇదిగో, ఈయన దామెర్ల రామారావు గారని చాలా గొప్ప చిత్రకారులు. నీలా బొమ్మలేసే వాళ్ళు రోజూ ఈయన పటం ముందు నిలబడి దండం పెట్టుకుంటే ఆయన ఆశీస్సులు అంది నీవు కాస్త మంచి ఆర్టిస్టువు అవుతావు’’ అని ఎవరూ చెప్పలేదు. కాస్త పెద్దయ్యి, హైస్కూల్లో చేరాకా మా డ్రాయింగు సారు కూడా దామెర్ల రామారావు పేరు పలికి ఆయనకు దండం పెట్టించడం అటుంచి, అసలు డ్రాయింగే మాకు నేర్పలేదు. ఒక మనిషి జీవితంలో దాదాపు పాతిక సంవత్సరాల వరకు చదువులో గడుస్తుందంటే– దామెర్ల రామారావు గురించి నేను పుట్టి పెరిగిన ఇల్లు గానీ, చదువులు నేర్పిన బడులు గానీ, కలిసి నడిచిన స్నేహాలు గానీ పరిచయం చేయలేదు. బ్రతుకుతెరువు రీత్యా ఒక చిత్రకారుణ్ణి అయిన తరువాత బొమ్మలు వేసే సర్కిల్ ఒకటి పరిచయం అవుతుంది కదా, అక్కడా అదే వరస! ‘నా జీతం ఇంత, నీ జీతమెంతా? నా బొమ్మకు ఇంత పుచ్చుకుంటా, నీ బొమ్మకు ఎంత అడుక్కుంటావ్?’ అనే గుమస్తా లెక్కల చిట్టా తప్పా దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం, వి. ఆర్. చిత్ర వంటి పేర్లు వినపడ్డవి కావు! వారి గొప్ప అందిందీ కాదు! అటు సాధారణ సంసార జనానికీ అందక, ఇటు బొమ్మల బ్రతుకులో తలమునకలైన వారికీ తెలీక ‘‘ఈ మహానుభావుడు, గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే’’ అని ఊపిరి పొడుగ్గా వదులుతాం. పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది? ఆయన చిత్రించిన వందల సంఖ్యల బొమ్మల చెంత పక్కన మరిన్ని సున్నాలు చేరి ఉండేవి. తన చిత్రకళా ప్రపంచంలో ఆయన మరింత కృషి కొనసాగించి ఉండేవారు. అయితే మాత్రం? కళా ప్రపంచంలోని వారు ఎంత కృషి చేసినా ఆ బొమ్మల భాషని చూపడానికి మన పిల్లల చేతుల పట్టుకుని ఆర్ట్ గ్యాలరీల వైపు అడుగులు వేసే సంస్కారం మన కుటుంబాలది కాదు. విద్యార్థుల బుర్రల్లో ఆ కళాకారుల గురించీ, వారి కళాసృష్టి గురించీ జ్ఞానబీజాలు నాటే సంస్కృతి మన బడులది కాదు. దామెర్ల జనన, మరణాల వికీపీడియా లెక్కలు కాదు కదా మనకిప్పుడు కావలసినది! ఎవరు చూస్తున్నారని, చూడబోతున్నారని గానీ, ఏ కీర్తి కిరీటపు బరువు నీడలో కాలాన్ని వెళ్ళబుచ్చుదామని వంటి ఆలోచనలు లేని ఒకలాంటి మానవులు ఉంటారు. ఉత్తమ జాతి మానవులు. ఉత్తమోత్తమమైనది వారి సృజన. సర్వవిద్యలకూ రెండు దశ లుంటాయి. ఒకటి రసాత్మకమైనది. రెండవది వినోదమైనది. సినిమాల పేరిట, షోల పేరిట టీవీల నిండా, మొబైల్ ఫోన్ల నిండా దొరుకుతున్నది రెండవదే. మనిషిలో కామ క్రోధ లోభ మోహాలనీ బలవంతాన మరీ బయటకు తీసి ఊ అంటావా ఊఊ అంటావా అని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవవే. ఈ శబ్దాలతో ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ మనిషి మనసుకు కావలసినదల్లా కాసింత సాంత్వన. గొప్ప సంగీతం వినడం, గొప్ప బొమ్మ చూడ్డం, గొప్ప రచన చదవడం వల్ల ఆ సాంత్వన కలుగుతుంది. చిత్రించిన ప్రతీది గొప్ప బొమ్మా కాదు, చిత్రించే ప్రతీవాడూ గొప్ప చిత్రకారుడు కాలేడు. కేవలం దామెర్ల రామారావు వంటి కొందరు చేసిన పని ఉంటుంది. అది కాలానికి కట్టుబడనిది, మనిషి మనసుకు శాంతినివ్వడానికి ఇవ్వబడినది. మనిషి ఎల్లకాలం ఉండడు. గొప్ప కళ ఎప్పటికీ ఉంటుంది. ఆ కళ తనున్నంత కాలం తన సరసన ఆ మనిషి పేరును నిలిపి పెడుతుంది. చలం గారి ‘యోగ్యతా పత్రం’లో ‘ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?’ అని ప్రశ్న ఉంటుంది. ‘సంధ్య కేసి’ అంటారు ఆయన. అడగవలసిన ప్రశ్న కాదది. అట్లా చూసేవాడిని చూడనివ్వాలి. మనమందరమూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒకవేపు అలా చూస్తూ నిలబడ్డవాళ్ళమే! ఆ సమయాన సంధ్యలోనో, అరుణోదయంలోనో, పారుతున్న ఏరు గలగలలో, మనం ఏం చూశామో, ఏం పొందామో, దానిని ప్రతిసారీ ఇవ్వగలిగినది మాత్రమే గొప్ప కళ. అది దామెర్ల వారి బొమ్మలో ఉన్నది, ఓస్వాల్డో గుయాసమీన్ బొమ్మలో ఉన్నది, బిస్మిల్లా ఖాన్ షెహనాయిలో, భూపేన్ హజారికా గొంతులో ఉన్నది. మనవంటి వారి మనసుల్లో శాంతి నింపడం కోసమే అవి ఉన్నవి. నూటా పాతిక కాదు, ఎన్ని వందల పాతిక జయంతులయినా జరుపుకొంటూ రామారావు గారూ, ఆయన బొమ్మలూ ఉంటాయి. ఆ వేపుకు కాస్త అడుగు వేసి చూడండి. అది మాత్రం మీ కోసం మీరు చేసుకోగలిగినది! – అన్వర్ (మార్చి 8న దామెర్ల రామారావు 125వ జయంతి) -
అలతి రేఖల బుజ్జాయి
ఈ మధ్యే ‘బుజ్జాయి’ గారిని తలుచుకున్నాను. టెలిగ్రామ్ అనే యాప్‌లో ఎవరో షేర్ చేయగా చిరంజీవి అనే బొమ్మల కథ అందులో చేరింది. సినిమా నటులు చిరంజీవిని ప్రధానపాత్రను చేసి చిత్రించిన కామిక్ అది. బొమ్మల కథలను, అందు లోని పాత్రలను, ఆ సన్నివేశాలను, ఆ ముచ్చటైన అరేంజ్‌మెంట్‌ను ఈ రోజు కొత్తగా తెలుసుకున్న వాళ్ళం కాదు కదా! కానీ నన్ను ఈ కొత్తగా చూస్తున్న ‘చిరంజీవి’ మంత్రముగ్ధుణ్ణి చేసింది. చిత్రకారుడికి కాల్పనికమైన పాత్రలను సృష్టిం చడం పెద్ద గొప్ప విషయం కాదు. అలా అని మన మధ్య ప్రాణం పోసుకుని తిరుగుతున్న మనకు బాగా తెలిసి ఉన్నవారిని బొమ్మల్లో ప్రాణప్రతిష్ట చేయడం అతి కష్టమైనదా? అని అడిగితే... ఒక బొమ్మను మాత్రమే చిత్రించడం అయితే పెద్ద కష్టమూ, గొప్పా కాదు. కానీ కామిక్స్‌లో కొన్ని వందల సార్లు ఒక పాత్రని, అందునా మనకు బాగా తెలిసి ఉన్న ఒక ప్రముఖుణ్ణి ఏ వైపు నుంచి చూసినా అరచేయి కొలత నుండి అగ్గిపుల్ల మొనంత కనబడే ఆ క్యారెక్టర్ని గీయడమనేది అంతగా క్రాఫ్ట్ నైపుణ్యం లేని తెలుగు చిత్రకళా రంగంలో ఒక అసాధ్యమే. నాకు తెలిసి ఈ పనే అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ చిత్రకారులు ‘మార్ట్ డ్రకర్’ చేయగలి గారు. అయితే బొమ్మల్లో తెగ డిటైల్ ఉంటుంది. బుజ్జాయి గారు అలా కాదు, మహామహా కార్య శీలులు మాత్రమే సాధించగలిగిన అమిత సింప్లి సిటీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కాన రారు. ఏం రేఖ, ఎంత చక్కని కూర్పు! తొలి ఉదయపు లేత ఎండ కాంతివంటి ఆయన రంగులు బొమ్మల మీద జిగేలు మనేవి. ఆయన బొమ్మలో రంగుని రేఖ తినేది కాదు, రేఖని రంగు మింగేది కాదు. సమన్వయం– సంతులత తెలిసిన ఒబ్బిడి రకం చిత్రకారులు ఆయన. మనిషీనూ అంతే. ఏళ్ళ క్రితం పనిగట్టుకుని మదరాసు వెళ్లి, ఒక రోజు ఆయనతో గడిపాము నేనూ, మా ఫ్రెండ్ విజయ్‌వర్ధన్. ఆ రోజు ఆయన చిన్నతనపు కబుర్లు, ఆ బొమ్మల ముచ్చట్లు, యవ్వనపు రోజుల్లో బాపు గారు స్కూటర్ ఎక్కి వారి ఇంటి వద్దకు వచ్చి హారన్ మ్రోగించడం, ఈయన వచ్చి బండెక్కడం, అవన్నీ చెబుతుంటే కళ్లముందు ఒక చక్కని నలుపు తెలుపు రంగు సినిమా కదలాడినట్లు ఉంది. గొప్ప తపన, పనితనం తెలిసిన చిత్రకారులంతా తమ బొమ్మలతో దేశాన్ని ఉర్రూతలూగించిన సమయ మది. మన వేపు బాపు, వపా, బుజ్జాయి, చిత్ర, శంకర్ దాదాపు ఆ మదరాసు వీధుల్లో నడకలుగా, తెలుగు పత్రిక పేజీల్లో రేఖలను పరుగులుగా సాగిన కాలమది. బుజ్జాయి బొమ్మలని ఆనిమేషన్ చిత్రాలుగా, చరిత్రలోని గొప్ప గాథలని బొమ్మల కథల్లో నిలుపు కుని ఉండాల్సిన పని. ఆయన బొమ్మలు చూసిన ప్రతిసారీ నా మనసుకు అనిపించేది ఒకటే. బ్బా! ఎంత అలవోకగా ఈయన కాగితంపై బొమ్మని మిగులుస్తారు. నిజానికి ఎంత పనిని మనం ఈయన వద్దనుండి రాబట్టుకోవలసింది! యురోపి యన్ దేశాల్లో ఆస్టెరిక్స్, టిన్ టిన్ వంటి వాటికి రెండింతల బొమ్మల సంపద మిగిలి ఉండాలి కదా. ఎంతో కథా సాహిత్యం మన దగ్గర ఉన్నది, లేని దల్లా బుజ్జాయి వంటి చిత్రకారులే కదా. పడమట వాలిన సూర్యుడు తెలవారగానే తూరుపున వచ్చే స్తారు. కానీ జాతి సాంస్కృతిక జీవనంలో ఒకరే బుజ్జాయి, ఒకరే బాపు, ఒకరే వడ్డాది పాపయ్య వంటి వారు ఒకరే ఉంటారు. వారు సశరీరంగా శాశ్వతులు కారు గానీ వారి స్ఫూర్తి మాత్రం తర తరాలుగా శాశ్వతంగా ఉండవలసినది. వారు జీవించి ఉన్నప్పుడే వారితో, వారి స్ఫూర్తితో వర్క్ షాపులు నడిపించి ఎందరో కొత్త తరం బుజ్జాయి లని తయారు చేసుకోవాల్సి ఉండింది! ఈరోజు బుజ్జాయి లేరు. ఆయన రచించిన పుస్తకాలు మాత్రం ఒక వరుసలో మిగిలాయి. ఏదో ఒక రోజున ఒక చిన్న హస్తం వచ్చి ఆ పుస్తకపు పేజీలు తెరిచి అందులోని బొమ్మలని చూసి వెలిగిన కన్నులతో బుజ్జాయి అంతటి చిత్రకారుడ వ్వాలనే కలలు కంటాయని కలగంటూ బుజ్జాయి అని మనకు తెలిసిన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారికి నివాళి. – అన్వర్