ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది! | Artist Anwar On Dr Chaganty Suryanarayana Murthy Doctor Katha Book | Sakshi
Sakshi News home page

ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది!

Published Thu, Feb 9 2023 2:24 PM | Last Updated on Thu, Feb 9 2023 2:32 PM

Artist Anwar On Dr Chaganty Suryanarayana Murthy Doctor Katha Book - Sakshi

ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. ఈ డాక్టర్ కథ వెనుక ఒక కల ఉంది. ఎప్పుడో దాదాపూ యేభై ఏళ్ల వెనుకటి కల ఇది. అనగనగా ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయాక ఒక మూడేళ్లు ఖాళీగా ఇంట్లో కూచుంది. గోళ్ళు కొరుక్కునే అలవాటు అనేదొకటుంటుంది అని తెలీకపోవడం వల్ల ఆ పిల్ల ఆ మూడేళ్లూ వాళ్ళ చిన్న ఊళ్లో లైబ్రరీలో వున్న పుస్తకాలన్నీ కొరుక్కుని తినెయ్యడమే పనిగా పెట్టుకుంది.

అలా చదివిన పుస్తకాల్లో ఒక చిన్న పుస్తకం ఆ చిన్నారిని అమితంగా ఆకర్షించింది. అవడానికి చిన్న పుస్తకమే గానీ ఆ వయసులో ఆ అమ్మాయిమీద ఆ పుస్తకం చూపిన ప్రభావం మరపురానిది. ఇవ్వాల్టి దినాన ఆవిడ డాక్టరయి, ప్రాక్టీసు పెట్టి చాలా ఏళ్లయిపోయినా , తను చిన్నప్పుడు చదివిన ఆ పుస్తకం, అందులోని విషయాలు ఆవిడకు గుర్తొస్తూనే వుండేవి. ఒక రకంగా తను డాక్టర్నవడానికి కూడా స్ఫూర్తిని ఇచ్చిందా పుస్తకం. ఆవిడ పేరు డాక్టర్ భార్గవి, ఆ పుస్తకం పేరు "ఒక డాక్టర్ కథ".

అపుడాకాలంలో చదివింది కేవలం ఒక పుస్తకం కాదని అది సాధించి తీరవలసిన ఒక గొప్ప కల అని కూడా గ్రహించని ఆ నాటి అమాయక్కపిల్ల గట్టిగా పట్టుకున్న కల ఇది . కల చుట్టూ బోలెడన్ని ఆశలు, ఆత్రుతలు, ఆలోచనలు అన్నీ కలిసి ఒక ఊహగా దిద్దుకుని కాపాడుకున్న కల అది. ఇన్ని ఏళ్ల తరువాత, అనేక ప్రయత్నాల తరువాత ఆ కల ఒక రూపం దాల్చి ఈ రోజు ఒకటి , రెండూ , పది , వందల సంఖ్యగా మారి పాఠకుల చేతుల్లో నిలిచింది.

ఈ రోజు మనందరి ముందున్న ఈ ఫలితం, డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి అనే ఒక మహానీయుడి కృషికి, దాని వెనుక జీవితానికి నూటా పద్నాలుగు పేజీల పుస్తక రూపం. నూరేళ్ల దీర్ఘ ప్రయాణం అనంతరం భౌతికంగా ఒక జీవితం ముగిసిపోతుందేమో కానీ.. ఇలా అక్షరాల ఆసరాగా పుటల మీదికి ఎక్కిన జీవితాలు అంత సులువుగా దూరమయ్యేవి కావు.

సుమారు అర్థ శతాబ్దం మునుపు మానవ మస్తిష్క జ్ఞాపకాలు లో నుంచి మరుగయిన ఒకనొక గొప్ప వ్యక్తి జీవితం ఈ పుస్తకం రూపంలో బయటికి వచ్చినపుడు, మిగతా వారెవరికీ తెలీనంత, అందనంత, పొందనంత సంతోషాన్ని పొందిన వాళ్లము ప్రథమంగా ఇద్దరమున్నాము.. ఒకరు మా అమ్మ భార్గవి , ఇంకొకరు నేను. మా ఇద్దరమూ కాక నిజానికి మూడో వ్యక్తి కూడా ఒకరున్నారు.

వాస్తవానికి ఈ పుస్తకం రంగూ, వాసనా, రుచి చూసి ఆయన కన్నా గొప్పగా పొంగిపోయేవారు మరొకరెవరూ ఉండలేరు. ఆయనే డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి గారు. ఎంత సంతోషపడి ఉండేవారో ఆయన ఈ పుస్తకాన్ని ఇలా చూసి ఉంటే. మీకు తెలియక పోవచ్చు. మాకు తెలుస్తుంది. నన్ను మా చిన్నాయన ఎంతో గొప్ప ప్రేమతో పెంచాడు. ఒక్కోసారి ఆయన పని మీద బయటికి వెళ్ళి అర్థరాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చేవాడు.

ఎంత అర్థరాత్రి అయినా సరే - మహా ఆలస్యమయినా సరే, వస్తూ వస్తూ నా కొసమని ఏదో ఒక మిఠాయినో, పండో, తినుబండారమో తెచ్చి, బాగా నిద్రలో ఉన్న నన్ను లేపి మరీ ఆ తెచ్చినది తినపెట్టి ఆ తరువాతే నన్ను నిద్రపుచ్చేవాడు. అలా నిద్రలు పోయీ పొయీ నిద్రలోనే పెరిగి పెద్దయి పోయిన నా దగ్గరకు ఈ అమ్మ వచ్చింది. ఎంత నా పనిలో నేనున్నా, చచ్చేంత చావులో మునిగి తేలలేకున్నా సరే , జుట్టు పట్టి తేల్చి మరీ "అన్వర్ చూడు ఈ పుస్తకం ఎంత బావుంటుందో, ఆ పుస్తకం చదువు ఎంత హాస్యంగా ఉంటుందో " అని పట్టుబట్టి నాతో పుస్తకాలు చదివించే పని మా అమ్మది.

ఆవిడకు అన్ని పుస్తకాలూ సమానమే, అయిననూ రెండు పుస్తకాలు మరీ ఎక్కువ సమానం. ఒకటి జమ్మి కోనేటి రావు గారి సూక్ష్మ క్రిమి అన్వేషకులు మరోటి చాగంటి సూర్యనారాయణ మూర్తి గారి డాక్టర్ కథ. మొదటి పుస్తకం "సూక్ష్మ క్రిమి అన్వేషకులు " అమ్మ దగ్గర ఉంది. డాక్టర్ కథ మాత్రం ఆవిడ దగ్గర లేదు. దాని గురించి ఆవిడ చెప్పడం, నేను వినడం తప్పా.

సరిగా ఆరు నెలల క్రిందట ఆవిడ చేతికి శిధిలావస్థ లో ఈ పుస్తకం కాపి అందింది. అప్పటికీ రాత్రి పది అయి ఉంటుంది. పుస్తకం వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి, ఫలానా పుస్తకం పంపుతున్నాను చూడు, వెంఠనే చదువు అన్నది. సరేనమ్మా చదివి రేపు ఉదయం మాట్లాడుకుందాములే అన్నా. పుస్తకం చదవడం మొదలు పెట్టా. రేపు ఉదయం ఫోన్ చేస్తా అన్నవాడిని చదువుతూ చదువుతూ పేజీల మధ్య ఆగిపోయి సంతోషం పట్టలేక ఆ రాత్రి ఎన్ని సార్లు ఆవిడకు ఫోన్ చేసానో, ఆయన కథనం గురించి, చక్కని వాక్యం గురించి, హాయైన శైలీ గురించి ఎంతగా మురిసిపోయామో ... ఒక్కోసారి ప్రొస్ ఈజ్ బాటిల్డ్ వైన్ అంటారే!

అంత నషాని ఇచ్చిందా పుస్తకం నాకు. సంతోషమంటే ఒకే ఒకరు తనతో తాను పంచుకోవడమా? గదిలో నాలుగు రెళ్ళ ఎనిమిది అద్దాలు ఏర్పాటు చేసుకుని ప్రతిబింబాల తోడుగా మురియడమా? కాదు కదా! ఒక చేయి చప్పట్లు పలకించలేదు. ఒక రెక్క రివ్వున ఆకాశం వైపు దూసుకోపోలేదు. పదిమందితో పంచుకోనిది ఏమానందం? నలుగురితో కలిసి రుచి చూడనీదీ ఏం భోజనం? ఒక పిట్టకథ చెబుతా.

1960 నాటి జగతి పత్రికలో "జియార్ ఫాన్ డీర్ ష్రింగ్ " గారి రచన ఒకటి అచ్చయ్యింది - అందులో పదమూడేళ్ళ హాన్స్ తన మిత్రురాలు పదహైదేళ్ల అమ్మాయి ఊటా కి కాస్త డబ్బు అప్పు పడతాడు. ఏం చేసయినా సరే ఆ అప్పు తీర్చాలని హాన్స్ పట్టుదల. సరిగ్గా అదే సమయం లో బయట పెద్ద తుఫాను- గాలి వానా. బయట కాలు అడుగుపెట్టడానికే లేదు.

ఏం పని చేసేట్టు? ఎట్లా డబ్బు సంపాదించేట్టు? పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని హాన్స్ తాతగారు వాడికి ఇదిగో ఈ అద్భుతమైన పుస్తకం చదువు అని ప్రపంచ ప్రఖ్యాత హొమర్ విరచిత ఒడిస్సే అతని చేతిలో పెడతాడు. పదమూడేళ్ల పిల్లవాడికి ఎంత భారం? ఏమర్థమవుతుంది అంత మహాకావ్యం? అయితే వాడికి ఒక ఆలొచన వస్తుంది. ఆ పుస్తకాన్ని కంఠోపాఠం చేసి పేజీ పేజీ ఒప్పచెప్పితే తాతయ్య నాకేమైన డబ్బు ఇస్తాడేమో? అలా డబ్బులు సంపాదించి తన ప్రెండు ఊటా’ దగ్గర చేసిన అప్పు తీర్చేయవచ్చు కదా!

అలా అని అలోచన చేసి ఆ పుస్తకాన్ని రాగయుక్తంగా కంఠస్థం చేయ మొదలు పెదతాడు ఆ బుల్లబ్బాయి. మిగతా కథ అంతా తరువాతి సంచికల్లో అని అక్కడిక్కకడ నన్ను మోసం చెసి వెల్లిపోయిందా సంచిక. ఎంత ప్రయత్నించినా నాకు తదుపరి సంచికలు దొరకలేదు. ఆ కథను అద్భుతంగా అనువాదం చెసినవారు , డాక్టర్ వి. ఎన్. శర్మ గారు. ఆయన పేరు మీద వెదికినా అసలేమి సమాచారం లేదు ఇంటర్నెట్లో.

అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే! ఒక చిన్న రొట్టె ముక్కనో, ఒక జామ పండునో, చివరికీ పిసరంత పిప్పరమెంట్ ను కూడా ముక్కలు చేసుకుని నలుగురితో పంచుకునే మనుష్యులము మనము. ఇక్కడ డాక్టర్ భార్గవి గారు పంచుకున్నదల్లా తన కలను. తను చదివి ఆనందించడమనేది సరి. కానీ తను పొందిన ఆనందాన్ని పదిమందికి పంచాలని ఉంటుందే!

అందునా అదేమి తన స్వంత రచన కాదు. ఈ పుస్తకం వలన తనకు కొత్తగా తెచ్చుకునే, వచ్చిపడే పేరూ ఉండదు. పుస్తకం వేయడమంటే డబ్బు ఎదురు పోయడమే కానీ, రావడం కాదు కదా. పైన నేను చెప్పిన కథ లో నాకు తప్పి పోయిన హాన్స్, ఊటా, డాక్టర్ వి. ఎన్. శర్మ గారు వీళ్లంతా నాకు ఏనాడో ఒకనాడు దొరక్కపొతారా? అనే ఆశకు ఆలంబన ఇదిగో ఈ డాక్టర్ భార్గవి గారి వంటి వారు, ఇంకా ఎవరైనా ఇటువంటి అద్భుతమైన పుస్తకాలు తేక పోతారా అని.

గాలి ఎట్లా వస్తుందో ముక్కు కు తెలీదు , గొప్ప పుస్తకాలకు తెలీని ఊపిరి పోసేది ఈ అమ్మ వంటి వారే! . కానీ ఏదీ అంత సులువుగా మొదలవదు. ముగియదు. ఈ పుస్తకం మళ్ళీ తేవడం కోసం డాక్టర్ భార్గవి ఎంత సంకల్పశక్తి తో ముందుకు సాగిందో , ఎన్నెన్ని అవాంతరాలు ఎదురయ్యి దిగాలు బొమ్మలా చిన్నబోయిందో నాకు తెలుసు. పాటలా గలగల సాగే మా అమ్మ, ఈ పుస్తకం కొసమని అపుడపుడూ బరువుగా దుఖంగా అయ్యేది.

నేను దానిని భరించలేక ఉండే వాడిని. పుస్తకమొద్దు ఏమీ వద్దు, ఇప్పుడు అది బయటికి రాకపోతే మునిగి పోయేదేం ఉంది? నీ ఆరోగ్యం, ఆనందం పాడు కావడం తప్పా ఆని! కేకలు కూడా వేసేవాడ్ని. అన్నీ వింటూనే ఉండేది, భరిస్తూనే ఉండేది. నేను మొత్తుకోళ్ళు పెడతానని తెలిసీ కూడా ఏ రోజుకారోజూ పనిలో ప్రొగ్రెస్ చేస్తూనే ఉండేది. నాకు చెబుతూనే ఉండేది . ఈ ఆరు నెలలు ఈ పుస్తకం తప్పా మరో పనేం పెట్టుకోలేదు.

అదిగో అక్కడ ఆ డాక్టరు గారి బంధువులెవరో ఉన్నారు అంటే అటు పరిగెత్తింది. అటు కాదు ఇటు అంటే ఈ వైపు పరిగెత్తింది. ఏ దిక్కునైనా దిక్కు చూపించే వారెవవరున్నారని తెలిసినా దిక్కులన్నీ కొలిచే పని పెట్టుకుంది. అలా మొదలు పెట్టి పేజీ పేజీ తడుము కుని ప్రాణంగా, ముచ్చట గా, ముద్దుగా పుస్తకాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము.

పుస్తకం చివరిదాకా వచ్చాక కూడా చాగంటి వారి ఫోటో దొరకలేదు. ఇద్దరమూ కలిసి దయ్యాల గది లాంటి ఒక చిన్న గదిలో కుప్పలుగా పొసిన ఫోటో గ్రాఫుల మధ్య దుమ్మూ, బూజు, ధూళి , అలర్జీల మధ్య ఎన్నో ఫ్రేముల మధ్య ఎప్పుడూ చూడని సూర్యనారాయణ గారిని వెదికే పని పెట్టుకున్నాము. ఆయన అక్షరాన్ని బట్టి, ఆయన శైలిని బట్టి ఆయనని పోల్చుకునే పని చేసాము. మా అమ్మ మొహమంతా మురికి, అలసట, కళ్లల్లో మాత్రం దొరికి తీరుతుందనే ఆశ. ఆశ గొప్పది. అది పొస్టల్ స్టాంపంత విశాలమైనది,

స్టాంపు వెనుక పూసి ఉంచిన జిగురంత లోతైనది. శ్రీ చాగంటి సూర్యనారాయణ గారి పోస్టల్ స్టాంపంత ఫోటో దొరికినపుడు ఆ గదిలో మేము ఇద్దరమే ఉన్నాము. అమ్మ ఎంత సంతోషించిందో చెప్పగలిగిన భాష నా దగ్గర లేదు. నాకైతే ఇంకాస్త దురాశ కలిగింది. చాగంటి వారు ఈ పుస్తకాన్ని వారి సతీమణి వేంకట రమణమ్మ గారికి అంకితం ఇచ్చారు. ఆవిడ ఫోటో కూడా దొరికితే అంకితం పేజి లో పెట్టవచ్చు కదా అని.

పాఠకుడి మనసుకి చదువుతో పాటూ కళ్లకి గొప్ప ఆనందం ఇవ్వడం కోసం ఈ పుస్తకాన్ని మాకు వీలయినంత అందంగా తేవడానికి ఇష్టపూర్వకంగా ప్రయత్నం చేసాము. పాతికకు పైగా బొమ్మలు వేసి కూడా మా లౌల్యం వల్ల పుస్తకం సింప్లిసిటి చెడకూడదని నిర్దాక్షిణ్యంగా ఆ బొమ్మలని పోగులు పెట్టాము. కథలో తగిలే ప్రతి ఉప శీర్షిక ని టక టక కీబోర్డ్ తో టైపాడించి పెట్టింది కాదు. కొత్తగా తయారు చేసింది.

అందులో నింపిన కేవలం పాతిక శాతపు నలుపు రంగు రేపు ఈ పుస్తకంలో ప్రింట్ రూపంలో ఎలా వస్తుందో, అచ్చయిన పేపరుని చూస్తే తప్పా మాకూ తెలిసే అవకాశం లేదు. అయినా సాహసం చేశాం. పుస్తకం బాగా రాకపోతే , ప్రతులన్నీ తగలెట్టి మళ్ళీ కొత్త పుస్తకం వేద్దాం అనే ఉన్నాం. పుస్తకం తొలి పేజీలో రచయిత బొమ్మ పై పెట్టిన టైటిల్ డిజైన్ హెయిర్ లైన్ థిక్ నెస్ ఫాంట్ పరిస్థితీ అంతే, ఏది ఎలా అచ్చవుతుందో మాకు తెలీదు. కొత్తగా చేయాలనుకున్నాము.

తన రచనతో మా మనసుల్లో కి గొప్ప స్థానంలో వచ్చి కూర్చున్న శ్రీ చాగంటి సూర్యనారాయణ గారి పట్ల మేము చూపించగలిగిన కృతజ్ఞత ఇది మాత్రమే. అదే చేశాము. ఈ పుస్తకపు పని చేస్తున్న రోజుల్లో నా బుర్రనిండా ఇద్దరు మనుషులే నిండి పోయారు ఒకరు నికోలా టెస్లా, 1856 ల నాటి మనిషి. మరొకరు ఈ చాగంటి సూర్యనారాయణ 1898 ల వారు. 2023 ల నాటి నాకు ఇప్పటి నా ప్రపంచంలో నేను మోయవలసిన ఆలోచనలు, ఇతరాలు చాలా ఉన్నాయి. కానీ నా బుర్రలో అవేమీ నన్ను ఆక్రమించుకొలేదు. ఈ ఇద్దరు మనుషులు తప్పా.

ఎందుకా అంటే, వీరు చేసిన పనల్లా, అలోచించినదల్లా కేవలం మానవాళి గురించే. వీళ్లని గురించి నేను చేసిన ఆలొచనలు, వీరి గురించిన నేను చదివిన చదువు నన్ను ఎంతగానో సంతోషపెట్టింది. నన్ను ఎక్కడో పడనివ్వకుండా సజ్జన స్మరణ లో ఆపింది. ఇదంతా ఎందుకు తలపోసుకుంటున్నానంటే మనిషి అనేవాడు మిగలడు కానీ అతను సంకల్పించిన మానవీయమైన కార్యాలు నిలుస్తాయి.

పుస్తకాలు కూడా అన్ని నిలబడవు, కేవలం అత్మశక్తి అక్షరాలలో నిలిచి మీ మనసులు తాకుతుందో,మనల్ని మనగా ఉంచ చూస్తుందో ఆ రచనలు మిగులుతాయి. ఇప్పుడు మీ చేతుల్లో అత్యంత సులువుగా పెంపుడు పావురాయిలా ఒదిగి కూచున్న ఆ పుస్తకం కోసం మేం ఎన్నెన్ని చెట్లు గుట్టలు ఎక్కినా, కొండా కోనలు గాలించినా అదంతా మా సంతోషం కోసమే. పంచడానికి మా వద్ద కేవలం సంతోషం మాత్రమే ఉంది. దయచేసి స్వీకరించండి.
-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement