ఇరు దేశాల ప్రధానులు మోదీ, అన్వర్ ఇబ్రహీం నిర్ణయం
మలేషియా వర్సిటీల్లో ఆయుర్వేద, తిరువళ్లువర్ విభాగాలు
ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మంగళవారం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ టెక్నాలజీతో సహకారంతోపాటు స్టార్టప్ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. మలేషియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ టుంకూ అబ్దుల్ రెహ్మాన్’లో ఆయుర్వేద విభాగాన్ని, యూనివర్సిటీ ఆఫ్ మలయాలో తిరువళ్లువర్ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా ఆయన తొలి భారత పర్యటన ఇదే కావడం విశేషం.
త్వరలో యూపీఐ, పేనెట్ అనుసంధానం: భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, మలేషియా మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సెమీకండక్టర్, ఫిన్‌టెక్, రక్షణ పరిశ్రమ, ఏఐ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ఇరు దేశాలకు మేలని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment