నిబంధనలకు విరుద్ధంగా మరో జట్టుతో ఒప్పందం చేసుకోవడంతో చర్య
కోల్‌కతా: ఆటగాళ్ల బదిలీకి సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన భారత ఫుట్‌బాల్ ప్లేయర్ అన్వర్ అలీపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) చర్యలు తీసుకుంది. అతనిపై నాలుగు నెలల నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత అన్వర్ ఆ కాంట్రాక్ట్‌ను పాటించకుండా అనూహ్యంగా ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు మారాడు. మరోవైపు వచ్చే ఏడాది వరకు కొత్త ఆటగాళ్లను తీసుకోవడంపై నిషేధం ఉన్నా సరే... దానిని ధిక్కరించి ఢిల్లీ ఎఫ్‌సీ కూడా అన్వర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తించింది. దాంతో విచారణ జరిపిన ఏఐఎఫ్‌ఎఫ్ అన్వర్‌పై నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది. అన్వర్ అలీ నుంచి రూ.12 కోట్ల 90 లక్షలు నష్టపరిహారం పొందేందుకు మోహన్ బగాన్ క్లబ్ జట్టుకు అర్హత ఉందని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని ఈస్ట్ బెంగాల్ క్లబ్, ఢిల్లీ ఎఫ్‌సీ, అన్వర్ కలిసి చెల్లించాలని ఏఐఎఫ్‌ఎఫ్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment