
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఈ మెగా టోర్నీకి ముందు తాము చేసిన వ్యాఖ్యలను పాక్ మాజీ ఆటగాళ్లు వెనక్కి తీసుకుంటున్నారు.
తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్తాన్ చేరుతుందని, తుది పోరు లాహోర్ వేదికగా జరుగుతుందని అలీ అంచనా వేశాడు. అయితే పాక్ లీగ్ స్టేజిలోనే నిష్క్రమించిడంతో తాజాగా అలీ క్షమాపణలు చెప్పాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలని తను కోరుకుంటున్నట్లు అతడు తెలిపాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహెర్ వేదికగా జరుగుతుందని, పాక్ టైటిల్ పోరుకు ఆర్హత సాధిస్తుందని చెప్పినందుకు నన్ను క్షమించిండి. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీమ్ ఇంత చెత్తగా ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ అధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మర్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్‌లు తలపడితే బాగుంటుంది. మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను తలపిస్తుందని అనుకుంటున్నాను" అని అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
బై బై అకీబ్..!
ఇక ఈ ఘోర ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాలని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న అకిబ్ పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది.
ఈ టోర్నీ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు వైట్‌బాల్ సిరీస్‌లో తలపడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. దీంతో న్యూజిలాండ్ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త హెడ్‌కోచ్ అవకాశముందని పీసీబీ మూలాలు వెల్లడించాయి. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో రావల్పిండి వేదికగా తలపడనుంది.
చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్
Comments
Please login to add a commentAdd a comment