
కేదార్‌నాథ్: హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించేవాటిలో కేదార్‌నాథ్(Kedarnath) ఒకటి. ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చే యూట్యూబర్లు ఆలయ పరిసరాల్లో వీడియోలు, రీల్స్ తీస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ కమిటీ ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది(2025)లో చార్‌ధామ్ యాత్ర(Chardham Yatra) ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. తొలుత యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరవనున్నారు. మే 2న కేదార్‌నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇటువంటి తరుణంలో కేదార్‌నాథ్ ఆలయ సముదాయంలో రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ చార్‌ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో అత్యధికంగా రీల్స్, వీడియోలు కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham)లోనే రూపొందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు యూట్యూబర్లు విరివిగా వీడియోలు , రీల్స్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. వీటి ప్రభావం తీర్థయాత్రపై పడుతోందని ఆలయ అధికారులు గుర్తించారు. భక్తి విశ్వాసాలతో మెలిగేవారు ఇటువంటి రీల్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇక్కడ రీల్స్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.
ధామ్ పవిత్రతను కాపాడటానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ తీర్థ పురోహిత సమాజ్ కూడా ఇక్కడ రీల్స్ చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలు తీయడాన్ని నిషేధించాలని చార్ ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు ఆలయంలో వీఐపీ దర్శనాలను కూడా నిషేధించారు. ఎవరైనా ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం