
శివాజీనగర: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రజలు ఫొటో తీయటానికి, వీడియోలు చిత్రీకరించడానికి ఆస్కారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయాల్లోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దీనివల్ల మహిళా ఉద్యోగుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని, అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి విన్నవించారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం కూలంకుషంగా పరిశీలించింది. ఇకపై పనివేళల్లో అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని ఆదేశిస్తూ సిబ్బంది, పరిపాలనా విభాగం కార్యదర్శి కే.వెంకటేశప్ప ఆదేశాలు జారీచేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా చట్టవిరుద్ధంగా ఫొటోలు, వీడియోలు తీసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment