నాకొక ఫొటో కావలె...! నేనే టీవీలో రావలె...! ఇదే సీఎం చంద్రబాబు యావ
పతాకస్థాయికి సీఎం చంద్రబాబు ప్రచార ఆరాటం
వరద ముంపు అంచనాలో దారుణ వైఫల్యం
తప్పు కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు హైడ్రామా
విజయవాడ కలెక్టరేట్‌లో మకాం వేసి ప్రచార హంగామా
రోజంతా ఫొటోలు, వీడియో షూట్లతో సొంత బాకా
బిల్డప్ బాబాయ్ పాత్రలో జీవిస్తున్న చంద్రబాబు
బాధితులను గాలికి వదిలి సీఎం సేవలో తరిస్తున్న యంత్రాంగం.. నాడు గోదావరి పుష్కరాల్లో
29 మందిని బలిగొన్న పబ్లిసిటీ ఆరాటం
సాక్షి, అమరావతి: టీవీల్లో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఓ ఫొటో..! ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఓ వీడియో క్లిప్..! మీడియా ప్రతినిధులను పిలిచి చేతులు అటూ ఇటూ ఊపుతూ ఏదో వివరిస్తుంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్..! ఎవరక్కడ? అనడమే ఆలస్యం.. ‘సిద్ధం దొరా..!’ అంటూ సదా అందుబాటులో ఉంటున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం...!!
ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు!
కానే కాదు.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో రెండు రోజులుగా సాగుతున్న సీను ఇదీ! ఓవైపు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది ‘అన్నమో రామచంద్రా’ అని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు యావత్ యంత్రాంగాన్ని తన చుట్టూ మోహరించి కలెక్టరేట్‌లో పండిస్తున్న ప్రచార సీన్ ఇదీ..!!
నా ఫొటోలూ.. నా వీడియోలూ.. అంతా నేనే
పీక్స్‌కు చేరిన చంద్రబాబు ప్రచార పిచ్చి
స్పైడర్ సినిమాలో విలన్ ఎస్‌జే సూర్య ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలు వింటూ పైశాచిక ఆనందంతో పరవశించిపోతుంటాడు. సినిమాలో అది ఊహాజనిత పాత్ర కావచ్చుగానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి అందుకే మాత్రం భిన్నంగా లేదన్న విమర్శలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.
వరద బాధితులు ఎలా పోతేనేం..! కరకట్టలు తెగి ఊళ్లు, చేలూ కొట్టుకుపోతేనేం... పేపర్లలో నా ఫొటోలు రావాలి..! టీవీ చానళ్ల తెర నిండా నేనే కనిపించాలి..! సోషల్ మీడియాలో నేనే వైరల్ కావాలి!! అనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం ఆయన ప్రచార కండూతికి నిదర్శనం. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనో ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తన క్యాంప్ ఆఫీసు నుంచో నిరభ్యంతరంగా సమీక్షించవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబు ఫొటోలు, వీడియోలు మీడియాలో పెద్దగా రావు కదా!!
ఇక టెక్నాలజీకి తాను బ్రాండ్ అంబాసిడర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు విజయవాడకు భారీ వరద ఐఎండీ రెండు రోజులు ముందు నుంచే హెచ్చరిస్తున్నా ముప్పును అంచనా వేయడంలో ఘోర వైఫల్యం చెందారు. కూటమి సర్కారు వైఫల్యం విజయవాడ ప్రజల పాలిట శాపంగా మారింది. దాంతో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చేందుకు దీంతో చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. విజయవాడ కలెక్టరేట్‌కు మకాం మార్చి తానేదో ఒంటి చేత్తో వరదను అడ్డుకుంటున్నట్లు ‘బిల్డప్ బాబాయ్’ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు.
టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతోపాటు అప్పటికప్పుడు జాతీయ మీడియాను కూడా పిలిపించుకుని చుట్టూ కూర్చొబెట్టుకుని మరీ ప్రచార సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బోటులో తిరుగుతున్న చంద్రబాబు... బుల్ డోజర్‌పై ఎక్కి చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు... లైఫ్ జాకెట్ వేసుకుని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు... డ్రోన్లను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఇలా సాగుతోంది ఈ ప్రహసనం. ముఖ్యమంత్రి వస్తున్నారంటే సహాయక చర్యలు వేగంగా చేపట్టి ఆర్థిక సహాయం చేస్తారని, వైద్య సేవలు అందేలా చూస్తారని బాధితులు ఆశిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజులిస్తూ వెళ్లిపోయారు. దీంతో బాధితులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు లేక.. ఆహారం అందక, తాగునీరు లేక అల్లాడుతున్నారు.
బాబు సేవలో యంత్రాంగం
ముఖ్యమంత్రే వచ్చి కలెక్టరేట్‌లో తిష్ట వేయడంతో అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి వరద బాధితులను గాలికి వదిలేసింది. ఇక ఓ వందమందితో కూడిన చంద్రదండు అనే ప్రైవేట్ సైన్యం అక్కడే మోహరించి చంద్రబాబు ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో వందల సంఖ్యలో చంద్రబాబు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం.
సీఎం ఆఫీసు మునక... కరకట్ట ఇంట్లోకి వరద
అమరావతిని వరదలు ముంచెత్తడంతో అక్కడ రాజధాని నిర్మాణంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు సచివాలయం ఇటు కరకట్ట నివాసం రెండూ చంద్రబాబు అవినీతి, వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుండటంతో విజయవాడ కలెక్టరేట్‌లో మకాం వేసి హైడ్రామాకు తెరతీశారు. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్న విషయం మరోసారి అందరికీ గుర్తుకొస్తోంది. ఇప్పుడు కూడా దాదాపు అదే రీతిలో ప్రచార కండూతితో వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.
తన ప్రచారానికే సీఎం ప్రాధాన్యం
సీఎం చంద్రబాబు చేసేది తక్కువ.. ప్రచారం చేసుకునేది ఎక్కువ అని చెప్పేందుకు తాజా వరద ప్రత్యక్ష సాక్ష్యం. విజయవాడలో బుడమేరు వరద ధాటికి సింగ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలు ముంపునకుగురై ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారికి అందించే సహాయ చర్యలను పర్యవేక్షించడానికంటూ చంద్రబాబు అవసరం లేకపోయినా అతిగా పర్యటనలు చేస్తున్నారు. కానీ అదంతా కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కోసమేనని అర్థమైంది. టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పెడుతున్న ఫొటోలు, వీడియోలే ఇందుకు సాక్ష్యం.
టీడీపీ అధికారిక ‘ఎక్స్’ లో 225
టీడీపీ ఫేస్‌బుక్ గ్రూపులో 245
ఐటీడీపీ ఫేస్‌బుక్‌లో 52
సీఎంఓ అధికారిక ‘ఎక్స్’లో 30
రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వాట్సప్ గ్రూపులో వందలాది ఫొటోలు, వీడియోలు పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment