
లక్నో : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.
ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు.
కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment