రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫొటోలు రికార్డు
మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం
అమెరికాలో భారతీయ డాక్టర్ ఒమెయిర్ ఎజాజ్ అరెస్టు
వాషింగ్టన్: చికిత్స కోసం వచ్చే రోగుల పట్ల అభిమానం, వాత్సల్యం ప్రదర్శిస్తూ సాంత్వన చేకూర్చాల్సిన వైద్యుడు రాక్షసంగా ప్రవర్తించాడు. తాను పనిచేసే ఆసుపత్రిలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు. కొందరు మహిళలకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ దృశ్యాలను సైతం రికార్డు చేసి, తన కంప్యూటర్‌లో భద్రపర్చాడు. ఆఖరికి సొంత ఇంట్లో కూడా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించాడంటే అతడెంత ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు. చివరికి పాపం పండడంతో కట్టుకున్న భార్యే అతడి బాగోతాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ దుర్మార్గుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతడొక భారతీయ వైద్యుడు కావడం గమనార్హం. భారతీయుడైన ఒమెయిర్ ఎజాజ్(40) స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత 2011లో వర్క్ వీసాపై అమెరికా చేరుకున్నాడు. తొలుత అలబామాలో నివసించాడు.
2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. మొదట రెండు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా పనిచేశాడు. తర్వాత ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వేర్వేరు ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్‌గా విధుల్లో చేరినప్పటి నుంచే తనలోని మరో కోణం బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. బాత్‌రూ మ్‌లు, బట్టలు మార్చుకొనే గదులు, హాస్పి టల్‌లో మహిళా రోగులు ఉండే గదుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చేవాడు. కెమె రాల్లోని దృశ్యాలను రికార్డు చేసి, ఎప్పటి కప్పుడు కంప్యూటర్‌లో భద్రపర్చేవాడు. మహిళలు, చిన్నారులే అతడి టార్గెట్. రెండేళ్ల పసిపాప వీడియోలు సైతం రికార్డు చేశాడు. అలాగే తనవద్దకు చికిత్స కోసం వచ్చే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాడు.
ఈ వ్యవహారమంతా చాలా ఏళ్లపాటు కొనసాగింది. ఇంట్లో కూడా రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసినట్లు ఒమెయిర్ ఎజాజ్ భార్య కొన్ని రోజుల క్రితమే గుర్తించింది. అందులో రికార్డయిన దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయింది. తన భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాధారాలు కూడా అందజేసింది. దీంతో ఈ నెల 8వ తేదీన ఒమెయిర్ ఎజాజ్‌ను ఓక్‌లాండ్ కౌంటీ పోలీసులు అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో సోదా చేయగా పెద్ద సంఖ్యలో ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. వాటిలో అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక హార్డ్ డిస్క్‌లో 13 వేల వీడియోలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment