సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా...
మార్చిన మహమ్మారి...
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి.
అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు.
అలా మొదలైంది...
2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది.
ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది.
ఆ్రస్టేలియా వైపుగా...
హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు.
ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని
వెల్లడించాడు.
సోషల్ మీడియాతో మరింత క్రేజ్
సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్‌బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment