Ranjit Kumar
-
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు
ఎన్నో విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న మలయాళ బిగ్‌బాస్ రియాలిటీ షో సంచలనాలను క్రియేట్ చేసింది. తొలి సీజన్ విజయవంతం కావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు రెండో సీజన్‌ను పట్టాలెక్కించారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా రెండో సీజన్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొననున్న సెలబ్రిటీలను నెటిజన్లు అప్పుడే ఫాలో అవడం మొదలుపెట్టారు. అయితే మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్ కుమార్‌ను బిగ్‌బాస్ యాజమాన్యం సెలక్ట్ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఎందుకు రంజిత్ కుమార్‌పై వ్యతిరేకత ఉందో తెలుసుకుందాం.. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు.. కాలేజీ ప్రొఫెసర్‌గా పని చేసిన రంజిత్ కుమార్ ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి విద్యార్థులు నిరసనగా సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఇలా తొలిసారిగా 2013లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రంజిత్ కుమార్ ఓ టీవీ షోలో అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్ సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. మహిళలు గెంతులు వేయకూడదు.. ఇక మరోసారి రంజిత్ మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే ఈ వివాదాస్పద వక్త ప్రాంతీయ భాషలో పలు పుస్తకాలను కూడా రచించారు. ఏదైతేనేం.. టీవీ షో కు ప్రాణవాయువు టీఆర్పీ. బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలకు టీఆర్పీ రావాలంటే వినోదం ఒక్కటే సరిపోదు. వివాదాలు, గొడవలు.. అన్నీ కలగలసి ఉండాలి. అందుకనే బిగ్‌బాస్ యాజమాన్యం రంజిత్ కుమార్‌ను ఏరికోరి తీసుకుందని స్పష్టమవుతోంది. మరి బిగ్‌బాస్ హౌస్ లోపలికి వెళ్లాక సంయమనం పాటిస్తాడో లేదా మళ్లీ నోరుజారుతారో చూడాలి! చదవండి: బిగ్‌బాస్ భామ పెళ్లికూతురాయెనే.. -
సోలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా
సాక్షి, న్యూఢిల్లీ : భారత సోలిసిటర్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజీత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచి సోలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు ఆయన స్థానంలో తుషార్ మెహతాకి కేంద్రం పదోన్నతి కల్పించింది. 2014 నుంచి అదనపు సోలిసిటర్ జనరల్‌గా పలు కీలకమైన కేసుల్లో మెహతా వాదనలు వినిపించారు. 2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన సోలిసిటర్ జనరల్‌గా కొనసాగనున్నారు. -
సర్కారీ చెక్కు బౌన్స్.. అమరవీరుడికి అవమానం!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా సాయం చేశాయి. వాళ్లను తాము ఆదుకుంటున్నామంటూ చెక్కులిచ్చి ఫొటోలు, వీడియోలు కూడా తీయించుకున్నారు. కానీ ఆ చెక్కులు వాళ్లకు ఎంతవరకు పనికొచ్చాయంటే.. అనుమానమే. ఎందుకంటే బిహార్ ప్రభుత్వం ఇలాగే ఇచ్చిన ఓ చెక్కు బౌన్స్ అయ్యింది. బిహార్‌లోని షేక్‌పురా జిల్లాకు చెందిన రంజీత్‌కుమార్ కూడా సుక్మా జిల్లాలో జరిగిన మారణహోమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మొత్తం ఆరుగురు బిహారీలో ఆ దారుణకాండలో అమరులయ్యారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. తన కోడలు సునీతాదేవి పేరు మీద ఇచ్చిన చెక్కును రంజీత్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జమ చేశారు. కానీ.. ఆ చెక్కు బౌన్స్ అయ్యిందని వాళ్లకు బ్యాంకు అధికారులు చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల అలా జరిగిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. అమరవీరుడి కుటుంబం విషయంలో ఇలా వ్యవహరించినందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. నితీష్ హయాంలో ఇలా జరగడం ఇది మొదటి సారి ఏమీ కాదని.. వాళ్ల మంత్రులు, నాయకులు సైనికుల గురించి దారుణంగా మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ టైగర్ అన్నారు. ఇప్పుడు చెక్కు బౌన్స్ అయ్యిందని, అమర సైనికుడి కుటుంబాన్ని ఆదుకోవాలే తప్ప ఇలా అవమానించకూడదని ఆయన చెప్పారు. అయితే తప్పు తమది కాదని, బ్యాంకు అధికారులదని జేడీ(యూ) నాయకులు అంటున్నారు. ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని నీరజ్ కుమార్ అనే నేత చెప్పారు. -
ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు . ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది. -
ప్రేమను చంపుకోలేక..
► తిరుపతి హోటల్ గదిలో ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య ► అబ్బాయిది వరంగల్, అమ్మాయిది ప.గో ► కలిసి బతకడం కష్టమనే నిర్ణయంతో బలవన్మరణం ఇదో విచిత్ర బంధం. పెద్దలు కలిపిన బంధం కాదు. వారికి వారే పెనవేసుకున్న అనురాగ బంధం. ప్రాంతాలు.. కులాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. దీంతో ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని కలలు కన్నారు. కానీ... అప్పటికే వివాహితులైన ఆ ఇద్దరూ సమాజానికి భయపడ్డారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలో తెలియక కలవరపడ్డారు. కలిసి బతకలేమన్న భీతితో చివరకు తనువు చాలించారు. చనిపోయేప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ... ప్రాణంగా ప్రేమించిన వాళ్లు పరాయి వాళ్లుగా మారుతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయమే వారిని మృత్యువుకు చేరువ చేసింది. వీడలేని బంధం మాదంటూ ఒకేసారి విగతజీవులయ్యారు. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలో వెలుగు చూసింది. తిరుపతి / తిరుపతి క్రైం : తిరుపతిలో ఓ ప్రేమజంట గురువా రం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం బెజవాడవారి పల్లెకి చెందిన దేవల పాపారావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె మౌనికకు మూడునెలల కిందటే దగ్గర బంధువుతో పెళ్లైంది. ఈ పెళ్లికి ముందు మౌనికకు రంజిత్‌తో పరిచయం ఉంది. వరంగల్ జిల్లా మోదుగులగూడెం మండలం పానరసకి చెందిన తేజావత్ రంజిత్ కుమార్ (31) వరంగల్ ఫారెస్టు డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందటే వివాహమై ఓ కుమార్తెను కలిగిన రంజిత్ భార్య చనిపోయింది. కాగా అడపాదడపా ఆచం ట నుంచి బంధువులున్న వరంగల్‌కు రాకపోకలు సాగించే క్రమంలో మౌనికకు రంజిత్‌తో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే వివాహమై కుమార్తెను కలిగి ఉన్న రంజిత్‌తో వివాహం కష్టమని నిర్ణయించుకున్న మౌనిక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెద్దలు చేసిన పెళ్లికి తలొంచింది. అయితే మనసులోని రంజిత్‌ను మాత్రం మర్చిపోలేకపోయింది. జనవరి 22న ఇంటి నుంచి పారిపోయింది. అదే నెల 29వతేదీ వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు గాలించినా కనబడకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు మిస్సింగ్ కేసు నమో దు చేశారు. అనంతరం వీరిరువురూ ఈనెల 13న తిరుపతికి చేరుకుని ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రముఖ హోటల్లో భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి తిరుమల, తిరుపతిలోని దేవాలయాలను సందర్శించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రూమ్‌ను శుభ్రపరిచేందుకు రూమ్‌బాయ్ కాలింగ్ బెల్ వేశాడు. ఎంతసేపటికీ డోర్ తీయక పోవడంతో హోటల్ మేనేజర్‌కు సమాచారం అందించగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈస్టు సీఐ రాంకిషోర్, ఎస్ఐ ఘటనా స్థలం చేరుకుని గది డోర్‌ను పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వీరిద్దరు ఒకే ఫ్యాన్‌కు ఒకరు వైరుతో, మరొకరు చున్నీతో ఉరివేసుకున్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ఇరువురి ఆచూకీ తెలుసుకుని పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ
ఇచ్చోడ : ఎంతోమంది విద్యార్ధుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాగే రంజిత్‌కుమార్ అన్నారు. ఆదివారం ఇచ్చోడ మండల కేంద్రంలోని సారుుబాబా మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రభుత్వ ప్రాధన్యతా పథకాలలో లేదనడం ప్రభుత్వనికి సిగ్గు చేటన్నారు. ఫిజు రీరుుంబర్స్‌మెంట్ లేకపోవడంతో ఎంతోమంది విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడిందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. వెంటనే ఫీజు రీరుుంబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రాంభించలేదని ఆరోపించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేయక పోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల సంఘటన కార్యదర్శులు నంది మల్ల రాజేశ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మనోప్పవార్, కొకన్వీనర్ వెంకటేశ్, ఇచ్చోడ , నిర్మల్ , ఖానపూర్ బాగ్ కన్వీనరులు రాజేశ్వర్, ప్రమోద్, బాపురావు , ఆదిలాబాద్, నిర్మల్ నగర కార్యదర్శులు ప్రశాంత్, కూమార్ కార్యకర్తలుపాల్గోన్నారు. -
ఎన్‌జేఏసీ పోతే.. కొలీజియం రాదు!
సుప్రీం ముందు కేంద్రం వాదన న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ.. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్‌జేఏసీ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా.. ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత 99వ రాజ్యాంగ సవరణను తాము కొట్టివేస్తే, కొలీజియం మళ్లీ అమల్లోకి వస్తుందంటూ గత శుక్రవారం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై కేంద్రం సోమవారం పై విధంగా స్పందించింది. కేంద్రం తరఫున అనుబంధ వాదనలు వినిపించేందుకు వచ్చిన సొలిసిటర్ జనరల్(ఎస్జీ) రంజిత్ కుమార్.. జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు వాదిస్తూ.. ‘కొత్తగా తీసుకువచ్చిన ప్రత్యామ్నాయ వ్యవస్థ(ఎన్‌జేఏసీ)ను రద్దు చేసినంత మాత్రాన రద్దై పోయిన పాత వ్యవస్థ(కొలీజియం) మళ్లీ అమల్లోకి వస్తుందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎన్‌జేఏసీకి పార్లమెంట్ ఆమోదం పొందిన రోజే కొలీజియానికి సంబంధించిన శాసనం రద్దై పోయింది’ అని చెప్పారు. దాంతో, ఆయనపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మేం కొట్టేశాక.. మరో రాజ్యాంగ సవరణ తోనే మళ్లీ చట్టం చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుందనే కారణంతో మేం దాన్ని కొట్టేస్తే.. గత వ్యవస్థ మళ్లీ ఎందుకు అమల్లోకి రాదు?’ అని ప్రశ్నించింది.అధికరణ 32, 226ల ద్వారా రాజ్యాంగం కోర్టుకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం తీసేసుకోలేదని పేర్కొంది. అది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనంది. ఎస్జీ స్పందిస్తూ.. ‘ఎన్‌జేఏసీ రద్దు తీర్పు రాజ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం అవుతుంది. పార్లమెంట్‌కున్న చట్టాలు చేసే అధికారాన్ని కోర్టు ప్రశ్నించలేదు. కోర్టు నిర్ణయంతో చట్టపర శూన్యత వస్తే పార్లమెంటు మళ్లీ రంగంలోకి వస్తుంది’ అని అన్నారు. దానికి.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్ రాజ్యాంగ అధికరణ 368 ఇవ్వలేదని బెంచ్ తేల్చి చెప్పింది. ‘అయినా, ఎన్‌జేఏసీని రద్దు చేస్తామని మీరెందుకు అనుకుంటున్నారు?’ అంటూ వాతావరణాన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించింది. -
తాళమేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ: ఇద్దరి అరెస్టు
గచ్చిబౌలి (హైదరాబాద్): తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ క్రైం డీసీపీ బి.నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ నివాసి కట్టెల అనూప్ కుమార్ అలియాస్ నితీష్ అలియాస్ రాజు అలియాస్ టింకు(24) ఎనిమిదేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయటం ఇతని నైజం. గత ఏడాది జూలైలో చర్లపల్లి జైలు నుంచి విడుదలై ఉప్పుగూడా రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే నల్ల రంజిత్ కుమార్ (24) తో జతకట్టి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సరూర్ నగర్ సీసీఎస్ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు. ఇద్దరూ కలసి అమీర్‌పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, సైదాబాద్, మలక్ పేట పోలీస్స్టేషన్ల పరిధిలో పగటి పూట రెక్కీ వేసి, రాత్రి వేళల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. ఎల్బీ నగర్ పీఎస్ పరిధిలో ఐ20 కారు, సరూర్‌నగర్, బేగంపేట పీఎస్ పరిధిలో బైక్‌లను కూడా ఎత్తుకెళ్లారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.20 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డీవీడీ ప్లేయర్లు, ఎల్సీడీ టీవీ, డిజిటల్ కెమెరా, హోం థియేటర్, మోటోజీ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా అనూప్ కుమార్ ఎనిమిదేళ్ల 34 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ తెలిపారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లున్నా తప్పించుకు తిరుగుతూ మకాంను ఉప్పుగూడలోని శివాజీనగర్‌కు మార్చాడని వెల్లడించారు. -
ఆధార్‌ను కొనసాగిస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో తీసుకువచ్చిన ఆధార్ పథకాన్ని తామూ కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ శుక్రవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తూ, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పథకం రాజ్యాంగ బద్ధతను పరిశీలించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. -
సొలిసిటర్ జనరల్‌గా రంజిత్ కుమార్
ఆరుగురు అదనపు ఎస్‌జీల నియామకం న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నూతన సొలిసిటర్ జనరల్(ఎస్జీ)గా ప్రభుత్వం నియమించింది. రంజిత్‌కుమార్‌ను ఎస్జీగా నియమిస్తూ శనివారం న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు మనిందర్ సింగ్, తుషార్ మెహతా, ఎల్ నాగేశ్వరరావు, పీఎస్ పత్వాలియా, నీరజ్ కిషన్ కౌల్, పీఎస్ నరసింహలను అదనపు సొలిసిటర్ జనరల్ పదవుల్లో నియమించింది. వీరి నియామకాలను జూన్ 4వ తేదీనే కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు సహా పలు కేసుల్లో గుజరాత్ తరఫున సుప్రీంకోర్టులో రంజిత్‌కుమార్ వాదించారు. ఇటీవల సంచలనం సృష్టించిన ‘స్నూప్‌గేట్’ కేసులో గూఢచర్యానికి గురైన మహిళ కుటుంబం తరఫున కూడా రంజిత్ సుప్రీంకోర్టులో వాదించారు. ఒక మహిళపై గుజరాత్ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడిందని, అందులో ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హస్తం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే ‘స్నూప్‌గేట్’గా ప్రఖ్యాతిగాంచింది.అయితే, కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ నియామకంపై ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ పదవికి తన సమ్మతిని తెలియజేసినట్లు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఇటీవలే వెల్లడించారు.