సుప్రీం ముందు కేంద్రం వాదన
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ.. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్‌జేఏసీ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా.. ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత 99వ రాజ్యాంగ సవరణను తాము కొట్టివేస్తే, కొలీజియం మళ్లీ అమల్లోకి వస్తుందంటూ గత శుక్రవారం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై కేంద్రం సోమవారం పై విధంగా స్పందించింది.
కేంద్రం తరఫున అనుబంధ వాదనలు వినిపించేందుకు వచ్చిన సొలిసిటర్ జనరల్(ఎస్జీ) రంజిత్ కుమార్.. జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు వాదిస్తూ.. ‘కొత్తగా తీసుకువచ్చిన ప్రత్యామ్నాయ వ్యవస్థ(ఎన్‌జేఏసీ)ను రద్దు చేసినంత మాత్రాన రద్దై పోయిన పాత వ్యవస్థ(కొలీజియం) మళ్లీ అమల్లోకి వస్తుందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎన్‌జేఏసీకి పార్లమెంట్ ఆమోదం పొందిన రోజే కొలీజియానికి సంబంధించిన శాసనం రద్దై పోయింది’ అని చెప్పారు. దాంతో, ఆయనపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
‘మేం కొట్టేశాక.. మరో రాజ్యాంగ సవరణ తోనే మళ్లీ చట్టం చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుందనే కారణంతో మేం దాన్ని కొట్టేస్తే.. గత వ్యవస్థ మళ్లీ ఎందుకు అమల్లోకి రాదు?’ అని ప్రశ్నించింది.అధికరణ 32, 226ల ద్వారా రాజ్యాంగం కోర్టుకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం తీసేసుకోలేదని పేర్కొంది. అది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనంది. ఎస్జీ స్పందిస్తూ.. ‘ఎన్‌జేఏసీ రద్దు తీర్పు రాజ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం అవుతుంది.
పార్లమెంట్‌కున్న చట్టాలు చేసే అధికారాన్ని కోర్టు ప్రశ్నించలేదు. కోర్టు నిర్ణయంతో చట్టపర శూన్యత వస్తే పార్లమెంటు మళ్లీ రంగంలోకి వస్తుంది’ అని అన్నారు. దానికి.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్ రాజ్యాంగ అధికరణ 368 ఇవ్వలేదని బెంచ్ తేల్చి చెప్పింది. ‘అయినా, ఎన్‌జేఏసీని రద్దు చేస్తామని మీరెందుకు అనుకుంటున్నారు?’ అంటూ వాతావరణాన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించింది.
ఎన్‌జేఏసీ పోతే.. కొలీజియం రాదు!
Published Tue, Jun 16 2015 12:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement