NJAC
-
సీజేఐ సమక్షంలో.. ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. ఎన్‌జేఏసీ సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే.. అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీం కోర్టు దానిని రద్దు చేసింది. ఇలాంటి ఉదాహరణ ప్రపంచానికి తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారాయన. రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకించిన ఆయన.. చట్టం పరిధిలో ముఖ్యమైన ప్రశ్న ఇమిడి ఉన్నప్పుడు, సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. అయితే.. నిబంధనను రద్దు చేయవచ్చని ఎక్కడా చెప్పలేదు అంటూ పేర్కొన్నారాయన. ఆ సమయంలో రాజ్యాంగ పీఠికను సైతం ప్రస్తావించారు. ఎన్‌జేఏసీ చట్టం.. లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వోటింగ్ ద్వారా ఆమోదం పొందిందని ధన్కర్ గుర్తు చేశారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టంతో వ్యవహరించింది. రికార్డు విషయంగా మొత్తం లోక్‌సభ ఏకగ్రీవంగా ఓటు వేసింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మేధావులను, న్యాయవేత్తలను కోరేది ఒక్కటే. దయచేసి.. రాజ్యాంగ నిబంధనను రద్దు చేయగల ఈ ప్రపంచంలో.. ఒక సమాంతరాన్ని కనుగొనండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దానిని కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన ఉప రాష్ట్రపతి ధన్కర్ దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కూడా. -
ఎన్జీటీ చైర్మన్‌గా జస్టిస్ గోయల్
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్ పదవిలో గోయల్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ పదవీవిరమణ చేయగానే ఆయన్ను ప్రభుత్వం ఎన్జీటీ చైర్మన్‌గా నియమించింది. ట్రిపుల్ తలాక్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) ఏర్పాటు సహా పలు కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గోయల్ చరిత్రాత్మక తీర్పులిచ్చారు. గతేడాది డిసెంబర్లో జస్టిస్ స్వతంతర్ కుమార్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఎన్జీటీకి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించలేదు. పర్యావరణంతో పాటు అడవులు, సహజవనరుల పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ద్వారా 2010, అక్టోబర్ 18న ఎన్జీటీని ఏర్పాటుచేశారు. ఎన్జీటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. మదిలో ఎమర్జెన్సీ కదలాడింది! పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు సభలో జస్టిస్ గోయల్ మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ సందర్భంగా ప్రాథమిక హక్కుల్ని రద్దుచేశారు. దీంతో పోలీసులు, అధికారులకు ఎలాంటి సమీక్ష లేకుండా అపరిమిత అధికారాలు లభించాయి. కానీ అలాంటి వాతావరణంలో కూడా కోర్టులు ప్రజలకు న్యాయం అందించేందుకు కట్టుబడ్డాయి. ఎమర్జెన్సీ కారణంగానే ఓ అమాయకుడ్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కోర్టులు వెంటనే బాధితులకు బెయిల్‌ను మంజూరు చేశాయి. ఎస్సీ,ఎస్టీ చట్టం దుర్వినియోగం కేసులో తీర్పు రాసేటప్పుడు ఇవన్నీ నా మదిలో కదలాడాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
‘ఎంఓపీ’పై సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) ఖరారులో జరుగుతున్న ఆలస్యంపై ఇద్దరు జడ్జీల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ఇలాంటి వాటిపై న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకోకూడదని, జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) కేసులోనే రాజ్యంగ ధర్మాసనం ఇందుకు సంబంధించిన చట్టానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఎంఓపీ అంశాన్ని న్యాయ వ్యవస్థ తరఫు నుంచి పరిశీలిస్తామని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 27న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జస్టిస్ ఖేహర్‌కు ‘ఎన్ జేఏసీ’ అడ్డుకాదు: సుప్రీం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖేహర్ నియామకాన్ని అడ్డుకునేందుకు ఎన్ జేఏసీ తీర్పును సాకుగా చూపడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘ఎన్ జేఏసీ తీర్పు’లో జస్టిస్ ఖేహర్ కీలక పాత్ర పోషించినందున సీజేఐగా ఆయన నియామకం చెల్లదంటూ పలువురు లాయర్లు వేసిన పిటిషన్ ను జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేసింది. నాడు తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఖేహర్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అందులో నలుగురు ఎన్ జేఏసీకి వ్యతిరేకించగా, ఒక జడ్జి ఎన్ జేఏసీకి మద్దతిచ్చినట్లు పేర్కొంది. -
అరుణ్ జైట్లీపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు దేశద్రోహం అభియోగాలు మోపింది. జైట్లీ విమర్శలను సుమోటోగా స్వీకరించిన ఝాన్సీ జిల్లాలోని మహోబా సివిల్ కోర్టు న్యాయమూర్తి అంకిత్ జియోల్ ఆయనకు సమన్లు జారీచేశారు. నవంబర్ 19న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. గ్యాంగ్‌రేప్ విషయంలో చాలాసందర్భాల్లో అసలు కన్నా కల్పితమైన ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌కు కూడా న్యాయమూర్తి జియోల్ సమన్లు జారీచేశారు. ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తుల నియంతృత్వాన్ని భారత ప్రజస్వామ్యం అంగీకరించబోదని అరుణ్ జైట్లీ తన బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, భారత శిక్షాస్మృతి ప్రకారం 124ఏ సెక్షన్ దేశద్రోహం, సెక్షన్ 505 బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలు మోపారు. ఆయన వ్యాఖ్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమవ్వడంతో సెక్షన్ 190 ప్రకారం సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. -
కొలీజియం పారదర్శకత ఎంత?: కేంద్రం
న్యూఢిల్లీ: ఎన్‌జేఏసీని సుప్రీం కోర్టు కొట్టేయటంపై కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొలీజియం పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేసింది. కొలీజియం పనితీరు సరిగా లేనందునే కొత్త చట్టాన్ని రూపొంచిందించామని.. న్యాయవస్థ గౌరవం ఏమాత్రం తగ్గకుండా కొత్త బిల్లును రూపొందించినా.. దీన్ని తిరస్కరించటం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నవంబర్ 3 తర్వాత కొలీజియం వ్యవస్థలో మార్పులకు సంబంధించిన వాదనలు వింటామని కోర్టు చెప్పటం.. వ్యవస్థలో తప్పులను ఒప్పుకున్నట్లేనన్నారు. సుప్రీం తీర్పు భారతదేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించేలా ఉందని న్యాయ మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. తీర్పు ఆశ్చర్యం కలిగించిందని మరో మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. అయితే.. కొలీజియం వ్యవస్థపై అనుమానాలున్నందునే పార్లమెంటులో ఎన్‌జేఏసీకి మద్దతు తెలిపామన్నారు. కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీ ఏర్పాటు అవసరమని వామపక్షాలు అన్నాయి. పాత వ్యవస్థ పనితీరుపై అనుమానాలున్నందునే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తెలిపారు. కింకర్తవ్యం! న్యూఢిల్లీ: సుప్రీం తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యచరణ ఎలా ఉండాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి కీలకమైన ఈ చట్టంపై అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి. కొలీజియాన్ని మెరుగుపర్చేందుకు తదుపరి విచారణ కొనసాగించాలని సుప్రీం నిర్ణయించడంతో..ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వవాదనను మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కొలీజియాన్ని కొనసాగిస్తూనే, న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతినకుండా దాన్ని మెరుగుపర్చేందుకు కొన్ని మార్పులను సూచించే అవకాశం ఉంది. -
ఎన్‌జేఏసీ చెల్లదు
అది రాజ్యాంగవిరుద్ధం; ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం: సుప్రీం రాజ్యాంగ మౌలిక స్వరూపానికది విరుద్ధం * ఆ చట్టంతో రాజ్యాంగంలోని అధికార విభజన నిబంధనల ఉల్లంఘన * మళ్లీ అమల్లోకి కొలీజియం; కోర్టు సంచలన తీర్పు * ఎన్‌జేఏసీని సమర్థించిన జస్టిస్ చలమేశ్వర్.. కానీ, మెజారిటీకే మొగ్గు.. * విచారణను విస్తృత బెంచ్‌కి నివేదించాలన్న కేంద్రం అభ్యర్థన తిరస్కరణ న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ న్యాయ నియామకాల సంస్థ(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్-ఎన్‌జేఏసీ) చెల్లనేరదంటూ శుక్రవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2014లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన ఎన్‌జేఏసీ చట్టం, సంబంధిత 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేసింది. ‘రాజ్యాంగ(99వ సవరణ) చట్టం-2014 రాజ్యాంగ విరుద్ధం. అది చెల్లనేరదు. అలాగే, ఎన్‌జేఏసీ కూడా రాజ్యాంగ విరుద్ధమని, చెల్లనేరదని ప్రకటిస్తున్నాం. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి ఈ చట్టాల కన్నాముందు నాటి వ్యవస్థ(కొలీజియం)నే అమల్లో ఉంటుంది’ అని తీర్పునిచ్చింది. విచారణను మరింత విస్తృత ధర్మాసనం మందుకు తీసుకువెళ్లాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన 99వ రాజ్యాంగ సవరణ చట్టం, తదనుగుణంగా వచ్చిన ఎన్‌జేఏసీ చట్టం.. ఈ రెండూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నాయంటూ వాటి రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం ధర్మాసనం పై తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య పోరు మరో ఆసక్తికర మలుపు తీసుకుంది. తీర్పుపై రాజకీయ, న్యాయ, ప్రభుత్వ రంగాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ఈ తీర్పు తనను విస్మయానికి గురిచేసిందన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ.. దీనిపై ప్రధాని మోదీ, ఇతర కేబినెట్ సహచరులతో చర్చించిన అనంతరం ప్రభుత్వపరంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. కొలీజియం అనేది అసలు రాజ్యాంగంలో లేనేలేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు. ఎన్‌జేఏసీ చట్టాన్ని రద్దు చేస్తూ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ 1,030 పేజీలతో తుది తీర్పునిచ్చింది. జస్టిస్ చలమేశ్వర్ మాత్రం మిగతా నలుగురితో విభేదించి, 99వ సవరణ చట్టబద్ధతను సమర్థించారు. కానీ మెజారిటీ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంచ్ తుది తీర్పుకు కట్టుబడి ఉన్నారు. ఈ అంశాన్ని 9 లేక 11 మంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను, గతంలో వచ్చిన ‘రెండో జడ్జీల కేసు(1993), మూడో జడ్జీల కేసు(1998)’లను పునః సమీక్షించాలన్న అభ్యర్థనను కూడా బెంచ్ తిరస్కరించింది. కొలీజియాన్ని మరింత మెరుగుపర్చే సూచనలు స్వీకరించేందుకు ఉద్దేశించిన విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.కొలీజియాన్ని సమర్థంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని, సీనియర్ లాయర్లను జస్టిస్ ఖేహర్ కోరారు. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖులకు స్థానం కల్పించడం రాజ్యాంగవిరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపానికే అది వ్యతిరేకమని ఆయన తీర్పులో పేర్కొన్నారు. ‘జడ్జీల నియామక అధికారాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వానికి అప్పజెప్పడం ప్రమాదకరమని రాజ్యాంగ పరిషత్‌లో అంబేద్కర్ చేసిన హెచ్చరికను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 124, 217 అధికరణాల్లో పేర్కొన్న ‘సంప్రదింపులు’ అనే పదం కార్యానిర్వాహక వర్గ అధికారాల కుదింపునకు ఉద్దేశించినదేనని వివరించారు. తమకున్న వీటో అధికారంతో, ఎలాంటి కారణం చూపకుండానే ఆ ఇద్దరిలో ఎవరైనా నియామక ప్రక్రియను అడ్డుకునే అవకాశముందని జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అది ఎలాంటి జవాబుదారీతనం లేని అధికారం’ అని వ్యాఖ్యానించారు. ఖేహర్ భావోద్వేగం.. తీర్పు వెలువరించేముందు జస్టిస్ ఖేహర్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేసు విచారణలో సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ ఐదుగురు సభ్యుల బెంచ్‌లో భాగం పంచుకోవాలన్న నిర్ణయం హృదయంతో కాదు.. ఆలోచనతో తీసుకున్నది. అది నేను నా సొంత నిర్ణయం’ అన్నారు. గతంలో అమల్లో ఉన్న కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందువల్ల, ఎన్‌జేఏసీ అమల్లోకి వస్తే అందులోనూ భాగం పంచుకునే అవకాశమున్నందువల్ల ఈ విచారణలో పాలుపంచుకోకూడదన్న విషయంపై ఖేహర్ స్పందించారు. ఖాళీలే... ఖాళీలు ఎన్‌జేఏసీ ద్వారా నియామకాలు చేపట్టొద్దని ఈ ఏడాది ఏప్రిల్ 23న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఆరునెలలుగా కొత్త జడ్జీ నియామకాల్లేవు. రిటైరయ్యే వారు మాత్రం రిటైరైపోయారు. దాంతో వివిధ హైకోర్టుల్లో ఖాళీలు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర న్యాయశాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నాటికి ఉన్న ఖాళీలివి... సుప్రీంకోర్టు 3 హైకోర్టులు 406 చక్రవర్తుల్లా అధికారమిస్తోంది ‘‘ఎన్‌జేఏసీలో నియమితులయ్యే ఇద్దరు ప్రముఖులకు వీటో అధికారాన్ని కల్పించడం... వారికి చక్రవర్తుల్లా అపరిమిత అధికారాలను కట్టబెట్టడమే. ప్రజాజీవితంలో ఏ రంగంలో నుంచి వచ్చిన ప్రముఖులతోనైనా సంప్రదింపులు జరపడానికి అభ్యంతరమేమీ లేదు. అయితే జడ్జీల నియామకాలకు సంబంధించి... రాష్ట్రపతి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలను కూడా వారు వీటో చేయగలరనేదే మింగుడుపడటం లేదు. అపరిమిత అధికారాలను ఎన్‌జేఏసీ చట్టం వీరికి కట్టబెడుతోంది. పైగా ఎలాంటి జవాబుదారీతనం లేకుండా. ఏదైనా నియామకాన్ని వీటో ద్వారా అడ్డుకున్నపుడు... దానికి వీరు కారణం కూడా చెప్పనక్కర్లేదు (ఎన్జేఏసీలోని ఆరుగురు సభ్యుల్లో ఏ ఇద్దరు వీటో చేసినా నియామకం ఆగిపోతుంది). నామినేట్ అయ్యే ప్రముఖ వ్యక్తులను కూడా కొన్ని వర్గాల నుంచే ఎంపిక చేయాలని పరిమితం చేయడం సబబు కాదు. అయితే ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి దానిపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేం. అయితే పునరాలోచన చేయాలని మాత్రం చెప్పగలం’’ - సుప్రీం ధర్మాసనం కొలీజియం పారదర్శకమే: జస్టిస్ ఖేహర్ ‘‘కొలీజియంలో రహస్యం ఏమీ లేదు. అంతా పారదర్శకంగానే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వర్గం మధ్య సంప్రదింపులు బహిరంగంగానే జరుగుతాయి. నియామకాలకు సంబంధించి ఇరువర్గాల మధ్య సౌహార్ద్రత ఉంది. ఎన్‌జేఏసీలో న్యాయవ్యవస్థకు సరైన ప్రాతినిధ్యం లేదు. అది న్యాయవ్యవస్థ సర్వోత్కృష్టతను నిలబెట్టేలా లేదు. ఇది జ్యుడీషియరీ స్వతంత్రతకు వ్యతిరేకమే. కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఎన్‌జేఏసీలో సభ్యుడిగా చేర్చడం రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల విభజన నిబంధనలను ఉల్లంఘించడమే. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖులకు స్థానం కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. రాజ్యాంగంలో చేర్చిన 124(ఏ) అధికరణలో అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి’’ ప్రాథమిక బాధ్యతకే ఎసరు: జస్టిస్ గోయెల్ భారత రాజ్యాంగం ప్రకారం జడ్జిల నియామక బాధ్యత న్యాయవ్యవస్థది. దీనికి 99వ రాజ్యాంగ సవరణ ఎసరు తెస్తోంది కనుక ఇది చెల్లదు. ఎన్‌జేఏసీ ఏర్పాటుకు భూమిక అయిన 99వ రాజ్యాంగ సవరణే చెల్లనపుడు, ఎన్‌జేఏసీ చట్టం రాజ్యాంగబద్ధతను సమీక్షించాల్సిన అవసరం ఉందని నేననుకోవడం లేదు. న్యాయ మంత్రికి సీజేఐతో సమానపాత్ర కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటిదెప్పుడూ లేదు. జడ్జిల నియామక ప్రక్రియ ప్రారంభం నుంచి, ఉత్తర్వులు ఇచ్చే దాకా న్యాయమంత్రి పాత్ర పరిమితంగానే ఉండేది. న్యాయమంత్రి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులు జడ్జిల నియామకాలను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతారు. అలాంటపుడు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం పడుతుంది. రాష్ట్రపతిని డమ్మీని చేస్తుంది: జస్టిస్ లోకుర్ జడ్జీల నియామకాల్లో రాష్ట్రపతి పాత్రను ఎన్‌జేఏసీ నామమాత్రం చేస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగమిచ్చిన ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఎన్‌జేఏసీలో ఆరుగురు సభ్యుల్లో ఒకరిగా సీజే మారిపోతారు. రాష్ట్రపతి సీజేల మధ్య ప్రత్యక్ష సంప్రదింపులు ఉండవు. ఎన్‌జేఏసీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత సంక్షోభంలో పడుతుంది. ఎంపిక ప్రక్రియలో సీజేఐ ప్రాధాన్యత తగ్గిపోతుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి 99వ రాజ్యాంగ సవరణ చెల్లదు. కొలీజియం వ్యవస్థను మరింత మెరుగ్గా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి తదుపరి విచారణ జరగాలి. కొలీజియం మెరుగవ్వాలి: జస్టిస్ జోసెఫ్ కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. నమ్మకం సడలడం వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇది మెరుగుపడాలి. అర్హులైన వారిపై శీతకన్ను వేశారని, ఎవరి ప్రయోజనాల కోసమే... మరొకరి నియామకాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరోగ్యకరమైన వ్యవస్థ అయితే లేదు. అందువల్ల దీన్ని మెరుగుపర్చడానికి తదుపరి విచారణ అవసరం. 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగవిరుద్ధం. దీని ద్వారా ఏర్పడిన ఎన్‌జేఏసీ చట్టపరంగా ఉనికిలో లేదు. ఇంకా పుట్టని బిడ్డ జాతాకాన్ని రాయడమెందుకు. పారదర్శకత లేదు: జస్టిస్ చలమేశ్వర్ ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు. ఆ ప్రక్రియలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రాజ్యాంగబద్ధ పాలనలో పారదర్శకత అత్యంతావశ్యక అంశం. న్యాయమూర్తుల నియామకమనేది న్యాయవ్యవస్థకున్న విశేష అధికారం అని, అది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని ఉన్న భావన పూర్తిగా తప్పు. గత 20 ఏళ్లుగా హైకోర్టు కొలిజియాలు ఇచ్చిన అనేక సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది. ఇందులో జవాబుదారీతనం లేదు. దీనివల్ల జ్యుడీషియరీ విశ్వసనీయత దెబ్బతింటుంది. జడ్జీల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం పాలు పంచుకోవడం మంచిదే. అది ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. ఈ కారణాల వల్ల 99 వ రాజ్యాంగ సవరణను నేను సమర్ధిస్తున్నాను. అయితే, మెజారిటీ జడ్జీల నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పును ఆమోదిస్తున్నాను. 99వ రాజ్యాంగ సవరణే అక్రమమని తేల్చిన తరువాత.. దాని పర్యవసానంగా ఉద్భవించిన ఎన్‌జేఏసీ చట్టం రాజ్యాంగబద్ధతపై చర్చించడం శుద్ధ దండుగ. ఇంకాపుట్టని పాపాయికి జాతక చక్రం రాయడమెందుకు?’’ కొలీజియం అంటే.. * రెండో జడ్జీల కేసు, మూడో జడ్జీల కేసుల పర్యవసానంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి 1993లో కొలీజియం అమల్లోకి వచ్చింది. * కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), సుప్రీం కోర్టులోని నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు స్థాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జీలు ఉంటారు. కొలీజియంపై అభ్యంతరాలు.. * ఇది జడ్జీలే జడ్జీలను నియమించే విధానం. నియామకాల్లో పూర్తిగా న్యాయవ్యవస్థదే అధికారం. నియామకం, బదిలీల్లో పారదర్శకత లేదు. * సమర్థత కన్నా వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్ద పీట. అవినీతికి, అవకతవకలకు ఆస్కారం. ఎన్‌జేఏసీ అంటే.. * 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నత న్యాయవ్యవస్థలోని నియామకాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత పెరిగేలా ఎన్‌జేఏసీని ముందుకు తెచ్చింది. * ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు సీజేఐ చైర్మన్‌గా ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి(ఎక్స్ అఫీషియొ), ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆ ఇద్దరు ప్రముఖులను సీజేఐ, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఇవీ ఎన్‌జేఏసీపై అభ్యంతరాలు.. * న్యాయవ్యవస్థ ప్రాధాన్యతను, స్వతంత్రతను తగ్గించేలా ఉంది. * కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉండటం వల్ల ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది. * ఇద్దరు ప్రముఖులకు న్యాయపరమైన అవగాహన లేనట్లయితే, నియామకాల్లో వారు పోషించే పాత్ర ఏమిటి? -
రెండు వ్యవస్థల ఢీ
న్యాయమూర్తుల నియామకాలకు అనుసరించాల్సిన విధానంపై కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం పతాక స్థాయికి చేరింది. నియామకాల ప్రక్రియపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 99వ రాజ్యాంగ సవరణ, దానికి అనుగుణంగా చేసిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం చెల్లబోవని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం మెజారిటీ తీర్పులో తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు సభ్యులుగా ఉండే కొలీజియం వ్యవస్థే ఇకముందు కూడా న్యాయమూర్తుల నియామకం వ్యవహారాలను చూస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే చర్యలుగా పరిగణించడంవల్లనే రాజ్యాంగ సవరణనూ, కొత్త చట్టాన్ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సైతం తోసిపుచ్చింది. ఈ తీర్పు పర్యవసానంగా కార్యనిర్వాహక వ్యవస్థ-న్యాయ వ్యవస్థల మధ్య హోరాహోరీ పోరాటానికి తెరలేచింది. పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన...20 రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీలు ఆమోదించిన రాజ్యాంగ సవరణ, చట్టం చెల్లవని చెప్పడం ప్రజల సమష్టి మనోగతాన్ని నిరాకరించడమేనని కొందరంటుంటే...కార్యనిర్వాహక వ్యవస్థ చేసే ఎలాంటి చట్టాలైనా, రాజ్యాంగ సవరణలైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని మరికొందరి వాదన. తన స్వతంత్రతకు ప్రాణ ధాతువుగా భావిస్తున్న న్యాయమూర్తుల నియామకం అధికారాన్ని తననుంచి తొలగించి కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యం ఉండే కమిటీకి అప్పజెప్పడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమే అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ పనితీరుకు సంబంధించి వచ్చే నెల 3న విచారణ జరుపుతామని చెప్పింది. మిగిలిన వ్యవస్థలతో పోలిస్తే మన దేశంలో న్యాయవ్యవస్థకు విశ్వసనీయత ఎక్కువన్న సంగతి కాదనలేని సత్యం. అంతమాత్రాన అక్కడంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. న్యాయ వ్యవస్థలో నెలకొన్న అవినీతిపైనా, దిగజారుతున్న ప్రమాణాలపైనా, కొలీజియం వ్యవస్థలోని లోటుపాట్లపైనా బయటివారికంటే లోపలివారే ఎక్కువ మాట్లాడారు. న్యాయమూర్తుల్లో అవినీతిపరులున్నారని జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య , మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పలు సందర్భాల్లో అన్నారు. నిజానికి జస్టిస్ వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనమే 1993లో కొలీజియం వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసింది. చివరకు ఆ వ్యవస్థ పనితీరును గమనించాక తీవ్ర అసంతృప్తికి లోనై దాన్ని తక్షణం రద్దు చేయాల్సి ఉన్నదన్నారు. నిజానికి కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి రావడానికి కార్యనిర్వాహక వ్యవస్థ వైపుగా జరిగిన తప్పిదాలే కారణం. 70వ దశకంలో సాగిన నియామకాలు న్యాయవ్యవస్థను ఉత్సవ విగ్రహంగా మార్చాయి. జడ్జీల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని రాజ్యాంగంలోని 124(2) అధికరణ చెబుతోంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని లేదని...తగిన కారణాలు చూపి దాన్ని నిరాకరించవచ్చునని 1981లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చాక ‘రాజకీయ నియామకాలు’ మరింతగా జోరందుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని పూర్తిగా బేఖాతరు చేశారు. కనుకనే 1993లో జస్టిస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం కొలీజియంతో దీనికి అడ్డుకట్ట వేయాల్సివచ్చింది. అయితే కొలీజియం సైతం తన పాత్రను సరిగా పోషించలేకపోయిందని పలు సందర్భాలు రుజువు చేశాయి. ఎవర్ని ఎందుకు నియమించారో, అందుకనుసరించిన ప్రమాణాలేమిటో తెలియని స్థితి ఏర్పడింది. ఒకసారి నియామకం పూర్తయ్యాక వారిపై ఎలాంటి ఆరోపణలొచ్చినా, వారి ప్రవర్తన ఎలా ఉన్నా, ప్రశ్నార్థకమైన తీర్పులు వెలువరించినా న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. కొలీజియం ఎంపిక చేసినవారిలో మహిళా న్యాయమూర్తులు, అణగారిన వర్గాలవారూ తక్కువగా ఉండటం కొట్టొచ్చినట్టు కనబడే ప్రధాన లోపం. వీటన్నిటినీ జస్టిస్ జేఎస్ వర్మ అనేకసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు కొలీజియం వ్యవస్థపై విచారణ చేపడతానంటున్న సుప్రీంకోర్టు ఇన్ని దశాబ్దాలుగా ఆ విషయంలో ఎందుకు విఫలమైందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొత్తానికి రెండు వ్యవస్థలూ లోపరహితమైనవి కాదని అనేక అనుభవాలు రుజువు చేశాయి. రెండింటిలోనూ పారదర్శకత లేనందువల్లనే సమస్యలు తలెత్తాయి. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌జేఏసీ దీన్ని సరిచేసిందా? ఆ కమిషన్ సభ్యుల అమరిక చూస్తే ప్రభుత్వానిదే పైచేయిగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. కమిషన్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ముగ్గురు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు ‘ప్రముఖ’ వ్యక్తులు ఉంటారని చట్టం చెబుతోంది. ఇద్దరు ‘ప్రముఖుల్ని’ ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే ప్యానల్ ఎంపిక చేస్తుంది. అలాగే కమిషన్‌లోని ఏ ఇద్దరు కాదన్నా నియామకం నిలిచిపోతుంది. ఇన్ని చెప్పిన చట్టం పారదర్శకత గురించి మాట్లాడలేదు. అసలు ‘ప్రముఖులు’ అన్నదానికి నిర్వచనమే లేదు. కనుక న్యాయమూర్తుల నియామకాల్లో మరోసారి కార్యనిర్వాహక వ్యవస్థ ప్రమేయం పెరగదన్న గ్యారెంటీ ఏమిటి? సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఒక అయోమయ స్థితి నెలకొంది. వివిధ హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ జరగాల్సిన 400కు పైగా నియామకాలు అనిశ్చితిలో పడ్డాయి. రాజ్యాంగ సవరణ, ఎన్‌జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి గతంలో సహకరించిన కాంగ్రెస్ మారిన పరిస్థితుల్లో స్వరం మార్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కనుక సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎన్డీఏ సర్కారుకు పెను సమస్యలు సృష్టించగలదనడంలో సందేహం లేదు. -
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
హైదరాబాద్ : న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటు, ప్రజల భాగస్వామ్యం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దశాబ్దకాలంగా జాతీయ న్యాయ నియామక వ్యవస్థను సమర్ధించిన వారిలో తానూ ఒకడినని జేపీ శుక్రవారమిక్కడ అన్నారు. కాగా జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొలీజియం వ్యవస్థను పక్కకు పెట్టి నేషనల్ జ్యూడిషియల్ కమిషన్ తీసుకొచ్చింది. అయితే, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పును వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. -
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
-
'కోర్టు తీర్పుతో ఆశ్చర్యం కలిగింది'
న్యూఢిల్లీ: నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్(ఎన్ జేఏసీ) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని, న్యాయనిపుణులతో చర్చించిస్తామని తెలిపారు. మెజారిటీ రాష్ట్రాలు ఎన్ జేఏసీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతుతో ఎన్ జేఏసీ ఏర్పాటైందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠం ఇంకా చదవలేదని, ఈ సమయంలో తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని, పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది. -
అదనపు జడ్జిగా జస్టిస్ రామలింగేశ్వరరావు కొనసాగింపు
ఎన్‌జేఏసీపై తీర్పు వాయిదా నేపథ్యంలో పొడిగింపు దేశంలోని అదనపు న్యాయమూర్తులందరికీ ఇదే వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావుకు అదనపు జడ్జిగా మూడు నెలల పొడిగింపు లభించింది. ఈ నెల 21 నుంచి మూడు నెలల పాటు ఆయన హైకోర్టు అదనపు జడ్జిగా కొనసాగుతారు. వాస్తవానికి అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలం పూర్తి చేసుకున్న వెంటనే ప్రతీ న్యాయమూర్తి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవుతారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ లేకపోవడం, దాని స్థానంలో ఏర్పాటైన జాతీయ న్యాయమూర్తులు నియామకపు కమిషన్ (ఎన్‌జేఏసీ)పై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తి నియామకపు ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేయలేదు. అలాగే ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై బదిలీపై కేరళ హైకోర్టుకు వెళ్లిన జస్టిస్ దామా శేషాద్రి నాయుడుకు సైతం అదనపు న్యాయమూర్తిగా పొడిగింపు లభించింది. జాతీయ న్యాయమూర్తుల నియామకపు కమిషన్ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దేశవ్యాప్తంగా అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన వారందరికీ మూడు నెలల పాటు పొడిగింపు లభించింది. -
ఎన్‌జేఏసీ పోతే.. కొలీజియం రాదు!
సుప్రీం ముందు కేంద్రం వాదన న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ.. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్‌జేఏసీ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా.. ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత 99వ రాజ్యాంగ సవరణను తాము కొట్టివేస్తే, కొలీజియం మళ్లీ అమల్లోకి వస్తుందంటూ గత శుక్రవారం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై కేంద్రం సోమవారం పై విధంగా స్పందించింది. కేంద్రం తరఫున అనుబంధ వాదనలు వినిపించేందుకు వచ్చిన సొలిసిటర్ జనరల్(ఎస్జీ) రంజిత్ కుమార్.. జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు వాదిస్తూ.. ‘కొత్తగా తీసుకువచ్చిన ప్రత్యామ్నాయ వ్యవస్థ(ఎన్‌జేఏసీ)ను రద్దు చేసినంత మాత్రాన రద్దై పోయిన పాత వ్యవస్థ(కొలీజియం) మళ్లీ అమల్లోకి వస్తుందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎన్‌జేఏసీకి పార్లమెంట్ ఆమోదం పొందిన రోజే కొలీజియానికి సంబంధించిన శాసనం రద్దై పోయింది’ అని చెప్పారు. దాంతో, ఆయనపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మేం కొట్టేశాక.. మరో రాజ్యాంగ సవరణ తోనే మళ్లీ చట్టం చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుందనే కారణంతో మేం దాన్ని కొట్టేస్తే.. గత వ్యవస్థ మళ్లీ ఎందుకు అమల్లోకి రాదు?’ అని ప్రశ్నించింది.అధికరణ 32, 226ల ద్వారా రాజ్యాంగం కోర్టుకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం తీసేసుకోలేదని పేర్కొంది. అది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమేనంది. ఎస్జీ స్పందిస్తూ.. ‘ఎన్‌జేఏసీ రద్దు తీర్పు రాజ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం అవుతుంది. పార్లమెంట్‌కున్న చట్టాలు చేసే అధికారాన్ని కోర్టు ప్రశ్నించలేదు. కోర్టు నిర్ణయంతో చట్టపర శూన్యత వస్తే పార్లమెంటు మళ్లీ రంగంలోకి వస్తుంది’ అని అన్నారు. దానికి.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్ రాజ్యాంగ అధికరణ 368 ఇవ్వలేదని బెంచ్ తేల్చి చెప్పింది. ‘అయినా, ఎన్‌జేఏసీని రద్దు చేస్తామని మీరెందుకు అనుకుంటున్నారు?’ అంటూ వాతావరణాన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించింది. -
జవాబుదారీతనం ఎలా?
ఎన్‌జేఏసీపై సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) పనితీరుకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం పలు ప్రశ్నలు సంధించింది. ‘న్యాయ వ్యవస్థ పనితీరును ఆ కమిషన్ ఏ విధంగా అర్థవంతంగా, జవాబుదారీగా మారుస్తుంది?’ అని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రభుత్వాన్ని అడిగేముందు, మేం అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం’ అని ఎన్‌జేఏసీకి వ్యతిరేకంగా వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు వివరించింది. ఆ కమిషన్ ప్రభుత్వానికే జవాబుదారీ కనుక ఈ ప్రశ్నలను ప్రభుత్వాన్నే అడగడం మంచిదని ధావన్ బదులిచ్చారు. ఎన్‌జేఏసీ చట్టంలోని ‘లక్ష్యాలు- కారణాలు’లో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ ధర్మాసనం పై సందేహాలను వ్యక్తం చేస్తూ.. వారు చెబుతున్న అర్థవంతమైన పాత్ర అంటే ఏమిటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్‌లో సభ్యులుగా ఇద్దరు ప్రముఖులను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సభ్యులుగా ఉండటంపై.. ‘ఇద్దరు రాజకీయ నేతలు, వారిమధ్య ఇరుక్కుపోయిన చీఫ్ జస్టిస్.. వీరు ముగ్గురు న్యాయ నియామకాల్లో జోక్యం చేసుకోగల ఇద్దరు వ్యక్తులను ఎలా నిర్ణయిస్తారు?’ అని ప్రశ్నించింది. ‘న్యాయవ్యవస్థలో ప్రాథమిక, దిగువ స్థాయి నియామకాలకు వారి(ప్రముఖులైన ఇద్దరు సభ్యులు) స్థాయి సరిపోతుంది కావచ్చు కానీ ఉన్నతస్థాయి నియామకాల్లో న్యాయమూర్తిగా, లేదా న్యాయవాదిగా అభ్యర్థి సామర్ధ్యాన్ని గుర్తించగలగడం ముఖ్యం. అది వారు చేయగలరా’ అని జస్టిస్ గోయెల్ వ్యాఖ్యానించారు. ఆ సభ్యులకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుందని, ఆ మూడేళ్లూ వారిని భరించాల్సిందేనని ధావన్ పేర్కొన్నారు. ఎన్‌జేఏసీ చట్టం 2014, సంబంధిత రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పై ప్రశ్నలను ధర్మాసనం సంధించింది. న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)లో నిరాధారమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇది రాజకీయ వేదిక కాదని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆయనను మందలించింది. ఈ తరహాలో పిల్ దాఖలు చేసినందుకు ఇక ముందు మరెప్పుడూ పిల్ దాఖలు చేయకుండా ఎందుకు అనర్హుడిగా చేయకూడదో చెప్పాలని, దీనికి వారంలోగా సమాధానం ఇవ్వాలని శుక్రవారం కోర్టు ఆదేశించింది. శర్మ దాఖలు చేసిన పిల్లోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. శర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సుప్రీంకోర్టులో అనవసరంగా పిల్లు దాఖలు చేస్తున్న విషయాన్ని తాము గుర్తించామని, చెత్త ఆరోపణలతో ఇలా ఎవరంటే వారిపై పిల్లు దాఖలు చేయడానికి కోర్టు రాజకీయ వేదిక కాదని ధర్మాసనం పేర్కొంది. -
‘రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఎన్‌జేఏసీ!’
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం ఏర్పాటు రాజ్యాంగం మౌలిక సూత్రాలను ఉల్లంఘించిందని వివిధ న్యాయసంఘాలు సుప్రీం కోర్టుకు విన్నవించాయి. ఎన్‌జేఏసీ ప్యానెల్లో ఇద్దరు సభ్యులను ఎన్నుకోవటానికి ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరు కావటం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రధాని మోదీకి లేఖ రాసిన మర్నాడే న్యాయసంఘాలు ఈ అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకువచ్చాయి. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌జేఏసీ నిలబడేది కాదని, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ వాదించారు. సుప్రీం కోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) తరపున ఆయన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎన్‌జేఏసీ చట్టాన్ని సవాలు చేసిన న్యాయ సంఘాల్లో ఇది ఒకటి. న్యాయవ్యవస్థ సర్వస్వతంత్రత రాజ్యాంగ మౌలిక సూత్రమని, ఈ సూత్రాన్నే ఎన్‌జేఏసీ ఉల్లంఘిస్తోందనీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాలకు సైతం ఈ చట్టం తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వటం లేదని నారిమన్ అన్నారు. -
'న్యాయ నియామక' రగడ: ప్రక్రియకు సీజే దూరం
వివాదాస్పదంగా మారిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఈసీ) సభ్యుల ఎంపిక వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది, సోమవారం ఎన్జేఈసీకి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవలసి ఉండగా ఆ ప్రక్రియకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తూ గైర్హాజరయ్యారు. దీంతో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. దాదాపు 15 నిమిషాలపాటు ఉత్తర్వుల జారీని నిలిపేశారు. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవడం తగదని సీజే దత్తూ మీడియాతో అన్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ నియామకాల కమిషన్ పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇవేవీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎన్జేఈసీ చట్టాన్ని కూడా రూపొందించింది. ఏప్రిల్ 21 నుంచి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ చెల్లుబాటుపై వివాదం పరిష్కారమయ్యే వరకూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ఎటువంటి నియామకాలూ చేపట్టబోదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. -
‘వివాదం తేలేవరకూ నియామకాలు చేపట్టదు’
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ చెల్లుబాటుపై వివాదం పరిష్కారమయ్యే వరకూ.. ఆ కమిషన్ ఉన్నత న్యాయవ్యవస్థలో ఎటువంటి నియామకాలూ చేపట్టబోదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ వివాదం పెండింగ్‌లో ఉండగా పదవీ కాలం ముగిసే హైకోర్టుల ప్రస్తుత అదనపు న్యాయమూర్తుల నియామకాలను మాత్రమే ఈ కమిషన్ చేపట్టాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నిర్దేశించింది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటుపై పలు అవాంతరాల అనంతరం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం ప్రాధమికంగా విచారణ చేపట్టింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి బదులిస్తూ.. కమిషన్ చెల్లుబాటుపై వివాదం పరిష్కారమయ్యే వరకూ ఎన్‌జేఏసీ ఎటువంటి నియామకాలూ చేపట్టబోదన్నారు.