రెండు వ్యవస్థల ఢీ | NJAC and coliseum are two systems to select supreme head | Sakshi
Sakshi News home page

రెండు వ్యవస్థల ఢీ

Published Sat, Oct 17 2015 12:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

రెండు వ్యవస్థల ఢీ - Sakshi

రెండు వ్యవస్థల ఢీ

న్యాయమూర్తుల నియామకాలకు అనుసరించాల్సిన విధానంపై కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం పతాక స్థాయికి చేరింది. నియామకాల ప్రక్రియపై ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 99వ రాజ్యాంగ సవరణ, దానికి అనుగుణంగా చేసిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం చెల్లబోవని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం మెజారిటీ తీర్పులో తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు సభ్యులుగా ఉండే కొలీజియం వ్యవస్థే ఇకముందు కూడా న్యాయమూర్తుల నియామకం వ్యవహారాలను చూస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే చర్యలుగా పరిగణించడంవల్లనే రాజ్యాంగ సవరణనూ, కొత్త చట్టాన్ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సైతం తోసిపుచ్చింది. ఈ తీర్పు పర్యవసానంగా కార్యనిర్వాహక వ్యవస్థ-న్యాయ వ్యవస్థల మధ్య హోరాహోరీ పోరాటానికి తెరలేచింది.

పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన...20 రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీలు ఆమోదించిన రాజ్యాంగ సవరణ, చట్టం చెల్లవని చెప్పడం ప్రజల సమష్టి మనోగతాన్ని నిరాకరించడమేనని కొందరంటుంటే...కార్యనిర్వాహక వ్యవస్థ చేసే ఎలాంటి చట్టాలైనా, రాజ్యాంగ సవరణలైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని మరికొందరి వాదన. తన స్వతంత్రతకు ప్రాణ ధాతువుగా భావిస్తున్న న్యాయమూర్తుల నియామకం అధికారాన్ని తననుంచి తొలగించి కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యం ఉండే కమిటీకి అప్పజెప్పడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమే అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ పనితీరుకు సంబంధించి వచ్చే నెల 3న విచారణ జరుపుతామని చెప్పింది.  

మిగిలిన వ్యవస్థలతో పోలిస్తే మన దేశంలో న్యాయవ్యవస్థకు విశ్వసనీయత ఎక్కువన్న సంగతి కాదనలేని సత్యం. అంతమాత్రాన అక్కడంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి వీల్లేదు.  న్యాయ వ్యవస్థలో నెలకొన్న అవినీతిపైనా, దిగజారుతున్న ప్రమాణాలపైనా, కొలీజియం వ్యవస్థలోని లోటుపాట్లపైనా బయటివారికంటే లోపలివారే ఎక్కువ మాట్లాడారు. న్యాయమూర్తుల్లో  అవినీతిపరులున్నారని జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య , మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పలు సందర్భాల్లో అన్నారు. నిజానికి జస్టిస్ వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనమే 1993లో కొలీజియం వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసింది. చివరకు ఆ వ్యవస్థ పనితీరును గమనించాక తీవ్ర అసంతృప్తికి లోనై దాన్ని తక్షణం రద్దు చేయాల్సి ఉన్నదన్నారు.  

నిజానికి కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి రావడానికి కార్యనిర్వాహక వ్యవస్థ వైపుగా జరిగిన తప్పిదాలే కారణం. 70వ దశకంలో సాగిన నియామకాలు న్యాయవ్యవస్థను ఉత్సవ విగ్రహంగా మార్చాయి. జడ్జీల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని రాజ్యాంగంలోని 124(2) అధికరణ చెబుతోంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని లేదని...తగిన కారణాలు చూపి దాన్ని నిరాకరించవచ్చునని 1981లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చాక ‘రాజకీయ నియామకాలు’ మరింతగా జోరందుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని పూర్తిగా బేఖాతరు చేశారు. కనుకనే 1993లో జస్టిస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం కొలీజియంతో దీనికి అడ్డుకట్ట వేయాల్సివచ్చింది. అయితే కొలీజియం సైతం తన పాత్రను సరిగా పోషించలేకపోయిందని పలు సందర్భాలు రుజువు చేశాయి.

ఎవర్ని ఎందుకు నియమించారో, అందుకనుసరించిన ప్రమాణాలేమిటో తెలియని స్థితి ఏర్పడింది. ఒకసారి నియామకం పూర్తయ్యాక వారిపై ఎలాంటి ఆరోపణలొచ్చినా, వారి ప్రవర్తన ఎలా ఉన్నా, ప్రశ్నార్థకమైన తీర్పులు వెలువరించినా న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. కొలీజియం ఎంపిక చేసినవారిలో మహిళా న్యాయమూర్తులు, అణగారిన వర్గాలవారూ  తక్కువగా ఉండటం కొట్టొచ్చినట్టు కనబడే ప్రధాన లోపం.  వీటన్నిటినీ జస్టిస్ జేఎస్ వర్మ అనేకసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు కొలీజియం వ్యవస్థపై విచారణ చేపడతానంటున్న సుప్రీంకోర్టు ఇన్ని దశాబ్దాలుగా ఆ విషయంలో ఎందుకు విఫలమైందో ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మొత్తానికి రెండు వ్యవస్థలూ లోపరహితమైనవి కాదని అనేక అనుభవాలు రుజువు చేశాయి. రెండింటిలోనూ పారదర్శకత లేనందువల్లనే సమస్యలు తలెత్తాయి. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌జేఏసీ దీన్ని సరిచేసిందా? ఆ కమిషన్ సభ్యుల అమరిక చూస్తే ప్రభుత్వానిదే పైచేయిగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. కమిషన్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ముగ్గురు,  కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు ‘ప్రముఖ’ వ్యక్తులు ఉంటారని చట్టం చెబుతోంది. ఇద్దరు ‘ప్రముఖుల్ని’ ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే ప్యానల్ ఎంపిక చేస్తుంది. అలాగే కమిషన్‌లోని ఏ ఇద్దరు కాదన్నా నియామకం నిలిచిపోతుంది. ఇన్ని చెప్పిన చట్టం పారదర్శకత గురించి మాట్లాడలేదు.

అసలు ‘ప్రముఖులు’ అన్నదానికి నిర్వచనమే లేదు. కనుక న్యాయమూర్తుల నియామకాల్లో మరోసారి కార్యనిర్వాహక వ్యవస్థ ప్రమేయం పెరగదన్న గ్యారెంటీ ఏమిటి? సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఒక అయోమయ స్థితి నెలకొంది. వివిధ హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ జరగాల్సిన 400కు పైగా నియామకాలు అనిశ్చితిలో పడ్డాయి. రాజ్యాంగ సవరణ, ఎన్‌జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి గతంలో సహకరించిన కాంగ్రెస్ మారిన పరిస్థితుల్లో స్వరం మార్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కనుక సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎన్‌డీఏ సర్కారుకు పెను సమస్యలు సృష్టించగలదనడంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement