coliseum
-
త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఖురేషి
న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ఎ.ఎ. ఖురేషి పేరును సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ప్రతిపాదించింది. గతంలో ఆయన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ కొలీజియం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిపై ఈ నెల 5వ తేదీన జరిగిన కొలీజియం భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ మే 10వ తేదీన కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై కేంద్రం ఆగస్టులో పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదులు త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఎ.ఎ. ఖురేషి పేరును తాజాగా కేంద్రం పరిశీలనకు పంపింది. అయితే, జస్టిస్ ఎ.ఎ. ఖురేషి ఆదేశాల మేరకే 2010లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పోలీసులు అరెస్టు చేశారని, తాజా పరిణామానికి అదే కారణమని గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్ యతిన్ ఓజా అనుమానం వ్యక్తం చేశారు. జస్టిస్ తహిల్ రమణి రాజీనామా ఆమోదం తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్ రమణి రాజీనామా ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది. తనను మేఘాలయ కోర్టుకు బదిలీచేయడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ తన రాజీనామా చేశారు. -
మద్రాస్ హైకోర్టు సీజే రాజీనామా
సాక్షి, చెన్నై: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్రమణి తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు శనివారం ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. తనను మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆమె చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజీయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తనన మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆగస్ట్ 28న సీజే రమణి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను కోరారు. అయితే ఆమె అభ్యర్థనను సుప్రీం తొసిపుచ్చింది. -
కేంద్రానికి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ: జడ్జీల పదోన్నతుల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నల పేర్లను సుప్రీంకోర్టు జడ్జీలుగా మరోసారి సిఫార్సు చేసింది. ఈ విషయంలో కేంద్రం వ్యక్తంచేసిన అభ్యంతరాలను కొలీజియం తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం.. ‘అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఏప్రిల్ 12న మేం సిఫార్సు చేసిన జడ్జీలు జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించాం. ఈ ఇద్దరు జడ్జీల సమర్థత, ప్రవర్తన, సమగ్రత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర జడ్జీల సీనియారిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సహా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని స్పష్టం చేసింది. వీరిద్దరితో పాటు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, హిమాచల్‌ప్రదేశ్ సీజే జస్టిస్ సూర్యకాంత్‌లకు కూడా సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రెండు తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో కొలీజియం అప్లోడ్ చేసింది. అంతకుముందు జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు పదోన్నతులు కల్పించాలని ఏప్రిల్ 12న కొలీజియం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జార్ఖండ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ బోస్ దేశవ్యాప్తంగా సీనియారిటీలో 12వ స్థానంలో, గువాహటి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ బోపన్న సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారని కేంద్రం తెలిపింది. సీనియారిటీతో పాటు ఇతర ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానంలో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. కాగా కేంద్రం అభ్యంతరాలను తిరస్కరించిన సుప్రీం కొలీజియం, జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నతో పాటు మరో ఇద్దరు జడ్జీల పేర్లను సిఫార్సు చేసింది. కొలీజియంలో సీజేఐ జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్మిశ్రా, జస్టిస్ నారిమన్‌లు ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన పేర్ల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం తిప్పిపంపవచ్చు. కానీ ఆ న్యాయమూర్తుల పేర్లను కొలీజియం మరోసారి సిఫార్సుచేస్తే మాత్రం కేంద్రం వాటిని తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనలేవీ లేవు. -
‘జస్టిస్ ఖన్నా’ నియామకంపై రగడ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. జనవరి 10న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సుప్రీంకోర్టు జడ్జీగా సిఫార్సు చేయడాన్ని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కౌల్ తప్పుపట్టారు. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్ పేరును తొలగించి, ఖన్నా పేరును జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నిస్తూ ఆయన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు కొలీజియం సభ్యులకు లేఖ రాశారు. జస్టిస్ ప్రదీప్ సమర్థుడైన న్యాయమూర్తనీ, పరిపాలకుడని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాల్లో దుందుడుకు నిర్ణయాలు తగవని అభిప్రాయపడ్డారు. ఇలాటి నిర్ణయాల కారణంగా న్యాయవ్యవస్థతో పాటు బార్‌లోనూ సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ.. దేశవ్యాప్తంగా ఉన్న 32 మంది సీనియర్ న్యాయమూర్తులను కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నాకు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించిందని ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కైలాశ్గంభీర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. 2018 డిసెంబర్ 12న సమావేశమైన కొలీజియం జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్, కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్‌ల పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. అయితే, ఈనెల 10న సీజేఐ జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలో భేటీ అయిన కొలీజియం వీరి పేర్లను ఎలాంటి కారణాలు చూపకుండానే తొలగించి జస్టిస్ ఖన్నాతో పాటు కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ దినేశ్ మహేశ్వరి పేర్లను చేర్చిందన్నారు. సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. గతేడాది జనవరిలో కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. న్యాయవాదుల ఆందోళన.. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదోన్నతిని వ్యతిరేకిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం ఆందోళన నిర్వహించింది. 32 మంది సీనియర్ జడ్జీలను కాదని జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయం విచిత్రం, ఏకపక్షమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్ సైతం జస్టిస్ ఖన్నా నియామకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకే ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా, కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ దినేశ్ మహేశ్వరిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది. -
రెండు వ్యవస్థల ఢీ
న్యాయమూర్తుల నియామకాలకు అనుసరించాల్సిన విధానంపై కొన్నేళ్లుగా సాగుతున్న వివాదం పతాక స్థాయికి చేరింది. నియామకాల ప్రక్రియపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 99వ రాజ్యాంగ సవరణ, దానికి అనుగుణంగా చేసిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం చెల్లబోవని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం మెజారిటీ తీర్పులో తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు సభ్యులుగా ఉండే కొలీజియం వ్యవస్థే ఇకముందు కూడా న్యాయమూర్తుల నియామకం వ్యవహారాలను చూస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే చర్యలుగా పరిగణించడంవల్లనే రాజ్యాంగ సవరణనూ, కొత్త చట్టాన్ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సైతం తోసిపుచ్చింది. ఈ తీర్పు పర్యవసానంగా కార్యనిర్వాహక వ్యవస్థ-న్యాయ వ్యవస్థల మధ్య హోరాహోరీ పోరాటానికి తెరలేచింది. పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన...20 రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీలు ఆమోదించిన రాజ్యాంగ సవరణ, చట్టం చెల్లవని చెప్పడం ప్రజల సమష్టి మనోగతాన్ని నిరాకరించడమేనని కొందరంటుంటే...కార్యనిర్వాహక వ్యవస్థ చేసే ఎలాంటి చట్టాలైనా, రాజ్యాంగ సవరణలైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని మరికొందరి వాదన. తన స్వతంత్రతకు ప్రాణ ధాతువుగా భావిస్తున్న న్యాయమూర్తుల నియామకం అధికారాన్ని తననుంచి తొలగించి కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యం ఉండే కమిటీకి అప్పజెప్పడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమే అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ పనితీరుకు సంబంధించి వచ్చే నెల 3న విచారణ జరుపుతామని చెప్పింది. మిగిలిన వ్యవస్థలతో పోలిస్తే మన దేశంలో న్యాయవ్యవస్థకు విశ్వసనీయత ఎక్కువన్న సంగతి కాదనలేని సత్యం. అంతమాత్రాన అక్కడంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. న్యాయ వ్యవస్థలో నెలకొన్న అవినీతిపైనా, దిగజారుతున్న ప్రమాణాలపైనా, కొలీజియం వ్యవస్థలోని లోటుపాట్లపైనా బయటివారికంటే లోపలివారే ఎక్కువ మాట్లాడారు. న్యాయమూర్తుల్లో అవినీతిపరులున్నారని జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య , మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పలు సందర్భాల్లో అన్నారు. నిజానికి జస్టిస్ వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనమే 1993లో కొలీజియం వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసింది. చివరకు ఆ వ్యవస్థ పనితీరును గమనించాక తీవ్ర అసంతృప్తికి లోనై దాన్ని తక్షణం రద్దు చేయాల్సి ఉన్నదన్నారు. నిజానికి కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి రావడానికి కార్యనిర్వాహక వ్యవస్థ వైపుగా జరిగిన తప్పిదాలే కారణం. 70వ దశకంలో సాగిన నియామకాలు న్యాయవ్యవస్థను ఉత్సవ విగ్రహంగా మార్చాయి. జడ్జీల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని రాజ్యాంగంలోని 124(2) అధికరణ చెబుతోంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని లేదని...తగిన కారణాలు చూపి దాన్ని నిరాకరించవచ్చునని 1981లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చాక ‘రాజకీయ నియామకాలు’ మరింతగా జోరందుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిని పూర్తిగా బేఖాతరు చేశారు. కనుకనే 1993లో జస్టిస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం కొలీజియంతో దీనికి అడ్డుకట్ట వేయాల్సివచ్చింది. అయితే కొలీజియం సైతం తన పాత్రను సరిగా పోషించలేకపోయిందని పలు సందర్భాలు రుజువు చేశాయి. ఎవర్ని ఎందుకు నియమించారో, అందుకనుసరించిన ప్రమాణాలేమిటో తెలియని స్థితి ఏర్పడింది. ఒకసారి నియామకం పూర్తయ్యాక వారిపై ఎలాంటి ఆరోపణలొచ్చినా, వారి ప్రవర్తన ఎలా ఉన్నా, ప్రశ్నార్థకమైన తీర్పులు వెలువరించినా న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. కొలీజియం ఎంపిక చేసినవారిలో మహిళా న్యాయమూర్తులు, అణగారిన వర్గాలవారూ తక్కువగా ఉండటం కొట్టొచ్చినట్టు కనబడే ప్రధాన లోపం. వీటన్నిటినీ జస్టిస్ జేఎస్ వర్మ అనేకసార్లు ప్రస్తావించారు. ఇప్పుడు కొలీజియం వ్యవస్థపై విచారణ చేపడతానంటున్న సుప్రీంకోర్టు ఇన్ని దశాబ్దాలుగా ఆ విషయంలో ఎందుకు విఫలమైందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొత్తానికి రెండు వ్యవస్థలూ లోపరహితమైనవి కాదని అనేక అనుభవాలు రుజువు చేశాయి. రెండింటిలోనూ పారదర్శకత లేనందువల్లనే సమస్యలు తలెత్తాయి. కేంద్రం తీసుకొచ్చిన ఎన్‌జేఏసీ దీన్ని సరిచేసిందా? ఆ కమిషన్ సభ్యుల అమరిక చూస్తే ప్రభుత్వానిదే పైచేయిగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. కమిషన్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ముగ్గురు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు ‘ప్రముఖ’ వ్యక్తులు ఉంటారని చట్టం చెబుతోంది. ఇద్దరు ‘ప్రముఖుల్ని’ ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే ప్యానల్ ఎంపిక చేస్తుంది. అలాగే కమిషన్‌లోని ఏ ఇద్దరు కాదన్నా నియామకం నిలిచిపోతుంది. ఇన్ని చెప్పిన చట్టం పారదర్శకత గురించి మాట్లాడలేదు. అసలు ‘ప్రముఖులు’ అన్నదానికి నిర్వచనమే లేదు. కనుక న్యాయమూర్తుల నియామకాల్లో మరోసారి కార్యనిర్వాహక వ్యవస్థ ప్రమేయం పెరగదన్న గ్యారెంటీ ఏమిటి? సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఒక అయోమయ స్థితి నెలకొంది. వివిధ హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ జరగాల్సిన 400కు పైగా నియామకాలు అనిశ్చితిలో పడ్డాయి. రాజ్యాంగ సవరణ, ఎన్‌జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి గతంలో సహకరించిన కాంగ్రెస్ మారిన పరిస్థితుల్లో స్వరం మార్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కనుక సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎన్డీఏ సర్కారుకు పెను సమస్యలు సృష్టించగలదనడంలో సందేహం లేదు.